Pages

11/01/2018

సతి - శరత్ చంద్ర చటర్జీ [The Devoted Wife - Sharat Chandra Chatterjee]






బెంగాల్ లో పబ్నా అనే ఓ ఊర్లో హరీష్ ఒక పేరొందిన లాయర్.  అతని భార్య నిర్మల, అతని విధవ చెల్లెలు ఉమ. ఇదే అతని కుటుంబం.  హరీష్ ఆ ఊర్లో ప్రముఖుడు కావడాన, ఊర్లో జరిగే సభల్లోనూ, కార్యక్రమాల్లోనూ అతనిది ఓ చెయ్యి తప్పని సరిగా ఉంటుంది.  సాధారణంగా చూస్తే అతని జీవితం పూలపానుపు కావల్సింది. కానీ నిర్మల - అతని భార్య - ఆవిడ అనుమానంతో అతన్ని కాల్చుకు తినకపోతే, ఆర్ధికంగా మంచి స్థాయి కి చెంది, సమాజంలో పరువు ప్రతిష్ఠా ఉన్న,హరీష్ లాంటి మనిషి కి,  ఆ జీవితం చాలా బావుండేది. 

హరీష్ తండ్రి రాం మోహన్ బారిసాల్ లో సబ్ జడ్జ్ గా పనిచేసేవారు. అక్కడ పక్క ఇంట్లో హరకుమార్ మజుందార్ అనే స్కూల్ ఇన్స్పెక్టర్ కూడా ఉండే వారు.  రాం మోహన్ ఇంట్లో ప్రతీ సాయంత్రం మితృలతో గోష్టి లాంటిది జరుగుతూండేది.  కలకత్తా లో లా చదువుతూ, బారిసాల్ కి సెలవులకని  వచ్చిన  హరీష్ కి ఓ మారు ఈ గోష్టి లో హర కుమార్ సౌమ్య, స్థిర వాదనా, వ్యక్తిత్వమూ, మిత భాషణ చాలా ఆకర్షించి, ఇద్దరికీ మధ్య ఒక గురు శిష్య సంబంధం లాంటిది ఏర్పడుతుంది.  హర కుమారుడి కూతురు లావణ్య ప్రభ.  హరీష్ కన్నా చిన్నది.  పీ. యూ. సీ చదువుతూండేది.   వీళ్ళిద్దరి మధ్యా వయసులో ఉండటం వల్ల చిన్న ఆకర్షణ లాంటిదాంతో పాటూ, చనువు,  దగ్గరతనం ఏర్పడుతుంది.  హర కుమార్ స్నేహంలో, అతని నీడలో హరీష్ చదువు కూడా చక్కగా సాగి, పరీక్షలు రాయడానికి కలకత్తా వెళ్ళిన హరీష్ చక్కగా పాసవుతాడు.  ఈ పిల్ల లావణ్య మాత్రం ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినందుకు సిగ్గు పడదస్సలు.  ఇంటికొచ్చిన హరీష్ ఎందుకు ఫెయిల్ అయ్యావు అని నిలదీస్తే, ఇప్పుడు చదువు నా వల్ల కాదని చెప్పేసి, నవ్వి, అక్కడ్నుంచి వెళిపోతుంది లావణ్య.  ఎందుకు కాదో అర్ధం కాదు హరీష్ కి.

అయితే వీళ్ళిద్దరి సాన్నిహిత్యం చూసి భయపడిన హరీష్ తల్లి, తండ్రికి చెప్పడం, అతను పరమ ధార్మికుడైన, చాందసుడైన, తన స్నేహితుని కూతురు నిర్మల కి కొడుకుతో సంబంధం నిశ్చయించడం.. వెంట వెంటనే జరిగిపోతాయి. అక్కడ కలకత్తా లో చదువుకుంటున్న హరీష్ కి తండ్రి నిర్ణయం, తన వివాహపు వార్త తెలిసి ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది. సన్యాసుల్లో కలిసిపోదామనుకుంటాడు.  అయినా సాంప్రదాయ వాది కాబట్టి, తండ్రి ఆజ్ఞ్య జవదాటలేక, నిర్మల ని పెళ్ళి చేసుకుంటాడు.  పెళ్ళి కి వచ్చిన హర కుమార్ మజుందార్ ని, ఈడొచ్చిన పిల్ల ని చదువు పేరుతో పెళ్ళి చెయ్యకుండా వదిలడం గురించి,  పాశ్చాత్య చదువులు, పోకళ్ళ గురించి వ్యంగ్య బాణాలతో  వధించాలని చూస్తాడు రామ్ మోహన్.   కానీ. మంటపం లో అందరికీ అర్ధం అయిన ఆ వ్యంగ్యాలు తనని ఉద్దేశించినవే అని  ఎంత మాత్రం  అర్ధం చేసుకోలేనంత స్వచ్చమైన మనస్సు ఉన్నవాడు హర కుమార్ మజుందార్.  

