Pages

07/11/2008

నా వీర గాధ Part - I




డిస్కవరీ చానెల్లో 'మై స్టోరీ ' లెవెల్లో ఉండదు నాకధ. కానీ నాదీ ఒక మంచి కధే. నాకే పాఠాలు చెప్పిన బుజ్జి కధ. నాకు నా ప్రత్యేకతని గుర్తింపచేసే కధ. నన్ను అందరికీ దగ్గర చేసిన కధ. అదేదో అంటారే.. నన్ను మరింత మెరుగైన మనిషి గా తీర్చి దిద్దిన కధ.


నా కధ మొదలయ్యే నాటికి నేను ఒంటరిని. ఇంటి నుండీ దూరంగా, హాస్టల్ లో జీవితం. చాలా హాయి అయిన ఉద్యోగం, మంచి స్నేహితులూ, నింపాది గా నడిచే కాలం, హాబీలూ, కాలక్షేపాలూ, నాటకాలూ, సినిమాలూ, షాపింగ్ - బాడ్మింటన్ - వీటితో ఏదో మంచి జీవితాన్నే అనుభవించేస్తున్న తృప్తి. వీటి కన్నా ఏమి కావాలి ?


2004 లో నడుము నొప్పి మొదలయింది. అసలు 2003 నుండే మొదలైంది. కానీ అంత సివియారిటీ లేదు. నా మొహం చూసిన డాక్టర్లంతా ముందు బరువు తగ్గమ్మా.. నడుము నొప్పి అదే తగ్గుతుంది అని సలహా పడేసే వారు. బరువు తగ్గడానికి నడకా, డైటింగ్, బాడ్మింటన్ (నేను చాలా బాగా ఆడేదాన్ని - మా హాస్టల్లో & చిన్నపుడు కాలేజీ లో, నా ఆటని ప్రత్యేకంగా చూసేవారు) - ఆఫీసు నుండీ హాస్టల్ దాకా నడకా మొదలు పెట్టాను. ఫలితం లేదు. నీర్సం వచ్చేది. ఆయాసం కూడా శృతి మించేది. బరువు తగ్గుతూంది గానీ నడుము నొప్పి తగ్గట్లేదు.



ఈ లోగా పరీక్షలూ, ఇంటికి పోయి రావడాలూ, వైజాగ్ లో యూరాలజిస్ట్ (కిడ్నీ లో రాళ్ళుండడం వల్ల నొప్పి కావచ్చేమో అని) నుంచీ గైనకాలజిస్ట్ దాకా అందర్నీ చూసాం. మా పెద్దమ్మ ఇంట్లో వారాలు చేసుకుని చదివి పెద్దయ్యిపోయిన ఒక ఎముకల డాక్టరు దగ్గరికి వెళ్ళాను. ఈయనకి మా పక్క వీధి లోనే బ్రహ్మాండమైన మయ సభ లాంటి ఇల్లుంది. స్టేషన్ రోడ్ లో చెండాలమైన క్లినిక్ ఉంది. క్లినిక్ లో నన్ను చూసి, (మొత్తం చూసి - జస్ట్ చూసి) స్పాండిలైటిస్ అని నిర్ణయించేసి, మెడకో బెల్టు కొనిపించేసి పంపించేసాడీయన. ఈయన నన్ను పరీక్షించిన తీరు మర్చిపోలేను. ఇది విషాదాల్లోకెల్లా విషాదం అని ఇప్పటికీ నమ్ముతాను. శుష్కించి, క్షీణించి, నొప్పితో (ఆ నొప్పిని వర్ణించలేను - చాలా సీరియస్ నొప్పి. ఈ నొప్పికి కారణం తరవాత తెలిసింది) బాధపడుతున్న ఒక మహిళని హెల్ప్ లెస్ గా ఫీల్ చెయ్యడం ఇతనికే చెల్లింది.


