Pages

16/02/2024

ఆవిష్కరణ - శ్రీదేవీ మురళీధర్

 ఆవిష్కరణ, (ఆల్కహాలిక్ ల పిల్లలు - ఒక అవగాహన) - శ్రీదేవీ మురళీధర్ 



ఆల్కహాలిజం ఒక (సామాజిక) రుగ్మత.  అధిక ఆదాయం తెచ్చిపెట్టే ఆల్కహాల్ వల్ల ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మద్య విధానాలు అవి తెచ్చి పెట్టే సంపద వలనా, సామాజికంగా, ఆర్ధికంగా వచ్చిన కొత్త మార్పుల వలనా, ఆల్కహాలిజం చాప కింద నీరులా మన సమాజంలో పాకిపోయి ఉంది. దీనివల్ల కుటుంబాలు ఎలానూ నాశనమవుతాయి. ముఖ్యంగా  ఆల్కహాలిక్ ల పిల్లలు ఎదుర్కొనే బాధలు,  "నొచ్చుకోళ్ళ స్థాయిలనుండి, అత్యాచారాలవరకూ, శారీరక మానసిక వేధింపులు, సామాజిక వెలివేత - ఆర్ధిక వెనుకబాటు" - వీటి మధ్య నలుగుతున్న పిల్లలు! వీళ్ళ గురించి ఎంతో చక్కగా రాసిన పుస్తకం ఇది. 


ఆల్కహాలిజం ఒక వ్యాధి. దీని బారిన పడినవాళ్ళు తాగకుండా ఉండలేరు. దీని నుండీ బయటపడడం అసాధ్యమేమీ కాదు. దానికి సంకల్ప బలం ఉండాలి. ఇది తరవాత. ముందు, ఆల్కహాలిక్ ల కుటుంబ సభ్యులు దీనికి ఎలా బలవుతారో, దీనికి పరిష్కారం ఏమిటో తెలియాలి. సోషల్ డ్రింకింగ్ వేరు, మెల్లగా అలవాటు పడిపోవడం, అది వ్యసనంగా మారడం, మత్తు కోసం కుటుంబ సభ్యులను, వృత్తిని నిర్లక్ష్యం చేయడం, ప్రమాదాల బారినపడడం, లేదా ఇతరులను వేధించడం వేరు.  ఆల్కహాలిక్ ని కుటుంబం ఎలానో ఒకలా రక్షిస్తూ ఉంటుంది. అతని భార్య పిల్లల కడుపు నింపడం కోసం ఎలానో బాధ్యతల్ని తలకెత్తుకుంటుంది. పైగా బయటివారికి చాలా వరకూ తమ ఇంటిలో ఆల్కహాలిజం సమస్య ఉన్నట్టు తెలియడం అవమానకరం / ప్రమాదం అనుకుంటుంది.  ఇలాంటి స్టిగ్మా లు, త్రాగుడు అవమానకరం గా భావించడం, తండ్రి ఎప్పుడు చూసినా మత్తులో మునిగి ఉండడం - భార్యా, పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారడం వగైరాలు మనం తరచుగా చూస్తూంటాము. సమాజం త్రాగుబోతు కుటుంబాన్ని ట్రీట్ చేసే పద్ధతి గురించి కూడా అందరికీ తెలిసినదే. 


పిల్లలు తల్లి తండ్రుల మధ్య సంఘర్షణకు ప్రత్యక్ష సాక్షులు. మత్తు లో జరిగే నేరాలు - పైగా పిల్లల ఎదుటే భార్యను కొట్టడం, కొన్ని విపరీత పరిస్థితుల్లో చంపడం, దానికి పిల్లలు అతి దగ్గరి, సాక్షులవడం మనకు పేపర్లలో / వార్తల్లో తెలుస్తుంటుంది. ఒక వేళ హింస ఇంత స్థాయిలో లేకపోయినా, ఆల్కహాలిక్ ల పిల్లలు - చిన్నబోవడం, ఇతరుల్లా తమ బాల్యం ఎందుకు చీకూ చింతా లేకుండా గడవదో తెలియకపోవడం, తల్లి నిస్సహాయత, తండ్రి ఆదరణ కు నోచుకోకపోవడం / ఉన్న డబ్బల్లా ఆల్కహాల్ కే ఖర్చుకావడం వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం - ఇవన్నిటికీ గురవుతారు.  పిల్లల్ని తమ రెక్కల మధ్య పొదువుకోవల్సిన తల్లిదండ్రులు ఆల్కహాలిసం కారణంగా పిల్లలను ఎంత అంధకారంలోకి నెట్టేస్తున్నారో తెలుసుకోవాలి. (ఈ పుస్తకంలో - బీద మధ్యతరగతి భారతీయ కుటుంబాలను ప్రస్తావించారు. ఈ కుటుంబాలలో స్త్రీల కన్నా, పురుషుల్లో ఆల్కహాలిసం ఎక్కువ. కొన్ని సార్లు స్త్రీలు కూడా ఈ వ్యసనానికి గురయి ఉండవచ్చు, ఈ రోజుల్లో పిల్లలలో కూడా త్రాగుడు, డ్రగ్ ఎడిక్షన్, ప్రవర్తనా దోషాలు మొదలయ్యాయి. వీటికి ఇలాంటి ఆల్కహాలిజపు కుటుంబ నేపధ్యం ఉండడం చూస్తున్నదే).   


