Pages

16/09/2017

పథేర్ పాంచాలీ - బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్

పథేర్ పాంచాలీ - బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ (1894-1950)
అనువాదం : మద్దిపట్ట్ల సూరి (1920-1995)



కొన్ని పుస్తకాలకి గొప్ప చరిత్ర వుంటుంది. ఎప్పుడో చిన్నప్పటి పథేర్ పాంచాలి. సత్యజిత్ రేయ్ సినిమా గానే తెలుసు. టీవీలో ఎప్పుడో చూసిన చిన్న బిట్  - వానల్లో బురదల్లో పల్లెలో పడుతూ లేస్తూ నడుస్తూ వస్తున్న పెద్ద మనిషిని ఇద్దరు చిన్న పిల్లలు నవ్వుతూ గమనిస్తున్న దృశ్యమే మనసులో ముద్రించుకుపోయింది. అత్భుతమైన సినిమా అనీ, సత్యజిత్ రే దానికి ప్రాణం పోసాడనీ వినడమే. ఎప్పుడూ దాని పూర్తి పాఠం చదవలేదు.  ఇన్నాళ్ళకిన్నాళ్ళకి ఈ "అజరామర పథగీతం"  ఇంత చక్కని తెలుగులో దొరికితే చదవకుండా వొదులుకోగలగడమే ?!  దీన్ని తెలుగులో అత్భుతంగా, రస రమ్యంగా అనువదించినది శ్రీ మద్దిపట్ల సూరి.   బెంగాలీ నవలల పట్ల తెలుగు వాళ్ళకున్న క్రేజ్ తెలిసినదే. శ్రీ సూరి మంచి మంచి బెంగాలీ క్లాసిక్ లను తెలుగు లో కి అనువదించారు. ఈ అనువాదాన్ని ఈయన కాకుండా ఎవరన్నా చేసి వుంటే ఆ పుస్తకం ఇంత బావుండేదా అని  అనిపించింది. కాబట్టి  అనువాదకునికి నమస్కరించి, ఇది మొదలు పెట్టాలి న్యాయంగా.

చాలా రోజులకి గుండెల్లో ఇంకిపోయిన చెమ్మని బయటకు తీసుకొచ్చిన ఇద్దరు చిన్న పిల్లల కథ ఇది.  పథేర్ అంటే పథం. మార్గం. పాంచాలీలనేవి తరతరాలుగా సంప్రదాయ కథాగానానికి ఉపయోగిస్తుండే బెంగాలీ గీతాలు. అందుకే సత్యజిత్ రే తన చిత్రానికి 'సాంగ్ ఆఫ్ ద లిటిల్ రోడ్' అనే ఉప శీర్షిక జోడించారు.  దుర్గ, అపూర్ లు అక్కా తమ్ముళ్ళు. నిశ్ఛింది పురంలో హరిహర రాయ్ గారి పిల్లలు. హరి రాయ్ భార్య సర్వ జయ.  హరి హరుడికి వరుసకు అక్కగారైన ఇందిరమ్మ అనే వృద్ధురాలు వీళ్ళతోనే ఆ ఇంట్లోనే ఉంటూండేది.  ఆవిణ్ణి, సర్వ జయ నూ బీదరికం నిర్దాక్షిణ్యంగా విడదీసేస్తుంది. ఈ మౌసీమా ని ఎంతగానో ప్రేమించిన చిన్నారి దుర్గ తల్లికీ, ఇందిరమ్మ కూ  మధ్య నలిగిపోతూ.. వాళ్ళ అస్థిత్వ పోరాటం లో - ఇందిరమ్మ ఇల్లు విడిచి పోవడమూ, తిండికి మొహం వాచి, ఎండ దెబ్బ కి మరణించడమూ చూసి ఎక్కువ దెబ్బ తిన్న పిల్ల.  అత్యంత బీదరికంలో బ్రతుకు వెళ్ళదీస్తున్న సర్వ జయకూ పిల్లలల తో పాటూ ఆ ముసలావిణ్ణి సాకడం కష్టమైపోతుంది.  ఇందిరమ్మ జీవితాన్నీ మరణాన్నీ చదివే సరికే పాఠకుడు ఎప్పుడు ఈ బ్రతుకుల్లో వెలుతురొస్తుందా అని నిస్పృహ లో కూరుకుపోతాడు. 

