Pages

26/08/2024

Banned Books (DK Series)




మనం రాయడం మొదలు పెట్టినదగ్గరినుండీ,  పుస్తకాల మీద  నిషేధాలు ఉన్నాయి. వాటిని జాబితాలలో చేర్చడమూ ఉంది.  1559 లో కేథలిక్ చర్చ్, నిషేధింపబడిన పుస్తకాల జాబితాను " Librorm Prohibitorum" (Index of Prohibited Books) అనే పేరుతో తీసుకొచ్చింది.  ఆ నిషేధ సంస్కృతి  నాలుగొందల సంవత్సరాల తరవాత ఇరాన్ కు చెందిన 'ఆయతుల్లా రొహల్లా ఖొమైనీ', 'ద సాటనిక్ వెర్సెస్' అనే పుస్తకం రాసినందుకు సాల్మన్ రష్దీని చంపేయమని ఫత్వా జారీచేసేంతవరకూ వచ్చింది. సంపూర్ణ నిషేధాలు - అంటే ఒక పుస్తకం ప్రచురింపబడకుండా, అమ్ముడుపోకుండా చేయడం, సెన్సార్ చేయడం మాత్రమే కాకుండా చేయడమే కాకుండా, ఒకవేళ అప్పటికే అందుబాటులో ఉంటే, లైబ్రరీలనుండీ తీసేయడం, పాఠకులకు దొరకనీయకుండా చేయడం వగైరాలు కూడా.    


ఫ్రెంచ్ విప్లవం జరిగినపుడు మొదటి సారి "ఫ్రీడం ఆఫ్ స్పీచ్" అనే అంశం 1789 లో తెరపైకి వచ్చింది.  రెండేళ్ళ తరవాత అమెరికాలో ఫర్స్ట్ అమెండ్మెంట్ లో ఇదే అంశాన్ని తీసుకున్నారు. ఇవి ఉన్నాకూడా పుస్తకాలని నిషేధించడం ఎక్కడా ఆగలేదు. రచయితల హక్కులు, పాఠకుల హక్కులని పరిమితం చేసారు. వ్యాజ్యాలు నడిపారు.  పుస్తకాలని సంవత్సరాల కొద్దీ నిషేధించారు. డీసెంట్ గా లేవనో, హింస నో సెక్స్ నో, ప్రేరేపిస్తున్నాయనో నిషేధించడం కాస్త అర్ధం చేసుకోదగినదే అయితే, జాత్యాహంకారులు, యుద్ధోన్మాదులు, రాజకీయ వాదులు, చరిత్రనో, సైన్స్ నో అంగీకరించని వారు కూడా నిషేధాలని నడిపించారు.  అయితే ఎన్నో గొంతులు కలిసి చేసిన పోరాటాలవల్ల, రాసిన వాళ్ళూ, చదివినవాళ్ళూ, నిషేధించినవాళ్ళూ, ప్రభావితులవడం వల్ల, మనలో మెల్లగా మార్పు వచ్చింది. మానవత్వాన్ని గుర్తు చేసే హక్కు పుస్తకాలకు ఉన్నంతకాలం, వాటి మీద నిషేధాలు వాటిని ఆపలేవు. 

ఈ పుస్తకంలో వివాదాస్పదమనో, రెచ్చగొట్టే స్వభావం ఉన్నందుకో, విప్లవ భావాలను ప్రచురించినందుకో నిషేధింపబడిన పుస్తకాల గురించి సమాచారం ఉంది. వీటిని చరిత్రలో ఎక్కడో ఓ చోట, ఏదో ఒక టైం లో ఆపేందుకు ప్రయత్నించారు. పుస్తకాల్ని నిషేధించడం, వాటి ప్రతుల్ని దొరకనీయకుండా చెయడం, కుప్ప పోసి తగలబెట్టడం, వాటి గురించి ప్రజలెవ్వరూ మాటాడకుండా చెయ్యడం, ఇల చాలానే జరిగాయి.  అయితే, ఇవి ఆయా పుస్తకాలకి మంచే చేసాయి. నిసేధింపబడిన చాలా పుస్తకాలు సూపర్ డూపర్ హిట్ లు అయ్యాయి. జనం లో వాటిని చదవాలన్న ఉత్సుకత పెరిగింది. మార్క్ ట్వైన్ అన్నట్టు పుస్తకాల అందుబాటుని పరిమితం చేస్తే, వాటి అమ్మకాలు పెరుగుతాయి. ఎందుకంటే, నిషేధింపబడిన పుస్తకాన్ని చదివేందుకు అందరికీ ఆసక్తి ఉంటుంది. 

ఈ పుస్తకం లిస్ట్ చేసిన పుస్తకాలు ఇప్పుడు మనం చాలా మటుకు చదివినవే. ఉదాహరణకు ఒకప్పుడు  బైబిల్ కూడా నిషేధింపబడిన గ్రంధమే.  అలాగే స్వచ్చంద మరణం గురించి వాదించే పుస్తకాలతో పాటు, హత్యలు చేయడం ఎలాగో చెప్పే పుస్తకాలు కూడా నిషేధింపబడ్డాయి. స్వేచ్చ ఉంది కదా అని ఇష్టం వచ్చినది రాయడం, దాని ద్వారా సమాజానికి హానిచెయ్యడం మంచిది కాదని చర్చలు జరిగాయి. ఇప్పుడు కాలానుగతంగా పుస్తకం లో భాగాలను చూస్తే అవి ఇలా ఉన్నాయి:-

  1. Pre - 1900
  2. 19 Century
  3. Between the Wars
  4. The Post War Years
  5. The Late 20th Century
  6. The 21st Century

ఇప్పుడు నిషేధింపబడిన పుస్తకాల జాబితాలో ఇప్పుడు బాగా పేరు పొందిన,  కొన్ని ప్రముఖ పుస్తకాల పేర్లు చూద్దాం. 
  • The Canterbury Tales
  • Wycliffe's Bible
  • Grimm's Fairy Tales
  • Frankenstein
  • The History of Mary Prince
  • Te Communist Manifesto
  • Madame Bovary
  • On the Origin of Species by Means of Natural Selection
  • Adventures of Huckleberry Finn
  • The Earth
  • The Awakening
  • Ulysses
  • Mein Kamph
  • Lady Chatterley' Lover
  • The Well of Loneliness
  • A Farewell to Arms
  • All Quiet on the Western Front
  • As I Lay Dying
  • Brave New World
  • Gone with the Wind
  • Their Eyes were watching God
  • The Grapes of Wrath 
  • The Diary of a Young Girl
  • Nineteen Eighty Four
  • The Catcher in the Rye
  • Fahrenheit 451
  • The Lord of the Files
  • Lolita
  • Doctor Zhivago
  • Things Fall Apart
  • A Raisin in the Sun
  • To Kill a Mockingbird
  • Catch - 22
  • One Flew over the Cuckoo's Nest
  • The Autobiography of Malcom X
  • I Know Why the Caged Bird Sings
  • Slaughterhouse-Five
  • Black Voices from Prison
  • Maurice
  • The Color Purple
  • The Handmaid's Tale
  • Beloved
  • Spycatcher
  • The Satanic Verses
  • The Alchemist
  • Final Exit
  • American Psycho
  • Shame
  • The God of Small Things
  • The Harry Potter Series
  • The Kite Runner
  • The Bastard of Istanbul
  • The Cartoons that Shook the World
  • Melissa (formerly George)
  • The Hate you Give
  • I Have Men
  • 1000 years of Joys & Sorrows

Surprising !  వీటిల్లో ఎన్ని అత్భుతమైన పుస్తకాలున్నాయో కదా.  కొన్ని మీరు విమర్శించే పుస్తకాలు కూడా ఉండొచ్చు.  కొన్ని వాణిజ్యపరంగా చాలా సక్సెస్ సాధించినవి కూడా ఉన్నాయి.  నల్లజాతి మహిళల పుస్తకాలు, మెక్సికో, రష్యా దేశాల గొంతులనీ అణిచివేసే ప్రయత్నాలు, బానిసత్వ నిర్మూలనని వ్యతిరేకించే లాబీలు ఈ నిషేధాలలో పెద్ద పాత్ర పోషించాయి. కొన్ని నిషేధాల్లో, తమ  పిల్లలు ఈ బాధితుల రేప్, హింసల వర్ణనలు చదవరాదంటూ అమెరికాలో స్కూలు పిల్లల తల్లిదండ్రులు పట్టుబట్టడం కూడా ఉంది.  అలా  ఈ పుస్తకంలో వీటన్నిటి గురించి, ప్రతి పుస్తకం గురించీ, ఒకటీ రెండు పేజీల సమాచారం ఉంది. ఎవరు ఏ పుస్తకాన్ని ఎందుకు వ్యతిరేకించారు ? ఎలా కేసులు నడిచాయి. ఎన్నాళ్ళు నిషేధించారు వగైరాలు.  చాలా ఆసక్తికరంగా ఉంది.  

వీటి నిషేధాలకి ఆయా దేశ కాల మాన పరిస్థితుల బట్టీ బోల్డు కారణాలున్నాయి. ఉదాహరణకు చైనాలో పాశ్చాత్య భావజాలం, యూరోపియన్ ప్రభావాన్ని పెంచే సాహిత్యం నిషేధం. వాటి ప్రతులు తైవాన్, హాంగ్ కాంగ్, మంగోలియాలలో విస్తృతంగా అమ్ముడుపోయినా కూడా, చైనా లో అవి దొరకవు. రచయితలు ఇతర దేశాల్లో శరణార్ధులవుతారు. దేశంలోనే ఉంటే మాయమవుతారు. ఇస్లామిక్ దేశాల్లో ఇస్లాం మీద పట్టు కోసం ఇరాన్, సౌదీల్ అరేబియా దేశాలు  కొట్టుకుంటూ, ఇలాంటి మతాన్ని చర్చించే పుస్తకాల  నిషేధాల మీద ప్రత్యేకాశక్తి కనపరుస్తాయి. మతానికి వ్యతిరేకంగా రాస్తే అక్కడ కఠిన శిక్షలుంటాయి.  ఇరాన్ లో మరీ కఠిన శిక్షలు ఉంటాయి. 

అయితే, భావ వ్యక్తీకరణ స్వేచ్చకు ఈ నిషేధాలు ప్రమాదకరం కాబట్టి, కాల పరీక్షకు ఎదురొడ్డి వీటిలో చాలా పుస్తకాలు బయటికొచ్చాయి, బాగా అమ్ముడుపోయాయి, చరిత్రని మార్చాయి. చలనచిత్రాలుగా రూపు దిద్దుకున్నాయి. బోల్డెన్ని అవార్డులు అందుకున్నాయి. సినిమాలుగా మారాక, పుస్తకాల అమ్మకాలు బాగా పెరిగాయి. యుద్ధం మీద, యుద్ధం వల్ల కలిగే వినాశనాన్ని గురించి, జాతి హననాన్ని  గురించీ ఈ పుస్తకాలు, సినిమాలు బాగా డాక్యుమెంట్ చేసాయి. వీటివల్ల చాలా మటుకు ప్రజాభిప్రాయాలలో మార్పు వచ్చింది. స్త్రీ పురుష సంబంధాల గురించి, హోమో ఫోబియా గురించీ,  మతం, రాజకీయ నమ్మకాల గురించి, సైన్స్ గురించి, రచయితలు రాసి ఆరోజుల్లో చాలా కష్టాలకు గురయ్యారు. భూమే సృష్టికి కేంద్రం అని నమ్మిన మానవాళి, సూర్యుడి గొప్పదనాన్ని ఒప్పుకునేంతవరకు హీలియో సెంట్రిక్ పుస్తకాలు నిషేధింపబడ్డాయి.

