Pages

23/03/2010

విచిత్ర వ్యక్తి (The Mysterious Stranger)




మనిషి - ధర్మా ధర్మ విచక్షణ ఉన్న జంతువు. జంతు లోకానికెల్ల సాధువు. అనంత సృష్టి లో అన్ని ప్రాణుల్లోకీ తెలివయిన వాడు. నాగరికుడు. పుణ్య పాపాల ఖాతరున్నవాడు. సంఘ జీవి. ధార్మికుడు. మార్మికుడు. దేవుణ్ణి ప్లీస్ చేసి, స్వర్గం లో ప్లేస్ కొట్టేసి, ఏ రంభ తోనో ఫ్రీ గా మదిరా సేవనం చేస్తూ పరలోకంలో కాలం గడిపెయ్యలని స్థూలంగా ఏ మతానికి చెందిన మనిషయినా ఇహలోకంలో తెగ తాపత్రయయపడుతూ ఉంటాడు. దేవుణ్ణి మెప్పించేది ధర్మ మార్గమే. 

అయితే ధర్మానికి ఒక్కో కాలంలో ఒక్కో నిర్వచనం ఉంది. హిందూత్వం లో (హిందూ మతం లో) - త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, .. అలా ఒక్కో యుగంలో ధర్మం నీరసిస్తూ వచ్చి, కలియుగం వచ్చేసరికి, నీరసించి కళ్ళు తేలేస్తుంది. అందుకే ఏవైనా ఘోరం జరిగితే, మనవాళ్ళు 'కలిధర్మం.. కలియుగం నాయనా !'  అని గునుస్తుంటారు. ధర్మం అంటే ఒక రూల్. ఇది మంచిది, ఇది కాదు అంటూ చెప్పే ఒక ఇది. 

అయితే ఈ ధర్మాన్నంటుకునే న్యాయం, అన్యాయం అంటూ కూడా ఉన్నాయి. ఒకపుడు బిచ్చమెత్తుకోవడం నేరం. బిచ్చగాళ్ళు, కడుపేదలు, అన్ననికి బిచ్చమెత్తుకుంటే, వాళ్ళని తీస్కెళ్ళి న్యాయం పేరిట వధించడం జరిగేది. పాశ్చాత్య లోకంలో మధ్య యుగాలలో నేరాలకి ఘోర శిక్షలుండేవి. మంత్రగత్తెలని అనుమానం వచ్చినాళ్ళని నిట్టనిలువునా సజీవంగా చంపేసేవారు. అసలు ఏ నేరానికైనా అమానవీయ, రాక్షస శిక్షలు ఉండేవి. నిలువునా, ప్రాణమున్న మనుషుల్ని చీరడం, ఫిరంగులకి కట్టి పేల్చడం.. ఇలా శిక్ష అమలుచేసే విధానాల్లో ఇప్పటికీ ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లోనూ కౄరత్వం - కొనసాగుతూనే ఉంది. 

దైత్యులంటే భయపడే మనల్ని (మానవులని)చూసి దైత్యులేమనుకుంటారో ఎవరైనా ఊహిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పటికీ యుద్ధాలూ, టెర్రరిజం, ఇంకేదో ఇజం.. ఇంకేదో రొచ్చు అనుకుంటూ, నిత్యం వేలాది మంది మన సాటి మానవుల్ని శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేస్తున్నదీ, అమానుషంగా చంపుతున్నదీ ''మనిషే''. ఇందులో 'అ-మానుషం' అంటూ ఏమీ లేదనీ.. మనిషి నైజమే అమానుషత్వమనీ ఒక సైతాను తేల్చిచెప్తే ఎలా వుంటుంది ? 

 మార్క్ ట్వెయిన్ రాసిన ఈ క్లాసిక్ ని ఇంతకుముందు (మూలం) చదవలేదు. మొన్నామధ్య హీరో వచ్చి నండూరి రామ్మోహన్ రావు గారి అనువాదం 'విచిత్ర వ్యక్తి' తెచ్చి ఇచ్చాకా, ఇన్నాళ్ళకి కుదిరింది. చదివాకా, అబ్బురం .. ఆశ్చర్యం, ఆనందం లాంటి ఫీలింగ్స్ అన్నీ ఒక్కసారి కమ్ముకున్నాయి. ఇంతోటి సాటిస్ఫేక్షన్ కలిగించిన ఈ బుల్లి పుస్తకాన్నీ దాచుకుని, మా బుజ్జాయికి ఈ కధ అర్ధం చేసుకునే వయసు వచ్చాకా చదివించాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే, కావడానికి ఇది పిల్లల కధే అయినా, సారాంశంలో ఎంతో డెప్త్ ఉంది. 