హరి హరుడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణీకం తప్ప ఇతర పనులెరుగని పండితుడు. అతని కొడుకు అపూర్ !  అపూ అక్క దుర్గ వెంటే ఎప్పుడూ. తండ్రి పౌరోహిత్యపు పనుల వేటలో, ప్రవచనాల పనుల వేటలో నెలల తరబడి ఇల్లు విడిచి వెళ్ళినప్పుడు తల్లికి మిగిల్న తోడు వీళ్ళిద్దరే. వీళ్ళు ఊరు నాలుగు చెరగులా తిరుగుతూ, వంటకి ఫలమో, పుష్పమో, కట్టెలో, ఎక్కడో పడిపోయిన  కొబ్బరి కాయలో, ఏ చెరువులోనో దొరికిన చేపల్నో ఇంటికి పట్టుకొస్తూంటారు.  ఈ పిల్లల కళ్ళ నిండా లేమే.  అపూ కి తల్లి ఉడకేసే ఆ నీళ్ళ లాంటి అన్నమూ పరమాన్నమే. దుర్గ కాస్త పెద్దది.  ఇల్లు గడవడం కోసం పక్క వాకిళ్ళలో దొంగతనానికీ వెరవదు.  సర్వ జయ కి ఈ పిల్లల భవిష్యత్తు గురించి విపరీతమైన బెంగ. తిండికే గడవని తాము దుర్గ పెళ్ళెలా చెయ్యడమా.. అపూర్ ని ఎలా చదివించడమా అని బెంగ.

ఇన్ని బాధల్లో పదకొండూ పన్నెండేళ్ళ పిల్ల  దుర్గ ని ఇష్టపడిన ఒక డబ్బున్న యువకుడు సర్వజయలో ఎంతో ఆశ కలిగిస్తాడు.  దుర్గ కూడా తనకి పెళ్ళయితే, ఇంట్లో బాధలు కాస్తన్నా తీరుతాయి కదా అని ఆశిస్తుంది. కానీ కుటుంబ తగాదాల్లో, ఆ సంబంధం తప్పి, వెలుగు రాబోతున్న జీవితాలు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు మూలపడతాయి.  ఆ రోజుల్లో బెంగాల్ పల్లెల్లో, ఎందరో ప్రజలు మలేరియా తో చనిపోతారు. దుర్గ కూడా వొళ్ళెరగని జ్వరంలో - రోజుల తరబడి ముసురు పట్టిన రోజుల్లో, తన మీద చూరు నుండీ ధారగా నీరు కారుతున్నా కదల లేనంత జ్వరంతో ప్రాణాలు విడుస్తుంది.   దుర్గ పోయిన విషయం తెలీని తండ్రి  కొన్నాళ్ళ తరవాత, పట్నం నుంచీ తీసుకొచ్చిన బహుమానం కళ్ళలో నీళ్ళు తెప్పిస్తుంది. 

చిన్న పిల్ల దుర్గ లేకుండా అక్కడ ఉండడం కష్టమయ్యి  కాశీ లో ఏదో ఒక పని దొరకకపోదని కాశీకి వలస వెళ్తుంది కుటుంబం.  అక్కడకి వెళ్ళేందుకు జీవితం లో మొదటిసారి రైలెక్కిన అపూర్, దుర్గ రైలెక్కలేదని, దుర్గ ని ఆ ఊర్లో వొదిలేసి పోతున్నామనీ బావురుమనడం  చదివి, ఎంతో బాధ కలిగిస్తుంది. కాశీకి వెళ్ళినా వాళ్ళ పరిస్థితి ఏమాత్రం మెరుగు పడకపోగా హరి మరణం, సర్వజయ బ్రతుకు గడవడం కోసం  ఒక జమీందారింట్లో  వంటలక్క గా చేరడం, అపూర్ అక్కడ వాతావరణంలో ఇమడలేక, తీవ్ర అవమానానికి గురయి,  మళ్ళీ నిశ్చిందిపురానికి వెళ్ళిపోవాలని ఇద్దరూ నిర్ణయించుకోవడం... ఇదే ఈ పథం.


ఈ కధ లో అత్యంత నిరాశా పూర్వక జీవితం లో కూడా ఎక్కడో ఏదో మంచి జరగకపోదా అన్న ఆశ ఎలా మనుషుల్ని నడిపిస్తుందో చూస్తాం.  నిశ్చిందిపురం ఆ పిల్లల దృష్టిలో స్వర్గం.  అందమైన తోట. ఆ అందాన్ని వొదులుకుని పట్నాల్లో ఇరుకు ఇళ్ళలో ఎలా గడిపారో అపూ వాళ్ళు అనిపించేంత సౌందర్యం.   హరి హరుడి కూలడానికి సిద్ధంగా ఉన్న ఇంటి చుట్టు పక్కల  ఎలా వుంటుందంటే : :

వాళ్ళ ఇంటి కిటికీ కి కొంచెం అవతలగా చుట్టూ ముదురుగోడ. ఆ గోడని ఆనుకుని అవతల అంతా ఒకటే అడవి.  ఆ కిటికీ దగ్గర కూర్చుంటే చాలు - నీలి సముద్రపు అలల్లాగా భాండీర, శాఖోటక వృక్షాల చివళ్ళు ఆ చెట్లనీ ఈ చెట్లనీ వ్రేళ్ళాడే రక రకాల తీగలు, ఏళ్ళ తరబడి ఉన్న వెదురు చెట్లు, వయో భారం వల్లా ప్రక్కనున్న కర్ణికార, 'వన చాల్ తా' చెట్ల మీదికి ఒరిగిపోతూ ఉండటం, వాటికింద వెలుతురు తక్కువగా ఉండే చోట కాటుక పిట్టలు గంతులు వేస్తూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది. 

