Pages

17/08/2026

Houti Attacks in the Red Sea and the Shifting Paragigms of Modern Warfare - AVM PK Mallick, VSM (Retd)

 Houti Attacks in the Red Sea and the Shifting Paragigms of Modern Warfare - AVM PK Mallick, VSM (Retd)

చైనా టిబెట్ లో ప్రపంచం లో అతి మెగా అతి పెద్ద డాం ని నిర్మిస్తూంది. ఒక వేళ ఏ భూకంపాలకో, లాండ్ స్లైడింగ్ వల్లనో, చైనా కనుక ఆ డాం ను నియంత్రించలేకపోయినా, లేదా ఆ డాం పగిలినా, నిజంగానే చైనా ఉద్దేశ్యపూర్వకంగా డాం ని బద్దలు కొట్టినా, ఆ నది నీరు, కింద ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అసాం, బాంగ్లాదేష్ లను సమూలంగా ముంచెత్తగలవు. ఒక విధంగా ఆ నీరు ఒక ఆయుధం. అదేదో అంటామే - ఒక సారి వినాశనం సృష్టించే మెగా మాస్ డిస్ట్రక్టర్. దీనితో పాటూ జరిగే ఎకాలజికల్ విధ్వంసం కూడా ఈ ప్రాంతాలు త్వరగా కోలుకోనివ్వలేవు.   ఇలా ప్రకృతిని, భౌగోళిక సంపదలనూ, ప్రాదేశిక వాతావరణాన్నీ, బూచి గా మార్చడాన్ని మానవుడు ఎపుడో నేర్చేసుకున్నాడు.  చైనా ఇపుడు ప్రపంచంలోనే బలమైన దేశం, సార్వభౌమాధికారం ఉన్న ఒక దేశం.  కానీ ఏ సార్వభౌమత్వమూ, రాజ్యమూ లేని చిన్న ఉగ్ర మూక, పర్యావరణ బాంబుల్నీ, చిన్న చిన్న పడవల్నీ, ఆయుధాలనీ వాడి, ప్రపంచ వాణిజ్యాన్ని అతలాకుతలం చెయ్యగలగడం, దాని ముందు పెద్ద పెద్ద నేవీలు, సైన్యాలు కూడా దిక్కు తోచని పరిస్థితి కి నెట్టివేయబడడం ఇప్పుడు చూస్తున్నాం. 


దాని గురించి రాసిన ఈ బుల్లి 62 పేజీల ఈ బుక్ గురించి నేను చేస్తున్న చిన్న పరిచయం ఇది. యుద్ధ కళ బాగా మారింది. ఆధునికం కాస్తా అత్యాధునికం అయింది. కృత్రిమ మేధ - రకరకాల మనుషుల్లేని విమానాలు, ఇంటర్ నెట్, బిగ్ డేటా, టెక్నాలజీ, సింథటిక్ బయాలజీ, వగైరాలు అందరి నాలుకలపై తిరుగుతున్నాయి. 

ఎర్ర సముద్రం లో ఇప్పుడు  ఉన్న పరిస్తితులు, వాటి వెనకున్న మర్మాలు, గొడవలు, ఆయుధాలూ వీటన్నిటి గురించి ఇంకా, సాంప్రదాయ సైన్యానికి ఉన్న పరిమితులు, సొంతింటి గూళ్ళలోంచీ స్థానబలిమితో అదుపైన పోరాటం చేసే తీవ్రవాదులూ, సాయుధ మూకలు, ప్రపంచం లోకెల్లా అత్యంత సమర్ధవంతమైన నౌకా సైన్యాన్ని సైతం ఎదుర్కోగల చిన్న చిన్న వ్యూహాల సామర్ధ్యం గురించి రచయిత ఈ పుస్తకం లో వివరిస్తారు. 


నిజానికి ఎర్ర సముద్రం లో ఇప్పుడు జరగాల్సిన యుద్ధం పెద్ద పెద్ద వార్ షిప్ ల తో కాకుండా తీరాల్లో గస్తీకీ యుద్ధానికి వాడే చిన్న నౌకలకూ, ఈ మూకలు వాడే బోట్లకూ మధ్యే జరగాలి. దీన్ని బట్టి సముద్రం లో శాంతినీ, స్థిరత్వానీ ఈ అతి పెద్ద అత్యాధునిక యుద్ధ నౌకలు, శక్తివంతమైన నౌకా దళాలూ తీసుకొస్తాయన్న గారంటీ అయితే లేదు. కొన్నిటిని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. 