ఈ నొప్పితోనే ఢిలీ నుండీ విశాఖ కు 36 - 38 గంటల ప్రయాణం, ఒక్కోసారి రెండు రైళ్ళు మారడం - చేసేదాన్ని. (సీరియస్ నెస్ తెలియక) ఆ రోజుల్ని తలచుకుంటే ఇపుడు కొంచెం భయం వేస్తుంది. ఆఖరు సారి మాత్రం, ట్రైన్ లో ఆర్.ఎ.సి టికెట్ మాత్రం దొరికి, విశాఖ కు ప్రయాణం కట్టాను. నాతో పాటూ ప్రాయాణించిన ఆర్.ఎ.సి ప్రయాణికురాలు బాలింత. పసి పిల్లాడితో ప్రయాణించిన ఆమె కోసం బెర్తు ని వొదిలి 30 గంటలు కూర్చుని ప్రయాణం చేశాను. అంతే.. ఈ ప్రయాణం తరవాత, నిటారుగా నిలబడలేదు. నా శరీరం 45 డిగ్రీ ల కోణంలో ఉండిపోయింది. నాకు మాత్రం, నేను నిటారుగా నించున్నట్టే అనిపించేది.



ఈ ప్రయాణం మాత్రం నా జీవితాన్ని మార్చేసింది. నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన నాన్న షాక్. నడుము నొప్పి, నడుము నొప్పి అని ఏడిచే నన్ను మరీ లైట్ తీసుకోకపోయినా - ఇంత భయంకరమైన నొప్పి ఉన్నట్టు తెలుసుకోలేక పోయారు.


ఈ ప్రయాణానికి ముందే నేను నాలో గమనించిన మార్పులు విపరీతంగా బరువు తగ్గడం, తిండి మీద ఆసక్తి నశించడం, రెండు కాళ్ళ లో కో-ఆర్డినేషన్ క్షీణించడం. ఉదా : బట్టలు వేసుకునేటప్పుడు నడుము మీది భాగానికి సులువు గా బట్టలు తొడగ గలిగే దాన్ని. నడుము కింది భాగానికోసం చాలా సర్కస్ చెయ్యాల్సొచ్చేది. అప్పటికీ నా నడుము కింది భాగం బలహీనమైన విషయం నాకు అర్ధం కాలేదు. బండి డ్రైవ్ చేసేటపుడు ఎపుడన్నా ఒక కాలు కిందికి దింపి నిలిపితే, ఆ కాలు తిరిగి పైకి తీసుకోలేకపోయేదాన్ని. ఏదో - సంథింగ్ రాంగ్ అనిపించేది గానీ ఇంత బాబోయ్-రాంగ్ అనిపించలేదు.


అందుకే దీన్ని వీరగాధ అంటాను. ఈ గొడవల్లోనే అత్యంత కష్టపడి గ్రూప్ వన్ పరీక్షలు రాశాను. హాల్లో కూర్చోలేక సర్కస్, నడవలేక సర్కస్, చదవలేక సర్కస్, ఏడుపూ - గోలా చూసి అమ్మా నాన్నా బాధపడే వారు. అందుకే బయటకు గోల పెట్టడం మానేసి మానసికంగా కృంగిపోవడం మొదలు పెట్టాను. బయటపడితే అమా, నాన్నా బాధపడతారని. ఊర్లో అందరు డాక్టర్లూ కవర్ అయిపోయారు. అందరూ చెప్పిన విషయం - అమ్మాయ్ - నువ్వు లావు తగ్గితే గానీ నీ నడుము నొప్పి తగ్గదు. ఇపుడు అర్జంట్ గా లావు ఎలా తగ్గాలి ? నడవడానికి కాళ్ళు సహకరిస్తే కదా.. అసలు నేను నిటారుగా నిలబడగలిగితే కదా...


నేను ఆ నొప్పికి చచ్చిపోతానేమో అని అనుకున్నాను. ఒక వేళ చచ్చిపోకపోతే, ఎలానో ఒక లా చచ్చిపోదామని కూడా నిర్ణయించేసుకున్నాను. పేపర్లో ఎపుడైనా కడుపునొప్పికో తలనొప్పికో ఎవరో ఆత్మ హత్యలు చేసుకుంటున్నారంటే ఏమిటో అనుకునే దాన్ని. ఇపుడు ఆ బాధ ఏమిటో తెలిసింది.


ఈ బాధ లో ఒక యూరాలజిస్ట్ నా స్కాన్ లూ అవీ పరీక్షించి డాక్టర్ విష్ణు ప్రసాద్ కు నన్ను రిఫర్ చేసారు. ఈ విష్ణు ప్రసాద్ గారు నన్ను చూడగానే - ఎం.ఆర్.ఐ. స్కాన్ తీయించుకోమని సలహా ఇచ్చారు. అప్పటికే నా ఆరోగ్యం చాలా పాడైంది. ఎం.ఆర్.ఐ. లాంటి గోల గోల రేడియేషన్ పరీక్ష సమయంలో స్పృహ కోల్పోయినట్టే నిద్ర పోయానంటే, చూడండి.



ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్ లో ఆప్షనల్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. నేనూ సిద్ధం అయ్యాను. అసలు వాటికోసమే వైజాగ్ వచ్చానప్పటికి. నా ఎం ఆర్ ఐ చూసి ఆ డాక్టర్ చూసిన చూపు, ఆయన పలికిన కైండెస్ట్ పదాలూ మర్చిపోలేను. 'ఇంత నొప్పి ఎలా భరించ గలిగావమ్మా?' అని అడిగారాయన. నాకు అపుడైతే కన్నీళ్ళు రాలేదు. బలహీనంగా కష్టాల్లో సావిత్రి లా నవ్వాను. ఇపుడు ఆ సీన్ తలుచుకుంటే ఏడుపొస్తుంది.


ఇంక నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవాలి - మంచం మీద నడుము వాల్చి పడుకోవడమే.. అర్జంటుగా నువ్వు బెడ్ రెస్ట్ కి వెళ్ళకపోతే నీ కాళ్ళు మరింత బలహీనం అయిపోతాయి చూసుకో మరి అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అప్పటికి ఎంత నొప్పి ఉన్నా.. మరి పరీక్షలో - ఆఫేసో - నా ప్రయాణమో - అని భయపడ్డాను. నొప్పికి విపరీతంగా డైక్లో ఫినాక్ వాడటం అలవాటైంది. ఒక్కోసారి రోజుకు 5 - 6 మందులు బిగించేసి, పరీక్ష ఇచ్చేదాన్ని. అప్పుడే నాకు హై.బీ.పీ మొదలైంది.


కానీ ఆయన అవన్నీ రూల్ ఔట్ చేసేసారు. బెడ్ రెస్ట్ అంటే బెడ్ రెస్ట్ - స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ ! ఇంకో మాట - నీకు సర్జరీ అవసరం. మీరు సిద్ధంగా ఉండండి ! అని నాన్నకి ఆల్టిమేటం ఇచ్చారు. ఆ మరుసట్రోజే హీరో నన్ను చూడటానికి వచ్చారు.


మా నాన్న కి అప్పటి జీవిత లక్ష్యం నా పెళ్ళి చెయ్యడమే. అందుకే వైజాగ్ నేను వస్తున్నానంటే పెళ్ళి సంబంధాలు చూసేవారు - నేనొచ్చే రోజుల్లో షూటింగ్ లు (పెళ్ళి చూపులు) జరిపేవారు. వాటికి హంగామా, ఇల్లు సర్దుకోవడం, మనసులో నానా తిట్లూ తిట్టుకుంటూ ముస్తాబవడం - అమ్మా, నాన్నల గోల - ఇవన్నీ మామూలే. సో, ఈ హడావుడిలో మా హీరో రావడం ముందే నిర్ణయం అయిపోయి ఉంది. కాబట్టి ఆపరేషన్ అనగానే మా అమ్మా, నాన్నలు ముఖాలు చూసుకున్నారు. సరే - ఆ రోజు ఇంటికొచ్చేసా. రాత్రి జ్వరం, తెల్లారి ముహూర్తానికి షూటింగ్, పెళ్ళికొడుకు రావడం, నేను ఎదురుగా వచ్చి కూర్చున్నా కన్ ఫ్యూస్ అయిపోయి ఇంకా 'వధువు వస్తున్నదీ !' అని ఎదురు చూడటం, అంత లోనే పెళ్ళి చూపులు అయిపోవడం - నేనూ 'ఆ - వీడేం చేసుకుంటాడ్లే అనుకోవడం' లోపలి గది కి పోయి ముణగదీసుకు పడుకోవడం జరిగిపోయాయి. తీరా ఈ సంబంధమే కుదిరింది.


పెళ్ళి కుదిరింది.. మా నాన్న గారి జీవితాశయం నెరవేరబోతుండగా - ఆపరేషన్ సమస్య ముందుకొచ్చింది. పెళ్ళిచూపుల రోజు ఎలా నడిచేనో గానీ మరుసట్రోజు అసలు లేవలేకపోయాను. కాలకృత్యాల దగ్గర్నించీ తిండి దాకా నిస్సహాయ స్థితి లోకి జారిపోతున్నాను. నాకు పెళ్ళీ గిళ్ళీ వొద్దు అని గాట్టి గా అందరికీ ట్యూషన్ చెప్పేసాను.


