Pages

14/12/2021

ఓడి గెలిచిన మనిషి - మల్లా రెడ్డి

 ఓడి గెలిచిన మనిషి - ఒక స్కీజోఫ్రెనిక్ ఆత్మ కథ 

 ఈ పుస్తకాన్ని హైద్రబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. మానసిక అనారోగ్యం నుంచీ కోలుకున్న ఒక వ్యక్తి, వ్యాధితో తన నిరంతర పోరాటం గురించి రాసిన పుస్తకం ఇది.  రచయిత,  మొదట "సూర్య" అనే 'కలంపేరు'తో రెండు పుస్తకాలు  రాసి, ఆ వ్యాధి చుట్టూ ఉన్న స్టిగ్మా, సామాజిక అపోహ ల ని తొలగించడానికి, తన సొంత పేరుతో రాసిన మొదటి (మూడో) పుస్తకం ఇది.   ఈ పుస్తకాన్ని రచయిత ఎంత బాగా రాసారో, అంతే ధీటుగా, ఎంత పెద్ద, నిజ గాధని, సరళంగా, దాని టోన్ ని చాలా సమర్ధవంతంగా  వినిపించేలా  ఎడిట్ చేసి, చాలా బాధ్యతగా, ఆదరంగా హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు.   ఈ పుస్తకం చదివి కొంచం అన్నా ప్రయోజనం పొందే బాధితుల / వారి కేర్ గివర్స్ మీద, మనందరి మీదా ఆదరం తో,   ఇది రాయమని మల్లారెడ్డి గారిని  ప్రోత్సహించి, ప్రచురించినందుకు  HBT వాళ్ళకి నా కృతజ్ఞతలు.  ఎడిటర్ డా.శోభా దేవి గారికి కూడా చాలా గుర్తింపు నిచ్చే పుస్తకం ఇది. 

 

నాకు ఈ పుస్తకం ఎందుకు అంతగా నచ్చినంటే, తనకు చికిత్స చేసిన డాక్టర్ అంటే, రోగి కి  ఉండే  మానసిక అనుబంధం, గౌరవం, ఆ కనెక్షన్, నాకూ ఉన్నాయి. నేను ఇంకొద్ది రోజుల్లో పేరా ప్లీజియాకు గురవ్వబోతున్నంత పరిస్థితి లో ఉన్నప్పుడు,  నన్నాదుకున్న సర్జన్  డా.విష్ణు ప్రసాద్, నన్ను ఎంతో కష్టం మీద మళ్ళీ రెండు కాళ్ళ మీదా నడిపించిన నా ఫిసియోథెరపిస్ట్ డా.వినోద్ మీదా, నాకున్న కృతజ్ఞతా భావం మర్చిపోలేనిది. వాళ్ళు ఇద్దరూ కేవలం వృత్తి పరంగా ట్రీట్ చేసిన వేలాది పేషెంట్లలో నేను ఎవరో.  కానీ వాళ్ళు నా జీవితంలో నా పట్ల చూపించిన ఆదరణ మర్చిపోలేనిది.  


అలా, తనకు కొత్త జీవితం ప్రసాదించిన మానసిక వైద్యుడి పట్లా, ఆయన తదనంతరం, సోదరుడిలా ఆదరిస్తూ వచ్చిన డా.ధర్మేంద్ర పట్లా, రచయిత మల్లారెడ్డి గారి కృతజ్ఞతా భావన మాటల్లో చెప్పలేనిది. ఈ పుస్తకం అసలు తెలుగు రాని తన డాక్టర్ తో తన భావాలు పంచుకునే సాధనంగా రాసిన ప్రయత్నమే.  అతని  మొదటి పుస్తకం "An Autobiography of a Mentally Challenged Man "(2011) ఆన్లైన్ లో  అందుబాటులో ఉంది. 


సున్నిత మనస్కుడైన ఒకమోతుబరి రైతు కొడుకు, ఎటువంటి హింసనూ చూసి తట్టుకోలేని సౌమ్యుడు మల్లారెడ్డి.   కుటుంబ కలహాల వల్ల, చదువులో వెనకబడడం వల్లా, విపరీతమైన మానసిక ఒత్తిడి కి గురయ్యి, మానసిక వ్యాధి బారిన పడతారు.   ఆయనకు కలిగిన కష్టం, మాటల్లో వర్ణించలేనిది. మానసిక అనారోగ్యం పట్ల అవగాహన లేని రోజుల్లో, కుటుంబ కక్షలూ, హత్యలూ సాధారణమైన రాయలసీమ ప్రాంతాల వ్యక్తి కావడాన,  ఈయన అకారణ భయాలను స్నేహితులూ, బంధువులూ.. అసలు గుర్తించనే లేక పోవడం వల్ల, వ్యాధి ముదిరి,  చదువు, కెరీర్ దిబ్బతింటాయి 

అతని జీవితం లో వచ్చిన ఘోరాతి ఘోరమైన కుదుపులు, కష్టాలు, వర్ణనాతీతమైన బాధ, చాలా అదృష్టవశాత్తూ అతనికి దక్కిన వైద్యమూ.. ఇవన్నీ ఏ విజయగాధకూ తీసిపోవు. కాకులు తరచుగా కనిపిస్తుండడం, శరీరం బలహీనంగా ఉండడం, వ్యాయామం చేయాలనిపించడం, ఆలోచనలు, ఎడతెరిపి లేకుండా, తట్టుకోలేనన్ని ఆలోచనలు, కాకులు తనకేదో చెప్తూన్నట్టు ఊహించుకోవడం, అవి చెప్పినట్టు తను చెయ్యడం, తన ఆలోచనలు ఇతరులు చదివేస్తున్నట్టు భయపడడం, వాటిని అణుచుకునేందుకు ప్రయత్నించడం, ఈ తీవ్ర సంఘర్షణ కారణంగా అలిసిపోవడం- ఇదీ అతని మొట్టమొదటి అనుభవం. మాటల్లో చెప్పలేని అనుభవం. ఇదీ అని చెప్పలేని ఆందోళన, వొత్తిడిని కలిగించే అనుభవం. 


ఇలాంటి రిపీటెడ్ ఎపిసోడ్స్ ఒక చదువుకునే అబ్బాయిని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తాయి ? ఒత్తిడికి కారణాలు అనేకం.  మల్లా రెడ్డి గారి తండ్రి ఒక నిరంకుశ మోతుబరి రైతు. 

విద్య అందరికీ ఓ ప్రాధమిక హక్కు. కానీ ప్రభుత్వం ఉచితంగా నడిపే బళ్ళో కూడా గ్రామం లో అందరు పిల్లలు చదువుకోగలిగేవారు కాదు.  బడి పంతులు స్కూల్ కి వచ్చిన పిల్లలకు బడికి రాని పిల్లల్ని బడికి తీసుకురావడం అనే బాధ్యత ఇచ్చేరోజులవి.  

అలా బడికి రమ్మని తమ తండా లోని లంబాడా వారి పిల్లల్ను  పిలుచుకు రావడానికి వెళ్ళిన మల్లారెడ్డి కి రియాలిటీ ఎలా ఎదురవుతుందంటే, "మా పిల్లలను బడికి పంపితే, మీ ఇంట్లో ఎనుములను ఎవరు చూస్తారు ? వాటి పేడ ఎత్తేది ఎవరు ? మాకెందుకు బాబూ చదువులు ? మీ నాయన దగ్గర నేను చేసిన అప్పు తీరేదాక, వీనిని మీ ఇంట్లో జీతానికి పెట్టకపోతే, మీ నాయన మమ్మల్ని బ్రతకనిస్తాడా ? ఎందుకొచ్చిన గొడవ ?" అన్న లంబాడా కూలి మల్లారెడ్డి మనసుని చివుక్కుమనిపిస్తాడు.  అదొక షాక్ ఈ చిన్నబాబుకి. 

అలాగే, అప్పు తీర్చని వ్యక్తిని చిన్న బాబు ముందే, రక్తం కారేలా కొట్టిన తండ్రి కారణంగా,   ఆ పిల్లాడి  మనసులో ముద్రించుకుపోయిన అన్యాయం, వ్యవస్థీకృతమైన సామాజిక హింస, అతన్ని కుదిపేసిన సంఘటనల్లో ఒకటి. అలాగే పిచ్చుకల్లాంటి అందమైన ఎవరికీ ఎటువంటి హానీ తలపెట్టని బెల్లెగాళ్ళనే పక్షుల్ని చిన్న పిల్లాడి ముందే ఒకడు కేవలం ఫన్ కోసం తుపాకీ తో కాల్చి చంపడం, కూడా అతన్ని బాగా బెంగపడేలా చేసేస్తాయి.  


1952లో, కడప లో, ఒక ఫేక్షనిస్ట్ వ్యవస్థలో ఉన్న పెద్ద రైతు కుటుంబంలో పుడతాడు. తండ్రికి ఇద్దరు భార్యలు. ఇతను రెండో భార్య కొడుకు. ఇతనంటేనే తండ్రికి ఎక్కువిష్టం అని మిగిలినవాళ్ళ భావన, కుటుంబ కలహాలు. ఇవి ఉన్నప్పటికీ ఇద్దరి తల్లుల పిల్లలూ, ముఖ్యంగా అతని అందరు అక్కచెల్లెళ్ళూ అతన్నెప్పుడూ ప్రేమగానే చూసేవాళ్ళు. 

మిగిల్న వాళ్ళు పురిగొల్పడం వల్ల, తరవాత వ్యాధిగ్రస్తుడైన తనని ఇబ్బంది పెట్టిన తమ్ముడు (పెద్ద భార్య కొడుకు) కూడా, అన్న దుస్థితి చూసి చలించిపోయి, అతని మీద కేసు పెట్టినందుకు ఏడిచేస్తాడు. [అయితే ఈ కేసు వల్లనే మల్లారెడ్డి లా చదువుకుని, న్యాయవాది అవుతాడు]    

గుర్రం పై తిరిగే తండ్రి, తనని కూడా అప్పుడప్పుడూ తీసికెళ్ళి తమ 'జమీ' నంతా చూపించడం, వగైరాల వల్ల, మల్లా రెడ్డికి గుర్రం అంటే ప్రాణం. కానీ తండ్రి ఎప్పుడూ సొంతానికి గుర్రాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు కొడుక్కు.  తండ్రి వెంట గ్రామాలు తిరుగుతున్నప్పుడే,   మొట్ట మొదటి సారి అప్పుడప్పుడే వస్తున్న రైలు నీ, ఎలక్ట్రిక్ బల్బు ని చూస్తాడు.  

అలా సాఫీగా సాగుతున్న జీవితంలో చదువు విషయంలో పెద్దలు తెలిసీ తెలియకుండా తీసుకునే నిర్ణయాలు శాపంగా మారుతాయి.  చిన్నవాడిని ఎందుకనో పెద్ద క్లాసులో బలవంతంగా చేరుస్తారు. వాడు, నేర్చుకోలేక, చదువు అందుకోలేక, మానలేక, ఎదుర్కొన్న వొత్తిడి, తరవాత ఇంగ్లీషు చదవలేక ఎదుర్కొన్న బాధ, ఇవన్నీ కుంగదీసినా ఎలాగో గట్టెక్కి, పెద్ద చదువులకు ఊరొదిలి పోవాల్సి రావడం, పట్నాలలో, నగరాలలో ఎదుర్కొన్న వింత పరిస్థితులు అతన్ని కుంగదీస్తాయి.

కొత్త స్నేహాలు, మనుషులు, చూసిన వివిధ దౌర్బల్యాలు, బలాలు, అతన్ని ఆదరించిన స్నేహాలు, మానవత్వం చూపిన మనుషులూ, ఇవన్నీ రచయితకు పేరు పేరునా గుర్తుండడం, చాలా మంది వ్యక్తులతో చాలా రోజులు, ఇంత వ్యాధి లో కూడా నిలుపుకున్న స్నేహం, చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎన్ని గాఢమైన ముద్రలు ఇవి ? మనం చేసే పనులూ, మాటాడే మాటలూ కొందరికి ఎంత గుర్తుంటాయో, వారిని ఎంత ప్రభావితం చేస్తాయో, మనం జీవితం లో ఎంత జాగ్రత్త గా మసులుకోవాలో చెప్తాయి.   


చిన్న వయసులో మల్లారెడ్డి  వాళ్ళింట్లో, గాదెలు (వెదురుతో చేసినవి), ఖర్దనాలు (రాతి గాదెలు) లో పంట దాచుకునేవారు. పాడి ఆవులు ఇంట్లోనే కట్టేసి ఉండేవి. వాటి వల్ల ఈగలు, రొచ్చు తో ఇంటి లోపలి పరిసరాలే అపరిశుభ్రంగా ఉండేవి. కుటుంబసభ్యులు, ముఖ్యంగా పిల్లలూ తరచూ జబ్బు పడుతుండేవారు.  సంతానం ఎక్కువ కావడాన, చిన్న పిల్లల్ని ఎవరో ఒక అవ్వలాంటి పనిమనిషి సాయంతో పెంచేవారు.  ఆవిడే వీళ్ళని ఆదరించి, శుభ్రం చేసి, భోజనం, ఆప్యాయతా పంచి పెట్టేది. 

మల్లరెడ్డి కుటుంబం పెద్దగా చదువు సంధ్యలు ఉన్న బాక్ గ్రౌండ్ నుండీ రాకపోయినా, అతని అక్క చెల్లెళ్లు చదువుకున్నారు.  మానసిక వైద్యం గురించి అవగాహన లేని తండ్రి, ఎంత ముతక మనిషైనా, డబ్బు పిచ్చి ఉన్న వాడైనా కూడా, బెంగళూరు తీసికెళ్ళి, ఒక ప్రముఖ మానసిక వైద్యుడి దగ్గరే కొడుక్కి వైద్యం ఇప్పించాడే తప్ప, దయ్యాలూ, మంత్రాలూ, తంత్రాలూ, తాయెత్తులూ అంటూ కాలయాపన చెయ్యలేదు. ప్రతి సారీ కోర్సు పూర్తయ్యేదాకా కొడుకు వెంబడే ఉండి వైద్యం చేయిస్తూ, కనిపెట్టుకుని ఉండేవారు. 

చదువు చెప్పిస్తూ, డాక్టర్ చేద్దామనుకుని, డొనేషన్ కట్టడానికి ముందుకు వచ్చి కూడా,   కొడుకు కు ఇష్టం లేదని  బలవంతపెట్టలేదు. చెట్టంత కొడుకు పిచ్చివాడై దేశం మీద పడి, అపరిశుభ్రంగా, ఆకలి తో, బలహీనతతో, అనారోగ్యంతో పరుగులు పెడుతూంటే, ఆఖర్న ఆత్మహత్యా యత్నం చేసినప్పుడు, వైద్యం ఇప్పించేవాడు.  నయమయిందీ అనుకున్నాక ఉద్యోగానికి విదేశం పంపి, సంబంధం చూసి, అతనికి పెళ్ళి కూడా చేసాడు. 


అయితే అల్జీరియా లో అక్కా బావా చూపించిన ఉద్యోగం చేసేందుకు వెళ్ళిన మల్లారెడ్డి, అక్కడి శీతాకాలంలో, తరగని పొద్దూ, నిరాదరించే చల్లదనం,  ఒంటరితనం వల్ల  డిప్రెషన్ బౌట్ లను మళ్ళీ ఎదుర్కోవడం, మందులను సరిపడా తీసుకుని వెళ్ళకపోవడం వల్ల చికిత్స అందక, మళ్ళీ తీవ్ర బాధలు ఎదుర్కొని, ఇండియా అంటూ తిరిగొస్తే, మరిక వెళ్ళేది లేదని నిర్ణయించుకుంటాడు. 

అలా పెళ్ళి కుదురాక దేశానికి వచ్చిన అబ్బాయి, తిరిగి ఉద్యోగానికి విదేశం వెళ్ళనని, ఇక్కడే ఉంటానని భీష్మించుకోవడం తండ్రికి నచ్చదు. అప్పటి నుంచీ తల్లితండ్రులు, అతని భార్య  ఉమ ప్రోద్బలంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని ఆమె  మీద అలిగి, కొడుక్కు దూరమవుతారు. ఎందుకంటే ఆ రోజుల్లో విదేశాల్లో ఉద్యోగం అంటే, అప్పట్లో  ఎంతో గొప్ప విషయం.  


పెళ్ళయ్యాక, భార్యకు తన వ్యాధి విషయం చెప్పినా, ఆమె పెద్దగా బాధపడదు. నయమయిందనే అనుకుంటుంది. కానీ మందులు తీసుకోవడంలో నిర్లక్షం, తగ్గింది కదా అని మందులు వేసుకోవడం మానేయడం వగైరాల వల్ల, ఎపిసోడ్ లు తిరగబెట్టేవి. వ్యాధి తీవ్రత, అతన్ని ఉద్యోగం చేసుకోనివ్వలేదు. భార్య ని అనుమానించేలా చేసింది, పిల్లల్ని భార్యే ఎలానో టీచర్ ఉద్యోగం చేసి పెంచుకోవాల్సి వచ్చింది. 


విపరీతమైన  సిగరెట్ అలవాటు, వ్యాధి ముదరడం వల్ల ఏదీ చెయ్యలేక, (రెండోసారి) ఆత్మహత్యా యత్నం చెయ్యడం, వగైరాలతో అందరినీ తీవ్రంగా ఇబ్బంది పెట్టినా భార్యా, ఆమె కుటుంబ సభ్యులూ ఎంతో మానవత్వం తో అతన్ని బ్రతికించుకుంటారు. వైద్యం ఇప్పిస్తారు. అండగా నిలుస్తారు.  నిజానికి వ్యాధి విషయం దాచి  పెళ్ళి చేసుకున్నందుకు అతను ఎంతగానో బాధపడతాడు కూడా. కానీ చెపితే అతనికి పిచ్చివాడని ముద్రవేసి పిల్లనివ్వరేమో అని తల్లితండ్రుల బెంగ మరి.  


మొదటి నుండీ అతనికి  వైద్యం చేసిన డాక్టర్ కూడా మల్లారెడ్డిని  సోదరుడిలా చూసుకుంటాడు. సిగరెట్ మానలేని ఈ మనిషిని ఆ దేవుడి లాంటి డాక్టర్ తీవ్రంగా మందలించడంతో ఇతను చలించి, అతి ప్రయత్నం మీద మాని, షేక్ హాండ్ ఇచ్చేందుకు వెళ్ళీనప్పుడు, ఎంత ప్రేమతో కౌగిలించుకుంటాడో తన పేషెంట్ ను!   

బహుశా మానసిక వ్యాధి ఒక మనిషి ని ఎంత  చిత్రవధ  చేస్తుందో ఎన్నో కేసుల్లో ప్రత్యక్షంగా చూసినందునేమో ఆ డాక్టర్ కి తన పేషెంట్ మీద ఆ ఆదరం.   కానీ అనారోగ్యంతో ఆ డాక్టరు మరణించడం మల్లారెడ్డి గారి జీవితంలో మరో పెద్ద విషాదం. కానీ చికిత్స పట్ల ఆ డాక్టర్ పట్టుదల గుర్తు తెచ్చుకుని, క్రమశిక్షణ తో ఆ కోర్సుల్ని కంటిన్యూ చెయ్యగలుగుతాడు ఆయన. 

ఈ ఆటోబయాగ్రఫీ అంతా పెద్ద రోలర్ కోస్టర్ రైడ్. ఎన్ని జ్ఞాపకాలో, ఎన్ని పాత్రలో. ఎన్ని సాయాలో. మానవత్వం బ్రతికే ఉందని, "ఆశ" అనేది,  ఎప్పటికీ ఉందనీ బుజ్జగింపో.  మానసిక రోగి జీవితం అంతా  ఎంత పెద్ద యుద్ధమో,  ఆదరించే కుటుంబసభ్యులూ, స్నేహితులూ - ఎంతెంత యోధులో చెప్తుంది. కుటుంబ కలహాలు కూడా ఎంత ఎవాయిడబుల్ చిన్న చిన్న పట్టింపులవల్ల మొదలవుతాయో, వాటి వల్ల మనుషులకెంత నష్టమో కూడా చెప్తారు. 