చాలా సార్లు ఈ పిల్లలు అపరాధ భావంతో, న్యూనత తో బాధ పడతారు. ఈ పిల్లలు  మగపిల్లలయితే, చిన్నవయసు నుందే కుటుంబ బాధ్యతల్ని మోయాల్సొస్తుంది. తమ లక్ష్యాలనూ, ఇష్టాలనూ, ఆటపాటలను పక్కన పెట్టి చిన్న చిన్న ఉపాధి మార్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.  ఆడ పిల్లలయితే, చాలా మటుకూ బడి మానేసి, తమ కన్నా చిన్న పిల్లల్ని సాకాల్సొస్తుంది.  తండ్రి తాగి తాగి ఉపాధి కోల్పోయాక, తల్లి సంపాదించేందుకు, ఇంటి పని నీ, తన కన్న చిన్న వయసు  పిల్లల్ని,  ఆడ పిల్లల కు అప్పజెప్పి పనికి వెళ్ళాల్సి వస్తుంది.  


ఆల్కహాలిక్ లు కూడా పిల్లల వల్ల పెరిగిన కష్టాలవల్లే తాగుతున్నామని వాళ్ళ మీద నిందలేస్తారు. తల్లులు పిల్లల కు తండ్రి నిద్రపోతున్నాడనో, జ్వరం వచ్చి పడుకున్నాడనో అబద్ధం చెప్తారు. వీళ్ళ కుటుంబాలలో రాయని రూల్స్ ఉంటాయి. నిశ్శబ్దం, ఎప్పుడేం జరుగుతుందో అనే భయం, వేలాడుతుంటాయి. అందుకే చాలాసార్లు పిల్లలు "మా నాన్న తాగకుంటే ఎంత బావుండేది ? మా నాన్న తాగుడు ను నేను మానిపించలేనా ?"  అని బాధపడుతుంటారు. తండ్రి తాగి వచ్చి పడిపోతే పిల్లకి ఎంత అవమానంగా, బాధగా ఉంటుందో. వాళ్ళకి ఒక రోల్ మోడల్ ఉండరు. ఎవరి నుంచి ఏ మంచిని గ్రహించాలో తెలియదు. తల్లి అవమానంగా ఫీల్ అవుతుంటుంది. పిల్లలు ఇతరులతో తమను తాము పోల్చుకుంటారు. చదువులో వెనుకబడతారు. ఇతరుల మీద జెలసీ ని పెంచుకుంటారు. న్యూనతను బయటికి కనిపించనీయకుండా అతి ఏక్టివ్ గా, జోకర్ల లా / అతి పని మంతుల్లా, అతి మంచి వారిలా అందరి  acceptance కోసం ఎదురుచూస్తూ, పొగడ్తల కోసం, గుర్తింపు కోసం వెంపర్లాడుతూ, పని రాక్షసులు కూడా అయిపోతారు.  


రచయిత్రి ఎడిక్షన్ కౌన్సెలర్ గా పనిచేస్తున్నారు. తన 28 సంవత్సరాల అనుభవం తో ఈ పుస్తకాన్ని ఆల్కహాలి క్ ల పిల్లల వైపు మన దృక్పథం మారాల్సిన సంగతి గురించి చర్చించేందుకు రాసారు. సామాజికంగా ఒక లాంటి మానసిక & ఎమోషనల్ వెలివేత ని పిల్లలు ఎలా ఎదుర్కోవాల్సొస్తుందో, వాళ్ళ ప్రవర్తనల్లో తేడాల కారణంగా టీచర్లు, కౌన్సెలర్ లు ఎలా గుర్తించాలో చెప్తారు.  చదువులో వెనకపడిన పిల్లలు, చుట్టూ ఉన్న పరిస్థితులకు ఎటువంటి స్పందననీ వ్యక్తపరచకుండా మౌనంగా ఉండిపోవడమే మేలనుకునే పిల్లలు, ఎవరినైనా  నమ్మడం అనవసరం అనుకునే పిల్లలు, తమలో బాల్య చాపల్యం వల్లో, మానవ సహజ నైజం వల్లో ఏవైనా కోరికలు ఉన్నా కూడా వాటిని ఎటూ నెరవేరవు కదా అని అణుచుకుని, చిన్నబోయి ఉండే పిల్లలు - బహుశా ఇంట్లో ఏదో రకమైన అబ్యూస్ కి గురవుతున్నవారు, అలవి కాని బాధ్యతల్ని మోయాల్సొచ్చేవారు - ఇలా ఆల్కహాలిక్ ల పిల్లలు ఎన్నో రకాలు. అయితే వీళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. వీళ్ళు 'ఎవరో ' చాలా తక్కువ పెర్సెంటేజీలలో లేరు. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న పిల్లలలో ఆల్కహాలిజం బారిన పడిన కుటుంబాల పిల్లలే 20% ఉన్నారు. లైంగిక వేధింపులకు గురయ్యే పిల్లల కేసుల్లో 90% మంది నేరస్తులు ఆల్కహాలిక్ లే. 




ఈ పుస్తకం రాయడం వెనుక మంచి ఉద్దేశ్యమే ఉంది. ఆల్కహాలిజం తాలూకు పర్యవసానం భయంకరమైనది. అదుపుతప్పిన మద్యపానం కాలక్రమేణా మతిభ్రమణం లేదా మరణం వైపు దారితీస్తుంది. ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రిచ్చవచ్చు. 

