Pages

25/10/2021

Widows of Vidarbha, Making of Shadows - Kota Neelima


Widows of Vidarbha, Making of Shadows - Kota Neelima


2001 నుండీ 2014 వరకూ మహరాష్ట్ర లో ని విదర్భ ప్రాంతం లో చోటు చేసుకున్న కొన్ని రైతు ఆత్మహత్యలని పరిశోధిస్తూ 'కోట నీలిమ' రాసిన పుస్తకం ఇది.  'పి సాయినాథ్'  రాసిన  'Everyone likes a good drought" తరవాత వ్యవసాయం, ప్రభుత్వ విధానాలు, రెడ్ టేప్, గ్రామాలు, రైతుల గురించి నేను చదివిన పుస్తకం ఇదే.   

కరువు, తీవ్రంగా కొన్ని జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. కరువు కొన్ని ఉసురుల్ని తీస్తుంది. పదే పదే పునరావృతమవుతుండే కరువు, వర్షాభావ పరిస్థితులు, తీసుకున్న ఋణాలు తీర్చలేక పోవడం, కొండల్లా పెరిగిపోతుండే అప్పులు, ముంచెత్తేసే డిప్రెషన్, నిస్సహాయత - వీటన్నిటిలో మహారాష్ట్ర విదర్భ ప్రాంతపు రైతులు చాలా అగచాట్లు పడ్డారు. ఎన్నో రైతు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. ఈ ఆత్మహత్యలు, దేశము, ప్రభుత్వమూ, మన బాంకింగ్ వ్యవస్థా, రైతు రుణ మాఫీ పథకాల డొల్లతనాన్నీ పెద్ద ప్రశ్నల ఊబిలోకి నెట్టేసాయి. 

ఈ పుస్తకం వాటిని ఒకసారి తరచి చూసే ప్రయత్నం చేస్తుంది. కేవలం 2001 నుండీ 2014 వరకూ విదర్భ లో ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న 18 ఆత్మహత్యల్నే దీనిలో చర్చించారు. అంటే బాధిత కుటుంబాలు 18. ఆయా రైతుల విధవలు - 26 నుండీ 63 ఏళ్ళ వయసు మధ్య లో ఉన్న మహిళలు ఎదుర్కోవాల్సొచ్చిన కఠిన పరిస్థితులు, ప్రభుత్వ పరిహారం కోసం ఎదుర్కోవలసిన ప్రశ్నలు, నిరూపించాల్సిన నిజాలు, నింపాల్సి వచ్చిన ఫారాలు, వాటిలో నిజ నిర్ధారణ కోసం ఎదుర్కొన్న్న అసందర్భ ప్రశ్నలు, అన్నీ.  

రైతు ఆత్మ హత్య చోటు చేసుకున్నాక, ఈ విధవలు ఒక శూన్యమైన భవిషత్తులోకి ఎలా ప్రవేశించారు ? వాళ్ళకి దొరికిన పరిహారం ఎంత ? ఎలా ఆ పరిహారం దొరికింది ? వీళ్ళ పిల్లలు ఏ కష్టాలు ఎదుర్కొన్నారు ? చదువు కట్టిపెట్టి బాల్యంలోనే రైతు కూలీలుగా మారిన వారెందరు ? వీరిలో చదువుకున్న భార్యలూ, చదువు లేనివారు, పరిహారం కోసం , కుటుంబ పోషణ కోసం, వీళ్ళు ఇప్పటికీ చేస్తున్న యుద్ధం ఏమిటి ? పురుషుల కన్నా ఈ కఠిన వ్యవసాయ ఆధారిత ఆదాయాల్ని, ఆర్ధిక వ్యవస్థల్నీ ఎలా సంభాళిస్తూ వస్తున్నారు అనేదే ఈ పుస్తకం చర్చించిన విషయం. 

ఆర్ధిక వేత్తలు డీ. నరసింహా రెడ్డి, శ్రీజిత్ మిశ్ర లు,  1980 ల నుంచీ మనం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్షం చేయడం వల్లనే  ఈ రైతు ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని వాదిస్తారు. మొదట ఈ సమస్య ఎలా మొదలైందీ అని తెలుసుకోవాలంటే మన దేశపు వ్యవసాయ రంగంలో పలు దఫాలుగా చోటు చేసుకున్న మార్పుల్ని గమనించాలి. 

మొదటి దశ లో 1950, నుండీ 60 ల మధ్య లో భూ సంస్కరణలు, నీటి పారుదల, వ్యవసాయ రుణాల మీద దృష్టి కేంద్రీకరించాం. కానీ ఈ పనుల్లో ఏకీకృత విధానం లేదా సమానత లాంటిదేదీ సాధించలేదు.  రెండో దశ లో హరిత విప్లవం చోటు చేసుకున్నా, పంపిణీ, ఆర్ధిక, సామాజిక ప్రగతీ రంగం మీదికి రానీకుండానే ఉండిపొయింది. ఎక్కువ దిగుబడి మాత్రమే వ్యవసాయం సాధించిన విజయానికి ప్రాతిపదికగా చూడబడింది. దాని వెనకున్న సాధక బాధకాలు ఎవరూ పట్టించుకోనేలేదు.  ఆఖరి దశలో గ్లోబలైసేషన్, సరళీకృత విధానాలూ, అసమానతలను ఎక్కువ చేసాయే తప్ప, తగ్గించలేదు. సరిగ్గా ఈ సమయంలోనే ప్రభుత్వ విధానాలు వర్షాలు సమృద్ది గా కురిసే ప్రాంతాలలో కూడా వ్యవసాయాన్ని ఓ కష్టమైన రంగంగా మార్చేసాయి. దానికి తోడు ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు లేవు. ప్రభుత్వం కూడా వ్యవసాయానికి ఊతమిచ్చే ప్రాజెక్టులు ఏవీ కట్టలేదు. అడుగంటిన భూగర్భ జలం, కురియని వానలు, చేతికి రాని పంటా - పెరిగిపోతున్న రుణ భారం, ముఖ్యంగా ప్రైవేటు రుణాలు,  ఈ ఉచ్చు లోంచీ బయటపడేందుకు చావొక్కటే మార్గంగా  మిగిలింది బీద రైతుకు. 


విదర్భ లో ఈ స్టడీ చెయ్యడానికి కారణం : ఆత్మహత్యల నిష్పత్తి, ఈ ప్రాంతం వర్షాభావ ప్రదేశం కావడం, చిన్న, సన్నకారు రైతులకు సరైన సదుపాయాలు కలగజేయకపోవడం, రాజకీయ నిర్లిప్తత. ఈ రాజకీయాలు, రైతు శవాలను, ఆధారంగా చేసుకుని పరస్పర నిందారోపణలకీ, నాయకత్వాల్ని మార్చుకునేందుకూ పనికొచ్చాయే తప్ప, రైతుల తరఫున ఆలోచించడానికి సరిపోలేదు. రైతు రుణ మాఫీల్ని ప్రభుత్వ బాంకులు చాలా హీనంగా చూసాయి. అంతకు ముందే తీర్చని పంట రుణం ఉన్న రైతు ప్రభుత్వ బాంకు ని సంప్రదించే వీలు లేకపోయింది. ఎలాగూ మాఫీ అవుతుందని రైతులు రుణాలు చెల్లించడం లేదని సాక్షాత్తూ SBI (Arundhati Bhattacharya) ఆరోపించింది. ఒక పంట పోయాక, ఇంకో పంట వేసేందుకు బయటి అధిక వడ్డీలకు రుణాలిచ్చే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వచ్చింది. అది ఒక పెద్ద ఊబి. 


