Pages

13/07/2025

The Sensualist - Ruskin Bond




The Sensualist చాలా భిన్నమైన రస్కిన్ బాండ్ పుస్తకం. పేరు సూచించినట్టూ, పుస్తకం హెచ్చరించినట్టూ ఇదో (సెన్సేషనల్) బాండ్ పెద్ద కథ. తల్లి తండ్రుల ప్రేమ  దక్కని ఓ డబ్బున్న పిల్లవాడి కథ.  బాండ్ మార్కు  అందమైన ప్రేమకథో, అత్భుతమైన హిమాలయాల నేపధ్యమున్న ఏ పిల్లల కథో కాకుండా,  చిన్నవయసులోనే పొందకూడని అనుభవాల బారిన పడి 'అందమైన బాల్యాన్ని '  కోల్పోయిన   ఓ 'చెడిపోయిన'  ఓ మామూలు మగవాడి కథ. 

రస్కిన్ బాండ్ రచనలు చేస్తున్న కొత్తలో భారత దేశపు ప్రముఖ 'సరసమైన పత్రిక' డిబొనైర్ లో ఓ మూడు నాలుగు సంచికలకు సరిపోయినంత ధారావాహిక గా వచ్చిన ఈ కథ చాలా పాతది. అప్పట్లో అంటే - ఎమర్జెన్సీ రోజుల్లో, (1975-76) ఇలాంటి అనైతికమైన బూతు కథ రాసినందుకు జైలుకెళ్ళాల్సిన పరిస్థితి కూడా వచ్చింది రచయితకు.  అయినా అప్పటి ఇలస్ట్రేటెడ్ వీక్లీ, విజయ్ టెండూల్కర్, నిసిం ఎళికీల్ తదితర ఉద్దండ పాత్రికేయ, రచయితా మిత్రులు నైతిక, న్యాయ మద్దతు ఇవ్వడం వల్ల ఆ కేసు నుండి బయట పడగలిగాడు ఈ పెద్ద మనిషి. 


ఓ గొప్ప రచయిత, తన రచనల్లో ప్రముఖంగా పిల్లల స్కూలు పుస్తకాల్లో చేర్చగల అత్భుత గాధల్నీ,   పాత కాలం కబుర్లని రంగరించి రాసిన  పుస్తకాలనీ, అవే చేతుల్తో బోల్డన్ని సంకలనాల్లో గొప్ప గొప్ప ప్రపంచ ప్రసిద్ధ కథల్ని భారతీయ పాఠకుల కోసం కూర్చి పెడుతూ, అపారమైన అమాయక ప్రేమ గాధల్నీ, హిస్టారిక్ రొమాంటిక్ నవలలనీ, సాత్ ఖూన్ మాఫ్ లాంటి మనో రంజకమైన కథల్ని, నవరసాలూ దట్టి కూర్చి రాసిన, ఇప్పటికీ రాస్తున్న,  ఈ నవలా లోకపు "బాలూ" ఇలాంటి కథ ఎలా రాసాడా అనే కుతూహలం తో నే చదివాను. 


కుష్వంత్ సింగ్ గానీ, ఆ కేలిబర్ ఉన్న ఇంకెవరైనా గానీ, స్త్రీ పురుషుల శారీరక (లైంగిక) సంబంధాల గురించి, రాసినపుడు ఎలాంటి స్పార్క్స్ కనిపిస్తాయో, అవి మామూలు సెన్సువాలిటీ ని ఏ ఎత్తులకు తీసికెళ్తాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.  అయితే దురదృష్టవశాత్తూ, ఈ కథ లో పాఠకులు ఆశించే సెన్సువాలిటీ, పోర్న్ కన్నా, సున్నితత్వం/ భావుకతా లేకపోవడం, అహంకారం, లొంగుబాటు తత్వమున్న ప్రేమ, స్వార్ధం, కపటత్వం, మనుషుల డైలమా లూ, భయాలూ ముఖ్య పాత్ర వహిస్తాయి.  


కొండల్లో దారి తప్పిన ఓ యువకుడు (రచయిత?) ఎవరో పిలిచినట్టు, వెతుక్కుంటూ వెళ్ళి ఓ గుహ ముందు తేలతాడు. అక్కడ ఏకాంతంగా జీవిస్తుండే ఓ నడి వయసు వ్యక్తి తారసిల్లుతాడు. మాటల్లో ఆ ఏకాంత వ్యక్తి తన మానసిక బలంతో తనని ఇక్కడికి రప్పించినట్టు చెప్తాడు.  అదంతా నమ్మశక్యంగా అనిపించకపోయినా, ఏ ఏకాంత వ్యక్తి, తనతో మాటాడే ఇంకో మనిషి కోసం అల్లాడుతున్నట్టు  అర్ధమై అతని కథ వినేందుకు ఒప్పుకుంటాడు రచయిత (అలా అనుకోవాలి).  ఆ ఏకాంత వ్యక్తి చెప్పిన ఆత్మ కథే ఈ Sensualist.