వాళ్ళ ఇంటి పక్కన ఆ అడవి ఇటు నీలిమైదానం వరకూ, అటు ఏటి గట్టునకు వ్యాపించి ఉంటుంది.  అపూ వాళ్ళకది ఎంత తిరిగినా తిరగనట్లే వుంటుంది.  అపూ అక్కతో కలిసి, ఆ అడవిలో చాలా దూరం తిరిగాడు.  కానీ ఆ అడవి ఎక్కడ ఆఖరయిందో తెలియలేదు వాడికి  - ఈ అడవి, దాని శ్యామలత్వం లోని నూతన స్పర్శ వాడి మనస్సుని, వాళ్ళ అక్క మనస్సునూ పులకరింపజేస్తుంటాయి. పుట్టినప్పట్నించీ సుపరిచితమైందీ అడవి వాళ్ళకి.

క్షణక్షణమూ ఏదో తెలియని ఆనందంతో వాళ్ళ పిపాసు హృదయాల్ని అపూర్వ విచిత్రరసానుభూతితో నింపివేస్తూ ఉంటుంది.  వర్షానికి నిగనిగలాడుతూ పచ్చగా వున్న చెట్ల పొదల మీదికి కరంజ పుష్పాల పసుపుపచ్చని చివుళ్ళు,  అస్తమయపు నీడలో పెద్ద అడవి ఉమ్మెత్త కొమ్మ మీద మెల్లిగా అటూ ఇటూ ఉడుత ఒకటి తిరుగుతుండడం, కావలసినన్ని ఫలపుష్పాలు, అన్నిటికంటె దట్టంగా అడవికి దగ్గరగా వున్న పొదలమీది కొమ్మ కొమ్మనీ ఏవో తెలియని పిట్టలు వ్రాలి ఉండడం  -  అలాంటప్పుడు వాడి మనసుకు కలిగే అపూర్వ గంభీరానందాన్ని ఎవరికీ వర్ణించి చెప్పలేడు వాడు! అదేదో స్వప్నం, ఇంద్రజాలం.  నాలుగువైపులా పక్షులు మధురంగా రోదన చేస్తూ ఉంటాయి, జల జల పూర్లు రాలుతూంటాయి. సంజె నీడలు మరింత దట్టంగా అలముకుంటూ వుంటాయి.  

దుర్గ పోయాక ఆ ఇంట్లో, ఆ ఊర్లోనూ ఉండలేక  వెళ్ళిపోతున్నప్పుడు అపూ హృదయాక్రోశం.. నిశ్చిందిపురానికి ఎంతో దూరాన ఉన్న రైల్వే స్టేషన్ లో రైలు స్టేషన్ ని దాటేస్తున్నప్పుడు చాలా రోజుల క్రితం తానూ అక్క దుర్గా కలిసి తప్పిపోయిన ఆవుదూడ ను వెతుక్కుంటూ, రైలు చూడ్డానికి వచ్చిన రోజు గుర్తొస్తుంది అపూర్ కి.  ఊరి చివర పెద్ద జామచెట్టు క్రింద తనూ, అక్కా ఇంత ముఖంచేసుకుని తమ రైలుబండినే చూస్తున్నట్టు అనిపిస్తుంది.

అక్కను ఎవరూ వెళ్ళి తీసుకుని రాలేదు. అందరూ విడిచిపెట్టేసారు.  అక్క చచ్చిపోయినా, తామిద్దరూ కలిసి ఆడుకునే వెదురుతోపులో, మామిడిచెట్ల నీడలో, నిశ్చిందిపురంలోని కూలిపోయేట్లున్న కొంపలో - అక్క స్నేహ స్పర్శ తనకెప్పుడూ సోకుతూనే ఉండేది. కానీ ఇవళే అక్కతో శాశ్వతంగా తెగతెంపులయిపోతున్నాయి నిజానికి ! 

అక్కను ఇహ ఎవరూ ప్రేమించడంలేదు. అమ్మా లేదు, ఎవరూ లేరు, అక్కను విడిచిపెట్టి వస్తున్నందుకు ఎవ్వరికీ విచారమే కలగలేదు.