చివరికి రాజకీయంగా, సామాజికంగా ఓడిపోయిన ఈ పద్ధెనిమిది రైతు కుటుంబాలూ, కుటుంబ పెద్దని కోల్పోయాయి. కొందరు అంతవరకూ బానే ఉండి, భార్యలకూ, తల్లిదండృలకూ, పిల్లలకూ అనుమానం రాకుండా గడిపి, ఏ పొలానికో వెళ్ళి ఏ  పురుగుమందో తాగే వారు. కొందరు ఇంటి దూలానికే ఉరి వేసుకున్నారు.  మొదట ఈ ఘోరాన్ని అర్ధం చేసుకునేందుకు, ఈ వార్త ని స్వీకరించేందుకే రైతు భార్యలకు చాలా కష్టమైంది.  అంతవరకూ జీవితంలో దన్ను గా ఉన్న్న వ్యక్తి ఇలా నిస్సహాయ స్థితిలో మరణించడం, దాన్ని ఆపేందుకు తాను పనికిరాలేకపోవడం / ఆ కష్టాన్ని నేను వినలేకపోయానా, అతనికి ధరియాన్నివ్వలేకపోయానా అనే ఆ గిల్ట్ నుండీ బయటపడడం ఓ భయానక స్మృతి.   కొందరికైతే వాళ్ళ కుటుంబాలకిన్ని కష్టాలున్నాయనే తెలీదు.  రేపటిని ఎలా ఎదుర్కోవాలో, చేతిలో చిల్లిగవ్వ లేకుండా పిల్లల్నెలా సాకాలో, ఎక్కడ పని వెతుక్కోవాలో, కూలబోతున్న తమ మట్టి ఇళ్ళను ఎలా రక్షించుకోవాలో తెలీనే తెలీదు. 


నిబంధనల ప్రకారం, పరిహారం కోసం జరిపే విచారణ లో ఆయారైతులు నిజంగా అప్పుల పాలై, ఏ మతిభ్రమణమూ లేకుండా, (డిప్రషన్ లాంటి వ్యాధులు ఏవీ లేవని) కేవలం ఆర్ధిక ఇబ్బందుల వల్లనే చనిపోయారని నిరూపించుకోవాలి.  ఈ స్టడీ ఆయా జిల్లాలలో ఆయా గ్రామాలలో జరిగిన అన్ని ఆయా విచారణ నోట్స్ లనూ క్షుణ్ణంగా పరిశీలించింది. దాదాపు 43 ప్రశ్నలున్న ప్రశ్నావళి ని.. రైతు పేరు, వయసు, చిరునామా, ఎక్కడ, ఏరోజు చనిపోయారో, ఆ వివరాలు, మృతి కి కారణాలు, పోస్ట్ మార్టం లో తెలిసిన వివరాలు, రైతుకున్న పొలం వివరాలు, పంట ఎంత కాసేదో, ఆ వివరాలు, మిగిలిన కుటుంబ సభ్యుల పొలాల వివరాలు (సాధారణంగా ఏ పొలాలన్న, తండ్రి, తమ్ముళ్ళ పొలాలనానుకుని ఉండటం లాంటి వాటి వల్ల), చనిపోయిన రైతు మానసిక, సామాజిక పరిస్థితి వగైరా వివరాలు. ఇవన్నీ నిరక్షరాస్యురాలైన భార్య నింపాలి. 

వచ్చిన నష్టపరిహారం లక్ష రూపాయల్లో 75% పిల్లల పేర ఫిక్స్డ్ డిపాసిట్ వేసి, ఏ పాతిక వేలో భార్య చేతికి ఇచ్చేవారు. ఇందులో ఈ డబ్బు రైతు కుటుంబానికే అల్టిమేట్ గా ఉపయోగపడాలని సదుద్దేశ్యమే ఉన్నా ఆ చేతికొచ్చిన పాతికవేలూ ఏ రుణ దాత కో వెళ్ళిపోయి, పరిస్థితి మొదటికే వచ్చేది. 


స్టడీ జరిగిన కాలం లో మొత్తం 2014 నుండీ 2017 వరకూ పలు దఫాలుగా ఆయా కుటుంబాలను కలవడం వల్ల వయసులో పిల్లల ఎదుగుదల తప్ప వారి ఆర్ధిక సామాజిక పరిస్థితుల్లో పెద్ద మార్పు రాకపోవడం గమనించారు. ఇన్నేళ్ళలోనూ కొన్ని మార్పులు అంటే పత్తి లాంటి ఉత్పత్తుల కనీస మద్దతు ధర పెరగడం, మహిళలు వ్యవసాయం చేయడం/కూలీలు గా దినసరి వేతనానికి పనిచేయడం,  వారి పిల్లలు ఇన్ని కష్టాలకు కారణమైన వ్యవసాయాన్ని ఓ ఉపాధి మార్గంగా ఎంచుకోకుండా ఉండేందుకే ప్రయత్నం చేస్తామనడం లాంటివి జరిగాయి. ఆడపిల్లల పెళ్ళిళ్ళకి పరిహారం సొమ్ముని ఉపయోగించుకున్న తల్లులూ ఉన్నారు. కొందరికి ఈ ప్రభుత్వ మాఫీల సంగతీ, పరిహారాలని ఎలా క్లెయిం చేయాలో తెలీనే తెలీదు. 


వీళ్ళలో 12 వ తరగతి వరకూ చదువుకున్న మహిళలు కేవలం నలుగురే. చదువు లేని వాళ్ళు ప్రతి చిన్నదానికీ ఇతరులపై ఆధారపడాల్సొచ్చింది. భర్తలు వదిలి వెళ్ళిన చిన్న చిన్న కమతాల్నీ, పొలాల్నీ సాగు చెయ్యడం తప్ప వీరికింకో దిక్కు లేదు. అయితే అప్పటి దాకా ఇంటికి వచ్చిన అతిధికి టీ ఇచ్చే స్వతంత్రం అన్నా లేని కోడళ్ళు,  భర్త చనిపోయాక తప్పనిసరి గా అధికారాన్నిలాకోవాల్సొచ్చింది.  అది వాళ్ళ బాధ్యత. 

