ఒక వేళ అమితవ్ ఘోష్ ని చారు కాచడం మీద పుస్తకం రాయమంటే, చారు, దాని మూలాలు, దానిలో వాడే పదార్ధాల మూలాలు, వాటి చరిత్ర, అవి ఈ భూమి మీద, నీ తుచ్చ శరీరం మీదా, భవిష్యత్తరాల మీద వేయబోయే ఇంపాక్ట్, అన్నిటినీ ఒక నాలొగొందల పేజీల పుస్తకం రాసి, జీవితంలో చారు అంటే విరక్తి చెందేలా చేస్తాడనీ, however, చివరికి ఆఖర్లో చారు లేకపోతే బ్రతకలేం అనే స్పృహని కలిగించి, పాఠకుల్ని వంటింటి వైపు లాక్కునెళ్తాడనీ, ఫ్రెండ్స్ జోకులు వేసుకునేవాళ్ళు. అలాంటి అనుభవమే ఇస్తుంది ఈ పుస్తకం, ఘోష్ నాలుగో పుస్తకం. బొత్తిగా అమ్మాయిలు రాసిన రొమాన్స్ లా వుంటుంది. కాకపోతే, ఎప్పట్లాగే మానవత్వమూ, మనిషికి సాటి మనుషుల పట్లా, చుట్టూ ఉన్న ప్రకృతి పట్లా ఉండితీరాల్సిన ప్రేమ గురించి ఆంత్రోపాలజిస్టిక్ చూపుతో రాసిన పుస్తకం కాబట్టి చెప్పుకోవాలి.
దేశసరిహద్దులకు ఇరుపక్కలా ఉన్న బెంగాలు లో, మన దేశానికున్న తూర్పుతీరాన, సముద్రానికీ, నదులకూ మధ్య విస్తరించిన అతి పెద్ద చిన్ని చిన్ని ద్వీపాల సముదాయం సుందర్బన్ ప్రాంతం. ఈ చిన్నవీ పెద్దవీ ద్వీపాలు రోజువారీ సముద్రపు ఆటుపోట్లకు తరచుగా మారుతుండే లాండ్ స్కేపు లతో, భయంకరమైన పురుగూ పుట్రా, రాయల్ బెంగాల్ టైగర్లు, మొసళ్ళు లాంటి జీవులతో నిండి వుండి, దాదాపు మానవావాసానికి పనికి రాకుండా ఉన్నా కూడా, మనుషులు ఈ దీవుల్లో నివసించారు. కొన్ని నివాసయోగ్యమైన ఒకటీ అరా దీవులకి పశ్చిమ బెంగాల్ నుండి కొద్దో గొప్పో కనెక్టివిటీ ఉన్నా, అతి రిమోట్ దీవులు, కేవలం పడవల మీద ఆధారపడేవి కోకొల్లలు. పంటలు పండని ఉప్పు నేల. వంట చెరకుకోసం అడవిలోకెళ్తే ఏ పులో పట్టుకుపోయేది. చేపలు జీవనాధారం. ఉప్పు గాలి, పోటొస్తే ముంచెత్తే నీళ్ళు, వరదలు, విధ్వంసం, బీదరికం, నిరక్షరాశ్యత అక్కడి జీవన విధానం.
ఇలాంటి సుందర్బన్ లను ప్రధానంగా ఒక విషయంగా తీసుకుని రాసిన నవల ఇది. ఈ సుందరమైన (నిజంగానే అత్భుత ప్రకృతి సౌందర్యం ఈ నీటి గ్రామాల సొంతం) అభివృద్ధికి నోచుకోని ప్రాంతం, ఎన్నో వైవిధ్యమైన జీవరాసులకు ఆలవాలం. బెంగాల్ లో బ్రిటీష్ వారి రాజ్యం నడుస్తున్నపుడు జనం లేని ఈ కీకారణ్యాలలో ఉచితంగా భూమిని ఇస్తామని చెప్పి ఎందరో నిర్భాగ్యులను ఈ ప్రాంతాలవైపు ఆకర్షించారు. బీహారు, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలనుండీ, కడు బీదలు కట్టు బట్టలతో ఈ చిత్తడి నేలలకు వ్యవసాయం చేసుకుందామని ఆశతో తరలి వచ్చారు. అదృష్టం బావుంటే కొంత వరి పండే ఆ భూమికి చేరేసరికి, వాళ్ళలో సగం మంది ఆ నేల పై ఎదురయ్యే ప్రమాదాలకే బలయ్యారు. కొందరు రాజకీయాలకు బలయ్యారు. మిగిలిన వాళ్ళు ఎలాగో ఎదుగూ బొదుగూ లేని జీవితానికి అలవాటు పడ్డారు.