సౌదీ అరేబియా కూ యెమెన్ కూ మధ్య ఉన్న సమస్యలూ, యెమెన్ కూ దిజిబూతీ కీ మధ్య దగ్గర దగ్గర కనిష్టంగా 20 మైళ్ళ వైశాల్యం మాత్రమే ఉండిన బాబ్ ఎల్ మండెబ్ సంధి తాలూకూ ప్రాధాన్యతా - ఇపుడు ప్రపంచానికి తెలుసు. సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ కూ, ఇరాన్ కూ మధ్య ఉన్న ప్రాధమిక వాణిజ్య రహదారి అయిన హర్మూజ్ జల సంధి ని ఇరాన్ ఆపేశాకా, దాదాపు పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాలన్న్నీ సౌదీ కి దిగువన ఉన్న ఈ బాబ్ ఎల్ మెండెబ్ జల సంధి ద్వారా తమ క్రూడ్ ఆయిల్ నూ, ఎల్ ఎన్ జీ నీ సరఫరా చేస్తున్నాయి. అయితే, ఈ జల సంధి లో ట్రాఫిక్ కీలకంగా మారిన కొన్ని నెలలకు హౌతీలు దీనిలో దాడులకు తెగబడి, అమెరికాను మరింత ఇరకాటంలోకి నెట్టేయడం, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అమెరికా సాయుధ సంపద ఈ గుంపు ముందు, ఈ గుంపు వాడే చిన్నా చితకా ఆయుధాల ముందు బెదరాల్సి రావడం విచిత్రం. 


బాబ్ ఎల్ మెండెబ్,   మెడిటెరేనియన్ సముద్రాన్నీ, హిందూ మహా సముద్రాన్ని కలిపే చోట ఉన్న  ఓ కీలకమైన జల సంధి.   దీనికి పశ్చిమాన ఆఫ్రికా తీరం  లోని దిజిబూతొ, తూర్పున యెమెన్ ఉన్నాయి. పెరిం ద్వీపం (జబాల్ అల్ టాయిర్) ఈ సంధిని రెండు ప్రధాన సముద్ర యాన మార్గాలుగా విడదీస్తుంది. 



* కుడి కాలువ  (బాబ్ ఇక్సెందర్) : రెండు మైళ్ళ వెడల్పు, దగ్గరదగ్గర 98 అడుగుల లోతు తో అంత పెద్దవి కాని నౌకలకి సరిపోతుందిది. 


* పడమటి కాలువ : 16 మైళ్ళ వెడల్పు, 1017 అడుగుల లోతు తో లోపలికీ, బయటికీ రెండువైపులా నౌకలు ప్రయాణించడానికి రెండు రెండేసి మైళ్ళ ఇరుకు ఉన్న ట్రాన్సిట్ కారిడార్లతో ఉంటుంది. ఈ ఇరుకు దారి లో వెళ్ళే వాణిజ్య నౌకల పరిస్థితి ఎంత సున్నితంగా ఉంటుందో ఊహించుకోండి. సాధారణంగా వాణిజ్య నౌకలు బోల్డంత బరువుల్ని మోసుకుపోతూ, అతి నెమ్మదిగా ప్రయాణిస్తూంటాయి. వీటి మీద దాడి జరిగితే ఎంత కష్టం? పైగా అవి క్రూడ్ ని తీసుకెళ్ళే నౌకలయితే ? 