ఈ పుస్తకం, మొదట రాసిన ఇంగ్లీష్ పుస్తకానికి 'అనువాదం' కాదు. ఆ ఇంగ్లీష్ పుస్తకం రాయడానికి, 15 గంటల ముప్పయి నిముషాలే పట్టింది. దాని తెలుగు అనువాదం కూడా ఈయనే చేసారు. ఈ పుస్తకం తను ట్రీట్ మెంట్ చేయించుకున్న క్లినిక్ లో వస్తూండే పేషెంట్లకు పనికొస్తుందని, అవగాహన కోసం రాసినదే. ఈ పుస్తకాన్ని తన డాక్టర్ గారికి అందిస్తే,  ఆయన ఈ ఆత్మకథ ని చదివి మెచ్చుకుని ఎంతగానో ప్రోత్సహించారు. అయినా కొంత అస్పష్టతను తగ్గించేందుకు ఈ మూడో వెర్షన్ ను మొత్తం తెలుగులో 'తిరగ'రాసారు. 'సూర్య' అనే కలంపేరు వద్దని, సొంతపేరునే వాడమని పబ్లిషర్ సూచిస్తే, ధైర్యంగా సొంత పేరుతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు.  ఈ 'రాయడం', తన గుండె మీద బరువుని తగ్గించడమే కాకుండా, తనలాంటి ఘోర యుద్ధం చేసే రోగులకు ధైర్యం ఇస్తుందని నమ్మి ఈ ప్రయత్నం చేసారు. 'మానసిక రోగం మనకి రాదు!' అని గుండె మీద చెయ్యేసుకుని ఇది మన జబ్బు కాదు అని తోసిపారేయకూడదు ఎవరైనా. 

ఈ డిప్రషన్, ఆత్రుత, ఆందోళన, ఇవన్నీ ఎందరిని ఆత్మ హత్యలకు ప్రేరేపిస్తున్నాయో మనకు తెలుసు.  ఆయా వ్యక్తులకు ఆత్మీయతా, ఆదరణా,  కరువయ్యి ఈ పనులు చేస్తున్నట్టు సాధారణంగా అనుకుంటాము మనం. కానీ వారిని వేధిస్తున్నమానసిక వ్యాధిని గుర్తించలేము. 

ఆత్మహత్యా యత్నంలో  విఫలమైన మనిషి బ్రతికితే కొన్నాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తామేమో. కానీ దానికి కారణం అయిన  వ్యాధి ని గుర్తించేందుకు ఏమి చెయ్యాలో మనకు తెలీదు. 

ఇదే 'హైద్రబాద్ బుక్ ట్రస్ట్",  డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు అనువదించిన  "మానసిక వైద్యులు లేని చోట " అంటూ మానసిక వ్యాధుల గురించి ఒక గైడ్ లాంటి చాలా మంచి పుస్తకం ప్రచురించింది.  మిగిలిన ఏ ప్రచురణ సంస్థలు  ఇలాంటి బాధ్యతా యుతమైన పనులు చేస్తాయో నాకు తెలీదు.  





ఇప్పుడు షుగర్, బీపీ ల లాగా, క్లినికల్ డిప్రషన్, పెద్దల్లో 'ఆల్జీమర్స్ డిసీస్' సాధారణం అవుతున్నాయి. నలభై దాటితే డిమెన్షియా వచ్చే అవకాశాలున్నాయి. వీటిల్లో కొన్ని ప్రాణాలు తీసే జబ్బులు. వాటి తీవ్రత మనకు తెలుసా ?  మతిమరుపుతో  రోజురోజుకూ ఆరోగ్యం దిగజారుతూ, బాధపడే వృద్ధుల్ని చూసుకునే కుటుంబ సభ్యులు, స్పెషల్ చిల్డ్రన్ ని కన్న తల్లిదండృలూ అనుభవించే మానసిక ఒత్తిడి మనకు తెలుస్తుందా ?  ఇవన్నీ తప్పకుండా చదివి తెలుసుకోవాల్సిన విషయాలు. 

ఇంత కథ చెప్పేసానని అనుకోవద్దు. "నిజ జీవిత కథ కదా, ఏముంది లే" అనుకోవచ్చు. 'నిజమే' 'కల్పన' కన్న ఎక్కువ ఆశ్చర్యకరం!!  ఈ మనిషి మానసిక దృఢత్వం ఎలా సాధించుకుని, ఎక్కువ తక్కువలు లేకుండా, జీవితం పట్ల కృతజ్ఞతా భావంతో ఎంత పాసిటివ్ గా ఈ పుస్తకం  రాసాడో తెలుసుకోవాలంటే చదవాలి. ఏకబిగిన చదివించి చాలా సంతృప్తి నిచ్చిన పుస్తకం ఇది.  నిజంగానే ఓడి గెలిచిన మనిషి కథ ఇది. 

02/11/2021

India's China War - Neville Maxwell



First published in Pustakam.net :  http://pustakam.net/?p=21903 


ఇప్పటి రోజులకి ఇది చాలా చాలా పాతపుస్తకం.  డోకలాం లో సంఘర్షణ మొదలయినప్పుడు టెలివిజన్ న్యూస్ నిండా ఇండియా చైనా బోర్డర్, దానిలో ఏ సార్వభౌమ రాజ్యాల కోసం మనం ఇలా కొట్టుకు పోతున్నామో విశదంగా బొమ్మలు మేప్ లతో, గాల్వాన్ లోయ లో చైనా ఆక్రమణల గురించి విస్తారంగా  హై డెఫినిషన్ సాటిలైట్ చిత్రాల తో  చూసాము. ఇప్పుడు చైనా, భారత దేశం తన సరిహద్దుల్ని  పటిష్టం చేయదలచుకున్నప్పుడల్లా కన్నెర్ర జేస్తుంటుంది. చైనా టిబెట్ నిండా ఆధునిక సౌకర్యాలతో గ్రామాలకు గ్రామాలనే నిర్మించి మనకు గుబులు రేకెత్తిస్తుంటుంది. అభివృద్ధి ఆశ చూపించి, టిబెటన్లను తన వైపు తిప్పేసుకుంది. ఇవన్నీ వార్తల్లో చదువుతాం. 


సరిహద్దు సంఘర్షణల్లో భాగంగా 16 బిహార్ రెజిమెంట్ ఇరవయి మందిని కోల్పోయినాక, అందులోనూ యువ కల్నల్ సంతోష్ కుమార్ మరణం తరవాత, భారతీయుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ప్లాస్టిక్ సామానులమ్మే 'చైనా' బజారులన్నీ 'జనతా బజారు ' లో, 'ఇండియా' బజారులో అయ్యాయి. చైనీస్ బ్యూటీ పార్లర్లూ, మేక్ ఓవర్ చేసుకున్నాయి. చైనీస్ రెస్టారెంట్లు వణికాయి. కానీ మనకు చైనా లేకుండా దీపావళీ, రాఖీ, హోలీ లూ గడవవు, పెన్నులు పాళీలు, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లూ, ఆఖరికి పేరసేటమల్ గోలీలు కూడా చైనా ఉత్పత్తులే . మనదే కాదు. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం, సప్లయి విభాగాల్లో, చవగ్గా ముడి సరుకూ, కీలక వైద్య ఉపకరణాలూ, మందుల ఇండస్ట్రీ లో చైనాది మోనోపోలీ. చైనా ఇప్పుడు ఒక ఎదురు లేని ప్రపంచ శక్తి. 


ఇండియా ముందునుండీ మొత్తుకుంటున్న దాని బెల్లికోస్ ప్రవృత్తి రాను రానూ శృతి మించుతుంది. చైనా విదేశాంగ విధానం ఎలా ఉన్నా, మన లాంటి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని దేశానికీ, చైనా కీ పోలికే లేదు. మన విదేశాంగ విధానం, "నెహౄ  మెతక " విధానంగా తీవ్ర అపనిందల పాలయింది. 1961 లో మన ఓటమి - ప్రపంచం దృష్టి లో మనని ఓ బలహీనమైన మామూలు దేశంగానే మిగిల్చింది. అదే యుద్ధం చైనా ని  ఓ బలమైన రాజ్యంగా పైకి తీసుకొచ్చి నిలబెట్టింది.  దేశం లో ప్రతిదానికీ నెహ్రూ మూలంగానే మనం ఓడిపోయామని, మనకో దూకుడు పద్ధతంటూ ఉండాలని వాదన మొదలయింది. దాని పర్యవసానాలు మళ్ళీ చైనా ఇండియా సరిహద్దు వివాదాల్ని కొత్తగా తెరపైకి తీసుకొచ్చాయి. ఈ రెండు దేశాల వాదనల్లో ఏది నిజం, ఎవరి వైపు న్యాయం ఉందో వివరించే ప్రయత్నం చేస్తుంది ఈ పుస్తకం. 


అసలు ఎందుకూ కొరగాని, మనుషులే జీవించని,  గడ్డి కూడా మొలవని విస్తారమైన 'నో మేన్ జోన్ '  అంటే మానవ మాత్రులే ఉండని  ఆ ప్రాంతం గురించి ఇరు దేశాలకూ ఎందుకు ఇంత పట్టుదల ? ఇరు దేశాల రాజకీయ సంబంధాలలో ఇంత నాటకీయమైన అంశం - ఇరవయ్యో శతాబ్దాన్ని ఇలా ఇంత గా ప్రభావితం చెయ్యడం ఏంటి ? అసలేంటి మన సమస్య ? ఆసియా ఖండంలోని ఈ కొత్త రెండు సామ్రాజ్యాలూ, స్నేహంగా కలిసిమెలసి ఉంటారని, ప్రపంచ రాజకీయాలకు శాంతి  సౌభ్రాత్తృత్వాలకి  చిరునామా గా ఉంటారని లోకం అంతా అనుకుంటూండగా హిందీ చీనీ భాయి భాయి కాస్తా ఒకరి గొంతు ఒకరు పట్టుకుని యుద్ధానికి తెగబడడం ఒక ఆశ్చర్యకరమైన పరిణామమే. 


దీని గురించి భారత దేశంలో The Times పత్రిక లో కరెస్పాండెంట్ గా 1959  ఆగస్టు లో న్యూడిల్లీ  చేరిన (Australian) journalist,  Neville Maxwell [నెవిల్ మేక్స్ వెల్] - 1961 లో చైనా భారత యుద్ధానికి దారితీసిన వివిధ నాటకీయ పరిస్థితుల గురించి తన పత్రికకు రాసిన వందలాది వ్యాసాల్ని   క్రోడీకరించి రాసిన పుస్తకం ఇది. అవి లాంగ్జూ [Longju] లో మొదటి సారి భారత, చైనీయ సైన్యాలు ఆయుధాలతో తలబడిన మొదటి సంఘటన జరిగిన రోజులు. ఈ సంఘర్షణ తరవాత  ఇరు రాజ్యాల మధ్యా సరిహద్దు వివాదం ముదిరి, మూడేళ్ళూ చిలికి చిలికి గాలివానై పెద్ద యుద్ధానికి దారితీసింది.   

నిజానికి ఇది రెండు కొత్త రాజ్యాల మధ్య భూభాగం మీద పట్టు కోసం జరిగిన యుద్ధంగా కనిపించినా దీని వెనక 150 ఏళ్ళ హిమాలయాల రాజకీయ, దౌత్య, సైనిక నేపధ్యం ఉంది. రెండు దేశాల్లోనూ ఈ నేపధ్యం మీద గానీ, ఒకరి అభిప్రాయం  గురించి ఇంకొకరికి కనీస ఒప్పుకోలు కూడా లేదు. ఇండియా కి చైనీయుల వాదన అభ్యంతరకరం, అలానే చైనీయులకి భారత దేశపు వాదన ఒకటి అసలు ఉందన్న భావనే లేదు. రచయిత భారతీయ దృక్కోణం గురించి భారత సైన్యపు పలు రికార్డులు, ఫైల్స్ - ఇంకా మన్ కేకర్ (D.R..Mankekar) లాంటి మిలిటరీ రీసెర్చర్ ల  నుంచీ సేకరించిన ఆధారాల ప్రకారం ఒక రూపాన్నిచ్చే ప్రయత్నం చేసారు. అలాగే పెకింగ్ (నేటి బీజింగ్) కఠిన ఆంక్షలు, అధికారిక మౌనం లాంటి ఇబ్బందులని దాటలేక,   చైనీస్ దృక్పధాన్ని గురించి లండన్ లోని స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ ఎండ్ ఆఫ్రికన్ స్టడీస్ విభాగం నుంచీ సమాచారం సేకరించారు.   


వందేళ్ళ క్రితం రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం, హిమాలయాల పైనుండీ భారత దేశం మీదికి రష్యా సామ్రాజ్య వాద దాడుల నుంచీ రక్షించుకోవల్సి  ఉండొచ్చని భావించింది. దాన్ని చెక్ చేయబోయి, ఎగువ హిమాలయాల మీదుగా చైనా సామ్రాజ్యాన్ని ఎదుర్కొంది. అప్పటికి ఆ ప్రాంతం అంతా చిన్న చిన్న ముక్కలుగా, ఏ స్థిర రాజకీయ వాతావరణమూ లేక, నాయకత్వమూ, సంఘీభావమూ లేక, ఎవరన్నా ఆక్రమించేసుకోగల పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇటు రష్యా, చైనా, బ్రిటీష్ సేనలకి ఈ పనికిమాలిన ప్రాంతం స్ట్రాటజిక్ గా చాలా అవసరంగా ఆక్రమించుకోదగ్గ ప్రాంతంగా  అనిపించింది. 


అటు రష్యా ను ఆపేందుకు ఆఫ్గనిస్తాన్, ప్రస్తుత పాకిస్తాన్ ల మధ్య Captain Henry McMahon ఆధ్వర్యాన నిర్దేశించబడిన  1500 మైళ్ళ పొడవైన  "డ్యూరాండ్ లైన్"  ద్వారా  బ్రిటిష్ వాళ్ళు,  ఆఫ్గన్ ల తో, "మీ జోలికి మేము రాము - మా వైపు మీరూ రాకండి" అని చెప్పేసినట్టయింది.  ఆఫ్గనిస్తాన్ లో గెలిచేది లేదని బాధాకరమైన ఓటమి తరవాత తెలుసుకుంది బ్రిటీష్ సామ్రాజ్యం. ఇదీ ఒక తాత్కాలిక, అస్పష్ట సరిహద్దే,  ఈ డ్యూరాండ్ లైన్ ఇప్పటి పాక్ - 'తాలిబాన్ పాలిత' ఆఫ్గన్ సరిహద్దు వివాదానికి ప్రధాన కారణం. 


అలానే ఇండియా చైనా ల మధ్య తొందరపాటు గా, నిర్లక్షంగా, అస్పష్టంగా సరిహద్దుల్ని గీసి, రెండు రాజ్యాల మధ్యా వివాదానికి కారణమైనదీ బ్రిటీష్ పాలనే.  అదే విధంగా ఏదో విధంగా తన పూర్వానుభవాల దృష్ట్యా . తమని ట్రిక్ చేసేస్తారేమో అని భయపడి, సరిహద్దు సమస్యలని చర్చించేందుకు, ఎప్పటికి ముందుకు రాని, రహస్య దౌత్య విధానాల్నీ పాటించే "చైనా"  సంస్కృతీ ఒక కారణమే. ఒక స్పష్టమైన సరిహద్దును నిర్వచించేందుకు జరిగిన ప్రయత్నాలన్నీ ఆయా కారణాల వల్ల బెడిసి కొట్టడమూ ఒక కారణం. 


మొదటి సిక్ యుద్ధాన్ని 1846 లో గెలిచినప్పటికీ కష్మీర్ లాంటి అప్రాధాన్య ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించకుండ,  కష్మీర్ ని కేవలం ఉత్తర సరిహద్దుని కాపాడే బఫర్ గా మాత్రమేవాడుకునేందుకు వీలుగా, (నిజంగా ఆక్రమించడం ద్వారా మొదలయ్యే ప్రజా వ్యతిరేకత నీ, ఖర్చునీ వదిలించుకునేందుకు కూడా) అక్కడ జమ్ము రాష్ట్రానికి చెందిన డోగ్రా నాయకుడు గులాబ్ సింగ్ కు అధికారాన్ని  అప్ప జెప్పి, తను ప్రేక్షక పాత్ర పోషించింది బ్రిటిష్ ఎంపైర్. ఇలా, ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతానికి (కాశ్మీర్) కు ఒక హిందూ రాజుని కట్టబెట్టడం ద్వారా ఇప్పటికీ ఆరని అగ్ని జ్వాలల్ని మొదలు పెట్టింది. గులాబ్ సింగ్ ని అలా బ్రిటిష్ కనుసన్నల్లోకి తేవడం కూడా ఒక రకంగా బ్రిటిష్ వారి విజయమే. ఎందుకంటే గులాబ్ సింగ్ తక్కువ వీరుడేమీ కాదు. అతను అల్లంత దూరాన ఉన్న  లడాక్ ని జయించుకుని వచ్చిన వాడు. 


లడాక్ పదో శతాబ్దం వరకూ టిబెట్ రాజ్యంలోని భాగమే. ఆ తరవాత అది స్వతంత్రం ప్రకటించుకుంది. 14 వ శతాబ్దంలో ఇస్లామిక్ ముట్టడి లడాక్ ని సమీపించి 16 వ శతాబ్దం వరకూ ఆ ప్రాంతాన్ని అంటిపెట్టుకునుండటం తో అది కూడా ముఘల్ సామ్రాజ్యంలో భాగమైంది.  ముఘల్ పతనం తరవాత కూడా లడకీయులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. స్వయానా వారు "బుద్ధు"లు,  [Lhasa] లాసా సాంస్కృతిక సామీప్యం, రాజకీయ అనిశ్చితి, లడక్ ని మళ్ళీ టిబెట్ సాంప్రదాయాల వైపు లాగింది. ఇది పంతొమ్మిదో శతాబ్దం వరకూ సాగింది. అది కాస్తో కూస్తో మానసికంగా టిబెట్ కు 'లొంగిన ప్రాంతం' అయి, 'విధేయంగానే' ఉండేది. టిబెట్ లో దలై లామా మాట ఎలా వేదమో, లడాక్ లో కూడా అదే ఆజ్ఞ అయేది. కానీ అప్పటికి టిబెట్ చైనా అంతర్భాగం. 


1854 లో గులాబ్ సింఘ్ లడాక్ మీదికి దండెత్తి, దాన్ని గెలిచిన తరవాత అతని సేన అక్కడితో ఆగకుండా టిబెట్ మీదకి కూడా యుద్ధానికెళ్ళింది. 1841 కల్లా టిబెట్ సిక్ రాజుల ఆధిపత్యంలోకి వచ్చింది. 'రాకాస్ తల్', 'మానస్ సరోవర్' లాంటి పవిత్ర తటాకాలు కూడా సిక్కుల అదుపులోకి వచ్చాయి. మేలు రకం ఉన్ని ఉత్పత్తులు, విశాలమైన భవ్య హిమాలయాలు అదుపులోకి వచ్చాక కూడా కేవలం ఒక తప్పుడు నిర్ణయం కారణాన సిక్కు సైన్యం భయానక మైన చిక్కుల్లోపడింది. చలికాలం టిబెట్ లోనే గడపడలన్న వారి సైన్యాధికారి తీసుకున్న నిర్ణయం, వారికి ప్రాణాంతకమైంది. సరైన వసతులు లేకుండా 12000 అడుగుల ఎత్తులో, మంచు సముద్రంలో దుర్భర చలి పరిస్తితుల మధ్య ఆ వేలాది సైన్యం తీవ్ర ఇబ్బందులు, తరవాత ఒక్కొక్కరుగా మొత్తం సైన్యమే మృత్యువాత పడింది.  


అప్పటికి, టిబెటన్ లు బలగాల్ని సమీకరించుకుని వచ్చి తిరిగి లడాక్ ను ఆక్రమించుకునే దాకా వచ్చింది.  ఇక ఆ ఓటమి తప్పని పరిస్థితుల్లో సిక్కు సైన్యము, టిబెట్ సైన్యమూ, ఒక ఒప్పందానికి వచ్చాయి. 'ఒకరి రాజ్య అధికారాన్ని ఒకరు గౌరవించుకుంటామని, ఇక పోరు పేరున ఒకరితో ఒకరు తలపడమని' ఆ ఒప్పందం.  దీనిలో ఇరు సైన్యాలూ కూడా సరిహద్దు ఇదీ అని నిర్ణయం ఏదీ తీసుకోలేదు.  టిబెటన్ లూ, డోగ్రా వారూ, తమ తమ పరిధుల్లో తాము ఇరుగు పొరుగు వారమే అయినా ఒకరికొకరం దగ్గర ఎన్నటికీ కామని తెలుసుకున్న సంఘటన అది. రెండు ప్రాంతాల మధ్యా స్పష్టమైన సరిహద్దేదీ లేదు. మధ్య లో ఉన్న "ఎవరూ ఉండని ప్రదేశమూ " ఇతరత్రా బండ గుర్తులూ, ఎవరికి వారు నిర్ణయించుకున్నవే తప్ప పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణీత సరిహద్దులు కావు.  ఇక్కడ ఈ గులాబ్ సింగ్ లడక్ ప్రస్థానం,  టిబెట్ యుద్ధాన్ని ఓడిపోవడాన్నీ బ్రిటీష్ సామ్రాజ్యం చాలా జాగ్రత్త గా పరిశీలించి, ఒక వేళ చైనా దండెత్తి (టిబెట్ మీదుగా) వస్తే, గులాబ్ సింగ్ అడ్డుకోకలడని ఆశించి, కష్మీర్ పై అధికారాన్ని అప్పగించింది. 


