" అతను ఎలిమెంటరీ స్కూలు దాటి చదవలేదు - ఎటువంటి శిక్షణ పొందేందుకైనా పేదరికం, పొట్ట గడవని పరిస్థితి. అమ్మతో పదేళ్ళ పిల్ల వాడి గా స్టేజీ చుట్టూ తిరిగినా వేషాలు ఎవరూ ఇవ్వలేదు. యాక్షన్ కూ, ఆడిషన్ కూ అవకశమే లేదు - అయినా ఒక ఫినామినా గా, మేధావి గా, విదూషకునిగా, గొప్ప దర్శకునిగా తరవాత కధ, స్క్రిప్ట్ రచయితగా, మూకీ నుండీ, టాకీ వరకూ రెండు ప్రపంచ యుద్ధాల చరిత్ర కాలంలో మారణ హోమపు కమురు కంపులోని విషాద ఛాయల నేపధ్యంలో - కొన్ని భగ్న ప్రేమలు, మూడు పెళ్ళిళ్ళు, రెండు విడాకులు, ఒక స్కాండల్, బ్లాక్ మెయిల్, క్రిమినల్ కేసులూ ఇలా 40 సంవత్సరాల పాటు జరిగిన జైత్ర యాత్రలో చిన్నా, పెద్దా 80 చిత్రాలలో 90 శాతం విజయాలతో "మిలియనీర్ ట్రాంప్' గ ఎదిగి, అమెరికా అధ్యక్షుని కోసం ప్రచార ప్రసంగాలు చేసి, "ద గ్రేట్ డిక్టేటర్ " తీసి, యాంటీ నాజీ గా, సోషలిస్టు గా, కమ్యూనిస్ట్ గా ముద్ర వేయించుకుని అప్పటి మత చాందసుల ఒత్తిడితో అమెరికా దేశపు చట్టాల చట్రంలో ఇరుక్కొని, దాదాపు ఇరవై సంవత్సరాల శిక్ష కు కారాగారపు గుమ్మంలో నిలబడి, అదృష్టవశాత్తు బయటపడి, అమెరికా దేశం నుండి దాదాపు తరిమి వేయబడిన బ్రిటిష్ పౌరునిగా, ప్రపంచం లోని మహామహుల సాన్నిధ్యంలో విందులు, వినోదాలు పంచుకుని, మేధావులతో భుజాలు రాసుకుని, దేశాధినేతలతో - రాణులతో, యువ రాజులతో ఓపెరాలు చూసి, అహంకారం పొడసూపని ఆత్మవిశ్వాసంతో, సంపదను పరాయిదానిగానే చూసి, అపారమైన కీర్తిని తలకెత్తుకొని, అసంగతమైన అపఖ్యాతిని మూటగట్టుకుని, చివరికి స్విట్జర్లాండ్ పర్వత సానువుల్లో తన చిన్నారి భార్య ఒడిలో, ఆరుగురు పిల్లలతో ఒదిగి, మనకు అందించిన ఈ అత్భుత గ్రంధం -
చార్లీ స్వీయ కధ నుంచి, కాల పరీక్ష కు నిలబడే ఆయన అభిప్రాయాలూ - అనుభవాలూ కొన్ని మీ ముందుంచుతున్నాను " అంటూ రచయిత / అనువాదకుడు శ్రీ వల్లభనేని అశ్వినీకుమార్ మొదలు పెట్టిన ఈ పుస్తకానికి ముందు మాట తనికెళ్ళ భరణి రాసారు.
