ఝుంపాలాహిరి ఇటాలియన్ లో రాసిన
రెండో నవల. ఇది కూడా పదేళ్ళ క్రితంది, ఆవిడే స్వయంగా ఇంగ్లీష్ లోకి అనువదించిన నవల.
ఏ పాత్రలకీ పేర్లుండవు, కథ జరిగే నగరానికీ, వీధులకీ, షాపులకూ వేటికీ, పేరుండదు. ఏ
పరిస్థితికీ, ఏ బంధానికీ ప్రత్యేకమైన వివరణా ఉండదు. ఇది మీదీ, నాదీ కూడా ఒక అనుభవం
అయుండొచ్చు, ఒక విశాల ప్రపంచంలో మన ఉనికి ఏమాత్రం? అంత వేదాంతపరంగా కాకపోయినా,
రెలిటివ్ గా కూడా మనం ఎంత? మనం వదిలి వెళ్ళే జాడలు ఏపాటివి ? ఒక సామాన్య జీవితం ఎలా
వుంటుంది ? అందులోనూ ఒంటరి జీవితం ? పెళ్ళీ, పిల్లలూ లేని నలభయిల్లో ఉన్న ఇంట్రావర్ట్ మహిళ జీవితం ?
పరిస్థితుల కారణంగా, మనసు బాలేకో, తీరిక లేకో, చదవడానికి దూరమైపోతున్నప్పుడు ఇలాంటి
పుస్తకం చదివితే, జీవితం కళ్ళ ముందు పరుచుకున్నట్టుంటుంది. ముఖ్యంగా తేలికయిన కథ,
కాంప్లెక్స్ మెరుపులు లేని మామూలు జీవితం గురించి, అర్ధమయ్యే భాష లో కథ.
హీరోయిన్
కి పేరుండదు. తల్లీ తండ్రీ వేర్వేరు వ్యక్తిత్వాలున్నవాళ్ళు. తండ్రి కొంచెం
పలాయనవాది. తల్లి మరీ పెర్ఫెక్షనిస్టు.. లేదా మొండిగా మాట చెల్లించుకునే రకం - 'మధ్య వయసు',
హార్మోన్లు, 'అతి జడ్జ్మెంటల్' ప్రవర్తన, ఇవన్నీ తన చిన్నతనపు జ్ఞాపకాలు. తల్లి
విపరీతమైన డిసిప్లిన్ (తన దృష్టిలో) తో చిన్నపిల్లని సాధించేస్తున్నపుడు, తండ్రి
ఆదుకోడు. పిల్లకి రక్షణగా నిలవాల్సింది పోయి, భార్యని ఎదుర్కోలేక, ఆవిడ
గయ్యాళితనాన్ని తను మాత్రం భరిస్తూనో, భరించలేకపోతే, ఆ రూం నుండీ తప్పుకునో
వెళిపోయేవాడు. ఈ పిల్ల, తల్లి గయ్యాళితనాన్ని ఎలాగో తట్టుకుని పెరిగి పెద్దవుతుంది.
ఎందుకనో పెళ్ళి చేసుకోదు.
తండ్రి కి థియేటర్ ఇష్టం. మధ్యతరగతి పెంపకం, డబ్బు
విలువైనది. తండ్రి కూడా జాగ్రత్తపరుడే కానీ, అతనికున్న ఒకే ఒక రసాస్వాదన, జీవితపు
రుచి తెలిపే అభిరుచి, తన మీద తాను ఖర్చుపెట్టుకునే లక్సరీ - సాహిత్యం, థియేటర్. నాటకశాల లో తనకిష్టమైన మూల కుర్చీలో కూర్చుని, నాటక ప్రపంచంలో మునిగిపోయే ప్రేక్షకుడు.
కూతురికి కూడా కళలు ఇష్టమే. తండ్రి చిన్నవయసులోనే మరణిస్తాడు. ఇక తల్లి తెంపరి
తనంతోనే "ప్రేమ తక్కువ అయిన" జీవితం గడిపి పెద్దదయి, ప్రయోజకురాలవుతుంది. తల్లి మీద చిన్న
విరక్తి. అయినా ముసలామెను అపుడప్పుడూ కలుసుకోవడానికి వెళ్తూంటుంది.
పుట్టి, పెరిగిన
సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఊరు. మిత్రులు ఎక్కువే. వాళ్ళలో స్త్రీలు, పురుషులూ..