తర్వాత జీవితంలో వినీలకుంతల సాగర మేఖల అయిన పృధివితో వాడికి, ఘనిష్ట పరిచయం ఏర్పడింది.  కానీ వాడికి శరీరం ఝల్లుమన్నప్పుడు, సముద్రయానంలో ఓడ డెక్ మీద నుంచి వినీలాకాశపు నూతన రూపం కంటపడుతున్నప్పుడు, ద్రాక్షాకుంజవేష్టితమైన ఏ నీలపర్వత సానువో - సముద్రంలో విలీనమౌతున్నట్లుండీ దిగంత ప్రాంతం నుండి   సుదూరంగా పోయి పోయి లీలగా కంపిస్తున్నప్పుడు, దూరం నంచీ భాసాభాసంగా కనిపించే చెలియలికట్ట - ప్రతిభాశాలియైన స్వరకర్త సృజించిన   మధుర స్వరంలాగా మధురాలాపనను వినిపింపజేస్తున్నప్పుడు - అలాంటి సమయాల్లో యెప్పుడూ వానకురుస్తున్న ఒక రాత్రివేళ ఓ పాత చీకటి కొంప లో రోగంతో మంచంలో పడిన ఓ పల్లెటూరి పేదపిల్ల 'అపూ! నయమయి లేచాక నాకొక రోజున ఎప్పుడైనా రైలు చూపిస్తావా ?' అని అడగడం వాడి మనసు లో ప్రతిధ్వనిస్తూనే వుంటుంది.

అన్నిటా ఓడాక సర్వజయ తో నిశ్చిందిపురానికి తిరిగి వెళ్ళిపోయేలా మాటాడాక అపూ "భగవాన్  నువ్వు మమ్మల్ని నిశ్చిందిపురానికి వెళ్ళేట్ట్లు చెయ్యి. లేకపోతే  బ్రతకలేను. నీ పాదాలు పట్టుకుంటాను" అని గుజగుజలాడాక,


పథ దేవత ప్రసన్నంగా నవ్వి ఓయి వెర్రివాడా, మీ ఊరిలోని వెదురుతోపుతో కాని, బందిపోటయిన వీరురాయ్ వటవృక్షం దగ్గరగాని, 'ధల్ చిత్' కాల్వరేవు దగ్గర గానీ నా పథం అంతమయిపోదు.  మీ 'సోనాడాంగా' మైదానాన్ని, ఇచ్చామతి నదిని దాటి, పద్మాలతో నిండివుండే మధుఖాలి తటాకం పక్కనుంచి పోయి, వేత్రవతి రేవును దాటి, సూటిగా, కేవలం సూటిగా - దేశాన్ని వదిలి దేశాంతరాల వైపు సూర్యోదయాన్ని విడిచి, సూర్యాస్తమయం వైపు, పరిచితములైన పరిధులన్నీ అధిగమించి, అపరిచితములైన పరిధులవైపు సాగి పోతున్నదీ పథం.


దివారాత్రాల్నీ, జనన మరణాల్నీ, మాసాల్నీ, సంవత్సరాల్నీ, మన్వంతరాల్నీ, మహా యుగాల్నీ దాటిపోతూనే వుంటుంది.  మీ జీవిత స్వప్నాలు కుక్క గొడుగుల్లా గుంపులు గుంపులుగా తలలెత్తుతాయి

నా వంశం అంతటితోనూ ముగియదు, పోతూనే వుంటుంది - పోతూనే వుంటుంది - ముందుకు సాగిపోతూనే వుంటుంది.

నిదా అనిర్వాణ వీణానిక్వాణం అనంతాకాశంలో అనంతకాలం ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. 

ఈ విచిత్ర ఆనందయాత్రా తిలకాన్ని నీ నుదుట ధరింపజేసి, నిన్ను గృహవిముక్తుణ్ణి చేసి తీసుకువచ్చాను.

"పద, ముందుకు పద.." అంది. (అంటుంది. )


అపూర్స్ ట్రైలొజీ  బిభూతి భూషణుడు రాసిన ఈ పథేర్ పాంచాలీ, అపరాజితో ల ని ఆధారంగా తీసిన మూడు సత్యజిత్ రే సినిమాలు.  మొదటిది ఈ "పథేర్ పాంచాలీ".  అపూ జీవన పథం లో ఎందరో పిల్లలు కలుస్తారు.. చుట్తు పక్కల వాళ్ళ పిల్లలు, కజిన్లు, స్నేహితులు,  తమ కంటే బీదవాళ్ళ పిల్లలు,  దుర్గ స్నేహితులు, తన స్నేహితులు,    ఆ పిల్లల ఆనందాలు,  వాళ్ళలో బీద పిల్లల, అనాధ ఆడపిల్ల ల కష్టాలు చదివి గుండె తరుక్కుపోతుంది.  అయినా కష్టాలనుభవిస్తున్న పిల్లలకి అవేవీ పట్టనే పట్టనట్టుంటారు. అంత అమాయకత్వం!

