01/06/2009
సరళ భగవద్గీత
కొత్త పాళీ గారి ఈ నెల కబుర్లలో రామకృష్ణ గారి షిర్డీ సాయినాధుని మీద ఉత్పలమాల, చంపకమాల్లో శతకం ప్రస్తావన ఉండేసరికీ నాకీ 'సరళ భగవద్గీత ' గుర్తొచ్చింది. ఇది మా స్నేహితురాలి మామగారయిన శ్రీ వుగ్రాల శ్రీనివాసరావు గారు రచించగా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో ప్రచురింపబడిన ఒక మంచి పుస్తకం.
ఈ పుస్తకాన్ని గురించి రాయాలని ఎన్నో సార్లు అనుకున్నా, పద్యాల మీద అంత జ్ఞానం లేకపోవడం వల్ల, రాయడానికి ధైర్యం చాలలేదు. కానీ ఇపుడు మాత్రం కనీసం పరిచయం చెయ్యడం వల్ల పద్యాల మీద ఆశక్తి ఉన్నవారు కనీసం ఈ పుస్తకం గురించి తెలుసుకుంటారని రాస్తున్నాను. ఈ పుస్తకం లో పద్యాలన్నీ 'ఆటవెలది' లో చాలా సరళంగా, అందరికీ అర్ధమయ్యే సులభమయిన భాష లొ రాయడం జరిగింది.
కాంప్లిమెంటరీ కాపీ గా నేను కొట్టేసిన ఈ పుస్తకం వెల కేవలం 100/- మాత్రమే. పుస్తకాన్ని పరిచయం చెయ్యడానికి కావలసిన ప్రజ్ఞ లేకపోవడం చేత ఆచార్య కశిరెడ్డి గారు రాసిన పరిచయం లో కొంత భాగాన్ని - అతి క్లుప్తంగా - ఇక్కడ రాస్తున్నాను.
(య ఏవం వేత్తిహంతారం .... రెండవ అధ్యాయంలో 19 వ శ్లో ||)
కు ఆటవెలది అనువాదం చూడండి !
ఆత్మనెవడు దలచు హంతకుడగునంచు
ఆత్మనెవడు చచ్చు నంచుదలచు
ఇద్దరును నిజంబు నెఱుగని వారలే
చందెన్నడాత్మ చావదెపుడు
(వా సాంసి జీర్ణాని ... కి ఆటవెలది ..)
వస్త్రములు చిరిగిన వదలిపెట్టి యెటుల
క్రొత్త వస్త్రములను కోరు నరుడు
పనికిరాని తనువు పారవైచి యటుల
క్రొత్త తనువు నాత్మ కోరి పొందు
సాంఖ్యయోగంలో 'హతో వాప్రాప్స్యసే .. అనే శ్లోకానికనువాదం మూలంలో ఉన్న అర్ధానికన్నా, రచయిత కొన్ని చేర్పులు చేయడం వల్ల అర్ధం స్పష్టమై - సరళమైంది. విషయ స్పష్టతకు రచయిత అక్కడక్కడా మూలలో లేని చిన్ని అంశాన్ని చేరిన ఘట్టాలు ఉన్న ఉదాహరణ :-
చంపబడితి వేని స్వర్గంబు దొరకును
కలుగు రాజ్య సుఖము గెలుచుకొన్న
ఏది తగును నీకు నెంచుకో కౌంతేయ !
పోరు సలుపలెమ్ము ఊరుకొనక.
పద్యాలలో గీతా మకరందాన్ని అందుకోదలచిన పాఠకులకు ఈ ఆటవెలది లో భగవత్గీత నిజంగా చాలా నచ్చుతుంది. అందుకే ఈ .. ప్రయత్నం!
'సరళ భగవత్గీత'
రచయిత : వుగ్రాల శ్రీనివాస రావు
వెల : రూ.100/-
ప్రతులకు : సరళ ఆధ్యాత్మిక ప్రచురణలు
7-1-282/C/33
ప్లాట్ నెం. 101, సాయి డ్రీం హౌస్
శ్రీ రాం నగర్, బల్కంపేట
హైదరాబాదు - 500 038
ఫోన్ : 9347510558
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
ఈమధ్య తిరుమలకు వెళ్ళనందువల్ల ఈ పుస్తకాన్ని గమనించలేకపోయాను.ఈసారి వెళ్ళినప్పుడు తప్పక తీసుకోవాలి.మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
మంచి ప్రయత్నం చేశారు. ఈ పుస్తకాన్ని గూర్చి ఎక్కువమందికి తెలియపరచినందుకు ధన్యవాదములు.
ఎన్ని భగవద్గీతలొచ్చినా, ఎంత సరళంగా వివరించినా ఘంటసాల గాత్రంలో వచ్చిన ఆడియోని మించిన సరళత దేనికీ రాదు. అదే నాదృష్టిలో అసలైన జనాల భగవద్గీత.
Post a Comment