జీవితంలో ఎన్నడూ ప్రేమ లో పడని, ఆ అత్భుతమైన ఫీలింగ్ ని ఎన్నడూ తెలుసుకోలేని ఓ అబ్బాయి లైంగిక ప్రయాణం ఇది. ఇంట్లో పెద్దగా పట్టించుకోని ధనిక తల్లి తండ్రులు, తండ్రి డబ్బు సంపాదన లో బిజీ, ఆ భర్త అదుపుదలలో చిక్కి, బలహీన వ్యక్తిత్వం సంతరించుకున్న తల్లి. వీళ్ళఇంట్లో అబ్బాయి పసితనం లోనే ఇంట చేరిన అనాధ పనిమనిషి !   అభిమానం, ఆదరణా లేని చోట ఈ పిల్లాడిపట్ల  అమిత ప్రేమను, అవసరానికన్నా ఎక్కువ లాలన ని అందించే నెపాన,  చిన్న వయసులోనే ఆ పనిమనిషి అతన్ని స్వాధీనం చేసుకోవడం, తెలిసీ తెలీని వయసులో ఆమె వల్ల తెలిసిపోయిన లైంగికత్వపు రహస్యాలూ,  ఆమె విపరీతమైన కట్లు దాటిన ప్రేమా,  ఈ అబ్బాయి వ్యక్తిత్వాన్ని  పూర్తిగా మార్చేస్తాయి.  


ఎదిగాక, బాగా చదువుకుంటున్న బంధువులమ్మాయితో, ఆ తరవాత వేశ్యలతో - తన యవ్వనాన్ని అత్భుతంగా గడుపుతున్నాననే భ్రమ లో ఉన్న యువకుడు.  తనలాంటి చిన్న వయసు వేశ్య తో బహుశా ప్రేమలో పడి ఉండునేమో. గానీ అతను ఆశించినట్టు కాక,  ఆమె అతన్ని కేవలం శారీరకంగానే దగ్గరకు రానిస్తుంది.  ఆమె దగ్గర మనసూ,  ఆత్మ లేవు. ఉన్నా, అవి తనకు దక్కవు. ఆ పిల్ల వేరే ఎవరినో ప్రేమిస్తుంది. 70 ల లోనే, హోమో ల ప్రేమ ని గురించి రాసి, పాఠకుల్లో వారి పట్ల సహానుభూతిని కలిగించగలగడం రస్కిన్ బాండ్ చేసిన మంచి పనుల్లో ఒకటేమో.   ఆ పిల్ల ప్రేమను గెలుచుకోలేక శూన్యతని ఎదుర్కున్న ఈ నవ యువకుడి  మనసు కూడా పాఠకుడిని కదిలిస్తుంది. 


అలా ప్రేమ దక్కక, విరాగై పోయి, ఇల్లు విడిచి వెళ్ళి, విచిత్రమైన పరిస్థితుల్లో తన లైంగికతనీ, అహాన్నీ పీల్చి పిప్పి చేసిన ఓ రాక్షసిణి బారిన పడి ఎలానో  బైటపడి - చివరకు ఇల్లు చేరి, తాను పూర్తిగా లైంగికంగా సర్వనాశనమైనట్టు గ్రహించుకుంటాడు.  


ప్రేమ, పెళ్ళి, కుటుంబమూ, సంసారిక జీవితం ఇచ్చే భద్రతా, సౌఖ్యమూ, ఇక తన నుదుట్న రాసి లేదనుకుని, చివరికి సమాజానికి దూరంగా కొండల్లోకి పారిపోయి, బైరాగైపోతాడు. మొదట్నించీ ఈ సౌఖ్యాన్వేషణ లో పడి, అమ్మాయిల మనసుల్ని అదుపు చేసే మాయా  విద్యల్ని నేర్చుకున్న వాడు, తన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి తనకన్నా ఎన్నో ఏళ్ళు పెద్దదయిన పనావిడ చేసిచ్చే రకరకాల కషాయాల్నీ, మూలికల్నీ సేవించినవాడు... చివరికి తన మీద,  వీటన్నిటి మీదా విరక్తి చెందేడంటే, దానికి కారణం ఏమిటి? దేన్నుంచి పారిపోయి ఈ ఏకాంత జీవితం? ఎన్నాళ్ళు మరి ఇలా? ఎప్పటి వరకూ? ఇవన్నీ ఆలోచింపజేసే విషయాలే.  

కానీ అతని కథనంతా విన్నాక రచయిత చెప్పిన వాక్యాలు కళ్ళు తెరిపిస్తాయి. చాలా వైవాహిక సంబంధాలూ, మానవ సంబంధాలూ, "అహం" చుట్టూనే తిరుగుతాయి. అన్నిట్లోనూ మనల్ని మనమే కేంద్ర బిందువుగా చూస్తున్నంత వరకూ మనం బాధ పడుతూనే ఉంటాము, ఇతరుల్ని బాధ పెడుతూనే వుంటాము. అహంకారం సర్వనాశని.  స్వార్ధం కూడా మన వ్యక్తిత్వాన్ని లోతుల్లోకి తోసేస్తుంది. బుద్ధి వికసించాల్సింది, వేరే స్థాయిల్లో. మనసు వికసించేది, ప్రేమని స్వీకరించినపుడు మాత్రమే కాక, దాన్ని ఇవ్వగలిగినపుడు కూడా.  


అలా ఏ భయాల వెనకో దాక్కుని పైకి దర్పం గా ఉంటూ, తమ స్వార్ధాలతో, తమ కించపడిన వ్యక్తిత్వాలతో, మనసుల్ని బంధించేసుకునే మనుషులు జారిపోయిన అధో పాతాళాల నుంచి బయటపడేందుకు ఏదో ఒక మార్గం కావాలి.  సడెన్ గా ఓ  adventurous  పుస్తకం ఫిలసాఫికల్ గా మారడం - అంతకన్నా ముందు మానవ సంబంధాల గురించి ప్రాక్టికల్ గా చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నది ఈ అహంకారం తోనే. ఇదే అన్ని సమస్యలకు మూలం.  ఎదుటి వ్యక్తి ని ప్రేమించలేని/స్వీకరించలేని/ మన్నించలేని అహంభావం!! ఇది యాభయ్యేళ్ళ క్రితం రాసిన పాచిన సబ్జెక్ట్ ఉన్న  పుస్తకమే అయినా, ఈ విషయం స్పష్టంగా చెప్పడాన చాలా ప్రోగ్రెసివ్ అని అనిపించింది. 

సెక్స్ లో, స్త్రీని లైంగికంగా ఆకర్షించే కళలో నైపుణ్యాలు పెంచుకునే విద్యల్లో శిక్షణా, నేర్పూ ఉన్న మగ మనిషి తన అడ్వెంచర్ ల గురించీ, పతనం గురించీ అనైతిక ప్రవర్తనా, ఆలోచనలూ వ్యక్తపరిచినందుకు, ఈ కథలో వర్ణించపడిన  (స్ట్రాంగ్/వైల్డ్) మహిళల గురించీ, వారి శరీరాల గురించి రాసినందుకు దీన్నో లేకి పుస్తకం గా తీసి పడేసారు ఎన్నాళ్ళో. 


తన ఎన్నో పుస్తకాలని ఎన్నో సారులు పదే పదే ప్రచురించిన రస్కింబాండ్ ఈ పుస్తకం విషయంలో అందుకే వెనకాడినా, పెంగ్విన్ ఇండియా సంస్థ, వాళ్ళ పదవ వార్షికోత్సవ ప్రత్యేక కథా సంకలనం లో ఈ కథ ని చేర్చి రచయితకి, ఈ రచనకీ గౌరవాన్ని ఇచ్చింది.  విమర్శకులు ఈ కథ ని ఓ ఆసక్తికరమైన పుస్తకంగా పేర్కొన్నారు.  ఇదేమన్నా రచయిత వ్యక్తిగత అనుభవమా అని కూడా కొందరు అనుమానపడ్డారంట. నిజం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. నిజంలాంటి కథ ఇంకా ఆసక్తికరం. 


కొన్ని (వావ్) Para లు : 

1)  I was not the sort of person who could give anything in return for love.  As soon as I found someone tender towards me, I withdrew into myself, became remote and cold, so that the love that might have been mine was squandered in an empty void.  I was determined to leave them with a feeling of insufficiency.  Those who gave themselves to me suffered for it. I became cruel and callous towards them.  Was it victory I wanted, or the chance to spurn victory ?

2)  She did this as part of her duty ; but it wasn't all commercial enterprise.  As familiarity grew between us, we spent some time in talk. What did we have to say to each other? I don't remember much of it but this strange girl ad evolved a philosophy of her own to deal with the situation she found herself in.  It was all a question of doing one's duty, she said.  Death was a duty, just as much as life was just another way of dying.

3)  And yet, there was a tremendous innocence about the way in which this single-minded woman had  stripped me of my manhood and pretensions. Hers was overpowering innocence of the mountains - I was helpless before it, just a computer lover overpowered by natural forces.  She was not a scheming woman.  She sought to appease a basic hunger, and she did so, without a civilized veneer, without the cover of sophisticated talk.  We who have grown up in the cities cannot understand the innocence of mountain people, because we cannot understand the innocence of mountains, high places which have retained their power over the minds of men because they still remain aloof from the human presence, barely touched by human greed.  

4) You were in love with your ego, you were too concerned about your self esteem.  You took the love but spurned the lover.  And you had to lose both..


PS: The Cover Design by Gunjan Ahlawat is clever, amazing and I am a big fan.  My next book to be read, too is designed by him. (I am drawn to book covers a lot.. my weakness.)

***





27/06/2025

Prophet Song - Paul Lynch



ఈరోజు నేటో పత్రికా సమావేశం లో ట్రంప్ ని ఒక మహిళా బీబీసీ యుక్రెయిన్ రిపోర్టర్  యుక్రెయిన్ కు "పేట్రియాట్" లు ఇస్తారా/ఇస్తున్నారా అని అడిగారు. ఆమె భర్త యుక్రెయిన్ లో సైనికుడు. ఆమె, పిల్లలతో ఇక్కడ వార్సాలో ఉంటోంది. ట్రంప్ ఎప్పట్లానే "ఇజ్రాయిల్" తన మొదటి ప్రయారిటీ అన్నట్టు, పిచ్చి సమాధానం ఇచ్చి యుక్రెయిన్ కు 'ఆల్ ద బెస్ట్' చెప్పాడు. చాలా మందికి అది ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న లా అనిపించలేదు. ఒక తల్లి,  ఒక భార్య, తన కుటుంబ క్షేమం గురించి తల్లడిల్లుతూ అడిగిన ప్రశ్న అది.  ఆ వీడియో లో ఆమె  తనలాంటి ఎందరో అమ్మల ప్రతినిధి  అనిపిస్తుంది. 

మనం చాలా మామూలుగా వార్తలు చదువుతాం.  ఈ జూన్ మొదటి వారానికి, 2022 నుండీ, పాలస్తీనా జాతి హననం లక్ష్యం గా పెట్టుకుని ఇజ్రాయిల్ పలు చోట్ల చేసిన 42000 క్షిపణి దాడులలో, 25000 పాలస్తీనాలోనే జరిగాయి. 60,000 మంది చచ్చిపోయారు. 615 కన్నా ఎక్కువ రోజులు యుద్ధం నిరంతరాయంగా జరిగింది. 55000 మంది పాలస్తీనీలే చనిపోయారు. వారిలో 17000 మంది పిల్లలే. 


ఇదంతా ఎందుకు? సగం రాజకీయాలు, సగం అధికారం కోసం ప్రాకులాట, ఇంకొంచం ఆయుధ వ్యాపారం. ఒక "మంచి కరువంటే అందరికీ ఎలా ఇష్టమో", ఇలాంటి ఆగని యుద్ధాలంటే యుద్ధవ్యాపారులకు చాలా ఇష్టం. ఆ చచ్చిపోయిన పిల్లలూ, వాళ్ళ తల్లుల గురించి ఒక్క మాట అడగదు ప్రపంచం. అడిగిన వాళ్ళను విడిచిపెట్టదు. మానవత్వం లేని డిప్లమసీ ఉచ్చులో భారత దేశం కూడా చిక్కుకుపోయింది.  

మనకి, అంటే,  మామూలు యుద్ధం బారిన పడని వాళ్ళకి "యుద్ధం, మానవ మరణాలు, బాంబుల సామర్ధ్యాలు వగైరాలు" ఒక సోప్ ఓపెరా. ఒక టెలివిజన్ షో!!   టీవీలో / ఇపుడు మన మొబైళ్ళలోనూ, బాధితులను, వాళ్ళ కష్టాలనూ జనం, "ప్రాపగాండా" గా తీసిపడేసేటట్టు  చేస్తున్న శక్తులు ఉన్నాయి. ఆ కష్టాల్లో నిజంగా చిక్కుకుపోయిన కుటుంబాల బాధ మనకు పట్టదు. 

సాధారణ ప్రజలమీద దురాగతాలకు పాల్పడే పాలకులను, మిగతా ప్రపంచం చాలా నిర్లిప్తంగా చూస్తూంటుంది. "మన బాధల్ని ప్రపంచ దేశాలు చూస్తాయి, మనల్ని కాపాడతాయి" అని ఆశించడం కూడా తప్పే. హిట్లరు అలానే నెగ్గుకొచ్చాడు చాలా ఏళ్ళు.  హిట్లర్ దురాగతాలు చాన్నాళ్ళు బయటి ప్రపంచానికి తెలీలేదనే అనుకుందాం. ఇప్పుడు యుద్ధాల దృశ్యాలు మన అరచేతుల్లోకి రాలేదూ?!  అయినా మనం పెద్దగా ఆలోచించం.


అలాగే totalitarianism వైపుకు మళ్ళుతున్న దేశాల్లో,   భయానకమైన పరిస్థితుల్లో, అణిచివేతకు, నిర్బంధానికీ, హింసకూ గురయ్యే ప్రజల కథకు ఎంతో కొంత సెన్సార్ షిప్ ఉన్నా, ఎంతో కొంత బయటకు రాదా!?!  ఈ "ప్రోఫెట్ సాంగ్" అలాంటి నోరులేని బాధితుల వ్యధని చర్చిస్తుంది.  ఇలాంటి అంతర్యుద్దాలలో అన్నిటినీ కోల్పోయి, అనాధాలయిపోయే తల్లుల గురించి చెప్తుంది.

నిజానికి ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే / సమాజమే, వాళ్ళని కొద్ది కొద్ది గా  కబళించేస్తున్నపుడు, ప్రాణాలు నిలుపుకోవడం కోసం, బాధితులు శరణార్ధులుగా, కట్టుబట్టల్తో ఇంటిలోంచీ, దేశం నుంచీ, పారిపోవాల్సి రావడం, చాలా ఘోరమైన స్థితి.  అలా తమ మూలాల నుండీ, తమని తాము పెకలించుకుని, ఇంటినీ, తమ వాళ్ళనూ వదిలి రావడం వెనుక ఎంతటి సంఘర్షణ ఉంటుంది?!  


ముఖ్యంగా రాక్షస పాలననిండీ తప్పించుకోగలగడం వెనక ఎంత బాధ ఉంటుంది? ఎన్ని మూసిన దార్లు / ఎంత నిర్బంధం / ఎంత రిస్క్!! పైగా పారిపోయొచ్చిన శరణార్ధికి ఏ దేశమూ గేట్లు బార్లా తెరిచి స్వాగతం పలకదు. ప్రతి చోటా తిరస్కారం, అవమానం ఎంతో కొంత ఎదుర్కోక తప్పదు. కాకపోతే, తమవీ, తమ వాళ్ళవీ ప్రాణాలు  నిలుపుకోవడం ముఖ్యం గాబట్టి, శరణార్ధులకు వేరే దారి ఉండదు. అలాంటి శరణార్ధుల మీద సానుభూతి తో రాసిన పుస్తకం ఇది. 

ఈ మధ్య కాలంలో ఇంత కదిలించేసిన పుస్తకం చదవనే లేదు. ఎటు చూసినా  యుద్దం, నరసంహారం, కూలిపోయిన ఇళ్ళు,  శిధిలమైన నగరాలు, మన్ను గా మారిపోయిన హాస్పిటళ్ళు,  శరణార్ధులు, రాక్షసత్వం, బాంబులు, క్షిపణులు, దాడులు, మృత్యువు. ఇవన్నీ ఎంతగా అలవాటయి పోయావంటే,  మనకి అవన్నీ అవి ఏవో టీవీలో వచ్చే వార్తలు! అంతే! ఓ వేళ జనం స్పందించినా, అది మరింత రెచ్చగొట్టే యుద్ధ వాంచ, తెలిసీ తెలీని గణాంకాల గొడవ మాత్రమే. ఎక్కడో జరిగే యుద్ధాలలో చచ్చిపోయే జనం, కేవలం ఓ సంఖ్య. యుద్ధం,  భవిష్యత్తు తెలీని పరిస్థితుల నుండీ పారిపోయే శరణార్ధి ఓ న్యూసెన్స్.     

ప్రతీ యేడూ వచ్చే వరదల్లా, వానల్లా, ఎండల్లా, మెరుపులూ, పిడుగుల్లా, ఈ యుద్ధాలు, మారణకాండా కూడా సర్వసాధారణం అయిపోయి, తమ గురించి నోరెత్తే నాధుడు లేని జనం గురించి చెప్పిన కథ ఈ "ప్రోఫెట్ సాంగ్". కనీసం పెరిగిన ఎండల గురించో, ఆగని వానల గురించో మాటాడుకున్నట్టు కూడా మనుషులు "యుద్ధం" గురించి, నిష్కారణ ప్రాణ నష్టం గురించి,   మాటాడుకోవడం తగ్గించేసిన కాలం ఇది.  అన్యాయాలని, క్రమేపీ బలం పెంచుకునే ప్రభుత్వ వ్యవస్థలనీ,  టీవీలో చూసి, నిర్లిప్తమైపోయి, మొహం తిప్పుకున్న సమాజంలో ఉన్న మనకి, కొన్ని రకాల రచనలు అవసరం. 

మన వరకూ వస్తే తప్ప మన ప్రపంచం స్పందించడమే మానుకున్న ఓ ఆట ఈ యుద్ధం/అనిశ్చితి.  కళ్ళెదురుగా మారణహోమం జరుగుతున్నా, కనీసం మనుషులుగా స్పందించడం మర్చిపోయిన మానవ జాతి ని చెవి మెలేసి తీసుకొచ్చి, ఓ సంక్షోభం మధ్యలో పడేసి, నిలువెల్లా ఆ ఘోరాన్ని అనుభవింపజేసి, ప్రాణాలకోసం, ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, తపించిపోయే ఓ విద్యాధికురాలైన తల్లిని,  ప్రధాన పాత్రగా పెట్టి  రాసి, పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేసేసిన నవల ఇది.  

యుద్ధం.  అందులోనూ ఏదైనా దేశంలో  ప్రజలకీ ప్రభుత్వానికీ మధ్య జరిగే యుద్ధం అయితే మరీ నిర్లక్షం. వీటిలో ఎక్కువగా నలిగిపోయేది స్త్రీలే.  సిరియా లో అల్ అసాద్ కు వ్యతిరేకంగా యేళ్ళు గా జరిగిన సివిల్ వార్ లో దేశం నిలువునా కృశించిపోయి, వేలాదిమంధి సాధారణ పౌరులు అదృశ్యం అయిపోయి, దశాబ్దాలుగా నిర్బంధం లో ఉండి, టార్చర్ అనుభవించి, ఒంటరిగా చచ్చిపోయి, వాళ్ళ కుటుంబాలు వీళ్ళని వెతుక్కుంటూ తరాలుగా పడిన వేదన, కూలిన నగరాలు, రాళ్ళ దిబ్బల మధ్య ప్రజలు కకావికలయిపోయి, ప్రమాదకరమైన డింగీల్లో దేశం విడిచిపారిపోయి, సముద్రంలో శవాలుగా తేలి,  ఎవ్వరికీ చెందని వాళ్ళయిపోయి,  ఇప్పుడు యుద్ధం ముగిసాక తమ తమ ఇళ్ళకు రావాలని ఎదురు చూస్తున్న సిరియా ప్రజల గురించి విన్నాము.  


తీరానికి కొట్టుకొచ్చిన రెండేళ్ళ బాల శరణార్ధి ఫోటో చూసి, చలించిపోయి,  సరిగ్గా సిరియా శరణార్ధి సమస్య ని ఓ అంశంగా తీసుకుని దానికి డబ్లిన్ (ఐర్లండ్) ను వేదిక చేసి రాసిన నవల ఇది.  పరిస్థితులు మొదటి నుండీ ఘోరంగా ఉండవు. మెల్లి మెల్లిగా దిగజారుతాయి. రాజ్యం ప్రజలకి వ్యతిరేకం గా మారితే, ఆ ఒత్తిడిని తట్టుకోగలగడం, సామాన్య ప్రజలకు అసాధ్యం. ఇలా మెల్ల మెల్లగా వస్తూన్న మార్పుల గురించి హెచ్చరికలతో నవల మొదలవుతుంది. ఒక నలుగురు పిల్లలున్న అందమైన కుటుంబం, తమ  కళ్ళెదురుగుగా తమ జీవితం నేల కూలడం ఎలా చూస్తుంది అన్నది దీనిలోని ప్రధానాంశం. 

ఓ సాధారణ ట్రేడ్ యూనియనిస్ట్ అయిన లారీ స్టాక్ కేవలం, నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తినందుకు, అదృశ్యం అయిపోతాడు. అతని భార్య ఎలిష్ ఓ సెల్యులర్ ఎండ్ మాలిక్యులర్ బయాలజిస్ట్. నలుగురు పిల్లలు ఉన్న కుటుంబం. ముగ్గురు టీనేజ్ పిల్లలు, నాలుగో వాడు పసివాడు.   కేవలం రాజకీయంగా చురుకుగా ఉన్నందుకు, అన్యాయాలకి వ్యతిరేకంగా నోరెత్తినందుకు ఈ కుటుంబం వీధిన పడుతుంది. లారీ కోసం పోలీసులొచ్చి, అతను ఆ సమయానికి ఇంట్లో లేనందుకు, ఓ కార్డ్ ఇచ్చి, భలే మర్యాదగా పోలీస్ స్టేషన్ కు రమ్మని సందేశం ఇచ్చి వెళిపోవడం తో నవల మొదలవుతుంది. 

ఇంటికి వచ్చిన భర్త తో ఎన్నో మల్లగుల్లాలు పడి, అపటికే అదృశ్యం అయిన ఇతర ఆక్టివిస్టులను తల్చుకుని, బెంగపడిపోయిన భార్యకు నచ్చ జెప్పి, పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన మనిషి మరి తిరిగిరాడు. వస్తూ, దారిలో హాకీకి వెళ్ళిన పద్నాలుగేళ్ళ కూతురిని తీసుకురావాల్సిన ఆ తండ్రి రాకపోవడంతో, ఎవరో తీసుకొచ్చి, పిల్లని ఇంటికి దింపినపుడు ఎలిష్ కి అర్ధం అవుతుంది  భర్త ప్రభుత్వం చేతిలో బందీ అని. అయితే అ(న)ధికారికంగా  అదృశ్యం అయిన వారి పరిస్థితి ఇక అంతే!!  అతని విడుదల కోసం ఎందరిని కాళ్ళా వేళ్ళా పడినా ఫలితం ఉండదు. అసలు అతను ప్రాణాలతో తిరిగొస్తాడని ఎవరూ అనుకోరు. ఎలీష్  తప్ప.


అప్పటినుండీ ఎలీష్ పడిన అగచాట్లు, వేదనా వర్ణనాతీతం!  ఎదిగిన పెద్దవాడు ఎక్కడ బలవంతంగా సైన్యానికి తీసికెళిపోతారో అని భయం,  ఓ వైపు డబ్లిన్ లోనే ఇంకో వీధిలో ఒంటరిగా ఉన్న తన మతిమరుపు వ్యాధిగ్రస్తుడైన తండ్రి,  మాయం అయిన తమ  తండ్రి గురించి అడుగుతుండే పిల్లలు,  సాకాల్సిన చిన్నవాడు!  ఈలోగా యుద్ధం ముదిరి, పెద్దవాడు ఇల్లు విడిచి వెళిపోవడం, వాడి గురించి ఏ వార్తా తెలియకపోవడం, వాడు రెబల్స్ లో చేరాడని ఓ ఫోన్ కాల్ తో చూచాయగా అర్ధం అయినా, వాడు నిఘా కారణాల వల్ల తన ఆచూకీ / క్షేమ సమాచారం, తల్లికి అసలు తెలీనివ్వకపోవడం,  ఎప్పుడు ఇంట్లో ఫోన్ మోగినా వాడే అనుకుని ఈమె ఎంతో ఆశగా ఫోన్ తియ్యడం, ఒకోసారి, ఫోన్ దగ్గరకు వెళ్తూన్నప్పుడే వాడితో మాటలు మొదలు పెట్టేయడం,  తండ్రి "అదృశ్యాన్ని" ప్రశ్నిస్తూ ఉండే పన్నెండేళ్ళ  రెండో వాడు. పిల్లలు బాధపడతారని, భయపడతారని, వాళ్ళకి నిజం చెప్పక, తల్లి పడే బాధ!!  

ఈ రెండోవాడు, బాగా నోరు జారే రకం. తల్లి తో అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాడు.   చుట్టూ జరుగుతున్న పరిణామాలతో బెంగపెట్టుకుని సరిగ్గా తినడం మానేసిన కూతురు. ఈ పిల్లే కాస్త తల్లి బాధని, ఆమె దిగమింగుకున్న దుఃఖాన్నీ అర్ధం చేసుకున్న  ఏకైక సాయం.  నవలంతా ఆమె తల్లికి అండగా ఉంటూనే ఉంటుంది. పసివాడికి ఈ కష్టాలేవీ తెలీవు. 


మెల్లగా ఉద్యోగ జీవితంలో ఒంటరి అయిపోయి, అది కూడా కొన్నాళ్ళకి కోల్పోయి, నిర్బంధం లో ఉన్న నగరంలో నిత్యావసరాల కోసం కూడా ప్రాణాలు గుండెల్లో పెట్టుకుని  పలు చెక్ పోస్టులు దాటి, అటు తండ్రి నీ, ఇటు పిల్లల్నీ కనిపెట్టుకుంటూ, ఓ వైపు భర్త కోసం, పెద్ద వాడికోసం తల్లడిల్లిపోతూ, వాళ్ళు చనిపోయే ఉంటారని ఎవరు చెప్పి ఆమెను నగరం విడిచిపెట్టి వెళిపోమన్నా, నిరాకరిస్తూ,  మొండి గా నెట్టుకొస్తూ, అగచాట్లు పడుతుంది.  


నవల మొత్తం ఎలిష్ దే.  ఓవైపు కెనడాలో స్థిరపడ్డ చెల్లెలు అక్కను, తండ్రిని తన వద్దకు రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. రాజకీయ శత్రువు కుటుంబం కాబట్టి,  ఐరిష్ ప్రభుత్వం కుంటి సాకులతో ఎలీష్ ని అష్టదిగ్బంధనం చేసేస్తుంది.  ఈ కుటుంబానికి పాస్పోర్ట్ లు సైతం నిలిపేస్తుంది. దాని వల్ల, సమయం ఉండగానే  న్యాయమైన దారుల్లో దేశం దాటడం అసాధ్యం అయిపోతుంది. 

ఎప్పటికైనా తన వాళ్ళు వస్తారని భ్రమల్లో ఉండడం వల్ల, ఎలిష్ 'తల్లి ప్రాణం', దేశం విడిచి  పారిపోయేందుకు ఒప్పుకోదు. ఎన్నో సంఘర్షణలు, అంతులేని విషాదం మధ్య చివరకు తనను తాను, తన ఇంటి నుండీ, నగరాన్నించి, కుటుంబం నిర్మించుకున్న జీవితం నుంచీ, బయటకు లాక్కుని,  చెల్లెలు పంపిన డబ్బుతో,  స్మగ్లర్లని నమ్ముకుని, దేశాన్ని దాటుతుంది. టీనేజ్ కూతురిని గార్డులు 'చెడ్డ' దృష్టి తో చూస్తున్నారని, ఆ పిల్ల అందమైన జుత్తును పూర్తిగా కత్తిరించేసి,  మేకప్ ని చెత్తబుట్ట లో పడేసి, చంటి పిల్లాడితో దేశం విడిచి, శరణార్ధి అయిపోతుంది ఎలిష్.  లీలగా మారిపోయిన తండ్రినీ, సోదరులనీ విడిచి వెళ్ళలేక,   నేను "రాను రానని" మొండికేస్తున్న, ఏడుస్తున్న కూతుర్ని బ్రతిమాలుకుని, సముద్రాన్ని చూపించి, "ఇదిగో.. ఇటే జీవితం ఉంది" అని చెప్పగలుగుతుంది. ఆ స్టేజ్ వరకూ వచ్చేందుకు ఆమె పడిన వేదన, అనుభవించిన కష్టాలు, పాఠకుడిని ఊపిరిసలపనివ్వవు. 

ఈ నవల మనల్ని తనలోకి లాక్కుంటుంది. ఈ తరహా డిస్టోపియన్ రచనల్లోకి వెళ్ళడం కష్టం. కానీ డబ్లిన్ నగరం, ఐరిష్ బాక్ గ్రౌండ్, చాలా రిలేటబుల్ గా ఉండడం తో, పైగా ఐరిష్ చరిత్ర కాస్తో కూస్తో తెలిసిన సగటు పాఠకుడికి కూడా, ఈ కథ ఇక్కడ జరిగి ఉంటుందనుకోవడంలో ఏ చిక్కూ ఉండదు.  విప్లవాత్మక ఆత్మ ఉన్న  ఐర్లాండ్ కూడా ఎందరో తల్లులకు గర్భశోకం మిగిల్చినందుకు, ఈ డబ్లిన్ నేపథ్యం కథకు సరిపోతుంది.


ముఖ్యంగా నవలలో కొటేషన్ లు, కామాలు, ఫుల్ స్టాప్  లు, పేరాలు ఉండవు. ఒకటే వాక్యాల వరద ప్రవాహం.  ఈ ధోరణి, ఎలీష్ నిస్సహాయతని అర్ధం చేసుకునేందుకు పనికొస్తుంది.  ఈ వరదలోకి దూకడం మొదట్లో భయం పుట్టించినా, కథ లోకి మనం కూడా చేరిపోయి,  పాత్రల డైలమ్మా లలో, కష్టాలలో, ఆలోచనలలో, బెంగల్లో మనల్ని మనం చూసుకుంటాం. పరిస్థితులు ముదిరే కొద్దీ "ఎలీష్ ఎందుకు ముందే పారిపోలేదు ?  ఇంత నష్టం జరిగే దాకా ఎందుకుంది. అసలు ఏమీ లేకుండా  ఎలా బ్రతికింది ?" అని కోప్పడలేము. ఆమెను పారిపొమ్మని ఒత్తిడి చేసే శ్రేయోభిలాషుల మీద అభిమానం కలుగుతుంటుంది.  ఎలీష్ కు మాత్రం ప్రాణం ఒప్పుకోదు.  ఓసారి "మార్క్ (పెద్దబ్బాయి) ఇంటికి ఎప్పటికైనా తిరిగి రాడా ? వస్తే మేము ఇక్కడ లేకపోతే ఎలా? వాడొచ్చి, ఆకలితో ఫ్రిజ్ తలుపు తెరిచి హేం (HAM) వెతుక్కుంటాడు. నేను ఉండకపోతే ఎలా? " అంటుంది. 

నవల లో మొదటి పేజీలు చదవడానికి కొంచెం ఇబ్బంది గా అనిపించినా, కథ మనసుని మెత్తగా చేస్తూ, ఒకటీ అరా సెకెన్లు కన్నీళ్ళు పుట్టించి, ఆపకుండా చదివిస్తుంది.  అప్పటి దాకా సాధారణం గా ఉన్న పరిస్థితులు ఒక చెడ్డ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినపుడు  ఎంతలా ఘోరంగా మారవచ్చో చూస్తాం.  కథ ఒక్క కుటుంబానిదే కాదు, దేశం మొత్తానిది.  రెబల్స్  ఇళ్ళ మీద దాడులు జరిగినపుడు క్షతగాత్రులను హాస్పిటల్ కు తీసుకెళితే అక్కడ కూడా షెల్స్ పడి, ఇంకో హాస్పిటల్ కు పరిగెత్తాల్సొస్తుంది. అది ఎంత గాభరాగా ఉంటుందో పాఠకులకు కూడా!!

నాకు నిరాశావాదంతో నిండి ఉన్న పుస్తకాలు చదవడం అంటే  కొన్ని అభ్యంతరాలు ఉన్నా, ఈ పుస్తకం కొంత దూరం గడిచాక అర్ధం కాకపోవడం తో, మొదట 'సినాప్సిస్' చదివి ముందుకు వెళ్ళాను. ముఖ్యంగా కథ ఇక్కడ ముఖ్యం కాదు. ఇలాంటి "ఎవరికీ పట్టని కుటుంబాలు" కొన్ని వేలు లక్షలు ఉన్నాయి. ఇలాంటి "దిక్కూ మొక్కూ"  లేని చావులు కూడా కోకొల్లలు.  కాపోతే, ఆ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించడం, రచయిత చేసిన గొప్ప పని. 


కథ లో ముందుకు ఏమి జరుగుతుందో ముందే తెలిసినా చదివించగలగడం, చాలా గొప్ప విషయం. పాల్ లించ్ చాలా ఇంటర్యూలలో, ప్రోఫెట్ సాంగ్ కథ ని గురించి ప్రశ్నల్లో స్పాయిలర్ లు ఉంటాయి. అయినా ఈ పుస్తకం ఎంతో ఆదరణ పొందింది. 2023 లో బుకర్ ప్రైజ్ దక్కించుకుంది. పోటీలో దీనికన్నా గొప్ప రచనలు ఉన్నాయి అని ఆ సంవత్సరం చాలా మంది పెదవి విడిచారు. కానీ బహుశా 'మనిషి', ఇంకో 'మనిషి కష్టాలని' చూసి స్పందించగలిగే హృదయాన్ని కోల్పోకుండా చేసే సాహిత్యాన్ని ప్రోత్సహించడం కోసం ఈ ప్రైజ్ ని ఈ పుస్తకానికి ఇచ్చుంటారు. 

పుస్తకాన్ని ఒక వారం లో రెండు మూడు సార్లు చేతిలోకి తీసుకుని, వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. కేవలం డిస్టోపియన్ అని / ఈ 'పేరా' లు లేని, ఎవరు ఎవరితో ఏమంటున్నారో తెలీనివ్వని శైలి.. చదవలేక, చదివాక ఆ కష్టాలు తట్టుకోలేక ఆపి, ఆతరవాత మెల్లిగా కథ లోకి దూకి, పాత్రల మనసులు చదివేసి, వాళ్ళ పరిస్థితుల్ని నీవిగా భావించి, ఆ పుస్తకంలోకి మమైకం అయిపోయేటట్టు చేసేసినందున మొత్తానికి, పూర్తిగా చదివాను. మధ్య లో కొన్ని సార్లు  భావాల గాఢత తట్టుకోలేక, రోజుల కొద్దీ పూటల కొద్దీ బ్రేక్ లు తీసుకున్నా కూడా, పూర్తి చేసే దాకా చదివించింది. మతిమరుపు తండ్రి తో ఎలీష్ సంభాషణలు, బెంగ, అతని అదృశ్యం, అతని ఫోన్ కాల్ లు, ఎలీష్ ఆందోళనలు, తండ్రి మీద ప్రేమ - వీటన్నిటినీ చదివి, ఓ రోజంతా ఏడ్చాను.   ఒక పుస్తకం ఇంత కదిలిస్తుందా ? అని ఆశ్చర్యం కలిగింది. 

కొన్ని గుండెను మెలిపెట్టే సన్నివేశాలు :

ఎలీష్ భర్త అదృశ్యం, అతను మరి రాడని అర్ధం అయేందుకు చాలా సమయం పట్టడం, అతనిని ప్రతి సంభాషణలోనూ, ప్రతి సంఘటనలోనూ తలచుకోవడం, కలల్లో అతన్ని హత్తుకుని పడుకుని, లేచి చూస్తే అతను లేకపోవడం.  పెద్దవాడి గురించి న్యూస్ పేపర్ లో చూసి తెలుసుకోవడం, రెండోవాడి తిరుగుబాటు ధోరణి, తల్లిని కావాలని బాధ పెట్టేలా వాగడం, చివర్లో తల్లిని హత్తుకుపోయే తెలిసీ తెలీని పసితనం, అతని కోసం, తల్లి పడ్డ పాట్లు, ఎలీష్ చెల్లెలి ప్రయత్నాలు, ఎలీష్ బాస్ వ్యవహారం,  మొత్తానికి సరిహద్దు దాటాల్సొచ్చినపుడు, కూతురు మోలీ జుత్తు కత్తిరించడం, (పద్నాలుగేళ్ళ పిల్ల ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం) ఈ అగాధాలు తెలీని చిన్న పిల్లవాడు, వాడి మందుల రేట్లు, పాల ఖర్చు, సగం ప్రాణాన్ని ఐర్లండ్ లోనే వదిలి, సగాన్ని పిల్లలకోసం పణం గా పెట్టి, ఎలీష్ భవిష్యత్తు వైపు ప్రయాణం చెయ్యడం.

ఇలా ఎలీష్ తో ప్రయాణం మొదలు పెట్టి, ఆమె తోనో నడుస్తూ, ఆవిడ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ, పాఠకుడు కూడా ప్రయాణిస్తూ ఉండడం వల్ల, ఆ కష్టాల ఇంటెన్సిటీ అర్ధం అయి, అసలు ప్రపంచ వ్యాప్తంగా "ప్రమాదం లో ఉన్న ప్రజాస్వామ్యన్ని" కాపాడుకోవడం ఎందుకు అంత అవసరమో తెలుస్తుంది.  ఎన్నో మంచి రివ్యూలు, ఎంతో ప్రశంస పొందిన ఈ నవల, మనిషిని  cleanse  చేసి పడేస్తుంది.  రాజకీయాల మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నా ఈ పుస్తకం చదవొచ్చు. సాధారణ ప్రభుత్వాలు కూడా ప్రమాదకరం గా ఎలా మారతాయో, మారితే ఏమి జరుగుతుందో అర్ధం అవుతుంది. 

Some clips : 






Some quotes : 

(a) ఆమెను ఒప్పించడానికి చెల్లెలు ఏన్ అన్న మాటలు : I wish you would listen to me, history is a silent record of people who did not know when to leave. 

(b) History is silent record of people who could not leave, it is a record of those who did not have a choice, you cannot leave when you have nowhere to go and have not the means to go there, you cannot leave when your children cannot get a passport, cannot go when your feet are rooted in the earth and leave means tearing off your feet. 

(c) Seeing how they have made an end of death by meeting it with death. 

(d) I don't see how free will is possible when you are caught up within some monstrosity, one thing leads to another things until the damn thing has its own momentum and there is nothing you can do. 


***