Pages

04/09/2008

మా ట్యూషన్ మేస్టారు

టీచర్స్ డే ! భారత రత్న సర్వేపల్లి రాధాక్రిష్ణన్ స్మృతికి అంకితమైన ఆయన పుట్టిన రోజు. విద్య దేశాన్ని ఉద్ధరించగలిగే ఒకే ఒక సాధనం అని నమ్మిన అయ్యోరు - సర్వేపల్లి. నిరంతర విద్యార్ధే మంచి గురువు కాగలడు. ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపరచుకుంటుకుంటూ, తన జ్ఞానాన్ని నలుగురికీ పంచే వాడే మంచి టీచర్. టీచింగ్ లాంటి అద్భుతమైన వృత్తిని ప్రేమించీ, రాణించే అత్భుతమైన వ్యక్తులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.


అబ్దుల్ కలాం చూడండి - ఇప్పటికీ తన స్కూల్ టీచర్ల పట్ల ఎంత ప్రేమనీ అభిమానాన్ని ప్రదర్శిస్తారో ! మంచి శిష్యుడంటే కూడా అలానే ఉండాలి.

చిన్నప్పుడు స్కూల్లో నాకు ఆత్భుతమైన టీచర్లు తారసపడలేదు. నా దృష్టిలో నా అసలుసిసలు టీచర్ మా ట్యూషన్ మాస్టర్. ఆయన పేరు నాకు ఎప్పటికీ తెలియలేదు. అప్పటికే ఆయన వృద్ధులు. నడిచి, తనంతట తానే మా ఇంటికి వచ్చి నాకు ట్యూషన్ చెప్పేరు. నాకొచ్చిన తెలుగు అక్షరాలూ, లెక్కలూ, గుణింతాలూ, ఇంగ్లీషు వర్ణమాల, చిన్నా చితకా చదువుకు సంబంధించిన విషయాలూ ఆయన ఇచ్చిన దానమే. స్కూల్ సిలబస్ లో లేకపోయినా పిల్లలకి మంచిదని అమ్మతో మాటాడి, తెప్పించిన పెదబాలశిక్ష, దాన్లోంచీ నేర్పించిన వేమన పద్యాలూ, సుమతీ శతకంలోని పద్యాలూ గుర్తున్నాయింకా.


నేను పెద్దయ్యాక, ఆయన దగ్గర ట్యూషన్ మానేసేం. స్కూల్ మారిపోయాం, ఇల్లు మారిపోయాం. కొన్నాళ్ళకి ఆయన వేరే కాలనీ లో కనిపించారు. వారి అబ్బాయి అప్పుడపుడూ అమ్మకి ఆయన వార్తలు చేరవేసేవారు. మేము పెద్దయ్యాక కూడా ఆయన అదే ఆరోగ్యం తో పిల్లల ఇళ్ళకు నడిచి వెళ్ళి, ట్యూషన్ చెప్పేవారు. కొన్నాళ్ళకు ఆయన పోయేరని కబురు కూడా వాళ్ళబ్బాయి ద్వారానే తెలిసింది.


ఆయన పాఠాల కన్నా, ఆయనిచ్చిన ఆత్మ విశ్వాసం నాకు ఎంతగానో పనిచేసింది. నేను ఏకసంతాగ్రాహి నని తరచూ పొగుడుతుండేవారు. నా తెలివితేటల పట్ల ఆయన కున్న నమ్మకం, నాకే నమ్మశక్యంగా ఉండేది కాదు. పెద్దయ్యాకా, చదువులో చాలా కష్టాలు పడ్డాను. ఏ టీచర్నూ .. ముఖ్యంగా లెక్కల టీచర్నూ ఇష్టపడ్లేదు. ఆయన తప్ప ఎవరూ నన్ను తెలివైనదాన్నని అనలేదు. నా తెలివి తేటలు, నా సక్సెస్ - అన్నీ టీచర్ల గుర్తింపు కి అనులోమానుపాతంలో (Directly proportionate) ఉండేవనుకుంటాను !


మా తాతగారు నా రెండున్నరేళ్ళకే పోయారు. మీ ట్యూషన్ మేస్టారే నా చేతి రాత కి ఒక షేప్ ఇచ్చారు. ఈయన బూస్ట్ చేసినంతగా ఎవ్వరూ నా మొరేల్ ను బూస్ట్ చెయ్యలేదు. ఇప్పటికీ నేను పరీక్షలకో, ఇంకో వేటికో నిరాశ చెందితే అమ్మ వెంటనే ఈ మేస్టారి ప్రస్తావన తెచ్చి... నువ్వు తెలివైన దానివే.. నువ్వు చెయ్యగలవు ! అని తెగ ఉత్సాహ పరిచేస్తారు. నిజమే అనుకుని, నేను ఉప్పొంగిపోయి.. హేపీ గా ఫీల్ అవుతాను.


అంత మంచి మేస్టార్ని టీచర్స్ డే న ఇంకోమారు గుర్తుచేసుకుంటూ....

2 comments:

Kathi Mahesh Kumar said...

ఎంటో..ఈ విషయంలో మాత్రం నేను అదృష్టవంతుడినే. ఇంటర్మీడియట్ మొదలు పోస్టు గ్రాడ్యుయేషన్ వరకూ అందరూ inspiring teachers దొరికారు నాకు. కేవలం పాఠాలు చెప్పేవాళ్ళుకాక, జీవితాన్ని విప్పిచెప్పేవారు దొరకడంకన్నా మహాభాగ్యం వుంటుందనుకోను.

అందుకే క్వాలిఫికేషన్ వుండీ,అవకాశం వచ్చినా నేను టీచర్ కాకపోవడానికి వాళ్ళస్థాయిని అందుకోలేననే శంకకూడా ఒక కారణమయ్యింది.

Sujata M said...

Lucky you! Thanks for the nice comment.