The Home Coming - Rabindranath Tagore
'ప్రతీక్ చక్రవర్తి' ఊర్లో పిలకాయలందరికీ చక్రవర్తి లాంటి వాడు. ఎప్పుడూ ఏదో ఒక కొంటె ఆలోచన తన తల లో పరిగెత్తుతూ ఉంటుంది. ఏటొడ్డున, పడవ తయారీ కోసం తెచ్చిన పెద్ద దుంగ ఒకటి పడి ఉంటే, దాన్ని తెచ్చి, దొర్లిస్తూ దాని స్థానం నుంచీ దూరంగా తరలించుకుపోవడం అలాంటి ఒక ఆలోచన. ఆ దుంగ యజమాని కోపంతోనూ ఆశ్చర్యంతోనూ కుతకుతలాడుతుంటే ఈ పిల్లకాయలకి సరదా.
ప్రతీక్ తన ఆలోచన చెప్పగానే ప్రతి ఒక్కడూ ముందుకొచ్చి, ఆ దుంగని దొర్లించేస్తూ తోసెయ్యడానికి సిద్ధపడిపోయారు. తీరా వీళ్ళ మజా మొదలయ్యేసరికీ ప్రతీక్ తమ్ముడు మాఖన్ వచ్చేసి, ఒక్క మాటా, పలుకూ లేకుండా దుంగ మీద కూర్చుండిపోయాడు. మిగిల్న పిల్లలు ఈ నిరసన కి మ్రాన్పడిపోతే, ప్రతీక్ ఆవేశంగా "మాఖన్ ! మర్యాదగా లే. లేదంటే నీ తాట తీస్తాను! " అని కేకేసాడు.
అయినా తమ్ముడు మాట వినకపోయీసరికీ, వాడుండగానే దుంగ ని తొయ్యమన్నాడు మిత్రులని. కింద పడిన మాఖన్ అవమానంతో రగిలిపోయి, ప్రతీక్ దగ్గరికెళ్ళి నాలుగు అంటించి, ఇంటికేసి పారిపోయాడు. ప్రతీక్ మొహం తుడుచుకుని ఏటి ఒడ్డున కూర్చున్నాక, ఏటి లోంచీ ఒక పడవ ఒడ్డుకొచ్చింది. అందులోని పెద్దమనిషి ప్రతీక్ ని చూసి, "బాబూ, చక్రవర్తుల ఇల్లుఎక్కడ?" అని అడిగాడు. ఈ కొత్త వ్యక్తి తెలీని ప్రతీక్ "మీరే వెతుక్కోండి!" అని చెప్పేసి, ఆలోచనల్లో కూరుకుపోయాడు.
కాసేపటికి ప్రతీక్ ని ఇంటికి రమ్మని పిలుపొచ్చింది. తల్లి ఇల్లు చేరగానే ప్రతీక్ ని తమ్ముడిని కొట్టినందుకు చెడా మడా తిట్టింది. "అయ్యో ! అమ్మా.. నేను తమ్ముడిని కొట్టలేదు. వాడే కొట్టాడు !"అన్నా విన్లేదు. ఆవిడ అన్యాయంగా తనని తిడుతూండేసరికీ విసిగిపోయి, కోపంతో తల్లి ముందే మాఖన్ ని లాగి ఒక్కటిచ్చుకున్నాడు. తల్లి, పిల్లలిద్దర్నీ విడదీసేటప్పుడు పొరపాట్న తల్లిని నెట్టేస్తాడు ప్రతీక్. ఇక ఆవిడ కోపం పట్టరానిదైపోతుంది. "తల్లినే కొడతావురా!! దుర్మార్గుడా ?" అని తిట్లు లంకించుకుంటుంది.