పిల్లల కధ కదా, పిల్లలే హీరోలు. వీళ్ళు ముచ్చు ముగ్గురు. దయ్యాలంటే భయపడని ఈ పిలకాయల దగ్గరకు సైతాను (ఒకప్పుడు దేవత అయిన సైతాను దేవునితో విభేధించి, నరకంలోకి తోయబడతాడు - అప్పణ్ణించీ మనుషుల ను సైతాను వశపరచుకుని, వాళ్ళని దేవుని దారి నుంచీ తప్పించి నరకంలో పాపులేషన్ పెంచాలని ప్లాన్లో ఉంటాడు. కాబట్టి సైతాను అంటే మనుషులకి భయం) అన్న కొడుకొకడు (ఇతని ఇంటిపేరూ సైతానే కదా మరి) పరిచయం అవుతాడు. ఈ సైతాను అపుడపుడూ కనిపిస్తూంటాడు. వింతలు చేస్తుంటాడు - మిగతా వారికి అదృశ్యంగా ఉండి, ఈ ముగ్గురు పిలకాయలకు మాత్రమే కనిపిస్తూ, వీళ్ళతో స్నేహిస్తూ, తానూ వినోదిస్తూ, జీవితం అంటే విపులంగా ఏవేవో చెప్తూ ఉంటాడు. 

సైతాను అంటే అభిమానం పిల్లలకి. కానీ సైతాను అభిప్రాయాలు చూసి భయపడుతుంటారు. సైతానుకు మానవత్వం లేదు. మనుషులంటే పురుగులుగానో, కీటకాలుగానో భావన. నయా పైసా అభిమానం వుండదు. అసలు ధర్మాధర్మ విచకషణ వున్న ఏ ప్రాణి అన్నా సైతానుకు మంట. సైతాను తన ఆనందంకోసం మనుషుల్ని ఘోరాలకు గురిచేస్తుంటాడు. తనే ఒక చిన్న లోకం సృష్టించి, పిల్లలు చూస్తుండగానే ఆలోకంలో భూకంపం పుట్టిస్తాడు, తను సృష్టించిన మానవుల్ని తానె కౄరంగా చంపి వినోదిస్తాడు. 

అయితే, సైతాను చేతలకి ఒక అర్ధం ఉంటుంది. ఎందుకంటే, ధర్మం అనే ఒక బ్రహ్మపదార్ధాన్ని పట్టుకుని, దాని ముసుగులో సాటి మానవుల్ని చంపుకు సాధించే మానవజాతి అంటే సైతానుకు కోపం. ఈ ముగ్గురు పిల్లలూ సైతాను స్పెల్ లో ఉండినా, సైతాను ఆలోచనలతో కొద్దో గొప్పో విభేధిస్తున్నారు. అయినా వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ కళ్ళముందు జరిగిన కొన్ని సంఘటనలు మనుషుల దారుణ మనస్తత్వాల గురించి తెలిసేలా చేసి, పిల్లల కళ్ళు తెరుచుకుంటాయి. అయితే మనుషులకి మేలు చెయ్యాలంటే, సైతాను ఎంచుకునే మార్గం విచిత్రంగా వుంటుంది. ఒకసారి ఈ మువ్వురిలోనే నికాలాస్ అనే కుర్రాడికి మేలు చేసేందుకు నికోలాస్ ని మృత్యువుకు అప్పగిస్తాడు. మృత్యువు మనిషి బాధలకీ, కష్టాలకీ ఆఖరి మజిలీ అని సైతాను వాదన. 'విచిత్ర వ్యక్తి' మిస్ కాకూడని పుస్తకం.

నండూరి వారి అనువాదం కట్టిపడేసే సమ్మోహకత్వంతో - సైతాను వాదనను పిల్లల సంఘర్షణనూ - హేతుబద్ధంగా మన ముందుచుతుంది. వివిధ సంఘటనల అల్లిక, సైతాను కొంటె చేష్టలు, సైతాను నిరంకుశత్వం - హేతువాదం - ఇవన్నీ నమ్మశక్యం కాని ఏదో లోకంలోకి - యాలీస్ లాగా మన చేతులు పట్టుకుని లాక్కుపోయి చివరి పేజీ కొచ్చేసేరికీ సైతాను సిద్ధాంతంతో అంగీకరించేలా చేస్తాయి. సైతానుకు వచ్చిన సందేహాలే చిన్నపుడో, పెద్దపుడో, మనకూ వచ్చుంటాయి. దేవుడు కొందర్ని మంచిగా, కొందర్ని బీదగా, కొందర్నే ఆరోగ్యంగా, కొందర్ని ఆయుక్షీణంగా ఇలా ఎందుకు చేస్తాడు ? మనమంతా దేముని బిడ్డలే అయినపుడు ఆయన ఎందుకిలా కొందరికి తీరని కష్టాల్నిచ్చేడు ? .. ఇలా! ముఖ్యంగా భారతీయ/హిందూ కర్మ సిద్ధాంతంతో మన పెద్ద వాళ్ళు సాధారణంగా సర్ది చెప్పేరు. 