రష్యన్ ఆయిల్ మీద నిషేధం విధించిన తరవాత 2021 నుండీ 2023 మధ్య ఈ బాబ్ ఎల్ మెండెబ్ తాలూకు ప్రాముఖ్యత పెరిగింది. రష్యా సూయెజ్ కెనాల్, ఆ తరవాత బాబ్ ఎల్ మెండెబ్ గుండానే తన ఆయిల్ ను ఇండియా చైనాలకు పంపించేది.  అదే విధంగా సౌదీ, యూ ఏ ఈ వంటి దేశాలు, తమ ఉత్పత్తులను  యూరొపు కి పంపేందుకూ ఈ మార్గమే సరైనది.  ఈ జల సంధి మీద అధికారం ఎవరిదీ అనే ప్రశ్న, యెమెన్ లో అంతర్యుద్ధం పొడుగూతా రేగుతూనే వచ్చింది. 2015 లో యెమెన్ తన తీరాన్నంతటినీ సాయుధ దళాలతో నింపేసింది. 2015 నుండీ 2017 వరకూ హౌతీలు ఈ ద్వీపాలను ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల మీద దాడి చేయడానికి వాడేవారు. వీటిని కొత్త లో యూ ఏ ఈ వగైరా దేశాలు చిన్న చిన్న నౌకల సాయంతో బానే ఎదుర్కొన్నారు. వాళ్ళని బాబ్ ఎల్ మెండెబ్ దరి దాపుల్లోంచీ, పెరిం దీవి నుండీ ఎన్నోసార్లు తరిమి కొట్టారు. అయితే హౌతీలు ఓడిపోలేదు. వెనుదిరగలేదు. ఎప్పటికప్పుడు ఏదో రకంగా తమ అదుపుని కొనసాగించారు. హోడిడా లాంటి కీలకమైన నగరాన్ని తమ ఆధీనం లోనే ఉంచుకున్నారు. 


2023 నవంబర్ ఒకటిన ఇండియా నుండీ టర్కీ కి కార్లని రవాణా చేస్తున్న ఒక వాణిజ్య నౌక ' గేలక్సీ లేడెర్ ని బంధించారు. దీనిని ఒక జపన్ కంపెనీ నడిపింది. బెహమీ జెండా ఉంది గానీ దీని ఓనర్ ఒక బ్రిటిస్క్ కంపెనీ. కానీ ఇంకో ఓనర్ ఇస్రాయిలీ అనే సాకు హౌతీలకి ఉంది. దీన్ని తీస్కెళ్ళి తమ ఆధీనంలో ఉన్న హౌడీడా పోర్ట్ లో బంధించుకున్నారు. నౌకలకి ప్రత్యేకంగా ఒక దేశం ఉండదు. బందీలయిన ఓడ సిబ్బందిలో ఒక్కరూ ఇస్రాయిలీ లేరు.  అయితే, ఈ దాడితో హౌతీల ప్రభ వెలిగింది. అసలు హౌతీల గొడవ ఏమిటా అని అందరూ తలౌ తిప్పి చూశారు. అయితే, హౌతీలు అంతకన్నా పురాతనమైన వాళ్ళే. 


హౌతీల అసలు పేరు అన్సర్ అల్లా ("Ansar Allah") (దేవుని మద్దతుదారులు) - వీళ్ళ కథ  1990 ల లో మొదలయింది. యెమెన్ లో షియా ముస్లిం లలో వీరిదొక మైనారిటీ వర్గం. పేరు జైదీలు. వీళ్ళకి ఈ పేరు వారి పోరాటాన్ని ముందుకు తెచ్చిన "హుసేన్ అల్ హౌతీ" పేరు మీదుగా వచ్చింది. షియా ల లో జైదీలు వేరు. వీళ్ళు దక్షిణ సౌదీ అరేబియా లోనూ, ఉత్తర యెమెన్ లోనూ కనిపిస్తారు. వీళ్ళకూ మామూలు షియాలకూ కొన్ని తేడాలున్నాయి.  వీళ్ళు మొదట యెమెన్ అధ్యక్షుడు 'అలీ అబ్దుల్లా సలేహ్ '  మీద తిరుగుబాటు చేయడం ద్వారా తమ పోరాటాన్ని మొదలు పెట్టారు. సలెహ్ ని సపోర్ట్ చేయడం వల్ల సౌదీ అరేబియా వీళ్ళకు శత్రువైంది. 