ఈ లోగా నాన్న గారు నన్ను సెకండ్ ఒపీనియన్ కని వేరే వేరే స్పెషలిస్టులకూ చూపించారు. కొందరు ఆపరేషన్ అవసరమనీ, కొందరు కేవలం బెడ్ రెస్ట్ (స్నానపానాదులతో సహా మంచం మీదే) ఒక ఆరు నెల్లు తీసుకుంటే చాలనీ చెప్పడంతో ఒక వైపు ఆరునెలల తరవాత పెళ్ళి ముహూర్తం పెట్టుకోవాలా / పెళ్ళి మానుకోవాలా / సంవత్సరం ఆగాలా అని డైలమా లో ఉండగా డా.సుబ్బారావు గారు నాన్న గారికి మంచి సలహా ఇచ్చారు.


అసలు నాకొచ్చిన రోగం ఏమిటీ అంటే, నా వెన్నెముక లో రెండు వెర్టిబ్రా అరిగి పోయి, కుళ్ళిపోయి - ముక్కలయి, వెనక్కి జరిగి (రెండు చోట్ల) వెన్ను పాము ను నొక్కేస్తున్నాయి. ఈ రెండు వెర్టిబ్రా లూ లంబార్డ్ స్పైన్ అనగా నడుము లో కింది భాగానికి చెందిన్వి కావడం వల్ల నాలో మొబిలిటీ (నడక) ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఈ వెన్ను భాగం నుండీ బయటకు వచ్చే నరాలు డైరెక్ట్ గా పెల్విస్ కూ, కాళ్ళకూ సంబంధించినవి. ఇలా అంత పెద్ద విషయం అక్కడ జరగడానికి నాకు 2002 లో జరిగిన రోడ్ ఆక్సిడెంట్ కారణం అయి ఉండొచ్చని ఒక విశ్లేషణ కూడా చేశారు. ఆ ఆక్సిడెంట్ లో నేను బండి మీంచీ ఎగిరి రోడ్ మీద సరిగ్గా నా వీపు మీద పడ్డాను. అందుకని నా వెన్నుకి ఆరోజు దెబ్బ తగిలి ట్రూమా కారణంగా వెర్టిబ్రే డీజెనెరేషన్ మొదలయి ఉంటుందని అంచనా. ఇంకో 3 వారాల్లో ఆపరేషన్ చెయ్యకపోతే కొన్ని నరాలు పూర్తిగా దెబ్బతిని నాకు పేరాప్లీజియా వచ్చే అవకాశాలున్నాయి. పేరా ప్లీజియా కు చికిత్స అందుబాటులో లేదు. (స్టెం సెల్ టెక్నాలజీ ద్వారా చికిత్స చెయ్యగలమని అంచనా. స్టెం సెల్ టెక్నాలజీ కి కొన్ని నైతిక, ధార్మిక న్యాయపరమైన అవరోధాలు ఇంకా ఉన్నాయి). దీనివల్ల నడుము క్రింది భాగం పూర్తిగా చచ్చుబడిపోతుంది. అదీ సంగతి.


అందుకే ఆలస్యం చెయ్యకుండా పెళ్ళి మాట పక్కనుంచి ఆపరేషన్ చేయించండి - అని ఆయన సలహా ననుసరించి నాకు ఈ రిపేర్ వర్క్ చేయించారు నాన్నారు. మొత్తానికి జూన్ 23, 2005 న, వైజాగ్ సెవెన్ హిల్ల్స్ హాస్పిటల్ లో నాకు ఆపరేషన్ జరిగింది. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని మంచి రోజు. నా జీవితాన్నే మార్చేసిన రోజు. నాకెందుకొచ్చిందబ్బా ఈ జబ్బు అని నన్ను నేను తిట్టుకున్న రోజు. డా.విష్ణు ప్రసాద్ కి మనసులో పెద్ద దణ్ణం పెట్టుకున్న రోజు. మా అమ్మ కీ నాన్న గారికీ నాకు ఇంకో జన్మనిచ్చినందుకు పదే పదే కృతజ్ఞతలు చెప్పుకున్న రోజు.