హేతువాదులు - దేవుడా - అచ్చి చ్చీ - వొట్టిదే ! అంటారు. విచిత్ర వ్యక్తి లో సైతాను ప్రసంగాలు ఈనాటి మన విశ్వానికీ వర్తిస్తాయి. మానవుడు తప్పులు చేస్తూ, ఆ తప్పుల్ని జస్టిఫై చేసుకోవడానికి ఎదుటి వ్యక్తిదే తప్పు అంటూ ఎలా రంకెలు వేస్తూడో, యుద్ధాలు ఎలా చేస్తాడో - మనుష్యుల మంద (మోబ్ మెంటాలిటీ) మనస్తత్వం ఎలా ఉంటుందో సైతాను గొంతులో వింటే, మనిషెంత భయంకర ప్రాణో అర్ధం అవుతుంది. 

అమెరికన్ పాఠకులకు (మూలం) మార్క్ ట్వెయిన్ ఇంకోసారి ప్రత్యక్షమై బుద్ధి చెప్పినట్టుంటాయి కొన్ని పేరాలు. ఇపుడు జరుగుతున్న ఇరాక్ యుద్ధం, దీని లో యూ.ఎన్.వో పాత్ర, ఇప్పటి రాజకీయ వాతావరణం..అన్నిట్నీ ఏదో దివ్యదృష్టి తో చూసినట్టు, అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు రామ్మోహన్ రావుగారి అందమైన తెలుగు నుడికారంలో వింటూంటే, పాప పుణ్యాల రంధి లో పడి ధార్మిక ప్రేలాపనలతో ఇదే ధర్మం అంటూ విరచుకు పడే మన లో ఉన్న ఫెనాటిసిజాన్ని, చాందసత్వాన్ని, మేనర్స్ లేని జంతు గుణాన్నీ చూసి సిగ్గుపడతాం. 

అందుకే మనిషికి మనిషి జడ్జ్ ఏమిటి ? ఖర్మ కాకపోతే ! మనిషి ఇంకో మనిషి చంపేడని, మూడో మనిషి నిర్ణయించి, నాలుగో మనిషి చేత చంపించడం న్యాయం కదూ ! ఎవడో ఎవణ్ణో చంపుతాడేమో అని ఇంకోడు ఆ మొదటి వాణ్ణి ఆనవాలు లేకుండా చంపి పెట్టడం దౌత్యం ! జార్జి బుష్ నీ, ఒసామా బిన్ లాడెన్ నీ పట్టుకుని బంధించి ఈ పుస్తకం చదివంచాలి అనిపిస్తుందెవరికైనా!! పనిలో పనిగా, ఈ పుస్తకం లో ముందుమాటల్లో ప్రస్తావించిన నండూరి వారి అన్ని అనువాదాలూ చదవాలని తీవ్రమైన ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. గోపీచంద్ కలెక్షన్ లాగా పబ్లిషర్లు ఈ తరం 'తెలుగు చదివే' పిలకాయలకోసం అవన్నీ ఒక సెట్టులాగా తీసుకొస్తే భలే కమ్మగా గడిచిపోగలదు ఈ ఎండాకాలం.

04/03/2010

Angela's Ashes

సాహిత్యంలో ఎప్పటికైనా పావర్టీ గొప్ప ఇదైన సబ్జెక్టు. మనిషికీ మనిషికీ ఉన్న సామ్యత ని తెలియచేసేది, మనసుల్ని ఒద్దిక చేసేది కూడా ఈ దారిద్ర్యమే. ఇంత దాకా సాహిత్యంలో చాలా ఎక్కువ ప్రసిద్ధ రచనలు, ముఖ్యంగా ఎందరో మహానుభావుల ఆత్మ కధలు ఈ పావర్టీనే అల్లుకుపోయాయి. ఆయా రచయితలు తమ బాల్యం లో అనుభవించిన దారిద్ర్యం, కష్టాలూ - ఆ కష్టాల్లో మమతలూ, కలతలూ, త్యాగాలూ, ప్రేమలూ - ఇలా ఎన్నో నిరుపమానమైన జీవితపు రంగుటద్దా ల్లో తమ కధ ని - కాదు కాదు ఆ బీదరికపు కధ ని చెప్పుకొస్తే, మనం కళ్ళార్పకుండా చదువుతాం. కష్టాల్లోనే చాప్లిన్ తరహా హాస్యాన్ని ప్రదర్శిస్తే ఎంతో ఆనందిస్తాం.

ఇదెందుకో యూనివర్శల్ ట్రూథ్ ! మన దేశంలో ఇంకా ఎందరో బీదలు. రోజురోజుకీ పెరుగుతున్న బీద వారి సంఖ్య. బీదరికం ఒక శిక్ష. ఒక చాలెంజ్. కేవలం సరయిన ఆధారమూ, ఆదాయమూ లేక పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేక, స్కూళ్ళకు పంపలేక కళ్ళల్లో కన్నీటితో బ్రతుకు పోరాటం చేస్తున్న తల్లులకూ తండ్రులకూ ఈ బాధ తెలుస్తుంది. ఏ వైద్యమో అందివ్వలేక కన్న పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే చూస్తూ ఉండిపోవాల్సిన నిస్సహాయత బీదలది.


అందుకేనేమో - ఎన్నో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాహిత్య లోకపు అవార్డులు తమ రచనలతో బీదరికపు స్మృతులని పాఠకులతో పంచుకున్న రచనలని వరించాయి. కొడవటిగంటి కుటుంబరావు గారు తన 'చదువు ' లో అన్నట్టు 'ఇక ఇందే ఆఖరు.. జీవితం ఇంతకన్నా ఘోరంగా దిగజారడానికి వీల్లేదు!' అనుకునే అసంఖ్యాక సందర్భాలు ఎదురయ్యే జీవితం గురించి చదువుతుంటే, అలాంటి జీవితం లోంచి కూడా కుసుమాలు వికసిస్తాయి అనే ఆశ, నమ్మకం కలుగుతుంటే - అదో చక్కని ఫీలింగ్. జాలి, సానుభూతి కోసం కాకుండా రచయితలు ఆయా రచనల లో ఇంకేదో వ్యూహాన్ని అనుసరిస్తారు. అందుకే కొన్ని రచనలు, వాటి సౌరభాలతో మనల్ని కొన్ని రోజుల పాటూ కమ్ముకునే ఉండిపోతాయి.

ఎన్నాళ్ళుగానో ఈ పుస్తకం (Angela's Ashes) గురించి రాద్దామని అనుకున్నా, ఈ నిరుత్సాహ పరిచే బీద రచన ని గురించి ఏమి రాయడం అనిపించేది. కానీ ''ఏంజెలాస్ యాషెశ్' లో ఏదో ఉంది. ఇది ఐరిష్ దారిద్ర్యాన్ని గురించి వచ్చిన అత్యుత్తమ రచనలలో ఒకటి. యుద్ధ సమయంలో, గ్రేట్ డిప్రెషన్ లో - ఉద్యోగాలు పోయి, ఆదుకునే దిక్కులేక, దుర్భర దారిద్ర్యంలో వలస పోయిన అమెరికా నుంచీ అయిన వాళ్ళ దగ్గరకి ఐర్లాండు చేరి, అక్కడ కూడా ఉద్యోగాలు దొరకక, పసి పిల్లలతో నానా అవస్థలూ పడిన ఐరిష్ కుటుంబపు కధ.

ఈ కుటుంబంలోని జంట ప్రేమ వివాహం చేసుకుంటారు. ఉత్తర ఐర్లండ్ లో స్వతంత్ర పోరాటంలో సాయుధుడై పోరాడిన ఐరిష్ తండ్రి మెక్ కోర్ట్, తన తల కి వెల కట్టబడి, ప్రభుత్వం నుంచీ,దేశం నుంచీ అమెరికా పారిపోయి, అక్కడ పరిచయమయిన ఇంకో ఐరిష్ యువతి యేంజెలా ను పెళ్ళి చేసుకుంటాడు. వీళ్ళ పెద్ద కొడుకే (ఫ్రాంక్ మెక్ కోర్ట్) ఈ నవలా రచయిత.


స్వదేశానికి తిరిగి రావడానికి యేంజెలా తల్లి ఎలాగో టికెట్లు పంపిస్తే, షిప్ లో ఐర్లెండు చేరిన ఈ కుటుంబం అప్పటి నించీ మరిన్ని కష్టాల్ని ఎదుర్కొంటుంది. యుద్ధం వల్ల ఎక్కడా ఉద్యోగాలు ఉండవు. అందునా ఐర్లండ్.. ఇక్కడ చాలా మంది పురుషులు ఇంగ్లండు కి వెళ్ళి, ఆ దేశ సైన్యంలో చేరుతారు. ఇండియా కి, ఇతర ఆసియా దేశాలలోనూ డెప్యూట్ చెయబడతారు. వీళ్ళకి యుద్ధమే జీవనాధారంగా తయారైంది.