సలేహ్ 2003 లో వీళ్ళ మీద సౌదీ అరేబియా మద్దతుతో తీవ్రమైన దాడులు చేసాడు. 2004 మొదటి కల్లా సలేహ్ దాడుల్లో వీళ్ళ లీడర్ హుసేన్ బద్రెద్దిన్ అల్ హౌతీ మరణించాడు.  ఈ అణిచివేతను హౌతీలు తిరస్కరించారు. తిరగబడ్డారు. అరబ్ స్ప్రింగ్ యెమెన్ లో 2011 లో సలేహ్ ని గద్దె దించింది.  హౌతీలు, 2014 లో  యెమెన్ రాజధాని సనా ని తమ ఆధీనం లోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ హౌతీలు యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. 

2014 లో హౌతీ ల ఎదుగుదల చుట్టు పక్కల రాజ్యాలని గాభరా పెట్టింది. సౌదీ అరేబియా, యూ ఏ ఈ లను ప్రధానంగా కలవరపెట్టింది. పైగా హౌతీలకు హిజబొల్లా, ఇరాన్ ల మద్దతు ఉండడం అందరినీ ఆందోళనకు గురి చేసింది.  దానితో, ఒక గ్రూప్ గా ఏర్పడి, అమెరికా, బ్రిటైన్, ఫ్రాన్స్ ల తో కల్సి, ఆ కూటమి యెమెన్ లో హౌతీ ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసారు. అవి చిచ్చుని మరింత రాజేసాయి. ఈ దాడుల వల్ల యెమెన్ కు లాభం కన్నా నష్టమే జరింగింది. యెమెన్ లో 21 మిలియన్ల ప్రజలు ఇళ్ళూ పొళ్ళూ కోల్పోయి రోడ్డున పడ్డారు. తీవ్ర మానవ  సంక్షోభం ఏర్పడింది. లక్షలాది మంది తిండి, రక్షణా లేక చనిపోయారు.  ఆఖరికి 2022 లో అప్పటి యెమెన్ అధ్యక్షుడు అబ్ద్రబుహ్ మన్సూర్ హదీ, తన అధికారాన్ని యునైటెడ్ నేషన్స్ గుర్తించిన "ప్రెసిడెన్షియల్ లీడర్ షిప్ కౌన్సిల్" కు బదలాయించాడు. 

అయితే ఈ ప్రభుత్వం హదీ 2015 లో సౌదీ అరేబియా  కి పారిపోయిన దగ్గరనుంచీ రియాద్ లోనే ఉంది. అంటే ప్రపంచం అధికారికంగా గుర్తించిన యెమెన్ ప్రభుత్వం యెమెన్ కు అవతల ఉంది. యెమెన్ లోపలి నుంచీ పాలిస్తున్నది, ప్రపంచం గుర్తించని ఉగ్ర మూక - హౌతీలు.  సనా పగ్గాలు చేపట్టిన దగ్గర్నించీ హౌతీలు తమని తాము బలోపేతం చేసుకోవడానికి ప్రయ్త్నిస్తూనే వచ్చారు. సాధారణ గొరిల్ల గ్రూప్ దగ్గరనుంచీ ఒక దేశ ప్రభుత్వానికి కావలసైన పద్ధతీ, సరంజామా, స్ట్రక్చర్ ఏర్పరచుకున్నారు. తమ సైన్య సామర్ధ్యాలని పెంచుకున్నారు. పన్నులూ, స్మగ్లింగూ, సుంకాల ద్వారా ఆదాయం గడించారు. ప్రపంచం తమని గుర్తించాలని కోరుకునేవాళ్ళు వారి స్లోగన్ " God is Great; deat to America; death to Israel; damn the Jews, Victory for Islam". 