అపూ లో తండ్రి వారసత్వం గా వచ్చిన చదువూ, చదువు పట్ల ఇష్టం, వాడి బాల్యం, కష్టాలు, చిన చిన్న ఆనందాలు, ఇవన్నీ ఇంతే భాషా సౌందర్యంతో చదువుతున్నప్పుడు మనసు కదలకుండా వుండటం చాలా కష్టం.   ముఖ్యంగా   ఈ అనువాదకుడే  "అపరాజితుడి కథ" ని కూడా అనువదించారంట.   ఈ ఒక్క పుస్తకానికే గుండె పట్టేసి, కొన్ని పుస్తకాల్ని ముగించాక కొన్ని రోజుల వరకూ మనసుల్లోంచీ పోని ఓ తృప్తికరమైన భావన  కలిగి, ఓ లాంటి తన్మయత్వంతో మునిగిపోతుంటే, "అపరాజితుడి కథ" ని చదవడానికి మానసికంగా చాలా శక్తి ని సమీకరించుకోవాల్సొచ్చేటట్టుంది. !  ఆ అనుభూతిని పంచుకుంటూంటే ఎంతో ఆనందం. దీన్ని పరిచయం చెయ్యడానికి ఆ అనుభూతే పనికొచ్చింది.  అందుకే పుస్తకంలోని లైన్లు యధాతథంగా కోట్ చేసాను పైన. 


అంత అత్భుతమైన నిశ్చిందిపురం నుంచీ భరించలేని బీదరికం తరిమేసినా, తల్లి ఒడికి చేరే పిల్లల్లా మళ్ళీ సొంత గూటికి ఒక వేళ వాళ్ళు చేరుకుంటే, ఆ   అపూ, సర్వజయల మిగిల్న కథ ని చదవాలన్న కోరికతో - ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఓర్చుకోవడానికి కావలసిన ధైర్యం, మనో నిశ్చయం వీళ్ళని ఎలా నడిపించిదో చదివి, చాలా ఆనందంతో, దుఃఖం తో,  ఈ అత్భుత పుస్తక పరిచయాన్ని ముగించేస్తున్నాను.

* * *

మొదట పుస్తకం. నెట్ లో ప్రచురించబడింది.

03/09/2017

అంపశయ్య - Nawin



అంపశయ్య మొదటి సారి 1969 లో విడుదలయ్యింది. రచయిత  నవీన్ మొదటి నవల, ఆయన పేరునే అంపశయ్య నవీన్ గా మార్చేసింది. ఫేమస్ వర్క్ ఆఫ్ అ ఫేమస్ రైటర్.  కేంద్ర సాహిత్య ఎకాడమీ ఎవార్డును  గెలుచుకున్న తెలుగు నవల. ఈ మధ్యనే దీని పదకొండో ప్రచురణ (2015) తరవాత  పుస్తకం కొనుక్కోవడానికి కుదిరింది.   మొదలు పెట్టాకా ముగించేవరకూ  ఆలోచనా స్రవంతి లో  ఇక  కొట్టుకుపోవడమే. దీన్నేదో ఛైతన్య స్రవంతి అంటారంట. ఇదో ప్రయోగం అంట.  అలాగా అనుకుంటూ - ఆ ప్రయోగం లో మనమూ కాస్త చెయ్యి వేయడానికి వెళ్ళామా దొరికిపోయామే.  కేవలం రవీంద్ర అనే యువకుడి ఆలోచనలే - వాదనలే - దూకుడే - మొత్తం ఒక భావి నిరుద్యోగి - భావి ఫెయిల్యూర్ -  కాబోయే ఆత్మ హంతకుడి కధ.  ఏవేవో తప్పులు ఒకదాని వెంబడి ఒకటి చేస్తూనే పోతూ, వాటిని ఆపలేక, నిస్సహాయత అనే ఊబిలోకి కూరుకుపోతుండే మానసిక రోగి లాంటి మనిషి రవీంద్ర.  ఇదంతా అతని ఆలోచనా స్రవంతి. భావాల పరంపర.  అతని ఆలోచనలే భాష్యాన్ని చెప్తాయి. ఫ్లాష్ బాక్ ని కూడా.


ఒక రోజు లో జరిగే కధ అంట... హిమజ్వాల లా జ్వలించే ఆలోచనలేనంట అంటూ ముందుకు సాగిపోయామా - వికృతమైన పరిస్థితులు, విచిత్రమైన బూతులు. ఇంగ్లీషు సినిమాలు, తారలు, యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ రొచ్చు అంతా చదవాల్సొస్తుంది.    ఆడపిల్లలు ఎలా చదువుతారో ఈ పుస్తకాన్ని అని కొందరన్నారు.    ఈ బూతులు - ఈ సెక్స్ వర్ణనలు, కాలేజీ కుర్రాళ్ళ ప్రగల్భాలు, అన్నీ ప్రయోగాలేనా ? ఈ ప్రయోగం అసలు మంచిదేనా ? తమ తో పాటూ చదువుకునే ఆడపిల్లల గురించి ఇంత అసహ్యంగా మాటాడుకునే కుర్రాళ్ళే తమ ఇళ్ళలో చెల్లెళ్ళనీ, పెళ్ళాలనీ కాలేజీ గుమ్మాలు ఎక్కించనిది. ఒక వేళ వాళ్ళు చదువుకున్నా, ఉద్యోగాలు చేసినా - తమ ఇష్టాల మీద పెళ్ళాడదలచుకున్నా పరువు హత్యలు చేసేది - అని కోపం కూడా వస్తుంది కొన్ని పాత్రల్ని చూస్తే.   అయినా ఈ పుస్తకం 60 ల కాలం నాటిది. కొత్త దేశం, కొత్త విశ్వ విద్యాలయాలు, పాతదే అయిన పేదరికం, పురాతనమైనదే అయిన వర్ణ వ్యవస్థ, అంతకంటే ఎక్కువ గా మన రక్తాల్లో ఇంకిపోయిన భూస్వామిత్వం, బానిసత్వం, కొత్తగా కొమ్ము విదిలిస్తున్న ఆశే లేని నిరుద్యోగం.  అందుకేనేమో - ఈ ప్రయోగాలు మంచివి. మనుషులు ఇలా ఎందుకు ఆలోచిస్తారు, ఎందుకు ప్రవర్తిస్తారు అని ఆలోచించగలిగేలా చేస్తాయి ఈ ప్రయోగాలు.