అప్పుడే ఆ పడవలోంచీ దిగిన పెద్దాయన ఇంట్లోకొస్తాడు. అతను ఈ పిల్లల మేన మామ బిషంబర్. సోదరుడిని చూసి తల్లి శోకండాలు మొదలు పెడుతుంది. ఈ మేనమామ బొంబాయిలో ఉండగా ప్రతీక్ తండ్రి మరణించాడు. ఈయన ఇప్పుడు కలకత్తా తిరిగొచ్చాడు కాబట్టి, చెల్లెలిని చూసేందుకు వచ్చాడన్నమాట. ఆవిడ బీదరికమూ, పిల్లల్ని సంభాళించుకోలేకపోవడమూ చూసి, మేన మామ, ప్రతీక్ ను తన తో పాటూ పట్నానికి తీసుకెళ్ళి చదివిస్తానని చెప్తాడు. దానికి తల్లి ఎంతగానో ఆనందించి, కనీసం ఈ పెద్ద వాడికి కాస్తయినా చదువు అబ్బి బాగుపడతాడని, సరే అంటుంది.
నిజానికి ఆ తల్లికి ప్రతీక్ అంటే చాలా విసుగు. ఈ పిల్లవాడు చెడిపోయినట్టే అని, బద్ధకిష్టి అని, పనికిమాలిపోతున్నాడనీ, చెప్పిన మాట వినడని, అల్లరి లో జంతువు లాంటివాడని, ఆవిడ అభిప్రాయం. ఆవిడ మాఖన్ చెప్పే చాడీల ప్రభావంలో, వైధవ్యం వల్ల కలిగిన బాధ్యతల హోరులో దిక్కు తోచనిదై వుంటుంది. మేనమామ ఉన్నన్నాళ్ళూ కలకత్తా వెళ్ళడం గురించి ఉత్సాహంతానే కనుక్కుంటాడు ప్రతీక్. వెళ్ళే ముందర తమ్ముడికి తన విలువైన వస్తువులైన చేపల గేలం, పెద్ద గాలిపటం, రంగు రాళ్ళు అప్ప చెప్పేస్తాడు. ఈ రోజు మాఖన్ మీద అతనికి కలిగిన ప్రేమాభిమానాలని కొలవలేము.
కలకత్తా వెళ్ళాక, అత్తయ్యని మొదటిసారి చూసాడు ప్రతీక్. అసలే బీదరికంతో సతమతమవుతున్న తమ ప్రాణాలకి ఈ పిల్లాడి లంపటం కూడా తగలడం ఆవిడకి అస్సలు నచ్చదు. తన ముగ్గురు పిల్లలే కాక ఈ పధ్నాలుగేళ్ళ పల్లెటూరి పిల్లాడిని సాకడం తన వల్ల కాదనేస్తుంది. బిషంబర్ నిజానికి ఈ బాధ్యతని తలకెత్తుకునే ముందు తన ఇంట ఎదురవబోయే వ్యతిరేకతని బేరీజు వేసుకోవాల్సింది.
పధ్నాలుగేళ్ళ ప్రాయం చాలా కష్టమైనది. ఆ వయసులో ఈ పిల్లాడు చిన్న పిల్లవాడే అయినా, పెద్దగా కనిపిస్తాడు కాబట్టి, వాడికి కావలసిన ఆప్యాయత ని అందివ్వడమూ కష్టమే. కాళ్ళకీ చేతులకీ అడ్డు పడుతున్నట్టుంటాడు. మేనమామ పిల్లలు కూడా ఇతడిని అడవి జంతువుని చూసినట్టు చూస్తారు. ఒక హీరో లా ఊరిలో కాలరెగరేసుకుని తిరిగే ప్రతీక్ పరిస్థితి కలకత్తాలో చాలా నీచంగా తయారవుతుంది. తనలో, తన చుట్టూ జరిగే మార్పులకీ, కలకత్తా లాంటి ఇరుకు ప్రదేశానికీ అలవాటు పడలేక సతమతమయ్యే ఈ పిల్లవాడికి ఈ ప్రేమాదరాలు లభించకపోవడమూ నరకంగా ఉంటుంది.
పద్నాలుగేళ్ళ పిల్లాడికి సొంత ఇంట్లో ఉండడం స్వర్గమే. కానీ ప్రతీక్ పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ ఎవరూ ప్రేమగా మాటాడరు. ఎప్పుడూ, తిట్లూ, తిరస్కారాలతో వీధికుక్కలాంటి జీవితమైపోతుంది. మేనత్త నిరాదరణ స్పష్టమే. ఆవిడ వాడి చేత పనులు చేయించుకునేది. ఏ చిన్న పొరపాటు జరిగినా తిట్లు తప్పేవి కాదు. తను బ్రతకడం చాలా మందికి భారమే అనిపించేది. ఆ ఇరుకు వీధుల్లో ఆడుకునేందుకు లేదు. స్కూల్లో ఒక సారి పుస్తకం పోతే, మేష్టారు నానా మాటలంటాడు. వీడు పళ్ళ బిగువున దుఃఖాన్ని అణుచుకుని మేనమామ ని ఇంకో పుస్తకం కొనిపెట్టమంటే, మేనత్త దెబ్బలాడుతుంది.
ఈ ఊపిరాడని పరిస్థితుల్తో పోరాటం చేసీ చేసీ, ఇంటి వైపు మనసు మళ్ళుతుంది. ఊరిలో తన స్నేహితులెంతమంది. ఇక్కడ ఎవరూ లేరే ! ఒక రోజు "మామా ! ఇంటికి వెళ్తాను" అంటాడు ప్రతీక్. "సెలవులు రానీ! వెళ్దువు గానీ!" అన్నాడాయన. ఇక సెలవులెప్పుడా అని ఎదురు చూపులు మొదలు.
ఒక సారి కలకత్తాలో భీకరమైన ముసురు పట్టినపుడు ప్రతీక్ కనిపించకుండా పోయాడు. నిజానికి వాడికి సరైన తిండి లేక, ఇంటి మీద బెంగ తోనూ జ్వరం పట్టేస్తుంది. మేనత్త దగ్గర ఉండిపోతే, వాళ్ళకి ఇబ్బంది కలిగించినవాడినవుతానని, ఈ పిల్లడు కాళ్ళనీడ్చుకుంటూ ఊరెళిపోదామని మనసు కొట్టుకుపోతుంటే, దోవ తెలీకపోయినా ఎలాగో పోదామని వెళిపోతాడు. మేనమామ వెతికీ వెతికీ పోలీసు కంప్లైంట్ ఇస్తాడు. మూడు రోజుల తరవాత పోలీసులు తడిచి ముద్దయిన పిల్లాడిని ఇంటికి తీస్కొస్తారు. జ్వరం పూర్తిగా ఎక్కువయిపోతుంది.
మేనత్త విసుక్కుంటుంది. జ్వరం వచ్చింది. మీకు ఇబ్బంది కాకూడదనే ఇంటికి వెళ్ళబోయా అంటాడు ప్రతీక్. రెండురోజుల్లోనే పరిస్థితి తారుమారవుతుంది. జ్వరం ప్రకోపించి సంధి ప్రేలాపనలు మొదలవుతాయి. "మావయ్యా ! సెలవులెప్పుడు వస్తాయి !?" అని కలవరిస్తున్నాడు ప్రతీక్. డాక్టరు పెదవి విరిచేసాడు. బిషంబర్ బాగా భయపడిపోయి, చెల్లెలికి కబురు చేస్తాడు.
తల్లి గుండె బాదుకుంటూ కలకత్తా వస్తుంది. ప్రతీక్ మంచమ్మీద స్పృహ కోల్పోయి కనపడీసరికీ, ఆవిడ పై ప్రాణాలు పైనే ఎగిరిపోతాయి. "ప్రతీక్, నా బాబూ!" అని వెర్రిగా ఏడుస్తుంది. తల్లి గొంతు విని కళ్ళు తెరిచిన ప్రతీక్ "అమ్మా సెలవులొచ్చాయి!" అని, కన్ను మూస్తాడు.
***
ఈ కథ ని 'పిల్లల కోసం వెబ్ సిరీస్' తీద్దామని ఒకరు సంకల్పించి పిల్లలు protagonist / సబ్జెక్ట్ గా ఉన్న (ప్రముఖ) కథలని సూచించమంటే, కుదించి, ఇలా రాసాను. దురదృష్టవశాత్తు ఇది ఎంపిక కాలేదు. కానీ బ్లాగ్‌లో పెట్టేస్తే ఎవరైనా చదువుతారని పోస్ట్ చేస్తున్నాను.
***
No comments:
Post a Comment