ఇంత వరకూ అందరికీ తెలిసిన విషయలయ్యాక, హౌతీల యుద్ధ నీతి గురించి చెప్పుకోవాలి. వాళ్ళు పర్యావరణాన్ని నాశనం చేస్తామని బెదిరింపులకు పాల్పడి సంవత్సరాల పాటూ 'హొడీడా ' తీరం మీద పట్టుని కోల్పోకుండా ఆపారు. అదెలా అంటే దాదాపు 1.1 మిలియెన్ బారెళ్ళ లైట్ క్రూడ్ తో నిండి ఉన్న ఒక తీరానికి కొట్టుకొచ్చిన పాత, పిప్పి పట్టీ స్టోరేజ్ టేంకర్ ని ఎన్విరాన్మెంటల్ వెపన్ గా వాడుకున్నారు. దాన్ని పరిశీలించడానికి యూ. ఎన్. పరిశీలకులకు హౌతీలు అనుమతి ఇవ్వలేదు. ఆ టాంకర్ కి ఏదైనా జరిగితే, జరిగే ఆయిల్ స్పిల్ వల్ల ఆ ఇరుకు జల సంధి లో జరిగే పర్యావరణ వినాశనానికి భయపడి, ఎవరూ యెమెన్ మీద హౌడీడా ప్రాంతం మీదా దాడి చేయనీకుండా ఈ బెదిరింపు ఆయుధం కాపాడుతుంది. 

గాజా లో యుద్ధం హౌతీలకు ఇంకో ఆయుధం. నిజానికి హౌతీల ప్రభుత్వం పాలనలో ఆర్ధిక పరిస్థితి కుదేలయి, సాధారణ యెమెన్ ప్రజలలో అసంతృప్తి మొదలయి, విప్లవ ధోరణులు కనపడే వేళలోనే సెప్టెంబర్ 2023 లో యెమెన్ లో ప్రదర్శనలు జరిగాయి. సరిగ్గా అక్టోబర్ 7 2023 న ఇజ్రాయిల్ మీద దాడి జరగడం తో హౌతీల దృష్టి మళ్ళింపు పోరాటం మొదలయింది.  ఇరాన్, హమాస్, హిజబుల్లా, హౌతీలు ఫ్రెండ్స్ కాబట్టి, వీళ్ళ ఉత్సాహం కూడా పెరిగింది. సడెన్ గా యెమెన్ లో హౌతీలు ఇస్లాం ఆత్మగౌరవం గురించి మాటాడడం వల్ల పొలిటికల్ మూడ్ మారింది.  

హౌతీలు తెలిసీ తెలీకండా ఇజ్రాయిల్ మీద దీర్ఘ శ్రేణి క్షిపణుల్ని ప్రయొగైంచారు. డోం లు వాటిని అడ్డుకున్నాయి. ఆ తరవాత గేలక్సీ లీడర్ ని పట్టుకున్నారు. దానితో వారి ప్రభ వెలిగింది. ఇదేదో బావుందనుకుని, యెమెనీ సరిహద్దు లో తిరిగే వాణిజ నౌకల మీద దాడులు చెయ్యడం మొదలు పెట్టారు. వీటికి ఒక సారి ప్రయోగించే డ్రోన్ లు, ఏంటేఎ షిప్ క్రూయెజ్ మిసైళ్ళు, ఏంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్ళు, చిన్న చిన్న డ్రైవర్ లేని స్పీడ్ బోట్లు (పేలుడు పదార్హ్దాలు నింపిన బోట్లు) - వీటన్నిటితో దేశం తొ సంబంధం లేకుండా అన్ని నౌకల్నీ దాదాపుగా అల్లరి పెట్టారు. 

అసలు నౌకలు ఆ జలాలలో ఎక్కడున్నాయో హౌతీలకు ఎలా తెలుస్తుంది ? వాళ్ళు ఇంటర్నెట్ లో అందుబాటు లో ఉండే ఓపెన్ సోర్స్ వెబ్ అప్లికేషన్ ల ద్వారా ఓడల ట్రాకింగ్ డాటా ని సేకరించేవాళ్ళు. తీరం వెంబడి చిన్నా చితకా ట్రాన్స్పోండర్ డాటాబేస్ లను, మరైన్ రాడార్ లనూ నెలకొల్పారు. పైగా ఎర్ర సముద్రం మధ్యలో తిరుగ్తూ ఉండే ఇరాన్ ఇంటెలిజెన్స్ షిప్ బెహ్షాద్ కూడా వీళ్ళకు ఓడల సరైన ఎడ్రసులు ఇచ్చేది. దానితో తమకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకున్న పరిధుల్లోనే పెంచుకుంటూ, ప్రిసిషన్ దాడులకు పాల్పడేవారు. కొన్ని ఓడలను పాక్షికంగా దెబ్బ తీసేవి. కొన్ని తీవ్రంగానూ దెబ్బ తీసేవి. దెబ్బకి వాణిజ్య నౌకల బిజినెస్ లో చాలా మార్పులొచ్చాయి. ఓడల భీమా మొత్తాలు పెరిగాయి. అమెరికా ఏ నౌకలకీ రక్షణ ఇచ్చే పరిస్థితి లో లేదు. సడన్ గా బాబ్ ఎల్ మెండెబ్ సున్నితత్వం బయటపడింది. 