60 లలో ఉస్మానియా యూనివర్సిటీ లో పీజీ చెయ్యడానికి వరంగల్ నుంచీ వచ్చి చేరిన ఒక బ్రైట్ స్టూడెంట్ హీరో  రవీంద్ర.  కానీ యూనివర్సిటీ రాజకీయాలూ, నగరపు ఆకర్షణలు,  సినిమాల వ్యామోహం  మధ్యా, అంతదాకా ఉర్దూలోనే బోధన సాగించి ఈ మధ్యే ఆంగ్లం లోకి దూకిన ప్రొఫెసర్ల పాఠాలు తలకెక్కక,   చదువు నుండీ పారిపోవడానికీ, పాడైపోవడం వైపు పయనించే 'సిటీ ' పోకళ్ళు తెలియని 'ఊరి' వాడు.   అరవైలలోనే కాలేజీ లో, యూనివర్సిటీలో చదివే అమ్మాయిలు, వాళ్ళ శరీరాలు, ప్రేమలూ, వర్ణనలు,  లావెటర్లీల్లో బూతు సందేశాలు, హాస్టల్లో రక రకాల మనుషులు, రవీంద్ర ని అదో లా చూసే (గే ) గుర్నాధం, రవి చూసిన సినిమాలు, అప్పట్లో వియత్నాం యుద్ధం గురించి, నెహ్రూ విధానాల గురించి కాలేజీ కుర్రాళ్ళ వాదనలు, వాళ్ళు వాడే ఇంగ్లీషూ, ప్రతీ కేరక్టరునూ రచయిత పరిచయం చేసిన తీరూ అవీ చాలా బావున్నాయి. ప్రతీ దానికీ ఓ కనెక్షన్. 


రవి ఆలోచనల్లో, అతను చూసే పీడ కలల్లో, అతని నైరాశ్యంలో, అతను ఊర్లో తల్లి నీ తండ్రినీ, చెల్లెల్నీ తల్చుకుంటూ బాధపడే తీరులో తాను ఎందుకూ పనికిరాకుండా తయారు కావడం గురించి, పరిక్షల గురించి విపరీతంగా భయపడుతూనే, అస్సలు చదవలేక తీవ్ర నిస్పృహ లో ఉంటూనే, కాలేజీ బ్యూటీ కిరణ్మయి కోసం వెంపర్లాడిపోతూ, ఆమె ను తను పొందడం అనేది సాధ్యం కాదని తెలుసుకుంటూనే, చాలా ప్రాక్టికల్ గా ఉండే ఆ అమ్మాయి వెంట ఎడారి లో ఒయాసిస్ లో పరిగెట్టినట్టు పరిగెట్టేస్తూ, రవి!  మూడు నెల్లు గా మెస్ బిల్ కట్టకపోవడం వల్ల తింటానికి తిండి లేక, మల మల మాడిపోతూ కూడా పలాయన వాదం వైపు, గుర్నాధం దగ్గర చేసిన అయిదు రూపాయల అప్పుతో పరిగెట్టేస్తూండే రవి!


ఈ రవి కధ  ఇది. దీన్లో ఉస్మానియా లో పిల్లలు మాటాడుకునే ఆంధ్రా తెలంగాణా వేర్పాటు వాద సంభాషణలున్నాయి. రవి హృదయం ఎంత గొప్పదో - "మనం యూనివర్సిటీ విద్యార్ధులం అర్రా.. ఇలా సంకుచిత భావాలేంటి మనకి - ఈ నేల మనది (రవి తెలంగాణా అబ్బాయి) అనుకోవడం ఎంత మూర్ఖత్వం? ఈ దేశం మనది రా" అంటాడు.  తన ముందరే అత్యంత అసహ్యంగా అమ్మాయిలను కామెంట్ చేసే సహ విద్యార్ధుల ని చూసి చిన్నబుచ్చుకుంటాడు.  వీళ్ళా నా స్నేహితులు అని నిరాశ పడిపోతాడు.  నవల ముగిసే సరికీ తనని ఆప్యాయంగా అభిమానంతో చూసే గుర్నాధాన్ని విపరీతంగా అసహ్యించుకునే మనిషి కూడా "మనిషి" లా మారతాడు. పాపం దేవుడు వాణ్ణలా చేసాడు. దానిలో వాడిదేం తప్పు అని జాలిపడతాడు. 