చార్లీ చాప్లిన్ నిస్సందేహంగా అత్భుత వ్యక్తి. ఎక్కడో ఖండాంతరాలలో అత్భుత ప్రతిభ కనబరచిన ఈ చిన్న వ్యక్తి ని ప్రపంచం నలు మూలలా చిన్నా పెద్దా అందరూ ఎంతో కొంత ఎరిగే ఉంటారు. తొలి పలుకుల్లో తనికెళ్ళ భరణి అంటారు.. "ఒక సారి పుస్తకం మూసేసాకే - మనసుకి తడొస్తుంది. మెదడు కి చెమట పడ్తుంది - విషాద ప్రపంచం లో ఉక్కిరిబిక్కిరైపోతాం. ఒక్కసారి హాలీవుడ్ లోకి అడుగుపెట్టాక అన్నీ విజయ గానాలే - అక్కణ్ణించీ ప్రపంచం లో ప్రతీ కుటుంబం లోను సభ్యుడైపోయాడుగా మరి - కానీ పుస్తకం చదివేసాక మనకేడుపొస్తుంది !! "
1889 వ సంవత్సరం ఏప్రిల్ 16 న పుట్టాడు చార్లీ.. వాక్వర్త్ తూర్పు సందులో రాత్రి ఎనిమిది గంటలకి.. తల్లి చిన్న పిల్లల్ని ఆయా సంరక్షణలో ఉంచి రాత్రి వేళల్లో నాటక శాలకు వెళ్తూండేది. ఆమె రంగస్థల నటి. పేదరికం ముందు నుంచీ ఉన్నదే గానీ దుర్భరమైన పేదరికం అనుభవింపు లో కి వచ్చేసరికీ చార్లీ కి ఊహ తెలిసింది. అన్న కేవలం తనకన్నా నాలుగేళ్ళు పెద్ద సిడ్నీ అంత చిన్న వయసు లో ఓడల మీద పని చెయ్యడానికి వెళ్ళడం. తల్లికి గొంతులో ఆరోగ్య సమస్య రావడం వల్ల ఆమె రంగస్థల నటన మూలపడడం.. చిన్నప్పట్నించీ చార్లీ అనుభవించింది బీదరికాన్నే, రిక్త హస్తాల్నే.
తండ్రి కూడా నటుడు. తల్లిని వదిలి సవతి తల్లిని పెళ్ళాడాడు. తల్లి ఒక్కత్తీ ఈ పిల్లల్ని సాకుతూ, ఇరుకు గదుల్లో, కుట్టు పనితో, ఆకలి కి పొట్ట నింపుకొనే దారి లేక, ఇంట్లో ఉన్న సామాన్లూ అవీ అమ్ముకుంటూ తినాల్సిన పరిస్థితిలో తీవ్ర ఒత్తిడి లో ఉంటుంది. తల్లి "హానా చాప్లిన్" అంటే ఇద్దరు పిల్లలకి ఆరాధన. చిన్న పిల్లలకి సహజంగా తల్లి పట్ల ఉండే ఆరాధన తో "మా అమ్మ ఎంతో అందంగా హుందాగా ఉండేది. ఆమె వంటి రంగు చాలా తెల్లగా ఉండేది. నీలి కళ్ళు, ముదురు రంగు జుత్తు లో ఆమె దేవత లా అనిపించేది. తెలిసిన వాళ్ళు ఆమె ఆకర్షణ గురించి చెప్పేవాళ్ళు " అని వర్ణిస్తాడు.
చార్లీ జీవితం లో అత్యంత భయానక మైన అనుభవం అంతా బాల్యానిదీ. భయానకం అంటే మరేమీ లేదు. బీదరికం. తినడానికి, పిల్లవాడికి పెట్టడానికి ఏమీ లేక పొరుగు ఇళ్ళకు వెళ్ళి ఆడుకొమ్మని చెప్పాల్సి వచ్చే ఆ తల్లి దైన్యం.. పెద్ద కొడుకు సిడ్నీ, పదిహేనెళ్ళయినా నిండని వాణ్ణి ఓడల్లో పనికి విదేశాలకు పంపడం, కేవలం డబ్బు కోసం! పిల్లలు ఇద్దరూ చాలా కష్టాలు పడటం, ఈ కష్టాల్లో అలిసి పోయి, ఉద్వేగంతో, ఒత్తిడితో మనశ్శాంతి కరువై, హానా కి మతి భ్రమిస్తుంది.