ఈ వ్యాధి పట్ల సరైన అవగాహన ఉన్న డాక్టర్ వైద్యసేవను, ఎడిక్షన్ కౌన్సిలింగ్ ను పొంది, త్రాగుడు కు స్తస్తి చెప్పడంతో ఒక ఆల్కహాలిక్ తప్పకుండా స్వస్థుడు కావచ్చు.  Alcoholics Anonymous  అనే స్వచ్చంద సంస్త ప్రపంచ వ్యాప్తంగా ఆల్కహాలిజం వ్యాధిన పడిన పేషెంట్ ల కోసం అపూర్వ సేవాభావంతో దశాబ్దాలుగా కృషి జరుపుతుంది. వాళ్ళని పూర్తిగా త్రాగుడు మానిపించగలిగేలా చేసింది. ఏ fee / కనీసం పేరు కూడా అడగకుండా ఈ సంస్థ తన సేవలను అందిస్తుంది. ఈ సంస్థ మన దేశంలో వివిధ ప్రాంతాలలో నడుస్తుంది. వాటి వివరాలు, ఎడ్రసులు, ఫోన్ నెంబర్లు పుస్తకంలో ఉన్నాయి. తాగుడు కు దూరంగా ఉన్న పేషెంట్ తప్పకుండా మంచి జీవితం మొదలుపెట్టగలుగుతాడు. ఇది స్వచ్చందంగా, మనస్పూర్తిగా పేషెంట్ తరఫునుండీ రావలసిన కోరిక / మార్పు. అలా ఆల్కహాల్ లేకపోతే చచ్చిపోతానేమో అనే భయాన్నిండీ, మానేసాక తన జీవితం ఎంత బావుండబోతోందో ఆలోచించుకునేలాగా చేయగలగడం, ఆ తరవాతి ప్రాసెస్ - దానికి ఈ సంస్థ ఇచ్చే తోడ్పాటు ల గురించి చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది.  ఎందుకంటే  ఆల్కహాలిజం కేవలం త్రాగే మనిషిని మాత్రమే కాకుండా, అతని కుటుంబ వ్యవస్థ ని పునాదులతో సహా కూల్చేసే ప్రమాదకరమైన వ్యాధి. 

ఆల్కహాలిక్ ల పిల్లలు సాధారణంగా పెద్దవాళ్ళయాక ఆల్కహాలిజం వైపు మళ్ళే అవకాశాలు ఎక్కువే.   ముందే చెప్పినట్టు, వాళ్ళు తమ రోల్ మోడళ్ళని కోల్పోతారు.  నిజానికి పిల్లలు ఆల్కహాలిజానికి కారకులూ కారు, ప్రేరకులూ కారు. కానీ దాని నష్టాలన్నీ పూర్తిగా అనుభవిస్తారు.  ఆదర్శంగా నిలవాల్సిన పేరెంటింగ్ వాళ్ళకు దక్కదు. అయితే, వాళ్ళని కౌన్సిల్ చేసే వాళ్ళు చేయాల్సిన మొదటి పని, తాము ఒంటరులం కాదని, తల్లితండ్రులు ఎడిక్ట్స్ అయితే దానిలో తమ తప్పు లేదనీ, తెలుసుకొనే లా చేయడం. ఇది వాళ్ళ గుండెల్లో భారాన్ని సగం తగ్గిస్తుంది. ఇంటిలో ఎలాంటి పరిస్థితులున్నా, హాయిగా ఆడుకోవడం, చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోకుండా సంతోషంగా ఉండమని చెప్పడం ! అయితే ఎంతయినా అవి 100% భద్రతా భావాన్ని ఇవ్వవు. అ తల్లిదండ్రులు ఆల్కహాలిజం తాలూకూ విష వలయం నుండీ బయట పడి, వాళ్ళ కుటుంబం లో నార్మల్సీ రావడం మాత్రమే ఆ పిల్లలకి అవసరమైన భద్రత. 

పుస్తకంలో వివరాలు చాలా సమగ్రంగా ఉన్నాయి. పిల్లలు ఎన్ని బాధలు పడతారో, ఆ అనుభవాలు వాళ్ళ భవిష్యత్తును ఎలా మార్చేస్తాయో - పట్టికల లా, సైంటిఫిక్ ప్రశ్నావళులతో - ఉదాహరణలతో, డేటా తో చక్కగా వివరించే ప్రయత్నం చేసారు. ఈ పుస్తకం చేరాల్సిన వాళ్ళకు / సహృదయులకు తప్పకుండా చేరాలి.  నిజానికి అమూల్యమైన పుస్తకానికి ఏ వెలా లేదు. ఇది పుస్తక ప్రదర్శన లో ఉచితంగా పంచుతున్నారని విన్నాను. రచయిత్రి ఈ పుస్తకం తో పాటు నాకు 'బుజ్జి ఒక పని మనసు కథ ( Original : "Bottles Break" by Nancy Grande Tabor ) అని ఇంకో పుస్తకం కూడా పంపించారు. ఇది బొమ్మల పుస్తకం. బొమ్మలు బాలివి. ఇది కూడా ఉచితం. ఈ పుస్తకాలు నాకు పోస్ట్ లో వచ్చాకా ఎంత అయిందా అని వెల వెతుక్కున్నాను. జస్ట్ వివరాలడిగితే పుస్తకాలు పంపించారు. ఇంత మంచి పుస్తకాలు నిజంగా టార్గెట్ పాఠకులని చేరితే తప్పకుండా వాళ్ళ జీవితాల్లో మంచి మార్పుని తీసుకురాగలుగుతాయి.   

ఉదా : బుజ్జి నుంచి:-



పుస్తకాన్ని NS Mani Charitable Trust  తరఫున శ్రీదేవీ మురళీధర్ ప్రచురించారు. ఈ పుస్తకం అవసరమైన వాళ్ళకి / కావాలనుకున్న వారికి ఉచితం. ఇంత మంచి ప్రయత్నం చేసినందుకు, స్వచ్చందంగా దీనిని వీలైనంత మంది చదివేందుకు ఉద్దేశించినందుకు, శ్రీదేవి గారికి చాలా ధన్యవాదాలు, అభినందనలు. 