పై పుస్తకాలు చాలా మంది చదివే ఉంటారు. జాతి వివక్ష గురించి మాట్లాడడం, స్త్రీ లైంగిక  స్వాతంత్రాన్ని గురించి మాట్లాడడం, స్వలింగ సంపర్కం, కులం, మతం గురించి మాటాడడం ఒకప్పుడు పెద్ద నేరం. ఇప్పటికీ కొన్ని విషయాల పై మట్లాడడం నేరమే. రేపొద్దున్న జనంలో మానవత, విచక్షణల గురించి మేల్కొలుపులు రావడానికి పుస్తకాలే అవసరమవుతాయి. ఎందుకంటే, పుస్తకాల నుండే సినిమాలు, వెబ్ సెరీస్ లు వస్తాయి. పుస్తకాల నుండే అయిడియాలు వస్తాయి. మేధ వికసిస్తుంది. భాష పరిపుష్ఠం  అవుతుంది. 

 
మనకి బాగా తెలిసిన పుస్తకాల గురించి చిన్న నోట్స్ : 

లజ్జ (SHAME) - తస్లీమా నస్రీన్.

బాబ్రీ మసీదు విధ్వంసం తరవాత భారత దేశం తో పాటు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో కూడా అల్లర్లు చెలరేగాయి. బంగ్లాదేశ్ లో ఉన్న చిన్ని హిందూ మైనారిటీని రక్షించడంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ వైఫల్యాలని గురించి లజ్జ అనే పుస్తకాన్ని రాసారు. బంగ్లా భాషలో మొదట ప్రచురితమైన పుస్తకం నాలుగు నెలల్లో 60,000 కాపీలు అమ్ముడుపోయింది. అయితే అవే నాలుగు నెలలు గడవగానే, బంగ్లదేశ్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది. నస్రీన్ ప్రాణాలు తియ్యాలని అనధికార ఫత్వాలు జారీ అయ్యాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు నస్రీన్ శరణార్ధి అయ్యారు, మొదట స్వీడన్ లో తరవాత భారతదేశం లోనూ ఆశ్రయం పొందారు. ఈ ఒక్క నిషేధిత పుస్తకం తో నస్రీన్ ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. 

Satanic Verses - Salman Rushdie 

Magic Realism లో రాసిన ఈ పుస్తకం తో 1980 లో ఓ పెద్ద యుద్ధానికే తెర తీసారు.  ఇద్దరు భారతీయ పురుషులు మధ్య జరిగిన కథ. ఇద్దరూ లండన్ కు వెళ్ళే విమానంలో ప్రయాణిస్తుండగా విమానం ఉగ్రదాడిలో చిక్కి, పేలిపోతే, వీళ్ళిద్దరూ మాత్రం ప్రాణాలు దక్కించుకుని ఒక  బీచ్ లో తేలతారు. వీళ్ళలో ఒకరు దేవత గా, ఒకరు సాతాను గా మారడంతో కథ మొదలవుతుంది. ఇక్కడినిండీ, కలా, సాహసాల మధ్య వీరి ప్రయాణం మత చర్చలు చేస్తూ సాగుతుంది. చాలా మంది ముస్లిములు ఈ పుస్తకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే, దీనిలో విలన్ పాత్ర మహమద్ ప్రవక్తని పోలి ఉంటుంది. దాంతో పుస్తకం నిషేధానికి గురయ్యింది. 

ఫిబ్రవరి 1989 లో ఇరాన్ కు చెందిన ఆయతుల్లా ఖొమైనీ రష్దీని చంపమని ఫత్వా జారీ చేసారు. ఒక మతకారుడు ఇలాంటి ఫత్వాని ఇస్తే, కేవలం ఇచ్చిన వాడే దానిని ఉపసంహరించుకోవాలి. కానీ జూన్ 1989 లోనే ఖొమైనీ మరణించాడు. ఫత్వా వెనక్కు తీసుకోబడలేదు. రష్దీ కొన్ని సంవత్సరాల పాటూ దాక్కున్నాడు. సాయుధ రక్షణలో బిక్కు బిక్కు మన్నాడు. అతని జపనీస్ అనువాదకుండిని చంపేసారు. ఇటాలియన్, నార్వే పబ్లిషర్ ల మీద పెద్ద దాడులే జరిగాయి. పుస్తక వ్యతిరేక ప్రదర్శనల్లో జరిగిన అల్లర్లలో 59 మంది చనిపోయారు.  ఇంత హింసకు చలించి,  రష్దీ "అల్లానే దైవం అనీ, ప్రవక్త దేవుడికి ప్రామాణికం అని" ఒప్పుకుంటూ స్టేట్మెంట్ జారీ చేసాడు.  అయినా ఈ నవల భారతదేశం, బాంగ్లదేశ్, సూడాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, కెన్యా, థాయిలాండ్, టాంజానియా, ఇండోనేషియా, సింగపోర్, వెనిజుయేలా లలో నిషేధించబడింది. ఒక్క సౌత్ ఆఫ్రికాలోనే 2002 లో ఈ నిషేధాన్ని ఎత్తేసారు.  తరువాత ఆ లొంగుబాటు ప్రకటన ఒక పొరపాటని రష్దీ విచారించాడు. 

ఈ పుస్తకంలో ఒక పాత్ర ఇందిరాగాంధీని పోలి ఉంటుంది. ఒక 'క్రూరమైన వితంతువు, తన భర్త మరణానికి కారణం ఐంది' అంటూ ఇందిరను గురించి చెప్తున్నట్టుగా ఉంటుంది. దీనితో ఇందిరా గాంధీ రష్దీ మీద కేసు వేసి గెలిచారు. అయితే తరవాతి ప్రచురణల్లో ఇందిర పాత్రను మార్చలేదు. కేవలం ఆమె పరువుని తీసేసే 'భర్తను చంపినదంటూ' రాసిన ఒక్క వాక్యాన్ని మాత్రం తొలగించారు. 

రష్దీ ప్రాణం పై ఇటీవల దాడి జరిగినపుడు ఆయన ఒక కన్నుని కోల్పోయారు. అయినా ఆయన రచనలు రావడం ఆగలేదు. చార్ట్ బస్టర్లు కావడమూ ఆగలేదు.  

Killing Commendatore - Haruki Murakami 

మురకామీ 14 వ నవల, అతని అన్ని పుస్తకాల లానే, రసవత్తరంగా, అత్భుతంగా దట్టించిన  సెక్స్, స్పష్టమైన శృంగార సన్నివేశాలతో నిండి వుంటుంది. హాంగ్ కాంగ్ Obscene Articles Tribunal,  దీనిని ఇండీసెంట్ పుస్తకంగా అభివర్ణించింది. "హింస, లేకితనం, జుగుప్స కలిగించే పుస్తకంగా" దీనికిపేరిచ్చింది. 

అయితే మురకామి ఇతర పుస్తకాల కన్నా ఎక్కువ సెక్స్ ఈ పుస్తకంలో గుప్పించనప్పటికీ, దీనిని మాత్రం నిషేధించడానికి హాంగ్ కాంగ్ అల్లర్లలో బీజింగ్ పట్ల వ్యతిరేక భావాలని ప్రకటించినందుకు గాను మురకామీ చైనా ప్రభుత్వ ఆగ్రహానికి గురవ్వడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. హాంగ్ కాంగ్ బుక్ ఫెయిర్ లో ఈ పుస్తకానికున్న చైనీస్ అనువాదాల్ని ఆఘమేఘాల మీద తీసేసారు. వెనువెంటనే చైనా మార్కెట్ నుండీ తీసేసారు. హాంగ్ కాంగ్ లో 18 ఏళ్ళు దాటిన పాఠకులకి మాత్రమే సీల్ వేసిన పుస్తకం అమ్మాలని రూల్ ఇచ్చారు. ఆ విధంగా పుస్తకం ఇతరభాషల్లోనూ హిట్ అయింది, బీజింగ్ పట్టుదల మీద మురాకామీ గెలుపూ స్పష్టమైంది. 

The Bastard of Istanbul - Elif Shafak

అర్మేనియన్ క్రిస్టియన్ ల పై జరిగిన మారణ కాండ గురించి, టర్కీలో మాటాడడం నేరం. 1915 లో ఆర్మేనియన్ మారణకాండ జరిగింది.  ఓట్టోమాన్ సామ్రాజ్యంలో తరతరాలు గా నివసించిన రకరకాల జాతి మతాల వారిలో ఒకరైన క్రిస్టియన్ మైనారిటీ కి చెందిన వారిని చుట్టు ముట్టి, టర్కీనుండీ నుండీ వెళ్ళగొట్టారు. అర్మేనియన్ మేధావుల్ని  24 ఏప్రిల్ 1915 న కాల్చి చంపేసారు.మిగిలిన వారిని సిరియా లో ఎడారి వైపుకు తరిమారు. 650,000 మంది ఆ ప్రయాణంలో ఆకలితో, అలసటతో మరణించారు. తరవాతెప్పుడో టర్కీ ప్రభుత్వం, ఈ మారణకాండ ని కొట్టిపారేసింది. ఎంతో ఒత్తిడి మీద "అవును చిన్న మొత్తంలో ఏదో కాస్త జరిగిందిలే" అన్నట్టు ఒప్పుకుంది. ఈ మారణ కాండ గురించిన ప్రస్తావన ఉన్నందుకు ఈ పుస్తకం నిషేధించబడింది. 

ఎలిఫ్ షఫాక్ లాంటి ఆడది, అర్మేనియన్ జీనసైడ్ లో ప్రాణాలు కోల్పోయిన ఓ అమ్మమ్మ మనవరాలిని అని తన ప్రధాన పాత్ర చేత చెప్పించడం వివాదాస్పదమైంది. ఈ మారణ కాండ ని గురించి చర్చించినందుకు టర్కీకి ప్రపంచ వ్యాప్త కీర్తిని తెచ్చిన 'ఓర్హాన్ పాముక్' ని కూడా కేసుల్లో ఇరికించారు. ఈ ఒక్క పుస్తకం చాలా గొప్ప స్టేట్మెంట్ నే ఇచ్చింది.  

ఇంకా చాలా మంచి మంచి పుస్తకాలే ఉన్నాయి ఈ పుస్తకంలో. చాలా మంచి నోట్స్ తో ! చదివిన వాళ్ళు - బ్లాక్ హిస్టరీ, బ్లాక్ లైవ్స్ మేటర్, ఎథునేసియా, రక రకాల దేశ చరిత్రలు, కమ్యూనిజం, మావోయిసం, మార్క్సిసం తదితర అంశాలపై వెలువడిన మంచి సాహిత్యం, కనువిప్పు సాహిత్యం, ఒకప్పుడు నిషేధాల లో నలిగి, అరిగి, పైకొచ్చిన విధానం గురించి తెలుసుకుని చాలా ఆనందిస్తారు.  

ఇంకా చాలా రాయాలనే ఉంది ఈ పుస్తకం గురించి. కానీ పైనిచ్చిన లిస్ట్ లో ఉన్న కొన్ని పుస్తకాలే కాకుండా, మనకు తెలియని పుస్తకాల గురించి, అవి సాధించిన లక్ష్యాల గురించి మీరందరూ కూడా చదవాలని నా కోరిక. అందుకే కేవలం, పుస్తకంలో ఉన్న అంశాలలో కేవలం రెండు శాతం  గురించి చెప్పాను. మిగిలింది ఆస్వాదించదలచుకుంటే చాలా మంచి అనుభవం. 

ISBN 978-0-241-3639-1
DK Penguin Random House, DK London

***

Some famous Quotes : 

If all printers were determined not to print anything till they were sure it would offend nobody, there would be very little printed. 
- Benjamin Franklin, 1731.