వీళ్ళ పెళ్ళి ఎంతమాత్రం ఇష్టం లేని ఇద్దరి తల్లి దండ్రులూ, చిన్న పిల్లల మొహం చూసి కూడా ఎంతమాత్రం సహాయం చేయరు. మెక్ కోర్టులయితే, ధనికులయినా కనీసం ఆశ్రయం ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. ఫ్రాంక్ భాషలో ఆ చిన్న హృదయం, తమ కష్టాలను అర్ధం చేసుకునే వయసు లేకపోయినా, తల్లి తండ్రుల నిస్సహాయతని, భయాలనూ చక్కగా వర్ణిస్తుంది.

ఫ్రాంక్ తండ్రి తాగుబోతు. కొన్నాళ్ళకి ఆ కుటుంబం ఎట్లాగో స్థిరపడినా, తన సంపదనంతా తాగడానికే వెచ్చించడంతో, ఆకలి, దాహం, చలి - ఇలా అన్ని కష్టాలూ ఆ కుటుంబాన్ని ముంచెత్తుతాయి. వీటిల్లో ఏంజెలా ఎన్నో సార్లు తన పిల్లల్ని అనారోగ్యాలనుచీ కాపాడుకోలేక, చనిపోతున్న పిల్లలని తలుచునుని రోదిస్తూ, బ్రతికి ఉన్న పిల్లలతో ఎలానో కాలక్షేపం చేస్తుంటుంది.

కొన్నాళ్ళకి ఫ్రాంక్ తండ్రి పని కోసం, బ్రతుకు తెరువు కోసం ఇంగ్లండ్ వెళ్తాడు. కొన్నాళ్ళు డబ్బు సరిగానే పంపినా తరవాత తాగుడుకి బానిసై, జబ్బుపడి తిరిగొచ్చి, ఐర్లండ్ లోనే కన్నుమూస్తాడు. అనాధ అయిన ఈ కుటుబానికి అద్దె చెల్లించుకునే స్తోమత లేక ఒక పెళ్ళికాని చుట్టం ఇంటికి తరలాల్సి వస్తుంది. అక్కడ ఈ చుట్టం (అంకుల్) కారణంగా పిల్లలూ, ఏంజెలా కూడా ఎన్నో అవమానాలకు గురి ఔతారు గానీ, ఆఖరుకి తన పిల్లల కోసం యేంజెలా అవన్నీ పంటి బిగువున భరిస్తూ ఉంటుంది. అతనికి ఉంపుడుగత్తెగా ఉండాల్సి వచ్చినా, పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఒక గూడంటూ ఉంటుంది కదా అని అతని ఇంట్లో పనిమనిషి లా పడి ఉంటుంది. చిరిగిన సాక్సులూ, కప్పుకోవడానికి వాడే చిరిగిన కోట్లూ - కప్పులు లేక పాత జాం జార్లలో టీ తాగడం, చర్చి చదువులూ, ఇలా నానా కష్టాలూ పడుతున్న పిల్లలు కనీసం ఈ అంకుల్ ఇంట్లో ఉంటే రాత్రి వెచ్చగా ఉంటారనే తల్లి ప్రేమని ఏ కొడుకు మర్చిపోగలడు ?

పెద్దయ్యాక పిల్లలు (చనిపోయినవాళ్ళు పోగా మిగిలిన వారు) ఎలానో ప్రయోజకులౌతారు. 19 ఏళ్ళ వయసులో Frank అమెరికా ప్రయాణం అవుతాడు. అమెరికా చేరాకా కొత్త జీవితం లోకి అతను చదువుకోవడం మీద కోటి ఆశలతో అడుగుపెట్టడంతో ఈ నవల ముగుస్తుంది. దీనికో సీక్వెల్ కూడా ఉంది. దాని పేరు 'Tis.

ప్రాధమికంగా ఈ రచనలో రచయిత ప్రతి పేరాగ్రాఫ్ లోనూ ఎంతో డీటైల్ తో - ఎక్కడా పొరపాటనేది దొర్లకుండా, ఐరిష్ జీవితాన్ని, బీదరికాన్నీ వర్ణిస్తాడు. ఆకలికి ఏడుస్తున్న తమ్ముళ్ళ నోటికి నీళ్ళు నింపిన బాటిళ్ళిచ్చి ఊరుకోపెట్టడం, ఇటాలియన్ పచారీ కొట్టువాణ్ణి ఈ మాటా,ఆ మాటా పెట్టి మభ్య పెట్టి అకణ్ణించీ అరటిపళ్ళు ఎత్తుకొచ్చి తన కన్నా చిన్న వాళ్ళకి తినిపించడం, ఇంట్లో ఫైర్ కోసం, రోడ్డు పక్కన బొగ్గులేరడం, పొద్దున్న పేపర్ బాయ్ గా పనిచెయ్యడం, తల్లి తండ్రుల ప్రేమనీ, వాళ్ళు పెద్దలనుంచీ ఎదుర్కున్న కష్టాలు అనిటినీ - చాలా హృద్యంగా వివరిస్తాడు.

