(Translation of original write up by Lt Gen Baljit Singh (Retd)
ఫిబ్రవరి 28, హిందూ ఆదివారం సంచిక లో, "కొత్త పుస్తకాల లిస్ట్" లో హార్పర్ కాలిన్స్ ఇండియా వారి, "రాజ్ ఎండ్ నోరా" (Raj And Norah : A True Story of Love lost and found in World War II - Peter R Kohli, Shaina Kohli Russo) పుస్తకాన్ని చూసాను. పుస్తకం అట్ట మీద డస్ట్ పాకెట్ లో రాజేంద్ర కోహ్లీ ఫోటో చూడగానే నా జ్ఞాపకాల తేనె తుట్ట కదిలి, ఒక్కసారిగా మే 1964 లో, నా గాంగ్ టక్ రోజుల్లోకి వెళ్ళిపోయాను.
కొత్త గా ఆర్మీ లో చేరి, ఎనిమిది ఏళ్ళు కూడా పూర్తి కాని లేత ఉద్యోగానుభవంతో, నేనొక కేప్టెన్ గా ఫీల్డ్ సర్వీస్ లో, ఒక స్టాఫ్ ఆఫీసర్ గా, 17 వ ఇన్ఫాంట్రీ డివిజన్ లో ఉన్నానప్పుడు. నా తాత్కాలిక ఆఫీసు గదికి ఒక విశాలమైన కిటికీ ఉండేది. చాలా ఆలోచన తో, కళాత్మకంగా కట్ చేసినట్టు, దాని వైశాల్యం ఎంత బావుండేదంటే, దాని ఫ్రేం లోంచీ సుదూరాన, సుదీర్ఘంగా పరుచుకున్న 'కంచన్ జంగా' పర్వత శ్రేణి "అంతా" స్పష్టంగా, కనిపిస్తూ ఉండేది.
బ్రిగేడియర్ ఆర్.ఎస్.కోహ్లీ అప్పుడే అక్కడికి దగ్గర్లో ఉన్న 112వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ కమాండ్ చేయడానికి కొత్తగా పోస్ట్ అయి, వచ్చారు. ఆనవాయితీ గా మా డివిజనల్ కమాండర్ ని కలవబోతూ, పొరపాట్న నా ఆఫీసు గదిలోకి (డివిజనల్ కమాండర్ తాలూకూ ఏడీసీ (ADC) గది అనుకుని) ఆయన అప్పుడు రావడం జరిగింది. అలా మాకు పరిచయం. అప్పుడు మామూలు గా మర్యాద పూర్వక సంభాషణ జరుపుతూ, అనుకోకుండా ఆ కిటికీ లోంచీ బయటకి చూసిన ఆయనకు , సూర్య కిరణాల మనోహరమైన మెరుపులతో అలరారుతున్న మహోన్నత 'కంచన్ జంగ' కనిపించింది
ఆ దివ్య పర్వత శ్రేణి ని చూసి ఒక మాటు గా చకితుడై పోయి, ఆ విశాలమైన కిటికీ కి ఎదురుగా కుర్చీ లాక్కుని అలా ఆ సౌందర్యాన్ని చూస్తూ మౌనంగా, కూచుండి పోయారు. జెనరల్ తో అపాయింట్ మెంట్ గురించి ఎవరో గుర్తు చేసి కుదిపేదాకా, ఆ ప్రకృతి రమణీయతను చూసి, తాద్యాత్ముడై, ఒక లాంటి 'ధ్యాన' స్థితి లోకి వెళ్ళిపోయారు.
వెళ్ళే ముందు నావైపు తిరిగి - "బల్ జీత్, 'కంచన్ జంగ' చాలా ఆకర్షణీయమైనదే. కానీ ప్రపంచం లో కెల్లా సుందరమైన పర్వతం ఏదో చెప్పగలవా ?" అని నవ్వుతూ, అడిగారు. నాకు అప్పటికి ఏమీ తెలీక, నోరు వెళ్ళబెట్టాను. నా నోటి వెంట తెలీదన్న మాట బయటకు రాక ముందే ఆయన అప్పటికి తను వచ్చిన పని నిమిత్తం బయటికి వెళ్ళిపోయారు.