అలాంటి సుందర్ బన్ జీవ వైవిధ్యానికి పేరెన్నిక కన్నది. ఇక్కడి ఇరవాడి డాల్ఫిన్ ల గురించి పరిశోధనలు చేయడానికి పియా (Piyali) అనే cetologist, సుందర్బన్ లోకి అడుగుపెడుతుంది. అక్కడి స్థానికులు రెండు దేశాల మధ్య సంధి ప్రాంతానికి చెందినవాళ్ళు. అక్కడి రాజ్యం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దే. అవినీతి, అరాచకం కమ్ముకుపోయిన ప్రాంతం అది. అలాంటి ప్రాంతానికి ఒంటరిగా వచ్చేందుకు పియాలీ అనే ఈ బెంగాలీ మూలాలు ఉన్న అమెరికన్ మెరీన్ బయాలజిస్ట్/cetologist సిద్ధపడడం ఇక్కడి స్థానిక సమాచారం లేకున్నా, భాష రాకున్నా ఏదో ఆవేశంతో దూసుకు పోవడం, ప్రధానంగా ఉంటుంది. ఈ పిల్ల రాకతో కరెస్పాండ్ అవుతూ, ట్రాన్స్లేటర్, రచయితా అయిన కనాయ్ కూడా సుందర్బన్ లలో లూసీబరీ అనే దీవికి వస్తాడు. అతను కోల్కతా వాసి అయినా, అతని అంకుల్, ఆంట్ లు లూసీబరీ లో స్కూలు నడుపుతూ అక్కడే స్థిరపడడం వల్ల, వాళ్ళని కలిసేందుకు కనాయ్ చిన్నతనంలో కొన్నిసార్లు లూసీబరీ రావడం వల్ల, అతనికి అక్కడి వాళ్ళతో కాస్తో కూస్తో పరిచయాలుంటాయి. అయినా ఎన్నో ఏళ్ళ తరవాత అతను లూసీబరీ కి ఆంటీ కోరిక మీద వస్తాడు. వీళ్ళిద్దరూ రైల్లో కలిసి, పరిచయం ఏర్పరుచుకుంటారు.
ఇప్పుడు కనాయ్ చిన్నప్పటికీ, కథాకాలానికీ ఎన్నో మార్పులు జరిగి ఉంటాయి. లూసీబరీ నిజానికి ఒక ఇంగ్లీషు దొర తన భార్య లూసీ కోసం, పేరు లేని ఆ కొత్త దీవిలో నిర్మించిన ఇల్లు. ఆవిడ ని ఈ ఆటుపోట్ల సముద్ర నదీ సంగమ ద్వారంలోకి పడవలో తీసుకొస్తున్నపుడు ఆ పడవ మునిగి పాపం మరణించింది. అయితే, ఆమె జ్ఞాపకార్ధం ఆ ఇంటినీ, ఆ దీవినీ కూడా స్థానికులు లూసీబరీ అనే పిలవడం మొదలయింది. అలాంటి లూసీబరీ లో కనాయ్ ఆంటీ, అంకుల్ లు వుంటారు. వాళ్ళకి పిల్లల్లేరు. వాళ్ళు బెంగాల్ లో విప్లవం వర్ధిల్లిన రోజుల్లో కమ్యూనిజం వంటబట్టించుకున్నా, అనారోగ్య సమస్యల వల్ల విప్లవాన్ని వదిలి, జనంకోసం జీవించే ముని దంపతుల్లా మిగిలిపోయి, అప్పటికి చదువూ, సంధ్యా, హాస్పత్రులూ లేని ఆ దీవికి తమంతట తామే వచ్చి, ఆ ఇల్లు కొనుక్కుని, జనానికి సేవలు చేస్తూ స్థిరపడతారు.