Every dictator gets rid of the artist first. They burn the books and execute the artist first.  Art might do something.  Its dangerous. 
- Toni Morrison

The fact that the adult American Negro female emerges formidable character is often met with amazement, distaste, and even belligerence.
- Maya Angelou.

If you have to go through the darkness before you get to the light. - Haruki Murakami.

You never really understand a person, until you consider things from his point of view.. Until you climb inside of his skin and walk around in it. -  Harper Lee  in 'To kill a Mocking Bird'

My job is to write, which I will continue to do for as long as I live, even if I am not allowed to be read. -  Taslima Nasrin 

If you start reading a book and if you don't like it you always have the option of shutting it.  At this point, it loses its capacity to offend you.
- Salman Rushdie

***


18/08/2024

Operation Khukri - Major General Rajpal Punia, Damini Punia




'దామినీ పునియా'  భారతదేశపు రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ఒక అఫీషియల్ కామెంటేటర్. ఆమె తండ్రి 'మేజర్ జెనరల్ పునియా' తో కలిసి రాసిన నిజ జీవిత కథ ఈ "ఆపరేషన్ ఖుక్రి".  కొన్ని దేశాల సైన్యాలు కలిసి సంయుక్తంగా  ఓ ఇరవయినాలుగేళ్ళ క్రితం ఆఫ్రికా లో జరిపిన ఓ అసాధారణ rescue operation ఈ పుస్తకం లో ప్రధాన వస్తువు.  వీళ్ళిద్దరి ప్రొఫెషనల్ స్కిల్స్ ఈ పుస్తకంలో కనిపిస్తాయి. 

సియెర్రా లియోన్ పశ్చిమ ఆఫ్రికాలో ఒకప్పుడు బ్రిటీష్ వలస పాలనలో గడిపిన ఒక దేశం.   అరేబియా సముద్రం ఓ వైపు హద్దుగా,  లైబీరియా, గునియాల మధ్య ఉన్న ఈ దేశం వజ్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినది. అత్భుతమైన నైసర్గిక సౌందర్యం, అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్న దేశం. కాకపోతే,  ఈ దేశం 1990 ల లో తీవ్రమైన సంక్షోభం లో పడింది.  ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా దొరికే నాణ్యమైన ముడి  వజ్రాల కోసం చుట్టుపక్కల దేశాలనుంచి, దూరతీరాల్లోని ధనిక, నాగరిక దేశాల దాకా ఈ సియెర్రా లియోన్ ని పీల్చి పిప్పి చేసేసాయి.  అధికారం కోసం, ఆ ప్రాంతం మీద అదుపు కోసం, జరిగిన అంతర్యుద్ధం వల్ల, దేశం లో  అవినీతి, అక్రమాలు పెచ్చరిల్లాయి. సాధారాణ ప్రజల జీవితం దుర్భరమైపోయింది. 

సియెర్రా లియోన్ లో కేవలం 90 లలోనే  అంతర్గత యుద్ధాలలో 50,000 మంది ఊచకోతకు గురయ్యారు. మిలియన్ కన్నా ఎక్కువమంది ఇళ్ళు వదిలి పారిపోయారు. తొమ్మిదేళ్ళకు పైగా ప్రజలు  శాంతి అన్న మాట తెలీకుండా గడిపారు. 30% ప్రజానీకం అంగచ్చేదులు.  నిర్దాక్షిణ్యమైన ఊచకోతలు, amputations ఇక్కడ సర్వసాధారణం.   దీని రాజధాని ఫ్రీ టౌన్. ఒకప్పుడు సంపన్న దేశాలు ఈ నగరంలో తమ బానిసలను ఫ్రీగా వొదిలేసేవి. అందుకని ఈ నగరం పేరు ఫ్రీటౌన్. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ బానిస జీవితం నుండీ విముక్తులయిన స్వేచ్చాజీవులన్నమాట. ప్రధానంగా వీరి మతం ఇస్లాం. 

1961 లో స్వతంత్రం వచ్చాక, అక్కడి ప్రభుత్వాలు అవినీతిని అస్సలు అదుపులో పెట్టలేకపోయాయి. 1980 ల మధ్యలో అవినీతి వల్ల దేశం అథోపాతాళానికి  చేరాక ప్రజల్లో తిరుగుబాటు మొదలయింది. "ఫోడే సేయ్ బానా సంకో" అనే ఒక మామూలు ఆర్మీ కార్పొరల్ తిరుగుబాట బాట పట్టి, ఒక సంస్థని స్థాపించాడు. అదే రివల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ (RUF)  "ఇదిగో మార్పు, ఇదిగో విప్లవం" అని అతను చూపించిన మార్గం ప్రజలకి ఎంతో నచ్చింది. తన ఆదర్శ భావాలతో ప్రజలు ప్రభావితం అయ్యారు.  ఇలా 'పరివర్తన తాంబూలాలను' ఎరవేసి సంపాయించిన ప్రజామద్దతు తో,  ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని ఫోడే సంకో చేజిక్కించుకున్నాడు. అదీ పొరుగుదేశం లైబీరీయా  అధ్యక్షుడైన చార్ల్స్ టేలర్ సహకారంతో ! చుట్టుపక్కల రాజ్యాలు సియెర్రా లియోన్ లో ధారాళంగా దొరికే ముడి వజ్రాల కోసం,  అక్కడి అస్థిరతని ఎంతమాత్రం తగ్గించే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఈ రెబల్స్ కు ముడి వజ్రాలకు బదులుగా అత్యాధునిక ఆయుధాలనిచ్చారు. వజ్రాల స్మగ్లింగ్ నిరాటంకంగా సాగేది.

ఒక దేశ సైన్యం కు ఉండదగ్గ ఆయుధాలతో RUF శక్తివంతమైన,  మరీ ముఖ్యంగా అత్యంత బ్రూటల్  గెరిల్లా దళం గా తయారయింది. ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టబడ్డాయి. ఆడవాళ్ళ మానభంగాలు, మగవారి హత్యలు, పిల్లని ఎత్తుకుపోవడాలు,  మారణహోమాలు నిత్యకృత్యాలయ్యాయి.  సైనికులు maximum టీనేజర్లు.  వీళ్ళని భయపెట్టి, తొమ్మిదీ పదేళ్ళ వయసులో చంపడం నేర్పించి దళంలోకి బలవంతంగా లాక్కొచ్చారు.   చంపడం, నరకడం లాంటి పద్ధతులతో ప్రజల్ని టెర్రరైస్ చేసారు. వీరి అదుపులో ఉన్న ప్రాంతాలలో ప్రజల జీవితం అత్యంత దుర్భరం. పాశవిక పద్ధతులు, పారిపోవడానికి ప్రయత్నించే ఊహలే రానీయకుండా చేయగల పనిష్మెంట్ ల ద్వారా అత్యంత ప్రమాదకరమైన దళంగా RUF మారింది.   

సామాన్య జనం ఉద్యమంలో చేరకుండా తటస్థంగా ఉండేందుకు వీలు లేకుండా పోయింది. ఇంట ఉన్న మగపిల్లల్ని ఎత్తుకుపోయి దళంలో చేర్చుకునేవారు. ఆ పిల్లలు పారిపోయేందుకు గానీ ప్రయత్నిస్తే చేతులు ఖండించేవాళ్ళు. ఈ శిక్ష కి ముచ్చటగా "లాంగ్ స్లీవ్", "షార్ట్ స్లీవ్" అని పేర్లుండేవి. అంటే చేతిని "మోచేతి నుండీ తొలగించడం", లేదా జస్ట్ "మణికట్టు దగ్గర కత్తిరించడం".  ప్రజల్లో భయంకరమైన టెర్రర్. జీవితాల్లో అంతులేని విషాదం. భర్త, పిల్లలు చంపబడి అనాధలయిపోయిన స్త్రీలెందరో, ప్రాణాలున్నా, జీవితేచ్చ లేని తల్లితండ్రులెందరో, అన్నీ ఉన్నా తినేందుకు అన్నం లేక, తినాలన్న ఇచ్చ లేక, మృత్యువు కోసం ఎదురుచూసే వృద్ధులు - బీదరికం, విద్య, భవిష్యత్తూ లేకపోవడం, అక్కడి జీవితం. 

ఈ పశ్చిమాఫ్రికా దేశానికి మాటసాయంగా ECOMOG (Economic Community of West African States Monitoring Group)ని నైజీరియా అధ్యక్షత న  ఏర్పరిచారు. దాన్ని చాలా నిర్దాక్షిణ్యంగా ఓడించాడు ఫోడే సంకో.  అప్పటినిండీ RUF,  ఒక్క "ఫ్రీ టౌన్"  లో తప్ప మొత్తం సియెర్రా లియోన్ లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. డ్రగ్స్, డైమండ్ స్మగ్లింగ్ దాని ప్రధాన ఆదాయ వనరు. ఆఖరికి అక్కడి ప్రజల జీవితానికి ఉన్న కష్టాన్ని అంతర్జాతీయ సమాజం పట్టించుకోవాల్సి వచ్చినప్పటికి ప్రజలు చాలా ఘోరమైన చిక్కుల్లో ఉన్నారు. తిండి, electricity, కనీసవసరాలు తీరే దారి లేని పరిస్థితి.   దేశం అధోగతిలో ఉన్నట్టే. ఐక్యరాజ్య సమితి,  ఆర్యుఎఫ్ ఒక ఒప్పందానికి (లోమె పీస్ ఎగ్రీమెంట్ -  Lomé Peace Agreement) కి రావడం జూలై 1999 లో జరిగింది. దీని ప్రకారం RUF ఆయుధాలను, పోరాటాన్ని వదిలిపెట్టి, దేశంలో శాంతియుతమైన ప్రభుత్వం ఏర్పడేందుకు సహకరించాలి.   ఇక్కడ  RUF ఒక తటస్థ సైన్యం ముందు మాత్రమే నిరాయుధీకరణ కు ఒప్పుకుంది. ఇలా ఆయుధాలు విడిచిపెట్టాక, సాధారణ జీవితం గడిపేందుకు గెరిల్లా పోరాటం తప్ప ఏమీ ఎరగని ఆ RUF సభ్యులకు సాయపడేందుకు ఐక్యరాజసమితి ఒక DDR (Disarmament, Demobilization and Rehabilitation Program) ప్రోగ్రాం ని కూడా సిద్ధపరిచింది.   ఆయుధాలతో లొంగిపోయే రెబల్స్ కు పునరావాసం కల్పించేందుకు ఒక తటస్థ సైనిక సంస్థ అవసరం అపుడు ఏర్పడింది.  దీనిలో భాగంగానే మన దేశ సైన్య బెటాలియన్  సియెర్రా లియోన్ కు UNAMSIL (United Nations Mission in Sierra Leone) శాంతి పరిరక్షక దళం గా ప్రయాణమయ్యారు.