ఆ తరవాత, HMI, డార్జీలింగ్ నుండీ భారత సైన్యం తరఫున మొదటి వాళ్ళలో ఒకడి గా, ప్రసిద్ధ గురువు టెన్సింగ్ శిష్యరికాన, "బేసిక్, ఇంకా, అడ్వాన్సుడ్ మౌంటెనీరింగ్" లో పర్వతారోహక శిక్షణ తీసుకున్నాను. ఈ ప్రక్రియలో అత్యత్భుత హిమాలయ శ్రేణుల సౌందర్యం, చరిత్ర, పర్వతారోహక సాహస గాధానుభవాల సారం లో తడిచి పోయాను. వాటిల్లో ప్రముఖంగా చెప్పదగిన ఒక పుస్తకం - 1924 లో బ్రిటీష్ సాహసిక బృంద సభ్యుడైన కలనల్ ఏడ్వర్డ్ నార్టన్ రాసిన "ఫైట్ ఫర్ ఎవరెస్ట్". ఇది, ఎగువ హిమాలయ శ్రేణుల గురించి పూర్తి ప్రాధమిక, శాస్త్రీయ అవగాహన ఇస్తుంది.
నాకు మటుకూ వ్యక్తిగతంగా ఎవరెస్ట్ శిఖరానికి దగ్గర్లోనే ఉన్న నెప్ట్యూస్ (Neptuse) పర్వతం చాలా అందమయిన పర్వతం అనిపిస్తుంది. కానీ టిన్సింగ్ కు మాత్రం సిక్కిం లో పౌహున్రీ (Pauhunri) పర్వతమే పెర్ఫెక్ట్ పిరమిడ్ లా అందమైనదని నమ్మకం. బ్రిగేడియర్ కోహ్లీ తో తరవాత కలిసినపుడు జరిగిన సంభాషణల్లో ఆయన మాత్రం, "కాంచన్ జంగ నీడలో జేమూ హిమనదానికి ఎదురుగా ఉన్న సినియోల్చూ పర్వతం మాత్రమే ప్రపంచం లో అన్నింటికన్నా అత్యంత అందమైన పర్వతం" అని గట్టి గా నొక్కిచెప్పడం, మనసు లో అలా సంవత్సరాలుగా, గుర్తుండిపోయింది.
పద్ధెనిమిది సంవత్సరాల అనంతరం, అదే 112 వ మౌంటెన్ బ్రిగేడ్, సినియోల్చూ ని కమాండ్ చేసే అవకాశం నాకు వచ్చింది. అదృష్టవశాత్తూ, నా పరిధి లో "పూర్తి ఉత్తర సిక్కిం" ఉండటం, దాని కి అందమైన అంచుల్లా, పశ్చిమ హద్దుల్లో ఈ 'సినియోల్చూ - కాంచన్ జంగా పర్వత శ్రేణులు', తూర్పున 'చొమల్ హారీ' ఉండటం తో, తరచూ కంటపడి, ఈ సినియోల్చూ, నా మనసుని తన సౌందర్యంతో ముట్టడి చేసేసి గెలిచేసుకుంది.
ఈ సమున్నత పర్వత శిఖరాన్ని, సినియోల్చూను, విధుల్లో భాగంగా లెక్కలేనన్నిసారులు వివిధ కోణాలనుంచీ, 'నిఘా' హెలికాప్టర్ లలోంచీ, ఏరియల్ వ్యూలలో చూసి ప్రతి సారీ అచ్చెరువొందుతూ ఉండేవాణ్ణి. గంభీరంగా, ఠీవి గా, శాశ్వతంగా పేరుకుపోయిన శ్వేత వర్ణపు మంచు సోయగంతో ఎన్నో పెద్ద హిమానీ నదాలు, చిన్న చిన్న సెలయేరులూ, వాగులూ, చివరికి తీస్తా నదిలో కలిసిపోయేదాకా ఆ పర్వతం మీద ప్రవహిస్తూ, కొండంచున విస్తరించిన గుబురైన అడవి, ఆ అడవుల్లో పింక్ రంగు విరజిమ్ముతున్నట్టుండే రొడో డెండ్రాన్ పూలు, లేత ఆకుల బిర్చ్లూ, ఎల్మ్ చెట్లు, నీలి రంగుల మోనాల్ పెసెంట్ పక్షులూ, మరియూ, హిమాలయాల విస్తార సౌందర్య నిశ్శబ్దాన్ని చూపించే, ఆ ఆనందాంబరపు అనుభవాలు ఎన్నిట్నో మూట కట్టుకున్నాను అక్కడ ఉన్నన్నాళ్ళూ.