***

05/02/2024

Man's Search for Meaning - Viktor E Frankl

 


విక్టర్ ఫ్రాంకెల్ రాసిన "Man's Search For Meaning" ఒక గొప్ప పుస్తకం. ఎప్పుడైనా ఒక పుస్తకం లో ఒక మనిషి జీవితాన్ని మార్చగలిగే ఒక్క పేరా గానీ, ఒక వాక్యం / ఒక ఐడియా ఉన్నా ఆ పుస్తకం గొప్పదని అనుకోవచ్చు. కొన్ని నచ్చిన వాక్యాల కోసం మళ్ళీ మళ్ళీ చదువుకోదగ్గ పుస్తకం ఇది. బహుశా సర్వైవల్ గురించి చెప్పిన మొదటి పుస్తకాలలో ఒకటి. జెర్మనీ లో, తూర్పు యూరోపు లో యూదులు ఎక్కడ తాము చాలా హాయిగా, secured గా ఉన్నామనుకున్నారో అక్కడ నాజీయిజం పుట్టి వైరస్ లా విజృంభించినప్పుడు విక్టర్ ఫ్రాంకెల్ తన తోటివాళ్ళతో కలిసి కాన్సంట్రేషన్ కేంప్ లకు పంపబడ్డాడు.  అయితే ఏదో అత్భుతం జరిగినట్టు, (బైబిల్ వాక్యంలాగా) అగ్ని సెగల నుండీ బయటకి తీసిన కట్టె లాగా అతను ఆ మారణహోమాల్లో ప్రాణాలతో బయటపడ్డాడు. అలా బయటపడేందుకు అతనికి చిక్కిన ఆధారం ఏది ?  
 

నీచా  ( Nietzsche)  చెప్పినట్టు "మనిషికి 'ఎందుకు ' బతకాలో తెలిస్తే 'ఎలా ' బతకాలో తెలుస్తుంది".  సరిగ్గా అలానే, ఈ మారణకాండ మధ్య, దుర్భర జీవన పరిస్థితుల్లో, ఎప్పుడు విడదలవుతామో, తమ వాళ్ళు ఎక్కడున్నారో, భార్యా పిల్లలు బ్రతికున్నారో, మరణించారో, తామెన్నాళ్ళు ఇలా బ్రతకాలో, ఎందుకు ఇలా జరుగుతుందో తెలీని ఘోర వేదన లో ఆ యూదు ఖైదీల్లో కొందరు తిండి, మందులు లేకపోవడం కంటే "ఆశ"  ని కోల్పోయి మరణించారు.  'ఆశ' ని వదిలేసినవాళ్ళకి ఎందుకు బ్రతకాలో తెలీక - బెంగతో కృశించి మరణించారు.   వీళ్ళకన్నా భిన్నంగా ఫ్రాంకెల్ లాంటి వాళ్ళు భార్య నో, బిడ్డలనో, కన్నవారినో, తాము చేయాల్సిన పనులనో, వైజ్ఞానికులైతే  విడుదలయ్యాక తాము మాత్రమే చేయగల పరిశోధనలనో తలచుకుని, ఆశను ఉగ్గబెట్టుకుని, ప్రాణాలను నిలుపుకున్నారు.  వాళ్ళకి "ఎందుకు" ఎలా అయినా ప్రాణాలు నిలబెట్టుకోవాలో అనేందుకు ఒక కారణం ఉంది. బహుశా వాళ్ళ జీవితానికి అర్ధం దాన్లోనే ఉంది. ఒక గోల్, మనకి ఆ కారణాన్నిస్తుంది. అది మనిషి బ్రతకడానికి అవసరం.

హాలోకాస్ట్ గురించి, మిలియన్ల కొద్దీ యూదులని నిర్దాక్షిణ్యంగా చంపేసిన నాజీ డెత్ కేంప్ ల గురించి ఎన్నో పుస్తకాల్లో చదివాము, సినిమాలు చూసాము.  అయితే అక్కడ 'లోపలి జీవితం ' ఎలా వుండేదో, ఖైదీల మధ్య కామ్రేడరీ, సోదర భావం, వాళ్ళ మధ్య సౌందర్యాభిలాష, స్నేహం, సాహిత్యపు, ప్రేమ లాలిత్యపు మానసిక దృఢత్వం, వాళ్ళ బ్రతుకు పోరాటం, ఊహించలేనంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా, రోజు రోజుకీ దిగజారుతున్న పరిస్థితుల్లో వాళ్ళు పాటించిన విలువలు, వాళ్ళలో ఒకళ్ళే అయి ఉండి కూడా కాస్త దిగజారి ప్రవర్తించిన కాపో (Capo) లు - నాజీ అధికారుల్లో కూడా కాస్తో కూస్తో దయ చూపించిన వాళ్ళు, వీళ్ళందరి గురించీ రాసిన పుస్తకం ఇది. అసలు చెప్పాలంటే మానవాళిలోనే కేవలం రెండు రకాల మనుషులే వుంటారు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. మంచివాళ్ళ సంఖ్య తక్కువే కావచ్చు. వారిలో చేరగలగడం కూడా కష్టమే.   