ఈ జలసంధినో, హర్మూజ్ నో ఇరాన్ ఆపేసినా, ప్రపంచ వాణిజ్యానికి కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది గానీ, మొత్తంగా దెబ్బ తిని పోదు. పనామా కెనాల్ లో కరువు వల్ల సరిగ్గా వర్షాలు పడక, నీళ్ళు నిండకపోతే అది మూసేస్తారు కొన్నాళ్ళు. సూయెజ్ కెనాలూ ఎన్నో సార్లు మూత పడింది. ఓడలు ఇంకొన్ని రోజులు ఎక్కువైతేనేం ఆఫ్రికా చుట్టూ తిరిగి సరకునైతే రవాణా చేసాయి. అసలు ఇంతింత దూరం ఎక్కువ బరువులు మోసుకెళ్ళేందుకే పెద్ద పెద్ద నౌకల్ని కూడా నిర్మించారు. ఇవసలు కృత్రిమమైన కెనాళ్ళ లో సరిపోను కూడా సరిపోవు. కాబట్టి ఇక్కడ ప్రశ్న వాణిజ్యానిది కాదు. ఈ గొడవల వల్ల మన ఇళ్ళలోకి గేస్ రావడం ఇబ్బంది అవుతూంది. నిజమే. కానీ ప్రపంచం ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు కూడా చూస్తుంది. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళిందనుకోండి. అపుడు పెట్రోల్ డిమాండ్ ఎక్కడుంటుంది. అయితే అది వెంటనే జరగకపోవచ్చు. అంత వరకూ మాత్రమే ఈ ఇబ్బంది, సందిగ్ధత. 

రచయిత చెప్పేదేమిటంటే, దీనిలో ప్రపంచాన్ని, క్రూడ్ బిజినెస్ నూ ఇబ్బంది పెట్టగలిగే శక్తి కేవలం ఒక అనాగరిక ఉగ్ర మూక కు ఉండడం ఏం బావుంటుంది ? అగ్ర రాజ్యాలు కూడా ఊరుకోలేదు. వీలైనన్ని సార్లు యెమెన్ మీద రక రకాల స్థావరాల నుండీ దాడులు చేశాయి. బ్రిటైన్, అమెరీకా లు తమ దగ్గర ఉన్న పెద్ద పెద్ద యుద్ధ నౌకల్ని మోహరించాయి. ఉదాహరణ కు  USS Dwight D Eisenhower (22 Fixed Wing Aircrafts), USS Pilippine Sea, USS Gravely, USS Mason, USS Florida, యెమెన్ మీద దాడి కి వాడిన కొన్ని ప్రముఖ ఆపరేషన్ లలో పనిచేసాయి. 12 Jun 2024 లో క్రూయిస్ మిసైళ్ళను ప్రయోగించి, వైమానిక దాడుల్నీ చేపట్టాయి. సైప్రస్ నుండీ విమానాలు బయల్దేరి వచ్చాయి. తోమహాక్ లు వాడారు. 150 precision guided munitions of various types,  వాడారు.  F/A-18 Super Hornet లు వాడారు.  ఎంత చేసినా హౌతీలు తోక ముడవలేదు. వాళ్ళ వ్యూహాలు వేరు. 


సౌదీ మిత్ర పక్షాల తో దశాబ్దం గా చేసిన యుద్దం హౌతీలను బలోపేతం చేసింది. ఎప్పటికప్పుడు తమ సైన్య స్థావరాలను మార్చడం, ట్రక్ ల మీద నుండీ ప్రయోగించే మిసైళ్ళను వాడుతూ, ఆ ట్రక్ లను ఒక ష్తానం నుండీ ఇంకో స్తానానికి వెంటనే మారుస్తూ ఉండటం, సొరంగాల ద్వారా కదలికలు, సొరంగాలలో ఆయుధాగారలను  దాయడం, ముఖ్యంగా ఇరాన్ నుండీ ఆగకుండా అందే ఆయుధాలూ, హౌతీలను సమర్ధులను చేసాయి. 