కానీ తదనంతరం, అమ్రిత్సర్ ఒప్పందం ఒకటి మాటాడి, గులాబ్ సింగ్, [ప్రతీకారంతో శక్తి యుక్తుల్ని సమకూర్చుకుని లడాక్ పై  ఇంకోసారి దాడి చెయ్యకుండా]   బ్రిటీష్ వారి అనుమతి లేకుండా సామ్రాజ్య విస్తరణ  చెయ్యకూడదని అతని చేతుల్ని కట్టి పడేసారు. అదే విధంగా గులాబ్ సింగ్ సైన్యం టిబెటన్ లతో చేసుకున్న ఒప్పందం ఆధారంగా సరిహద్దు వివాదాలన్నిటినీ కూర్చుని చర్చించేసుకుని పరిష్కరించేసుకుందామని చైనా కు కబురు పెట్టారు.  అప్పటికి పెకింగ్ లో బ్రిటీష్ వారి ఆఫీసు లేదు. అసలు చైనీయులని కాంటాక్ట్ చెయ్యడమే గగనం. వారి నుండీ సమాధానం దొరకడమూ దుర్లభమే. కాబట్టి వీళ్ళకి అతికష్టం మీద చైనా నుండీ దొరికిన సమాధానం " లడాక్ సరిహద్దులు పూర్తిగా పరిష్కరించబడినవనీ, వాటిలో అస్పష్టత ఏమీ లేదని - ఇందులో చైనా వచ్చి మాటాడాల్సిందేమీ లేదనినూ.."   దానితో ఏ చర్చా జరగలేదు. చైనా ఉద్దేశ్యంలో తనదైన ప్రాంతమంతా తనదే. ఇంకోరు ఇంకో మాట అనడానికి వీల్లేదంతే. 


పైగా, ఆ తరవాత ఇంకో వివాదమూ తెర మీదికొచ్చింది. అసలు గులాబ్ సింగ్ తో ఒప్పందం చేసుకునే హక్కు టిబెటన్లకి లేదనీ, వారు కేవలం చైనా తరఫున రాయబారానికొచ్చారే  గానీ, సంధి చేసుకునే అధికారం వాళ్ళకి చైనా ప్రభుత్వం ఇవ్వలేదనీ!!!   ఇదంతా మిగిల్చిన గందరగోళం మధ్య, ఇండియా, చైనాలు అసంబద్ధమైన, అస్పష్టమైన సరిహద్దు కారణంగా, ఇప్పటికీ యుద్ధ వాతావరణంలోనే ఉన్నారు. దానికి తోడు, ముందుచూపు లేని నాయకత్వం, లౌక్యం లేని దుష్ప్రచారం, అగ్నికి ఆజ్యం పోస్తూనే ఉన్నాయి.   


గులాబ్ సింఘ్ ఇంకో స్పష్టమైన విజయం అందుకోకుండా ఆపిన బ్రిటీష్ ప్రభుత్వం, కేవలం దౌత్యంతో, సరైన సరిహద్దుని నిర్ణయించడం ద్వారా చైనా ను బౌండరీ కవతలే ఉంచేందుకు చేసిన ప్రయత్నాలూ బెడిసి కొట్టాయి.  సరిహద్దు నిర్ణయించేందుకు గాను, పాంగోంగ్ లేక్ నుండీ కారకోరం శ్రేణి వరకూ ఉన్న ప్రాంతాన్నంతటినీ, సర్వే ఆఫ్ ఇండియా కు చెందిన అధికారి WH Johnson పర్యేవేక్షించారు. ఈయన 1865 లో ఖోటాన్ ని సందర్సించి, అక్కడి నుండీ అక్సాయ్ చిన్ (Aksai chin -  desert of white stones) వరకూ నడిచి,  సర్వే చేసారు. సముద్ర మట్టానికి 17000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆక్సాయ్ చిన్ లో గడ్డి కూడా మొలవదు. ఎవరూ నివసించరు. కారకోరం పర్వత శ్రేణికీ, కుయెన్-లున్ శ్రేణికీ మధ్య ఉన్న ఈ ప్రాంతం రెండు దేశాల మధ్యా అతి పెద్ద వివాదానికి దారి తీసింది. దీన్ని భారత దేశపు మేప్ లో చూపించడం చైనా కు తీవ్ర అభ్యంతరకరం.  ఈ విషయం పై బ్రిటీష్ అధికారులే భిన్న అభిప్రాయాలతో కొట్టుకున్నారు. ఇవి దౌత్యపరంగా చైనా కు అనుకూలాంశాలు.  

ఈ లోగా చైనా లో తలెత్తిన తిరుగుబాట్లూ, విప్లవాలూ చైనా ని మరింత కఠినంగా మార్చేసాయి. ఈలోగా రష్యా కూడా ఈ ప్రాంతంపై, చైనా తాలూకూ వీక్ లింక్స్ మీదా దృష్టి పెడుతుందేమో అన్న  భయాలు  కూడా బ్రిటిష్ విధానాల్ని ప్రభావితం చేసాయి. 1873 లో బ్రిటన్ ఆశించినవిధాన , కారకోరం నుండీ చాంగ్చె-హ్నొ లోయ దాకా ఒక లైన్ లో సరిహద్దు సరిగ్గా నిర్దేశిస్తూ లండన్ లో ఓ మేప్ సిద్ధం కూడా అయింది.  కానీ అసంఖ్యాక యుద్ధాల్లో మునిగిన జార్ ప్రభుత్వం బ్రిటిష్ దాడిని ఊహిస్తూ, రష్యా, చైనా, భారత సరిహద్దుల్లో చేపట్టిన కొన్ని చర్యలు బ్రిటన్ ను తొందరపాటు దిశగా నెట్టాయి. 

1889 లో లార్డ్ లాండ్స్డౌన్ అన్న మాట ఇది. 

The country between Karakoram and Kuen Lun Ranges is, I understand, of no value, very inaccessible, and not likely to be coveted by Russia.  We might, I should think, encourage the Chinese to take it, if they showed any inclination to do so.  This would be better than leaving a no-man's land between our frontier and that of China.  Moreover, the stronger we can make China at this point, and the more we can induce her to hold her own over the whole Kashgar-Yarkand Region, the more useful will she be to us as an obstacle to Russian advance along this line. 

1860 చర్చల్లో (& in Treaty of Aigum, 1858, Peking 1860)  రష్యా కు కొంత మధ్య ఏషియా లో భూభాగాన్ని కోల్పోవాల్సి వచ్చిన చైనా, ఆ తరవాత చర్చలన్న మాట కే వణికిపోవడం ప్రారంభించింది.  ప్రత్యర్ధులు తనని బలహీనంగా చేసి ఎలాగోలా తమ ప్రాంతాల్ని కొట్టేస్తారేమో అని దాదాపు అన్ని దేశాలతోనూ వివాద పరిష్కారం కోసం ప్రయత్నించకుండా పారిపోతూండడం, అడ్డదిడ్డమైన వాదనలు చెయ్యడం ద్వారా వివాదాలు పెచ్చరిల్లడానికి కారణం అయింది చైనా.  మొత్తానికి రష్యా, బ్రిటన్ లు కన్నేసిన తన దక్షిణ సరిహద్దుని రక్షించుకునేందుకు 1880 లలో నడుం బిగించింది చైనా.  వాళ్ళతో 1890 లో మాటాడ్డానికి వెళ్ళిన అధికారితో తమ సరిహద్దు కారకోరం నుంచీ ఇండస్,  టారిం బేసిన్  ల వాటర్ షెడ్ ప్రాంతాల వరకూ అని మౌఖికంగా చెప్పింది. 

అదే విధంగా 1892 లో కారకోరం నుంచీ తను నిర్దేసించిన భాగం వరకూ భౌతికమైన గోడని సరిహద్దు గా నిర్మించింది. దీన్ని బ్రిటీష్ ప్రభుత్వం స్వాగతించింది. ఇక్కడ చైనా నిర్దేశ ప్రాంతం నుండీ 'నో మేన్ జోన్' లోకి చొచ్చుకొచ్చినా అది పనికిరాని ప్రదేశమంటూ పట్టించుకోలేదు. అలా కారకోరం పాస్, రెండు దేశాలూ ఒప్పుకున్న సరిహద్దు అయింది. కానీ ఈ సరిహద్దు వంకరటింకరగా ఉండడం మళ్ళీ వివాదాస్పదమైంది. దానితో చైనా తరఫున ఒక అధికారి పరిశీలనకు పంపబడ్డాడు. ఆయన కాస్తా 'కారకాష్' నది నుండీ 'హాజి లంగర్' (WH Johnson  ఆక్ సాయి చిన్ దర్సించినపుడు అప్పటి ఖాటోన్ రాజు హజి హబీబుల్లా ఖాన్ పేరున నిర్మించిన సత్రం)  దాక వెళ్ళి అక్కడినుంచీ ఆక్సాయ్ చిన్ వైపు తిరిగి అక్కడినించీ 'లింగ్జీ తాంగ్' - అలా ఇంకా ముందుకు చాంగ్ చెన్మో నది దాకా వెళ్ళొచ్చి అదంతా తమదే అన్నాడు. 


అలా 1890 ల కల్లా, కారకోరం శ్రేణి నుంచీ- చాంగ్ చెన్మో నది వరకూ, ఇంకా ఆక్సాయ్ చిన్ ప్రాంతమూ తమదేనని చైనా వాదన వినిపించడం మొదలయింది.   అలా ఆక్సాయ్ చిన్ తమదంటే తమదని బ్రిటన్, చైనాలు కొట్టుకోవడం మొదలయింది. మొత్తానికి బ్రిటీష్ పెద్దమనుషులే సగం సగం రొట్టె పంచుకున్నట్టు, 'అక్సాయ్ చిన్' కొంత భాగం బ్రిటిష్ ఇండియాలోనూ, కొంత భాగం చైనా లోనూ ఉండేట్టు సర్దుబాటు చెయ్యబోయారు. సాధారణంగా ఒప్పందాలలో / చర్చల్లో పాల్గోవడం చైనాకి అలవాటు పోయింది కాబట్టి, ఈ సర్దుబాటు కి చైనా ఒప్పుకోలేదు. ఇలా వివిధ కాలాల్లో, ఒకదాని వెంట ఒకటి జరిగిన పరిణామాలు చైనా ప్రతీ ప్రాంతమూ తనదే అని చెప్పుకునేందుకు (కాదని చెప్పే స్పష్టమైన ఒప్పందం ఏదీ రాతపూర్వకంగా లేదు కాబట్టి) సాధ్యం అయింది. 

ఇలా లండన్ లో సాధికారక పత్రాలు, మేప్ లూ, వివిధ దశల్లో చర్చల్లో పాల్గొన్న అధికారులూ, వ్యంగ్య భాషణలూ, అంతర్గత నోట్ లూ సమగ్రంగా పరిశీలించడమే కాకుండా, భారత్ దేశాన్ని బ్రిటీష్ పాలకులు వీడాక,  ఈ పుస్తక రచయిత ,  భారతీయ సైనిక అధికారులతోనూ, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలోనూ ఉన్న పత్రాలను కూడా పరిశీలించి నేపధ్యాన్ని సృష్టించాడు. ఈ పుస్తకం లో  ఇంకో చాప్టర్ పూర్తిగా పెకింగ్ దృక్కోణం లోంచీ, ఈ వివాదం గురించి చైనా అనుకోలు, పట్టుదలా ల గురించి కూడా రాసాడు.  పైగా స్వాతంత్రం వచ్చాక టిబెట్ అంతర్గత వ్యవహారమైన దలైలామా విషయంలో భారత్ సాయం చెయ్యడం - చైనా అస్సలు క్షమించలేకపోయింది. 

మామూలుగా అలోచిస్తే, మన ప్రభుత్వం మీద తిరగబడిన వ్యక్తి ని వేరే దేశం ఆదుకుంటే, మనిద్దరి మధ్యా స్నేహ బంధం నిలుస్తుందని ఎలా ఆశిస్తాం ? అదే జరిగింది.  ఈ పుస్తకం ఇలా Shimla లో జరిగిన మొదటి - ఆఖరి చర్చలూ,  ఒప్పందం, McMahon Line తో కలిపి,  ఒక్కటి కూడా వదలకుండా, అప్పటి సంగతులని రికార్డ్ చేసి - ఇండియా చైనా ల దౌత్య / యుద్ధ పోరాట నేపధ్యాల్ని స్పష్టంగా చెప్తుంది. ఈ పుస్తకం ఎంత పాప్యులరో అంత అన్ పాపులర్ కూడా. దీన్ని భారత దేశాన్ని (For being extremely critical about Indian failure in this war)  గుడ్డిగా విమర్శించిన పుస్తకం గా అభివర్ణిస్తారు కొందరు. [దీనికి వ్యతిరేకంగా China's India War కూడా వచ్చింది]  కానీ దీనిలో సాధికారిక సమాచారం ఒక జర్నలిస్ట్ కోణంలో రిఫరెన్సుల ఆధారంగా ఉండడం వల్ల 'అసలు నేపధ్యం' తెలుసుకునేందుకు  చాలా ఉపయోగకరమైన పుస్తకం అని చెప్పొచ్చు. 

పుస్తకం లో నచ్చిన వాక్యాలు చాలా చాలా ఉన్నాయి. ఇవి మచ్చుకు:

 

"You listen too much to the soldiers. you should never trust experts. If you believe the doctors, nothing is wholesome.  If you believe i n theologians, nothing is innocent ; if you believe the soldiers, nothing is safe'  - London's advice to Governor General of India (Context : apprehensions about Russian occupation from Northern tip of India)

...................


Now, it is a question of fact whether this village or that village or this little strip of territory is on their side or on our side.  Normally wherever these are relatively petty disputes, well, it does seem rather absurd for two great countries.. immediately rush to each other's throats to decide whether two miles of territory are on this side or on that side, and especially two miles of territory in the high mountains, where nobody lives. 

But where national prestige and dignity is involved, it is not the two miles of territory it is  the nations dignity and self respect that becomes involved. and therefore this happens 

- Jawaharlal Nehru, Lok Sabha, Sep 4, 1959

......................

Today's reality : 

If the Chinese were ever to be driven off the Aksai Chin plateau, it could only be after they had been defeated militarily elsewhere.  But the overall superiority in numbers of the Chinese Army and their advantages in movement on the Tibetan Plateau make it likely that the Indians can never hope to mount a successful offensive action anywhere on the northern borders - so long as China's central power is unbroken. 

----------------

The Chinese, for their part, showed no interest in improving relations with India. Chinese maps continue to ignore the McMahon Line and show the eastern boundary with India running along the edge of the Brahmaputra Valley, just as India's maintained the claim to Aksai Chin ; presumably however, Peking's long-standing offer to negotiate a boundary settlement on the basis of the status quo when India is ready to do so still stands.  But thus to go back to the beginning would mean India's tacit admission of error, and recantation of the deeply cherished belief that in 1962 she was innocent victim of unprovoked Chinese aggression. That will not be easy. 

(Obviously, Indians refused to agree with this book  ఈ వివాదాస్పద రచయిత మాత్రం 2014 లో  నెహ్రూనే యుద్ధానికి పిలుపునిచ్చాడనీ, చైనా కాదనీ, ప్రకటించాడు.   )

---------------

నేను ఈ పుస్తకం చదువుతుండగా, హిందూ లో 'Fifty Years Ago ' శీర్షికన ఈ పుస్తకం గురించి నాలుగు ముక్కలు.  [ఎంత వ్యతిరేకత !!] 


........................


ఈ పుస్తకానికి / విషయానికీ వ్యతిరేకంగా భారత దేశాన్ని పూర్తిగా సమర్ధిస్తూ 2018 లో వచ్చిన పుస్తకం.


***

25/10/2021

Widows of Vidarbha, Making of Shadows - Kota Neelima


Widows of Vidarbha, Making of Shadows - Kota Neelima


2001 నుండీ 2014 వరకూ మహరాష్ట్ర లో ని విదర్భ ప్రాంతం లో చోటు చేసుకున్న కొన్ని రైతు ఆత్మహత్యలని పరిశోధిస్తూ 'కోట నీలిమ' రాసిన పుస్తకం ఇది.  'పి సాయినాథ్'  రాసిన  'Everyone likes a good drought" తరవాత వ్యవసాయం, ప్రభుత్వ విధానాలు, రెడ్ టేప్, గ్రామాలు, రైతుల గురించి నేను చదివిన పుస్తకం ఇదే.   

కరువు, తీవ్రంగా కొన్ని జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. కరువు కొన్ని ఉసురుల్ని తీస్తుంది. పదే పదే పునరావృతమవుతుండే కరువు, వర్షాభావ పరిస్థితులు, తీసుకున్న ఋణాలు తీర్చలేక పోవడం, కొండల్లా పెరిగిపోతుండే అప్పులు, ముంచెత్తేసే డిప్రెషన్, నిస్సహాయత - వీటన్నిటిలో మహారాష్ట్ర విదర్భ ప్రాంతపు రైతులు చాలా అగచాట్లు పడ్డారు. ఎన్నో రైతు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. ఈ ఆత్మహత్యలు, దేశము, ప్రభుత్వమూ, మన బాంకింగ్ వ్యవస్థా, రైతు రుణ మాఫీ పథకాల డొల్లతనాన్నీ పెద్ద ప్రశ్నల ఊబిలోకి నెట్టేసాయి. 

ఈ పుస్తకం వాటిని ఒకసారి తరచి చూసే ప్రయత్నం చేస్తుంది. కేవలం 2001 నుండీ 2014 వరకూ విదర్భ లో ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న 18 ఆత్మహత్యల్నే దీనిలో చర్చించారు. అంటే బాధిత కుటుంబాలు 18. ఆయా రైతుల విధవలు - 26 నుండీ 63 ఏళ్ళ వయసు మధ్య లో ఉన్న మహిళలు ఎదుర్కోవాల్సొచ్చిన కఠిన పరిస్థితులు, ప్రభుత్వ పరిహారం కోసం ఎదుర్కోవలసిన ప్రశ్నలు, నిరూపించాల్సిన నిజాలు, నింపాల్సి వచ్చిన ఫారాలు, వాటిలో నిజ నిర్ధారణ కోసం ఎదుర్కొన్న్న అసందర్భ ప్రశ్నలు, అన్నీ.  

రైతు ఆత్మ హత్య చోటు చేసుకున్నాక, ఈ విధవలు ఒక శూన్యమైన భవిషత్తులోకి ఎలా ప్రవేశించారు ? వాళ్ళకి దొరికిన పరిహారం ఎంత ? ఎలా ఆ పరిహారం దొరికింది ? వీళ్ళ పిల్లలు ఏ కష్టాలు ఎదుర్కొన్నారు ? చదువు కట్టిపెట్టి బాల్యంలోనే రైతు కూలీలుగా మారిన వారెందరు ? వీరిలో చదువుకున్న భార్యలూ, చదువు లేనివారు, పరిహారం కోసం , కుటుంబ పోషణ కోసం, వీళ్ళు ఇప్పటికీ చేస్తున్న యుద్ధం ఏమిటి ? పురుషుల కన్నా ఈ కఠిన వ్యవసాయ ఆధారిత ఆదాయాల్ని, ఆర్ధిక వ్యవస్థల్నీ ఎలా సంభాళిస్తూ వస్తున్నారు అనేదే ఈ పుస్తకం చర్చించిన విషయం. 

ఆర్ధిక వేత్తలు డీ. నరసింహా రెడ్డి, శ్రీజిత్ మిశ్ర లు,  1980 ల నుంచీ మనం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్షం చేయడం వల్లనే  ఈ రైతు ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని వాదిస్తారు. మొదట ఈ సమస్య ఎలా మొదలైందీ అని తెలుసుకోవాలంటే మన దేశపు వ్యవసాయ రంగంలో పలు దఫాలుగా చోటు చేసుకున్న మార్పుల్ని గమనించాలి. 

మొదటి దశ లో 1950, నుండీ 60 ల మధ్య లో భూ సంస్కరణలు, నీటి పారుదల, వ్యవసాయ రుణాల మీద దృష్టి కేంద్రీకరించాం. కానీ ఈ పనుల్లో ఏకీకృత విధానం లేదా సమానత లాంటిదేదీ సాధించలేదు.  రెండో దశ లో హరిత విప్లవం చోటు చేసుకున్నా, పంపిణీ, ఆర్ధిక, సామాజిక ప్రగతీ రంగం మీదికి రానీకుండానే ఉండిపొయింది. ఎక్కువ దిగుబడి మాత్రమే వ్యవసాయం సాధించిన విజయానికి ప్రాతిపదికగా చూడబడింది. దాని వెనకున్న సాధక బాధకాలు ఎవరూ పట్టించుకోనేలేదు.  ఆఖరి దశలో గ్లోబలైసేషన్, సరళీకృత విధానాలూ, అసమానతలను ఎక్కువ చేసాయే తప్ప, తగ్గించలేదు. సరిగ్గా ఈ సమయంలోనే ప్రభుత్వ విధానాలు వర్షాలు సమృద్ది గా కురిసే ప్రాంతాలలో కూడా వ్యవసాయాన్ని ఓ కష్టమైన రంగంగా మార్చేసాయి. దానికి తోడు ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు లేవు. ప్రభుత్వం కూడా వ్యవసాయానికి ఊతమిచ్చే ప్రాజెక్టులు ఏవీ కట్టలేదు. అడుగంటిన భూగర్భ జలం, కురియని వానలు, చేతికి రాని పంటా - పెరిగిపోతున్న రుణ భారం, ముఖ్యంగా ప్రైవేటు రుణాలు,  ఈ ఉచ్చు లోంచీ బయటపడేందుకు చావొక్కటే మార్గంగా  మిగిలింది బీద రైతుకు. 


విదర్భ లో ఈ స్టడీ చెయ్యడానికి కారణం : ఆత్మహత్యల నిష్పత్తి, ఈ ప్రాంతం వర్షాభావ ప్రదేశం కావడం, చిన్న, సన్నకారు రైతులకు సరైన సదుపాయాలు కలగజేయకపోవడం, రాజకీయ నిర్లిప్తత. ఈ రాజకీయాలు, రైతు శవాలను, ఆధారంగా చేసుకుని పరస్పర నిందారోపణలకీ, నాయకత్వాల్ని మార్చుకునేందుకూ పనికొచ్చాయే తప్ప, రైతుల తరఫున ఆలోచించడానికి సరిపోలేదు. రైతు రుణ మాఫీల్ని ప్రభుత్వ బాంకులు చాలా హీనంగా చూసాయి. అంతకు ముందే తీర్చని పంట రుణం ఉన్న రైతు ప్రభుత్వ బాంకు ని సంప్రదించే వీలు లేకపోయింది. ఎలాగూ మాఫీ అవుతుందని రైతులు రుణాలు చెల్లించడం లేదని సాక్షాత్తూ SBI (Arundhati Bhattacharya) ఆరోపించింది. ఒక పంట పోయాక, ఇంకో పంట వేసేందుకు బయటి అధిక వడ్డీలకు రుణాలిచ్చే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వచ్చింది. అది ఒక పెద్ద ఊబి. 


చివరికి రాజకీయంగా, సామాజికంగా ఓడిపోయిన ఈ పద్ధెనిమిది రైతు కుటుంబాలూ, కుటుంబ పెద్దని కోల్పోయాయి. కొందరు అంతవరకూ బానే ఉండి, భార్యలకూ, తల్లిదండృలకూ, పిల్లలకూ అనుమానం రాకుండా గడిపి, ఏ పొలానికో వెళ్ళి ఏ  పురుగుమందో తాగే వారు. కొందరు ఇంటి దూలానికే ఉరి వేసుకున్నారు.  మొదట ఈ ఘోరాన్ని అర్ధం చేసుకునేందుకు, ఈ వార్త ని స్వీకరించేందుకే రైతు భార్యలకు చాలా కష్టమైంది.  అంతవరకూ జీవితంలో దన్ను గా ఉన్న్న వ్యక్తి ఇలా నిస్సహాయ స్థితిలో మరణించడం, దాన్ని ఆపేందుకు తాను పనికిరాలేకపోవడం / ఆ కష్టాన్ని నేను వినలేకపోయానా, అతనికి ధరియాన్నివ్వలేకపోయానా అనే ఆ గిల్ట్ నుండీ బయటపడడం ఓ భయానక స్మృతి.   కొందరికైతే వాళ్ళ కుటుంబాలకిన్ని కష్టాలున్నాయనే తెలీదు.  రేపటిని ఎలా ఎదుర్కోవాలో, చేతిలో చిల్లిగవ్వ లేకుండా పిల్లల్నెలా సాకాలో, ఎక్కడ పని వెతుక్కోవాలో, కూలబోతున్న తమ మట్టి ఇళ్ళను ఎలా రక్షించుకోవాలో తెలీనే తెలీదు. 


నిబంధనల ప్రకారం, పరిహారం కోసం జరిపే విచారణ లో ఆయారైతులు నిజంగా అప్పుల పాలై, ఏ మతిభ్రమణమూ లేకుండా, (డిప్రషన్ లాంటి వ్యాధులు ఏవీ లేవని) కేవలం ఆర్ధిక ఇబ్బందుల వల్లనే చనిపోయారని నిరూపించుకోవాలి.  ఈ స్టడీ ఆయా జిల్లాలలో ఆయా గ్రామాలలో జరిగిన అన్ని ఆయా విచారణ నోట్స్ లనూ క్షుణ్ణంగా పరిశీలించింది. దాదాపు 43 ప్రశ్నలున్న ప్రశ్నావళి ని.. రైతు పేరు, వయసు, చిరునామా, ఎక్కడ, ఏరోజు చనిపోయారో, ఆ వివరాలు, మృతి కి కారణాలు, పోస్ట్ మార్టం లో తెలిసిన వివరాలు, రైతుకున్న పొలం వివరాలు, పంట ఎంత కాసేదో, ఆ వివరాలు, మిగిలిన కుటుంబ సభ్యుల పొలాల వివరాలు (సాధారణంగా ఏ పొలాలన్న, తండ్రి, తమ్ముళ్ళ పొలాలనానుకుని ఉండటం లాంటి వాటి వల్ల), చనిపోయిన రైతు మానసిక, సామాజిక పరిస్థితి వగైరా వివరాలు. ఇవన్నీ నిరక్షరాస్యురాలైన భార్య నింపాలి. 

వచ్చిన నష్టపరిహారం లక్ష రూపాయల్లో 75% పిల్లల పేర ఫిక్స్డ్ డిపాసిట్ వేసి, ఏ పాతిక వేలో భార్య చేతికి ఇచ్చేవారు. ఇందులో ఈ డబ్బు రైతు కుటుంబానికే అల్టిమేట్ గా ఉపయోగపడాలని సదుద్దేశ్యమే ఉన్నా ఆ చేతికొచ్చిన పాతికవేలూ ఏ రుణ దాత కో వెళ్ళిపోయి, పరిస్థితి మొదటికే వచ్చేది. 


స్టడీ జరిగిన కాలం లో మొత్తం 2014 నుండీ 2017 వరకూ పలు దఫాలుగా ఆయా కుటుంబాలను కలవడం వల్ల వయసులో పిల్లల ఎదుగుదల తప్ప వారి ఆర్ధిక సామాజిక పరిస్థితుల్లో పెద్ద మార్పు రాకపోవడం గమనించారు. ఇన్నేళ్ళలోనూ కొన్ని మార్పులు అంటే పత్తి లాంటి ఉత్పత్తుల కనీస మద్దతు ధర పెరగడం, మహిళలు వ్యవసాయం చేయడం/కూలీలు గా దినసరి వేతనానికి పనిచేయడం,  వారి పిల్లలు ఇన్ని కష్టాలకు కారణమైన వ్యవసాయాన్ని ఓ ఉపాధి మార్గంగా ఎంచుకోకుండా ఉండేందుకే ప్రయత్నం చేస్తామనడం లాంటివి జరిగాయి. ఆడపిల్లల పెళ్ళిళ్ళకి పరిహారం సొమ్ముని ఉపయోగించుకున్న తల్లులూ ఉన్నారు. కొందరికి ఈ ప్రభుత్వ మాఫీల సంగతీ, పరిహారాలని ఎలా క్లెయిం చేయాలో తెలీనే తెలీదు. 


వీళ్ళలో 12 వ తరగతి వరకూ చదువుకున్న మహిళలు కేవలం నలుగురే. చదువు లేని వాళ్ళు ప్రతి చిన్నదానికీ ఇతరులపై ఆధారపడాల్సొచ్చింది. భర్తలు వదిలి వెళ్ళిన చిన్న చిన్న కమతాల్నీ, పొలాల్నీ సాగు చెయ్యడం తప్ప వీరికింకో దిక్కు లేదు. అయితే అప్పటి దాకా ఇంటికి వచ్చిన అతిధికి టీ ఇచ్చే స్వతంత్రం అన్నా లేని కోడళ్ళు,  భర్త చనిపోయాక తప్పనిసరి గా అధికారాన్నిలాకోవాల్సొచ్చింది.  అది వాళ్ళ బాధ్యత. 

ఈ కుటుంబాలలో 52 మంది పిల్లలున్నారు. వీళ్ళలో పెద్దవాడు ఒక్కడు పీ.జీ చదువుతున్నాడు. చిన్నవాడు 4 వ తరగతి. కొందరికి వాళ్ళ నాన్న గుర్తే లేడు. కొన్ని కుటుంబాలకి ఆయా రైతుల జ్ఞాపకాలేవీ మిగల్లేదు. ఎప్పటివో ఒకటీ అరా ఫోటోలే తప్ప.  కొందరు పిల్లలు తండ్రి ఆదరణ, దన్ను కోల్పోయి, అనాధలయిపోయారు. మానసికంగా వారికి తగిలిన దెబ్బ చిన్నది కాదు. 

తల్లే వారికిప్పుడు తల్లీ తండ్రీ. కొందరు పిల్లలు బలవంతాన పెద్దయిపోయి బాధ్యతలు పంచుకోవాల్సొచ్చింది. వీళ్ళలో కేవలం ఇద్దరు ఆడపిల్లలు మాత్రం గ్రాడ్యుఏషన్ చెయ్యడానికి ఎంపికయ్యారు. ప్రభుత్వ పథకాలు వాళ్ళకి 18 ఏళ్ళ దాకానే చదువు ఖర్చు కి పనికొస్తాయి. ఆ పై చదువుకోవాలంటే వారికింక సొంత ఖర్చే. అది భరించగలే బాక్ గ్రౌండ్ ఉండదు. వారి నెల ఆదాయం కనీసం పది వేల రూపాయలన్నా ఉండదు. దీనిలోనే అన్ని ఖర్చులూ గడవాలి. మధ్య లో వచ్చే అత్యవసర ఖర్చులకు, వైద్య ఖర్చులకూ మళ్ళీ వెతుక్కోవల్సిందే. 


చాలా ప్రభుత్వ పథకాలు, రుణ మాఫీ స్కీములూ కొన్ని కేటగెరీలకే వర్తిస్తూ, నిజమైన లబ్దిదారులకు చేరక ఫెయిల్ అవుతున్నాయి. రాజకీయంగా శక్తి వంతమైన నినాదాలు గా మాత్రమే మిగిలిన , రైతు సంక్షేమ  పథకాల ప్రకారం ఈ పద్ధెనిమిది కుటుంబాలలో దేనికీ రుణ మాఫీ లభించలేదు. ప్రతి పనికీ వంద నిబంధనలు, BPL, APL కార్డు దారుల మధ్య అంతరం, ప్రతి కార్డు పొందేందుకూ సవాలక్ష అడ్డంకులు,  ఏ వాలంటీరూ ఆయా సంక్షేమ పథకాల గురించో, ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన విధానాల గురించో వీళ్ళని కలిసే విధానం కూడా ఎక్కడా లేదు. వీళ్ళ పాట్లు వీళ్ళే పడనీ అని గ్రామ వ్యవస్థ కూడా పట్టించుకోకుండా వదిలేసినట్టే.  అందువల్లనే నేమో ఈ రైతు విధవలు రెక్కల కష్టాన్నే నమ్ముకున్న్నారు. ఒకవేళ ఈ పథకాల ద్వారా ఎవరైనా లాభ పడ్డా, అదీ వీళ్ళ పట్టువదలకుండా ప్రయత్నించే తత్వం వల్లనే. 

సమాజంలో ఎవరికీ కనిపించకుండా తమ పని తాము చేసుకుని అజ్ఞాతంగా ఉండిపోయే సగటు మహిళ ఇలా బయటికి వచ్చి, ఎవరి దన్నూ లేకుండా అన్నిటినీ సాధించుకురావడం, పిల్లల్నీ, కుటుంబాన్నీ నిలబెట్టడం కూడా అజ్ఞాతంగానే జరగాలని గ్రామ సమాజం ఆశిస్తుంది. కొందరు మహిళలు కాస్త వారి వారి పోరాటాల ఫలితంగా బయటకు కనిపిస్తుంటారు. వాళ్ళ గొంతు వినిపిస్తుంటుంది.   

కొందరు ప్రజల్లో మంచి పేరున్నా గ్రామ పంచాయితీ ఎన్నికల్లో నిల్చోడానికి కూడా ఇష్టపడరు. చప్పుడు చేసే మహిళలకు, అజ్ఞాతం నుండీ బయటకు తొంగి చూసే మహిళలకు బయటికి కనిపించని వ్యతిరేకతేదో ఉంటుంది. అలా నిశ్శబ్దంగా వీరి జీవితాలు నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఎవరూ మాటాడుకోని ఈ మహిళల గురించి, వీళ్ళు పాల్గొన్న జీవిత సంగ్రామాలగురించి చాలా చాలా విస్తారంగా, పలికిన ప్రతి పలుకుకీ బేస్ రిఫరెన్స్ తో, స్టాటస్టిక్స్ తో, ఫోటోలు, సాక్షాధారాలతో  కోట నీలిమ చాలా మంచి సమచారాన్ని ప్రపంచం ముందుంచారు. 

ఆత్మ హత్య చేసుకున్న రైతు తాలూకు విధవ, మానసిక దౌర్బల్యాలకీ, సామాజిక అణిచివేతకూ ఎదురొడ్డి  తలెత్తుకు తిరిగేందుకు ఎంత కష్టపడగలగాలో అంత కష్టపడుతుంది. ఒక్కోసారి ఈ ఆర్ధిక ఇబ్బందుల్ని భర్తల కన్నా ధీటుగానే ఎదుర్కోగలుగుతుంది.  వీళ్ళకి చదువు, అదిచ్చే అవకాశం, ఎంత ముఖ్యమో మనకి బాగా తెలుస్తుంది. తమ కోసం మాట్లాడలేని బలహీన వర్గం గా వీళ్ళు మిగిలిపోకూడదు.  వీరి పిల్లలు చాలా మంది మళ్ళీ వ్యవసాయం చెయ్యడానికి ఇష్టపడడం లేదు. చదువు ద్వారా ఏదైనా వేరే ఉద్యోగం చెయ్యాడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆడపిల్లలు చదువుకోవడం గురించి అందరికీ ఏకాభిప్రాయం ఉంది. 

స్టడీ ముగిసేటప్పుడు ఈ పిల్లల్నీ, ఆ మహిళల్నీ కొన్ని ప్రశ్నలడిగారు. చాలా మంది ప్రభుత్వ విధానాల్ని తప్పుపట్టారు. వీరికి తమకి కావల్సిది, చదువు, ఉండేందుకు ఇల్లు, ఉపాధీ, వ్యవసాయం చేసేందుకు ప్రోత్సాహకాలు, కాస్త మార్గదర్శనం. వీళ్ళలో మెజారిటీ, ఇంకో జన్ముంటే మహిళ గా మన దేశంలో పుట్టనే కూడదనుకున్నారు. తమ పిల్ల భవిష్యత్తు ఏమి కానుందో, తామిచ్చే  అరకొర చదువు వారికి సరిపోతుందా అని బెంగపడ్డారు. వీళ్ళు చూసిన కష్టాలు చూడని వీళ్ళ ఆడ పిల్లలు మాత్రం ఆశావహంగానే ఉన్నారు. విదర్భలో ప్రాణాలు తీసుకొనేలా ప్రేరేపించిన అలాంటి పరిస్థితులు ఈ కొత్త తరం వారు చూడకూడదనే ఆశిద్దాం. 

నాకు నచ్చిన వాక్యాలు :

1) The research provided a perception study of the invisible, and revealed the dynamic of the world of shadows in which the women survived.  It also helped chart the different invisibilities of the widow, which was the second objective of this research.  The question that was raised and sought to be answered was about how farm widows were restricted to their invisibility, conditionally released through social rituals like marriage, or partially released through state rituals like suicide compensation.  The widows made an intervention into the working of the state, the community and the family that had never been heard before and perhaps, never been sought. 

2) First, the lives of the widows remained unchanged not just from one season to the next, but from one generation to the next.  Second, it was impossible for the widows to support their families without private loans and the generosity of others.  Third, there was anger among the farmers children who held the state and the political class responsible for their destiny.  Fourth, there was evidence of the continuous neglect of the widows by the state, despite their need and their agency. 

3) When compared to the efforts of the man, the woman's contribution to the household was unaccounted form as was her role in moulding the future of her children.  This did not change in the case of widows, even when they made all the efforts that a man did to support the family along with all the work they did as women.  The allocation of value to a woman's labour might provide her a visibility that was incompatible with her invisible universe.  She had to be represented indirectly through the life of her children or the opinion of her family but not directly through her work, even if she worked on the same farmlands as the men.  The widow seldom has rights over property or the farm and would face difficulty finding the bank loans.  And yet, it was the widow's daily wages that paid household expenses and the children's school fees.  The earnings of the invisible were also categorized as invisible, and the widow did not derive any financial freedom because of her labour.  While the farmer was hailed for his efforts to earn a livelihood on the farm, a widow did the same in the shadows, without acknowledgement.  This revealed the last invisibility of the widow that had come with the failure of the democratic promise of equality of all citizens - the vote.  ...... They were not represented in the visible world of assertive politics of organized vote banks and engineered equations, in which the invisible did not count.  The unchanged life of the widow proved that, like her, even her vote was invisible. 

***

This was first published in pustakam.net 

http://pustakam.net/?p=21896 


However irrelevant this is to us :

This is the news item, dtd 29/10/2021. (Eenadu)





24/10/2021

పల్నాటి కథలు - సుజాత వేల్పూరి

http://pustakam.net/?p=21890


పల్నాడు  కథలు - సుజాత వేల్పూరి 



ఒక సారి ఒక వెబ్ జైన్ లో ధారావాహికంగా ప్రచురితం అయ్యాక, ఆయా కథలకి పాఠకులు మిగులుతారా అని నాకో అనుమానం ఉండేది. ఈ మధ్య ఒకటే పని గా 'సారంగ', 'ఈమాట' లాంటి అంతర్జాల పత్రికల్లో వచ్చిన కథల గుచ్చాలు పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు. అవి బహుశా తెర మీద చదువుకోలేని వారి కోసం / ఇలా మాసం మొదటి రోజునో పక్షానికో వెలువడే పత్రికలని చదివే తీరిక / సౌలభ్యమూ లేనివాళ్ళ కోసమో అని అనుకుంటున్నానిన్నాళ్ళూ.   పైగా మనకే ఆనంద వికటన్ లూ లేవు. ఉన్న విపుల, చతురా కాస్తా కనుమరుగయ్యాయి. ఇప్పుడు మనకి చదువుకోవడానికి పుస్తకాలు కావాలి కదా. 

అలా, 'పల్నాడు కథలు' ఒక వాక్యూం ని పూరించడానికి వచ్చిందనిపిస్తుంది. అసలు ఒక చోట ఆల్రేడీ చదివేసిన పుస్తకాల్ని చదవడం ఎలా ఉంటుంది అనే అనుమానం పటాపంచలు చేసిన పుస్తకం ఇది.  దీనిలో ఉన్న కథలనీ ఒక ప్రాంతానివి, ఒక మర్చిపోయిన గతానివి. ముఖ్యంగా మహిళలవి.  అలా అని ఇవి స్త్రీవాద కథలు కాదు.  