నాదో కోతి మనస్తత్వం కాబట్టి ఆపరేషన్ అంటే నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఈ సర్కస్ లో నాకెన్ని బాధలున్నాయో అపుడు నాకు తెలియలేదు. మా చుట్టాల్లో, నా ఫ్రెండ్స్లో నా వొంకర నడుమూ, నొప్పీ కలిగించిన ఆత్రుత నాకో సూడో స్పెషాలిటీ ని కలిగించి, భలే కిక్ ఇచ్చింది. ఆపరేషన్ కు వెళ్ళేటపుడు గౌన్ వేయించినపుడు సర్కస్ మొదలయింది. బయట అమ్మకూ నాన్న కూ చేతులూపి వెళ్ళాను. అంత మంచి సోఫిస్టికేటెడ్ ఆపరేషన్ థియేటర్ ను కళ్ళారా చూడనే లేదు - ముఖానికి మాస్కు పెట్టి ఎనెస్థీషియా ఇచ్చారు. చేతికి బీ.పీ మానిటరు చాలా టైట్ గా కట్టేసేరబ్బా.. నొప్పుడుతూంది అని చెబ్దామనుకుంటూనే నిద్ర పోయాను.

31 comments:

Purnima said...

ఇలాంటి టపాలు చదువుకుని, ఆ అనుభవాన్ని ఆకళింపుచేసుకోవడం బాగుంటుంది. పోరాట పటిమ, సహనం, నొప్పి మీద యుద్ధం ఇవ్వన్నీ స్పూర్తిదాయకంగా ఉంటాయి. ఓ కొత్త ఉత్సాహాన్ని కూడా ఇవ్వచ్చు, ఆ బాధనే అనుభవిస్తున్నవారికి.

కానీ ఓ మనిషింత వేదన భరించారన్న నిజం తెలీగానే మాత్రం మనసులో ఓ కెలుకుడు మొదలవుతుందే, దాన్ని భరించటం మాత్రం చాలా కష్టం.

"చాలా బాగా రాసారండీ.. మరిన్ని రాయగలరు" అని చెప్పలేని సందర్భం, నిజంగా మనస్సుకి హత్తుకునేలా రాసినా!

అందుకే మీ పోరాట పటిమకు ఓ సలాం కొడుతూ..
మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాని మనస్పూర్తిగా కోరుకుంటూ..

పూర్ణిమ

Rani said...

I wish I could express my thoughts like purnima.

Some people dont share such things but i think it is really important to let others know of our pain and how we got out of it. so others can identify when they come across such things.

God bless you with all the health :)

cbrao said...

ఎంత బాధాకరం నడుము నొప్పి? ఇంతటి సీరియస్ ఉదంతాన్నీ , lighter vein లో చెప్పిన మీ కథనం బాగుంది. మీ అనారోగ్యాన్ని లెక్క చెయ్యక, పెళ్లికి ఒప్పుకున్న ఒరియా యువరాజు, కథానాయకుడే. సందేహం లేదు. ఆపరేషన్ సమయంలో కూడా మొక్కవోని మీ ధైర్యం అభినందించతగ్గది.

hanumantha rao said...

ఈ మద్యే ఇక్కడ తిరగటం మొదలెట్టాను. కొన్ని రోజులుగా మిమ్మల్ని చదువుతున్నాను. విషయాల్ని చాలా చక్కగా చెప్తున్నారు. అభినందనలు. మీ గాథ ముగింపు కోసం ఎదురు చూసేలా చేస్తున్నారు.ఫలానా సుజాత గార్కేమైందో అని మేము ఆలోచించాలి కామోసు. ఎం బాలేదు. ఐనా బావుంది. త్వరగా ముగిద్దురూ!

చిలమకూరు విజయమోహన్ said...

ఇంత భయంకరమైన నరకాన్ని నిజంగా ఎలా అనుభవించావమ్మా! తలచుకుంటేనే కన్నీరాగడంలేదే .మీ మొక్కవోని ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను.

సుజాత వేల్పూరి said...

ఇంత విషాదాన్ని హాస్యం మేళవించి ఎలా చెప్పగలుగుతున్నారు తల్లీ! మీరు మనిషా కాదా అనిపిస్తోంది. ఇంకొకరైతే డిప్రెషన్ లోకి పోయి, జీవితం సర్వ నాశనమై పోయుండేది.

