సియోల్ లో ఓ
క్లాస్ రూం లో ప్రాచీన గ్రీక్ భాష నేర్చుకునే విభాగంలో, గ్రీకు పాఠాలు చెప్పే 'పురుషుడు' క్లాస్ లో ఉన్న ఒక మూగ 'మహిళ' తో
ఏర్పరచుకునే కనెక్షన్ ఇది. ఇద్దరివీ భిన్న ధృవాలు. అతనికి వారసత్వంగా వచ్చిన చూపు
ఇబ్బంది. క్రమంగా త్వరలోనే మసక కూడా మాయమయ్యి పూర్తిగా గుడ్డివాడుగా మారబోతున్న
మనిషి. అతను తన కండిషన్ ని దాచి, కేవలం గుర్తుంచుకున్న పాఠాల్ని బోర్డ్ మీద
రాస్తూ, పాఠాలు
నేర్పిస్తుంటాడు. అతనినే, బోర్డు మీద రాసిన తను చేతి రాత చదవమంటే, సాధ్యం కాదతనికి.
ఆమె, పరిస్థితుల ఒత్తిడి తట్టుకోలేక, తన గొంతు కోల్పోయిన మహిళ. పూర్వాశ్రమంలో
సొంతంగా చదివి పైకొచ్చిన కవయిత్రి, ఉపాధ్యాయురాలైన
గతం ఉన్నా, తల్లి మరణం,
తరవాత విడాకులు, తొమ్మిదేళ్ళ కొడుకు భాద్యతలని కోర్టు లో
గెలుచుకోలేక, బలవంతుడైన మాజీ
భర్తని ఎదిరించే శక్తీ, గొంతూ లేక,
తన భాష ని, గొంతుని, జీవితేచ్చనీ కోల్పోయి, క్రమంగా మూగబోయిన మనిషి ఆమె. ఇద్దరి పేర్లూ
తెలీవు. అతను, ఆమె. అంతే.
తల్లి గా ఆమె
ప్రయాణం, అపుడపుడూ ఇంటికి
వస్తూండే కొడుకుతో గడిపే సమయం మాత్రమే ఆమెను
బ్రతికుంచే బంధం. ఈ మధ్యనే, తండ్రి తనని ఇక
తల్లి దగ్గరకు పంపీయబోవట్లేదని, ఇద్దరినీ దూరంగా
ఉంచేందుకు, తనని ఎక్కడికో
దూరంగా పంపేయబోతున్నాడనీ చెప్పినపుడు, ఆమె మనసులో పిడి బాకు దిగినట్టయి, పూర్తిగా మూగబోతుంది.
ఆవేశంలో, కోపంలో, ఆక్రోశంతో భర్తకు ఫోన్ చేసినా, గొంతు పెగలని దీనత. తనని బ్రతికున్నాళ్ళూ ప్రోత్సహించి, దన్నుగా నిలబడిన తల్లీ చనిపోయి, ఇటు పిల్లాడూ దూరమయి, ఒంటరి అయిపోతుంది. ఈ మహిళ, ఎవరికీ అక్కర్లేని ఓ మృత భాషని నేర్చుకుని,
ఏమి సాధించాలనుకుంటుందో
తెలీదు. ఒకవేళ ఆ గ్రీకు భాష నేర్చుకున్న, దానిని పలకడం ఎలా సాధన చేస్తుంది.
చేసినా ఎవరితో మాటాడడానికి ? తెలీదు. క్రమం
తప్పకుండా క్లాసు లో సమయానికి హాజరు కావడం, టీచర్ చెప్పినవి పెన్సిలు తో నోట్ చేసుకోవడం,
ఎవ్వరితోనూ మాట మాత్రం
మాటాడకుండా, కనీసం తను మూగది
అన్న విషయం కూడా తెలియనీకుండా, క్లాసు లోంచీ
వెళిపోతుంటుంది.
అతను ఆమెను
గమనిస్తాడు. క్లాసులోనే. ఈ శోకదేవత మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. ఆమె కథ మధ్య
మధ్యలో చాప్టర్లలో వస్తుంది. కథ మెల్లిగా విసుగు నుండీ నడిచి, చిక్కబడుతూ, ఇద్దరి బాధల్నీ చెప్తుంది. పాఠకుడి మనసు
కరుగుతూ, ఈ అన్యాయానికీ,
దురదృష్టానికీ, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులనుండీ ఆమె బయటపడితే
బావుణ్ణనిపిస్తుంది.
అతను కొరియన్
అయినా, జెర్మనీ లో పెరిగాడు.
అతని కంటి డాక్టరు కూతుర్ని ప్రేమిస్తాడు. ఆమెకు అతని క్రమేపీ పోతున్న కంటి చూపు
గురించి తెలుసు. ఆమె పదే పదే గుర్తొస్తు ఉంటుంది. తల్లి, చెల్లెలు, జెర్మనీ లో నే ఉంటారు. ఇక చూపు కోల్పోవడం ఖాయం,
తన తండ్రికి ఇలానే
జరిగింది. అసలది ఎలా ఉంటుందో నేర్చుకోవాలని అతనికి తోచింది. పూర్తిగా చూపు పోయే
ముందు సియోల్ వెళ్ళాలనుకున్నాడు. గ్రీకు లాటిన్ లు వచ్చు కాబట్టి ఈ పాఠాల ఉద్యోగం
దొరికింది. ఒక్కడూ సియోల్ లో ఉంటున్నాడు. తన దారులు, ఇంటి కొలతలు, వైశాల్యాలు, వీధి వెలుతుర్ల బట్టీ సమయాన్ని చెప్పగలగడం,
తనంతట తానే
నేర్చుకుంటున్నాడు. చెల్లెలు ఉత్తరాల ద్వారా ప్రోత్సహిస్తూంటుంది. క్రమేపీ ఆమె
ప్రోద్బలంతో బ్రెయిల్ నేర్చుకుంటాడు. చెల్లెలు బ్రెయిల్ లో నే రాస్తుంది. కళ్ళ నిండా చీకటి అలముకున్నాక ఎలా జీవించాలో
నేర్చుకోవడం అతనికి అవసరం.
అతని చూపు
పూర్తిగా కోల్పోబోయే ముందు దశ లో ఆమెను చూస్తాడు. ఆమె అతనిలో ఎన్నో జ్ఞాపకాలని
తట్టి లేపుతుంది. చెల్లెలికి రాసే ఉత్తరాలలో ఆమె గురించి రాస్తాడు. పెద్దగా తెలీదు
ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి. ఒకసారి ఆమె నోట్ బుక్ లో గ్రీకు అక్షరాలతో కవిత
లాంటిది రాస్తుంది. ఆమె క్లాస్ మేట్ 'ఈమె కవిత రాసింది " అంటాడు. అతనికి ఆశక్తి కలుగుతుంది. మాట్లాడబోతాడు.
ఆమె వెంటనే నోటు బుక్ మూసేసి, క్లాసు నుండీ
వెళిపోతుంది. ఆమెకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు.
తల్లి దగ్గరికో, కొడుకు దగ్గరికో
వెళ్ళలనిపిస్తు ఉంటుంది. మధ్య మధ్యలో
పిల్లాడి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఒకరినుంచి ఒకరు దూరం
కాబోతున్నామని తెలిసాక, ఆమె లో ఆప్యాయత,
వాత్సల్యం ఎక్కువవుతాయి.
ఆమెది భర్త కన్నా చాలా తక్కువ ఆదాయం వచ్చే జాబ్. అందుకని పిల్లాడి సంరక్షణ కోర్టు
తండ్రి చేతిలో పెడుతుంది. అతనికి అర్ధబలం, కంఠబలం ఉన్నాయి. ఆమె తనమీద పడుతున్న ఈ దెబ్బ మీద దెబ్బలకు తల్లడిల్లి సగం, మనిషి జీవితాన్ని కల్లోలం చేయగల మాటలంటే,
అసహ్యం పుట్టి సగం,
క్రమేపీ తన గొంతుని,
మాటలను పెగిల్చే
సామర్ధ్యాన్నీ కోల్పోతుంది.
పేజీల కొద్దీ
ఇద్దరి విషాదమూ ఎస్టాబ్లిష్ చేసాక, ఒకరికొకరు ఎదురు
పడుతూనే ఉన్నా మాటాడుకోని ఇద్దరూ, ఒక సారి అనూహ్య
పరిస్తితుల్లో ఒక చోట చేరాల్సొస్తుంది.
అతను క్లాస్ కు రోజూ లా రాడు. ఆమె ఎదురు చూస్తుంటుంది. ఆరోజు అతను
ప్రమాదవశాతూ, ఒక కాలేజీ
లోనే భవనం బేస్మెంట్ మెట్ల మీంచి
పడిపోతాడు. కళ్ళజోడు విరుగుతుంది. వాటిని వెతికే క్రమంలో చేతులకు గాయాలవుతాయి.
చీకటి పడబోతుంది. రక్షించే నాధుడు లేడు. అతనికి ఏమీ కనిపించదు. ఆమె అతనెందుకు
రాలేదా అనుకుని క్లాసు నుండి వెనక్కి
మళ్ళినపుడు ఎక్కడో లీలగా అతని గొంతు వినపడుతుంది. ఆమె అతన్ని ఆ బేస్ మెంట్ నుండీ
జాగ్రత్తగా పైకి తీసుకొస్తుంది. అతనిని మొదట హాస్పిటల్ కీ, తరవాత అతని ఎపార్ట్ మెంట్ కీ చేరుస్తుంది. ఆమె కు మాటలు రావని అతనికి ముందే తెలుసు.
అతనికి వచ్చిందల్లా జెర్మన్ సైన్ లాంగ్వేజ్ ! ఆమెకు వినబడదేమో అనుకుని, ఆ సైన్ లాంగ్వేజ్ లో మాటాడడానికి ఇంతకు ముందు ప్రయత్నించాడు కూడా.
కానీ ఆమెకు అతను
గుడ్డివాడని తెలీదు. కళ్ళ జోడు లేని అతని ముఖాన్ని ఆమె అప్పుడే అంత దగ్గరగా చూడడం.
అతని దెబ్బ తాకని ఇంకో అరచేతి మీద చూపుడు వేలితో మెల్లగా వాక్యాలు రాస్తూ, కమ్మ్యూనికేట్ చేస్తుంది. అతను టాక్సీ లో కూడా
తాను వెళ్ళాసిన చోటి గురించి స్పష్టంగా చెప్తాడు. ఆమె అతని ఇల్లు చేరాకా, ఆపకుండా ఆమెతో లొడ లొడా మాటాడతాడు. బయట చీకటి
పడబోతుంది. చేతి గాయానికి కట్టు ఉంటుంది. ఆమె అతని మాటల్ని చాలా సేపు మౌనంగా
వింటుంది. అసలు ఆమె తన గదిలో ఉండడం, తను పూర్తిగా గుడ్డివాడయ్యే సమయానికి ఒక ప్రాణి తనకు తోడుగా ఉండడం, అతనికి ఊరటనిస్తుంది. అంతవరకూ మసకబారిన చూపుతో
నెట్టుకొచ్చిన అతనికి ఇదే అంతం అనీ, ఈ మాత్రం కూడా ఇకపై తనకు కనబడదనీ అర్ధం అయింది. అతనికి స్వాంతన కావాలి. ఆమె
అతని ఎదురుగా బెంచ్ మీద కూర్చుని ఉంది. అతను వస పిట్ట లా తన గురించి చెప్తూనే
వుంటాడు. ఆమె నిశ్శబ్దంగా అతని పెదవుల నుంచీ వెలువడుతున్న హృదయ భాషని వింటుంది. చూపు కోల్పోతూ తాను ఎదుగుతున్నపుడు తను చూసిన
కలల్ని చెప్తాడు. "కలల్లో నేను చాలా అత్భుతాలని చూస్తాను. వాటర్ మెలన్ లో ని
ఎరుపుని చూస్తాను. బుద్ధుడి పుట్టినరోజు వేడుకలు చూస్తాను. మంచు రాలుతున్నదీ
చూస్తాను. కానీ కల ముగిసి, కనులు తెరిచి లేచానంటే, ఇంకేమీ కనబడన్న బెంగతో లేస్తాను. నా రంగులన్నీ కలలకే పరిమితం." అంటాడు. చాలాసేపు వింటుంది. కానీ చీకటి పడుతుంది. వర్షం
కూడా పడుతుంది. ‘ఇక నేను వెళ్ళాలి’ అని అతని చేతి మీద రాసి చెప్తుంది. అతనికి
ఆమెను వెళ్ళనీయకూడని, ప్రాధేయపడాలనుంది.
కానీ ఏమన్లేకపోతాడు. ఆ రాత్రి పెద్ద వర్షం. ఆమె తన రూం లో లేదని అర్ధమయి, అతను చాలా సేపు ఏడుస్తాడు.
ఆమె మనసు స్పందనల
గురించి అతనికి ఏమీ తెలీదు. ఆమె బాధలు ఆమె చెప్పుకోలేదు. ఆమె పెదవులు ఒక టేప్ వేసి
అంటించినట్టు, మాటలకు మాత్రం
కదలవు. ఆమె రూపం ఇకపై లీల గా కూడా అతనికి
ఇకపై తెలియదు. ఆ రాత్రి అతను అనుభవించిన ఆవేదన చెప్పలేనిది. పొద్దున్న
తెల్లవారినట్టు, కిటికీ లోంచీ పడే
వెలుగు తీవ్రత బట్టి తెలుసుకుంటాడు. అతనిని మళ్ళీ హాస్పిటల్ కు తీసుకెళ్ళేందుకు
ఆమె మళ్ళీ వచ్చింది. ఆమె నుండీ వచ్చే ఏపిల్ సెంట్ ని అతను గుర్తు
పడతాడు. ఈ సారి ఆమె వచ్చినట్టు తెలిసి,
అతని గుండె
ఉప్పొంగిపోతుంది. అతనిని రెడీ అవమని
చెప్పి బల్ల మీద కూచున్న ఆమెను సమీపించి, భుజాలను పట్టుకుని, ఎన్నో యుగాలుగా మూగబోయిన ఆమె పెదవులను ఇక
వీడలేనంత బెంగతో ముద్దు పెట్టుకుంటాడు. ఆమె కూడా అతని ముఖాన్ని తన చల్లని కోమలమైన
చేతులతో లాలనగా స్పృశిస్తుంది.
వాళ్ళ జీవితాలతో
కలిసి ప్రయాణం చేసిన పాఠకుడు ఎమోషన్ తో కదిలిపోతాడు. ఇద్దరినీ కలిపే శక్తి ఏదయినా, ఆమెకు ఇకపై అతనిచ్చే ప్రేమతో మాటలాడగలే సామర్ధ్యం వస్తుందేమో, ఇద్దరూ ఒకరికొకరు తోడు గా నిలబడతారేమో, అతని తల్లి, చెల్లెలు, ఈ పరిణామానికి ఎంత ఆనందిస్తారో, అతను ఆమెకు గొంతయి నిలబడతాడు,
ఆమె అతనికి చూపు ! హమ్మయ్య!! అనుకుంటాడేమో పాఠకుడు. తెలీదు. ఒక రచన
ఇదీ అని చెప్పకుండా ముగిసినపుడు ఆయా పాత్రలతో కలిసి, వాళ్ళ చేతుల్లో చేతులేసి నడిచి,
వాళ్ళని సమీపం నుంచి చూసాక కలిగే దగ్గరితనం సాధించడం రచయిత 'సృష్టి' సాధించిన విజయం. ఎంతయినా రచయిత్రి ప్రతిభ కలది. ఆవిడ ఇంతకు
ముందు రాసిన 'వెజిటేరియన్' ను సరిగ్గా అనువాదం చేయలేదనీ, మూలం ఇంకా అత్భుతంగా ఉంటుందనీ ఎందరో అభిమానులు వాపోయారు. నాకు ఇదే మొదటి హాన్ కాన్ నవల. నచ్చింది.
***
No comments:
Post a Comment