ఈ దాడులకు హౌతీలు కూడా ప్రతిదాడులు చేసారు జనవరి 2024 లో USS Laboon మీద మిసైళ్ళు వేసారు కానీ అవి మధ్యలోనే నిలువరించబడ్డాయి. మరునాడే మూడు anti ship ballistic missiles, Gibraltar Eagle  అనే అతి పెద్ద అమెరికన్ వాణిజ్య నౌక మీదికి ప్రయోగించారు. వాటిలో రెండు గురితప్పాయి. మూడోది నౌక కి తాకిన, పెద్ద నష్టం జరగలేదు. 


జనవరి 28 న టవర్22 అనే కీలక అమెరికన్ సైనిక స్థానం మీద దాడి చేసారు. దీనిలో ముగ్గురు అమెరికన్ సైనికులు చనిపోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  ఇది సిరియాకీ ఇరాక్ కీ మధ్య ఉన్న కీలక స్థావరం. ఇక్కడి నుండే అమెరికన్ సైన్యాలు ఐసిస్ మీద దాడులు చేసేవి. ఇది పెద్ద దెబ్బ.   అసలు ఈ చిన్న చిన్న మూకలు చేసే తక్కువ ఖర్చు దాడులకీ, అగ్ర రాజ్యాలు చేసే అత్యాధునిక దాడులకీ ఎంత తేడా ఉందో. పేట్రియాట్ మిసైల్ బేటరీలు ఒక సారి వాడేనుకు ఒకో మిసైల్ కూ 3-4 మిలియన్ డాలర్ ల ఖర్చవుతుంది. అలాంటిది టవర్ 22 ను పేల్చేందుకు హౌతీలు చవకైన ఆత్మాహుతి డ్రఒన్ లు వాడారు.  ఒక సైనిక స్థావరం మీద అంత పెద్ద దాడి ని అగ్ర రాజ్యం కనుక్కోలేకపోవడానికి కారణం, సరిగ్గా అదే సమయానికి అమెరికన్ డ్రోన్ ఒకటి సర్వైలెన్స్ చేసి, బేస్ కు వాపసు రావాల్సి ఉంది. దాని రాకతో వార్నింగ్ సిస్టం లు ఎలర్ట్ అయి ప్రతి దాడి చేస్తాయేమొ అనే కాస్ట్ కటింగ్ మరియూ ఫ్రెండ్లీ ఫైర్ ను నివారించేందుకు డ్రోన్ లను పసిగట్టే వ్య్వస్థను కాసేపు నిలిపేసారు. అదే సమయానికి హౌతీ డ్రోన్ రావడం వల్ల, టవర్ 22 దాడి సాధ్యమయింది.   ఇలా ఇలాంటి యుద్ధాలలో వాడే యుద్ధ తంత్రాలు, ఆయుధ శ్రేణి, వాటి ఖర్చులు, వాటి పరిమితులు, ఎదుటి వారు వాడే పద్ధతులు, వ్యూహాలూ, డేటా ఫ్యూజన్, ఇంటెలిజెన్స్ సేకరించే పద్ధతులు, ఇరాన్ సాంకేతిక సామర్ధ్యం, వీటన్నిటి గురించీ చక్కగా మిలిటరీ భాషలో వివరించారు రచయిత.  సైన్యం వాడే పద్ధతులు, మారాల్సిన కొత్త కొత్త పోరాట పద్ధతుల గురించి ఇంటరెస్టింగ్ గా రాయడం వల్ల, ఇవన్నీ, న్యూస్ పేపర్లలో చదివే వ్యవహారేలే అయినప్పటికీ, క్షిపణి వ్యవస్థలు, ఒక వేళ నౌకల మీద ఆయుధ శ్రేణులన్నీ వాడేస్తే వాటిని ఎలా రీఫిల్ చేస్తారు? వాటి పరిమితులేంటి ? యుద్ధం లో పార్టిసిపేట్ చేసే యుద్ద నౌకలు ఎందుకు వెనక్కి రాలేవు.. ఇలాంటివన్నీ చదివితే నిజంగా ఇన్ని నెలలు గా సముద్రం లో చిక్కుకుపోయిన నావికుల మీదా, సైన్యాల మీదా చాలా సానుభూతి కలుగుతుంది.  