ఈ కుటుంబాలలో 52 మంది పిల్లలున్నారు. వీళ్ళలో పెద్దవాడు ఒక్కడు పీ.జీ చదువుతున్నాడు. చిన్నవాడు 4 వ తరగతి. కొందరికి వాళ్ళ నాన్న గుర్తే లేడు. కొన్ని కుటుంబాలకి ఆయా రైతుల జ్ఞాపకాలేవీ మిగల్లేదు. ఎప్పటివో ఒకటీ అరా ఫోటోలే తప్ప.  కొందరు పిల్లలు తండ్రి ఆదరణ, దన్ను కోల్పోయి, అనాధలయిపోయారు. మానసికంగా వారికి తగిలిన దెబ్బ చిన్నది కాదు. 

తల్లే వారికిప్పుడు తల్లీ తండ్రీ. కొందరు పిల్లలు బలవంతాన పెద్దయిపోయి బాధ్యతలు పంచుకోవాల్సొచ్చింది. వీళ్ళలో కేవలం ఇద్దరు ఆడపిల్లలు మాత్రం గ్రాడ్యుఏషన్ చెయ్యడానికి ఎంపికయ్యారు. ప్రభుత్వ పథకాలు వాళ్ళకి 18 ఏళ్ళ దాకానే చదువు ఖర్చు కి పనికొస్తాయి. ఆ పై చదువుకోవాలంటే వారికింక సొంత ఖర్చే. అది భరించగలే బాక్ గ్రౌండ్ ఉండదు. వారి నెల ఆదాయం కనీసం పది వేల రూపాయలన్నా ఉండదు. దీనిలోనే అన్ని ఖర్చులూ గడవాలి. మధ్య లో వచ్చే అత్యవసర ఖర్చులకు, వైద్య ఖర్చులకూ మళ్ళీ వెతుక్కోవల్సిందే. 


చాలా ప్రభుత్వ పథకాలు, రుణ మాఫీ స్కీములూ కొన్ని కేటగెరీలకే వర్తిస్తూ, నిజమైన లబ్దిదారులకు చేరక ఫెయిల్ అవుతున్నాయి. రాజకీయంగా శక్తి వంతమైన నినాదాలు గా మాత్రమే మిగిలిన , రైతు సంక్షేమ  పథకాల ప్రకారం ఈ పద్ధెనిమిది కుటుంబాలలో దేనికీ రుణ మాఫీ లభించలేదు. ప్రతి పనికీ వంద నిబంధనలు, BPL, APL కార్డు దారుల మధ్య అంతరం, ప్రతి కార్డు పొందేందుకూ సవాలక్ష అడ్డంకులు,  ఏ వాలంటీరూ ఆయా సంక్షేమ పథకాల గురించో, ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన విధానాల గురించో వీళ్ళని కలిసే విధానం కూడా ఎక్కడా లేదు. వీళ్ళ పాట్లు వీళ్ళే పడనీ అని గ్రామ వ్యవస్థ కూడా పట్టించుకోకుండా వదిలేసినట్టే.  అందువల్లనే నేమో ఈ రైతు విధవలు రెక్కల కష్టాన్నే నమ్ముకున్న్నారు. ఒకవేళ ఈ పథకాల ద్వారా ఎవరైనా లాభ పడ్డా, అదీ వీళ్ళ పట్టువదలకుండా ప్రయత్నించే తత్వం వల్లనే. 

సమాజంలో ఎవరికీ కనిపించకుండా తమ పని తాము చేసుకుని అజ్ఞాతంగా ఉండిపోయే సగటు మహిళ ఇలా బయటికి వచ్చి, ఎవరి దన్నూ లేకుండా అన్నిటినీ సాధించుకురావడం, పిల్లల్నీ, కుటుంబాన్నీ నిలబెట్టడం కూడా అజ్ఞాతంగానే జరగాలని గ్రామ సమాజం ఆశిస్తుంది. కొందరు మహిళలు కాస్త వారి వారి పోరాటాల ఫలితంగా బయటకు కనిపిస్తుంటారు. వాళ్ళ గొంతు వినిపిస్తుంటుంది.   

కొందరు ప్రజల్లో మంచి పేరున్నా గ్రామ పంచాయితీ ఎన్నికల్లో నిల్చోడానికి కూడా ఇష్టపడరు. చప్పుడు చేసే మహిళలకు, అజ్ఞాతం నుండీ బయటకు తొంగి చూసే మహిళలకు బయటికి కనిపించని వ్యతిరేకతేదో ఉంటుంది. అలా నిశ్శబ్దంగా వీరి జీవితాలు నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఎవరూ మాటాడుకోని ఈ మహిళల గురించి, వీళ్ళు పాల్గొన్న జీవిత సంగ్రామాలగురించి చాలా చాలా విస్తారంగా, పలికిన ప్రతి పలుకుకీ బేస్ రిఫరెన్స్ తో, స్టాటస్టిక్స్ తో, ఫోటోలు, సాక్షాధారాలతో  కోట నీలిమ చాలా మంచి సమచారాన్ని ప్రపంచం ముందుంచారు. 

ఆత్మ హత్య చేసుకున్న రైతు తాలూకు విధవ, మానసిక దౌర్బల్యాలకీ, సామాజిక అణిచివేతకూ ఎదురొడ్డి  తలెత్తుకు తిరిగేందుకు ఎంత కష్టపడగలగాలో అంత కష్టపడుతుంది. ఒక్కోసారి ఈ ఆర్ధిక ఇబ్బందుల్ని భర్తల కన్నా ధీటుగానే ఎదుర్కోగలుగుతుంది.  వీళ్ళకి చదువు, అదిచ్చే అవకాశం, ఎంత ముఖ్యమో మనకి బాగా తెలుస్తుంది. తమ కోసం మాట్లాడలేని బలహీన వర్గం గా వీళ్ళు మిగిలిపోకూడదు.  వీరి పిల్లలు చాలా మంది మళ్ళీ వ్యవసాయం చెయ్యడానికి ఇష్టపడడం లేదు. చదువు ద్వారా ఏదైనా వేరే ఉద్యోగం చెయ్యాడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆడపిల్లలు చదువుకోవడం గురించి అందరికీ ఏకాభిప్రాయం ఉంది. 

స్టడీ ముగిసేటప్పుడు ఈ పిల్లల్నీ, ఆ మహిళల్నీ కొన్ని ప్రశ్నలడిగారు. చాలా మంది ప్రభుత్వ విధానాల్ని తప్పుపట్టారు. వీరికి తమకి కావల్సిది, చదువు, ఉండేందుకు ఇల్లు, ఉపాధీ, వ్యవసాయం చేసేందుకు ప్రోత్సాహకాలు, కాస్త మార్గదర్శనం. వీళ్ళలో మెజారిటీ, ఇంకో జన్ముంటే మహిళ గా మన దేశంలో పుట్టనే కూడదనుకున్నారు. తమ పిల్ల భవిష్యత్తు ఏమి కానుందో, తామిచ్చే  అరకొర చదువు వారికి సరిపోతుందా అని బెంగపడ్డారు. వీళ్ళు చూసిన కష్టాలు చూడని వీళ్ళ ఆడ పిల్లలు మాత్రం ఆశావహంగానే ఉన్నారు. విదర్భలో ప్రాణాలు తీసుకొనేలా ప్రేరేపించిన అలాంటి పరిస్థితులు ఈ కొత్త తరం వారు చూడకూడదనే ఆశిద్దాం. 