ఈ బెటాలియన్ లో రెండు కంపెనీలకు   'దారూ',  'కైలాహున్' అనే రెండు ప్రాంతాలలో పనిచేయాలని ఆదేశాలున్నాయి.  నిజానికి ఇవి రెండూ రెబెల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు. మరీ ముఖ్యంగా   'కైలూహాన్' చాలా కష్టమైన ప్రదేశం. ఎందుకంటే ఇది RUF  కు  ప్రధాన స్థావరం. కెన్యా తో సహా ఇతర ఏ దేశమూ ఇక్కడ డిప్లాయ్ అవడానికి ఒప్పుకోలేదు.  భారత దేశానికే చెందిన  (UN) ఫోర్స్ కమాండర్ జెనరల్ జెట్లీ,  తన దేశపు ట్రూప్స్ ని కైలాహూన్ లో పనిచేయమని ఆదేశించారు.  ఈ డిప్లాయ్మెంట్ లలో కొన్ని దేశాలు అయితే ప్రత్యేకంగా 'డైమండ్ ఏరియా'ల్నే కోరుకునేవి.   కైలాహూన్ లాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్ని నిరాకరించేవి.  ఇలాంటి పరిస్థితుల్లో, మేజర్ పునియా తన బెటాలియన్ లో అతి చిన్న భాగాన్ని అడ్మినిస్ట్రేటివ్ సాయం కోసం  "దారూ" లో విడిచిపెట్టి, మిగతా భాగంతో (233 గురు)    "కైలాహూన్" కి బయల్దేరారు.  వారిని అక్కడ deploy చేసిన ప్రాంతం RUF కు గుండెకాయ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. అక్కడికి వెళ్ళేందుకు ఎన్నో దేశాల పీస్ కీపింగ్ ఫోర్స్ సభ్యులు నిరాకరించారు.   ఆఫ్రికా సంగతి తెలిసిన కెన్యా సైన్యమే అక్కడ విడిది చేసేందుకు నిరాకరించింది. అలాంటిది, ఇచ్చిన మాట కోసం, ఒప్పుకున్న పని చేసేందుకని నోరెత్తకుండా అక్కడికి బయల్దేరిన ఈ పటాలం, తదనంతరం బయల్దేరిన పోట్లాటల ఫలితంగా నెలల తరబడి RUF చేత  చుట్టుముట్టబడింది.  

నిజానికి ఈ  డిప్లాయ్మెంట్ ఒక శాంతి పరిరక్షక దళానిది.  స్థానికులకు వీరు ఎలాంటి పరిస్థితిలోనూ హాని కారకులు కారు.  వీరు పెద్దన్నల లాంటి వాళ్ళు. ప్రమాదంలో ఉన్న స్థానికులకు సాయం చేసేందుకు వచ్చినవాళ్ళే. కాబట్టి స్థానికులతో తగినంత పరిచయం పెంచుకుని వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం కూడా ఒక స్ట్రాటజిక్ అవసరం.  

దీనిలో రెండు రకాల దళాలుంటాయి. ఆయుధాలు ధరించే పోరాట దళం, (మన దేశ సైన్యం లాంటిది) - ఇంకోటి ఆయుధాలు పట్టకుండా, కేవలం డిప్లమాటిక్ డ్యూటీ గా వచ్చిన అబ్సర్వర్ బృందం. వీరు నిరాయుధులు. వీరు డిప్లొమసీ, arbitration  ని చదువుకుని, శాంతియుత పరిష్కారాల కోసం ఎలా పనిచెయ్యాలో తెలుసుకుని వచ్చిన వారు.  సమిష్టిగా,  వీళ్ళ డ్యూటీ ఇక్కడ RUF  సాయుధులను వారి ఆయుధాలు విడిచేలా ఒప్పించి,  జన జీవన స్రవంతి లో కలిసేలా చెయ్యడం, వృత్తి నైపుణ్యాలవీ నేర్పించడం.  

(లొంగిపోయిన)/ ఆయుధాలు విడిచిపెట్టిన ప్రతి రెబెల్ కూ హాండ్సం గా డబ్బు (అప్పట్లోనే USD 300) రెండు విడతల్లో (150 + 150)  ఇచ్చేవారు.  అయితే,  పథకం మొదలయిన కొత్త కొత్తల్లో కాబట్టి 'డబ్బు విడుదల'  కావడం అనేది టైం పట్టే వ్యవహారం కాబట్టి,  ఆయుధాలు విడవగానే ఒళ్ళో డబ్బు రాలిపళ్ళేదని కినుకతో ఎక్కువ RUF Rebel లొంగుబాట్లు జరిగేవి కాదు.  లొంగిన వాళ్ళు చాలా మంది టీనేజర్లు లేదా అంత కన్నా చిన్న పిల్లలు. వాళ్ళ వయసుని చూస్తే గుండె బేజారయిపోయేది. వీళ్ళ అమ్మా నాన్నా అక్కా చెల్లెళ్ళు చాలా మందిని వీళ్ళకళ్ళ ముందే కాల్చేసారు. లేదా, వారిప్పుడు బ్రతికున్నారో లేదో తెలీని పరిస్థితిలో ఉన్న పిల్లలు వీళ్ళు. వీళ్ళు కూడా ఎందరినో చంపేసారు.  గుక్కెడు నీళ్ళకోసం, గుప్పెడు అన్నం కోసం తుపాకీ ధరించి ప్రాణాలు తీయడమే వీళ్ళ కి తెలిసిన జీవితం. యుద్ధం లేని ఆటపాటల బాల్యం ఎలావుంటుందో వీరికి తెలిసే అవకాశమే లేదు.

భారత శాంతి పరిరక్షక దళం సియెర్రా లియోన్ లో డిప్లాయ్ చెయ్యబడ్డ ఒక  'సాయుధ' సైన్యం.  పరిపాలన సౌలభ్యం కోసం వీరిని రెండు వేర్వేరు సైట్ లలో ఉంచారు. వీటిలో ఒకప్పుడు హాస్పిటల్ గా ఉపయోగింపబడిన రెండంతస్థుల బిల్డింగ్ ఒకటి, రెండోది ఏ భవనమూలేని ఎతైన గ్రౌండ్.   ఈ భారత దళం స్థానికులతో కలిసిపోయి, వారి సమస్యల్ని తెలుసుకుంటూ, తాముంటున్న  ఊరి పెద్దలతో సమావేశమవుతూ, తమ లక్ష్యాలని వారితో పంచుకుంటూ, శాంతియుతంగానే గడిపింది. నాయకుడిగా మేజర్ పునియా స్థానికులచేత గౌరవంగానే స్వాగతించబడ్డారు.  స్థానికులతో చక్కగా కలిసిపోయి, వారితో మంచి బంధాన్ని ఏర్పరచుకున్నారు.  గ్రామ పెద్ద మంచి దోస్త్ అయ్యాడు. ఇక్కడ గ్రామ పెద్ద అంటే, అక్కడి పద్ధతి ప్రకారం,  చుట్టుపక్కల ప్రావిన్సెస్ లో ఉన్న పెద్దలందరికీ పెద్దన్నమాట. అతన్ని 'పాపా గీమా'  (Papa Giema)  అంటారు. అతని వాక్కు అందరికీ  శిరోధార్యం.   కాకపోతే అతను నిరాయుధుడు. రెబెల్స్ కు నచ్చ జెప్పగలడు తప్ప, వారిని శాసించలేడు.  

భారత శాంతి పరిరక్షక దళానికి UN నుంచీ మంచి తిండి/రేషన్ దొరుకుతుంది, అదీ ఎక్కువ గానే,  సౌకర్యంగానే దొరికేది.   గ్రామ పరిస్థితుల్ని చూసి, వారిలో తిండి కి ఎంత కష్టంగా ఉందో గ్రహించి, తరచుగా తమ రేషన్ నుంచీ కాస్త తీసి,  గ్రామస్తులకు పంచడం, యూనిట్ డాక్టర్ గ్రామస్తులకు వైద్య సేవలందివ్వడం వంటి  humanitarian assistance ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ చర్య అతనికి ఎంతో పేరు తెచ్చింది.  పిల్లా పాపలతో ప్రేమగా మాట్లాడడం, యువత తోనూ, కలిసిపోవడం, తరచుగా వాళ్ళతో వాలీబాల్ ఆడడం (మన క్రికెట్ లాగా - దౌత్యం, స్నేహం కోసం) వంటి పనుల ద్వారా, క్రమం తప్పకుండా ప్రతి రోజూ గ్రామం లోకి తన పెద్ద నల్ల గొడుగు తీసుకుని నడకకు  వెళ్ళడం, తరచూ టచ్ లో ఉండడం ద్వారా కొన్ని పరిచయాల్ని పెంచుకుంటాడు మేజర్.  

ఆ స్నేహాలు తరవాత అతనికి పనికొస్తాయి. లోకల్ ఇంటలిజెన్స్ కీ, డిప్లొమసీ కీ, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఈ లోకల్ పరిచయాలు బాగా ఉపయోగపడతాయి. పైపెచ్చు, గ్రామస్తులతో, RUF నేతలతో స్నేహం పెరగడం వల్ల వాళ్ళను disarmament  వైపు నడిపించొచ్చు. పైగా UNPKF లక్ష్యం అదే.  అదే ఆశ తో అందరితో స్నేహం కల్పించుకుంటాడు మేజర్ పునియా. వచ్చీ రాని ఇంగ్లీష్ తో మాటాడే RUF యువకులు - మేజర్ తో పరాచికాలాడేంతవరకూ ఇవి కొనసాగాయి. వాళ్ళలో కొందరి కి ఎడమ చెయ్యి ఉండదు / కట్ చేసి ఉంటుంది. RUF చాలా తెలివైనది.  ఈ పిల్లలు సాధారణంగా  కుడి చేతితో నే రైఫిల్ షూట్ చెయ్యాలి కాబట్టి, ఎంత పెద్ద పనిష్మెంట్ అయినా (చావు తప్ప) కుడి చేతి జోలికి RUF ఎపుడూ పోదు. 

మేజర్ మీద RUF ని  disarmament/ లొంగుబాటు  కి ఒప్పించమని ఒత్తిడి పెరుగుతూ ఉండగా,   అకస్మాత్తుగా  సియెర్రా లియోన్ లోనే ఇంకో దిక్కున ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. కెన్యా, నైజీరియా దళాలకు, RUF కు చిరకాల వైరం.  ఒక గొడవ అనంతరం Kenyan దేశ UN దళాలతో RUF పోరాటానికి దిగినప్పుడు, UN తన వారిని కాపాడుకునేందుకు ఎటాక్ హెలికాప్టర్ లను పంపింది.  అలా   ఎయిర్ ఎటాక్ జరిగి, వందలాదిమంది RUF రెబెల్స్ మరణించారు. దానితో UN మీద వొళ్ళు మండిన RUF సియెర్రా లియోన్ లో విడిది చేసిన అన్ని దేశాల UN బెటాలియన్లనూ చుట్టుముట్టింది. చాలా మంది లొంగిపోయారు. ఆయుధాలు వదిలి, నిస్సహాయులైపోయారు. అదే ఊపులో కైలుహాన్ లో కూడా RUF మెరుపు దాడి చేద్దామనుకుంది.     ఇక్కడి  భారత దళాల కేంప్ ను చుట్టుముట్టింది. అధికారులను బందీలుగా తీసుకుంది.   వీరిలో నిరాయుధ మిలిటరీ అబ్సర్వర్లు కూడా ఉన్నారు. వీళ్ళలో  వేరే వేరే శక్తివంతమైన దేశాలవారితో పాటూ భారత దేశం, పాకిస్తానీ సైన్యాధికారులు కూడా ఉన్నారు.  ఈ ఎయిర్ స్ట్రైక్ సమాచారం, కెన్యన్ దళాల లొంగుబాటు సమాచారం ఏదీ -  ఎందువల్లనో మేజర్ పునియా కి / అతని బృందానికి   చేరక, అంతా 'చంగాసీ' అనుకుని హాయిగా ఉన్నపుడు, ఇక తమ ప్రాంతాలలో రెబల్స్ త్వరలో ఆయుధాలను వదిలిపెడతారు, తమ అసలు పని మొదలుకానుంది అనుకుని చల్లగా  ఉన్న భారత శాంతి పరిరక్షక దళం, కలలో కూడా అనుకోని పరిణామం ఇది. 