మన కోర్ ఏంటో నిరూపించుకోవడానికి కొన్ని సందర్భాలొస్తాయి. ఆ పరిస్థితుల్లో మానవత్వం మరిచిపోయి నిర్దాక్షిణ్యంగా మారణకాండకు సహకరించిన వాళ్ళు (డాక్టర్  జె లాంటి వాళ్ళు), అవే పరిస్థితుల్లో,  మంచి SS  కమాండర్స్ కూడా వున్నారు.   బవేరియా లో నిర్మించిన మొదటి కాన్సంట్రేషన్ కేంప్ లో విక్టర్ ఉన్నపుడు అక్కడి ఒక జెర్మన్ కమాండర్ ఎంత దయగలవాడంటే, అతను ఖైదీల కోసం చుట్టు పక్కల బవేరియన్ గ్రామాలలో దుస్తులు విరాళాలు గా తీసుకుని పంచేవాడు.  యుద్ధం ముగిసాకా, ఖైదీలు అతనికి అండగా  నిలిచారు.  యుద్ధం ముగిసాక, కేంప్ ఖైదీలే ఆ  నాజీ అధికారి అమెరికన్ ల చేత చిక్కకుండా తప్పించుకునేందుకు సహకరించి, అతని ప్రాణాలకి ఏ హానీ జరగదని హామీ తీసుకున్నాకే అతనిని అధికారులకు అప్పగించారు.    కాబట్టి, హిట్లర్ వాదించిన 'Race' లలో కేవలం రెండు రేస్ లే వున్నాయి.   'డీసెంట్ మేన్',   'ఇండీసెంట్ మేన్'.  ఏ జాతి ప్యూరిటీ కోసం సాటి మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా, మెర్సీ అనేదే లేకుండా, సామూహికంగా హత్యలు  చేసేసారో, అలాంటి జాతి ఫలానాదే అని ఏదీ వుండదు.  నాజీ గార్డులలోనూ మంచి వాళ్ళున్నారు, యూదు ఖైదీల్లోనూ ఘోరమైన మనుషులున్నారు. 

1942 లో వార్సా లో ఒక యూదు ఘెట్టో లో ఒక తిరుగుబాటు జరిగింది. గాస్ చాంబర్ లో విష వాయు ప్రయోగంతో చంపబడేందుకు తరలింపడవలసిన యూదు ప్రజలు జెర్మన్ నాజీ లకు లొంగేందుకు వ్యతిరేకించి తిరగబడ్డారు. వాళ ప్రయత్నం ఓటమికే దారితీసింది. ఐతే తిరగబడిన ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు తాము చేసే ప్రయత్నం ఫలిస్తుందని చేయలేదు.   ఓడిపోతామని తెలిసినా, తిరగబడేందుకు ప్రయత్నించారు. తమ ధిక్కారాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని వాళ్ళు ఎంచుకున్నారు.   చివరకి 13000 మంది ఘెట్టో వాసులను నాజీలు చంపేసారు. ఇదొక్కటే బహుశా యూదులు తమ అణిచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటం.  అదీ విఫలమైంది.  

యుద్ధానంతరం ఆస్ట్రియన్ రేడియోలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది.  అది ఆ తిరుగుబాటులో పాల్గొని, తదనంతరం కేంపు కు తరలించబడి, ప్రాణాలతో విడుదలయిన ఒక ప్రముఖ హృద్రోగనిపుణుడి ఇంటర్వ్యూ.    ఆ వార్సా ఘెట్టో తిరుగుబాటు సాహసం ఎంత పెద్దదో - దాని వెనకున్న ధైర్యాన్ని తొక్కిపారేసెందుకు అధికారులు చేసిన ప్రయత్నమూ అంత పెద్దదే.   ఆ తిరుగుబాటుని హీరోయిజం గా  రేడియో రిపోర్టర్ అభినందించినప్పుడు, ఆ హృద్రోగ నిపుణుడు ఇచ్చిన  సమాధానం - "గన్ తీసుకుని కాల్చి చంపడం హీరోయిజం కాదు.  SS  నిన్ను గాస్ చాంబర్ కో లేదా సామూహిక హనన కేంద్రానికో తరలించి, అక్కడ స్పాట్ లో నిన్ను చంపుతున్నప్పుడు,  చనిపోవడం తప్ప, ఇంకేమీ నువ్వు చేయలేకపోతున్నప్పుడు. ఆ మృత్యువుని డిగ్నిటీ తో స్వాగతించడం హీరోయిజం!!"      అలా నిస్సహాయంగా దిక్కులేని మరణాల పాలయిన యూదులు, కేంపుల్లో గదులకు గొళ్ళాలు పెట్టి, తాళాలు వేసేసి, సజీవ దహనాలు చేసినపుడు చనిపోయినవాళ్ళు,  మళ్ళీ శవాల గుట్టలని ఎప్పటికప్పుడు క్లియర్ చేసి, క్రిమేషన్ లు చేసిన యూదు ఖైదీలు, తమలో తామే ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్న ఖైదీలు,   ఒకరి బదులు ఒకరు మృత్యువుని ఎదుర్కోవడానికి వెళ్ళిన ఖైదీలు - వీళ్ళందరూ హీరోలే.


మనిషి కి బ్రతుకు కి అర్ధం తెలియాలంటే, ఏమి తెలియాలి?!   ఊరూ పేరూ అస్తిత్వమూ మరచి కేవలం ఒక నెంబర్ గా మిగిలిన మనుషులకు -  నిరాశ, నిస్పృహలతో పాటు, రోజుకి కేవలం ఒక పిడిడంత రొట్టె ముక్క, గరిటెడు పలచని సూప్, అంధకారమైన భవిష్యత్తు, ఇళ్ళూ, వాకిళ్ళూ, ఆప్తులని కోల్పోవడం వల్ల కలిగిన వేదన, రోజూ భరించలేననంత నీరసంలోనూ కఠోరమైన శారీరక శ్రమ చేయాల్సి రావడం, కళ్ళెదురుగా పిట్టల్లా రాలిపోతున్న ఇతర ఖైదీలు, ముఖ్యంగా మనిషిని మృగంగా మార్చేంత చలి!   వెచ్చదనం కోసం, అప్పుడే చనిపోయిన తోటి ఖైదీ జోళ్ళు, బట్టలు తీసి వెంటనే వేసేసుకునేంత ఘోర పరిస్థితులు కూడా మామూలవడం, కొన్ని కేంపుల్లో యుద్ధం ముగిసే సమయాలకి ఆ తిండి కూడా దొరకక, జెర్మనీ ఓడిపోయి, లిబరేషన్ ఇంకొన్ని నెలల్లోనే వస్తుందనగా, కరువు పరిస్థితులు ముదిరి, ఖైదీలు, చనిపోయిన ఇతర ఖైదీల మాంసం కూడా వండుకుని తిన్నారు.  అలాంటి (మనుషులు) తట్టుకోలేని కష్టాలని కొందరు ఎలా తట్టుకోగలుగుతారు ? ఎక్కడైనా సరే, adversity  కమ్ముకొచ్చినప్పుడు బలహీనుడు మట్టికరుస్తాడు. బలమైన వాళ్ళు బ్రతుకుతారు. అయితే బ్రతకడానికి వాళ్ళకీ,  మిగిలినవాళ్ళకీ ఖచ్చితమైన తేడాని ని గమనిస్తే, మానసిక దృఢత్వం, suffering  ని తాత్వికంగా తీసుకోగలగడం, భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథం కలిగి ఉండడం ఎంత అవసరమో తెలుస్తుంది.  