యేంజెలాస్ యాషెస్ - నవల కాదు. ఇది ఫ్రాంక్ మెక్ కోర్ట్ తన బాల్య స్మ్ర్తులతో రాసిన ఆత్మ కధ అని చెప్పొచ్చు. దీనికి 1997 లో పులిట్జెర్ ప్రైజ్ లబించింది. అన్ని కష్టాల్లో, అంత బీదరికంలో నేను బ్రతికి బట్టకట్టడం విశేషమే. ఈ తరానికి తెలియని ఆ జీవిత పోరాటాన్ని మా అమ్మ స్మ్రుతికి అంకితం ఇస్తున్నా అంటాడు రచయిత. అయితే ఇన్ని కష్టాల్లో కూడా ఫ్రాంక్ ప్రదర్శించిన మంచి లక్షణం - దుఃఖం లో మునిగిపోకపోవడం. సెల్ఫ్ పిటీ లో కొట్టుకుపోకపోవడం. రచన అంతా మేటర్ ఆఫ్ ఫేక్ట్ గా కొనసాగుతుంది. అలా అని ఆ విషాదం మన హృదయాన్ని స్పృశించకపోదు. అదీ ఈ రచన ప్రత్యేకత. 2009 లో నేను చదివిన అన్ని పుస్తకాల్లో ఇదే ఎక్కువ నచ్చింది.

02/03/2010

డియర్ చీఫ్ జస్టిస్

మన ఇంత పెద్ద భారద్దేశం లో, ధర్మం ఒకప్పుడు నాలుగుపాదాలా నడిచేదంట. ఇపుడు కాలం మారింది. కలి మహిమ ! ఎంత ప్రజారాజ్యమైనా జనం ప్రభువుల పదఘట్టనల మధ్య చిత్తుకాయితాల్లా నలుగుతున్నారు. పుర్రెకో బుద్ధి అన్నట్టు, ప్రస్తుతం మనకో న్యాయం, ఊరందరికీ ఇంకో న్యాయం అమల్లోకి తెచ్చేం.

పుణ్యక్షేత్రాల్లో తీర్ధ ప్రజ, మామూలు గుళ్ళలో కూడా తొక్కిడి, టెలివిజన్లో భక్తి - బాబాలూ, అమ్మలూ - ఇవన్నీ చూసి, మాలతీ చందూర్ ని ఎవరో అడిగారు ; ప్రజల్లో దైవభక్తి ఇంతగా ఎందుకు పెరిగిందీ ? అని. ఆవిడ నిష్కర్షగా చెప్పింది - ప్రజల్లో పెరిగింది భక్తి కాదు - పాప భీతి అని. పాపభీతి సంగతేమో గాని, నేరాలు వివిధ క్షేత్రాల్లో, పరిధుల్లో - ఆయా రేట్లలో పెరుగుతూనే ఉన్నాయి.

మనకో న్యాయ వ్యవస్థ ఏడిచింది గానీ మొదట్నుంచీ ప్రజలకి కోర్టులంటేనే ఏవో పడని పాట్లు గుర్తొస్తాయి. కోర్టులో కేసులు తరతరాలుగా పేరుకు పోవడం, న్యాయం దొరకడం ఆలీశెం అయిపోవడం వల్లనా కోర్టు - గాడిదా సామెతలు పుట్టాయి. తడిసి మోపెడయ్యే వ్యాజ్య ఖర్చులు తలుచుకుని, కేసు గెలిచినవాడు ఇంటికెళ్ళి, గెలవని వాడు కోర్టు బయటా ఏడుస్తారని జోకులు పుట్టాయి.

ఇలా న్యాయం దుర్భరమైపోతే ప్రజలకి దొరికేది, మిగిలేది - అన్యాయమే. కానీ అన్యాయాన్ని ఎదిరించే దమ్మున్న, నిబద్ధత ఉన్న మనిషొకడు నిర్ణయాత్మక, క్రియాశీలక పదవి లో ఉంటే ? రాజకీయాలకు అతీతంగా, అదరక బెదరక - అవినీతితో కుళ్ళిన న్యాయ వ్యవస్థ కి వన్నెను తీసుకొచ్చిన జడ్జి ఒకరు ఉంటే ?