మీ మనో బలానికి టోపీ తీసి మోకాళ్ళ మీద వంగి మరీ అభివాదం చేస్తున్నాను. ఇది హాస్యం కాదు, నిజం కాదు. మనమెప్పుడన్నా కలుసుకుంటే కూడా ఇదే చేస్తాను.

సుజాత వేల్పూరి said...

భరించలేని వేదనలు చుట్టుముట్టినపుడు భగవంతుడు
లేడని నిష్టూరపడటం మానవ సహజం! అటువంటి సమయంలోనే ఒక చిన్న గడ్డిపోచ అందుతుంది. అదే మనల్ని పైకి లాగే తాడవుతుంది. ఆ గడ్డిపోచే " డాక్టరు విష్ణు ప్రసాద్ ని కలవండి" అని మీకు దొరికిన సలహా! ఆ తాడే విష్ణుప్రసాద్ గారు. ఆయనకంటే మీకు భగవంతుడెవరు సుజాతా!

teresa said...

Here's a pat on your back for deling with the pain so very gracefully. I am glad you are doing well after the spinal fusion and thanks for sharing your experience.
slainte Mhath! :)

చైతన్య.ఎస్ said...

మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాని కోరుకుంటూ..

Unknown said...

అలాంటి పరిస్థితులకి ఎదురొడ్డి నిలిచిన మీరు విజేత!

Anonymous said...

సుజాత, మీ లవ్ స్టొరీ చెప్తున్నారనుకొని పరిగెత్తుకొచ్చా. గుండెలు పిండేసారు. నాకు సస్పెన్స్ గిట్టదుకాని, ఒక్కమాట చెప్పేయండి .ఇప్పుడు మీరు అన్నివిధాలా కులాసాయే కదా! మిగతాది ఆలస్యం చెయకుండా వెంట,వెంటనే రాసేయండి. అంతబాధ మీరెలా భరించరోగాని , వింటున్న మాకే ఎంతో కస్టంగా వుంది.

ఆయుర్వేదం said...

no words to say... నావీ వేరే రకం బాధలు కానీ ఇలా హత్తుకొనేట్టు చెప్పటం రాదు.... ఇంత బాధల్లో మీకు అమ్మ, నాన్నా తోడు ఉన్నారు. అందుకు మీరు చాలా lucky.. కొన్ని జాతకాలకు ఆ అదృష్టం ఉండదు.

ramya said...

సుజాత గారు, చదువుతూ ఉంటే గుండె బరువెక్కింది.
నిజంగా వీరగాధ, విజేత మీరు.
ఇప్పుడు కులాసాగా ఉన్నారా?

ప్రతాప్ said...

వెన్ను నొప్పి బాధ పగ వారికి కూడా వద్దు.
You r really gr8.

Kathi Mahesh Kumar said...

“Bravery is believing in yourself, and that thing nobody can teach you.”

మీరు ధైర్యవంతులు. అంతకు మించి ఏంరాయాలో తెలియటం లేదు.

Sujata M said...

పూర్ణిమా

కొన్ని అనుభవాలు ఇతరులకు పనికి రావొచ్చు. అందుకే ఇవి చెప్పడానికి సాహసించాను. థాంక్స్.

Sujata M said...

Rani garu

I agree with you. I hv not until now counted on my experiences, though they had a great impact on my life. I am writing this to say thanks to everyone who have been with me in my worst days.

Sujata M said...

సీ.బీ.రావు గారు

చాలా థాంక్స్. ధైర్యం సంగతి నాకు తెలియదు గానీ - ఒక లాంటి నిస్సహాయ స్థితి లో కూడా హ్యూమర్ ని కోల్పోకుండా చేసిన మావయ్య లకూ, చిన్నాన్న ల కూ, అమ్మా నాన్నలకూ - ఒక పెద్ద సలాం.

వెన్ను నొప్పి చాలా నరకం. కేవలం సాధారణ నడుము నొప్పి గా ట్రీట్ చేసి దాన్ని పీకల మీద కు తీసుకొచ్చిన అందరి మీదా నాకు బోల్డంత కోపం వచ్చింది. చిన్న పామును పెద్ద కర్ర తోనే కొట్టాలి. ఒక్కో సారి చిన్న పాము చిన్న పాము లా వుండదు.