అనుకోకుండా ఈ కథలన్నీ  ఎక్కువ గా 'కథానాయికల' కథలు. ఈ నాయికల్లో ఒకావిడ సొంతవాళ్ళచే రేప్ చేసి చంపబడ్డ పసి దాని సోదరి. ఇంకో ఆవిడ పిల్లల ని పోషించుకోవడం కోసం నాటు బాంబులు స్మగుల్ చేసే కూలీ మనిషి. ఒకావిడ రికార్డింగు డాన్సులు వేసే మనుషుల కుటుంబానిది. ఒక నాయిక బ్రతకడానికి ఒళ్ళమ్ముకునే సామాన్యురాలు.   ఒక సింగిల్ మదర్, కూతురి భవిషత్ కోసం వొళ్ళు దాచుకోకుండా రెక్కలు ముక్కలు చేసుకునే 'రోజు కూలీ'. ఇవి బహుశా ప్రభుత్వ పథకాలు ఇంకా చిక్కని రోజులు అనిపించింది. ఈ పిల్ల పడే కష్టం చూసి. (నా నెగిటివ్ థింకింగ్) 

ఈ కథల్లో మహిళా ప్రధానమైన కథలే కాక నిజమైన హీరోలు ఉన్న కథలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నైపుణ్యంతో చెప్పిన కథలు.  వీటిలో కనిపించే హీరోలు చాలా మటుకూ ఒంటరి మహిళలే అయినా మనసున్న Male మారాజులు కూడా ఉన్నారు. మన చుట్టూ కనిపించే వాళ్ళే - మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు, కళారాధకులు, చిన్న పిల్ల పూల జడ కోసం తంటాలు పడే బీద తల్లికి పువ్వులు ఉచితంగా ఇచ్చే షావుకారు, బాంబులు చేరేసే బీదరాలిని జాలి తలిచి, న్యాయంగా వదిలేసె ఇన్స్పెక్టరూ. ఈ సిన్మా పిచ్చి అబ్బాయీ, ఒక మంచి తండ్రీ, కొడుకూ.. ఇలా.

కొన్ని సార్లు మనమే  ఎరుకా లేకుండా చూపించే చిన్న దయ, కరుణా, ఎదుటి వాళ్ళకెంత మీనింగ్ ఫుల్ గా ఉంటాయో తెలిస్తే మనం ఇంకొన్నిసార్లు చెయ్యమూ ఈ మంచిపన్లు ? అనిపించేలా చేస్తారు రచయిత్రి.  చిన్న చిన్నacts of kindness, మనకే తెలీకుండా ఇతరుల పట్ల మనం చేసే ధాష్టీకం,  మనమో, మనవాళ్ళో ఒకరిని  'ఉద్ధరిస్తున్నా'మనుకుంటూ చేసే పన్లూ,  వీటి గురించి మనకి సూక్షం అర్ధం అయితే చాలదూ. 

ఈ కథల్లో పల్నాటి అమ్మాయిలు పౌరుష వంతులు. ఏ కష్టాన్నన్నా భరిస్తారు గానీ, వాటి ముందు మోకరిల్లరు.  సీత ఎలియాస్ విజయశాంతి లాంటి అమ్మాయిలు వృత్తి లో భాగంగా గాంగ్ రేప్ కి గురయ్యి కూడా పనిలోకి వెళ్ళాల్సి వచ్చేంత ఎక్స్ప్లాయిట్ అవుతూ ఉంటుంది. అసలీ పిల్ల ఈ కష్టం ఎలా భరిస్తుంది ? అది గుండేనా అసలు ? అనిపిస్తుంది. మన దేశం లో ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాలకు, unreported లైంగిక దాడులకూ లెక్కే లేదు. 

కొత్తగా వచ్చిన చట్టాల ఎంత వరకూ ఉపయోగపడుతున్నాయో గానీ, బయటకు రాని, మౌన ఆవేదనల మధ్య, కౌటింబిక హింసల మధ్యా జరిగే రేప్ లకే దిక్కు లేదు. వొళ్ళమ్ముకునే అమ్మాయికేమి రక్షణ ? ఏ హక్కు లు ? ఆ పిల్ల పడే బాధ / అవమానం, హింసా ఎవరికయినా అర్ధం అవుతాయా ? ఒక ప్రాస్టిట్యూట్ ని జాలి తలుస్తాడా మామూలు సంఘ జీవి ?  చిన్న చిన్న ఎదురీతలకే రేప్ ని ఒక కంట్రోలింగ్ టూల్ గా వాడుకుని ఆడవాళ్ళని అణిచేసే లోకానికి, ఈ సీత అంటే జాలి చూపించే మనిషి వింతే కదా. ఈ వింతలు పల్నాడు లోనే కాకుండా ఎక్కడన్నా కూడా ఉండొచ్చు. కానీ ఈ ఒక్క కథ లో, ఆమె సవతి తండ్రి పాత్ర లో, కథ లోని సంఘర్షణనంతా, ప్రేమనంతా చూపించేసి, చాలా ఎత్తుకు తీసికెళిపోయారు రచయిత్రి.


ఈ సంపుటి లో అన్ని కథలూ వేటికవే సాటి. సంభాషణలు, కథ ల ను చెప్పే విధానమూ, పాత్రలని పరిచయం చేసే విధానమూ, వాడినా భాషా, అచ్చు తప్పులు లేకుండా,  (ఆల్రెడీ ప్రచురింపబడ్డాయి కాబట్టి బాగా కత్తెరలు పడి కరెక్షన్లు జరిగినా కూడా) అచ్చమైన  పల్నాటి ప్రాంతపు "స్పెషాలిటీ - పేషన్" తో చాలా బాగా తీసుకొచ్చారు.  అంతర్జాలం దాదాపుగా అందుబాటు లో ఉన్నా, దేశం లో మనుషుల కన్నా, మొబైల్ ఫోన్లే ఎక్కువ అయిపోయినా, చదివేందుకు physical పుస్తకాలే అనువు చాలా మందికి.  కాబట్టి, ముఖ్యంగా మంచి పుస్తకాలు క్రమంగా కనుమరుగవుతున్న సమయాన ఇలాంటి పుస్తకాలు చదవడం ఓ మంచి అనుభవం.  



23/10/2021

అసమాన అనసూయ - (నా గురించి నేనే) - కళా ప్రపూర్ణ డా. వింజమూరి అనసుయ దేవి.





ఒక 95 ఏళ్ళ విదూషి, తన జీవిత గమనం గురించి, తను ఎదుర్కొన్న కష్టాలు, దొరికిన సంతోషాల గురించి, చెప్పుకున్న విషయాలే ఈ పుస్తకం. అయితే ఇవి సామాన్యమైన కష్టాలూ కావు, సాధించినదేదీ సామాన్య విజయమూ కాదు. వీటిని ఏ ధైర్యంతో ఎదుర్కొనగలిగారో, ఏ హార్డ్ వర్క్ తో సాధించగలిగారో, చెప్పడమే ముఖ్య విషయం.

1925 లో కాకినాడ సరస్వతీ గాన సభ వారి ఆధ్వర్యంలో ఆంధ్ర సేవా సంఘం హాలులో జరుగుతున్న సంగీతోత్సవాల నాటి జ్ఞాపకాలు చెప్తూ తన కథ  మొదలు పెడతారు. చిన్న తనంలో బాల్యావస్థలో మనసులో ముద్రించుకుపోయిన జ్ఞాపకాలు, అందరికీ ఉంటాయి. అయితే, ముందుమాటలో వంగూరి చిట్టెన్  రాజు గారు చెప్పినట్టు, వింజమూరి అనసూయాదేవి ఈ పుస్తకంలో రికార్డ్ చేసినది ఒక వ్యక్తి జీవితం గురించి / ఒక వ్యక్తి చరిత్ర కాదు. తెలుగు సంగీత చరిత్ర ఇది.

కాకినాడ లాంటి పాత కొత్త వాసనల ఊరి ప్రతిబింబం లాంటి, సరస్వతీ దేవి లాంటి ప్రతిభావంతురాలు ఈ అమ్మాయి. దేవులపల్లి కృష్ణ శాస్త్రి మేనకోడలు. మావయ్య భావ గీతాలకి తొట్టతొలుత బాణీ కట్టింది. తెలుగు లలిత సంగీతానికి మొట్ట మొదటి కంపోసర్. ఆఖరి నిముషాల్లో, రాసి ఇచ్చే మావయ్య పాటలకు క్షణాల్లో బాణీలు కట్టడం, పసిప్రాయంలోనే, తెలియని కొత్త వాయిద్యాలైన వీణ, పియానోలను కూడా, తనంతట తానే వాయించడం, తండ్రి నాటక కళాకారుడు కాబట్టి, తెలుగు నాటకాలలో వాడే లెగ్ హార్మొనీ వాయించాలని కలలు కనడం, అయినా కాళ్ళందని చిన్న పిల్ల అని అవకాశం ఇవ్వకపోయినా, అనుకోని విధంగా హార్మొనిస్టు రాని పౌరాణిక నాటకానికి 11 ఏళ్ళ వయసులో రాత్రంతా హార్మొనీయుం వాయించటం లాంటి ఫీట్లు చేయడం, పిఠాపురం జీవితం, రాజు గారి పిల్లలతో స్నేహం, వగైరాలు, నిన్న మొన్నటి కబుర్లలాగా చెప్తారు.

కళ్ళు మూసుకుని, కళ్ళకు బట్ట చుట్టి, హార్మోనియం మీద బట్ట కప్పి వాయించడం లాంటి బాల్య చేష్టల దగ్గర్నించి, కౌమారంలో తెలిసీ తెలియని తనంతో ప్రదర్శించిన అతిశయం, యవ్వనం లో తన ఆరాధకుల పై తనకుండిన నిర్లక్షాన్ని గురించి కూడా దాయకుండా చెప్పేంత ఇష్టం తనంటే తనకు. తానందుకున్న ప్రేమ లేఖలు, సూటర్స్ తనని బలవంత పెట్టడాలూ, ఆ ఎటెన్షన్ ని తను ఎంజాయ్ చెయ్యడమూ, అంతలోనే, ఎవరినీ దగ్గరికి రానీయనంత ఇండివిడ్యువాలిటీ ని ప్రదర్శించడం కూడా గుర్తు చేసుకుంటారు.

“నేను కొంచెం స్వార్ధపరురాలిని. నా సౌకర్యమే చూసుకుంటాను అనీ, కొంతవంతు ఎక్కడో కాస్త నార్సిసిస్టు ని కూడా” అని ఎవరు చెప్పుకుంటారు ? అయితే జీవితంలో దెబ్బ తిన్నాక, “నీ పొగరు అణచడానికే ఈ పని చేసాను!"  అని చెప్పే మనిషి (మనుషులు) ఎదురైనప్పుడు ముక్కలైన మనసుని కూడగట్టుకుని, అహాన్ని చంపుకుని, పిల్లల కోసం, బ్రతుకు కోసం, కెరీర్ కోసం, తన మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం, పరువు కోసం, వాళ్ళతోనే కలిసి ఉంటూ, వాళ్ళని పశ్చాత్తాపంతో కుమిలేలా చేసారేమో గానీ, వెను తిరిగి పారిపోలేదు. ఈ సంగతి, చదువరులకు తెలియజేయాలనుకోవడం, నిజంగా చాలా బోల్డ్.

అంతవరకూ ఆవిడ మహారాణి. “మద్రాసులో రేడియో లో పని చేస్తున్నప్పుడు నా చుట్టూ మగవాళ్ళు పడేవారు. నేనెవర్నీ లెక్క చేసే దాన్ని కాదు. ఇంటి ముందు వాడుకోవడానికి రకరకాల కార్లు పంపే వారు. నేను బయటికొచ్చి, ఆరోజు చీరకి ఏ రంగు మేచ్ అవుతుందో ఆ కారు లో ఎక్కి వెళ్ళేదాన్ని”, అని చెప్పినప్పుడు గానీ, పెళ్ళయిన మగవాళ్ళు పెళ్ళాల చేత రెండో పెళ్ళికి రాయబారాలు పంపడం గురించి గానీ చెప్పడానికి వెనకాడలేదు. (పేర్లతో సహా)

వింజమూరి అనసూయాదేవికి తన జీవితం మీద చాలా స్పష్టత ఉంది. “ఎవరేమన్నా అనుకోనీ, నాకు నేనంటే పరమ ఇష్టం!” అని చెప్పుకోగల ధైర్యం ఉంది. బాల్యం, కౌమారంలో అద్భుత విజయాలు, విద్యలో పేరు ప్రఖ్యాతలూ సాధించేశాక, ఇక పైకెదిగేందుకు మెట్లే లేవా అన్నంత ఎత్తుకి ఎదిగిపోయినా, తన ఇంటి పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటూ, తల్లితండ్రులు తమ రెక్కల కింద దాచుకుంటూ ఉండగా ,తనతో పాటూ ఇల్లు విడిచిపెట్టొచ్చి, మద్రాసులో తనతో పాటూ ఇళ్ళు మారుతూ, తిరిగి, ఎన్ని త్యాగాలు చేస్తూ, తన కళా జీవితానికి ఊతమిచ్చారో ఆమెకు తెలుసు. ఎప్పుడూ చేయాల్సిన పనులు ఉండనే ఉన్నాయి తనకు. చూసుకోవాల్సిన వాళ్ళూ ఉన్నారు.

మద్రాసులో సినీ, రేడియో, గీతాల ప్రస్థానం కన్నా, కాకినాడలో ఆమె ఎదిగిన వైనం, స్కూల్లో, కాలేజీలో సంగీతం లో సాధించిన పనులు గుర్తించదగ్గవి. వీటిలో శ్రీశ్రీ కవితలకీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి పాటలకీ ఇప్పటికీ ఆవిడ ట్యూన్లు యధాతథంగా వాడగలగడం, బాలాంత్రపు రజనీకాంతరావు, బుజ్జాయి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కాంచనమాల, భానుమతి, ఘంటశాల వేంకటేశ్వరరావు ల్లాంటి ప్రముఖులతో ఆమెకు ఉన్న ఆత్మసంబంధం, మొదటి గురువు అయిన తల్లితో ఉన్న బంధమూ, ఏకసంథాగ్రాహి కావడం వల్ల, కాకినాడలో భోగం వాళ్ళ దగ్గర కూడా సేకరించి నేర్చుకోగలిగిన జావళులూ, పదాలు, గాలివాటుగా విన్న పల్లె పాటల్ని సేకరించడం, వాటికి శాస్త్రీయ మైన గుర్తింపు ఇవ్వడం, వాటికి ఎల్ పీ రికార్డుల ద్వారా, కనుమరుగైపోకుండా, ఒక శాశ్వతత్వాన్ని ఇవ్వడం, ఆకాశవాణిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చెయ్యడం, అద్భుత కళాకారులతో పనిచెయ్యడం, తనకు విద్యనీ, జ్ఞానాన్నీ, సంస్కారాన్నీ  ఇచ్చిన గురువుల్ని మర్చిపోకపోవడం, ఇవన్నీ, తన జీవితాన్ని సుసంపన్నం చేసిన అనుభవాలంటూ తృప్తి పడడం చాలా బావున్నాయి.

ప్రతిభావంతులైన ఆనాటి కళాకారులు, సొంతంగా ఇంట్లో అందరూ పెద్ద పెద్ద వాళ్ళు. ఇంట్లో మామూలుగా జరిగే వాదోపవాదాలు, చర్చలు, ఏకీభవించకపోవడాలు, ఇవన్నీ ఆవిడ వ్యక్తి వికాసాన్ని, (అమ్మాయిలు మూల పడుండాలని ఆశించని కుటుంబ వాతావరణం) నిర్దేశించాయి. ఇది జీవితపు రికార్డు కాబట్టి, జ్ఞాపకాల మీద ఆధారపడి రాసినా కూడా, ఆవిడ చూసిన, కలుసుకున్న ప్రముఖ వ్యక్తులూ, రెడ్ల, రాజుల, స్నేహితుల వివాహాలలో, వేడుకల్లో, తనకు దక్కిన స్నేహమూ, గౌరవం, ఆదరణా, పేరు ప్రఖ్యాతులూ, ఇవే ఆవిడ సంపాదన.

ఆత్మస్తుతీ, పరనిందా తప్ప ఆత్మకథల్లో ఏముంటాయి అని అందరూ అనుకునేమాటే. చాలా డార్క్ విషయాల్ని ఎవరూ చెప్పరు. ముఖ్యంగా ఇంట్లో అందరూ ప్రముఖులే అయిన వాళ్ళు అస్సలు చెప్పరు. “నేను నా పిల్లల కోసం ఇంత త్యాగం చేసాను. ఇన్ని బాధలు పడ్డాను. నా వృద్ధాప్యంలో వాళ్ళు కూడా నా దగ్గర బోల్డు డబ్బుంది అనుకున్నారు. నేనిలా కష్టాలు పడ్డాను.. ” అని, ముఖ్యంగా మీరు త్యాగాలు చెయ్యకపోతే అటు సూర్యుడిటు పొడవడూ అని లోకం పట్టుపట్టే స్త్రీలు/పెళ్ళాలూ, తల్లులూ అస్సలు చెప్పుకోరు. అయితే ఆ చెప్పుకోవడం కొన్ని సార్లు అవసరం.

“నాకే ఇలా జరిగితే, మామూలువాళ్ళకి ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో!” – అనే స్పృహ ఆమెకి ఉంది. ఈ పుస్తకంలో కెరీర్ పరంగా, సాధించిన పేరు ప్రఖ్యాతుల పరంగా, వృత్తి జీవితం లో తృప్తి , ప్రతిభా, పట్టుదలా, కష్టపడే తత్వం మూలాన ఉన్నత స్థానం లో ఉన్న వ్యక్తి, తన వ్యక్తిగత జీవితం లో చీకటి ని అంతే ఒప్పుదలతో బయట పెట్టడం చాలా షాకింగ్. కానీ ఆ ధైర్యం, తెగువా – సగం బలం ఈ పుస్తకానికి.

ఇదంతా నాకు భానుమతి ఆత్మ కథని గుర్తు చేసింది. ఆవిడ కూడా చాలా unique సింగర్, బోల్డన్ని కళల్లో ప్రవేశమూ, నైపుణ్యమూ, ధైర్యమూ ఉన్న తల్లిదండ్రుల చాటు పిల్ల. సరస్వతీ పుత్రికే. భానుమతి ప్రేమించి, పెళ్ళి చేసుకుంది. పెళ్ళి అయ్యాక, తల్లయ్యాక, నిజానికి చాలా స్టెబిలిటీ తో పని చేసింది. అనసూయని ప్రేమించానని చెప్పుకున్న వ్యక్తి బహుశా అసూయతో, అధికారం కోసం, డబ్బు కోసం, ద్రోహం చేసి పెళ్ళి చేసుకున్నాడు. పిల్లల ని పెంచుకోవడం, కెరీర్ ని కొనసాగించడం వగైరాలు ఆమె దాదాపూ ఒంటి చేత్తో సాధించుకున్న పనులు.

అయితే ఒక స్త్రీగా, భానుమతి లాగా రొమాంటిక్ జీవితం కాదు ఈవిడది. సొంత చెల్లెలు మోసం (ఊహ) చెయ్యగా, పదేళ్ళుగా తన మీద కన్నేసిన ఒక పెళ్ళయిన వాడు అదను చూసి రేప్ చేసి, రెక్కలు కత్తిరించేసి, ద్రోహపూరితంగా పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఈవిడ. సరస్వతీ పుత్రిక, అంతవరకూ వివిధ కార్యక్రమాలు, కచేరీలద్వారా ఎంతో సంపాదిస్తున్న లక్ష్మీదేవి లాంటి కూతురు పెళ్ళి ఎంతో దివ్యంగా చెయ్యాలని కలలు గన్న తల్లితండ్రులకు తీవ్ర వేదన కలిగించిన సంఘటన ఈ బలాత్కారం.