కేంప్ కి తరలింపబడగానే యూదుల్లో ఓ తొంభయి శాతం మంది మరణానికే తరలింపబడేవాళ్ళు. మిగిలిన పది శాతం, వెట్టి చాకిరీకి. అదీ సేనిటేషన్ / disinfecting  పేరిట వాళ్ళ దగ్గరున్న విలువైనవన్నీ, దుస్తుల్నీ, చేతి గడియారాల్ని, ఫోటోల్నీ, (కనీసం పెళ్ళి ఉంగరాలనీ కూడా దగ్గరుంచుకోవడానికి వీల్లేదు) జోళ్ళతో సహా అన్నిట్నీ వొలిచేసి ఇచ్చేసి, వాళ్ళిచ్చిన యూనిఫాం, కుదరని బూట్లు, లేసులుగా వైరు ముక్కలు, చిరిగిన మేజోళ్ళు వేసుకోవాలి. అవి కూడా ఇంతకు ముందు మరణించిన ఖైదీలవి.  తమ ప్రయాణం బహుశా మృత్యువు వైపుకే అని తెలిసీ, మల మూత్రాలతో తడిచి నానిన గడ్డి నే అంటిపెట్టుకుని, వెచ్చదనం కోసం పక్కనున్నవాళ్ళ వొంటినే ఆసరాగా తీసుకుని, ఘోరంగా గురకలు తీసే తోటి ఖైదీని వాటేసుకుని గాఢ నిద్రలోకి జారిపోగలిగేంత శ్రమ చెయ్యడం, అలసట తీరకుండానే ఇంకో రోజు, ఇంకాస్త చాకిరీ, తాము మనుషులం అని మర్చిపోయి, మృగాలుగా మార్చేసే పరిస్థితులు. ఆత్మ హత్య చేసుకునేందుకు ఎలక్ట్రిక్ కంచె ఉండనే ఉంది. విసుగేస్తే దాని పైకి దూకొచ్చు. తప్పించుకునే ప్రయత్నం చేసినా తుపాకీ గుళ్ళకి బలవ్వొచ్చు. అదీ వద్దనిపిస్తే నిరాశ తోనే రోజుల వ్యవధిలో జీవితాన్ని ముగించొచ్చు. ఇన్ని వైడ్ ఆప్షన్ ల మధ్య కూడా కొందరు మాత్రం కేవలం మనసుల్నీ, హృదయాల్నీ కాపాడుకుంటూ గడిపారు.

రోజువారీ సఫరింగ్ లో కూడా జోక్ లు వేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ  గాజు పెంకులతో అయినా సరే ఖచ్చితంగా షేవింగ్ చేసుకున్నారు. అలా చెయ్యాడం వల్ల కాస్త యంగ్ గా కనిపిస్తే, వీళ్ళు పని చెయ్యడానికి పనికొస్తారని నిర్ణయింపబడే "పది శాతం" యూదుల్లో వుంటారు. కాలు వాచిందనో ఎముకలు విరిగాయనో, ఫ్రాస్ట్ బైట్ అనో కుంటుతూ నడిచినా - వీళ్ళని కాల్చి పడేయొచ్చు. అందుకే ఎంత నొప్పిగా ఉన్నా స్మార్ట్ గా నడిచారు. ఒకరినొకరు కాపాడుకున్నారు. ఒక ఆకలి బాధితుడు కిచెన్ లో ఏదో దొంగతనం చేసినందుకు 'అతన్ని పట్టివ్వకపోతే ఆరోజు కేంప్ లో ఎవరికీ తిండి ఉండదు!'  అని జెర్మన్ లు గర్జించినప్పుడు ఆ రోజు కేంప్ లో ఉన్న మొత్తం 2500 మందీ, ఉపవాసం ఉండడానికే నిర్ణయించుకున్నారు.   రేపో మాపో చనిపోతామని అనుకున్నవారు తోటి వాళ్ళకి  తమ ఆప్తులకు ఆఖరి సందేశాలు ఇవ్వడం వంటి వీలునామాలను అప్పజెప్పారు. 

