Pages

02/08/2019

Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 4


                                     మాలతి

21 మే 1991 న తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో  భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎల్ టీ టీ ఈ కు చెందిన మహిళా తీవ్రవాది ధను (అసలు పేరు థెన్ మోళి రాజరత్నం) నడుముకు చుట్టుకున్న బెల్టు బాంబు పేల్చి ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో రాజీవ్, ధనులతో సహా వారికి చుట్టుపక్కల ఉన్న  16 మంది దుర్మరణం పాలయ్యారు.  రాజకీయ కల్లోలం సృష్టించిన ఈ ఘటన ఆ తీవ్రవాద సంస్థ తుడిచిపెట్టబడడానికి, భారత ప్రజల్లో శ్రీలంక తమిళుల పట్ల ఉన్న సానుభూతిని చెరిపేయడానికీ దోహదపడింది. బాలసింగం అన్నట్టు ఇదో దురదృష్టకరమైన సంఘటన. ప్రభాకరన్ వ్యూహాత్మక తప్పిదం. అయితే, ధను తీవ్రవాదంలో మహిళల పాత్ర పట్ల ప్రపంచ దృక్కోణాన్ని మార్చేసింది.

దాడి సఫలం అయిన వెంటనే, వాటి తీవ్ర రాజకీయ పరిణామాలను ఊహించిన ఎల్.టీ.టీ.ఈ. ఈ హత్య వెనుక తమ పాత్ర లేదని వాదించింది. ధను ఐ.పీ.కే.ఎఫ్ చేతిలో అత్యాచార బాధితురాలని, ఆమె వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోవడానికే రాజీవ్ ని చంపిందనీ ప్రకటించింది. ఐ.పీ.కే.ఎఫ్ 1987 - 1990 వరకూ జఫ్నా లో పనిచేసింది.  మహిళల శీలం, పవిత్రతా లకు సాధారణంగా సమాజంలో ఓ గౌరవనీయమైన స్థానం ఉంటుంది.  రాజ్యం / ఐపీకేఎఫ్ / శ్రీలంక దళాలు, తమిళులను కృంగదీయడానికి సామూహిక హత్యలూ, అత్యాచారాలకు తెగబడ్డాయన్నది నిజం. అలా దాడులకు, తరచూ ఇంటిని / తమ స్వస్థలాలనూ వొదిలి పారిపోవాల్సి రావడం, చెట్లకిందే సమూహాలలో బ్రతుకు జీవుడా ని జీవించడం, కళ్ళముందే అయినవారిని కోల్పోవడం, చాలా మంది మహిళలను ప్రతీకారేచ్చ తో రగిలేటట్టు చేసాయి. ఏ రక్త సంబందమూ ఇవ్వలేని బాంధవ్యాన్ని ఈలం పోరాటం కల్పించింది.   వారు ఇలాంటి తీవ్రవాద / ఆత్మాహుతి దాడికి పాల్పడి, వారు తమ పవిత్రత ని తిరిగి పొందవచ్చనీ, చెరచపడ్డ ఆడది, తిరగబడటానికి, చంపడానికీ తుపాకీ చేపట్టడం, తిరుగులేని జవాబు గా భావించడం,   ఓ అధికారంగా భావించడం జరిగింది. ఏ యుద్ధంలో అయినా మహిళ ల పట్ల ఘోర అన్యాయాలు జరుగుతాయి. అత్యాచారం వాటిలో మొదటిది. భర్తలనూ, పిల్లలనూ చంపడం, అశక్తురాలను చేయడం మిగతావి.  వాటికి ప్రతీకారం తీర్చుకునేందుకు "తమిళ పులులు" వారికి అవకాశం ఇచ్చారు.

రేప్ కు గురయిన స్త్రీ, బయట సమాజంలో అంతగా గౌరవింపబడదు. కానీ తమిళ పులుల సమాజంలో వారికి పురుషులతో సమాన హోదా వుంది.  పైగా స్త్రీ సహజ నైజం త్యాగం (సమాజపు చట్రాల ఆలోచనల్లో, స్త్రీ తప్పనిసరిగా త్యాగధనే)  కాబట్టి, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ మహిళ అయితే ఇంకా గౌరవింపబడేది.  హమాస్ లాంటి చాందసవాద ముస్లిం సంస్థల్లో పురుషులతో సమానంగా తీవ్రవాద ఆత్మాహుతి దాడులకు అనుమతించాలని ఉద్యమించిన మహిళలకు ఆ అవకాశం ఇవ్వడానికి మొదట తటపటాయించినా, తిరుగులేని జవాబుదారీతనంతో, ఖచ్చితత్వం తో వారు ఈ దాడులకు దిగడం తో స్త్రీ ల ఉగ్రవాద పాత్రల పట్ల, వారికి కొన్ని కీలక ప్రదేశాల్లో పురుషులకు కూడా దొరకని ప్రవేశావకాశాలను  దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం ఎంత లాభదాయకమో హమాస్, ఇస్లామిక్ జిహాద్ వగైరా సంస్థలు వెంటనే గుర్తించాయి.