తల్లి ఒక్కతే చార్లీ జీవితానికి చెందిన ఒకే ఒక ఆధారం. తల్లి అంటే వెర్రి అభిమానం, ప్రేమ, ఆవిడ త్యాగాల్ని మర్చిపోలేని కృతజ్ఞత, ఆమె కు ఎలాంటి సహాయం చెయలేని వయసు.. చార్లీ తల్లి మతి భ్రమించి మానసిక చికిత్సాలయానికి వెళ్ళేసరికీ, చాలా షాక్ కు గురయ్యే చిన్న పిల్లాడి ఒంటరితనాన్ని చదివి గుండె తడి ఉద్వేగం కలుగుతుంది. తల్లి వెళిపోయే సరికీ, అద్దె ఇంట్లో ఒక్కడూ ఎలానో ఉంటాడు. అన్న సిడ్నీ ఓడల పని ముగించుకుని ఆఫ్రికా నుండీ వచ్చేవరకూ.. ఆ దశ అంతా అత్యంత విషాదం. పిల్లలిద్దరూ తల్లిని ఆసుపత్రి లో కొంచెం కుదురుకున్నాక కలుస్తారు. డాక్టరు చెప్పినదాని ప్రకారం, సరైన ఆహారం లేక ఆమె కు మతి భ్రమించింది. "చార్లీ! ఆ రోజు నువ్వు నాకొక్క కప్పు టీ ఇచ్చి ఉంటే ఇలా అయుండేది కాదు" అని తల్లి అనగానే చార్లీ గుండె బద్దలవుతుంది. ఆ మాట అంతని గుండెలో అలా నాటుకుపోతుందంటే అతని జీవన పర్యంతం.. ఆ విషాదమైన మాట ని అతను గుర్తుంచుకునే ఉంటాడు. నిజానికి ఆ పూట, తినడానికి ఏమీ లేక, పిల్లాడిని స్నేహితుని ఇంటికి తల్లే పంపిస్తుంది. అంత విషాదం లోనూ, చార్లీ తల్లిని ఆసుపత్రి లో వదిలి వచ్చాక ఆవిడ ఒక మూల దాచిన మిఠాయి చూసి ఒక్క సారిగా ఏడుస్తాడు. హన్నా చాప్లిన్, ఆ తరవాత పిల్లల ఎదుగుదలని, విజయాలనూ, గ్రహించుకోగలిగేంత స్థితి లో ఉండదు.
ఇన్ని కుదుపుల తరవాత, సిడ్నీ ఇంక ఓడల మీద ఇల్లొదిలి వెళ్ళే పని మానుకుని, నటన మీద దృష్టి కేంద్రీకరిస్తాడు. అన్న అడుగుజాడల్లోనే చార్లీ కూడా నాటకరంగ ప్రవేశం చేస్తాడు. బాలనటుడి గా. చార్లీ నాటకాల్లో ఎంతో కొంత పేరు గడిస్తూ, అత్యంత మేధావులైన బ్రిటీష్ నటులతో సరితూగే లా తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ, ఇంగ్లండు యావత్తూ తిరుగుతూ, బాల్యం నుండీ యవ్వనానికి ప్రయాణిస్తూ.. నాటక రంగంలో ఒక ముద్ర వేస్తాడు. జనం చార్లీ ని గురించి మాటాడుకోవడం.. పత్రికలు అతనికి మంచి భవిష్యత్తు ఉన్నట్టు రాయడం, ఆర్ధికంగా కాస్త కుదురు ఏర్పడటం.. అంతా తరవాత జరిగే విషయాలు. తల్లికి మెరుగైన వైద్యం, ఆహారం ఇవ్వగలిగే తన స్థితి కి చార్లీ, సిడ్నీ ఇద్దరూ ఎంతో ఆందిస్తారు.