అత్యంత ఖరీదైన రక్షణ వ్యవస్థలు, అంతు లేని దాడులూ చెల్లా చెదురుగా విస్తరించిన హౌతీల ని నిలువరించడం సాధ్యం కాదు. రక రకాల రాజకీయ కారణాల వల్ల జరిగే ఈ ఎడ తగని ఈ పోరాటాల వల్ల ఈ కొత్త రకం యుద్ధాలు, కొత్త సాంకేతికతలూ  ఈ కొత్త వ్యూహాలూ - ఇవేవీ కావు సొల్యూషన్ ! మంచి నాయకులూ, మంచి పద్ధతులూ, మంచి నిర్ణయాలూ తప్ప ఈ ప్రపంచాన్ని బాగు చెయ్యలేవు.   యుద్ధం చాలా ఖరీదైనది. అది దేశాల ఆర్ధిక వ్యవస్థలని ఇబ్బంది పెట్టగలవు. అమెరికన్ నేవీ వాడే టాక్టికల్ ఇంటర్సెప్టర్ లు, మల్టీ మిలియన్ డాలర్ల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అంటే Standard Missile-2 (SM-2) అనేది 2.2 మిలియన్ డాలర్లుంటుంది. అదే  SM-6 - 5.3 మిలియన్లు, SM-3 -  28.7 మిలియన్లు.   ఒక పేట్రియాట్ ఇంటర్సెప్టర్ ఖరీదు దాదాపు 4-5 మిలియన్ డాలర్లు ఉంటుంది. అన్నిటి కన్నా చవక రకం AIM-9X సైడ్ విండర్ ఒక షాట్ కి 400,000 డాలర్లుంటుంది. అంటే యుద్ధం, ఆయుధ వ్యాపారులకి తప్ప ఎవరికీ లాభం కాదు. అలాంటిది, ఇంతా ఖర్చు పెట్టి అమెరికన్లు సాధించినది ఏముందా అంటే ఏదీ లేదు. చిన్న చిన్న గుంపులుగా విడిపోయి, చవక రకం చిన్న ఆయుధాలతో తమ ప్రాదేశిక  బలిమి వల్ల, ప్రపంచానికి చాలా అవసరమైన జలసంధిని ఆధీనం లోకి తెచ్చుకుని హౌతీలు చేస్తున్న పోరాటం వెంక ఉన్న బలం వాళ్ళ రాజకీయ పట్టుదల అనేది, బహుశా అమెరికన్లు గుర్తించాల్సి ఉంటుంది.  

ఇట్లాంటి సమస్యలకి రాజకీయ, దౌత్య పరిషారాలు వెతకాల్సిందే తప్ప, ఎడా పెడా సైన్యాలను, సైనిక ఆస్తులనూ తాకట్టు పెట్టడం ఎవరికీ మంచిది కాదు. పైగా ప్రపంచ రాజకీయాలలో ఇపుడు ఏర్పడిన సున్నితత్వం ఇంతకు ముందెన్నడూ లేదు. కల్సి కట్టుగా అగ్ర రాజ్యాలు పోరాడే రోజులు దగ్గర్లో లేవు. నాటో గొడవల వల్ల ఇప్పుడు ఈ సుదీర్ఘ యుద్ధాలలో అమెరికా ఒంటరై పోయింది. ఇలాంటి చిక్కు ముళ్ళకు పరిష్కారం తొందరగా దొరకదు.  ఇలాంటి ప్రపంచంలో మిలిటరీలు పోషించే పాత్ర ఎంత కీలకం ?! అంతే ఇంపార్టెంట్ దౌత్య వేత్తలు చేసే పని కూడా. వీటికి కాస్త పొలిటికల్ విల్ ఉండాలి. అంతే. 

***


No comments: