Pages

25/11/2025

కథలు గాధలు - హోవనేస్ తుమన్యాన్ (గిఖోర్)





*** 

ఈ పుస్తకం నాకెంతో ఇష్టమైన చిన్న నాటి జ్ఞాపకం. స్కూలు లైబ్రరీనో ఎక్కడో చదివిన ఈ పుస్తకమూ,  బొమ్మలూ మనసులో పాతుకుపోయి ఉండిపోయాయి. ఈ   పుస్తకం లో అన్ని కథలూ బావుంటాయి, గాధలయితే అల్లరిగా ఉంటాయి.  దీన్లో మొట్ట మొదటి కథ, గిఖోర్.  ఇది మనసుని కదిలించేసే కథ. నాకెంతో ఇష్టమైనది కూడా.   "పోస్ట్ చెయ్యని ఉత్తరం" రాసే పిల్లాడి కథలాగా (Salam Bombay సినిమాలో కూడా ఉంటాడు ఆ పిల్లాడు),  గిఖోర్ నా బాల్యంలో మనసు ద్రవింపజేసేసి, ఏడిపించేసిన కథ. చాలా ఏళ్ళకు ఈ పుస్తకం ఒక సోదరి గిఫ్ట్ చెయడం మర్చిపోలేని అనుభవం) 

ఈ కథ ని 'పిల్లల కోసం వెబ్ సిరీస్' తీద్దామని ఒకరు సంకల్పించి పిల్లలు protagonist /  సబ్జెక్ట్ గా ఉన్న (ప్రముఖ) కథలని సూచించమంటే, కుదించి, ఇలా రాసాను. దురదృష్టవశాత్తు ఇది ఎంపిక కాలేదు.  ఇది ఎంపిక కాలేదనుకోవడం కన్నా, ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు అనుకోవడం బావుంటుంది.  బ్లాగ్‌లో పెట్టేస్తే ఎవరైనా చదువుతారని పోస్ట్ చేస్తున్నాను. 

***

గిఖోర్ (synopsis)

గిఖోర్ : పన్నెండేళ్ళవాడు. పేదరైతు హంబో ఇంట్లో పుట్టాడు. వాళ్ళు చాలా బీదవాళ్ళు. అంబో కొడుకును పట్నానికి తీస్కెళ్ళి పనిలో పెట్టడానికి నిర్ణయించుకున్నాడు. అతని భార్య ఒప్పుకోలేదు. ముక్కుపచ్చలారని పసివాడిని, నీతీ, న్యాయం లేని ఈ ప్రపంచంలోకి తోసేయడానికి వీల్లేదని ప్రాధేయపడింది.  అయినా హంబో ఆమెను లెక్క చెయ్యలేదు.

 

ఓ రోజున కొడుకుతో కాలినడకనే పట్నానికి బైల్దేరుతాడు. దారిలో ఓ ఊర్లో స్నేహితుడి ఇంట్లో దిగుతారు. స్నేహితుడు హంబో తో యుద్ధం గురించి మాట్లాడి, కుర్రాడిని పనిలో పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నందుకు మెచ్చుకుంటాడు.

 

చివరికి గిఖోర్, హంబోలు పట్నానికి వెళ్తారు. అక్కడ పని వెతుకుతుంటాడు హంబో.  రెండో రోజు ఉదయం ఒక కొట్లో వ్యాపారి హంబోని పిలిచి 'పిల్లాడిని పనిలో పెడతావా ?' అని అడుగుతాడు. ఆ వ్యాపారి పేరు బజాజ్ ఆర్తే.  అతను జీతం లేకుండా అయిదేళ్ళదాక వీడికి పని నేర్పిస్తానని, అన్నం పెట్టి ఆదరిస్తాననీ చెప్పి గిహోర్ ని తన ఇంటికి తీస్కెళ్తాడు.  పట్నంలో కొత్త విషయాలు - గిఖోర్ కి ఆశ్చర్యంగా అనిపిస్తాయి. పని రూపంలో ఎడతెగని చాకిరీ చెయ్యాల్సొచ్చింది. మిగతా పనివారి చేతిలో అవమానాలు, హేళనా ఎదుర్కోవాల్సి ఉంటుంది.  ఒక పక్క ఇంటి మీద బెంగ, ఒక పక్క పేదరికపు బరువూ అతన్ని వూపిరాడనివ్వవు.  ఏదైనా తట్టుకోగలడు గానీ ఆ పిల్లాడు ఆకలిని తట్టుకోలేడు.  తన వూరిలో వున్నపుడు ఆకలేయగానే స్వతంత్రంగా ఏదో ఒకటి తినేవాడు.  ఇపుడు యజమాని ఇంట్లో ఆకలి దహించేసేదాకా తను ఏదయినా తినేందుకు వీల్లేదు.  అలాంతి సమయాల్లో తల్లినీ, చెల్లాయినీ, తమ్ముడినీ, ఇంటినీ, తమ ఆవునీ తలచుకుని కుమిలేవాడు. అమాయకత్వం అతనికి ఉరితాడవుతుంది.