ఆకలి చంపేసిన విచక్షణ నుంచీ,  ఇతరుల మానవత్వపు ఓదార్పు పొందడం వల్ల మానసికంగా పరిపక్వం చెందాకా,  పరిణితుడై,,తన సహచరుల్లో దోషాల్నీ, ఒప్పుల్నీ సమానంగా స్వీకరిస్తాడు. "వరంగల్ లో అమాయకపు, నిర్మలమైన స్టూడెంటు జీవితానికీ, హైదరాబాద్ లో ఒకడి గొంతు ఇంకోడు కోసేసుకునే cut throat కాంపిటీషన్ కీ, సామ్యమే లేదంటూ, నీ జీవితం, నీ చదువు మీద దృష్టి పెట్టు - భయపడవు బాగుపడతావు. నీ మీద ఆశలు పెట్టుకున్న నీ కుటుంబం కోసం " అంటూ  కాలేజీ రోజుల్నాటి ఫేవరెట్ లెక్చరర్ చెప్పిన   హితవు విని, ఇంక పరీక్షలు రాబోతున్నాయి కాబట్టి ఎలా అన్నా బాగా చదివి మంచి మార్కులు సంపాయించుకోవాలన్న ఆశావహ దృక్పధానికి ప్రయాణించే దాకా మనని తనతో పాటూ ప్రయాణింపచేసేసే రవి. ఎంత బావుంటాడో. తన బలాలూ, బలహీనతలతో పాటూ.


రవి మనసులో కొన్నేళ్ళుగా ఆరని గాయం రత్తి - వాళ్ళ ఊళ్ళో ఉండే బీద అమ్మాయి. ఆ అమ్మాయి కధ చాలా బాధ పెట్టేస్తుంది. ఆ అమ్మాయి నిస్సహాయత కి తానూ కారణం అనే స్పృహ, ఆమె మరణం తరవాత ఈ కుర్రాడిలో కలిగిన గిల్త్, మానవత్వం వర్ణనాతీతం. సహాధ్యాయి ఒకడు ఒక బిచ్చగత్తె నగ్నత ని ఫోటో తీసి చూపించినప్పుడు - వెళ్ళగక్కేసిన ఆక్రోశం,  రత్తి మీద తనకున్న ఆప్యాయత, ప్రేమ, సాంఘిక కట్టుబాట్లు, తన మీద తనలో పేరుకుపోయిన న్యూనత,  మానసిక సంఘర్షణ - గ్రేవ్ దాకా తీసుకుపోతానేమో అన్న రత్తి సీక్రెట్ ని, గిల్ట్ నీ స్నేహితునితో పంచుకున్నాక మనసు విచ్చుకుని, దాన్లోకి వెలుగు ప్రసరించడం మొదలవుతుంది. . ఇవన్నీ చదివాక ఈ అబ్బాయి అసలు సిసలు అబ్బాయి కదా అనిపిస్తుంది. మానవత్వం నశించినవాడు మనిషే కాదు గాబట్టి.


రచనా కాలం గడిచి ఇన్నేళ్ళయినా, ఇప్పటికీ ఎందరో తెలివైన, ఆదర్శవాద విద్యార్ధుల డిప్రెషన్లకి, ఒత్తిళ్ళకీ మానసిక దౌర్బల్యాలకీ అద్దంపట్టే రచన.  ఇన్నాళ్ళ తరవాత కూడా విద్యార్ధుల ఉద్యోగాల మార్కెట్ లో చెల్లని కాణీల్లాంటి విలువలూ, ఆదర్శాలూ ఇప్పటికీ ఈవ్ టీజింగ్ కి ఆడపిల్లలు గురవ్వటాలూ, ఇప్పటికీ పిల్లల చదువు కోసం తల్లితండ్రులు కొవ్వొత్తుల్లా కాలిపోవడాలు, అన్నీ ఇప్పటికీ అవే దృశ్యాలు.

ఏదేమైనా Cruel life కి కాస్తంత సహాయం చేసిన స్నేహ హస్తాల గొప్పతనం, మంచితనం చక్కగా కళ్ళకి కట్టేసారిందులో. సముద్రంలో నీటిబొట్టంత కరుణ కూడా దొరక్కపోయి కదా జరిగేవి ఈ ఆత్మహత్యలు.   నిరాశా నిస్పృహలలో కూరుకుపోయి ఆత్మహత్యే శరణ్యం అనుకుని, అమ్మో! నేను ఆత్మహత్య చేసుకుంటే మా అమ్మ గుండె పగిలి చచ్చిపోదూ అని భయపడిపోయే వెర్రి కొడుకు, దారులన్నీ మూసుకుపోయి, మానసికంగా ఓడిపోయిన విద్యార్ధికి,   దొరికిన ఆలంబన అతని స్నేహితులు.   వాళ్ళు అనాలోచితంగానూ, ఆలోచించుకునీ చేసిన చిన్న చిన్న పన్లు, చేసిన మాట సాయాలూ.. వీడి మంచితనాన్ని గౌరవించే చిన్ని చిన్ని gestures ;    అవి ఎంత గొప్ప Transformation  తీసుకొస్తాయో జీవితంలో - ఒక్క ధాటి గా చదివించేస్తుందీ అంపశయ్య!