విక్టర్  నాలుగు కేంపుల్లో మూడేళ్ళు గడిపాడు.  ఎన్నో చావులు, ఆత్మహత్యలు, భీష్ముడిలాంటి స్వయం మరణాలు చూసాడు. పారిపోయేందుకు ప్రయత్నించి మానుకున్నాడు.    అతను తన ఫేట్ ని మార్చుకోవాలనుకోలేదు. తన తోటి వాళ్ళకి భవిష్యత్తు లోకి చూడడం నేర్పించాడు. తన దేశస్తులతో కలిసి కలలు కన్నాడు. (ఆ ఖైదీలకు వచ్చే కలలు అంతా తిండి, సిగరెట్టు, శుభ్రమైన స్నానం, ఇంటికెళ్తే ఎదురొచ్చే భార్యా పిల్లలూ, ఇలా.). జెర్మనీ అతని దేశాన్ని ఆక్రమించే ముందే వియన్నా వదిలి అమెరికాకి వెళ్ళేందుకు వీసా వచ్చినా సరే 'ఫేట్' ను మార్చుకోకుండా తన వాళ్ళకోసం వియన్నా లోనే ఉండిపోయాడు.  అలాగే అతనికి కేంప్ నుండీ ఇంకో కేంప్ కి వెళ్ళే అవకాశం వచ్చినా,  ఖైదీలు ట్రక్ ఎక్కినపుడు ఆఖరున ఎక్కాల్సిన అతన్ని నిలువరిస్తారు.  అతనితో పాటు, ఆ నిస్పృహతో కేంప్ లో ఉండి, రాత్రి  నిద్రపోయిన మిగిలిన ఖైదీలని మిత్ర పక్షాల సైన్యాలు రక్షిస్తాయి. తరవాత కొన్ని సంవత్సరాలకు ఆ వేరే కేంప్ లో తమ స్నేహితులందరూ సజీవంగా తగలబెట్టబడి చంపబడ్డారని తెలిసినపుడు విధి రాత ని ఎవరూ ఎలా తప్పించుకోలేరో అర్ధం అయి, షాక్ కు అతీతమైన నిర్వేదం కలుగుతుంది. 

 

సైకాలజిస్ట్ గా / సాటి మనిషి గా Concentration Camp Prisoners ని దగ్గరగా గమనించడం, డాక్టర్ గా వాళ్ళ ని ఉన్న అతి తక్కువ మందులతో ట్రీట్ చేస్తూ, అతనో ట్రీట్మెంట్ విధానాన్ని తయారుచేసి దాని ఫలితాన్ని నిరూపించుకున్నాడు. అదే Logotherapy.  లొగొ థెరపీ గురించిన పుస్తకం నిజానికిది. కానీ కొత్త ప్రతులలో ఆ మాటే పుస్తకం లేబుల్ లో లేకుండా ప్రచురించేస్తున్నారు. ఈ పుస్తకం ఒక మానసిక వైద్య నిపుణుడు రాసినది.   రోగులనూ, బలహీనులనూ, వికలాంగులనూ నిర్దాక్షిణ్యంగా నాజీలు చంపేసిన కాలం లో యూదుడైనందుకు ఈ డాక్టర్ ని కేంప్  కి తరలించారు. అతను వియన్నా లో ఇంతకు ముందు పనిచేసిన చిన్న పిల్లల మానసిక వైద్యాలయంలో వందలాది పిల్లలను, ఆటిజం, లెర్నింగ్ డిసబిలిటీస్ ఉన్న నాలుగేళ్ళ వయసు పిల్లల్ని కూడా నాజీలు చంపేసారు.  ఎటు చూసినా కౄరత, విషాదం, దయాహీనత ! ఇలాంటి పరిస్థితుల్లో, తన చుట్టూ ఉన్న వాళ్ళలొ స్థైర్యాన్ని నిలబెట్టింది "ఈ కష్టాలు ఇలా  వృధా పోవాల్సిందేనాా!"  అన్న స్పృహ.  జీవితం లో అర్ధాన్ని వెతుక్కుని, దాని కోసం జీవితేచ్చని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం. 

 

విడుదల అయ్యాకా, అన్నాళ్ళూ ఆకలితో, అనారోగ్యాలతో, బానిసల లాగా, జంతువుల లాగా బ్రతికిన ఖైదీలకు ఎదురుగా జీవితం లో ఏముందో తెలియలేదు. వాళ్ళు ఆశించిన, కలలు కన్న స్వాతంత్రం  కన్నా భిన్నమైన భవిష్యత్తు వాళ్ళకు కనిపించింది.  హాలోకాస్ట్ బాధితులే కాక ఇతర పేషెంట్ ల లో కూడా లొగో థెరపీ విధానాల్ని ప్రయత్నించి అతను తయారు చేసిన మానసిక చికిత్సా విధానం, మనిషి తన సఫరింగ్ కి అర్ధం వెతుక్కోవడం అనే పద్ధతి !  'లొగో' అంటే గ్రీక్ భాష లో అర్ధం 'అర్ధం'. ఇది దాదాపు కర్మ సిద్ధాంతం లాంటిదికానీ కాదు.  మనం ఎపుడైనా ఇలా మనకే 'ఎందుకు'   జరుగుతుందో అని జీవితాన్ని నిలదీసుకుంటాం. మన కష్టాలనే అత్యంత ఘోరమైన కష్టం అనుకుంటాం.

హాలోకాస్ట్ విక్టిం లు తాము అన్ని కష్టాలు తట్టుకుని ఎలా బయటపడ్డామా అని ఆశ్చర్యపోతుంటారంట.  ఎవరికైనా భరింపరాని కష్టాలు కూడా అలవాటాయిపోతాయి. చీకటి పోయి వెలుగొస్తుంది. బాధ పడినవాడెవడూ చెడిపోడు. జీవితం నేర్పించే పాఠాన్ని వినమ్రంగా నేర్చుకున్నవాడు మనిషి. తమ బాధల్ని భూతద్దాలలో పెట్టి చూసుకుని 'ఆనందం ' వెనక పరిగెత్తే మనిషి, ఎప్పటికీ ఆనందాన్ని సాధించలేడు.  కష్టాలలో కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఓర్పు, సహనం, పోరాటం కూడా మనిషి కి కావాల్సిన విషయాలు. సంకల్పం మంచిదయి ఉండాలి. సహనం తో కొన్నిటిని సహించాలి. వీలయినంత గా తనని తాను కాపాడుకుంటూ, పక్కనున్న వాడిని కూడా కాపాడుకోవాలి. ఇదే జీవితానికి ఉన్న అర్ధం. ఇదే ఈ పుస్తకం.