ఇద్దరూ. నలభయి ఏళ్ళ అవివాహిత, తన కాళ్ళ మీద తాను నిలబడి, సాయంత్రం ఇంటికి వచ్చాక, తననుకున్న విధంగా జీవిస్తుండే మహిళ కి ఏ అనుభవాలుంటాయి ? ఇష్టముంటే వంట, లేకపోతే
దగ్గరలోని కఫే లోంచీ తెచ్చుకున్న ఆహారం. తన మగ స్నేహితులు ఎంత మంచివారంటే, తన తో
పాటూ ఎక్కడికైనా కేజువల్ షాపింగ్ కు రాగలరు. ఒకసారి వీధిలో కలిసిన మగ స్నేహితునితో
స్టాకింగ్స్ కొనుక్కోవడానికి వెళ్తుంది. అతను సెలెక్షన్ లో హెల్ప్ చేస్తాడు కూడా. సేల్స్ గర్ల్ అతన్ని ఆమె భర్తనుకుంటుంది.
అతను కాస్త క్లోస్. అతని భార్యా, పిల్లలూ - కూడా. అతనికి ఆమె అంటే అభిమానం. ఏ
ఎమర్జెన్సీ అయినా, ఎక్కడికైనా వెళ్ళాల్సొచ్చినా, ఈమెకు ఇంటి తాళం ఇచ్చి కుక్క బాధ్యత చూసుకోమని చెప్పగలిగేంత
చనువు. ఆమెకూ అతనంటే అభిమానమే. అది ఆమెను చీల్చేస్తుంటుంది. కానీ దానిలో స్పష్టత
కూడా ఉంటుంది. గ్రాసరీ షాప్ లో అనుకోకుండా ఎదురయి, పిల్లలవాడు కాబట్టి, ఆమెకు
రెట్టింపుగా సామాన్లు కొనుక్కుని, ఒంటరి మహిళ కాబట్టి అంత సామాన్లు కొనని ఆమెను
చూసి దిగులు చెంది, ఆమెను డ్రాప్ చేసేటప్పుడు - 'చూడు, నా గ్రాసరీ కాస్త తీసుకో,
నీకు నెలరోజులు వస్తుంది. ఎందుకైనా మంచింది, స్టాక్ చేసి పెట్టుకో, మరీ అంత తక్కువ
కొనుక్కున్నావూ ' - అని ఆఫర్ చేయగల అభిమానం వుంది అతని మనసులో. ఆ అభిమానం చాలు తనకు.
సామాన్లేమీ తీసుకోదు.
ఎపుడైనా తనలో ప్రశాంతతని చూసి తనకే ఆశ్చర్యం కలుగుతూంటుంది. ఆ
వయసులో తన తల్లి ఎంత భీతావహంగా, కంట్రోలింగ్ గా ప్రవర్తించేదో, గుర్తు తనకు. ప్రతి పైసా కీ
లెక్కడిగేది, ప్రతి చేష్టకీ వివరణ అడిగేది. బాల్యం అంతా భయంభయంగానే, టీనేజ్ కూడా
బెదురుగానే. ఇప్పుడు ఏదో స్వేచ్చ, తనకి కావల్సినవి కొనుక్కోగలిగే స్వేచ్చ, కావల్సిన
చోటుకు వెళ్ళగలిగే స్వేచ్చ, ఆర్ధిక స్వేచ్చ, ఎమోషనల్ స్వేచ్చ.
ఒంటరి మహిళే అయినా
ప్రేమ అంటే తెలియనిదేమీ కాదు తను. ఒక పెళ్ళయిన వాడితో కొన్నాళ్ళు ఒక ఫ్లింగ్ - అతను
ఈమెను విపరీతంగా వెంటాడి, ఫ్లర్ట్ చేసి, తన వైపు తిప్పుకోవడం, అతనితో కలిసి
భోజనానికి అని, లాంగ్ డ్రైవ్ లకు అనీ వెళ్ళడం, ఎవరైనా చూస్తారేమో అని అతను బెదురుతూ, ఎక్కడెక్కడికో
దూర ప్రాంతాలకు తీసుకెళ్ళడం, ప్రాక్టికల్ గా పెద్ద గా కుదరకపోవడంతో నిలిచిన ఒక
అనుభవం. ఒక చిన్న పరిచయం..