ఆతరవాత తాను పని చేసే రంగస్థల కంపెనీ ఫ్రెడ్ కార్నో తరఫున నాటకాలు వేయడానికి మొదటి సారి పారిస్ పర్యటన, (చార్లీ తండ్రి ఫ్రెంచు వాడే) పారిస్ లో అనుభవాలు.. ఇంగ్లండు లో హెట్టీ ని ప్రెమించడం, ఎందుకనో అది విఫలం కావడం.. మొత్తానికి ఫ్రెడ్ కార్నో తరఫున అమెరికాకి వెళ్ళాల్సిన అవకాశం రావడం. కార్నో కంపెనీ అమెరికా లో నటించేందుకు మంచి హాస్య నటుణ్ణి వెతుకుతుందన్న మాట విని.. చార్లీ తను ఇంగ్లండు లో ఉండి చెయగలిగింది ఏమీ లేదని గ్రహించుకుంటాడు. మార్పు కోసం ఎదురు చూస్తున్న అతనికి ఇదో సువర్ణావకాశం. అమెరికా చేరాక, బ్రిటీషు మర్యాదలకి భిన్నంగా మనుషులు.. కొత్త అలవాట్లు, పలుకులు, బ్రాడ్వే మాయ తెలిసే సరికీ.. "అవును ! ఇదే - ఇలాంటి జీవితం కావాలి. నాకు ఇదే తగిన ప్రదేశము!" అనుకునేంత గా నచ్చింది అమెరికా.. చార్లీ కి.
కానీ ఇంగ్లండు లో తనను చూడగానే గొల్లున నవ్వే ప్రేక్షకులు ఇక్కడ లేరు. మొదట గందరగోళ పడ్డా.. మెల్లగా కుదురుకుంటాడు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకున్నాక, చార్లీ కి ఎదురు లేదు. అప్పుడప్పుడే మొదలయ్యే చలన చిత్ర పరిశ్రమ కూడా అతన్ని ఆకర్షిస్తుంది. మేధ, వ్యాపారం, కళ కలగలుపు వ్యవహారంలో కిటుకులు గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అయినా వితండవాదాన్ని, మంకుపట్టు మూస భావాల్నీ జయించి, ముందుకు పోవడానికి, హాస్య మూకీ చిత్రాల్లో తన మార్కు సంపాదించడానికి చిన్న పాటి యుద్ధం చేసి, గెలిచాడు చార్లీ. సృజన, తన మీద తనకున్న నమ్మకం, కష్టపడే మన్సస్తత్వం తప్ప అతని దగ్గర ఏమీ లేదు. హాలీవుడ్ కు కావాల్సింది అదే.
ఒకప్పుడు సాంకేతికతే సినిమా అంతా అయినప్పుడు, నటీనటులు పడుతూ లేస్తూ తెర అంతా కలియ తిరుగుతూ అదే హాస్యం అని చెల్లుబాటయిపోతూండటం సహించలేక, తన బ్రిటీషు యాస ని ఆటపట్టిస్తూ, తన మీద హాస్యానికి మాటలు విసురుతూన్నప్పుడు, దర్శకుడు - చార్లీ - ఇక్కడ నవ్వులు కావాలె. ఏదైనా హాస్యపు వేషం వేసుకో - ఏదైనా పరవాలేదు" అన్నప్పుడు పెద్ద ఆలోచన లేకుండానే దుస్తులు మార్చుకునే గదిలో పెద్ద పంట్లము, పొడుగాటి బూట్లు, డెర్బీ టోపీ, చేతిలో వంగిన కర్ర, "అన్నీ వ్యతిరేకాలే" - అనుకుంటూ, హాస్యగాడి పాత్ర కు వయసు ఎంత ఉండాలో నిర్ధారించుకోలేక, చిన్న మీసం పెట్టుకుని - మేకప్ తో బయటకు వచ్చి నిల్చునేసరికీ, అంత సాంకేతిక దర్శకుడూ, సామాన్య ప్రేక్షకుడిలా నవ్వి నవ్వి, పగలపడి నవ్వి, నిలువెల్లా వణికిపోయాడు. ఆ వేషమే ట్రాంప్.. చార్లీ ని చిరంజీవిని చేసిన గెట్ అప్. ఈ పెద్ద మనిషి (ట్రాంప్) కి చాలా కోణాలున్నాయి. ఇతను ఒక కవి, కలలు కనేవాడు. ఎపుడూ ఏదో ఒక మంచి జరుగుతుందని ఆశించేవాడు. రొమాన్సు కోసం ఎంతో సాహసంతో ఎదురుచూసేవాడు. అని మొదలుపెట్టిన చార్లీ... ట్రాంప్ ని అజరామరం చేసేసాడు.