ఏమైనా నేను ధైర్యంగా ఈ పరిస్థితి ని ఎదుర్కొన్నానని అనను. ఈ పరిస్థితులే నాకు ధైర్యాన్నిచ్చాయి. నేను హీరోయిన్ లా ఫీలయ్యే లా చేసాయి. :D

Sujata M said...

హనుమంత రావు గారు

నాకేమీ కాలేదు. అదంతా అయిపోయింది. నేనిప్పుడు చాలా బావున్నాను. చాలా థాంక్స్. కొన్ని ఇబ్బందులు ఉన్నా, లైఫ్ స్టైల్ కాస్త మార్చుకుని, వొళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకుతున్నాను. అయినా గతాన్ని తవ్వడానికి కారణం - ఈ మధ్య మళ్ళీ మొదలయిన నొప్పి కొంచెం, ఊసు పోక కొంచెం. :D

Sujata M said...

సుజాత గారు,

మీరన్నది అక్షరాలా నిజం. దొంగా దొంగా సినిమాలో ఒక డైలాగుంది. దేవుడు తలుపులన్నీ వేసేసినా, కిటికీ కొంచెం తెరిచి ఉంచుతాడంట. అలా.. డా.విష్ణు ప్రసాద్ దగ్గరకి నేను వెళ్ళటమేమిటి - ఆయన 'వి విల్ ఫైండ్ ఏన్ ఎండ్ టు ఇట్ ' అనడమేమిటి ? సంవత్సరం తిరిగే కల్లా నేను టింగు రంగా అంటూ కొండలెక్కడమేమిటి ?

హేట్స్ ఆఫ్ లు ఏమీ వొద్దు. నేను జస్ట్ లక్కీ అంతే ! :D

Sujata M said...

Teresa garu

Thanks. I am an Iron Lady :D !! Got an implant in my spine !!!

Thanks very much. I tried my best not to sound pitiful.

This experience is something which I can never forget.

Thanks a lot for understanding.

Sujata M said...

ప్రవీణ్ గార్ల పాటి గారు

థాంక్స్. విజేత నేనొక్కదాన్నే కాదు. నా తో పాటూ నడిచిన అందరూ విజేతలే. నేను లక్కీ. అంతే !

Sujata M said...

Chaitanya garu

Thanks a lot.

Sujata M said...

లలిత గారూ

ఇది నా లవ్ స్టోరీ నే ! నన్ను నేనెక్కువ లవ్ చేస్తాను కాబట్టి - నా లవ్ 'స్టోరీ' !

Sujata M said...

అమర వాణి గారు

థాంక్స్. మా అమ్మా, నాన్నా - నిజంగా నాకు చాలా సపోర్ట్ చేసారు. అందుకే దేవుడికి థాంక్స్!

Sujata M said...

రమ్య గారు

థాంక్స్. వచ్చే సారి బరువెక్కకుండా ప్రయత్నిస్తాను.

Sujata M said...

ప్రతాప్ గారు..

నిజంగా - పగవారికి కూడా రాకూడదు.

Sujata M said...

మహేష్ గారు,

థాంక్స్. ధైర్యం అంటారా ? ఏమో ! అది అలా జరిగిపోయింది.

Bolloju Baba said...

i am not able to read the post.
i am sorry

రాధిక said...

నేనేమీ మాట్లాడలేకపోతున్నానండి.అసలు అంత నొప్పిని ఎలా భరించారు?మళ్ళాదానిని కామెడీగా చెపుతున్నారు.ఒక పక్క నుంచి కళ్లల్లో నీళ్ళొస్తున్నాయి...ఇంకో పక్కనుంచి మీ జోకులకి నవ్వు కూడా వస్తుంది.ఇదో వింతయిన పరిస్థితి.ఏదేమయినా ఇప్పుడు మీరు బాగున్నారు కదూ..మీరు బాగుండాలండి.

శ్రీ said...

మీ మూడో పార్టు చూసి మీ వీరగాధ మొదటినుండీ చదవడం మొదలుపెట్టాను ఇపుడే!

మనిషికి ఒకసారి బాధని అనుభవించి బయటపడినపుడు జీవితం పరిపూర్ణమవుతుందేమో! అలాగే ప్రపంచాన్ని కొత్తగా, ఇంకొంచెం ధైర్యంగా చూడడం మొదలుపెడతాడు.

బాధని మాతో పంచుకుంటున్నదుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.