సరిగ్గా ఇలాంటి లక్షణాలున్న నిజంగానే గౌరవనీయులైన ప్రధాన న్యాయ మూర్తి అజయ్ ప్రకాష్, గత అక్టోబర్ లో పదవీ విరమణ చేశారు. పత్రికలలో ఆయన మీద కురిసిన ప్రశంసలు చదివి చాలా ఆశ్చర్య పోయి ఈ మనిషిని గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుందామని ప్రయత్నం చెయ్య బుద్ధయింది. అజయ్ ప్రకాష్ షా సుదీర్ఘ కెరియర్ లో మచ్చుకి కొన్ని మెచ్చు తునకలు :

గోధ్రా అల్లర్ల అనంతరం, గుజరాత్ ప్రభుత్వం - దూరదర్శన్ లో ప్రసారం కానివ్వకుండా అడ్డుకున్న టెర్రరిజం, అయోధ్య ల పై తీసిన డాక్యుమెంటరీలు 'ఇన్ మెమొరీ ఆఫ్ ఫ్రెండ్శ్ & 'రాం కే నాం' లను ప్రసారం చెయ్యాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించడం. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ - భారత పౌరుడుకి ఉన్న ప్రాధమిక హక్కు అని ప్రభుత్వానికి గుర్తు చేసారు ఈ న్యాయ మూర్తి.

విదేశాల్లో వికలాంగులను, వారికున్న సదుపాయాలను, పౌర జీవితం, నాగరికతా, వికలాంగుల కోసం పబ్లిక్ ప్లేసులను ప్రత్యేక సదుపాయాలతో సౌకర్య వంతంగా తీర్చిదిద్దడం చూసిన వారికి, మన దేశంలో వికలాంగులు పడే బాధలు చూస్తే ఎలా అనిపిస్తుంది ? మన దేశంలో ఇలాంటి వారికి మనం కల్పించే సౌకర్యాలు తక్కువ. బస్సు ల్లో, రైళ్ళలో, పని చేసే చోట్లలో - మానసిక అవకరం ఉన్నవాళ్ళకి, శారీరక వైకల్యం ఉన్నవాళ్ళకీ, రోజువారీ జీవితమే ఒక కార్గిల్ యుద్ధంలా తయారు చేసి పెట్టేం మనం. మరి వాళ్ళకి ఉన్న హక్కుల్ని ఎవరు గౌరవిస్తారు ? జస్టిస్ అజయ్ ప్రకాష్ మాత్రం ఆ పని చేశారు. ఎన్నో తీర్పుల్లో రవాణా సంస్థలనీ, ప్రభుత్వాల్నీ వికాలాంగుల హక్కుల కోసం కదిలించారు. లొంగని వాళ్ళని లొంగేలా చేసారు. ఈ ఒక్క వ్యక్తి, మానసిక అస్వస్థులు ఎదుర్కొనే వివక్ష ని కూడా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. అంతవరకూ మంచి ఆరోగ్యంతో ఉన్న ఉద్యోగులు, ఏ కారణం గానైనా మానసిక అస్వస్థత కు గురి అయితే, ఇలాంటి వారిని వృత్తి ఉద్యోగాల నుండీ బలవంతంగా నిర్మూలించడం, వారి వారి పెన్షన్ బెనిఫిట్లను నొక్కి పెట్టడాన్ని నిరసించి, చట్ట భద్రత కలిపించారు.

మహారాష్ట్ర లో మహాబలేశ్వర్, పంచ్ ఘని లను - ఆయా బీచ్ లనూ - అభివృద్ధి పేరిట వినాశనం చెయడాన్ని తన తీర్పులతో అడ్డుకున్నారు. ఆయా ప్రదేశాల 'ఇకో సిస్టం' ని భగ్న పరిచే ప్రయత్నాలు ఏవయినా తన దృష్టికి వస్తే వొదిలిపెట్టలేదు. హిందూ వివాహ చట్టం ప్రకారం - మొదటి భార్య బ్రతికుండగా, ఆ భర్త రెండో పెళ్ళి చేసుకుంటే, రెండో భార్యకు ఏ హక్కులూ ఉండవు. కానీ ఈ అంశాన్ని అడ్డంగా పెట్టుకుని భర్త విహీన అయిన రెండో భార్యని సమాజం ఎన్నో రకాలుగా వేధించడాన్ని ఈయన ప్రతిష్ఠాత్మకమైన తీర్పుల ద్వారానే నివారించగలిగారు. భారత విమాన యాన సంస్థ 58 సంవత్సరాల వయసు దాటిన మహిళా హొస్టెస్ లను బలవంతంగా రిటైర్ చేయించబోయినపుడూ ఈ అజయహస్తమే ఈ వయో, లింగ వివక్ష కు వ్యతిరేకంగా మహిళా ఏర్ హోస్టెస్ లు రిటైర్మెంట్ వయసు వరకూ పని చేయవచ్చని తీర్పిచ్చి ఆదుకుంది. విమాన యాన సంస్థ మొదట తన పనితీరు మెరుగు పరుచుకొని ప్రైవేటు రంగానికి దీటుగా నిలబడాలిగానీ ఏర్ హోస్టెస్ లను వొదిలించుకుని కాదని హితవు చెప్పింది ఈయన నాయకత్వం వహించిన బెంచ్.