సొంతంగా, అందం, తెలివితేటలు, ప్రతిభా వ్యుత్పత్తులు కలిసిన మనిషి, ఈ ద్రోహం తరవాత పోయిన పరువు, పొరపాటున ఆ సంఘటనకు కారణం అయ్యానని వేదన చెందే మేనమామ, అంతవరకూ ఏకవచనంతో పిలుస్తూ వచ్చిన మనిషి భర్త అయి, అలాంటి ఘోరానికి ఒడిగట్టినా, అదేదో హక్కు చలాయించాలని చూడటం, అతని మొదటి భార్య కూడా, “అనసూయ అలాంటిది కాదు. నా మొగుడే చెరచి ఉంటాడని”, “తప్పక పెళ్ళి చేసుకుని ఉంటుంద”నీ చెప్పడం.. ఆడవారి బలహీనత ఉన్న ఒక విలువల్లేని మనిషికి భార్య అవల్సి రావడం, ఇవన్నీ హృదయాన్ని కలిచివేసే సంగతులు.

ఎన్నో ఘనతలు సాధించిన మొదటి మహిళగా అసామాన్యమైన పేరు పొంది కూడా, తన గర్వాన్నో, అహంకారాన్నో అణచడానికి చూసే కుళ్ళుమోతు భర్త గురించి, ఎన్నో కచేరీలలో తనతో పాటు పాల్గొనై, సరిసమానంగా ప్రతిభా, పేరు గల చెల్లెలి గురించీ, సూచన ప్రాయంగా చెప్పిన కొన్ని సంగతులు ఇదంతా ఆవిడ కడుపు మంట చల్లార్చుకోవడానికి రాసినదే అయి ఉంటుందా అనిపించేలా ఉంది. అయితే తన వెర్షన్ తను చెప్పే అధికారం అయినా ఆమెకు లేకపోతే ఎలా ? దీని గురించి మరీ ఆలోచించక్కర్లేదు. ఆ దుర్మార్గానికి తను ఎలా బలయినదీ – ఆఖరికి పెళ్ళయాక కూడా రకరకాలుగా అనుభవించిన బాధలు చెప్పుకునే గొంతు, ఆమెకి అక్కర్లేదా అనిపిస్తుంది.

ఈ బలవంతపు పెళ్ళి అయ్యి, అయిదుగురు పిల్లలున్న తల్లి, “నా పిల్లలు కూడా రత్నాలలాగా, ప్రతిభ, విద్య ఉన్నవారు. నా పంచ ప్రాణాలు” అంటూ, ఈ పిల్లల కోసం, తన కెరీర్ ని త్యాగం చేసి, కుటుంబ, సంసార బాధ్యతల కోసం, సహకరించని కుటుంబం కోసం – స్వయంగా రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ వచ్చి, అన్నమాచార్య కీర్తనలను స్వరపరచమని అడిగినా చెయ్యలేకపోయి, “ఈ ఘనత కూడా సాధించి ఉందును. కానీ ఇంటి బాధ్యతల వల్ల వొదులుకోవాల్సొచ్చింది” అని చెప్పడం బాధ కలిగిస్తుంది.

మొదట్నుండీ, కుటుంబం అంతా కలిసి, సందడిగా ఉండే, ఒకరికొకరు సహకరించుకుంటూ, ఏ తీరిక వేళలోనో మేధో మధనాలు చేసే కుటుంబాలలో పెరిగిన మనిషి. తన కెరీర్ కోసం చాలా మంది కుటుంబసభ్యులు కావల్సొచ్చి అందరి పోషణ బాధ్యత నీ తీసుకున్న మనిషి. స్వయంగా భర్త చేతిలో డబ్బు విషయంలో మోసపోయిన మనిషి. ఎప్పుడూ ఒకరి మీద పై చేయై బ్రతికి, ఎవరి దయా దాక్షిణ్యాల మీదా ఆధారపడకుండా, తన లో తన ని నిలుపుకుంటూ, రోజువారీ యుద్ధాన్ని గెలుస్తూ వచ్చిన మనిషి.

ఆఖరికి భర్త చివరి అయిదు సంవత్సరాలూ కాన్సరుతో బాధపడి పశ్చాత్తాపంతో దగ్ధమవుతున్నప్పుడు అతనికి సేవలు చేయాల్సొస్తుంది. చివరి రోజుల్లో భర్త తనని అణిచివేయడం గురించి పశ్చాతాపం వ్యక్తం చేసాక, ఎవరికీ లొంగని, ఎవరికీ తలొగ్గని తను అతనికి అన్ని సేవలు చెయ్యడం, ఇదీ బహుశా అన్నేళ్ళు కలిసి ఉండడం వల్ల తనలో కలిగిన ప్రేమ వల్లనేమో అని అనుకోగల పెద్ద మనసు తనది. క్షమించడానికి కూడా మనసుండాలి.

పిల్లలు సహకరించని వేళ ఒక్కర్తీ, మనవల్ని కూడా చూసుకోవాల్సిన వేళ. ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టిన వృద్ధాప్యంలో “కూరగాయలు చవగ్గా దొరుకుతాయని నడుచుకుంటూ ఫలానా చోటికి వెళ్ళేదాన్ని. చెయ్యలేని శారీరక శ్రమ చేసాను – పడరాని పాట్లు పడ్డాను” అని కూడా చాలా తృప్తి గా చెప్పగలగడం బావుంది.

ఈ ఆత్మకథ రచయిత్రి రాసిన (95 ఏళ్ళ వయసులో) ఆఖరి పుస్తకం. “నాదగ్గర ఫలానా విద్య ఉంది. ఈ ఈ పాటలు తెలుసు. ఎవరికన్నా నేర్చుకోవాలనుంటే నేర్పుతాను. తొందరపడండి. నాకిప్పుడు 95 ఏళ్ళు !” అని ఆహ్వానం ఇస్తారు ఓ చోట. ఈ రికార్డ్, ఆవిడ సాధించిన ఘనత, కలుసుకున్న వ్యక్తులు, సంగీతం ను యూనివర్సిటీ విద్యలో ప్రవేశ పెట్టడం, టీటీడీ ప్రచురించిన వివిధ తెలుగు గేయాలు, బాణీలూ, వరుసలతో అచ్చయిన పాటల పుస్తకాలు, సినిమాల్లో చౌర్యానికి గురయిన ట్యూన్లు, తన పేరు లేకుండా హిట్ అయిన ఎన్నో పాటలు, ఇవన్నీ గుర్తు పెట్టుకుని రెండు నోటు పుస్తకాల నిండా ఆవిడ రాసి పెడితే, వంగూరి ఫౌండేషన్ వాళ్ళు దీని ఒక అభిమాని శ్రీ సుభాష్ సాయంతో కంపైల్ చేసి ప్రచురించారు. అయితే ఈ ఎమోషనల్ ఫ్లో లో, కొన్ని పేజీలు (పేజీల్లో సంగతులే) రిపీట్ కావడమూ, ఆమె సేకరించిన ప్రముఖుల ఆటోగ్రాఫ్‌లలో కొన్ని రిపీట్‌‍లూ, ఇవన్నీ చిన చిన్నవే, కాస్త తరవాతి ఎడిషన్లలో ఎడిట్ చేస్తే బావుంటుంది. ముందుకీ, వెనక్కీ ఒక సంగతి నుండీ ఇంకో సంగతికి పరిగెత్తేసే విధానంలో కాకుండా, చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సినంత చెప్పి, చెప్పకూడని విషయాన్ని వదిలేయడం బావుంది.

కేవలం తొమ్మిదేళ్ళ వయసులో శాస్త్రీయ బాణీలతో ఎన్నో ప్రముఖ గేయాలు స్వరపరచిన సరస్వతీ పుత్రిక విజమూరి అనసూయాదేవి. అందం, ప్రతిభ కలపోసిన, ఒకప్పటి సెన్సేషన్ ! ఇదీ ఆవిడ జీవితం. నిజంగా అసామాన్యమైన కథ. తనని తాను “అసమాన అనసూయ” అని చాలాసార్లు చెప్పుకోగలంత 'పొగరు ' తనకు. కాలం అపుడపుడూ ఎదురుతిరిగినా ,ఎవరెన్ని అసూయలు పోయి,  మోసాలు చేసి / ద్రోహాలు చేసినా ఆ ‘పొగరు’ని అణచలేకపోయారు. అదీ మెచ్చుకోవాల్సిన విషయం.

పుస్తకం లో ఆఖరు న ఒక పరిపూర్ణ జీవితం గురించి ఆమె రాసుకున్న మాటలు కొన్ని :

“జీవితం పరిపూర్ణమయింది. కోరికలనీ తీరాయి. వైకుంఠపాళీ ఆటలో ఎంత నీతి, నిజం ఉందో ఇప్పుడర్ధమైంది. పెద్ద నిచ్చెనెక్కి పైకి వెళ్ళిన నేను, తక్షణమే పెద్ద పాము నోట్లో పడి కిందకు వచ్చాను. అయితేనీం. పందాలు వేసుకుంటూ ‘పరమ పదం’ వరకూ చేరాను. ఇంక భయం లేదు. ఎక్కువ దూరం లేదు కనుక.”

” నా కోరిక :

ప్రశాంతమైన వాతావరణం, అగరవత్తులు, సాంబ్రాణి, పాలమడ్డి పొగలతో, నాకిష్టమైన ఎర్రరంగు పట్టుచీర కాళ్ళకు ఆల్తా, గోళ్ళకు మ్యాచింగ్ రంగు, చీరకు తగ్గ బొట్టూ, కాటుకలతో అలంకరించాలి. నా వాళ్ళంతా నా చుట్టూ ఉండాలి. నా తల దగ్గర నా హార్మోనియం పెట్టాలి. ఆ పక్కా ఈ పక్కా రెండు ఎలక్ట్రిక్ తంబూరాలు కంటిన్యుయస్ గా మోగుతూ ఉండాలి. నాకిష్టమైన పెర్ఫ్యూం నా మీద చల్లండి. ఎవ్వరూ ఏడవకండి. ఆరు తరాలు చూసి, ఇంత బలగాన్ని పోగేసుకున్న నా కంటే అదృష్టవంతులు ఎవరుంటారు ?

నలుగురు కూర్చుని నవ్వే వేళల
నా మాటొకపరి తలవండి !
నా పాటొక పరి పాడండి! “

……

First published in  :  http://pustakam.net/?p=21883 



15/09/2021

Why should we cheer those Women in Sports

పరిచయం : ఇది ఒక చిన్న నోట్ / ఉత్తరానికి అనువాదం.  హైద్రబాద్ రన్నర్స్ క్లబ్,   రన్నింగ్ సర్కిల్స్ లో చాలా ప్రముఖమైన సంస్థ.   దీనికి పలు ఈవెంట్లను,  మారథాన్ లు నిర్వహించిన అనుభవం ఉంది. వీరు ఔత్సాహిక రన్నర్స్ కోసం ట్రైనింగ్ కార్యక్రమాలు చేపడతారు.  కొత్త గా పరిగెట్టే వారికి ప్రొఫెషనల్ హెల్ప్ ఇవ్వడం, ప్రోత్సహించడం, 'ప్రో' ల కోసం, అథ్లెట్ల కోసమూ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం చేస్తున్నారు చాలా ఏళ్ళుగా.  

అల్వల్ రన్నర్స్ క్లబ్ లో ఒక స్నేహితుని ద్వారా ఈ  హైద్రబాద్ రన్నర్స్ క్లబ్ గత నెలలో నిర్వహించిన 12 గంటల స్టేడియం రన్ గురించి, అక్కడి విశేషాల గురించి తెలుసుకున్నాను.  ఇదంతా దానిగురించి.   

ఈ ఆగస్టు అంతా హైదరాబాద్ లో  వానలు,  కొంచెం కొంచెం తెరిపి ఇచ్చి, దాదాపు ప్రతి రోజూ వర్షం కురిసి, ఊరిని ముంచెత్తేసింది వాన .   సాధారణ జనం, పొద్దున్నే ముసుగు పెట్టి నిద్రలు పోయే ఓ సెలవు రోజున, ఆగస్టు 28 న, హైద్రబాద్ రన్నర్స్ క్లబ్ ఒక 12 గంటల రిలే & 12 గంటల solo పరుగు ఈవెంట్ ని నిర్వహించింది. దీన్ని హైదరాబాదు లో గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ రన్నింగ్ ట్రాక్ మీద నిర్వహించారు. దీన్ని "స్టేడియం రన్" అంటున్నారు.  దీనిలో ఆరుగురు సభ్యులున్న టీం సభ్యులు (ఒకరి తరువాత ఒకరు గా), ఒక్కో రన్నర్ రెండు గంటల చొప్పున కనీసం 20 కిలో మీటర్లు పరిగెడతారు. రిలే థీంలో.  [సోలో పరిగెత్తే వారు వేరే ట్రాక్ మీద మొత్తం 12 గంటలు పరిగెడతారు.   ఫార్మాట్ అర్ధం కావడానికి కింద ఇచ్చిన 'నావ్'  వీడియో చూడండి.] 

ఆ రోజు నిర్వహించిన పరుగులో తమిళ నాడు, కేరళ, ఒడిశా, కర్నాటక, తెలంగాణ ల నుండి 37 టీం లు పాల్గొన్నాయి. వీరిలో చాలా మంది మహిళా సభ్యులున్నారు. ఆరుగురో, ఏడుగురో జాతీయ స్థాయి అథ్లెట్లున్నారు. చాలా మంది సరదాగా కాలనీ లెవెల్లో రోజుకు అయిదు కిలో మీటర్లు ఫిట్ నెస్ కోసమో, బరువు తగ్గడం కోసమో మొదలుపెట్టిన వారున్నారు.   పరుగు ఒక మత్తు లాంటిది. ఫిట్ నెస్ ఒక వ్యసనం. బద్ధకించినన్నాళ్ళూ ఆ సొగసు తెలియదు గానీ, ఫిట్ నెస్, ముఖ్యంగా రన్నింగ్ జీవితంలో భాగమైన వారికి, ఇది ఒక తేలికగా వదిలేయగలిగే వ్యసనం కాదు.  

ఈ పరిగెత్తే ఔత్సాహికులు కొన్నాళ్ళ సాధన తరవాత, మెల్లగా వారే సీరియస్ రన్నర్స్ ఔతారు. అలాంటి వారు చిన్న చిన్న టీం లు గా అయి,  రోజువారీ, వారాల వారీ, చాలెంజు లు పెట్టుకుని పాల్గొంటున్నారు.   వీళ్ళలో చాలా మంది,  లోకల్ / outstation సిటీ మేరథాన్ లలో,   ఇంకా  పోయినేడు కోవిడ్ లో ఎవరి ఇంటిలో వారు ఆన్లైన్ మారథాన్ లలో కూడా పాల్గొన్నారు. ఈ సాధన వారిని శారీరకంగా ఎలానూ ధృఢంగా తయారు చేసేస్తుంది. కానీ వ్యాయామం, క్రమశిక్షణ, మనుషుల్ని మానసికంగా కూడా ఎంత దృఢంగా చేస్తాయో  చాలా తక్కువ మందికి తెలుసు.  డిప్రెషన్, ఒత్తిడి లతో బాధపడే వారు, ఏదో ఒక వ్యాయామన్ని, వీలయితే ఆరుబయట నడక, పరుగు, స్విమింగ్, సైక్లింగ్  లాంటివి ప్రయత్నించమంటారు అందుకే.  

ఆగస్టు 28 న , గాడియం స్కూల్ లో నిర్వహించిన ఈ   ఈ 12 గంటల స్టేడియం పరుగు ఈవెంట్ (DAWN TO DUSK RUN, A STADIUM RUN, 2021)  లో పాల్గొన్న అల్వల్ రన్నర్స్ క్లబ్లో ఒక మహిళా సభ్యురాలు,  ప్రముఖ సైక్లిస్ట్ , Dr.Niharika, ఈవెంట్ అనంతరం,  ఈ పరుగు గురించి తన అనుభవాన్ని టీం మెంబర్స్ తో పంచుకున్నారు. అది చదవగానే ఇది చాలా చాలా కాంటెంపరరీ అనిపించి, దీనిని అనువదించి, అందరితో పంచుకునేందుకు అనుమతి తీసుకున్నాను.  దీనిలో తప్పులన్నీ నావి. 


---------------------------------------------------------------------------------------------------------------------

You must not only have competitiveness but also the ability to never quit, regardless of the circumstances you face. 

ఆగస్టు 27 న అంటే, సరిగ్గా పరుగుకు ముందురోజు, మా ఇంటి  "భూమి పూజ" జరిగింది. దీనిలో చాలా బిజీగా ఉన్నాను. బాలా అలసిపోయాను,  కానీ మరుసటి రోజు పరుగులో పాల్గొంటున్నాననే భావన ఉత్సాహాన్ని కలిగించింది.   శనివారం నిద్రలేవగానే షాక్ తగిలింది.   ఖచ్చితంగా కారణం ఇదే అని చెప్పలేను గానీ,  కోవిడ్ కు స్పుత్నిక్-V వాక్సిన్ తీసుకున్నాక  నా  ఋతుక్రమం దెబ్బతింది.   అది కాస్తా 72 రోజుల తరవాత ఈరోజే మొదలయ్యింది. 

ఈరోజు నాకు ఎంత ముఖ్యమైన రోజు ?!   వొళ్ళంతా నొప్పులు, పీకుడు, పోట్లు, వికారమూ మొదలయ్యాయి. దానికి తోడు ఋతుస్రావం.  కానీ పట్టుదలగా పరుగులో పాల్గొనాలనే నిర్ణయించుకున్నా. అదెంత తప్పు నిర్ణయమో తరవాత తెలిసింది. "ఇలాంటి చాలెంజులు జీవితం లో ఎన్ని ఎదుర్కోలేదు ? ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో పనులు చక్కబెట్టుకురాలేదు నేను ? ఈ రెండు గంటల పరుగు నేనింతకు ముందు ఎదుర్కొన్న 27, 40 గంటల** పోరాటలకన్నా ఎక్కువా ఏంటి? పద పద ! నువ్వు చెయ్యగలవు!" అని నాకు నేనే చెప్పుకున్నాను.  

పవన్ దయతో, నన్ను వెన్యూ దగ్గర దాకా దిగబెట్టాడు. అక్కడ ఉత్సాహపూరిత వాతావరణం, అక్కడి క్రౌడ్ సపోర్ట్ చూసి, పూర్తి జోష్ వచ్చేసింది. ఎంత స్పూర్థిదాయకంగా ఉన్నారో అందరూ. వాళ్ళని చూసి, నా అసౌకర్యాన్ని ఎప్పుడో పూర్తిగా మర్చిపోయను  మా అల్వల్ రన్నర్స్ క్లబ్ స్నేహితుల్ని ప్రతి ఒక్కరినీ అక్కడ చూసి,  నా  ఉత్సాహం రెట్టింపయిపోయింది. 

పరుగు కు 30 నిముషాలుందనగా, వాష్ రూం కి వెళ్ళి, అంతా బానే ఉందని నిర్ధారించుకున్నాను. అక్కడి నుంచి తిన్నగా  వార్మ్ అప్ కోసం జుంబా సెషన్ లో పాల్గొన్నాను. పరుగు మొదలయ్యే సమయం వరకూ  ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించాను. వార్మ్ అప్ అయ్యాక, నా పరుగు బృందపు స్నేహితురాలు 'గార్గి '  తో నా అసౌకర్యం గురించి  మాటాడాను. పరుగు సమయంలో  ఏ బరువులూ ఉండకూడదు. అలాంటిది, ఆ చెమ్మ వాతావరణంలో   ఈ టాంపన్ పెట్టుకుని ఆ బరువుతో 20 కిలో మీటర్లు పరిగెత్తడం ఎంత అసౌకర్యమో అని మాటాడుకున్నాము. అవన్నీ తీసిపారేద్దామని బలమైన కోరిక కలిగింది.   బ్లీడింగ్ గురించి చింతించకుండా, ఏదయితే అది అయిందనుకుని టాంపన్ తీసేసి పరుగు కు సిద్ధపడ్డాను.  [టాంపన్ బదులుగా పాడ్ వాడొచ్చు. కానీ దానివల్ల అనవసరంగా ఇంకా రాషెస్ వస్తాయి, పైగా అడ్డు ]   అప్పుడు చాలా తేలిక గా,  స్వేచ్చ గా,  confident గా అనిపించింది. 

యాధృచ్చికంగా నా  సైక్లింగ్   స్నేహితుడు సత్య కేశవ్ ని కలిసాను. అతనిదీ, నాదీ  ఒకే టైం స్లాట్.  అతని పరుగు వేగం గురించి కనుక్కున్నాను. అదృష్టవశాతూ, అతనిదీ, నాదీ ఒకే పేస్. పరుగు మొదలయ్యాక, మెల్లగా మాటలు కూడా నడిచాయి. అతని ఉన్నత విద్య, ఉద్యోగం  ప్లాన్ ల గురించి, మాటాడుకున్నాం. నాకు అలా  తెలియకుండానే పది కిలో మీటర్ల పరుగు ఒక గంటా మూడు నిముషాలలో అయిపోయింది. నేను కొంచెం నీరు తాగాలని బ్రేక్ తీసుకున్నాను.

ఆ  తరవాత మేము టైం వేస్ట్ చెయ్యకుండా పరుగు మొదలు పెట్టాము. కేశవ్ అప్పుడు వేగం పెంచాలని నిర్ణయించుకున్నాడు. కానీ నా పరిస్థితి వల్ల నేను నా వేగం లోనే -  అంటే ఆరున్నర నిముషాలకొక కిలోమీటరు చొప్పున కొనసాగాను.   16 వ కిలో మీటరు చేరుకునే సరికీ కళ్ళు తిరిగిపోయాయి. వికారం, వాంతి వచ్చేలా అనిపించడమూ మొదలయింది. ఎక్కడ స్పృహ కోల్పోతానో అని భయపడ్డాను. అంతా చీకటయిపోయింది.  పొట్టలో తీవ్రమైన నొప్పి, సన్నని వర్షం లో ఆగకుండా తడుస్తూనే పరిగెత్తడం వల్ల, రక్తస్రావం వల్లా,  వొళ్ళంతా బరువుగా, చర్మం మీద దద్దుర్లు గా అయ్యి,  అస్సలు శరీరం సహకరించక, ఓ 30 సెకండ్లు అకస్మాత్తుగా ఆగిపోయాను. నా మనసుకు అప్పుడు నేనే ధైర్యం చెప్పుకోవాల్సి వచ్చింది. "ఇంకో 20 నిముషాలే ఉంది. ఎలా అయినా 18 కిలో మీటర్లు పరిగెత్తాలి. ఇప్పుడు ఆగిపోకూడదు. ఈ నొప్పి అంతా ఒకట్రెండు రోజుల్లో పోతుంది. నేను బానే ఉంటాను. ఇది కేవలం ఒక నెగటివ్ ఎమోషన్ !" అని నన్ను నేనే సముదాయించుకున్నాను. 


ఇటు పక్క నా టీం మెంబర్స్ చేసే ప్రోత్సాహపూరిత కామెంట్లు, కేకలు నన్ను నేను ఎలాగో ఒకలా  ముందుకు తోసుకుపోవడానికి దోహదపడ్డాయి. దీనంతటి లోనూ నేను ఆగిపోతే, వాళ్ళెంత డిసపాయింట్ అవుతారో అనేది కళ్ళ ముందు మెదులుతూంది. నేను ఇంతకన్న బాగా చెయ్యగలను. మా అల్వల్ టీం అంతా నన్ను ముగింపు వైపుకు పరిగెత్తేందుకు ఉత్తేజపరుస్తున్నారు. అక్కడి జనం అంతా నా పేరు, మిగిలిన నా సమయాన్ని గట్టిగా అరుస్తున్నారు. "చివరి రక్తపుబొట్టు దాకా ...."  తరహాలో, నా శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి పరిగెట్టా ఆ లాస్ట్ లాప్ మాత్రం.  


పరుగు ముగిసాకా, కలిగిన విజయానందం, మాటల్లో వర్ణించలేనిది. నా టీం అందరినీ  కలిసాను. నా విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాను.   కొన్ని ఫోటోలు తీసుకున్నాక, వాష్ రూం కి పరిగెత్తాను. అప్పటికి పూర్తిగా ముద్దలా తడిచిపోయున్నాను.   నా మనసంతా చాలా అలజడిగా ఉంది. పరుగు జరిగినంత సేపూ ఎందుకు పాల్గొన్నాన్నా అనిపించేలా చేసిన ఆ తీవ్ర అసౌకర్యం, నొప్పి, బాధ, శారీరక దౌర్బల్యం, నన్ను ఉక్కిరిబిక్కిరి  చేసెసాయి. గార్గి ని పట్టుకుని ఆపుకోలేక పెద్దగా ఏడ్చేసాను.  ఈ పరుగులో పాల్గొని తప్పు చేసానని నూటొక్కోసారి బాధపడ్డాను. అయితేనేం.. నేనీ పరుగుని పూర్తిచెయ్యగలిగాను.  ఇంత బాధ పడీ కూడా,  కష్టాన్ని ఓర్చుకోగలిగి, ఎదుర్కోగల గుణమేదో  నన్ను నా మనసునీ ఆక్రమించేసి, ఈ విజయాన్ని సాధించగలిగేను.  ఫ్రెష్ అయి, అయిదు నిముషాల్లో ఇంటికి బయల్దేరాను. 

నా వరకూ నైతే, ఈ ఆఖరి 16 కిలో మీటర్ల పరుగు చాలా కఠినమైనది. అది మనసుకీ, శరీరానికి జరిగిన సంఘర్షణ. అయితే, ఎప్పటిలాగే శరీరంపై మనసు గెలిచింది. 

నా ఈ విజయాన్ని నా పరుగు మితృడు శ్రీకాంత్ తాడూరి గారికి అంకితం ఇస్తున్నాను.  ఇంకా అల్వల్ రన్నర్స్  అందరికీ నా ధన్యవాదాలు. మీ దన్ను లేకపొతే, నేనసలు ఈ పరుగులో పాల్గొనేదాన్నే కాదు. ఇది నేను నా స్నేహితులకు రాస్తున్నాను. ఇదంతా నన్ను నేను ఉబ్బేసుకుందుకు కాదు. ఇది కేవలం ఒక చిన్న సందేశాన్నివ్వడానికి మాత్రమే. క్రీడల్లో పాల్గొనే మహిళ గా ఉండడం ఎంత కష్టమో, మీకు తెలియడానికి!  మా "ప్రదర్శన" ను మా "హార్మోన్లు" ఎంతో ప్రభావితం చేస్తాయి.  అందుకే, ప్రతి క్రీడాకారిణినీ చీర్ చెయ్యండి. వెన్ను తట్టి ప్రోత్సహించండి. నా తోటి మహిళలకు నేను చెప్పేది ఒకటే -  నేను చెయ్యగలిగితే, మీరూ చెయ్యగలరు.     


Notes : 

Hyderabad Runners Club 

Gaudium International School - They have a good running track

Dawn to Dusk 12 K Stadium Run video for full idea of the event by Nav. 

Nav K  is a vlogger, fitness enthusiast from Hyderabad. 

Dr Niharika  - భారత దేశంలో నెంబర్ 1 సైక్లిస్ట్.  సోషల్ మీడియా ఎక్కువ వాడరు. ఈ  Straha ఏప్ ని విస్తారంగా వాడతారు. అందుకే ఈ లింక్ ఇచ్చాను.   ఈవిడ పరుగు గురించి చెప్తూ, సైక్లింగ్ కూ, రన్నింగ్ కూ ఉన్న తేడా ల వల్ల, ఈ పీరియడ్ రన్నింగ్ కు కాస్త ఇబ్బంది పడ్డట్టు చెప్పుకున్నారు. సైక్లింగ్ లో పీరియడ్ సమయం లో మహిళలు వాడే సానిటరీ వస్తువులు పరుగు కు సూట్ కాకపోవచ్చు. టాంపన్ లు అందరికీ సౌకర్యంగా ఉండవు. కొన్ని శారీరక ఇబ్బందుల వల్ల, వాడేందుకు బాధాకరంగా ఉన్నా, చాలా మంది మహిళా క్రీడాకారులు టాంపన్లు వాడుతున్నారు.  

ఆమె ఫిట్ నెస్, సైక్లింగ్ నిపుణురాలు, mentor, coach.  తన సైక్లింగ్ అనుభవాల ను వివరిస్తూ, సూయి ఆవిష్కార్ అనే పుస్తకాన్ని కూడా రచించారు.   పైగా ఋతు సమయంలో మానసికంగా మహిళలు తమతో తాము చేసె మానసిక పోరాటం గురించి వోకల్ అవగలగాలని ఆశిస్తారు. 

** Dr. Niharika, వరుసగా దాదాపు అన్ని వారాంతాలూ ఈ హై ఎండ్యూరెన్స్ సైక్లింగ్ ఈవెంట్స్  లో పురుషులతో కలిసి పాల్గొంటారు. అవి 27 గంటల నుండీ (400 km) 40 గంటల (1000 km) పాటూ సాగుతుంటాయి.   కింద తన పుస్తకం లో తనగురించి పరిచయం.






Facebook page of Dr.Niha

Strava App 

----------------------------------------------------------------------------------------------------------------------------


22/08/2021

The Great Indian Novel - Dr.Shashi Tharoor

 శశీ థరూర్ - ఇప్పుడు వార్తల్నిండా అతనే... కాంగ్రెస్ లో ఉన్నా సరే ప్రజలు డంబ్ ఫెలో అని తీసి పారేయలేని వ్యక్తి.  పెగాసస్ వార్తలు మొదలైన దగ్గర్నించీ ప్రధాన మంత్రి తరవాత,  పార్లమెంటరీ పానల్ అధ్యక్షుడిగా, అంత గా పేపర్లలో ప్రత్యక్షమైన మనిషి.  

2006 లో కేవలం పబ్లిక్ ఆఫీస్ లో పని చేసిన అనుభవం లేకపోవడాన,  'బాన్ కీ మూన్' ముందు ఓడిపోయి, ప్రపంచ గుర్తింపు కు నోచుకునే UNGS - యునైటెడ్ నేషన్స్ జెనరల్ సెక్రటరీ పదవి కోల్పోయినందుకు,  కాంగ్రెస్ అతన్ని ఆహ్వానించి, మంత్రి పదవి ని ఇచ్చి, భారతీయ "టర్ఫ్ గేం" ను పరిచయం చేసింది.   భార్య అకస్మాత్ మరణం తరవాత దాదాపు చీకటవబోయిన కెరీర్ ని నెమ్మదిగా నెట్టుకొచ్చి, ఇప్పుడు క్లీన్ చిట్ పొందడం, అంతా  - విధి.  ఇప్పుడు అతను ఐక్యరాజ్య సమితి పదవులకు నామినేట్ కాకపోవచ్చు. కానీ, తన అందం, తెలివి తేటలతో, వాక్చాతుర్యంతో, రచనా పటిమతో, యువత లో చాలా మంచి పేరు తెచ్చుకున్న రాజకీయ వేత్త. 



ఇతను చాలా వ్యంగ్యాత్మకంగా 1989 లో  రాసిన చతురమైన నవల ఈ గ్రేట్ ఇండియన్ నోవెల్. దీనిలో అతను మహాభారత కథ ని భారత స్వతంత్ర పోరాటానికి, తరవాతి పరిణామాలకీ  ముడి వేసేసి, గాంధీ మహాత్మునితో కల్సి, నెహ్రూ, జిన్నా, సుభాష్ చంద్ర బోస్, ఇందిరా గాంధీ, మహరాజా హరి సింగ్,  లాంటి మహా నాయకుల్ని, నిర్దాక్షిణ్యంగా విమర్శిస్తూ,  (ఇండియా, పాకిస్తాన్ లలో వీరిని ప్రజలు ఆరాధిస్తూంటారు కదా) - మన స్వతంత్ర పోరాటాన్ని, గర్వించదగ్గ ప్రజాస్వామ్యాన్ని   అగౌరవపరచకుండానే - మహా భారతంలోని  పాత్రలను యధాతథంగా,   (ప్రతీకలుగా  కాదు, ఈసీగా తెలిసిపోయే చిన్న చిన్న పేర్ల మార్పులతో) తీసుకుంటూ, బ్రిటిష్ ప్రభుత్వాన్ని, వారి బిహేవియర్ ని చాలా సహజంగా - వారి దోపిడీ మనస్తత్వాన్నీ, స్వాతంత్ర భారతం లో వివిధ కొత్త పరిణామాల్ని, సీరియస్లీ సరదాగా వివరించడంలో సఫలీకృతుడయ్యాడు. 


పిచ్చి రాజకీయాల గొడవల్లో పడి, ఎమర్జెన్సీ, నక్సలిసం, అరాజకీయం, అరాచకత్వం,  అవినీతి,  అధికారంలో ఉన్నవాళ్ళు స్వలాభం కోసం ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేసేందుకు ప్రయత్నించడం, ఆతరవాత వచ్చిన తిరుగు దిద్దుబాటు  చట్టాలు, పొరుగు దేశాల్తో యుద్ధాలు, మనం ఆక్రమించుకున్న ప్రాంతాలు, రాజకీయ చతురత, బెడిసికొట్టిన నిర్ణయాలు - ఇలా ప్రతీదీ మనం ఒక జాతిగా ఎలా ఎదుర్కొన్నామో సులువుగా చెప్పేందుకు రాసినది ఈ  పుస్తకం. 

ఇంకా  "కాల పురుషుడి కథల్లో, దేనికీ ముగింపు ఉండదు. మనది ఒక జరుగుతున్న చరిత్ర!"  అని చెప్పడం ప్రధాన లక్ష్యంగా రాసిన పుస్తకం ఇది. ఇది చదివాక, వ్యంగ్యానికి ఇంత ప్రతిభ, రాజకీయాలమీదా, మహాభారతం మీదా ఇంత జ్ఞానం అవసరం అని తెలుస్తుంది.  రెండు దేశాల (భారత్, పాకిస్తాన్) చరిత్రల పట్ల సమగ్రమైన పట్టు, అవగాహన తో ఆయా నేతల్ని విమర్శించేందుకు తీసుకున్న నిర్దాక్షిణ్యమైన చనువు, వెక్కిరింత, ఈ రోజుల్లో ఊహకు కూడా అందని విషయం. 

ఈ పుస్తకం ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్, మళయాళ భాషల్లోకి అనువదించబడింది. ఈ పుస్తకానికి  యూకే లో ఇండిపెండెంట్ పత్రిక విడుదల చేసిన   "12 ఉత్తమమైన భారతీయ నవలల జాబితా (2020)"  లో స్థానం చిక్కింది.  అచ్చు మహాభారతం లో లాగే 18 భాగాలు (పర్వాలు/పుస్తకాలు)  - దాదాపు అన్ని ముఖ్య మహాభారత పాత్రలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పాత్రల్ని ఇస్తున్నాను. 

మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుండగా, గణేషుడు రాసుకుంటాడు. సరిగ్గా ఇలాగే దీన్ని శశీ థరూర్ అనే వేదవ్యాసుడు అనగా వీ.వీ (వీవీ గిరి అనుకోవచ్చు / రాజగోపాలాచారి గానీ) చెప్తుండగా గణపతి అనే ఒక పాత్ర రాస్తూంటుంది. మధ్య మధ్యలో ఈ వ్రాయసకారుడు ఆయా ట్విస్టులకీ టర్నులకీ ఉలికిపడుతుండగా వీ.వీ వాటికి తన రసవత్తర అనునయాలు కూడా చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ గణపతి ఒక్కడే అచ్చంగా గణపతి అన్నమాట. 

మహాత్ముడు లేని భారత దేశాన్ని, దేశ చరిత్రనీ ఊహించుకోలేము. తన సత్యాగ్రహంతో, అహింసే పరమధర్మమని విశ్వసించిన వాడు, ఘోరమైన శారీరక, మానసిక శ్రమని,  ఓర్చుకుని,  ఋషి లాగా దౌర్బల్యాలనీ అధిగమించి, ఒక్కడూ కోట్లాదిమందికి స్పూర్థినిచ్చి, దేశానికి స్వతత్రం తెచ్చిపెడతాడు మహాత్మాగాంధీ. ఇతను, అందరికీ పూజ్యుడు, గురువు, సేనపతి, తాత. సరిగ్గా ఇలాంటివాడే కదా గాంగేయుడు (భీష్ముడు)!  అందుకే ఆ భీష్ముడు ఇక్కడ గాంధీ (నవల లో గంగాజీ).   అయితే గాంధీ పాటించిన బ్రహ్మచర్యం, ఆ బ్రహచర్యం పాటించేందుకు అతను అవలంబించిన పద్ధతులు, (అమ్మాయిలతో గడపడం, తన ఆలోచనల్ని నియంత్రించుకోవడం సాధన చెయ్యడం, చిన్న కౌపీనం ధరించడం వగైరా ungentlemanly పనులతో) విమర్శలు ఎదుర్కొన్నాడు. భీష్ముడు కూడా బ్రహ్మచర్యం అవలంబిస్తాడు. ఆఖరికి ఆ బ్రహ్మచర్య దీక్ష వల్లనే ఎటూకానిదైపోయి వచ్చిన అంబ ని పెళ్ళి చేసుకోవడానికి నిరాకరిస్తాడు. ఆ అంబ,  శిఖండి అయ్యాక, ఆమె చేతిలోనే మరణిస్తాడు. ఇక్కడ గంగాజీ కూడా నాథూరాం గాడ్సే (శిఖండి) చేతిలో బలవుతాడు. 

ఇంకో ముఖ్య పాత్ర మహమ్మద్ ఆలీ జిన్నా : పాకిస్తాన్ కి ప్రాణం పోసిన వాడు. నానా పట్టూ పట్టి, దేశాన్ని ముక్కలు చేసేదాకా వదలడు. దేశం ఆవిర్భవించే ముందే కేన్సర్ బారిన పడినా, ఎక్కడా మాట పొక్కనివ్వడు. తనని బలహీనుడని పక్కన పెట్టేస్తారని భయం. ఇన్ని ప్రాణాలు తీసి, ఇన్ని కుటుంబాల్ని చిందరవందర చేసి, ఇప్పటికీ మన రెండు దేశాలూ కుత్తుకలు కోసుకునేంత శతృత్వాన్ని బహుమానంగా ఇచ్చిన పెద్దాయన, పాకిస్తాన్ స్వతంత్రం సాధించిన ఏడాది కూడా బ్రతకనేలేదు. ఎండి పీలికైపోయి, నిస్సహాయంగా కేన్సర్ బారిన పడి మరణించాడు. ఈయనకిలా ఒంట్లో బాలేకపోయినా, నొప్పితో, నీరసంతో అల్లాడుతూనే, గాంధీ, నెహ్రూలకి ధీటుగా మాటాడుతూ, ముస్లిం లీగ్ ని జట్టుగా నడిపించినందుకు (ముస్లింలు వివక్ష ఎదుర్కొంటారు, వారికి ఇంకో దేశం అవసరం అని గట్టిగా విశ్వసించబట్టి) అతన్ని కర్ణుడిని చేసేసాడు థరూర్. ఈ కర్ణుడు ఇలా దుర్బలుడు, తొందరలో చచ్చిపోతాడూ అని తెలిస్తే, ఈ విభజనని ఇంకాస్త డిలే చేసేవాడినే అని బ్రిటీషు దొర బాధపడీంతగా.. అంటే చచ్చిపోయే ఆఖరి క్షణం వరకూ పాకిస్తాన్ కోసం, తను నమ్మిన దానికోసం, ఎన్నో కష్టాలకోరుస్తూ పోరాడినందుకు కర్నిస్తాన్ (ముక్క దేశం) అనగా పాకిస్తాన్ ఫౌండర్ గా అక్కడ పూజ్యుడు. 

ఇంకా చాలా పాత్రలున్న్నాయి గానీ, కొన్ని తరచుగా వచ్చేవి : 

దృతరాష్ట్రుడు - గుడ్డిగా ముందుచూపు లేకుండా వ్యవహరిస్తాడని - నెహ్రూ 

పాండు రాజు - వొద్దన్న పని చేసి చచ్చిపోయాడని - బోస్ 

విదురుడు  - పటేల్ 

ద్రోణుడు  - జేపీ

శకుని - సిద్ధార్ధ్ శంకర్ రే (ఇందిర కు ఎమెర్జెన్సీ పెట్టమని సలహా ఇచ్చిన ఘనుడు)

జరాసంధుడు - యాహ్యా ఖాన్ 

శిశుపాలుడు - లాల్ బహదూర్ శాస్త్రి 

గాంధారి - కమలా నెహ్రూ 

ద్రౌపది - మన ప్రజాస్వామ్యం - పెక్కు భర్తలతో  (di Mocracy - నవల్లో పేరు. నెహ్రూకీ ఎడ్వీనా మౌంట్ బాటన్ కీ పుట్టిన అక్రమ సంతానం) 

కౌరవులు - కాంగ్రెస్ పార్టీ 

ప్రియ దుర్యోధని - ఇందిర (ఈ నవల్లో నూరుగురు కౌరవులు ఉండరు. గాంధారికి దుర్యోధని ఒక్కర్తే పుడుతుంది) 

అర్జునుడు - పత్రికలు,  వగైరా. 