ఆ స్ట్రైక్ జరిగిన మర్నాడుదయాన్నే ఈ భారత సైన్యపు అధికారిని మేజర్ పునియాని మీటింగ్ కి అని తమ స్థావరానికి పిలిచి, మిగిలిన అబ్సర్వర్లతో పాటు బందీ చేసారు. గన్ పాయింట్ మీద తమ తిరస్కారాన్ని వెళ్ళగక్కారు.    వీరిలో కేప్టెన్ సునీల్ ని భారత దళాలున్న కేంప్ కు తీసుకెళ్ళి అతని తలకి తుపాకీ ఎక్కుపెట్టి -  కేంప్ లో ఉన్న 233 మందినీ ఆయుధాలు విడిచిపెట్టి ముందుకు వచ్చి లొంగిపోతారా, మీ అధికారిని కాల్చమన్నారా అన్నారు.  అయితే కేప్టెన్ సునీల్ (ఇపుడు బ్రిగేడియర్)  ఆయుధాల్ని ఎట్టి పరిస్థితుల్లోనీ విడిచిపెట్టవద్దని హిందీలో అరుస్తూ తమ ట్రూప్స్ ని హెచ్చరించారు. అతని ఆదేశాల వల్ల, హెచ్చరికల వల్ల, ఈ విచిత్ర పరిస్థితుల్లో ఎలా మెలగాలో భారతీయ ట్రూప్స్ కు అర్ధమయింది. ఒక్కరూ ఈ బెదిరింపులకు లొంగలేదు. భారత బెటాలియన్ చుట్టుముట్టబడింది. వాళ్ళు అక్షరాలా RUF బందీలయ్యారు. సగౌరవంగానే, తమ తమ స్థానాలను కాపాడుకున్నారు.  ఇది టర్నింగ్ పాయింట్. కథ మొదలు.  పైగా పరిస్థితులు దిగజారడం వల్ల వారికి దగ్గరగా ఉన్న UN ఆఫీసులు కూడా చాలా కార్యకలాపాలను ఆపేశాయి. దాంతో మన సైన్యం ఒంటరిగా మిగిలిపోయింది.

నిజానికి సియెర్రా లియోన్ లో అప్పటికి,  వారి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండిన  మిగతా దేశాల శాంతి పరిరక్షక దళాలు లొంగిపోయి, ఆయుధాలతో పాటూ, యూనిఫాం కూడా లాక్కోబడి, అర్ధనగ్నంగా ట్రక్కుల్లో పశువుల్లా కుక్కబడి, ఊరేగించబడి, లొంగుబాటు మీద సంతకాలు చేసేందుకు లైబీరియా తీసికెళ్ళబడ్డారు. భారతీయ సైన్యం మాత్రం ఆయుధాలు విడవలేదు. సరెండర్ అయే ప్రశ్నే లేదన్నారు. 45 రోజులకు పైగా వేర్వేరు కేంప్ లలో బందీలు అయిపోయారు. గానీ పంతం విడవలేదు. ఆఖరికి తమని RUF అష్టదిగ్బంధనం చేసేసి,   తిండి లేకుండా, రేషన్, ఉత్తరాలు అందనీయకుండా మిగిలిన ప్రపంచంతో సంబంధాలు కట్ చేసి నిర్బంధించినా సరే, సహనంగా  చాతనయినంత కాలం శాంతి మంత్రాన్నే పఠించారు.  దౌత్యవేత్తలు చర్చామార్గం పట్టారు. సంకో అస్సలు తలొగ్గలేదు.

కైలాహూన్ కు చెందిన 'పాపా గీమా',  మేజర్ పునియాను ఎంతగానో అభిమానించే వాడు.  అతన్ని సాంప్రదాయక రీతిలో RUF  తుపాకీ అంచున బందీని చెయ్యడాన్ని వ్యతిరేకిస్తాడు. అతన్నిని RUF స్థావరంలో విడిగా కాకుండా   తన ట్రూప్స్ తోనే ఉండగలిగేలా చెయ్యడంలో కీలక పాత్ర పోషిస్తాడు. సాధారణంగా సైన్యంలో పై అధికారి స్థానంలో శూన్యత ఉండకూడదు. పై అధికారి బందీ అయితే, మొత్తం సైన్యం నిస్తేజం  అయిపోతుంది.  ఈ పాపా గీమా,  మేజర్ పునియా తన సైన్యం తోనే ఉంటూ,  స్వేచ్చగా గ్రామంలో తిరిగేందుకు సహకరిస్తాడు.  అంటే తనవాళ్ళందరూ కార్డన్ (ముట్టడి) లో ఉండగా, మేజర్ పునియా మాత్రం రెబెల్స్ తో సంభాషించగలిగేందుకు బయటికి రావడం జరుగుతుండేది. అది కాస్తా అతనొక్కడే బయట తిరిగి, పరిస్థితులను బేరీజు వేసుకోవడానికి పనికొచ్చేది.

ఇదిలా ఉండగా మధ్యలో తమ వారు ఇలా వేర్వేరు కేంప్ లలో బందీలుగా ఉండడం మంచిది కాదని గ్రహించుకుని,   RUF వేరే కార్యక్రమాలలో బిజీగా ఉన్నపుడు, పహారా కాసే రెబల్స్ సంఖ్య కుదించబడిన సమయంలో,   ఒకసారి ధైర్యం చేసి  హాస్పిటల్ సైట్ లో ఉన్న మేజర్ , స్ట్రాటజిక్ గా తక్కువ రక్షణ కల్పించగల హాస్పిటల్ కేంప్ నుండీ, హై గ్రౌండ్ కేంప్ కు తన దళాలతో, వాహనాలతో సహా, పెళ్ళున వర్షం పడుతున్న రాత్రి ఎస్కేప్ అవుతారు.  ఇలా ఒకే కేంప్ లో అందరూ చేరడం ఒక మొరేల్ బూస్టర్ అవుతుంది. 

పైగా విడుదలెప్పుడో తెలీనిపరిస్థితులలో  చిక్కుపడి, ముట్టడి లో రోజులతరబడి ఉండడం వల్ల కలిగే స్ట్రెస్ ని తగ్గించుకునేందుకు,   బందీలుగా ఉండడం వల్ల చేతులు కట్టేసినట్టయి, అలా ఉండిపోకుండా కేంప్ లోపల ట్రెంచ్ లు తవ్వడం, వాలీబాల్ ఆడడం, శత్రువు లకు అనుమానం రాకుండా యుద్ధానికి సన్నద్ధంగా ఉండడం తప్పనిసరి అవుతుంది.    బయటి ప్రపంచంతో, ఫేమిలిలతో,  సంబంధం తెగిపోయి కొద్దో గొప్పో డీలా పడి ఉన్న తన బృందాన్ని ఎప్పటికపుడు ఉత్సాహపరుస్తూ ఉండడం ద్వారా బెటాలియన్ లో అధికారులు బిజీగా ఉండేవారు.      

విడుదల చేస్తారా, వీర స్వర్గం బాట పట్టిస్తారా అనేది RUF చేతిలో మాట. వాళ్ళు కాస్తా మొండి వాళ్ళు. 'అందరూ లొంగిపోయారు. ఈ ఇండియన్లు ఎందుకు లొంగరు ? ఎన్నాళ్ళు లొంగరు?' అని పంతం వాళ్ళది. "మేజర్ నువ్వు ఇంటికి వెళ్ళవా?'' అని పరిహాసం చేసేవారు. "మీ దేశం అందమైనది. ఇక్కడే ఉండిపోతా, వెళ్ళేటట్టయితే, నా ఆయుధాలతో, నా బెటాలియన్ తో సగౌరవంగా వెళ్తాను" అని ఇతను బదులిచ్చేవాడు.  వీళ్ళ కార్డన్ మొదలయినపుడు వీరి సమాచారం కోసం దారూ నుండీ వచ్చిన ఒక భారతీయ సైనికుల పెట్రోలింగ్ బృందాన్ని  RUF అడవిలోనే  బంధిస్తుంది.  ఇరవై ఒక్క సభ్యులున్న ఈ బృందం హేయమైన పరిస్థితుల్లో నెలన్నరకు పైగా బందీలుగా ఉన్నారు. వీరి విడుదల కూడా దేశాల మధ్య రాజకీయ చర్చలకు దారితీసింది. వీరి విడుదల కూడా మేజర్ పునియా ప్రయత్నాల వల్ల సాధ్యపడింది.  వీరి విడుదల జరిగే వరకూ ఎటువంటి ఆపరేషన్  చేపట్టినా, అడవిలో బందీలుగా ఉన్న వీళ్ళ ప్రాణాలు ప్రమాదంలో పడేవి. కాబట్టి ఆపరేషన్ ఖుక్రీ ప్రారంభం కావడానికి ఈ రిస్క్ ఎలిమెంట్ కూడా లేకుండా పోవడం మొదటి మెట్టు. పునియా ఒంటి చేత్తో ఓర్పుగా ఒక్కో చిక్కుముడీ అలా విప్పుకురాగలిగారు.  

వీరిని గురించి ప్రధాని వాజపేయి పార్లమెంట్ లో ప్రసంగించారు. యునైటెడ్ నేషన్స్ నీ, సియెర్రా లియోన్ నీ వీళ్ళని విడుదల చేసేలా ప్రయత్నించాలని విజ్ణప్తి చేసారు.  ఆ విషయం తెలిసాక, తమ నిర్బంధం గురించి / క్షేమం గురించి తన భార్యకు తెలిసి ఉంటుందని మేజర్ పునియాకు అనిపిస్తుంది. అతను కేంప్ కు వచ్చేముందు, సియెర్రా లియోన్ లో తాము లేండ్ అయిన ఆ దేశపు ఏకైక విమానాశ్రయం లుంగీ నుండి భార్యకు ఫోన్ చేసాడు. మొబైల్ లు అంతగా లేని కాలం అది. కార్గిల్ యుద్ధం జరిగిన మరుసటి సంవత్సరం. కేవలం ఇక్కడ విమానాశ్రయంలో మాత్రమే  ఐ.ఎస్.డీ సౌకర్యం ఉండేది. దేశంలో ఇంకెక్కడా, టెలిఫోన్, విద్యుత్ సదుపాయం కూడా లేదు.   అక్కడి దట్టమైన అడవుల్లో, జంతువులు కూడా లేవు. అవన్నీ ప్రజల ఆకలి కి ఆజ్యమైపోయాయి. అంత దారుణమైన పరిస్థితులు.   అప్పట్నించీ బెటాలియన్ లో ఎవరికీ ఫోన్ కాల్ సదుపాయం లేదు. ఉత్తరాలూ ఇప్పుడు బంద్ అయిపోయాయి. అసలు తాము బ్రతికే ఉన్నామని తమ కుటుంబాలకు తెలుసో లేదో తెలీని పరిస్థితి ఈ సైనికులది.  

ఆఖరికి, వర్షాకాలం సమీపిస్తున్నపుడు, తమ దగ్గరున్న ఆహారం వారం రోజులకు మాత్రమే సరిపోతుందని తెలిసినపుడు, ట్రూప్స్ లో బెంగ మొదలయిందని గ్రహించినపుడు, మేజర్  పునియా, ఊహించని నిర్ణయం తీసుకుంటారు.   ఇక దౌత్య విధానాల ద్వారా విడుదలకు ప్రయత్నించి లాభం లేదని, వొదిలేయదల్చుకుంటే,  RUF ఎపుడో పంతం వీడేదని గ్రహించాడు. అతనెరిగిన  నాయకులు "మేజర్ మీ దేశానికి వెళ్ళవా?"  అని గేలి చేయడం ఎక్కువయింది. మానసిక దాడి ఇది. మనోబలాన్ని తెగ్గొట్టడం వారి వ్యూహం. పైగా మేజర్ నెరపిన ప్రజారంజకత్వపు వ్యూహం  వల్ల అతని పట్ల, భారతీయులపట్ల, స్థానికుల్లో సానుభూతి ఉంది.   RUF  ఒకవేళ వీరిమీద  కాల్పులకు తెగబడితే,  వారు స్థానిక ప్రజల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే RUF  కేవలం మనో యుద్ధానికే కట్టుబడింది.  వారి ఉద్దేశ్యం United Nations  ని అవమానించడం. తాము  invincible  అని, ప్రపంచం తన వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని,   తమని UNPKF బలవంతంగా నిరాయుధీకరణ వైపు నెడుతోందనీనూ వీళ్ళ కోపం.  ఈ అహంకారం వల్లనే RUF ఎప్పుడూ చర్చలకు సిద్ధం కాదు. ఒప్పందాలను ఖాతరూ చెయ్యదు. దీన్ని ఎదిరించాలని మేజర్ పునియాకు, రేషన్ సప్లై, ఉత్తరాలు లాంటివి లేకుండా రెండు నెలల దిగ్బంధనం లో తన వాళ్ళతో గడిపిన తరవాత బలంగా అనిపిస్తుంది.  పైగా పెట్రోలింగ్ బృందం విడుదల, రాబోతున్న వర్షాకాలం, నిర్ణయానికి రావాల్సిన సమయం ఆసన్నమయిందన్న క్లియర్ మెసేజ్ ని ఇస్తాయి.   తాను, తన వారూ ప్రాణాలతో, గౌరవంతో బైటపడాలంటే ఆ నిర్ణయం తప్పనిసరి మార్గం కూడా.  "పిల్లిని ఒక గదిలో బంధిస్తే..."  అనే నానుడి గుర్తుంది గా.  పైగా RUF   పెట్టుకున్నది అప్పుడే (Kargil) యుద్ధం గెలిచొచ్చిన  సైన్యంతో!   RUF అతిశయాన్ని  బ్రేక్ చెయ్యాలని, "యుద్ధం ఎల్లకాలం సాగకూడదని"  వాళ్ళకు గుణపాఠం చెప్పేందుకు మేజర్ నిర్ణయించుకుంటాడు.  

సియెర్రా లియోన్ లో వర్షాకాలం అత్యంత ప్రమాదకరమైనది. ఎంత విస్తారమైన భయానకమైన కుంభవృష్టి కురుస్తుందంటే, గ్రామాలు నెలలతరబడి వరదలో, బురదలో, రోగాలలో మునిగి ఉంటాయి. ఒక వైపు తిండి లేక, తమ పై ముట్టడి ముగిసే సమయం,  పద్ధతీ ఏమీ తెలీని వేళ, stand-off  లో చేతులు కట్టుకుని కూచుంటే లాభం లేదని, అక్కడే ఉంటే అందరం చస్తామని, పునియా యుద్ధానికి సిద్ధపడ్డారు.  

పై నుండి రేడియో లో ఆదేశాల కోసం అర్జీ పెట్టుకు ని ఎదురు చూసారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మేన్ ఆన్ ద గ్రౌండ్ (యుద్ధ క్షేత్రం లో ఉన్న అధికారి) గా తన లిమిటేషన్ లను, అవసరాల్ని, ఫీల్డ్ కమాండర్ తో పంచుకున్నారు. అలా  ఆపరేషన్ ఖుక్రీ మొదలయింది. యుద్ధం డ్రాయింగ్ బోర్డ్ మీద మొదలయింది.  ఫీల్డ్ కమాండర్, వివిధ దేశాల సైనిక ప్రతినిధులతో కలిసి వ్యూహాలు రచించారు. వివిధ దేశాలకు చెందిన దళాలతో, పారా కమాండోలతో  ఆయుధాలను, హెప్టర్ లను, ఎటాక్ హెలెకాప్టర్లను, సిద్ధం చేసారు. మూడు ప్లాన్ లు సిద్ధమయ్యాయి వాటిని రేడియో ద్వారా మేజర్ కు వివరించారు. ప్రతి వ్యూహం లో నూ ఉన్న రిస్క్ లను చర్చించుకున్నారు. ప్లాన్ ఏ, బీ, సీ లలో అత్యంత క్లిష్టమైన, risky, ఎక్కువ చావులకు కారణమవగలిగే వ్యూహం (plan C) ఎన్నికయింది. పునియా తన అధికారులతోనూ, సైనికులతోనూ సాధ్యాసాధ్యాలను చర్చించారు. ఏకాభిప్రాయం సాధించారు. వ్యూహంపై అనుమానాల్నీ, వ్యతిరేకతల్నీ, మొగ్గ దశలోనే తుంచేసారు. ఒకటీ అరా తిరుగుబాట్లనీ అంతకు ముందే అణచేసారు. తమని రక్షించేందుకు ఎవరూ రారని,   తమని తామే రక్షించుకోవాలనీ భారత దళానికి  అర్ధం అయింది. భారత దళం యుద్ధానికి సిద్ధమైంది.  ఈలోగా భారత దేశం నుండి ఇంకో 'para special forces కమాండోలు, ఎటాక్ విమానాల తో  సైనిక బృందం'  సియెర్రాలియోన్ వచ్చి చేరింది. ఈ కొత్త గా పెరిగిన బలగం, ఆపరేషన్ లో భారతసైన్య విజయావకాశాలను పెంచింది.

 ఈ ఫైనల్ ప్లాన్ ప్రకారం అసలు ఆపరేషన్,  బందీలు గా ఉన్న "ఫారెన్ అబ్సర్వర్లను" హెలికాప్టర్ ద్వారా ఎయిర్లిఫ్ట్ చెయ్యడంతో మొదలవుతుంది. హెలికాప్టర్ ని చూసి  దళాలు వాటిని కాల్చగలిగే ఆయుధాలకోసం 'ఆయుధాగారానికి'  వెళ్ళినపుడు, దాన్ని రాకెట్ తో లేపేసి, వాళ్ళ కమ్యూనికేషన్ యూనిట్ ని ఇంకో టీం, నాశనం చెయ్యాలి. ఈ దాడి నుండీ RUF  కోలుకునేలోగా కైలూహాన్ పట్టణానికి సరిగ్గా మధ్యలో ఉన్న రోడ్ మార్గం గుండా  నుండీ దారూ వైపు వెళ్ళాలి.    కైలూహాన్ పట్టణానికి నడిబొడ్డున  బహుశా నివాశితుల పైన కూడా బాంబులు, రాకెట్లు,   పేల్చాల్సి రావచ్చు. (Collateral Damage). పునియా, గ్రామం లో తప్పనిసరి వ్యాహ్యాళి, స్థానికులతో ముచ్చట్లు పెట్టుకోవడం వంటివి ప్రతిరోజూ చేయడం ద్వారా RUF ఆయుధాగారం గా వాడుకుంటున్న తెల్లని భవనం, వారి కమ్యూనికేషన్ భవనం ఎక్కడున్నాయో ఖచ్చితంగా తెలుసుకుని టార్గెట్ పై నిర్ణయం తీసుకోగలుగుతారు.

ఎన్నో మల్లగుల్లాలు పడి, ఇదే సరైన వ్యూహం అని నమ్మి, ఈ వ్యూహం ప్రకారం,  కైలాహున్ ను  తగలబెట్టి, ఊరిలోంచి దూసుకొచ్చే ఫైరింగ్ ని ఎదుర్కొంటూ, రాకెట్ దాడులను నియంత్రిస్తూ,   దానిలో భాగంగా తాము జరపాల్సొచ్చే కాల్పుల్లో,  అప్పటిదాకా తమ స్నేహితులైన స్థానికులను కూడా చంపుకుంటూ, టౌన్ దాటి అడవిలోకి ప్రవేశించి, అటునుండి దారూ (DARU)  పట్టణం వైపుగా వీళ్ళు సాగాలి. దారూ నుండి ఇంకో దళం తగినన్ని వాహనాల్ని, ammunitionనీ,  సాయుధుల్నీ తీసుకొచ్చి వీళ్ళని రక్షిస్తుంది. పైనుండి ఎటాక్ హెలికాప్టర్లు ఫైర్ చేస్తాయి.    దారంతా అడవుల్లో  గెరిల్లాలు అడుగడుగునా దాడి చేస్తారు. వాళ్ళని కాల్చుకుంటూ, దొరికినవాడిని దొరికినట్టు చంపుకుంటూ వెళ్ళి బయటపడాలి. ఇదీ ప్లాన్. 

ట్రూప్స్ లో అధికంగా ఉన్న గూర్ఖాల వీరత్వానికి ప్రతిబింబంగా వారి ఆయుధమైన ఖుక్రీ పేరుని ఈ ఆపరేషన్ కు పెట్టారు. కీలక ఆదేశాలను  రేడియో సందేశాలను,  RUF వినవచ్చనే ఉద్దేశ్యంతో మళయాళం లో ప్రసారం చేసారు. భారత బెటాలియన్ లో మళయాళీలు, ఎక్కువ ఉన్నారు. హిందీ ని కూడా RUF network క్రాక్ చేసుండగలిగేది కాదు. అయినా రిస్క్ తీసుకోలేదు.  కార్గిల్ లో కూడా కమ్యూనికేషన్ ని మదరాసీ భాషలో (తమిళం) నిర్వహించారు. పుష్తూన్, కష్మీరీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, అఫ్గానీ భాషల్ని అర్ధం చేసుకున్నంత సులువుగా మన తమిళాన్ని పాకిస్తానీలు అర్ధం చేసుకోలేకపోయారు.  

పై అధికారులు ఈ ఆపరేషన్ లో కనీసం 30% మంది సైనికులు మరణిస్తారని ప్రాధమికంగా అంచనా వేసారు. ఎందుకంటే RUF అత్యంత పాశవిక,  గెరిల్లా నైపుణ్యం ఉన్న సంస్థ.  అప్పటి దాకా దాని స్థానబలం, ఆయుధ బలం వల్ల  విజయావకాశాలు ఎక్కువ, అపజయం అన్న మాటే ఎరగని సైన్యం దానిది. వాళ్ళ దగ్గర ఉన్న అపారమైన ఆయుధ సంపత్తి, హెలికాప్టర్లను, ఫైటర్ విమానాలనూ కూల్చగల సామర్ధ్యం, చిక్కని అడవుల్లో చిక్కకుండా దాడి చేసేది, దాని వ్యూహం, కౄరత్వమూ మామూలు సైన్యాలకు ఊహకు కూడా అందనివి. కాబట్టి, శత్రువుని తక్కువ అంచనాలు వేయకుండా, అత్యంత వ్యూహాత్మకంగా ప్లాన్ ను సిద్ధం చేసి, ఆపరేషన్ ను నడిపించారు. 

ఈ ఆపరేషన్ లో ఒకే ఒక్క సైనికుడు, అదీ కొన్ని కారణాల వల్ల దారూ లో ఉండిపోయి ముట్టడిలో బందీ కాకుండా అప్పటిదాకా ఫ్రీ గా ఉండిన  హవిల్దార్ కృష్ణకుమార్ మాత్రమే మరణించారు. మిగిలిన వారికి కొద్దినష్టమే జరిగింది. ప్రాణాంతకమైన గాయాలు కాలేదు. ఆస్తి నష్టం కొద్దో గొప్పో జరిగినా, RUF ఆస్థాన 'కైలాహున్'  పట్టణం  నడి మధ్య నుంచీ, ఫైర్ పవర్, చెక్కుచెదరని ధైర్యంతో, మొండి పట్టుదలతో ఆ పట్టణాన్ని బుగ్గి చేసి, భారతీయ సైన్యం కేవలం నడక ద్వారా, మెల్లగా నడిచే సైనిక వాహనాల లోనూ, అచ్చు సినిమాల్లానే బయటికొచ్చింది.  ఊర్నించీ వచ్చాకా దట్టమైన అడవిలో దారూ వైపు పరయాణించింది.  మార్గ మధ్యంలో వాహనాలు చెడిపోయాయి. RUF Rebels రోడ్డు తవ్వేసారు. అప్పటికప్పుడు బ్రిడ్జ్  మెటీరియల్ ని హెలికాప్టర్ ల ద్వారా దగ్గరి బేస్ నుండీ రప్పించి, భారీ వాహనాలు నడవగలిగే బ్రిడ్జి ఆఘమేఘాల మీద కట్టేసి, పటాలాన్ని ముందుకు నడిపించారు.  

తప్పించుకుంటున భారత సైన్య కేన్వాయ్ 3 బృందాలుగా విడిపోయింది. రెండు బృందాలు నడక, వాహనాల్లో, దారూ చేరాయి. ఇంకో బృందం కేప్టెన్ సునీల్ సారధ్యాన ఎయిర్లిఫ్ట్ చెయ్యబడింది. అంటే, మొదటి రెండు బృందాలూ ప్రమాదభరితమైన జోన్ నుండీ తప్పించుకునేవరకూ కెప్టెన్ సునీల్ బృందం రెబెల్స్ పై ఫైర్ చేస్తూనే ఉంది. ఆఖర్న వాళ్ళు నేలకి  కొన్ని అడుగుల ఎత్తులో హెలికాప్టర్ లాండ్ అవకుండా, తేలుతూ ఉండగా ఉరుకులు పరుగుల మీద హెలికాప్టర్ లోకి దూకి, వెను వెంటనే గాల్లోకి హెప్టర్ లేవడం ద్వారా రక్షించబడ్డారు. ఆఖరి నిముషం వరకూ వారిని బుల్లెట్లు వెంటాడాయి. కానీ దుర్గామాత దయ వల్ల ఒక్క ప్రాణం పోలేదు.  (ప్రతి సైనిక బృందానికీ ఒక కులదైవం లాంటి సింబల్ ఉంటుంది. వీరి దైవం దుర్గా మాత). 

కేవలం హవిల్దార్ కృష్ణ కుమార్, RUF రాకెట్ పొట్టలో దూసుకుపోవడం వల్ల మరణించాడు. ఆయన దారూ నుండీ తన ట్రూప్స్ ని కాపాడేందుకు కావల్సిన  ఆయుధాలతో నిండి ఉన్న ట్రక్ తీసుకొస్తున్నారు.  ఆ రాకెట్ ట్రక్కుని గనుక తాకి ఉంటే జరిగే విధ్వంశంలో ఆపరేషన్లో కాపాడవలసిన సైనికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ పొట్టలో రాకెట్ తాకి, తీవ్ర రక్తస్రావం అవుతున్నా సరే,   ట్రక్కుని క్షేమంగా పక్కకు తీస్కెళ్ళి నిలిపిన తరవాతే ఆయన వాలిపోయాడు. అతనికి మరణానంతరం ప్రతిష్టాత్మక సేనా మెడల్ దొరికింది. ఆయన పేరిట ఒక స్మారక చిహ్నం సియెర్రా లియోన్ లో ఇప్పటికీ ఉంది. 

ఈ ఆపరేషన్ లో మరణించిన తన సియెర్రా లియోన్ పౌర స్నేహితులని తలచుకుని పునియా గుండె చాన్నాళ్ళు  మూగబోయింది. తన బిడ్డల్లంటి ట్రూప్స్ ని ప్రాణాలతో భారతమాతకి అప్పచెప్పగలిగినందుకు, ఆపరేషన్ లో బందీలుగా ఉన్న తనవారిలో  ఒక్క ప్రాణం కూడా పోనందుకూ ఎంతో సంతోషంగా ఉన్నా, అమాయక ఆఫ్రికన్ స్నేహితులు మరణించడం, అసలు వాళ్ళు ప్రాణాలతో మిగిలారో లేదో, శిధిలాల్లో బ్రతికే ఉన్నారో లేదో కూడా తెలుసుకోగలిగిన అర్హత , సమయం, అవకాశం తనకు లేనందుకు guilt అతని మనసులో ఇప్పటికీ గుచ్చుకుంటూనే ఉంటుంది. పాపా గీమా, తనకు సోదరి లాంటి 'సిస్టర్' అనే మహిళా, మార్టిన్ అనే ఒక RUF కేప్టెన్ - ఇతర ఎరిగిన ముఖాలూ - తాను వాళ్ళనన్నా కాపాడుకోలేకపోయాడే అన్న బాధ, మేజర్ పునియాను ఇప్పటికీ వేధిస్తూనే ఉంది.   ముందు రాత్రే వాళ్ళను కల్సినా ఆపరేషన్  గురించి హెచ్చరించలేకపోయానే అనే బాధ (సమాచారం  లీక్ అవుతుందేమో అన్న భయం వల్ల వారిని హెచ్చరించలేకపోతాడు)  అసలు 'కైలాహున్' ని ఎటాక్ చేస్తూ విడిచిపెట్టాల్సి రావడం అతనికి కోలుకోలేని బాధ. అసలు 'పాపా గీనీ' వల్లనే కదా తను ఫ్రీ గా తిరగగలిగింది, పరిస్థితుల్ని అంచనా వేయగలిగింది అనే బాధ, అతన్ని రక్షించలేకపోయానే అనే పశ్చాత్తాపం, అతన్ని ఎప్పటికీ విడువదు.  వృత్తిధర్మం ముందు స్నేహ ధర్మం, మానవతా ఓడిపోయాయి. సైనికుడిగా తన కర్తవ్య పాలన, తన దేశం పట్ల విశ్వాసం మాత్రమే తన మొదటి ధర్మంగా తీసుకోవాల్సొచ్చింది. 

మొత్తానికి కైలాహున్ లో చిత్తుగా ఓడిపోయి, 233 మంది భారతీయుల్లో ఒక్కరినయినా బంధించలేక / చంపలేకపోవడం, అంతవరకు మెత్తగా, శాంతియుతంగా, స్నేహపూర్వకంగా ఉన్న భారత సేన, ఉగ్ర రూపం దాల్చడం, వారి ఫైర్ పవర్, నైపుణ్యం, వ్యూహాలు, RUF  పొగరుని, అహంకారాన్నీ చావుదెబ్బకొట్టాయి. కేవలం ఆపరేషన్ ఖుక్రీ కారణాన ఇప్పుడు సియెర్రా లియోన్ ఒక శాంతియుత దేశమైంది.    ఈ ఆపరేషన్ ముగిసాక RUF  అహం వీడి (తోక ముడిచి)   మర్యాదగా చర్చలకు టేబుల్ దగ్గరకొచ్చింది. దేశం లో అరాచకం తగ్గింది. ఎప్పుడూ జీవితాల్లో ఒకదాని వెంబడి ఒకటి గా జరిగే సంఘటనల వెనుక భగవంతుడి హస్తం ఉంటుంది. ఏది ఎలా ఎప్పుడు జరగాలనుందో రాసిపెట్టి ఉంటుంది. 

ఈ ఆపరేషన్ ఖుక్రీ ని SRK (షాహ్ రుఖ్) హీరో గా సినిమాగా తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్యుమెంటరీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణం గా ఎంత గొప్ప ఆపరేషన్ లో అయినా ప్రాణనష్టం జరగడం అనేది సహజమే అయినా అప్పటి దాకా పునియా వర్ణనల్లో జీవించిన కేరక్టర్స్ మరణించడం అనేది పాఠకుడి హృదయాన్ని కాల్చేస్తుంది.   అయినా ఎక్కువ రిస్క్ తో గూడిన ప్లాన్ సీ ఎంపికవడం, తక్కువ ప్రాణనష్టం కలిగే అవకాశాలుగా చర్చినపడ్డ ప్లాన్ ఏ, బీ లు ఎంపికవకపోవడం వెనక లాజిక్ ని పాఠకుడి మనసు ఒప్పుకోదు.  బ్రిగేడియర్ సునిల్ తో కలిసి పనిచేసినందున ఆ సున్నిత మనస్కుడికి కూడా కైలాహున్ లో తాము సృష్టించిన అగ్ని కీలల ఎస్కేప్ రూట్ పూర్తి సంతృప్తిని ఇచ్చిందందుకోను. కాకపోతే, శవంగా ఇంటికి తిరిగిరావడం కన్న, లేదా లొంగిపోయి ప్రాణాలు కాపాడుకొని పరాభవంతో జీవితాంతం బ్రతకాల్సి రావడం కన్నా, pusillanimous గా ఉండిపోకుండా, కంట్రోల్ ని తమ చేతుల్లోకి తీసుకుని ముందుకు ఉరకడం,  సైనికుడిగా పోరాడడమే సరైన నిర్ణయంగా వీళ్ళు భావించి ఉండొచ్చు. 

ఏదిఏమయినా భయంకరమైన శత్రువు తమని అన్యాయంగా బంధించినపుడు టిప్పింగ్ పాయింట్ దాకా వేచి ఉండగలగడం కూడా పోరాటమే. దీనిలో కూడా మన సైన్యం ఈ ఆపరేషన్ లో గెలిచింది. మిలిటరీ పదజాలం, పటాలాల సామర్ధ్యం, పేర్లు వంటి వైపు పోకుండా కేవలం జరిగింది టూకీగా చెప్పడం మాత్రమే ఇక్కడ చేసినా కూడా వ్యాసం పొడుగు ఆంజనేయుడి తోకలా  పెరిగిపోతూనే ఉంది. 

పుస్తకం లో కొన్ని ఎక్కువయ్యాయి. రెండు మూడు చోట్ల సీక్వెన్స్ మిస్ అయింది. కొన్ని చోట్ల ఏమి జరిగిందో నాకు అర్ధం కాలేదు. గూగుల్ నీ, వికీ ని, USI నీ ఆశ్రయించాల్సొచ్చింది.   డేట్లు, టైం లైన్ లు లేవు. కొన్ని నెలలల పాటు జరిగిన సీజ్ గురించి కేవలం డైరీల ఆధారంగా గుర్తు చేసుకుంటూ, నాటకీయంగా రాసినందున కొన్ని ముందువెనుకలు, కొన్ని రిపిటీషన్ లు వచ్చాయి. అయినా సరే చెప్పదలచుకున్నది సరిగ్గా చెప్పడం జరిగింది. ఇది బేసిక్ గా ఒక పశ్చాత్తాప ప్రకటన పుస్తకం!  తమ వేలర్ని, ప్రతిభనీ చెప్పుకునేందుకు రాసినదని పూర్తిగా అనుకోలేం.   అయితే  అతి గ్లోరిఫికేషన్, అతి రొమాంటిసైసేషన్,  అతి నిర్బంధం, అతి అధికారం, అతి విశ్వాసం, అతి సామర్ధ్యం, అతి విధేయత, ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే మంచి టీం లో భాగంగా, మంచి లక్ష్యాలకోసం, మంచి పోరాటాలు చేయడం, దానిలో గెలుపును వరించడం అందరికీ ప్రాప్తం కాదు. 

పుస్తకంలో సూటిపోటి మాటలూ ఉన్నాయి. సాధారణంగా నిజ కథ ని రాసినప్పుడు కొందరు (పెద్దవాళ్ళ) చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుతాం / ఎదిరించం / క్రిటిసైస్ చెయ్యం. దీనిలో క్రిటిసైస్ చెయ్యడమూ ఎక్కువే ఉంది. తన చర్యలను తాను అతిగా సమర్ధించుకోవడమూ ఉంది. అయితే ఆయన సూచించిన సమర్ధనల్లో కాస్త నిజం, కాస్త అతీ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆర్మీ లైఫ్ లో ఆ మాత్రం డ్రామా ఉండడం తెలిసిందే.  కూతురు సహ-రచయిత అవటం వల్ల, లేదా కూతురే తండ్రి పాత్రను హీరోయిక్ గా వివరించడం వల్ల ఎక్కడో ఈ రచన కాస్త కారెక్టర్ సెంట్రిక్ గా సాగింది. మిగిలిన ఆఫీసర్ ల, జవాన్ల  సాహస చర్యల వర్ణన తక్కువగానే ఉంది. 

ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులకి గాలంట్రీ అవార్డులు వచ్చాయి. బహుశా పుస్తకం ప్రెస్ కి  వెళ్ళేముందు "డైరీ" తప్ప ఇతర రిఫరెన్సులు తీసుకోకపోవడం వల్ల ఈ మాట ఇందులో చెప్పలేదు .  కాకపోతే తన escape కి  సైన్యం ఎంచుకున్నమార్గం వల్ల ప్రాణాలు కోల్పోయిన కైలాహున్ గ్రామ వాసులను తలచుకుంటూ తన హృదయంలో పేరుకుపోయిన పశ్చాత్తాపాన్ని ప్రకటించడం, దాని ద్వారా తన బరువు దించుకోవడం కోసం  ఈ పుస్తకంలో 'జరిగిన సంఘటనలను నిష్పక్షపాతంగా చెప్పడం'  ద్వారా (దాయకుండా, లేదా తీపి పూతల కవరింగ్ చేయకుండా రాడం) పునియా చాలా నిజాయితీ గానే ఈ పుస్తకాన్ని రాసుకున్నట్టయింది.  ఏదేమైన మంచి పుస్తకం.  

***

Mentions :   

* RUF చేతికి లొంగిపోవడం అంటే ఓ రకంగా (ప్రాణాలతో) విడుదలే. ఆయుధాలు వదిలి, లొంగిపోయిన సైన్యాలను, గుంపులుగా తీస్కెళ్ళి మిత్రదేశమైన లైబీరియాలో విడదల చేసింది RUF. అతా సులువుగా, సింపుల్ గా కనిపిస్తుంది.  కాకపోతే అది అవమానం, దేశద్రోహం.  దానిలో Honor ఉండదు. మిలిటరీ లో లొంగుబాటు కి కొన్ని మర్యాదలు, సంప్రదాయాలు ఉంటాయి. RUF లాంటి brutal force కి ఏ మర్యాదలూ తెలీవు, పట్టవు. 

* సియెర్రా లియోన్ లేదా ఇతర ఆఫ్రికన్ దేశాలలో 'బుష్ వైఫ్' అనే పద్ధతి ఉంటుంది. ముఖ్యంగా సివిల్ వార్ లో రెబెల్స్ -  గ్రామాలలో స్కూలు పిల్లల్ని, ఇంట్లో ఉన్న అమ్మాయిల్నీ, కంటికి నచ్చినవాళ్ళనీ ఎత్తుకుపోయి, బలవంతంగా భార్యలుగా చేసుకుంటారు.  ఈ అంతర్యుద్ధాన్ని స్థానికంగా బుష్ వార్ అంటారు. గొరిల్లా వార్ ఫేర్ ని బుష్  వార్ అని అంటారు. ఈ బుష్ వార్ వీరులు చాలా పేరున్నవాళ్ళు కూడా. దేశాధ్యక్షులు కూడా అయారు. 

* సరిగ్గా ఇలానే బయటి దేశాల సైనికులు / UNPKF సైన్యాలు వచ్చినపుడు వేరే రకమైన బుష్ వైఫ్ లు తయారవుతారు. వీళ్ళుండిన రెండు మూడేళ్ళలో సెక్స్/ఎమోషనల్ అవసరాలకు వాళ్ళకు ఆడది కావాల్సి వస్తుంది. భయంకరమైన బీదరికం, పెద్ద జనాభా ఉండడం వల్ల, వారికి ఎవరో ఒక బుష్ వైఫ్ సులువుగా దొరికేవారు. వాళ్ళకి పిల్లలు కూడా కలుగుతారు. కానీ ఆయా ట్రూప్స్ తమ దేశాన్ని విడిచి వెళ్ళేటపుడు బుష్ వైవ్స్ వెనకే ఉండిపోతారు. కొత్తగా చంకలో బిడ్డ తో, ఎక్కువైన బాధ్యతతో, అదే నిస్సహాయతలో, బహుశా జబ్బులతో, గుండె కోత తో కూడా. 

* సియెర్రా లియోన్ లో ఎయిడ్స్ ఎక్కువ. భారతీయ ట్రూప్స్ లాండ్ అవగానే, వారితో పరిచయం చేసుకునేందుకు ఆడపిల్లలు ఆసక్తి కనపరుస్తారు. కానీ మేజర్ పునియా ముందే వాళ్ళని గట్టిగా హెచ్చరిస్తారు.  తమ సైన్యంలో ఎవరైనా ఇలాంటి రొమాంటిక్/ శారీరక బంధాలని ఏర్పరచుకోవడం జరిగితే సహించబోనని కూడా హెచ్చరించారు. 

 * మేజర్ పునియా తన పరిస్థితులని వివరిస్తూ, చాలా ఎమోషనల్ గా రాసిన కథనం ఇది. ఈ సంఘటన జరిగింది 2000 లో, మేజర్ పునియా ఈ కథనాన్ని, తాను మేజర్ జనరల్ అయ్యాక 2021 లో రచించి, ప్రచురించారు.  

* 02 మే 2000 నాడు ఈ అధికారిని, ఇతరులతో కలిసి బందీ గా తీసుకున్నారు.  మొదట RUF  స్థావరంలో బందీ చేసినా పాపాగీమా దౌత్యం వల్ల అతన్ని, మిగిలిన అబ్సర్వర్ల తో పాటు విడిచిపెడతారు.  వీళ్ళందరూ హై గ్రౌండ్ కేంప్ లో విడిది చేస్తారు.  ఈ సీజ్ జరిగినన్నాళ్ళూ అబ్సర్వర్లు టెంట్లు లేని ఓపెన్ ఆకాశం కింద bivouacs  అంటే టెంట్లు లేని తాత్కాలిక సైనిక స్లీపింగ్ బేగ్ లాంటి ఏర్పాట్లలో గడిపారు. స్పైసీ ఇండియన్ భోజనం తిన్నారు.  కొందరు పారిపోవడానికి ప్రయత్నించారు. భారతీయ సెంట్రీలకు, అధికారులకూ చాలా చికాకులు కలిగించారు.   అయితే వీళ్ళ నేషనాలిటీల వల్ల, భారత సైన్యం పై RUF ఏ దాడికీ దిగలేదు.  ఎప్పటికప్పుడు తన వాళ్ళ సంఖ్యను పెంచుకుంటూ వచ్చినా కూడా, సంఖ్యాబలం వాళ్ళదే ఎక్కువయినప్పుడు కూడా,  శక్తివంతమైన దేశాల ప్రతినిధులను చంపితే అంతర్జాతీయంగా బలహీనపడతామని తెలిసి, లొంగిపోయేందుకు భారత బెటాలియన్ పై ఒత్తిడి తెచ్చిందే గానీ తనకు తానై, వీళ్ళమీద దాడి చెయ్యలేదు. ఈ అబ్సర్వర్లను "ఎసెట్" గా పునియా భావించి, వాళ్ళను వేరేగా విడుదల కానివ్వలేదు. ఇదో game changer.

* 15 జులై 2000 న పొద్దున్న వేకువకు ముందు మొదలయిన   ఆపరేషన్ కు 1030h కల్లా ముగింపు మొదలయింది. సాయంత్రానికల్లా అందరూ evacuate చెయ్యబడ్డారు.  ఈ అబ్సర్వర్లను కాపాడుకునేందుకే రెండు చినూక్ హెలికాప్టర్లు కేంప్ లో లాండ్ అయ్యాయి.  వీళ్ళిలా ఎదురుతిరుగుతారని RUF  కి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం కలగలేదు.  చినూక్ లు పెద్దవి కాబట్టి వాటి లాండిగ్ కి , కేంప్ లో వాలీబాల్ కోర్ట్ కి పక్కనున్న చెట్లను  తొలగిస్తున్నపుడు RUF అడ్డుకోబోతే,  వాటిని  ఆటస్థలం విస్తరణ కోసం నరుకుతున్నాం అని  చెప్పారు. "మేజర్ ఇక నువ్వు ఇక నీ దేశానికి వెళ్ళవా?" అని  RUF అబ్బాయిలు హాస్యమాడారు. 

* అంతర్జాతీయ సైనిక సంస్థలు, ఎన్నో దేశాల దళాలూ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఫోర్స్ కమాండర్ స్వయంగా దారూ లాంటి యుద్ధ క్షేత్రంలో సర్వసన్నద్ధంగా ఈ evacuation  ను పర్యవేక్షించారు.   తెల్లారి ఆపరేషన్ మొదలవుతుందని, రేపుదయం మీరు ఎయిర్ లిఫ్ట్ చెయ్యబడతారనీ, అబ్సర్వర్లకు అర్ధరాత్రి చెప్పారు. ఒకవైపు హెలికాప్టర్లను RUF కాల్చేస్తుందని భయపడినా,  అబ్సర్వర్లు ఈ వార్త తెలియగానే పునియాను హత్తుకుని ధన్యవాదాలు తెలిపారు.  

* సియెర్రా లియోన్ లో ఆహారకొరత ఎక్కువ కాబట్టి అక్కడి ప్రజలు రోజులో ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. చుట్టుముట్టబడిన తరవాత రేషన్ సప్లై నిలిచిపోవడంతో భారత సైన్యం కూడా ఒక పూట భోజనంతోటే 75 రోజుల పాటు గడిపింది. 

* సియెర్రా లియోన్ ప్రజలు స్వయంగా  "ఖుక్రీ వార్ మెమొరైయల్" ని మోవా నది తీరంలో నిర్మించేందుకు సహకరించారు.   దీని ద్వారా అంతర్యుద్ధంలో వాళ్ళెంత నలిగిపోయారో అర్ధం చేసుకోవచ్చు. 

* మేజర్ పునియా కు ఈ ఆపరేషన్ తరవాత 2002 లో రాష్ట్రపతి చేతుల మీదుగా  'యుద్ధ సేవా మెడల్'  దొరికింది. ఈ మెడల్ వల్ల అతని సొంత రాష్ట్రం రాజస్థాన్ లో ప్రభుత్వం అతనికి కొంత భూమి కూడా ఇచ్చింది. ఇక్కడ ఆయన భార్య "కైలాహున్ ఫార్మ్" (Kailahun Farm)  ని ఏర్పరిచారు. దీని ద్వారా ఆ భూమిలో ప్రతి మట్టి కణమూ మన సైనికుల వీర గాధల్ని భవిష్యత్ తరాలకు చెప్పాలని ఆవిడ కోరిక. 



ముగింపు :  (రచయిత అభిప్రాయం)

The actual plan executed during Operation Khukri was not the best from a safety point of view, but it was the best possible plan under the prevailing scenario and the most effective way to teach a lesson to the RUF, who had never been defeated by any military force in their heartland of Kailahun until the Indian Army brought them to their knees.  This later turned out to be the principal cause and facilitator for the RUF returning to the discussion table to seriously explore an effective, long-lasting peace in the war-ravaged country of Sierra Leone.  If today Sierra Leone is a peaceful country and is progressing in the right direction, I can say with conviction and honesty that the Indians played a significant role in this and paid a mammoth price to ensure peace.


కాబట్టి, కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో - అనే దానికి చాలా బ్రాడ్ వ్యూ పాయింట్ ఉంటుంది.  చేతనయినంత వరకు మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ పోవడమే మనం చెయ్యాల్సింది. సైన్యాధికారయినా, పెద్ద డాక్టరయినా, సైంటిస్టయినా దైవ ప్రేరణ ని నమ్ముతాడు. ఒకవేళ కాలపురుషుడు, సృష్టి స్థితి లయ కారుడు ఉంటే, ఇదంతా అతని స్క్రిప్ట్ అని అనుకోవాలి. 

***