వీళ్ళ ప్రయాణంలో ఎందరో దీవి జనాలు తారసపడతారు. శుద్ధ పల్లె అమాయకత్వం, అవిద్యా, నిస్సహాయుల్ని చేసే బీదరికం, పులుల వల్ల కుటుంబ పెద్దలు మరణించడంతో వీధిన పడిన కుటుంబాలు, ఒంటరైపోయిన ఆడవాళ్ళూ, వారికి ఆడపిల్లలు ఉంటే, వాళ్ళని (కూడా) దళార్లు పని ఆశ పెట్టి కలకత్తా తీసుకెళ్ళి కామాటిపూరా లో వేశ్యలు గా అమ్మేయడం - సర్వ సాధారణం. కనాయ్ బంధువులు అక్కడి సామాజిక రాజకీయ బీదరికాల్లో, తమ సొంత ఆస్తులతో ఇలా అవసరం ఉన్నవాళ్ళకు దన్నుగా నిలవడం, ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ఉన్న వాళ్ళకు అవి అందేలా చూడడం, మెయిన్ లాండ్ నుండీ అధికారన్నవాడు తొంగిచూడని ద్వీపాలలో అడపా దడపా అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి, ఆడవాళ్ళని ఆదుకోవడం, చదువు చెప్పడం, చిన్న చిన్న నర్సింగ్ (ప్రథమ చికిత్స, టీకాలు) పనులు నేర్పడం లాంటివి చేస్తుంటారు. విధవలు, నిస్సహాయులయిన ఆడవారి తో స్వయం సహాయక సంఘాల వంటివి నడుపుతుంటారు.
పియాలీ పరిశోధనల కోసం కథా ప్రారంభంలో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన లాంచ్ ఎక్కి నీళ్ళమధ్యకు ప్రయాణం చేస్తుంది. ఆమెకు అప్పటికే, రక రకాల ఏషియన్ దేశాలలో ఈ తరహా డాల్ఫిన్ల మీద పరిశోధన చేసిన అనుభవం ఉంది. అయితే, ఫారెస్ట్ గార్డు, ఆమె తెచ్చుకున్న గైడ్ ఆమెకు సాయపడేది పోయి ప్రతిబంధకాలుగా మారతారు. ఈలోగా ప్రమాదవశాత్తూ ఆమె నీళ్ళలోకి పడిపోతే, ఫకీర్ అనే బెస్తవాడు ఆమెను కాపాడతాడు. ఇక ఆమె ప్రయాణం అంతా అతనితోనే, అతని బోటు మీదే. అతనికీ, ఆమెకి మాటాడుకునేందుకు భాష లేకపోయినా, ఆమె కి కావల్సింది అర్ధం చేసుకున్నట్టుగా అక్కడి పరిసరాల మీద చిన్నప్పట్నించీ పుట్టిపెరిగిన అనుభవం వల్ల, రాత్రీ పగలూ, మారుతుండే అలలల రీతుల మధ్య ఆమెను డాల్ఫిన్లు తిరిగే చోట్లకు జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటాడు ఫకీర్. ఆమెకు కొద్ది రోజుల్లోనే, తన పరిశోధనలకు నెలలు పట్టవచ్చని అర్ధం అవుతుంది. ఆ సమయం వీళ్ళిద్దరూ దగ్గరయేందుకు కూడా సాయపడుతుంది.
ప్రధానంగా కథంతా ఈ మూడు పాత్రల తోనే నడిచినా, ఈ నవల్లో హీరోలు సుందర్బన్, అక్కడి స్థానిక ప్రజలు, వాళ్ళ అంతులేని జీవన పోరాటం. సుందర్బన్ లో దట్టమైన అడవులు, ఆటుపోట్లకు నీళ్ళు వస్తూ పోతూ ఉండడం వల్ల విచిత్రమైన చిక్కదనంతో, గ్రీనరీతో, బలమైన వేళ్ళతో, తీరం పొడవునా ఉన్న మడ అడవుల్లో పెరిగే విచిత్రమైన చేపలు, విష సర్పాలు, మొసళ్ళు, పొదల్లో దాగి ఉన్న బలమైన పులులతో చాలా డేంజరస్ గా ఉంటాయి. రాత్రిళ్ళు పడవ ప్రయాణాలు ప్రమాదకరం. రాత్రిళ్ళు గ్రామాల బెస్తవాళ్ళు తమ పడవలు కొట్టుకుపోకుండా, తీరానికి కాస్త దూరంలో అన్ని పడవల్నీ తాళ్ళతో కట్టుకుని గుంపుగా మకాం వేస్తారు. ఫకీర్ మాత్రం వేటకు వెళ్ళినప్పుడు తన పడవ లో యోగి లా ఒక్కడే ఉంటాడు. తీరానికి మరీ దగ్గరగా పడవని ఉంచితే ఏ రాత్రప్పుడో పులులో ఇంకేవో జంతువులు పడవలోకి దూకగలవు. ఎక్కువ లోతున్న నీళ్ళలో ఉంచితే, తెల్లరేసరికి ఏ దీవికి కొట్టుకెళిపోతామో తెలీదు. ఈ పడవల బెస్తవాళ్ళకి అవే ఇళ్ళు. వేటకు వెళ్ళినపుడు, వండుకోవడానికీ, తినడానికీ, రాత్రిళ్ళు పడుకోవడానికీ, అన్ని ఫెసిలిటీస్ ఉన్న బీద గూటి పడవలు అవి. రాత్రంతా వలలేసి, చేపలు పట్టి, తెల్లారుతూ ఊరిలోని దళారులకు అమ్ముకోవడానికి తీసుకొస్తారు.
ఈ అడవుల్లో ప్రమాదాలు పిల్లా పాపా అందరికీ తెలిసినవే. అందుకే వాళ్ళకు "బొన్ బీబీ" వనదేవత ఉంటుంది. మంచి కర్మలు చేసేవాళ్ళకి, తనని మనసారా నమ్మేవాళ్ళకీ ఈ వన దేవత అండ ఉంటుందని స్థానికులు నమ్మేవారు. వారి నాటకాలలో "బొన్ బీబీ" కాపాడిన పిల్లల కథలుంటాయి. ఈ వన దేవి పాలిటికి "దక్ఖిన్ రాయ్" అనే విలన్ రాక్షసుడు అడ్డు తగులుతుంటాడు. ఆవిడ భక్తులను అమాంతం తినేస్తుంటాడు. వాడే ఈ డేంజరస్ "పులుల" దేవుడు. ఎవరైనా పులిబారిన పడ్డారంటే దానర్ధం ఈ రాక్షసుడి ఉచ్చులో మనం పడబట్టే అని. దీవులమీదికి రాత్రి పూట ఆవరించే చీకటిలో ఆ రాక్షసుడు దాక్కునుంటాడు. అతనికి చిక్కితే ఇంక అంతే సంగతులు.
ఈ నవల 2004 లో వచ్చింది. అంటే 20 ఏళ్ళ తరవాత చదువుతున్నాను. ఇప్పటికీ సుందర్బన్ ఇంతందంగా ఉందో లేదో తెలీదు. కథ లో చిన్న చిన్న పిల్లల కళ్ళ ముందే వాళ్ళ తండ్రులను పులులు మెడ దగ్గర కొరికి చంపేసి, శరీరాన్ని అడవుల్లోకి ఈడ్చుకుని పోతుంటాయి. 1978-79 ప్రాంతాలలో బాంగ్లాదేశ్ నుండీ పారిపోయొచ్చిన బీదసాదల్ని, ఈ సుందర్బన్ లో భయానక దీవుల్లో ఆశ్రయం పొంది, ప్రాణాలతో మిగిల్నవాళ్ళని బెంగాల్ ప్రభుత్వం సగానికి పైగా కాల్చి చంపేసింది. దీన్ని "మోరిచ్ ఝాపీ మసాకర్" అంటారు. ఆ మసాకర్ లోనే ఒకానొక ప్రధాన పాత్ర మరణిస్తుంది. ఆవిడ తరవాతి తరం వాళ్ళు ఈ కథ కి ప్రాణం పోస్తారు. ఈ పిల్లల Trauma చెప్పనలవి కానిది. తండ్రిని పులి చంపేస్తున్నపుడు బొన్ దీదీని ఎంత పిలిచినా, ప్రార్ధించినా, వచ్చి కాపాడలేదని ఒకప్పుడు ఎంతగానో బాధపడిన పిల్లే ఈ మరణించిన ప్రధాన పాత్ర.
కథలో అమితవ్ ఘోష్ కాసింత చరిత్రా, వైజ్ఞానిక శాస్త్ర ప్రభోధన చేస్తాడు. దాదాపు మౌలిక సదుపాయాలు శూన్యమైన ప్రాంతాలలో సాధారణ ప్రజలు మెయిన్ లాండ్ నుండీ వెళ్ళి చిన్న చిన్న వలంటరీ సంఘాలు స్థాపించి, అక్కడి ప్రజలతో పని చెయ్యడం ముఖ్యమైన అంశం. ఆసంఘాలు ఇప్పుడు చాలా దూరం ప్రయాణించి వ్యవస్థాత్మక మార్పులు చెందాయనుకోండి. అసలు మనిషన్నవాడు ఉండలేని ఆ కీకారణ్యాలలో బ్రతుకుతెరువు వెతుక్కుంటూ వచ్చి స్థిరపడి ప్రతి పూటా బ్రతికేందుకు ప్రాణాలడ్డం పెట్టి పోరాటం చేసిన పాటకజనం, ఒకనాడు కన్సర్వేషన్ పేరిట అక్కడనుండీ వెళ్ళగొట్టబడడం, ఎవడో ఇంగ్లీష్ వాడు హామిల్టన్ కట్టించిన స్కూలు భవనం, అక్కడి ప్రజల ఎకలాజికల్ నాలెడ్జ్ - వీటన్నిటినీ తెలుసుకోవచ్చు.
ప్రజల లో మతానిది పెద్ద విషయం కాదు. క్రూర జంతువులండీ, రోగాలు రొచ్చుల నుండీ, ఆకలి నుండీ తమని తాము కాపాడుకోవడమే వాళ్ళ గోల్. రోడ్లు లేని, బురద ప్రాంతాలలో వెలిసిన చిన్న చిన్న సెటిల్మెంట్లు ఇప్పుడు పట్టణాలయ్యేయి. సుందర్బన్ లో ఆకలి గొన్న పోటు జలాలు ప్రతీ సీజన్లోనూ పొలాల్ని ముంచెత్తి, ఉప్పుమయం చేసేస్తాయి. అక్కడి జంతుజాలం, ఆటుపోట్ల సంగీతాల రిథం కు అలవాటు పడి, తమ తమ బిహేవియర్లను మార్చుకున్నాయి. మనిషి కూడా దానికి మినహాయింపు కాదు. ఆ మాటకొస్తే ప్రతీ ప్రాణీ, కాలంతో పాటూ ఇవాల్వ్ అవుతూ ఉంటుంది.
ఈ వనంలో వచ్చిన భీకర తుఫానులు, ఆకాశమూ, సముద్రమూ కలిసే చోటి అందాల వర్ణనలూ రచయితని ఓ మెట్టు పైకి తీస్కెళ్ళినిలబెడతాయి. తుఫానులు సర్వసాధారణమైన బాంగ్లాదేష్ ని ఆనుకునున్న ప్రాంతం కాబట్టి, మడ అడవులు నీళ్ళలో మునుగుతూ, తేలుతూ, తీర ప్రాంతాల్ని రక్షిస్తూ, అక్కడి ఎకాలజీని పరిపుష్టం చేస్తుంటాయి. అక్కడి పడవలు,రకరకాల చేపలు, క్రాబ్స్, జంతువులు, కథాకాలం 70-80 ల మధ్యది కాబట్టి అప్పటి జీవన విధానం, అక్కడి నుండీ వచ్చి కలకత్తాలో జీవనం వెతుక్కున్న తరాల నాస్టాల్జిక్ తిరుగుప్రయాణాలు, ముఖ్యంగా కన్సర్వేషన్ గురించి, తెలుసుకోవాలంటే ఈ పుస్తకం ఒక మంచి రిఫరెన్స్. పాత సబ్జక్ట్, రచయిత రాస్తున్న మొదట్లో అప్పటి పుస్తకం కాబట్టి, కూడబెట్టి ఉన్న డేటాను విపరీతంగా ప్రవేశపెట్టడం వల్లానూ, బోరు కొడుతుంది. కానీ కొన్ని పుస్తకాలు ఇంఫోటైన్మెంట్ కోసం. ఇదీ అంతే.
***