ఈ పుస్తకానికి  Millions of Copies అమ్ముడయ్యాయి. ఇంకా అవుతూనే వున్నాయి. మనుషులు ఎదుర్కొనే existential crisis కీ, వెంపర్లాటలకీ, శూన్యతలకీ ఈ లొగోథెరపీ సమాధానం ఇస్తుంది. విక్టర్ బందీగా కేంప్ కి తరలింపబడగానే అతను వెంటనే కోల్పోయినది తన రీసెర్చ్ పేపర్లు.  కోటు పాకెట్లో ఉన్నందున కోటుతో సహా వాటిని అక్కడ కుప్ప పోసిన ఇతర ఖైదీల వస్తువుల్లో పారేయాల్సి వచ్చినపుడు అతననుభవించిన క్షోభ - చివరికి అతను విడుదలయ్యాక తిరిగి రాసుకోగలిగినపుడు, అనుభవించిన ఆనందం, తృప్తి ముందు చిన్నదే అనిపించింది.

బాధలూ, కష్టాలూ రెలేటివ్. కాలం, పరిస్థితులను బట్టి అవి మారుతాయి. దుర్భర పరిస్థితుల్లో కూడా సూర్యాస్తమయాల్ని, ఎర్రబారిన ఆకాశాన్ని చూసి ఆనందించగలిగే ఖైదీ ఆనందం లో ఎంత సానుకూల దృక్పధం ఉందో కదా అనిపిస్తుంది.   తన బట్టలు విడిచేసిన తరవాత కేంప్ లో ఇంకో ఖైదీ కోట్ ని అతనికి ఇస్తారు. దాని జేబులో ఒక యూదు ప్రార్ధనా శ్లోకం ఉన్న కాయితం దొరుకుతుందతనికి. దాని సొంతదారు గాస్ చేయబడి చనిపోయి ఉంటాడని తెలిసినా, అతనొదిలిన ఆ కాగితం అందించిన సాంత్వన ఫ్రాంకెల్ ని చాలా రోజులు అంటిపెట్టుకునుంటుంది. 

చాలా చిన్న పుస్తకమే అయినా అది డీల్ చేసిన బరువు వల్ల కాస్త మెల్లగా చదవాల్సొచ్చింది. ఎన్నో అత్భుతమైన వాక్యాలు. ఎన్నో కొటేషన్లు.  నిస్సందేహంగా అత్భుతమైన పుస్తకం !  కొన్ని పదునైన, ఘాటైన విమర్శలు ఎదుర్కొన్నా, విక్టర్ ఫ్రాంకెల్ డిప్లమసీ ని, పుస్తకం అత్భుత విజయం సాధించాకా, దానిని తన బాగ్ లో వేసుకుని రాజకీయ లౌక్యతని, డిప్లమసీ ని ప్రదర్శించాడనీ పలువురు ఈ రచయితని ధారాళంగా తిట్టుకున్నా కూడా, హాలొకాస్ట్ లాంటివి, అణ్వాయుధ దాడులూ మరెన్నడూ జరగకూడదని, గట్టిగా కోరుకుందాం.  అందరు మనుషులూ సమానమే అని - రేసిజం, అపార్థీడ్ లాంటిగాయాలు సమసిపోయి, అందరూ సుఖంగా వుండాలని అనుకుంటాం.

 

------------------------------------------------------------------------------------------------------------------------

Taste the content : 


Quotes :

1)  "He who has a Why to live for can bear almost any How."- Nietzsche 

2)  "That which does not kill me, makes me stronger." - Nietzsche

3) "What you have experienced, no power on earth can take from you."

4) "Mankind was apparently doomed to vacillate eternally between the two extremes of distress and boredom." - Schopenhauer

5) "The neurotic who learns to laugh at himself may be on the way to self-management, perhaps to cure." - Gordon W Allport.


/////some best  lines//// 

1) They died less from lack of food or lack of medicine than from lack of hope, lack of something to live for. 

2) I didn't know whether  my wife was alive, and I had no means of finding out ; but at that moment it ceased to matter.  There was no need for me to know ; nothing could touch the strength of my love, my thoughts, and the image of my beloved.  Had I known then that my wife was dead, I think that I would still have given myself, undisturbed by that knowledge, to the contemplation of her image, and that my mental conversation with her would have been just as vivid and just as satisfying.   "Set me like a seal upon thy heart, love is as strong as death.

3)  To draw an analogy, a man's suffering is similar to the behavior of gas.  If a certain quantity of gas is pumped into an empty chamber, it will fill the chamber completely and evenly, no matter how big the chamber.  Thus suffering completely fills the human soul and conscious mind, no matter whether the suffering is great or little.  Therefore the "size" of human suffering is absolutely relative. 

4) It is not for me to pass judgement on those prisoners who put their own people above everyone else.  No man should judge unless he asks himself in absolute honesty whether in a similar situation he might  not have done the same.

5) It didn't really matter what we expected from life, but rather what life expected from us.

6)  Pleasure is, and must remain, a side-effect  or by-product, and is destroyed and spoiled to the degree to which it is made a goal in itself. 

7)  Freedom, however,is not the last word.  Freedom is only part of the story and half of the truth.  Freedom is but the negative aspect of the whole phenomenon whose positive aspect is responsibleness. 

8)  World is in a bad state, but everything will become still worse unless each of us does his best. So, lets be alert - alert in twofold sense : 

      Since Auschwitz we know what man is capable of 

      And since Hiroshima we know what is at stake.

***********

Victor Frankl - Taken in 1942 and spent two years at Theresuebstadt, sent to Auschwitz and spent 5 days there and shifted to Dachau where he is liberated by Americans in 1945.

What is Holocaust

US Holocaust Museum

Warsaw Ghetto uprising

Logotherapy   

****