నాకు నచ్చిన వాక్యాలు :

1) The research provided a perception study of the invisible, and revealed the dynamic of the world of shadows in which the women survived.  It also helped chart the different invisibilities of the widow, which was the second objective of this research.  The question that was raised and sought to be answered was about how farm widows were restricted to their invisibility, conditionally released through social rituals like marriage, or partially released through state rituals like suicide compensation.  The widows made an intervention into the working of the state, the community and the family that had never been heard before and perhaps, never been sought. 

2) First, the lives of the widows remained unchanged not just from one season to the next, but from one generation to the next.  Second, it was impossible for the widows to support their families without private loans and the generosity of others.  Third, there was anger among the farmers children who held the state and the political class responsible for their destiny.  Fourth, there was evidence of the continuous neglect of the widows by the state, despite their need and their agency. 

3) When compared to the efforts of the man, the woman's contribution to the household was unaccounted form as was her role in moulding the future of her children.  This did not change in the case of widows, even when they made all the efforts that a man did to support the family along with all the work they did as women.  The allocation of value to a woman's labour might provide her a visibility that was incompatible with her invisible universe.  She had to be represented indirectly through the life of her children or the opinion of her family but not directly through her work, even if she worked on the same farmlands as the men.  The widow seldom has rights over property or the farm and would face difficulty finding the bank loans.  And yet, it was the widow's daily wages that paid household expenses and the children's school fees.  The earnings of the invisible were also categorized as invisible, and the widow did not derive any financial freedom because of her labour.  While the farmer was hailed for his efforts to earn a livelihood on the farm, a widow did the same in the shadows, without acknowledgement.  This revealed the last invisibility of the widow that had come with the failure of the democratic promise of equality of all citizens - the vote.  ...... They were not represented in the visible world of assertive politics of organized vote banks and engineered equations, in which the invisible did not count.  The unchanged life of the widow proved that, like her, even her vote was invisible. 

***

This was first published in pustakam.net 

http://pustakam.net/?p=21896 


However irrelevant this is to us :

This is the news item, dtd 29/10/2021. (Eenadu)





24/10/2021

పల్నాటి కథలు - సుజాత వేల్పూరి

http://pustakam.net/?p=21890


పల్నాడు  కథలు - సుజాత వేల్పూరి 



ఒక సారి ఒక వెబ్ జైన్ లో ధారావాహికంగా ప్రచురితం అయ్యాక, ఆయా కథలకి పాఠకులు మిగులుతారా అని నాకో అనుమానం ఉండేది. ఈ మధ్య ఒకటే పని గా 'సారంగ', 'ఈమాట' లాంటి అంతర్జాల పత్రికల్లో వచ్చిన కథల గుచ్చాలు పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు. అవి బహుశా తెర మీద చదువుకోలేని వారి కోసం / ఇలా మాసం మొదటి రోజునో పక్షానికో వెలువడే పత్రికలని చదివే తీరిక / సౌలభ్యమూ లేనివాళ్ళ కోసమో అని అనుకుంటున్నానిన్నాళ్ళూ.   పైగా మనకే ఆనంద వికటన్ లూ లేవు. ఉన్న విపుల, చతురా కాస్తా కనుమరుగయ్యాయి. ఇప్పుడు మనకి చదువుకోవడానికి పుస్తకాలు కావాలి కదా. 

అలా, 'పల్నాడు కథలు' ఒక వాక్యూం ని పూరించడానికి వచ్చిందనిపిస్తుంది. అసలు ఒక చోట ఆల్రేడీ చదివేసిన పుస్తకాల్ని చదవడం ఎలా ఉంటుంది అనే అనుమానం పటాపంచలు చేసిన పుస్తకం ఇది.  దీనిలో ఉన్న కథలనీ ఒక ప్రాంతానివి, ఒక మర్చిపోయిన గతానివి. ముఖ్యంగా మహిళలవి.  అలా అని ఇవి స్త్రీవాద కథలు కాదు.  

అనుకోకుండా ఈ కథలన్నీ  ఎక్కువ గా 'కథానాయికల' కథలు. ఈ నాయికల్లో ఒకావిడ సొంతవాళ్ళచే రేప్ చేసి చంపబడ్డ పసి దాని సోదరి. ఇంకో ఆవిడ పిల్లల ని పోషించుకోవడం కోసం నాటు బాంబులు స్మగుల్ చేసే కూలీ మనిషి. ఒకావిడ రికార్డింగు డాన్సులు వేసే మనుషుల కుటుంబానిది. ఒక నాయిక బ్రతకడానికి ఒళ్ళమ్ముకునే సామాన్యురాలు.   ఒక సింగిల్ మదర్, కూతురి భవిషత్ కోసం వొళ్ళు దాచుకోకుండా రెక్కలు ముక్కలు చేసుకునే 'రోజు కూలీ'. ఇవి బహుశా ప్రభుత్వ పథకాలు ఇంకా చిక్కని రోజులు అనిపించింది. ఈ పిల్ల పడే కష్టం చూసి. (నా నెగిటివ్ థింకింగ్) 

ఈ కథల్లో మహిళా ప్రధానమైన కథలే కాక నిజమైన హీరోలు ఉన్న కథలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నైపుణ్యంతో చెప్పిన కథలు.  వీటిలో కనిపించే హీరోలు చాలా మటుకూ ఒంటరి మహిళలే అయినా మనసున్న Male మారాజులు కూడా ఉన్నారు. మన చుట్టూ కనిపించే వాళ్ళే - మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు, కళారాధకులు, చిన్న పిల్ల పూల జడ కోసం తంటాలు పడే బీద తల్లికి పువ్వులు ఉచితంగా ఇచ్చే షావుకారు, బాంబులు చేరేసే బీదరాలిని జాలి తలిచి, న్యాయంగా వదిలేసె ఇన్స్పెక్టరూ. ఈ సిన్మా పిచ్చి అబ్బాయీ, ఒక మంచి తండ్రీ, కొడుకూ.. ఇలా.

కొన్ని సార్లు మనమే  ఎరుకా లేకుండా చూపించే చిన్న దయ, కరుణా, ఎదుటి వాళ్ళకెంత మీనింగ్ ఫుల్ గా ఉంటాయో తెలిస్తే మనం ఇంకొన్నిసార్లు చెయ్యమూ ఈ మంచిపన్లు ? అనిపించేలా చేస్తారు రచయిత్రి.  చిన్న చిన్నacts of kindness, మనకే తెలీకుండా ఇతరుల పట్ల మనం చేసే ధాష్టీకం,  మనమో, మనవాళ్ళో ఒకరిని  'ఉద్ధరిస్తున్నా'మనుకుంటూ చేసే పన్లూ,  వీటి గురించి మనకి సూక్షం అర్ధం అయితే చాలదూ. 

ఈ కథల్లో పల్నాటి అమ్మాయిలు పౌరుష వంతులు. ఏ కష్టాన్నన్నా భరిస్తారు గానీ, వాటి ముందు మోకరిల్లరు.  సీత ఎలియాస్ విజయశాంతి లాంటి అమ్మాయిలు వృత్తి లో భాగంగా గాంగ్ రేప్ కి గురయ్యి కూడా పనిలోకి వెళ్ళాల్సి వచ్చేంత ఎక్స్ప్లాయిట్ అవుతూ ఉంటుంది. అసలీ పిల్ల ఈ కష్టం ఎలా భరిస్తుంది ? అది గుండేనా అసలు ? అనిపిస్తుంది. మన దేశం లో ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాలకు, unreported లైంగిక దాడులకూ లెక్కే లేదు. 

కొత్తగా వచ్చిన చట్టాల ఎంత వరకూ ఉపయోగపడుతున్నాయో గానీ, బయటకు రాని, మౌన ఆవేదనల మధ్య, కౌటింబిక హింసల మధ్యా జరిగే రేప్ లకే దిక్కు లేదు. వొళ్ళమ్ముకునే అమ్మాయికేమి రక్షణ ? ఏ హక్కు లు ? ఆ పిల్ల పడే బాధ / అవమానం, హింసా ఎవరికయినా అర్ధం అవుతాయా ? ఒక ప్రాస్టిట్యూట్ ని జాలి తలుస్తాడా మామూలు సంఘ జీవి ?  చిన్న చిన్న ఎదురీతలకే రేప్ ని ఒక కంట్రోలింగ్ టూల్ గా వాడుకుని ఆడవాళ్ళని అణిచేసే లోకానికి, ఈ సీత అంటే జాలి చూపించే మనిషి వింతే కదా. ఈ వింతలు పల్నాడు లోనే కాకుండా ఎక్కడన్నా కూడా ఉండొచ్చు. కానీ ఈ ఒక్క కథ లో, ఆమె సవతి తండ్రి పాత్ర లో, కథ లోని సంఘర్షణనంతా, ప్రేమనంతా చూపించేసి, చాలా ఎత్తుకు తీసికెళిపోయారు రచయిత్రి.


ఈ సంపుటి లో అన్ని కథలూ వేటికవే సాటి. సంభాషణలు, కథ ల ను చెప్పే విధానమూ, పాత్రలని పరిచయం చేసే విధానమూ, వాడినా భాషా, అచ్చు తప్పులు లేకుండా,  (ఆల్రెడీ ప్రచురింపబడ్డాయి కాబట్టి బాగా కత్తెరలు పడి కరెక్షన్లు జరిగినా కూడా) అచ్చమైన  పల్నాటి ప్రాంతపు "స్పెషాలిటీ - పేషన్" తో చాలా బాగా తీసుకొచ్చారు.  అంతర్జాలం దాదాపుగా అందుబాటు లో ఉన్నా, దేశం లో మనుషుల కన్నా, మొబైల్ ఫోన్లే ఎక్కువ అయిపోయినా, చదివేందుకు physical పుస్తకాలే అనువు చాలా మందికి.  కాబట్టి, ముఖ్యంగా మంచి పుస్తకాలు క్రమంగా కనుమరుగవుతున్న సమయాన ఇలాంటి పుస్తకాలు చదవడం ఓ మంచి అనుభవం.  



23/10/2021

అసమాన అనసూయ - (నా గురించి నేనే) - కళా ప్రపూర్ణ డా. వింజమూరి అనసుయ దేవి.





ఒక 95 ఏళ్ళ విదూషి, తన జీవిత గమనం గురించి, తను ఎదుర్కొన్న కష్టాలు, దొరికిన సంతోషాల గురించి, చెప్పుకున్న విషయాలే ఈ పుస్తకం. అయితే ఇవి సామాన్యమైన కష్టాలూ కావు, సాధించినదేదీ సామాన్య విజయమూ కాదు. వీటిని ఏ ధైర్యంతో ఎదుర్కొనగలిగారో, ఏ హార్డ్ వర్క్ తో సాధించగలిగారో, చెప్పడమే ముఖ్య విషయం.

1925 లో కాకినాడ సరస్వతీ గాన సభ వారి ఆధ్వర్యంలో ఆంధ్ర సేవా సంఘం హాలులో జరుగుతున్న సంగీతోత్సవాల నాటి జ్ఞాపకాలు చెప్తూ తన కథ  మొదలు పెడతారు. చిన్న తనంలో బాల్యావస్థలో మనసులో ముద్రించుకుపోయిన జ్ఞాపకాలు, అందరికీ ఉంటాయి. అయితే, ముందుమాటలో వంగూరి చిట్టెన్  రాజు గారు చెప్పినట్టు, వింజమూరి అనసూయాదేవి ఈ పుస్తకంలో రికార్డ్ చేసినది ఒక వ్యక్తి జీవితం గురించి / ఒక వ్యక్తి చరిత్ర కాదు. తెలుగు సంగీత చరిత్ర ఇది.

కాకినాడ లాంటి పాత కొత్త వాసనల ఊరి ప్రతిబింబం లాంటి, సరస్వతీ దేవి లాంటి ప్రతిభావంతురాలు ఈ అమ్మాయి. దేవులపల్లి కృష్ణ శాస్త్రి మేనకోడలు. మావయ్య భావ గీతాలకి తొట్టతొలుత బాణీ కట్టింది. తెలుగు లలిత సంగీతానికి మొట్ట మొదటి కంపోసర్. ఆఖరి నిముషాల్లో, రాసి ఇచ్చే మావయ్య పాటలకు క్షణాల్లో బాణీలు కట్టడం, పసిప్రాయంలోనే, తెలియని కొత్త వాయిద్యాలైన వీణ, పియానోలను కూడా, తనంతట తానే వాయించడం, తండ్రి నాటక కళాకారుడు కాబట్టి, తెలుగు నాటకాలలో వాడే లెగ్ హార్మొనీ వాయించాలని కలలు కనడం, అయినా కాళ్ళందని చిన్న పిల్ల అని అవకాశం ఇవ్వకపోయినా, అనుకోని విధంగా హార్మొనిస్టు రాని పౌరాణిక నాటకానికి 11 ఏళ్ళ వయసులో రాత్రంతా హార్మొనీయుం వాయించటం లాంటి ఫీట్లు చేయడం, పిఠాపురం జీవితం, రాజు గారి పిల్లలతో స్నేహం, వగైరాలు, నిన్న మొన్నటి కబుర్లలాగా చెప్తారు.

కళ్ళు మూసుకుని, కళ్ళకు బట్ట చుట్టి, హార్మోనియం మీద బట్ట కప్పి వాయించడం లాంటి బాల్య చేష్టల దగ్గర్నించి, కౌమారంలో తెలిసీ తెలియని తనంతో ప్రదర్శించిన అతిశయం, యవ్వనం లో తన ఆరాధకుల పై తనకుండిన నిర్లక్షాన్ని గురించి కూడా దాయకుండా చెప్పేంత ఇష్టం తనంటే తనకు. తానందుకున్న ప్రేమ లేఖలు, సూటర్స్ తనని బలవంత పెట్టడాలూ, ఆ ఎటెన్షన్ ని తను ఎంజాయ్ చెయ్యడమూ, అంతలోనే, ఎవరినీ దగ్గరికి రానీయనంత ఇండివిడ్యువాలిటీ ని ప్రదర్శించడం కూడా గుర్తు చేసుకుంటారు.

“నేను కొంచెం స్వార్ధపరురాలిని. నా సౌకర్యమే చూసుకుంటాను అనీ, కొంతవంతు ఎక్కడో కాస్త నార్సిసిస్టు ని కూడా” అని ఎవరు చెప్పుకుంటారు ? అయితే జీవితంలో దెబ్బ తిన్నాక, “నీ పొగరు అణచడానికే ఈ పని చేసాను!"  అని చెప్పే మనిషి (మనుషులు) ఎదురైనప్పుడు ముక్కలైన మనసుని కూడగట్టుకుని, అహాన్ని చంపుకుని, పిల్లల కోసం, బ్రతుకు కోసం, కెరీర్ కోసం, తన మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం, పరువు కోసం, వాళ్ళతోనే కలిసి ఉంటూ, వాళ్ళని పశ్చాత్తాపంతో కుమిలేలా చేసారేమో గానీ, వెను తిరిగి పారిపోలేదు. ఈ సంగతి, చదువరులకు తెలియజేయాలనుకోవడం, నిజంగా చాలా బోల్డ్.

అంతవరకూ ఆవిడ మహారాణి. “మద్రాసులో రేడియో లో పని చేస్తున్నప్పుడు నా చుట్టూ మగవాళ్ళు పడేవారు. నేనెవర్నీ లెక్క చేసే దాన్ని కాదు. ఇంటి ముందు వాడుకోవడానికి రకరకాల కార్లు పంపే వారు. నేను బయటికొచ్చి, ఆరోజు చీరకి ఏ రంగు మేచ్ అవుతుందో ఆ కారు లో ఎక్కి వెళ్ళేదాన్ని”, అని చెప్పినప్పుడు గానీ, పెళ్ళయిన మగవాళ్ళు పెళ్ళాల చేత రెండో పెళ్ళికి రాయబారాలు పంపడం గురించి గానీ చెప్పడానికి వెనకాడలేదు. (పేర్లతో సహా)

వింజమూరి అనసూయాదేవికి తన జీవితం మీద చాలా స్పష్టత ఉంది. “ఎవరేమన్నా అనుకోనీ, నాకు నేనంటే పరమ ఇష్టం!” అని చెప్పుకోగల ధైర్యం ఉంది. బాల్యం, కౌమారంలో అద్భుత విజయాలు, విద్యలో పేరు ప్రఖ్యాతలూ సాధించేశాక, ఇక పైకెదిగేందుకు మెట్లే లేవా అన్నంత ఎత్తుకి ఎదిగిపోయినా, తన ఇంటి పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటూ, తల్లితండ్రులు తమ రెక్కల కింద దాచుకుంటూ ఉండగా ,తనతో పాటూ ఇల్లు విడిచిపెట్టొచ్చి, మద్రాసులో తనతో పాటూ ఇళ్ళు మారుతూ, తిరిగి, ఎన్ని త్యాగాలు చేస్తూ, తన కళా జీవితానికి ఊతమిచ్చారో ఆమెకు తెలుసు. ఎప్పుడూ చేయాల్సిన పనులు ఉండనే ఉన్నాయి తనకు. చూసుకోవాల్సిన వాళ్ళూ ఉన్నారు.

మద్రాసులో సినీ, రేడియో, గీతాల ప్రస్థానం కన్నా, కాకినాడలో ఆమె ఎదిగిన వైనం, స్కూల్లో, కాలేజీలో సంగీతం లో సాధించిన పనులు గుర్తించదగ్గవి. వీటిలో శ్రీశ్రీ కవితలకీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి పాటలకీ ఇప్పటికీ ఆవిడ ట్యూన్లు యధాతథంగా వాడగలగడం, బాలాంత్రపు రజనీకాంతరావు, బుజ్జాయి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కాంచనమాల, భానుమతి, ఘంటశాల వేంకటేశ్వరరావు ల్లాంటి ప్రముఖులతో ఆమెకు ఉన్న ఆత్మసంబంధం, మొదటి గురువు అయిన తల్లితో ఉన్న బంధమూ, ఏకసంథాగ్రాహి కావడం వల్ల, కాకినాడలో భోగం వాళ్ళ దగ్గర కూడా సేకరించి నేర్చుకోగలిగిన జావళులూ, పదాలు, గాలివాటుగా విన్న పల్లె పాటల్ని సేకరించడం, వాటికి శాస్త్రీయ మైన గుర్తింపు ఇవ్వడం, వాటికి ఎల్ పీ రికార్డుల ద్వారా, కనుమరుగైపోకుండా, ఒక శాశ్వతత్వాన్ని ఇవ్వడం, ఆకాశవాణిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చెయ్యడం, అద్భుత కళాకారులతో పనిచెయ్యడం, తనకు విద్యనీ, జ్ఞానాన్నీ, సంస్కారాన్నీ  ఇచ్చిన గురువుల్ని మర్చిపోకపోవడం, ఇవన్నీ, తన జీవితాన్ని సుసంపన్నం చేసిన అనుభవాలంటూ తృప్తి పడడం చాలా బావున్నాయి.

ప్రతిభావంతులైన ఆనాటి కళాకారులు, సొంతంగా ఇంట్లో అందరూ పెద్ద పెద్ద వాళ్ళు. ఇంట్లో మామూలుగా జరిగే వాదోపవాదాలు, చర్చలు, ఏకీభవించకపోవడాలు, ఇవన్నీ ఆవిడ వ్యక్తి వికాసాన్ని, (అమ్మాయిలు మూల పడుండాలని ఆశించని కుటుంబ వాతావరణం) నిర్దేశించాయి. ఇది జీవితపు రికార్డు కాబట్టి, జ్ఞాపకాల మీద ఆధారపడి రాసినా కూడా, ఆవిడ చూసిన, కలుసుకున్న ప్రముఖ వ్యక్తులూ, రెడ్ల, రాజుల, స్నేహితుల వివాహాలలో, వేడుకల్లో, తనకు దక్కిన స్నేహమూ, గౌరవం, ఆదరణా, పేరు ప్రఖ్యాతులూ, ఇవే ఆవిడ సంపాదన.

ఆత్మస్తుతీ, పరనిందా తప్ప ఆత్మకథల్లో ఏముంటాయి అని అందరూ అనుకునేమాటే. చాలా డార్క్ విషయాల్ని ఎవరూ చెప్పరు. ముఖ్యంగా ఇంట్లో అందరూ ప్రముఖులే అయిన వాళ్ళు అస్సలు చెప్పరు. “నేను నా పిల్లల కోసం ఇంత త్యాగం చేసాను. ఇన్ని బాధలు పడ్డాను. నా వృద్ధాప్యంలో వాళ్ళు కూడా నా దగ్గర బోల్డు డబ్బుంది అనుకున్నారు. నేనిలా కష్టాలు పడ్డాను.. ” అని, ముఖ్యంగా మీరు త్యాగాలు చెయ్యకపోతే అటు సూర్యుడిటు పొడవడూ అని లోకం పట్టుపట్టే స్త్రీలు/పెళ్ళాలూ, తల్లులూ అస్సలు చెప్పుకోరు. అయితే ఆ చెప్పుకోవడం కొన్ని సార్లు అవసరం.

“నాకే ఇలా జరిగితే, మామూలువాళ్ళకి ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో!” – అనే స్పృహ ఆమెకి ఉంది. ఈ పుస్తకంలో కెరీర్ పరంగా, సాధించిన పేరు ప్రఖ్యాతుల పరంగా, వృత్తి జీవితం లో తృప్తి , ప్రతిభా, పట్టుదలా, కష్టపడే తత్వం మూలాన ఉన్నత స్థానం లో ఉన్న వ్యక్తి, తన వ్యక్తిగత జీవితం లో చీకటి ని అంతే ఒప్పుదలతో బయట పెట్టడం చాలా షాకింగ్. కానీ ఆ ధైర్యం, తెగువా – సగం బలం ఈ పుస్తకానికి.

ఇదంతా నాకు భానుమతి ఆత్మ కథని గుర్తు చేసింది. ఆవిడ కూడా చాలా unique సింగర్, బోల్డన్ని కళల్లో ప్రవేశమూ, నైపుణ్యమూ, ధైర్యమూ ఉన్న తల్లిదండ్రుల చాటు పిల్ల. సరస్వతీ పుత్రికే. భానుమతి ప్రేమించి, పెళ్ళి చేసుకుంది. పెళ్ళి అయ్యాక, తల్లయ్యాక, నిజానికి చాలా స్టెబిలిటీ తో పని చేసింది. అనసూయని ప్రేమించానని చెప్పుకున్న వ్యక్తి బహుశా అసూయతో, అధికారం కోసం, డబ్బు కోసం, ద్రోహం చేసి పెళ్ళి చేసుకున్నాడు. పిల్లల ని పెంచుకోవడం, కెరీర్ ని కొనసాగించడం వగైరాలు ఆమె దాదాపూ ఒంటి చేత్తో సాధించుకున్న పనులు.

అయితే ఒక స్త్రీగా, భానుమతి లాగా రొమాంటిక్ జీవితం కాదు ఈవిడది. సొంత చెల్లెలు మోసం (ఊహ) చెయ్యగా, పదేళ్ళుగా తన మీద కన్నేసిన ఒక పెళ్ళయిన వాడు అదను చూసి రేప్ చేసి, రెక్కలు కత్తిరించేసి, ద్రోహపూరితంగా పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఈవిడ. సరస్వతీ పుత్రిక, అంతవరకూ వివిధ కార్యక్రమాలు, కచేరీలద్వారా ఎంతో సంపాదిస్తున్న లక్ష్మీదేవి లాంటి కూతురు పెళ్ళి ఎంతో దివ్యంగా చెయ్యాలని కలలు గన్న తల్లితండ్రులకు తీవ్ర వేదన కలిగించిన సంఘటన ఈ బలాత్కారం.

సొంతంగా, అందం, తెలివితేటలు, ప్రతిభా వ్యుత్పత్తులు కలిసిన మనిషి, ఈ ద్రోహం తరవాత పోయిన పరువు, పొరపాటున ఆ సంఘటనకు కారణం అయ్యానని వేదన చెందే మేనమామ, అంతవరకూ ఏకవచనంతో పిలుస్తూ వచ్చిన మనిషి భర్త అయి, అలాంటి ఘోరానికి ఒడిగట్టినా, అదేదో హక్కు చలాయించాలని చూడటం, అతని మొదటి భార్య కూడా, “అనసూయ అలాంటిది కాదు. నా మొగుడే చెరచి ఉంటాడని”, “తప్పక పెళ్ళి చేసుకుని ఉంటుంద”నీ చెప్పడం.. ఆడవారి బలహీనత ఉన్న ఒక విలువల్లేని మనిషికి భార్య అవల్సి రావడం, ఇవన్నీ హృదయాన్ని కలిచివేసే సంగతులు.

ఎన్నో ఘనతలు సాధించిన మొదటి మహిళగా అసామాన్యమైన పేరు పొంది కూడా, తన గర్వాన్నో, అహంకారాన్నో అణచడానికి చూసే కుళ్ళుమోతు భర్త గురించి, ఎన్నో కచేరీలలో తనతో పాటు పాల్గొనై, సరిసమానంగా ప్రతిభా, పేరు గల చెల్లెలి గురించీ, సూచన ప్రాయంగా చెప్పిన కొన్ని సంగతులు ఇదంతా ఆవిడ కడుపు మంట చల్లార్చుకోవడానికి రాసినదే అయి ఉంటుందా అనిపించేలా ఉంది. అయితే తన వెర్షన్ తను చెప్పే అధికారం అయినా ఆమెకు లేకపోతే ఎలా ? దీని గురించి మరీ ఆలోచించక్కర్లేదు. ఆ దుర్మార్గానికి తను ఎలా బలయినదీ – ఆఖరికి పెళ్ళయాక కూడా రకరకాలుగా అనుభవించిన బాధలు చెప్పుకునే గొంతు, ఆమెకి అక్కర్లేదా అనిపిస్తుంది.

ఈ బలవంతపు పెళ్ళి అయ్యి, అయిదుగురు పిల్లలున్న తల్లి, “నా పిల్లలు కూడా రత్నాలలాగా, ప్రతిభ, విద్య ఉన్నవారు. నా పంచ ప్రాణాలు” అంటూ, ఈ పిల్లల కోసం, తన కెరీర్ ని త్యాగం చేసి, కుటుంబ, సంసార బాధ్యతల కోసం, సహకరించని కుటుంబం కోసం – స్వయంగా రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ వచ్చి, అన్నమాచార్య కీర్తనలను స్వరపరచమని అడిగినా చెయ్యలేకపోయి, “ఈ ఘనత కూడా సాధించి ఉందును. కానీ ఇంటి బాధ్యతల వల్ల వొదులుకోవాల్సొచ్చింది” అని చెప్పడం బాధ కలిగిస్తుంది.

మొదట్నుండీ, కుటుంబం అంతా కలిసి, సందడిగా ఉండే, ఒకరికొకరు సహకరించుకుంటూ, ఏ తీరిక వేళలోనో మేధో మధనాలు చేసే కుటుంబాలలో పెరిగిన మనిషి. తన కెరీర్ కోసం చాలా మంది కుటుంబసభ్యులు కావల్సొచ్చి అందరి పోషణ బాధ్యత నీ తీసుకున్న మనిషి. స్వయంగా భర్త చేతిలో డబ్బు విషయంలో మోసపోయిన మనిషి. ఎప్పుడూ ఒకరి మీద పై చేయై బ్రతికి, ఎవరి దయా దాక్షిణ్యాల మీదా ఆధారపడకుండా, తన లో తన ని నిలుపుకుంటూ, రోజువారీ యుద్ధాన్ని గెలుస్తూ వచ్చిన మనిషి.

ఆఖరికి భర్త చివరి అయిదు సంవత్సరాలూ కాన్సరుతో బాధపడి పశ్చాత్తాపంతో దగ్ధమవుతున్నప్పుడు అతనికి సేవలు చేయాల్సొస్తుంది. చివరి రోజుల్లో భర్త తనని అణిచివేయడం గురించి పశ్చాతాపం వ్యక్తం చేసాక, ఎవరికీ లొంగని, ఎవరికీ తలొగ్గని తను అతనికి అన్ని సేవలు చెయ్యడం, ఇదీ బహుశా అన్నేళ్ళు కలిసి ఉండడం వల్ల తనలో కలిగిన ప్రేమ వల్లనేమో అని అనుకోగల పెద్ద మనసు తనది. క్షమించడానికి కూడా మనసుండాలి.

పిల్లలు సహకరించని వేళ ఒక్కర్తీ, మనవల్ని కూడా చూసుకోవాల్సిన వేళ. ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టిన వృద్ధాప్యంలో “కూరగాయలు చవగ్గా దొరుకుతాయని నడుచుకుంటూ ఫలానా చోటికి వెళ్ళేదాన్ని. చెయ్యలేని శారీరక శ్రమ చేసాను – పడరాని పాట్లు పడ్డాను” అని కూడా చాలా తృప్తి గా చెప్పగలగడం బావుంది.

ఈ ఆత్మకథ రచయిత్రి రాసిన (95 ఏళ్ళ వయసులో) ఆఖరి పుస్తకం. “నాదగ్గర ఫలానా విద్య ఉంది. ఈ ఈ పాటలు తెలుసు. ఎవరికన్నా నేర్చుకోవాలనుంటే నేర్పుతాను. తొందరపడండి. నాకిప్పుడు 95 ఏళ్ళు !” అని ఆహ్వానం ఇస్తారు ఓ చోట. ఈ రికార్డ్, ఆవిడ సాధించిన ఘనత, కలుసుకున్న వ్యక్తులు, సంగీతం ను యూనివర్సిటీ విద్యలో ప్రవేశ పెట్టడం, టీటీడీ ప్రచురించిన వివిధ తెలుగు గేయాలు, బాణీలూ, వరుసలతో అచ్చయిన పాటల పుస్తకాలు, సినిమాల్లో చౌర్యానికి గురయిన ట్యూన్లు, తన పేరు లేకుండా హిట్ అయిన ఎన్నో పాటలు, ఇవన్నీ గుర్తు పెట్టుకుని రెండు నోటు పుస్తకాల నిండా ఆవిడ రాసి పెడితే, వంగూరి ఫౌండేషన్ వాళ్ళు దీని ఒక అభిమాని శ్రీ సుభాష్ సాయంతో కంపైల్ చేసి ప్రచురించారు. అయితే ఈ ఎమోషనల్ ఫ్లో లో, కొన్ని పేజీలు (పేజీల్లో సంగతులే) రిపీట్ కావడమూ, ఆమె సేకరించిన ప్రముఖుల ఆటోగ్రాఫ్‌లలో కొన్ని రిపీట్‌‍లూ, ఇవన్నీ చిన చిన్నవే, కాస్త తరవాతి ఎడిషన్లలో ఎడిట్ చేస్తే బావుంటుంది. ముందుకీ, వెనక్కీ ఒక సంగతి నుండీ ఇంకో సంగతికి పరిగెత్తేసే విధానంలో కాకుండా, చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సినంత చెప్పి, చెప్పకూడని విషయాన్ని వదిలేయడం బావుంది.

కేవలం తొమ్మిదేళ్ళ వయసులో శాస్త్రీయ బాణీలతో ఎన్నో ప్రముఖ గేయాలు స్వరపరచిన సరస్వతీ పుత్రిక విజమూరి అనసూయాదేవి. అందం, ప్రతిభ కలపోసిన, ఒకప్పటి సెన్సేషన్ ! ఇదీ ఆవిడ జీవితం. నిజంగా అసామాన్యమైన కథ. తనని తాను “అసమాన అనసూయ” అని చాలాసార్లు చెప్పుకోగలంత 'పొగరు ' తనకు. కాలం అపుడపుడూ ఎదురుతిరిగినా ,ఎవరెన్ని అసూయలు పోయి,  మోసాలు చేసి / ద్రోహాలు చేసినా ఆ ‘పొగరు’ని అణచలేకపోయారు. అదీ మెచ్చుకోవాల్సిన విషయం.

పుస్తకం లో ఆఖరు న ఒక పరిపూర్ణ జీవితం గురించి ఆమె రాసుకున్న మాటలు కొన్ని :

“జీవితం పరిపూర్ణమయింది. కోరికలనీ తీరాయి. వైకుంఠపాళీ ఆటలో ఎంత నీతి, నిజం ఉందో ఇప్పుడర్ధమైంది. పెద్ద నిచ్చెనెక్కి పైకి వెళ్ళిన నేను, తక్షణమే పెద్ద పాము నోట్లో పడి కిందకు వచ్చాను. అయితేనీం. పందాలు వేసుకుంటూ ‘పరమ పదం’ వరకూ చేరాను. ఇంక భయం లేదు. ఎక్కువ దూరం లేదు కనుక.”

” నా కోరిక :

ప్రశాంతమైన వాతావరణం, అగరవత్తులు, సాంబ్రాణి, పాలమడ్డి పొగలతో, నాకిష్టమైన ఎర్రరంగు పట్టుచీర కాళ్ళకు ఆల్తా, గోళ్ళకు మ్యాచింగ్ రంగు, చీరకు తగ్గ బొట్టూ, కాటుకలతో అలంకరించాలి. నా వాళ్ళంతా నా చుట్టూ ఉండాలి. నా తల దగ్గర నా హార్మోనియం పెట్టాలి. ఆ పక్కా ఈ పక్కా రెండు ఎలక్ట్రిక్ తంబూరాలు కంటిన్యుయస్ గా మోగుతూ ఉండాలి. నాకిష్టమైన పెర్ఫ్యూం నా మీద చల్లండి. ఎవ్వరూ ఏడవకండి. ఆరు తరాలు చూసి, ఇంత బలగాన్ని పోగేసుకున్న నా కంటే అదృష్టవంతులు ఎవరుంటారు ?

నలుగురు కూర్చుని నవ్వే వేళల
నా మాటొకపరి తలవండి !
నా పాటొక పరి పాడండి! “

……

First published in  :  http://pustakam.net/?p=21883