ఈ పుస్తకంలో ఇంకా ఎన్నో ముద్దు పేర్లు - ప్రాంతాలకు ఉన్నాయి. అప్పటికి ప్రసిద్ధమైన ఎన్నో పుస్తకాల పేర్లనే తన పర్వాలకు కొద్ది మార్పులతో కొంటె గా పేర్లు గా పెట్టుకున్నాడు రచయిత.  చైనా  మన  దేశంలో  చిన్న ముక్క ఆక్రమించేసరికీ, మనసు కష్టపెట్టుకుని నెహ్రూ కి గుండె ఆగి చనిపోయాడని చెప్తాడు. 

జలియన్ వాలా బాగ్, దండి సత్యాగ్రహం (మామిడి పళ్ళ కోసం ఉద్యమం ట), నీలిమందు ఉద్యమం, చోరాచోరీ ఉదంతం, అన్నిటికీ వేరే పేర్లు.  చైనా కి చిత్ర అంట. కష్మీర్ - (cash) కేష్ తీసేసి మనీ (money) అని పెట్టి మనీమీర్ అంట - ఇలా Goa ని Comea - కమియా అనీ ఇలా !  ఇంకా భయంకరం కష్మీర్ ని ఇండియాలో కలపడం.  దీనికోసం మహరాజా హరీ సింగ్ ని కలవడానికి వెళ్ళటం, అప్పటికి ఆయన విలాసాలలో ఉండటం (ఇలా రాయడానికి ఎంత ధైర్యం ? నిజానికి శ్రీనగర్ వాళ్ళు కనీసం ఆయన్ని దేవుడి లాగా చూస్తారు)   

కొన్ని విపరీతమైన స్వతంత్రాలు - ఆ రచయిత కి ఉన్న ఉగ్గబెట్టుకున్న కోపాన్ని వ్యక్తీకరిస్తాయేమో అనిపిస్తుంది. అయితే, మన వాడు  జలియన్ వాలా బాగ్ ఉదంతం గురించి మాత్రం కళ్ళు అంటుకునేలా వర్ణిస్తాడు. డయ్యర్ ఇండియాలోనే పెరిగిన వాడు. బిషప్ కాటన్ స్కూల్ లో చదివాడు. అయినా  భారతీయుల పట్ల,  మనుషుల పట్ల కరుణ లేనివాడెలా ఔతాడు ? పోనీ వాడు కాల్చమంటే కాల్చిన  సైనికులు మనవాళ్ళే కదా. కళ్ళెదురుగా చచ్చిపోతున్న, ఆర్తనాదాలు చేస్తున్న మనుషుల, నిస్సహాయుల, ఆక్రందనలకి వాళ్ళ చెవులు పేలిపోలేదా, మనసు మొద్దుబారిందా ? వాళ్ళ గుండె ఎందుకు ఇదంతా కానిచ్చింది ? వాళ్ళూ మనుషులా ? మిషన్లా? అని ఆక్రోశిస్తాడు. 

జలియన్ వాలా బాగ్ ఉదంతం తరవాత ప్రపంచం దృష్టి భారత దేశం మీద పడింది. అంతవరకూ ఈ స్వతంత్రపోరాటం అదీ ఏదో 'మీ అంతర్గత వ్యవహారం, మాకెందుకూ?' అనుకున్న ప్రపంచం, డయ్యర్ చర్యల్ని తీవ్రంగా ఖండించింది.  అయితే,ఆయన ని వీరుడిగా పరిగణించి, దేశం నుండీ వెళ్ళేటప్పుడు బ్రిటన్ విచారణ చేసి ఒకవేళ ఆయన ఉద్యోగం  పీకేసినా, అతని వంశం కొన్ని తరాలపాటూ కూర్చుని తినేంత డబ్బుని,  భారత దేశంలో మొదటి స్వతంత్రపోరాటం లో చనిపోయిన బ్రిటీషు వారి కుటుంబాల నుంచీ, ఎందరో బ్రిటీష్ సానుభూతిపరులు కొన్ని వేల పౌండ్లని సేకరించి ఇచ్చారు.  ఇలాంటి చిన్న చిన్న డీటైల్స్ ని, వ్యంగాత్మకంగా చెప్పడానికి చరిత్ర ని, బ్రిటీష్ వారి దోచుకెళ్ళే మనస్తత్వాన్నీ తీవ్రంగా ఇప్పటికీ విమర్శిస్తూ ఉండే థరూర్ రాయటం, చాలా బావుంటుంది. ఇవన్నీ జరిగిపోయిన కబుర్లు కాబట్టి, ఈ నెరేషన్ చాలా కేజువల్ గా రక్తం మరిగిస్తూ ఉంటుంది. 

కౌరవ సేన నే కాంగ్రెస్ గా, ఆ తరవాత వచ్చిన వివిధ ఇతర రాజకీయ పార్టీల పెరుగుదలల్నీ, అయోమయం లో పడిపోయి, ఎమర్జెన్సీ తరవాత వచ్చిన ఎలక్షన్ ల లో ఎలాగో గెల్చినా, మళ్ళీ ఎన్నికల కల్లా, ఇందిర ముందు చతికిల బడిన విలువలున్న రాజకీయ నాయకులు, పత్రికలు, నకుల సహదేవుల్లాంటి భారతీయ సివిల్ ఫారిన్ సర్వీసుల అధికారులు, వీళ్ళందరినీ కూడా ముద్దుపేర్లతో వర్ణిస్తాడు. 

మహాభారతాన్ని ఆధారంగా తీసుకుని రాసిన పుస్తకం కాబట్టి, చిన్న చిన్న పాత్రల్ని కూడా వదలక, విస్తృతంగా అందరిని, అన్నిటినీ పరిచయం చేస్తుంటాడు రచయిత. దీనిలో ఎపుడో విని మర్చిపోయుంటాం తరహా - అర్జునుని భార్యలు, పిల్లలు నుంచీ  అశ్వథామ, యుధిష్టరుని స్వర్గారోహణం - తీరా స్వర్గంలో అతనికి దుర్యోధని ఎదురుపడడం - భారతం తో పోల్చదగ్గ వివరణలు  భలే ఉంటాయి. ఎసెన్స్ ని వదిలేయకుండా !   

ఉదాహరణకు యమధర్మరాజుకు, యుధిష్టరునికీ మధ్య సంభాషణ లో ఒక పేరా.   : 

Accept doubt and diversity. Let each man live by his own code of conduct, so long as he has one.  Derive your standards from the world around you and not from a heritage whose relevance must be constantly tested.  Reject equally the sterility of ideologies and the passionate prescriptions of those who think themselves infallible.  Uphold decency, worship humanity, affirm the basic values of our people - those which do not change - and leave the rest alone.  Admit that there is more than one Truth, more than one Right, more than one dharma....." 

................

ఇప్పటి భారత దేశం చాలా మారింది. రాజ్యం అవినీతి సంగతేమో గానీ ప్రజలు అవినీతిపరులయిపోయారు. వీళ్ళకి చరిత్ర, రాజ్యాంగం, మన దేశ ప్రతిష్ట,ఏమీ తెలీదు. చదువుకున్న మత దురహంకారులు, చదువులేని ఓటు అమ్మకందారుల చేతిలో మన పిల్లల భవిష్యత్తు ఉంది. అయితే, ఇంకా కథ ఉంది. అది నడుస్తూనే ఉంటుంది. అదొక్కటే రిలీఫ్. 


🙈🙉🙊

.................


Note :  మహా భారతం ఒక మతానిదీ అని చూడకుండా చదివితే, ఇది రాజ్యం కోసం, అధికారం కోసం, ఎప్పటికప్పుడు నిర్వచనాలు మారిపోయే ధర్మం గురించి జరిగిన ఒక యుద్ధం గురించి చెప్పే కథ. ఈ గ్రేట్ ఇండియన్ నోవెల్ లో అస్తమానం ఈ ధర్మం గురించి ప్రస్తావన వస్తుంటుంది. ఉదాహరణ కి వారసులు లేని రాజ్యం అయితే, బ్రిటీష్ వాడు ఎనెక్స్ చేసుకుంటాడు కాబట్టి, కుంతి, మాద్రి, గాంధారి, వివాహానికి బయట, వేరే పురుషుల ద్వారా సంతానాన్ని పొందుతారు. ఇది పెద్దల ఆజ్ఞానుసారం, భర్త అనుమతి తో జరుగుతుంది. వ్యాసుడు కూడా మధ్యలో ఒకసారి ఇలా ప్రత్యక్షం అయి, తన పాత్ర ముగిసాక, తెర వెనక్కి నెరేటర్ స్థానానికి వెళిపోతాడు.  

గాంధీ నెహ్రూల వివిధ నిర్ణయాలు, వివిధ సందర్భాలలో వారికి తోచిన సమాధానాలు, బోస్ చేపట్టిన సైనిక తిరుగుబాటు, జిన్నా పట్టుబట్టిన పాకిస్తాన్ మత్రం, ఇవన్నీ ఎక్కడికక్కడ ధర్మాలే. వాటి పరిణామాల్ని వారు కూడా ఊహించి ఉండరు. ధర్మం అనే బ్రహ్మ పదార్ధం గురించి ముఖ్యంగా పాశ్చాత్య పాఠకుల కోసం చిన్న వివరణ ఇచ్చాడు థరూర్. 





This got  first published in pustakam.net - 

http://pustakam.net/?p=21691

30/07/2021

ఒడిసీ - తెలుగు: బీనా దేవి





ఇలియడ్ చదివి, వీలయితే ట్రాయ్ - నెట్ ఫ్లిక్స్ సిరీస్ రెలీజియస్ గా చూసి కళ్ళు తుడుచుకున్నాకా చదవాల్సిన పుస్తకం, దాని కొనసాగింపు "ఒడిసీ". నిజానికి ఇది కూడా చాలా పెద్ద విషాద గాధ. కాకపోతే, సుఖాంతం. సుందరకాండ లాగా చదివిన వారికి గుండె ధైర్యాన్ని, కష్టాల్ని ఎదుర్కోవడానికి కావల్సిన స్థైర్యాన్ని, స్తితప్రజ్ఞతనూ, ఇంకా ముఖ్యంగా patience ని ఇస్తుంది.  హోమర్ రాసిన ఇలియడ్ లో గ్రీకు సైన్యానికి చీఫ్ (chief strategist), పిచ్చెక్కినట్టు నటించినా వొదలక, బలవంతంగా ఒప్పించి గ్రీకువీరులు యుద్ధభూమికి లాక్కుపోతే, పదేళ్ళ యుద్ధం, తరవాత ఇంకొన్నేళ్ళు (పది) సముద్ర యానం, షిప్ రెక్ లు, దేవతలూ, దయ్యాలకు కోపాలు తెప్పించే వీరోచితమైన పనులు చేసి, బలగం అంతా కళ్ళెదురుగా చనిపోయాకా, ఒక్కడూ ఎలానో బ్రతికి, ఒక దేవత చేతిలో బందీ అయి, గ్రహబలాలు కలిసొచ్చి, శాపాలన్నీ అనుభవించాక, అష్టకష్ఠాలనంతరం,  భార్యా బిడ్డల్ని చేరుకునే ఒడిసీసియస్ కథ ఇది. 

గ్రీకులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకీ మనకీ వ్యాపార సంబంధాలుండేవి. నిజానికి స్పార్టా రాణి హెలిన్ ని అసలెవరో భారత రాజు కూడా చేసుకుందామనుకుని కానుకలు పంపాట్ట కానీ, ఆవిడ తిరక్కొట్టిందంట. ఆ కానుకలు పట్టు పీతాంబరాలు.. మిరియాలు, పసుపు - ఆఫ్రికా నుండి కూడా పసుపు, దాల్చిన చెక్క పంపేవారనీ విన్నాను. ఇంకా ఇలియడ్ నే మన పురాణేతిహాసాల కు స్పూర్థి అనీ, ఇంకా ఈజిప్టు రాజు కథే, కాలక్రమేణా ఆర్యుల నోటి వెంట భారత దేశానికి ప్రయాణం చేసి, పరిణామం చెంది, రాముడి కథ అయిందనీ రక రకాల ప్రతిపాదనలు ఉన్నాయి. 

అయితే, ఈ పుస్తకం 'ఒడిసీ'  - అదీ మన తెలుగు లో, పిట్ట కథ లాగా, అచ్చ తెలుగులో కాసిని ఇంగ్లీషు పదాలతో, చిన్న పిల్లలకి కూడా అర్ధమయ్యేంత సరళత తో, కొంచెం హాస్యంతో, వదిలేయాల్సిన వివరాలు వొదిలేస్తూ, (ఎందుకు వొదిలేసారో చెప్తూ) చెప్పల్సిన సంగతులు మాత్రం చెప్తూ ఉండడం వల్ల చాలా బావుంది. బీనాదేవి గారి చెప్పడం చాలా బావుంది. ఇది కూడా అదృష్టవశాత్తూ దొరికిన పుస్తకమే కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ చదివడం జరిగింది.  

ఆవిడ వాడిన సరళత ఉదాహరణ కి :  

అనగా అనగా గ్రీసు దేశంలో అయోనియన్ సముద్రంలో ఒక చిన్న దీవి. పేరు ఇథాకా. దాని రాజు ఒడిసియస్. అతి తెలివైనవాడు, జిత్తులమారి. ఈటెను విసరడంలో బహునేర్పరి. స్వార్టా రాజు ఇకారియస్ కూతురు పీనోలోప్ ను పెళ్ళిచేస్కున్నాడు. పీనోలోప్ కీ ఓ పిల్ల కథ ఉంది. ఆ పిల్లని చిన్నప్పుడు తండ్రిపోసిడాన్ కొడుకు చేత సముద్రం లో విసిరేయించేస్తాడు. ఎందుకో ? హోమరు ఇష్టం. ఆమెని పీనీలోప్లనే బాతు జాతి పక్షుల గుంపు కాపాడి ఒడ్డుకు చేర్చాయి.  అప్పుడా తల్లితండ్రులకు ఆశ్చర్యం వేసి, ఆ పిల్లని తెచ్చుకుని, పీనీలోప్లు కాపాడాయి కాబట్టి పీనోలోప్ అని పేరు పెట్టారు. అసలు పేరు ఆర్నీషియా. 


ఇలాంటి కథే మనకీ ఉంది. మేనక విశ్వామిత్రుడి వల్ల పుట్టిన పిల్లని అడవిలో వదిలేస్తే (ఏం? ఇంద్రలోకంలో పిల్లలు ఉండకూడదా?!) శాకుంతలాలు అనే పక్షులు కాపాడేయి. అప్పుడు కణ్వమహర్షి ఆ పిల్లని తెచ్చి పెంచుకున్నాడు. ఆ పక్షుల పేరే శకుంతల అని పెట్టేరు. 


పెళ్ళి చేసిన తరవాత అదే తండ్రి ఒడిసియస్ ని తన రాజ్యంలో ఉండిపొమ్మని బతిమలాడేడు. ఒక దేశానికి రాజుని.. మరో దేశానికి ఇల్లరికవా! షట్. ఉండనని భార్యని తీసుకుని ఇథాకా వెళ్ళిపోయాడు. వాళ్ళ గదిలో పడుకోవడానికి మంచం తనే స్వయంగా తయారుచేసేడు. ఏం? రాజుగారికి పనివాళ్ళే లేరా ? ఉన్నారు. కానీ ఆ మంచానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ గది మధ్యలో ఉన్న్ ఆలివ్ చెట్టు మానుని మంచానికి ఒక కోడుగా వాడేడు.  ఈ సంగతి  అతని భార్యకీ, ఒక దాసీదానికీ మాత్రవే తెలుసు. వాళ్ళకి ఒక కొడుకు పుట్టేడు. పేరు 'టెలిమాకస్' . ఒడిసియస్ భార్య కొడుకుతో సంతోషంగా ఉన్నాడు. 


ఇంతే కాదు. ఈ సుఖంగా ఉన్న ఒడిసీసియస్ జీవితంలో హెలెనా లేచిపోవడము గందరగోళం సృష్టిస్తుంది. నానా కష్టాలు పడి, "తప్పదు బంధునాశనము" అని తెలిసీ, భార్యని మళ్ళీ కలుసుకుంటాడో లేదో అనే బెంగతోనే పిల్లాడిని వదిలి, పెద్ద ఘోరమైన యుద్ధం చేసొచ్చి, ఆ శతృ, స్వజన నాశనం తో ఎంతో భారంగా, తిరుగు ప్రయాణంలో చెడ్డశకునాల్ని చూసి బాధపడుతూ, సముద్రంలో నానా కష్టాలు పడి, ఎలాగో ఇల్లు చేరతాడు. 


ఈ చేరడానికి కొన్నేళ్ళు పడుతుంది. ఇల్లు చేరాకా భార్య కోసం ఇంకో యుద్ధం చెయ్యాల్సొస్తుంది. మధ్యలో ఆయన పడిన కష్టాలు, చంపిన శత్రువులు, చూసిన నరకమూ, (వైతరిణి లాంటి నది దాటి, నరకానికి పోయి, చనిపోయిన వారితో మాటాడతాడు - అదో హృదయవిదారకమైన ఘట్టం) చనిపోయిన తల్లిని చూస్తాడు. అప్పటికి తన మీద బెంగతోనే  ఆవిడ మరణించిందని తెలియదు. ఇంటిదగ్గర భార్య చిక్కుల్లో ఉన్న విషయం ఆవిడే చెప్తుంది.  అలాగే ఆ ఆత్మల్లో,   ట్రాయ్ యుద్ధంలో తనతో పాల్గొని విజయులై, ఇళ్ళకి ప్రయాణం అయిన తన  సహచరుల్ని చూస్తాడు. అరె, విజయం వరించి ఇళ్ళకు వెళ్ళినవారిని కూడా శాపాలు (మృత్యువు) ఎలా వెన్నాడాయో కదా అని విచారిస్తాడు. అక్కడ దెయ్యాలన్నీ (ఆత్మలు) తమ కథలు ఒడిసియస్ కు చెప్పుకుంటాయి. ఈ చాప్టర్ ని కూడా బీనాదేవి చాలా బాగా క్లుప్తపరిచి హాస్యంగా (తేలికపరచలేదు) ముగించి, కధని ముందుకు దూకిస్తారు.  దీంతో వీరాధివీరులు, అజేయులు కూడా ఎలా మరణిస్తారో చూసి ఆశ్చర్యం కలుగుతుంది.






సుమారు 2800 ఏళ్ళ క్రితం ఒక స్ట్రీట్ సింగరు గానం చేసిన గాధలకి ఇంత ప్రాచుర్యవా? అది అర్ధం చేసుకోవడం ఇంతటి మహా యజ్ఞ్యమా అని ఆశ్చర్యపోతాం మనం. దీనిలో ప్రతి కథకీ  కొన్ని కారణాలుంటాయి. ముందుదో, తోకదో ఒక అనుబంధ కథ ఉంటుంది. "అల్లప్పుడెప్పుడో మీరు మామాటిన్లేదు గాబట్టి, మేమిప్పుడు మీ మాటినం" అంటారు అందరూ. బలులివ్వక పోతే దేవతలకి కోపాలు. సూర్యుడికీ, గాలి కీ అందరికీ కోపాలు, శాపాలు.  సముద్రయానం లో ప్రకృతి సహకరించడం, సహకరించకపోవడం దేవతల చేతిలోనే ఉంటుంది. ఏదో కొందరు  దయగల దేవతల వల్ల కథ నడుస్తుంది. 


అలా... ఈ మేజ్ లో అన్ని కథల్నీ ఒక లైనులో పెట్టి, కారణాల్ని విడమర్చి మనకెవరు చెప్తారు చెప్పండి?  ఇది మామూలు  మేధ కి అంత తొందరగా అందని విషయం. మనసు ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి యజ్ఞ్యాలు, మంచి మంచి రచయితల చేత చేయించి ఇంతందమైన పుస్తకాలు వేస్తున్నంత కాలమూ, అనువాదాలు, "తిరిగి కథలు చెప్పడాలూ" ఇంత చక్కగా ఉండడమూ జరిగినన్నాళ్ళూ, "చదువుకోవడం" ఒక ఆనందదాయకమైన వ్యాపకం గా కొనసాగుతుంది. రచయిత్రికీ, (బీనాదేవి ఒకరే రాసారు) పబ్లిషర్స్ కీ వేల వేల ధన్యవాదాలు. 


***