అందరు మంచి మహిళల లాగే ఈ తీవ్రవాద ముస్లిం మహిళలు కూడా, టార్గెట్ వరకూ ఒక మగ మనిషితో వచ్చారు. ఈ మగ సహచరుడు, బహుశా వీరు దాడి చేస్తారా చెయ్యరా చూడడానికి వచ్చినట్టు కూడా అనుకోవచ్చు.  వాళ్ళ కళ్ళు విప్పార్చుకునేలా దాడులు చేసిన మహిళలు, మహిళా తీవ్రవాదానికి ఒక పెద్ద పీట వేయించారు. కాశ్మీర్ లో ఈ మధ్య వరకూ చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారని బాలురు, డబ్బులకు రాళ్ళు రువ్వడం ప్రచార మాధ్యమాలలో బాగా చూసాం. ఈ పసివాళ్ళే, ఆర్మీ కాన్వాయి మీద చేతితో క్లిప్ తీసి, విసిరే గ్రనేడ్ లనూ అవలోకగా విసురుతారు.  అలా చిన్న చిన్న పసివారు కూడా తీవ్రవాదంలో భాగం కావడం సామాన్యం. శ్రీలంక ఈలం పోరాటంలో వేలాది పిల్లలు, మహిళలూ దళంలో చేరారు. చావు వీరికి, తమ జీవితంలో ఎదురవబోయే ఓ ముప్పు. ఎన్నో పరిణామాల వంటిదే.

అయితే ఆత్మాహుతి దళంలో చేరడం, స్లీపర్లు గా పనిచేయడం, వారి అవసరం పడినపుడు తమ నేతకు తలవంపులు తేకుండా, 100% సఫలత తో దాడికి తెగబడడం, వారు చాలా ఇష్టంగా ఎంచుకునే ప్రక్రియ.  మహిళల కైతే, తమ పవిత్రతని తిరిగి పొందేందుకు ఇదో సాధనం.

నిజానికి ఎల్.టీ.టీ.ఈ. దళాలు తప్పనిసరిగా తమ ట్రైనింగ్ ముగిసిన గుర్తుగా మెళ్ళో ఓ కుప్పి / సైనేడ్ బిళ్ళ ను వేసుకునే వారు. గాజు కుప్పె / తావీజు లో పేక్ చేసిన ఆ సైనేడ్, రక్త ప్రవాహంలో చేరిన వెంటనే 5-10 నిముషాల పాటు విపరీతమైన వేదనకు గురి చేసి, మనిషి ప్రాణాన్ని తీస్తుంది. మోతాదు తక్కువ అయితే, మెదడు కోలుకోలేనంతగా దెబ్బ తింటుంది. మిలిటెంట్ విద్యార్ధి ఉద్యమంలో పోలీసులకు పట్టుబడే ముందు శివకుమార్ అనే నాయకుడు సైనేడ్ సేవించి 1974 లో ఆత్మహత్య చేసుకోవడం, ప్రభాకరన్ దృష్టిలో పడింది.

నిజానికి సైనైడ్ మరణం అత్యంత బాధ తో, హృదయవిదారకమైన వేదనతో నిండినది. కానీ పోలీస్ / సైనికుల చేతిలో విపరీతమైన చిత్రవధ, తరవాత తప్పని భయంకరమైన మృత్యువును తప్పించుకునేందుకు సైనైడ్ ను నమ్ముకుంది ఎల్.టీ.టీ.ఈ.  కొత్తల్లో ఈ కుప్పె ను కొరికి, నాలుక/పెదవుల మీద అయిన గాయం ద్వారా సైనైడ్ ను తీసుకునేవారు. కానీ గట్టి గా ఉంటూండే కుప్పెను అంత గట్టిగా కొరకడం అన్నిసార్లూ కుదిరేది కాదు. గాయం చిన్నదయినా, మోతాదు తగ్గినా విపరీత పరిణామాలుండేవి.

ఆఖరికి ఈ కుప్పె లో ఆధునిక మార్పులు వచ్చి, సన్నని గాజు కుప్పెలు వాడటం మొదలయింది. భారత దేశాన్నిండీ దీన్ని దిగుమతి చేసుకునే వారు. తీవ్ర గాయాలతో శ్రీలంక దళాలకు చిక్కేసే పరిస్థితుల్లో సైనైడ్ తిని ఆత్మహత్య చేసుకున్న మొదటి మహిళా సభ్యురాలు మాలతి వీర మరణాన్ని, అక్టోబర్ 2009 లో చివరి పోరాటం లో ఓడిపోయే వరకూ ఎల్.టీ.టీ.ఈ. గౌరవిస్తూనే ఉంది. సైనేడ్ మరణాలను చాలా వరకూ హాయైన మరణంగా ప్రచారం చేసేవారు.  ఎందుకంటే దొరికిపోయి, తమ తోటివారికి ప్రమాదం గా తయారవకుండా, చనిపోవడమే క్షేమమని భావించేవారు.


ఎల్.టీ.టీ.ఈ, చాలా విషయాల్లో మిగతా తీవ్రవాద దళాల కన్నా స్త్రీ సమానత్వం లో మెరుగు.  ఏ నమ్మకాల మీద, బ్రెయిన్ వాషింగ్ మీదనో, తమిళ బాధిత స్త్రీలు దళంలో చేరినపుడు వారికి పురుషులతో సమాన అవకాశాలు కల్పించింది.  బెదురు లేని, ఇంటిలాంటి వాతావరణాన్నిచ్చింది. అప్పటి వరకూ సామాన్యంగా జీవించేందుకు పోరాడిన సామాన్య మహిళలు కాస్తా, సమాజం కట్టుబాట్లని వదిలి, పురుషులతో సమానమైన ట్రైనింగ్, ఆయుధాలు, లక్ష్య నిర్దేశ్యాలలో, నాయకత్వ నిర్ణయాలలో భాగం తీసుకోవడం మొదలయింది.

ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వారి కుటుంబాలకి,  ప్రతీ తీవ్రవాద సంస్థా నెలకింత అని స్టైపెండ్ ఇస్తుంది. కానీ హమాస్, ఇస్లామిక్ జిహాద్ లు పురుషుడి కుటుంబానికి  ఎక్కువా, మహిళా తీవ్రవాది కుటుంబానికి అందులో సగం ఇచ్చేవారు. ఎందుకంటే, బ్రతికి ఉండుంటే, పురుషుడు తన కుటుంబానికి ఏదో ఓ పని చేసుకుని డబ్బు సంపాయించి ఇచ్చిఏవాడు కనుక.  కానీ ఎల్.టీ.టీ.ఈ అలాంటి తేడాలేవీ చూపించలేదు.  అయితే ఈ తరహా సొమ్ము ను తమిళ కుటుంబాలు ఎంత చొప్పున అందుకునేవో బయటికి తెలిసేది కాదు.  ఒకవేళ వారు దాన్ని నిరాకరించినా, ఈలం సమాజంలో ఆయా కుటుంబాలకు సముచిత గౌరవం దక్కేది.

ప్రతీ 27 నవంబరు నా,  వీరుల స్మారక దినం రోజు అన్న ప్రభాకరన్ ఆయా కుటుంబాలను ఉద్దేశించి బరువైన ప్రసంగం చేసేవాడు.   ఆత్మాహుతి దాడి చేసుకున్న   మొదటి పురుషుడు కేప్టెన్ మిల్లర్ కు ఎంత గౌరవం దక్కిందో, సైనైడ్ తిని ఆత్మహత్య చేసుకున్న మొదటి మహిళగా మాలతి కీ  అంతే గౌరవం దక్కింది.  వివిధ యుద్దాలలో, ఆత్మాహుతి దాడుల్లో చనిపోయిన ఈలమ్ వీరుల త్యాగాలు ఊరికేనే వృధా కావనీ, పోరాటానికి జవస్త్వాలు కూర్చడానికి ప్రాణాల్నే బలిదానం చేసిన వీర సైనికులమేలు మరవలేనివనీ ప్రభాకరన్ వల్లించడం ఆయా కుటుంబాలను సాంత్వన పరచేవి.No comments: