ఇవన్నీ - 'పుస్తకం' అనే ఓ 'వింత వస్తువ' మాయ లో జరుగుతూంటాయి. లోకమంతా ఒక 'మాయ' ఐతే, పుస్తకం ఒక 'విష్ణుమాయ'! చాలా మంది పుస్తక ప్రియులకి పుస్తకాలు వేన వెర్రిగా కొనడం అలవాటు. కొందరు కేవలం 'అలంకరణ కే ' కొంటారు. కొందరు పుస్తకాల్ని బహుమతులు గా ఇస్తూంటారు. కొందరు కొన్ని "అత్భుత పుస్తకాల్ని" ఎంతో అపురూపంగా దాచుకుంటారు. కొందరు పుస్తకాల కి పెట్టినంత ఖర్చు ఇంకే వస్తువకీ పెట్టరు. కొందరు పుస్తకాలు అరువివ్వరు. కొందరు (99.9% మంది) అరువు తీసుకున్న వాళ్ళు వాపసు ఇవ్వరు. పుస్తకం 'పోయిందీ - అనగా వాపసు రాలేదు, రాదు!' అని రియలైస్ అయిన్నాడు అన్నం సహించకపోవడం చాలా మందికి అనుభవం. కొన్ని అపురూపమైన సెంటిమెంట్లు అతుక్కున్న పుస్తకాలుంటాయి. రచయిత స్వయంగా సంతకం చేసిచ్చినవి, ఫలానా పాండీ బజారులో మండుటెండలో రోడ్డు పక్కన కొన్నవి, ఎవర్నో బ్రతిమలాడి ఎక్కడ్నించో తెప్పించుకున్నవి - ఇలా. ఎవరి లైబ్రరీ వారికి అపురూపమైన గని. పుస్తకం మహా మాయ. ఆ మాయ లోంచీ బైటపడ్డం కష్టం.
ఫలానా 'పుస్తకం మా దగ్గరుంది, ఫలానా 'పుస్తకం' చదివానూ అని చెప్పుకోవడం కొందరికిస్టం. ఏదో ఒక పుస్తకం చదివి ట్రాన్సు లోకి వెళిపోయి, అదేదో లోకాన్ని సొంతంగా సృష్టించేసుకుని, తీవ్రంగా అభిమానించే జనం కొందరు. వీటన్నిటిలో, పుస్తకాన్ని పక్క వాడికి పంచడం అనే పెద్ద హృదయం చాలా తక్కువ మందికి వుంటుంది.
ప్రతి పుస్తకానికీ ఒక చరిత్రుంటుంది. సాధారణం గా మన దగ్గర ఏదైనా పుస్తకం తాలూకూ కాపీ అదనంగా ఉన్నపుడు ఏ స్నేహితులకో గిఫ్ట్ గా ఇస్తాం. కొన్ని చదివినా నచ్చని పుస్తకాలూ ఉంటాయి. కొన్ని చదివి, ఇంకోరితో చదివించేంత మంచి పుస్తకాలూ వుంటాయి. కొందరు పుస్తక ప్రియులకు, ముఖ్యంగా వృద్ధాప్యం లో వున్న వాళ్ళ దగ్గర కుప్పలు గా పేరుకుపోయిన అమూల్య సంపదని పరిరక్షించే స్పూర్థి ఉన్న వారసులు ఉండకపోవచ్చు. పుస్తకం తాలూకూ ధన్యత అది నలుగురు చదివితేనే కదా చిక్కేది. పుస్తకం షెల్ఫుల్లో పడి ధూళి పేరుకునే బదులూ, దాన్ని నమ్మకంగా చూసుకునే ఏ లైబ్రరీ కో ఇద్దామని చాలా మందికి వుంటుంది.
కొందరు పుస్తకాల్ని ఇష్టం వొచ్చినట్టు పేర్చి, నాశనం చేస్తారు. లైబ్రరీ సైన్సు చదువుకున్న వాళ్ళనడగండి. పుస్తకాన్ని ఎంత భద్రంగా చూసుకోవాలో. నాకు తెలిసి ఒక పెద్దాయన, అపురూపమైన తెలుగు వాగ్మయాన్ని ట్రంకు పెట్టెల్లో సంవత్సరాలు గా పెట్టి ఆఖరికి చెదల పాలు చేసారు. ఆయన పోయాకా, పెట్టె తెరిచి చూస్తే, పిండే మిగిలింది. ఆయన కి ఆ పుస్తక సంపద అంటే తెగ మోహం. ఎవరికీ ఇచ్చేవారు కాదు. అపుడపుడూ రిఫర్ చేసే వారేమో గానీ, ఎందుకనో అవన్నీ పాడైపోయాయి.
కొందరికి ఇంట్లో ఎటు చూసినా పేరుకు పోయిన పుస్తకాల్ని చూస్తే విసుగ్గా వుంటుంది. ఎప్పుడో ఫ్రస్ట్రేషన్ లో అన్నీ తూకానికి వేసినా వెయ్యొచ్చు. కొందరికి కొన్ని కాలక్షేపం నవలల్ని వొదిలించుకోవాలనుంటుంది. ఇవీ చాలా మటుకూ, తూకానికో, విదేశాల్లోనైతే, రీ సైక్లింగ్ కో పడేస్తారు.
వీటన్నిటికీ పరిష్కారంగా ఒక సోషల్ నెట్ వర్కింగ్ బుక్ క్లబ్ ని ఎవరో పుస్తకప్రియులే కనిపెట్టారు. దీని పేరు 'బుక్ క్రాసింగ్'. ఈ క్లబ్ లో చేరిన పుస్తకాలు ప్రపంచం అంతా ప్రయాణిస్తాయి. దీన్లో చేరిన సభ్యులు తమ పుస్తకాల్ని ఒక సైట్ లో రిజిస్టర్ చేసుకుంటారు. చేరిన ప్రతి పుస్తకానికీ ఒక యూనిక్ బుక్ క్రాసింగ్ ఐడీ నెంబరు ఇస్తారు. ఇది పుస్తకానికో గుర్తు అన్న మాట. మీరు ఇతరులతో షేర్ చేసుకోవాలనుకునే పుస్తకాన్ని ఆ ఐడీ ఒక లేబుల్ పై రాసి, మీ ఇష్టమైన పబ్లిక్ ప్లేస్ - సాధారణంగా పుస్తకం ఏమిటా అని చూసే వ్యక్తులు తారసిల్లొచ్చు అనుకునే ప్రదేశాల్లో, ఉదాహరణ కి - పబ్లిక్ లైబ్రరీల్లో / ఆర్ట్ గాలరీల్లో / కాలేజీ లో / బస్ లో / ట్రైన్ లో / విమానాశ్రయం లో - అలా విడిచిపెట్టొచ్చు. దీన్ని తరవాత ఎవరో మనం ఎరుగని వ్యక్తి మనం ఎరుగని టైం లో చూడొచ్చు. ఆసక్తి ఉంటే, ఆ పుస్తకాన్ని తీస్కెళ్ళి చదువుతారు. లేదా వొదిలేస్తారు. అలా చదివిన రీడర్ మళ్ళీ, ఆ పుస్తకాన్ని వేరేఅ చోట విడిచిపెట్టొచ్చు. పుస్తకం దొరికిన తరవాత, బుక్ క్రాసింగ్ సైట్లో కి వెళ్ళి, పుస్తకం ముందున్న యూనిక్ ఐడీ నెంబర్ ని ఎంటర్ చేస్తే, మనకు పుస్తకం చరిత్రా తెలుస్తుంది, సైటు వాళ్ళకు / పుస్తక దాత కు పుస్తకం జాడా (ఎవరో ఒకరు చదివారన్న తృప్తి) దొరుకుతుంది. ఇది పూర్తిగా ఉచితం, ఎక్కువ స్వంత సమాచారం ఇవ్వనక్కర్లేదు గాబట్టి క్షేమం కూడా.
సడన్ గా ఏ బస్ లో నో మీకో మంచి పుస్తకం దొరికిందనుకోండి ! ఎంత థ్రిల్ అవుతారు ? అలానే ఆ విషయం దాత కి సైట్లో తెలియజేస్తే, దాత కూడా థ్రిల్ అవుతారు. పుస్తకం ఒక మంచి నేస్తం. ఈ పుస్తకాల ద్వారా మనం మరిందరు మనుష్యులతో ఒక లాంటి స్నేహమే చేస్తున్నాం. పుస్తకాన్ని మరో మనిషి తో పంచుకోవడం ద్వారా ఒక లాంటి మానవీయ బంధమేదో ఏర్పరుచుకుంటున్నం. ఈ సైట్ లో చేరడం ద్వారా మన పుస్తకాలకి రెక్కలిస్తాం. (మళ్ళీ మన దగ్గరికి రావనుకోండి. పుస్తకాలు మనల్ని విడిచి వెళ్ళిపోతాయి).
ఇదో చెత్త కాన్సెప్ట్. మన దేశం లో వర్క్ ఔట్ కాదేమో అని అనిపిస్తూందా ? ఎంత వీలయితే అంత.. చూద్దాం అనే పద్ధతి లో నైనా ఈ పద్దతిని మనం కూడా మొదలు పెట్టొచ్చు. ఇంటర్నెట్ వాడకం మన దేశం లోనూ ఎక్కువయింది. సోషల్ నెట్ వర్కింగ్ అయితే లెక్కే లేదూ. ఏమో చెప్పలేం. మన దేశం లోనూ హిట్ కావచ్చు. పైగా పబ్లిక్కు కి మంచి పుస్తకాల్ని దానం చెయ్యడం చాలా మంది వల్ల కాదనుకోండి. ఇలాంటి 'ప్రయాణించే పుస్తకాలూ బహుశా చాలా మంది 'వొదిలించు కుందామనుకునే రకం చెత్త పుస్తకాలేమో ' అని సందేహం కూడా రావచ్చు. ఇవన్నీ తెలుసుకోవాలంతే, ఈ సైట్ ని ఓసారి దర్శించొచ్చు.
వీళ్ళు చెప్తూన్న లెక్కల ప్రకారం, ప్రపంచ వ్యాప్తం గా ఈ (ప్రపంచ పుస్తక భాండారం అనొచ్చు) 9,667,897 పుస్తకాల్ని 1,807,007 గురు సభ్యులు షేర్ చేసుకుంటున్నారు. సరే. అన్నిట్నీ గాలికి వొదిలేయక్కర్లేదు. ఇష్టమైన పుస్తకాల్ని సభ్యులతో షేర్ చేసుకోవచ్చు. సైట్ వాళ్ళు నిర్వహించే పుస్తక సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇంకా, ముఖ్యంగా, కొనుక్కో బోయే పుస్తకాల మీద డిస్కౌంటు పొందొచ్చు. 'అరుదైన పుస్తకాల్ని సేకరించొచ్చు.
ఇలా పుస్తకాల్ని పంచుకోవడం ద్వారా, చాలా సంతోషాన్ని పొందే వాళ్ళు ఎందరో వున్నారు. ఒక చిన్న అడుగు అటు వేద్దామనుకునే వాళ్ళ కోసం ఈలింకు : http://www.bookcrossing.com/about
పుస్తకాల్ని షేర్ చేసుకోదలచుకుంటే, వీళ్ళ సహాయంతో మొదట పుస్తకాన్ని లేబుల్ చెయ్యాలి. ఈ బుక్ క్రాస్ సభ్యులు మన దేశం లో కూడా వున్నారు. (ఓ తొమ్మిది పుస్తకాలనుకుంటాను - ప్రయాణిస్తున్నాయి మన దేశం లో కూడా) పుస్తకాల పురుగులు పుస్తకాలు కేవలం చదువుతాం అనుకునేవాళ్ళు కూడా స్వాగతం. అదీ దీని సంగతి.
PS: నాకెలా తెలిసిందనుకుంటున్నారా ? మొన్న నాకో పుస్తకం మా వూరి మ్యూజియం లో దొరికింది. ఏమిటా అని తెరిచి చూస్తే, ఒక లేబుల్ - దాని మీద, 'మీకిష్టమైతే ఈ పుస్తకాన్ని తీసుకోండి చదవండి, మా సైట్ ని దర్శించండి - అని ఒక నోటూ, పుస్తకం జాతక చక్రం తాలూకూ ఐడీ నెంబరూ కనిపించాయి) పుస్తకం చదవలేదింకా. కానీ సైట్ చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించి, టైం కుదరగానే ఇలా బ్లాగుతున్నా. అది విష్యం.
ఆన్లైన్ లో సాఫ్ట్ కాపీల్ని పంచుకోవడం లా కాకుండా, "నిజ (అంటే ??!) జీవితం" లో నిజం పుస్తకాల్ని పంచుకోవడం - అంత ఎథికల్ విష్యం కాపోవచ్చు వ్యాపారాత్మకం గా. కానీ 'మంచి తనం ', 'మంచి ఉద్ద్యేశ్యం ', 'పుస్తకాల్ని పంచుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం', 'పుస్తకాల ద్వారా స్నేహితుల్ని సంపాదించుకోవడం', 'మనిషి కి మనిషి కనెక్ట్ కావడం", కొంచెం మంచి విషయాలు గా తోచాయి.
ఇలాంటి ఇతర ప్రముఖ పుస్తకాలు పంచుకునే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఎవరికన్నా తెలిస్తే తెలియపరచకలరు. (నాకు తెలీటం ఇదే మొదటి సారి కాబట్టి ఇంకా ఎక్కువ సైట్లు ఏమన్నా ఉన్నాయేమో అనే ఆసక్తి ఉంది.)