ఎన్నాళ్ళకో కలిసిన స్నేహితురాలు, నీడ లాంటి భర్త తో
ఇంటికి వస్తుంది. అతనూ రచయితే అంట. ఆమె ఇంట షెల్ఫుల్లో నిండిన పుస్తకాలని
పరిశీలించి, తను ఇష్టపడే కవి పుస్తకం తీసుకుని, ఆమె ముఖానే, వీడిని నేను అస్సలు
భరించలేను అని క్రాస్ గా మాటాడే తలపొగరు మేథావి. తన స్నేహితురాలు బాత్రూం కు
వెళ్ళినపుడు, చాలా తేలికగా, ఆమెను తను అయిదు నిముషాల ముందే విమర్శించిన ఆ కవి
పుస్తకం అరువు ఇమ్మని అడుగుతాడు. ఆమె నిర్మొహమాటంగా ఇవ్వనని చెప్పేస్తుంది. అతను
ఏమనుకుని ఉంటాడు ? మనసులో తిట్టుకుని ఉంటాడు. స్నేహితురాలు బాత్రూం నుండీ వచ్చాక,
ఆమె ఆకుపచ్చని కళ్ళలో కాలేజీ రోజుల్నాటి మెరుపు లేకపోవడం స్పష్టంగా తెలుస్తుంది. ఆ
నీడ లాంటి, ఆ నెగెటివ్ మనిషి అయిన ఆ భర్త ని ఆ మెరుపు ఎంత భయపెట్టి ఉంటుందో, ఆ మెరుపుకు
వ్యతిరేకంగా తన శక్తి యుక్తులన్నిటినీ కేంద్రీకరించి, ఆమె మనసును తన "ఫ్రీక్" నాలుకతో రోజూ కోస్తూ ఉండుంటాడు ఇన్నాళ్ళూ అనుకుంటుంది. అందుకే ఈ ఫ్రెండ్ మెరుపుపోయిన గాజుముక్కలా అనిపిస్తుంది.
డబ్బు జాగ్రత్త తనకి
తల్లిదండ్రుల నుంచీ వచ్చింది. ఓ ఆవేశపు ఘడియన కింద పడిన చిల్లర నాణేలు మంచం కిందికి తోసేసాడని తన మొదటి బాయ్
ఫ్రెండ్ ని వదిలేస్తుంది. తన స్నేహితులు కూడా బాధ్యత గా ప్రవర్తించేవారే. అన్
ప్రొఫెషనల్, కష్టపడని, పైలాపచ్చీసు మనిషికి తన జీవితంలో పెద్ద చోటుండదు. ప్రొఫెషనల్
గా, తన వృత్తిలో ఎదురయిన విచిత్రమైన మనుషుల నుండీ, రోజువారీ జీవితంలోని పచారీ
కొట్టు మనిషి వరకూ, రైలు కదిలిపోతున్నప్పుడు తన కాఫీ డబ్బులు తీసుకోకుండా ఆమెను
రైలెక్కమని హెచ్చరించిన రైల్ స్టేషన్లో కాఫీ షాపు నడిపే దంపతుల నుంచీ, ఒక ప్రొఫెషనల్ ట్రిప్ లో హోటల్ లో, తానుండే అంతస్థు లోనే దిగిన ఇంకో పేరెన్నికగన్న ప్రొఫెసర్ కళ్ళలో కరుణ వరకూ - అన్నీ ఆమెకు చెప్పుకోదగ్గ విశేషాలే. ఇలా ఒక హాస్పిటల్
విజిట్ లో తనలాగే ఒంటరిగా వచ్చిన ఇంకొక మహిళని చూసి, తన భవిష్యత్తునీ, ఒంటరి
వృద్ధాప్యాన్నీ తలచుకుని భయపడిన సంగతి గురించీ - దాదాపు చాలా విషయాల్ని కవర్
చేస్తుంది రచయిత్రి.
రకరకాల మనుషులు, కరుణ తో ప్రవర్తించే వారు, పిచ్చి మనుషులు,
తను వెర్రిగా ఊరికే అభిమానించే నెయిల్ ఆర్ట్ అమ్మాయి, ఒక పార్టీలో విసిగించేసిన
ఇంకో అమ్మాయి.. ఇలా ఎందరో మనం కలిసే మనుషుల్లాంటి వాళ్ళే. వీటన్నిటి మధ్యలో జీవితపు
సౌందర్యాన్ని చూడగలగడమే ఈ పుస్తకం ప్రత్యేకత.