ఆకల్తో అలమటించేస్తున్నప్పుడు రోడ్డు వార హోటళ్ళలో బిర్యానీ తినే వాళ్ళ ప్లేట్లు లాక్కుందామా అని చూసే మనిషి, మెస్ బిల్లు డ్యూ కట్టకపోతే హాల్ టికట్ ఎలా వస్తుందా అని భయపడే మనిషి. మూడొందల కోసం తండ్రి ఎవరి కాళ్ళు ఎలా పట్టుంటాడో తెలీక భవిష్యత్తు పట్ల బిక్క మొహంతో చూసే మనిషి,  నకనకలాగే ఆకలితో,  ఆఖరికి వరంగల్ రోజుల్నాటి లెక్చరర్ గారింటికి వెళ్ళి వాళ్ళిచ్చిన బోర్న్ వీటా తాగి, బలం పుంజుకుని, ఆయనిచ్చిన ప్రోత్సాహంతో హాస్టల్ కు చేరి చదువుకు ఉపక్రమించేదాకా  ఇప్పుడో అప్పుడో ఆత్మహత్య చేసుకోబోయిన మనిషి. కానీ ఈ చిన్న సంఘటన అతని దృక్పధం లో మార్పు తీస్కొస్తుంది.   అంతవరకూ వివిధ లోపాలతో తన చుట్టూ చేరే స్నేహితుల, హాస్టల్ మేట్ల పట్ల అతని ఆలోచనల్లో మార్పు రావడం,  అందరూ కలిసి రవిని తీవ్రంగా భయపెట్టేస్తూండే కాంపస్ రౌడీ రెడ్డి గాంగు ని ఎదుర్కోవడం - అన్నీ కేవలం ఒక విద్యార్ధి జీవితంలో ఒక్క రోజులో కలిగిన మార్పు.  ఆశ్చర్యం.


ఒక డిప్రెస్డ్ వ్యక్తి కి తన మీద, తన ఖర్చుల మీద, నోటి మీద అదుపు లేని ఫక్తు నెగెటివ్ వ్యక్తి ఆలోచన పరంపరల్లో పచ్చి బూతులతో - సాటి విద్యార్ధినుల దగ్గర్నించీ స్త్రీ లంటే కలిగే అంతు లేని సెక్సు ఆలోచనల్లో - తోటి విద్యార్ధినుల పట్ల వాళ్ళ కుండే అమూల్య అభిప్రాయాలూ (ఈమె అందమైనదో కాదో ఇంకా నిర్ణయించుకోలేదు - తరహా)  ఇవన్నీ విసుగ్గా వికృతంగా అనిపించినా ఒక్క ఔట్బర్స్ట్ తరవాత రవీంద్ర అసలు మనసు బయటపడి  - అతని మానవత్వం బయటపడి, అతనిలో కాస్త పాసిటివ్ దృక్పధం కనిపించాకా, హమ్మయ్య అనిపిస్తుంది.   అంతవరకూ ఆలోచనల, పరిస్థితుల అంపశయ్య పై చాలా బాధనీ, వ్యధనీ అనుభవించిన రవీంద్ర - మెల్లగా తనని తాను రక్షించుకోగలడు అన్న నమ్మకం కలిగాకా పాఠకుడిలో కాస్త ప్రశాంతత కలుగుతుంది.



తెలుగులో మెదడు ని స్టిమ్యులైజ్ చేసే రచనలు - కేవలం కొన్ని ఆలోచనల ప్రకటన గా జరిగే రచనలు ఎన్నున్నాయో నాకు తెలీదు.  ఈ అంపశయ్య మాత్రం గొప్ప రోలర్ కోస్టర్ రైడ్.  రచయిత మిగిలిన రచనలు కూడా ప్రయత్నించాలనిపించేంత బావుంది.


***

First appeared in pustakam.net,  http://pustakam.net/?p=19809

ఈ పుస్తకాన్ని తెలుగులో "కాంపస్ అంపశయ్య" అనే పూర్తి నిడివి సినిమా గా తీసారు.

ఇంకా... అంపశయ్య - పూర్తిగా తెలుగులో ఉండదు. అన్ని పాత్రలూ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతూ, పోట్లాడుతూ, ఆలోచిస్తూ ఉంటాయి.  అది కూడా మంచి భాష లో.