ఆ రోజుల్లో, వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు హెలికాప్టర్ పైలట్లు, అపుడపుడూ, నా కోరికను నెరవేరుస్తూ, ఇంకో రెండు మూడు సార్లు ఆ ప్రపంచ లో కెల్ల సౌందర్య వంతమైన ఆ పర్వత శిఖరానికి కొంచెం దగ్గరగా, మెల్లగా, ఎగురుతూ, ఆ దివ్య సౌందర్యాన్ని ఇంకాస్త సేపు చూసేందుకు అవకాశాన్నివ్వడం ఓ మర్చిపోలేని అనుభవం.
- Lt Gen Baljit Singh (Retd)
లెఫ్టినెంట్ జెనరల్ బల్ జీత్ సింగ్ (రిటైర్డ్)
(naturefan3@gmail.com)
(జెనరల్ బల్ జీత్ సింగ్ అనుమతి తో చేసిన చిన్న సరదా అనువాద ప్రయత్నం)
మహానుభావుల జ్ఞాపకాలు, సిక్కిం లాంటి అందమైన రాష్ట్రం, మిలటరీ జీవితాల్లో పెనవేసుకున్న మానవ సంబంధాలు, విలువల పట్ల పాతకాలపు మహాశయుల ఆరాధన, యుద్ధంలో ప్రేమ, రకరకాల పుస్తకాలు అనివార్యంగా మోసుకొచ్చే జ్ఞాపకాల ప్రస్తావన వల్ల, ఈ చిన్న వ్యాసం నన్ను ఆకట్టుకుని, ఇలా తెలుగులోకి ఒంపుకున్నాను.
Originally published in The Hindu Sunday Magazine dated May 9, 2021.
https://www.thehindu.com/opinion/open-page/the-worlds-most-beautiful-mountain/article34513183.ece
Notes :
కంచన్ జంగా పర్వత శ్రేణి డార్జీలింగ్ నుంచీ
Siniolchu గూర్చి తెలుగులో.
Brig Rajendra Singh Kohli (Aug 26, 1919- Jun 20, 2019) - గురించి కొడుకు రాసిన వ్యాసం.
Raj And Norah (జెనరల్ బల్జీత్ సింగ్ ప్రస్తావించిన పుస్తకం)
Mt Siniolchu, Sikkim (Wiki page is stub)
HMI - Himalayan Mountaineering Institute, Darjeeling
Mt Pauhunri (wiki page still a stub)
Mr.Tenzing Norgay - ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి షేర్పా (తరవాత కూలీ స్థాయిని దాటి ప్రపంచ వ్యాప్తంగా గౌరవించబడ్డ పర్వతరోహకుడిగా పేరు పొందాడు)
Fight for Everest - Colonel Edward Norton
112 Mountain Brigade, 112 Infantry Brigade, 17 Infantry Division - లు ఎత్తైన పర్వత శ్రేణుల్లో, పోరాటానికి సిద్ధం చేయబడ్డ దళాలు. డోకలాం తరహా చిన్న యుద్ధాలలో, క్లిష్టమైన పర్వత ప్రాంతపు పోరాటాలలో, శిక్షణ పొందిన సైనిక బృందాలతో సన్నద్ధత తో ఉండే దళాలు.
ADC - ఆర్మీ లో పెద్ద జెనరల్ స్థాయి అధికారికి ఉండే పెర్సనల్ సెక్రటరీ లాంటి అధికారి.
***
Tenzing Norgay బృందం వాడిన దారి (From Readers Digest, Jun 2013)
*******