ఈ చార్లీ జీవిత చరిత్ర ఎంతో వివరంగా, అతని సినీ జీవిత ప్రస్థానాన్ని వివరించుతూ, అతని జీవితంలో ఎదురుపడిన పలు స్త్రీ పురుషులూ, నటీ నటులూ, దర్శకులూ, సాంకేతిక నిపుణులూ.. నిర్మాతలూ, స్నేహితులూ, సన్నిహితులూ అందర్నీ చిక్కగా సినిమా కధ రాసినంత వలపుతో రాస్తాడు. చార్లీ అమెరికా జీవితం ఎందుకంత వివాదాస్పదం, అతని కోర్టు కేసులూ, అత్భుతమైన వైవాహిక జీవితం, తల్లి తరవాత తల్లి లాంటి భార్య. ఒడిదుడుకుల్ని ఎంతో వివరంగా అందించాడు చార్లీ. అంతే అత్భుతంగా, పూర్తి నిబద్ధత తో, తన శైలి ని కూడా, కలుపుతూ హృద్యంగా తెలుగు చేసారు శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార్. మధ్యలో చార్లీ కలుసుకున్న ప్రముఖులు... ఆ తరానికి చెందిన మహానుభావులు.. చార్లీ తో నటించిన నటీ నటులు, కట్టుబట్టలతో ఇల్లువిడిచి, అమెరికా విడిచి పోవాలిసి రావడం, సిడ్నీ, చార్లీ ల ప్రేమ.. ఇవన్నీ చదివినపుడు నిజంగా సంభ్రమం కలుగుతుంది.
చార్లీ ఎన్నో మంచి మానవత్వమైన సినిమాలు తీసాడు. చాప్లిన్ తీసిన కొన్ని అత్భుతమైన సినిమాలు - సిటీ లైట్స్, మోడర్న్ టైంస్, ద గ్రేట్ డిక్టేటర్ (ఇందులో స్పీచ్ అత్భుతం) ద కిడ్, ద గోల్డ్ రష్, లైం లైట్, ద సర్కస్, ద అడ్వెంచరర్, వన్ ఏ ఎం, మేకింగ్ ఎ లివింగ్, ఎ డాగ్స్ లైఫ్, ద ఇమ్మిగ్రంట్, ద ట్రాంప్. హాస్యం కోసం ఎంతో సాహసమైన ఫీట్లు చేసాడు. ప్రేక్షకుల్ని నవ్విస్తూనే విషాదాన్నీ రుచి చూపించాడు. అతని ట్రాంప్ మాత్రమే కాదు ద గ్రేట్ డిక్టేటర్ లా అతను కూడా హాస్యం అంచున మానవత్వాన్ని కూడా, విలువల్ని కూడా ప్రేక్షకులకి గుర్తు చేసాడు. అందుకే చార్లీ ఒక ఐకాన్. అతని జీవితం ఒక అత్భుతం. వివరంగా ఈ అత్భుత వ్యక్తి గురించి చదవడానికి అదీ.. తెలుగులో.. 'నా కధ' ఒక అత్భుత అవకాశం.