ఒంటరితనం శాపమూ, వరమూ కూడా. తల్లిని
కలుసుకోవడానికెళ్ళినపుడల్లా, ఆమె తన కేర్ టేకర్ గురించో, తన ఆరోగ్యం గురించో చెప్పే
ఫిర్యాదుల్ని ఏదో వినాలి కాబట్టి విని, ఏవో నాలుగు మంచి మాటలు చెప్పి, వచ్చేస్తూ
ఉండే తనకి ఊరి ని వొదిలి పక్క దేశంలో మంచి ఉద్యోగం రావడంతో వెళ్ళాల్సిన అవకాశం
వస్తుంది. స్నేహితులు ప్రోత్సహిస్తారు. ఇల్లు ఖాళీ చెయ్యడం, శుభ్రం చెయ్యడం,
వీడ్కోలు చెప్పాల్సిన వారికి చెప్పడం, ముఖ్యంగా తల్లికి ఇష్టమైన బిస్కెట్ టిన్ను ని
ఇచ్చి, కొత్త సంవత్సరం సెలవుల్లో వీడ్కోలు చెప్పాల్సి రావడం, అప్పటివరకూ మొనాటనస్
గా అనిపించిన వీధులూ, రోడ్లూ, తనెప్పుడూ పట్టించుకోని మనుషులూ, తెలిసిన వాళ్ళు,
తెలియని వాళ్ళు, అందరూ ఆ ఆఖరి రోజు అభిమానంగా అనిపించడం.. ఇవన్నీ. ఒంటరిగానే,
మధ్యవయసులో కొత్త మార్పుని ఆహ్వానించాల్సి రావడం, దానికి శ్రమించడం, కొత్త ఉదయం
వైపు చూస్తూ నిల్చోవడం - దీనిలోనే ఆమెకు తన "వేరెబౌట్స్" తెలుస్తాయి. ప్రపంచంలో, తన
చిన్ని విశ్వం లో తన స్థానం ఏమిటో తెలుస్తుంది.
ఇంతమంది స్నేహితులు,
శ్రేయోభిలాషులూ, (అసమర్ధ) తండ్రి తాలూకూ నిస్సహాయత, ప్రేమ, ఎప్పుడూ సణుగుతూ ఉండే
తల్లి కి కూడా ఏవో బాధలు/భయాలు ఉండే ఉంటాయన్న స్పృహ, కల్మషాలేవీ లేకుండా తనని
అభిమానించే ఆ స్నేహితుడు, వీళ్ళందరూ తన నిరంతర చలనంలో (ప్రయాణం) ఒక భాగం అని
అర్ధమవుతుంది. మనం ఈ ఎపిసోడ్స్ లో ఎక్కడో ఒక చోట మనల్ని చూసుకుంటాం. ఇందులో ఉన్న
పాత్రలలో కనీసం ఒకరైనా మన జీవితాలలో ఉండుంటారు. అందరూ ఏవేవో స్వీయ పోరాటాల్లో
మునిగి తేలుతూ, ఒకడుగు మనవైపు వేసి ఓ స్నేహహస్తం ఇచ్చే ఉంటారు. వీళ్ళందరిలోనే మన
జీవితం, వీళ్ళతోనే మన ఉనికి. అందుకే ఈ పిచ్చి చిన్న పుస్తకం నాకు నచ్చింది.
కొన్ని
విశేషాలున్నాయి ఈ పుస్తకానికి. దీనిని తేలిగ్గా, హాయిగా చదివించగలిగిన టైప్ ఫేస్
కి, బుక్ డిసైన్ చేసిన వారికీ గుర్తింపుకోసం ఒక నోట్ ఉంది చివరిలో. చాలా నార్మల్ గా అనిపించాల్సిన ఈ నోట్ కూడా ఎందుకో హృదయాన్ని తాకుతుంది! అప్పటికి మన హృదయం కూడా కాస్తయినా ద్రవించి ఉండడం వల్లనేమో! అదే రచయిత్రి లక్ష్యం కూడా కద.
I flee, after a moment, terrified, from the great flame to the shadows; I fear
the flame will consume me, that it will seize me and reduce me to an element
even less signficant on this earth, a worm or a plant, I cant think straight,
everything seems futile, life itself seems extremely simple. I dont care if
nobody thinks of me anymore, if hardly anyone writes to me. (ఒక సూర్యోదయం చూసాక
ఇంకో గొప్ప రచయిత ని కోట్ చేస్తూ ..)