అజయ్ ప్రకాష్ ఇచ్చిన ఎన్నో బెంచ్ మార్క్ తీర్పుల్లో - ప్రస్తుతం ఢిల్లీ హై కోర్టు చీఫ్ జస్టిస్ గా కామన్ వెల్త్ క్రీడల నిర్వహణకు సిద్ధం అవుతున్న ఢిల్లీ లో బిచ్చగాళ్ళను వారి వారి స్వ రాష్ట్రానికి పంపిచడాన్ని కోర్టు తప్పు పట్టడం తాజాది. ఢిల్లీ ఎవరి సొంతం.. బిచ్చగాళ్ళనయినా సరే పొమ్మనడానికి ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం ఎవరిచ్చారు ? అనే భావన ని, ఎన్నో ఎన్.జీ.వో. ల మనోకాంక్షలని నిలబెట్టిందీ తీర్పు. అయితే, ఇపుడు అజయ్ పదవీ విరమణ చెయడంతో పరిస్థితి తారుమారు అయింది. ఎముకలు కొరికే నిర్దాక్షిణ్యమైన ఢిల్లీ శీతోష్ణ స్థితి ఏటా కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకుంటోంది. ఇది కేవలం రాత్రి ఉండటానికి చోటు లేక పోవడం వల్లనే. చలి కాలంలో రాత్రి పూట రోడ్డు మీద నిద్రించే, ఇల్లు లేని కొన్ని వేల మంది అభాగ్యులకు ఎముకలు కొరికే చలి లో ప్రాణం నిలుపుకోవడానికి తినడానికీ (వొంట్లో వేడిని నిలుపుకోవడానికి), కప్పుకోవడానికీ ఏదయినా కావాలి. తిండి మాట దేవుడెరుగు. రాత్రికి 40 రూపాయల అద్దెకి కుక్కి మంచాన్నీ, కప్పుకునేందుకు రజాయినీ ఈ పేదలకి అందించే వాణిజ్యం కూడా అమలులో ఉందిక్కడ. కూటికి గతి లేక పోయినా, చలికి బ్రతికి బట్టకట్టేందుకు రాత్రికి 40 రూపాయల ఖర్చు కోసం తిండి కూడా తినకుండా పేదలు కటకటలాడుతున్నారు. వారిలో పిల్లలు, ముసలి వారు, వెనుకబడిన ప్రాంతాలనుంచీ పొట్టకూటికి నగరం చేరిన రిక్షా పుల్లర్లు, రక రకాల కూలి పనులు చేసుకునే వారు. వీళ్ళలో ఎందరో చలికాలం నిర్దాక్షిణ్యమైన చావు ని ఎదుర్కొంటున్నారు. కనీసం శీతాకాలం లోనైనా షెల్టర్లు నిర్మించి ఇవ్వమని ఆదేశించిన ఘన హృదయం జస్టిస్ అజయ్ ది.

లెక్కలేనన్ని ఎన్విరాన్ మెంట్ ఇష్యూస్, టెక్నాలజీ అంశాలూ - పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లూ - ప్రభుత్వ విధాన నిర్ణయాలూ - ఇలా ఎన్నో ప్రజోపయోగ తీర్పులతో ఎందరి జీవితాలనో తాకిన జస్టిస్ అజయ్ ప్రకాష్ లాయర్ల కుటుంబం నుంచీ వచ్చారు.

మన దేశంలో చాలా మందికి రుచించని 'గే' ల చట్టబద్ధతని, హోమో సెక్సువల్ ల హక్కులనూ - జస్టిస్ అజయ్ తీర్పే కల్పించింది.

జస్టిస్ అజయ్ ప్రకాష్ పదవీ విరమణ అనంతరం జాతీయ ప్రింట్ మీడియా ఆయన పనితీరుని ప్రత్యేకంగా శ్లాఘించింది. సాహసం, నిబద్ధతా, నిజాయితీ, మూర్తీభవించిన ఇలాంటి జడ్జి - జస్టిస్ దినకరన్ లాంటి కేసుల వల్ల దెబ్బతిన్న ఇండియన్ జ్యూడీషియల్ సర్వీసుల ప్రతిష్టని పెంచడానికి కావాలి. రాబోయే కాలంలో జస్టిస్ అజయ్ ప్రకాష్ ని ఏదో ఒక కమిటీ కి పెద్దగా చూడవచ్చేమో మనం.

సో.. ఎందరో మహానుభావులు. ఒక్కొక్కరికీ వందనాలు.