 

కొన్నాళ్ళకు ఇంటి యజమానురాలికి ఇతని "అడవితనం" నచ్చదు. వూరికే ఈ పిల్లాడిని పనిలోంచీ తీసేయమని బజాజ్ ఆర్తే తో గొడవపడుతూ ఉంటుంది.   ఒకసారి ఒక కంప్లైంట్ తరవాత ఆర్తే పిల్లాడిని విచక్షణారహితంగా కొడతాడు.  రక్తం, కన్నీరూ కారుతున్న అబ్బాయికి ఆకలి అంటే ఏంటో తెలియాలంటూ, రొట్టె పెట్టావద్దని శాసిస్తాడు. ఇకైంటి పనికి పనికిరాడని, కొట్లో పనికి తీస్కెళ్తారు.

 

అక్కడ రకరకాల పనుల్తో పాటూ కస్టమర్లను కొట్లోకి పిలవాల్సిన పని కూడా చేయాల్సొస్తుంది. అక్కడ వూరి నుంచీ వచ్చినైద్దరు రైతులు హంబో ఇచ్చిన ఉత్తరాన్ని ఇస్తారు. వాళ్ళతో ఊరెళిపోదామనీ, తన నరకపు జీవితాన్నిండీ తప్పించమనీ అడగబోయిన గిహోర్ కు హంబో ఉత్తరం ఆశనిపాతంలా దొరుకుతుంది. దానిలో హంబో, కొడుకును ఏదన్నా డబ్బ్బు ఉంటే పంపించమంటాడు. వాళ్ళకి, ముఖ్యంగా అమ్మకూ, చిన్నపిల్లలకూ, చలికి తగిన బట్టలే లేవని రాయడమూ, ఆవు చచ్చిపోయిందని రాయడమూ చూసి, వాడి గుండె బద్దలవుతుంది.  ఇంతలో నిర్దాక్షిణ్యమైన శీతాకాలం మొదలయింది. గిహోర్ కు పోషణ లేక, తిండి లేక, దెబ్బలతో, పనిభారతో ఆరోగ్యం మరీ సున్నితంగా ఉంటుంది. దానికి తోడు మంచులో నిలబడి, పల్చని దుస్తులు ధరిస్తూ, చలిగాలి ఎముకలని కోస్తుండగా పని చెయ్యాల్సి రావడం వల్ల మంచాన పడతాడు.  ఇక పిల్లవాడు బరకడూ అని హంబోని పిలిపిస్తారు. మరణించే ముందు పూనే సంధిలో  అమ్మా, నాన్నా, తమ్ముడూ అని అరుస్తున్న పిల్లవాడికి తండ్రి వచ్చిన సంగతే తెలియదు. అలా గిఖోర్ కథ ముగుస్తుంది.

 

గిఖోర్ ని పాతిపెట్టాక, వాళ్ళమ్మ కరువు తీరా ఏడవడానికి గిఖోర్ బట్టలను హంబో తీస్కెళ్తుంటాడు.  గిఖోర్ జేబుల నిండా మెరుస్తున్న బొత్తాలు, రంగు రంగుల కాగితం ముక్కలు, పిన్ను సూదులూ, బట్టల తాళ్ళ పీలికలూ ఉన్నాయి. అవన్నీ తన చెల్లెలి కోసం పోగు చేసినవి.

 

హంబో తిరుగు దారిలో గిఖోర్ పోయిన సారి ఈ దార్లో వచ్చినపుడు ఇక్కడే "నాన్నా  ! కాళ్ళు నొప్పులు పుడుతున్నాయన్నాడు" అనో ఇంకోదో అన్నాడనో తిరుగుదారంతా తలచుకుంటూనే వున్నాడు. ఇక్కడే నీళ్ళు తాగాడు. అన్నీ అలానే ఉన్న్నాయి. వాడే లేడు. హంబో వూరికి చేరుతుండగా అతనికి ఊరివారంతా, హంబో కుటుంబం సహా బయటకొచ్చి నిలబడి కనిపిస్తారు.

 

'గిఖోర్!! వచ్చావా ?! రా ! రా! అన్నట్టు. '

 ***

మూల రచయిత - హోవనాస్ తుమన్యాన్ (1869-1923) (ఆర్మేనియా)

తెలుగులోకి అనువాదం : పి. చిరంజీవి కుమారి

ప్రగతి ప్రచురణాలయం, 1974 (సోవియట్ యూనియన్)

 ***

కథ వినడానికి శ్రీమతి స్వాతి పంతుల గారి చానెల్ లింక్

 https://youtu.be/GEsZ4Akt8c8?si=y3S-rse6HLlIIj7C

Many thanks to Mrs Swati Pantula.

*** 

No comments: