Pages

30/07/2021

ఒడిసీ - తెలుగు: బీనా దేవి





ఇలియడ్ చదివి, వీలయితే ట్రాయ్ - నెట్ ఫ్లిక్స్ సిరీస్ రెలీజియస్ గా చూసి కళ్ళు తుడుచుకున్నాకా చదవాల్సిన పుస్తకం, దాని కొనసాగింపు "ఒడిసీ". నిజానికి ఇది కూడా చాలా పెద్ద విషాద గాధ. కాకపోతే, సుఖాంతం. సుందరకాండ లాగా చదివిన వారికి గుండె ధైర్యాన్ని, కష్టాల్ని ఎదుర్కోవడానికి కావల్సిన స్థైర్యాన్ని, స్తితప్రజ్ఞతనూ, ఇంకా ముఖ్యంగా patience ని ఇస్తుంది.  హోమర్ రాసిన ఇలియడ్ లో గ్రీకు సైన్యానికి చీఫ్ (chief strategist), పిచ్చెక్కినట్టు నటించినా వొదలక, బలవంతంగా ఒప్పించి గ్రీకువీరులు యుద్ధభూమికి లాక్కుపోతే, పదేళ్ళ యుద్ధం, తరవాత ఇంకొన్నేళ్ళు (పది) సముద్ర యానం, షిప్ రెక్ లు, దేవతలూ, దయ్యాలకు కోపాలు తెప్పించే వీరోచితమైన పనులు చేసి, బలగం అంతా కళ్ళెదురుగా చనిపోయాకా, ఒక్కడూ ఎలానో బ్రతికి, ఒక దేవత చేతిలో బందీ అయి, గ్రహబలాలు కలిసొచ్చి, శాపాలన్నీ అనుభవించాక, అష్టకష్ఠాలనంతరం,  భార్యా బిడ్డల్ని చేరుకునే ఒడిసీసియస్ కథ ఇది. 

గ్రీకులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకీ మనకీ వ్యాపార సంబంధాలుండేవి. నిజానికి స్పార్టా రాణి హెలిన్ ని అసలెవరో భారత రాజు కూడా చేసుకుందామనుకుని కానుకలు పంపాట్ట కానీ, ఆవిడ తిరక్కొట్టిందంట. ఆ కానుకలు పట్టు పీతాంబరాలు.. మిరియాలు, పసుపు - ఆఫ్రికా నుండి కూడా పసుపు, దాల్చిన చెక్క పంపేవారనీ విన్నాను. ఇంకా ఇలియడ్ నే మన పురాణేతిహాసాల కు స్పూర్థి అనీ, ఇంకా ఈజిప్టు రాజు కథే, కాలక్రమేణా ఆర్యుల నోటి వెంట భారత దేశానికి ప్రయాణం చేసి, పరిణామం చెంది, రాముడి కథ అయిందనీ రక రకాల ప్రతిపాదనలు ఉన్నాయి. 

అయితే, ఈ పుస్తకం 'ఒడిసీ'  - అదీ మన తెలుగు లో, పిట్ట కథ లాగా, అచ్చ తెలుగులో కాసిని ఇంగ్లీషు పదాలతో, చిన్న పిల్లలకి కూడా అర్ధమయ్యేంత సరళత తో, కొంచెం హాస్యంతో, వదిలేయాల్సిన వివరాలు వొదిలేస్తూ, (ఎందుకు వొదిలేసారో చెప్తూ) చెప్పల్సిన సంగతులు మాత్రం చెప్తూ ఉండడం వల్ల చాలా బావుంది. బీనాదేవి గారి చెప్పడం చాలా బావుంది. ఇది కూడా అదృష్టవశాత్తూ దొరికిన పుస్తకమే కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ చదివడం జరిగింది.  

ఆవిడ వాడిన సరళత ఉదాహరణ కి :  

అనగా అనగా గ్రీసు దేశంలో అయోనియన్ సముద్రంలో ఒక చిన్న దీవి. పేరు ఇథాకా. దాని రాజు ఒడిసియస్. అతి తెలివైనవాడు, జిత్తులమారి. ఈటెను విసరడంలో బహునేర్పరి. స్వార్టా రాజు ఇకారియస్ కూతురు పీనోలోప్ ను పెళ్ళిచేస్కున్నాడు. పీనోలోప్ కీ ఓ పిల్ల కథ ఉంది. ఆ పిల్లని చిన్నప్పుడు తండ్రిపోసిడాన్ కొడుకు చేత సముద్రం లో విసిరేయించేస్తాడు. ఎందుకో ? హోమరు ఇష్టం. ఆమెని పీనీలోప్లనే బాతు జాతి పక్షుల గుంపు కాపాడి ఒడ్డుకు చేర్చాయి.  అప్పుడా తల్లితండ్రులకు ఆశ్చర్యం వేసి, ఆ పిల్లని తెచ్చుకుని, పీనీలోప్లు కాపాడాయి కాబట్టి పీనోలోప్ అని పేరు పెట్టారు. అసలు పేరు ఆర్నీషియా. 


ఇలాంటి కథే మనకీ ఉంది. మేనక విశ్వామిత్రుడి వల్ల పుట్టిన పిల్లని అడవిలో వదిలేస్తే (ఏం? ఇంద్రలోకంలో పిల్లలు ఉండకూడదా?!) శాకుంతలాలు అనే పక్షులు కాపాడేయి. అప్పుడు కణ్వమహర్షి ఆ పిల్లని తెచ్చి పెంచుకున్నాడు. ఆ పక్షుల పేరే శకుంతల అని పెట్టేరు. 


పెళ్ళి చేసిన తరవాత అదే తండ్రి ఒడిసియస్ ని తన రాజ్యంలో ఉండిపొమ్మని బతిమలాడేడు. ఒక దేశానికి రాజుని.. మరో దేశానికి ఇల్లరికవా! షట్. ఉండనని భార్యని తీసుకుని ఇథాకా వెళ్ళిపోయాడు. వాళ్ళ గదిలో పడుకోవడానికి మంచం తనే స్వయంగా తయారుచేసేడు. ఏం? రాజుగారికి పనివాళ్ళే లేరా ? ఉన్నారు. కానీ ఆ మంచానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ గది మధ్యలో ఉన్న్ ఆలివ్ చెట్టు మానుని మంచానికి ఒక కోడుగా వాడేడు.  ఈ సంగతి  అతని భార్యకీ, ఒక దాసీదానికీ మాత్రవే తెలుసు. వాళ్ళకి ఒక కొడుకు పుట్టేడు. పేరు 'టెలిమాకస్' . ఒడిసియస్ భార్య కొడుకుతో సంతోషంగా ఉన్నాడు. 


ఇంతే కాదు. ఈ సుఖంగా ఉన్న ఒడిసీసియస్ జీవితంలో హెలెనా లేచిపోవడము గందరగోళం సృష్టిస్తుంది. నానా కష్టాలు పడి, "తప్పదు బంధునాశనము" అని తెలిసీ, భార్యని మళ్ళీ కలుసుకుంటాడో లేదో అనే బెంగతోనే పిల్లాడిని వదిలి, పెద్ద ఘోరమైన యుద్ధం చేసొచ్చి, ఆ శతృ, స్వజన నాశనం తో ఎంతో భారంగా, తిరుగు ప్రయాణంలో చెడ్డశకునాల్ని చూసి బాధపడుతూ, సముద్రంలో నానా కష్టాలు పడి, ఎలాగో ఇల్లు చేరతాడు. 


ఈ చేరడానికి కొన్నేళ్ళు పడుతుంది. ఇల్లు చేరాకా భార్య కోసం ఇంకో యుద్ధం చెయ్యాల్సొస్తుంది. మధ్యలో ఆయన పడిన కష్టాలు, చంపిన శత్రువులు, చూసిన నరకమూ, (వైతరిణి లాంటి నది దాటి, నరకానికి పోయి, చనిపోయిన వారితో మాటాడతాడు - అదో హృదయవిదారకమైన ఘట్టం) చనిపోయిన తల్లిని చూస్తాడు. అప్పటికి తన మీద బెంగతోనే  ఆవిడ మరణించిందని తెలియదు. ఇంటిదగ్గర భార్య చిక్కుల్లో ఉన్న విషయం ఆవిడే చెప్తుంది.  అలాగే ఆ ఆత్మల్లో,   ట్రాయ్ యుద్ధంలో తనతో పాల్గొని విజయులై, ఇళ్ళకి ప్రయాణం అయిన తన  సహచరుల్ని చూస్తాడు. అరె, విజయం వరించి ఇళ్ళకు వెళ్ళినవారిని కూడా శాపాలు (మృత్యువు) ఎలా వెన్నాడాయో కదా అని విచారిస్తాడు. అక్కడ దెయ్యాలన్నీ (ఆత్మలు) తమ కథలు ఒడిసియస్ కు చెప్పుకుంటాయి. ఈ చాప్టర్ ని కూడా బీనాదేవి చాలా బాగా క్లుప్తపరిచి హాస్యంగా (తేలికపరచలేదు) ముగించి, కధని ముందుకు దూకిస్తారు.  దీంతో వీరాధివీరులు, అజేయులు కూడా ఎలా మరణిస్తారో చూసి ఆశ్చర్యం కలుగుతుంది.






సుమారు 2800 ఏళ్ళ క్రితం ఒక స్ట్రీట్ సింగరు గానం చేసిన గాధలకి ఇంత ప్రాచుర్యవా? అది అర్ధం చేసుకోవడం ఇంతటి మహా యజ్ఞ్యమా అని ఆశ్చర్యపోతాం మనం. దీనిలో ప్రతి కథకీ  కొన్ని కారణాలుంటాయి. ముందుదో, తోకదో ఒక అనుబంధ కథ ఉంటుంది. "అల్లప్పుడెప్పుడో మీరు మామాటిన్లేదు గాబట్టి, మేమిప్పుడు మీ మాటినం" అంటారు అందరూ. బలులివ్వక పోతే దేవతలకి కోపాలు. సూర్యుడికీ, గాలి కీ అందరికీ కోపాలు, శాపాలు.  సముద్రయానం లో ప్రకృతి సహకరించడం, సహకరించకపోవడం దేవతల చేతిలోనే ఉంటుంది. ఏదో కొందరు  దయగల దేవతల వల్ల కథ నడుస్తుంది. 


అలా... ఈ మేజ్ లో అన్ని కథల్నీ ఒక లైనులో పెట్టి, కారణాల్ని విడమర్చి మనకెవరు చెప్తారు చెప్పండి?  ఇది మామూలు  మేధ కి అంత తొందరగా అందని విషయం. మనసు ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి యజ్ఞ్యాలు, మంచి మంచి రచయితల చేత చేయించి ఇంతందమైన పుస్తకాలు వేస్తున్నంత కాలమూ, అనువాదాలు, "తిరిగి కథలు చెప్పడాలూ" ఇంత చక్కగా ఉండడమూ జరిగినన్నాళ్ళూ, "చదువుకోవడం" ఒక ఆనందదాయకమైన వ్యాపకం గా కొనసాగుతుంది. రచయిత్రికీ, (బీనాదేవి ఒకరే రాసారు) పబ్లిషర్స్ కీ వేల వేల ధన్యవాదాలు. 


***


24/07/2021

నాలో నేను - డా.భానుమతీ రామకృష్ణ

 తెలుగు చలనచిత్ర పరిశమ లో / భారతీయ చలన చిత్ర చరిత్రలో డా|| భానుమతీ రామకృష్ణ రచయిత్రిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, దర్శక నిర్మాతగా అలా అన్ని రంగాలలోనూ పేరు పొందిన  బహుముఖ ప్రజ్ఞాశాలిని.    పద్మభూషణ్ డా|| భానుమతీ రామకృష్ణ రాసిన ఈ జీవిత చరిత్ర - 1994 సంవత్సరానికి ఉత్తమ జీవిత చరిత్రగా జాతీయ బహుమతి కూడా పొందింది. 



భానుమతి గారు రాసిన "అత్తగారి కథలు", "భానుమతి కథలు", ప్రచురించబడినా,  సేకరించలేక చరిత్రలో కలిసిపోయిన కొన్ని ముందుకాలపు రచనలు, పాఠకులకు భానుమతి గారి సులువుగా కథ చెప్పగలిగే హాస్యచతురత ను, రచనా కౌశలాన్నీ పరిచయం చేసినా, ఈ "నాలో నేను" - కల్పన లేకుండా - స్వగతంగా తన గురించి ఆమె నిర్మొహమాటంగా, ఖచ్చితంగా, ఎవరైనా ఏమైనా అనుకుంటారన్న భయం లేకుండా చెప్పిన ఆత్మకథ కాబట్టి, ఎక్కడా గొప్పలు పోకుండా, విర్రవీగకుండా ప్రాక్టికల్ గా, నిజాయితీ తో రాయడం వల్ల - మరింత ఆకట్టుకుంటుంది.  . 


ముదుమాట లో డీవీ నరసరాజు గారు చెప్పినట్టు ఈ స్వగతాన్ని, జీవిత యదార్ధ గాధ ని సినిమాగా తియ్యాలనుకుని, స్క్రిప్ట్ కూడా దాదాపుగా రాసుకుని, కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నారు భానుమతి. నాకు మాత్రం ఇది పుస్తకం గానే ఎంతో బావున్నట్టు అనిపించింది. జీవితంలో అతి ముఖ్యమైనది భానుమతి గారి దృష్టి లో సంతృప్తి ! "నేనింక ఏదీ సాధించేందుకు మిగలలేదు, జీవితంలో అన్నీ సాధించాను "  - అనే సంతృప్తి ఆమెకు కలగడానికి కారణం తన భర్త, ఇంకా శృంగేరి జగద్గురువు ఆశీర్వాదాలు అని చెప్తూ, ఎంతో చక్కగా డాక్యుమెంట్ చేసిన ఈ మహనీయురాలి జీవిత చరిత్ర, నిరంతర ఆలోచనల ప్రవాహం  ఈ "నాలో నేను". 


ఒకోసారి మనం అవసరమైనవెన్నో మర్చిపోతుంటాము కానీ  కొన్ని పనికిమాలిన జ్ఞాపకాలు కూడా మనసులో ఎంత పాతుకుంటాయో, వాటిని పెద్దయ్యాక కూడా ఎందుకు మర్చిపోలేమో వివరించలేము.   ఈ కథ లో భానుమతి వీధి బడి, రంగయ్య పంతులు, బెత్తం వంటి అనుభవాల నుండీ, తన ఆహార్యం, మేచింగ్ పట్టు పావడాలు, తల్లో పువ్వులు వగైరాల తో పాటు ఆరోజుల ఫాషన్ గురించి, తన బొద్దు తనాన్ని గురించి హాస్యంగా చెప్పినా,  తెలివితేటల పరంగా,   ఆ పసి వయసులోనే తన బుద్ధి కి అర్ధం అయేటన్ని మానవ స్వభావాల గురించి, అమాయకత్వపు రోజుల్లోనే ఆమె కు ఎంత అవగాహనో చదివితే భలే ఆశ్చర్యం వేస్తుంది. బడిలో పిల్లల పట్ల పంతుళ్ళ బిహేవియర్,  శిక్షలు - లౌక్యాలు ఎంత జ్ఞాపకంగా హాస్యంగా చెప్పారో!  


ఎపుడో చిన్నప్పుడు స్పాండిలైటిస్ లాంటి వెన్నుపూస సమస్యతో ఆ రోజుల్లో వైద్య సదుపాయాలు లేకనో, బీదరికం వల్లనో ఎప్పుడూ తల పైకెత్తి, ఆకాశం వైపు చూసి నడుస్తూ  కాళ్ళకు ఎదుర్రాయి దెబ్బలతో బాధపడుతూండే ఓ ముసలాయన జ్ఞాపకం , తనకు పెద్దయ్యి వెన్ను సమస్య వచ్చాక తనకు అర్ధం కావడం, "అబ్సర్వేషన్"  అను తన జబ్బు గురించి -  వివరిస్తూ,  చిన్నతనాన పొరుగున ఉండిన  పంజాబీ తాత ఒకరు చిన్నప్పుడెప్పుడో ఇచ్చిన ఉల్లిపాయల కూర తనకు ఎంతగానో నచ్చడం గురించి కూడా మురిపెంగా గుర్తుచేసుకోవడం, తినాలనిపించినప్పుడు స్వయంగా వంటింటి లోపలికెళ్ళి ఆ కూర చేసుకోవడం - తన ప్లెయిన్ హార్టెడ్ నెస్ ని, తన బాల్యాన్నీ, తన లోపలి బాలిక నీ,  వొదులుకోని స్త్రీ గా ఎంత బాగా చెప్పారో. నాకూ వ్యక్తిగతంగా ఉల్లిపాయ, మీగడతో చేసే ఈ కూర చాలా చాలా ఇష్టం. అందుకే ఎక్కువ కనెక్ట్ అయిపోయినట్టున్నాను.   😆


అలా చిన్నప్పట్నించీ ఎన్ని జ్ఞాపకాలో, తన కజిన్లు, వారి  వెధవ వేషాలు - చేసిన తప్పుడు పనులు, చుట్టు పక్కల ఇరుగు పొరుగుల గురించి, వారి దగ్గర తాను నేర్చుకున్న ఎన్నో మంచి  విషయాల గురించి, వారి వారి బలం, బలహీనతల గురించి,  రకరకాల మనుషుల గురించి, వారు తన పట్ల చూపిన ఆదరం, అనాదరాన్ని గురించి చెప్తున్నప్పుడు, పసి మనసుల అద్దంలాంటి నిర్మలత్వం లో మనం వదిలే ఇంప్రెషన్ ల ప్రభావం మనకు అర్ధం అవుతుంది.   తనలో చిన్నప్పటి సంస్కృతాధ్యయనం వల్ల ఒరవడిన ఆధ్యాత్మిక భావనల గురించి పొల్లు పోని క్లుప్త ప్రస్తావనలు - ప్రవాహంలా ఆయా ఈవెంట్లను అల్లుకుంటూ రావడం భానుమతి గారి ప్రత్యేకత.  

సినిమా రంగ ప్రవేశం, తండ్రి నేర్పిన సంగీతం, బాల్యంలోనే పాటల ద్వారా తనకు సరస్వతి కటాక్షం వల్ల అందరి లోనూ వచ్చిన మంచి పేరు - సాంప్రదాయ వాద పెంపకం వల్ల తండ్రి చాటు బిడ్డగా, క్రమశిక్షణ తో, హార్డ్ వర్క్ తో అప్పటికే స్టార్ గా ఉన్న ఆమె రామ కృష్ణ గారితో ప్రేమలో పడడం - ఆమె పెళ్ళి, పెళ్ళి తరవాత విడిచిన సినిమా రంగం, తాను కోరుకున్న కుటుంబ మధ్యతరగతి జీవితానికి వారు ఇష్టంగా అలవాటు పడినా, విధి లిఖితం వల్ల, పలువురు శ్రేయోభిలాషుల బలవంతం వల్ల, తండ్రికి ఎంతగానో ఇష్టమైన తన గాత్రం - నలుగురూ వినాలని ఆయనకు బలమైన కోరిక ఉండడం వల్ల, కొడుకు భవిష్యత్తు కోసం తల్లిగా ఆమె తపన పొందడం వల్ల, ఎందరో మేలు కోరే కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో సినీ రంగంలోకి పునఃప్రవేశం చేసాకా చాలా మంచి మంచి సినిమాలో నటించి, ప్రొడ్యూస్ చేసి, దర్శకత్వం చేసి, తన గానంతో ఎన్నో శాస్త్రీయ సంగీతం దగ్గర్నించీ, పాశ్చాత్య సంగీతం దాకా ఎన్నో శైలులలో పాటలు పాడి, అలరించి, వివిధ రాష్ట్ర ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు గ్రహించి, ప్రభుత్వం దగ్గర ఎన్నో బిరుదులు, గౌరవ ఎవార్డులు, రివార్డులు పొందిన గొప్ప మహిళ భానుమతి గారు. 

ముందస్తు హెచ్చరిక ఏమిటంటే : ఇది గొప్ప ప్రేమ కథ. దాదాపు పుస్తకం నిండా రామకృష్ణ భానుమతి, వారి ప్రేమ, పెళ్ళి, ప్రయాణం, వారి స్ట్రగుల్, విజయాలు. ఇదంతా చదవడానికి ఎంత బావుందో. ఒక స్త్రీ గా రొమాన్స్ ని ఎంత గొప్పగా వర్ణిస్తారో. తండ్రిని వొదల్లేక, ఒప్పించలేక, ఎదురు చెప్పలేక, రామకృష్ణ గారిని వొదులుకోలేక, చెల్లి సహకారంతో - స్నేహితుల తోడ్పాటుతో, నాటకీయంగా పెళ్ళి చేసుకోవాల్సి రావడాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించి, మన గుండె ఆగేంత ఉత్కంఠ ని చాప్టర్ల వెంట పరిగెట్టిస్తారు. పుస్తకం ఆఖరున వారి వియోగం కూడా కంటతడి పెట్టిస్తుంది.  ఇదంతా వారిద్దరి ప్రయాణం. అంతగా జీవితాలు పెనవేసుకుపోయిన ప్రేమికులు - అందునా కెరీర్ మనుషులు, కళాకారులు, సృజన రంగంలో తలలు పండినవారు  - ఈరోజుల్లో దొరుకుతారా? 

ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి - అందరితో మంచివాడు అని పేరు తెచ్చుకున్న ఆ చిన్న, బీద టెక్నీషియన్ని ప్రేమించడం - ఆయన కూడా ప్రతిభాశాలి కావడాన వారి ప్రయాణం సాఫీగా జరగడం, అత్తగారి, పెద్దత్త గారి ప్రోత్సాహం - ఈ స్టార్ నటీమణి, మధ్యతరగతి సాంప్రదాయ కోడలు లాగా వ్రతాలు, నోములూ, పూజలు, వంటలు చేసుకోవడం, ఆత్మీయంగా, అందరితోనూ కలిసి మెలిసి ఉండడమూ,  తన కోసం స్క్రిప్ట్ లు రాయబడిన / మార్చబడిన, అందరి చేత గౌరవించబడిన తార - చిన్న చిన్న నటీనటులని కూడా గుర్తు పెట్టుకుని వారు తనకి అదెప్పుడో చేనిన  చిన్న సాయాల గురించి / మేలు గురించి తన ఆత్మ కథ లో  కూడా గుర్తు చేసుకోవడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.  ఇదీ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒద్దిక అనిపిస్తుంది. 

మిస్సమ్మ లో తాను మిస్ అయిన చాన్స్ సావిత్రి లాంటి మహానటిని చిత్ర పరిశ్రమ కు అందివ్వడం, తన జీవితం లో ఇష్టం లేకుండా చేసిన అమెరికా ప్రయాణం, కొడుకు జీవితం - ఇవన్నీ భగవంతుని ఆజ్ఞ ప్రకారం జరిగినవే నని, తాను ఇలా జీవితం లో కళాకారిణిగా పైకెదగడం, పేరు తెచ్చుకోవడం కూడా కర్మ వశాత్తూ జరిగిందే ననీ, తన గొప్పదనం కన్నా ఇదంతా డెస్టినీ అని నమ్ముతారు. అలా అని ఆమె భావ వ్యక్తీకరణ లో నిర్లిప్తతా, అయిష్టం ఏమీ లేవు. ఎన్ని డీటైల్స్, ఎన్ని జ్ఞాపకాలు - ఎన్ని అవమానాలు, మధుర ఊహలు, అనుభూతులు, కష్టాలు, దుఃఖాలు - వీటిని ఎంత చక్కగా జీవితపు ప్రతి క్షణాన్నీ ఉన్నది ఉన్నట్టుగా, స్వీకరిస్తూ,  ఒప్పుకుంటూ, ఆనందిస్తూ జీవించడాన్నే ఆమె నమ్ముకున్నారు. 

తాను పని చేసిన సినిమాల గురించి - రాసిన కథల గురించి మాత్రమే కాక, చూసిన వివిధ భాషల అజరామరమైన సినిమాలు, వాటి మెరిట్, సినిమా పరిశ్రమ లో పెరిగిన కమర్షియలిసం, మారిన విలువలు, సామాజికంగా రాజకీయంగా, సినిమాల లో తన కు కలిగిన అనుభవాలు, భర్త వియోగం తరవాత కొన్ని మంచి సినిమాలలో చిన్న చిన్న పాత్రలే వేసినా, అవి మహిళల వ్యక్తిత్వానికి పాసిటివ్ రిప్రసెంటేషన్ ను ప్రతిబింబించేలా  ఉంటేనే, తాను అవి చెయ్యడాన్ని గురించి సమగ్ర వివరణ ఇచ్చారు. 

ఎంత రొమాంటిక్ స్త్రీ /  మాట జవదాటని  కూతురు /  కుమారుడిని  అమితంగా ప్రేమించే   తల్లి /  పద్ధతైన  కోడలు అయినా - ముందు  ఆమె మంచి ప్రొఫెషనల్. అదీ ఎంతో ప్రతిభా, నిబద్ధతా ఉన్న కష్టపడే మనిషి. కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ చాలా ప్రొఫెషనల్ గా, నైపుణ్యంతో నిండి ఉంటుంది. దీన్ని చదవడం చాలా మంచి అనుభవం. నా షెల్ఫ్ లో ఎన్నో ఏళ్ళుగా ఉండినా ఈ మధ్యనే చదవడానికి కుదిరింది. ఎంత బావుందో  ఈ పుస్తకం... ఇన్నాళ్ళూ ఎందుకు చదవలేదా అనుకున్నాను.  ఇదీ దైవ నిర్ణయం ఏమో.  ఇప్పుడు ఈ వయసులో ఈ పుస్తకం ఒక కొత్త డైమెన్షన్ లో కనిపించింది.  ఓ పదేళ్ళ క్రితం చదివి ఉంటే, ఏదో గడ గడా చదివేసేదాన్నేమో గానీ ఈ వయసులోనే ఎక్కువ అర్ధం అయింది, ఆ విలువలు, నిజాయితీ, భయం లేకపోవడం, అవేవీ పొగరుగా/అతిగా  అనిపించకుండా, ఆత్మ విశ్వాసంగా / తనను తాను గౌరవించుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న  ఓ మహిళ జీవిత కథగా   అర్ధం అయి, బాగా నచ్చింది.


*** 

 





23/07/2021

హోమర్ : ఇలియడ్ - ముత్తేవి రవీంద్రనాథ్




ఈ పుస్తకం ఒక ఐతిహాసిక మహాకావ్యం - ఒక అత్భుతమైన  కథ ని విడమరిచి చెప్పే చాలా క్లిష్టమైన ప్రక్రియని అరటిపండు వొలిచి నట్టు, చాలా సులువు చేసి, అసంఖ్యాకమైన పాత్రలనీ, వాటి పుట్టు పూర్వోత్తరాల్నీ, వారి వారి వెనకున్న జన్మ కారణాల్నీ ఒక తీరుగా చెప్పడంలో అనువాదకులు (reteller) శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారి కృషి చాలా అబ్బుర పరుస్తుంది. ఇలియడ్ లాంటి మహా కావ్యాన్ని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టాల్స్టాయ్, గోథే లాంటి వారిచేత ఎంతో గొప్పగా ప్రశంసించబడ్డ కావ్యాన్ని, సులువైన తెలుగులో, సరళంగా చెప్పాలని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, దాన్ని సాధించేందుకు ఆయన చేసిన కృషి గురించి, even "రచయిత ముందుమాట" నుండీ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉందీ పుస్తకం. 


ఇలియడ్, ప్రపచ ప్రఖ్యాతి గాంచిన గ్రీకు ఇతిహాస కావ్యం. ప్రాధమికంగా, ఇది ఎవరూ ఘంటం పట్టి రాయలేదు. మౌఖికంగా, పాటల రూపంలో, (రచయిత) హోమర్ ఊర్లలో తిరిగి గానం చేస్తూ చెప్పిన కథ. దీనికి మన పురాణ గాధల్లాగా రకరకాల వెర్షన్లు అవీ ఉన్నయ్యేమో, ఉన్నా, అవి స్పష్టంగా వివరించపడడం వల్ల, ప్రధానంగా మూల కథ ఏమాత్రం దెబ్బతినిపోకుండా మనతో నిలిచిపోయిన మహా కావ్యం.  


హోమర్ గురించి ఆధునిక సమాజానికి పెద్ద వివరాలేమీ తెలియవు. ఆయన తాను రాసిన కావ్యాలలొ ఘట్టాలను శ్రావ్యంగా గానం చేస్తూ ఊరూరా తిరుగుతూ పొట్ట పోసుకునే వాడట.  హోమర్ బాబిలోనియన్ అనీ, కియోస్ దీవికి చెందినవాడని, గ్రీకు భాషలో 'హోమిరోస్' అంటే 'బందీ' అని అర్ధం కాబట్టి, అతను గ్రీకులకు బందీగా చిక్కిన 'టిగ్రానీజ్' అని, లేదా అతనో గుడ్డి వాడనీ, రకరకాల నమ్మకాలున్నా, ఏదీ సరైనది అనే సాక్షాలు లేవు.  ఇలియడ్, ఒడిస్సీ లాంటి మహాకావ్యాలనే కాక హోమర్ ఇంకొన్ని ఇతర రచనలూ చేసాడు. వాటిల్లో "హోమరిక్ హింస్" ప్రసిద్ధ దేవతా స్తుతులు, "ది బాటిల్ ఆఫ్ ఫ్రాగ్స్ ఎండ్ మైస్" (కప్పలు చుంచెలుకల యుద్ధం), "మార్గైట్స్" అనే అమాయకుడి సాహసగాధ, ప్రసిద్ధమైనవి. పాశ్చాత్య మహాకవుల్లో ఇంత సుదీర్ఘ కావ్యాలను రచించినవారు లేరు.  అతని పేర్న బోల్డన్ని సూక్తులు, పదాలు - సామెతలు ఉన్నాయి.  


ట్రోజన్ గుర్రం గురించి చిన్నతనంలో ఏ నాన్-డీటైల్ లోనో, లేదా పాశ్చాత్య సాహిత్యంతో ఉన్న పరిచయాల ద్వారానో, మన వయసు / పరిమితుల దృష్ట్యా, కుదించబడిన కథలని చదివే ఉంటాం అందరం.  ట్రాయ్ నగరం ని గెలిచి, రాకుమారుడు పారిస్ ఎత్తుకొచ్చిన తన భార్యని రక్షించుకోవడానికి (రామాయణం లా - ధర్మబద్ధమైన) ఒక గ్రీకు రాజు   చేసిన సుదీర్ఘ యుద్దపు గాధ ఇది. ఈ యుద్ధంలో మన భారతం లానే, కొన్ని వందల రాజ్యాలు, వేలాది సైన్యాలు, కొన్నేళ్ళ పాటు యుద్ధం చేసి, గెలవలేకపోయి, ఒక పెద్ద చెక్కగుర్రాన్ని ట్రాయ్ కి బహుమానంగా ఇవ్వచూపి,  వీరులంతా ఆ చెక్క గుర్రం లో దాక్కునెళ్ళి,  ట్రాయ్  కోటలోకి ప్రవేశించాకా, ఊచకోతకి తెగబడి, చివరికి యుద్ధాన్ని గెలవడం,   ప్రధాన ఇతివృత్తం. 


ఈ యుద్ధంలో పాల్గొన్న అందరు వీరులదీ ఒక్కో గాధ. లేవదీసుకురాబడ్డ హెలెనా దీ, ఆమెను ఎత్తుకొచ్చిన పారిస్ దీ, వాళ్ళ నగరానికున్న శాపాల గతం, ఈ ఐతిహాసిక గాధలో తరచుగా మన ముందుకొచ్చే అసంఖ్యాక మహావీరులు, వారి ఒక్కొక్కరి కథలు, అచ్చు మన మహారాజు దుర్యోధనుణ్ణి వాళ్ళ అమ్మ గాంధారి "మహా బలవంతుడిని" చెయ్యబోయి వజ్ర లేపనం రాసినపుడు అతను సిగ్గుపడి అంగవస్త్రం ధరించడం వల్ల, కేవలం అతని తొడలు మాత్రం బలహీనంగా మిగిలి, తొడపై భీముడి గదా ఘాతానికి, అతన్ని చావు ఎలా వరిస్తుందో - అదేవిధంగా గ్రీకు గాధల్లో ఎకిలీజ్ మహా వీరుడి తల్లి, శిశువుగా ఉన్నప్పుడు దేహమంతా అమృతం రాసి కుడికాలి మడమ పట్టుకుని మంటల్లో కాలుస్తుంది. ఆ అబ్బాయి పెద్దయాక, కేవలం ఆ కాలి మడమ గాయానికే మరణిస్తాడు. అందుకే ఏదయినా వ్యవస్థ లో బలహీనమైన / ప్రమాదకరమైన లోపాల్ని "ఎకిలీజ్ హీల్" అనడం ! ఎకిలీజ్ తల్లి కూడా, హిందూ పురాణ గాధలలో స్వాప్నిక మాతలు (గంగ/ఉలూచి) / అప్సరసల లాగా తమ భర్తలు తమను ప్రశ్నించినా, వారు చేసే పనులను ఆపడానికి ప్రయత్నించినా, అకస్మాత్తుగా మానవ జీవితాల్లోంచీ తప్పుకుంటారు.  ఇలా హిందూ పురాణేతిహాసాలతో, పోలికలే పోలికలు !  


పౌరాణిక గాధలలో వచ్చే దేవీ, దేవతలు, వారికీ, మానవులకూ ఉన్న బాంధవ్యాలు, వారికీ వీరికీ ఉన్న అభిప్రాయ బేధాలు,ప్రేమలు, శాపాలు ఇలియడ్ నిండా !  ఇంత పురాతన గాధ లో కూడా పాఠకుల ముందుకొచ్చే స్వలింగ ప్రేమ బంధాలు - అవీ - మహావీరుల మధ్య!    కంసుడి చావు గురించి అశరీరవాణి చెప్పినట్టు - ఇలియడ్ లో కూడా - అశరీర వాణి భవిష్యత్తు ను గురించి హెచ్చరిస్తుంది.  ఎందరో శక్తులున్న రాజకుమారులు, రాకుమార్తెలు, భవిష్యవాణి వినిపిస్తుంటారు. బలులు - నర బలి, జంతు బలి - అవి సరిగా లేకపోవే దేవతలకు ఆగ్రహం కలగడం -  వగైరా!  ఇవన్నీ మళ్ళీ అంతర్గతంగా ఒక్కో కథతో ఇంకోటి పెనవేసుకునుంటాయి. వీటిని విడమరచడం లో అనువాదకులు చాలా ప్రతిభ కనపరచడంతో, చదవడానికి చాలా బావుంటుంది.


ఒడిస్సీసియస్, హెక్టర్, నియోటాలమస్, ఎయాస్, పాట్రోకస్, ఎట్రియస్, మెనెలాస్  నుండీ హెర్క్యులస్, సూర్య దేవుడు , ఫీనిక్స్, యాప్రొడైట్ లాంటి బంధువులు, రాజులు, దేవతలు ఇలా అసంఖ్యాకమైన అత్యత్భుత పాత్రలు, వాటి వివరణలకు, క్లుప్తంగానే అయినా రచయిత చాలా శ్రమ తీసుకుని చేసిన భాగాలు - ప్రత్యేక ఎపెండిక్స్ లతో ఈ పుస్తకం చాలా విపులంగా ఉంది.  గ్రీకుల జీవన విధానం, వారి నాగరికతను గురించి తెలుసుకోవాలంటే, జ్యూస్, అపోలో, హెర్హ్యులీస్, వీనస్, హెక్టర్, ప్రయాం, ఎకిలీస్, యులిసీస్ తదితరుల గురించి తప్పక తెలుసుకుతీరాలి. 


ఇలియట్ ప్రధానంగా  ట్రాయ్ కు గ్రీకు వీరులంతా కూడి వెళ్ళి, తొమ్మిదేళ్ళ పాటు ప్రయాణాలు చేసి, అష్టకష్టాలు పడి ట్రాయ్ ని సర్వనాశనం చేసి గెలిచే(?!) వరకు - దీని తరవాత   వెనుతిరిగి తమ తమ రాజ్యాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళంతా దేవతల ఆగ్రహానికి గురయి ఎన్ని కష్టాలు పడతారో, ఎందరు మృత్యువాత పడతారో  ఇంకో గ్రంధం.  ఈ మహా వీరుల్లో, ఇష్టం లేకుండా యుద్ధంలో అడుగుపెట్టినా, చివరిదాక ప్రముఖ పాత్ర పోషించిన మహా వీరుడు  "ఒడిస్సీసియస్" ఎన్ని బాధలు పడి తన రాజ్యాన్ని, భార్యను తిరిగి పొందగలుగుతాడో, హోమరే, "ఒడిస్సీ"  అనే గాధలో చెప్పాడు. 


ముత్తేవి రవీంద్రనాథ్ గారు ఈ పుస్తకాన్ని తెలుగు చెయ్యడం కోసం తీసుకున్న శ్రద్ధ, కేవలం కథ చెప్పడంతోనే సరిపెట్టకుండా, ఒక పూర్తి చాప్టర్ లో "వివరణ", దీని చారిత్రక నేపధ్యం, శాస్త్రీయంగా కూడా వివరించడం, ఇప్పుడు మిగిలిన సాక్షాలను, ఆధారాలనూ గురించి వివరించడంతో పాటు, యుద్ధం జరిగిన తీరు, యుద్ధంలో పాల్గొన్న అనాగరిక జాతులు, దేవతలు - గ్రీకుల నౌకా యుద్ధపు నైపుణ్యం, సముద్రాలు దాటి వచ్చి వాణిజ్యం చేయగలిగే పాశ్చాత్యుల ప్రావీణ్యం, పర్యవసానం గురించి చాలా విస్తృతంగా చర్చించడం లో కనిపిస్తుంది. 


ఇలియడ్ కూ రామాయణానికీ,  మహాభారతానికీ ఉన్న పోలికల గురించి - కూడా మంచి రీసెర్చ్ జరిగింది. భగవత్గీత తో కూడా పోలిక,  వీటిల్లో వచ్చే 'కథలో కథా లాంటి ప్రక్రియల గురించీ మనుస్మృతి నుంచీ, వివాహ వ్యవస్థ, కన్యాశుల్కం, స్వర్గ నరకాలు - ఆహారం - నిర్మాణ పద్ధతులు, కుటుంబ వ్యవస్థ,  ఇలా దేనినీ వదలకుండా, పూర్తిగా మనసు పెట్టి - ఇలియడ్ కు ఒక రిఫరెన్స్ పుస్తకంలా  దీన్ని తీర్చిదిద్దినందుకు, ఆఖరి చాప్టర్ - కావ్య రచనలో తొణికిన కొన్ని తప్పుల కోసం ప్రత్యేకంగా కేటాయించడం చాలా బావుంది. 





ఇప్పుడు దొరుకుతుందో లేదో గానీ, అనుకోకుండా, కేవలం అదృష్టవశాత్తూ - కొనుక్కున్న పుస్తకం ఇదీ, ఇంకా 'ఒడిస్సీ'. దాని గురించి ఇంకో సారి. తక్కువ ధరలో, నాణ్యమైన కంటెంట్ తో, (ఇంకా తెలుగు ఇలియడ్ లు ఉన్నాయి గానీ - చిక్కుల్లేని భాష మూలంగా చాలా నచ్చింది ఇది) 'వనవాసి '  లా పదే పదే చదువుకోగలిగిన పుస్తకం.  దొరికితే తప్పకుండా ఎంజాయ్ చెయ్యండి. 


***