అలా నిర్మల హరీష్ జీవితం లో కి ప్రవేశిస్తుంది. పెళ్ళవుతున్న నిర్మల కు తల్లి ఇచ్చిన సలహా వీళ్ళ జీవితాల్ని శాసిస్తుంది.  అది "భర్తని ఒక క్షణం కూడా వొదలకుండా పర్యవేక్షించుతూ ఉండు. ఒక్క క్షణం కూడా కళ్ళు మూసావో, అతను నీ చేతిలోంచీ జారిపోగలడు జాగ్రత్త !  ఇల్లూ, సంసారం తరవాత. ముందు నీ పట్టు కోల్పోకు!! " అన్నది.   ఈ సలహా ని నిర్మల పెళ్ళయిన క్షణం నుంచీ మర్చిపోక, తూచా తప్పకుండా అమలు చేస్తూ, హరీష్ జీవితాన్ని సర్వ నాశనం చేస్తుంది. 

ఈ నిరంతర పర్యవేక్షణ, నిష్కారణ అభాండాలు, ఎప్పుడూ ఘర్షణ, హరీష్ సున్నిత మనస్తత్వాన్ని గాయపరుస్తాయి.  ఎంత సంపద ఉన్నా, సమాజంలో ఎంత స్థానం ఉన్నా, ఇంట్లో అతని బ్రతుకు దుర్భరం.  అతని ప్రతి చర్య, ప్రతి కదలికా, అతని సామాజిక జీవితాన్ని కూడా ప్రభావితం చేసేంత దిగ్బంధనం, లేశ మాత్రమైన ప్రేమ లేని వివాహ బంధం, అతనికి బంధనాల్లా, గుది బండల్లాగా తయారవుతాయి. అతను ఎంత లాయరయినా,  ఎంత చదువుకున్నా,  పాశ్చాత్య చదువులు చదివినా,   "నేను క్రైస్తవుణ్ణయితే  భార్య కు విడాకులివ్వ గలిగేవాణ్ణి, ముస్లిం అయి ఉంటే తలాక్ ఇచ్చేసే వాణ్ణి. బెంగాలీ బ్రాహ్మణుణ్ణి. ఏమని చెప్పి విడాకులివ్వాలి ?  ఈమెను వదిలేస్తే తరవాత ఆమె గతి ఏమిటి?" అని ఆలోచించి, సాలె గూళ్ళో చిక్కుకుపోయిన కీటకం లా -  విల విల లాడుతూంటాడు.  అతని తండ్రి అప్పటికి మరణించాడు.  ముసలి తల్లి తన తోనే వుంటుంది.  కానీ ఆమె తో మానసిక సాన్నిహిత్యం తక్కువ. అతన్ని కాస్తో కూస్తో సానుభూతి తో చూసేది ఉమే.  కానీ ఆమె కూడా అశక్తురాలు.

ఈ నిర్మల విచిత్రమైన వ్యక్తి. ఆమె కి భర్త అంటే ప్రేమ లాంటిదేమీ లేదు. అతను ఆమె ఆస్థి!  సంపాదన. అంతే.  అయితే ఒక సారి హరీష్ కి కలరా సోకి, డాక్టర్ ఆశ వదులుకొమ్మని చెప్పినప్పుడు - నిర్మల ఏ మాత్రం చలించక,  దేవాలయానికి వెళ్ళి దేవుడి విగ్రహం ముందు కఠోర ప్రతిజ్ఞ చేస్తుంది.  "హరీష్ కి బాగయ్యే దాకా నేను ఇంటికి వెళ్ళను. ఒక వేళ అతనికి ఏమన్నా అయితే, నేనూ అతని తోనే వెళ్ళిపోతాను!"  అని!   ఒక్క పూటే  భోజనం చేసి, ఓ పదిహేను రోజుల పాటు ఆ దేవాలయం లోనే నిద్రపోయి, అక్కడే పూజలు చేస్తూ గడిపేస్తుంది. 

హరీష్ అదృష్టమో, దురదృష్టమో, నిర్మల అదృష్టమో అతనికి ప్రమాదం తొలగి, ఆరోగ్యం కుదుటపడుతుంది. దాంతో అందరూ నిర్మల ను సతీ సావిత్రి లాంటి నిబద్ధమైన పతివ్రత అని, పుణ్యాత్మురాలని అని, వేనోళ్ళ కొనియాడతారు. హరీష్ అదృష్టాన్ని లక్ష నోళ్ళతో పొగుడుతారు.  హరీష్ కోర్ట్ కి వెళ్ళినా, బార్ కి వెళ్ళినా, క్లబ్ కి వెళ్ళినా.. ఇదే ప్రస్తావన, నిర్మల ని ఆకాశానికి ఎత్తేయడం. అయితే ఈ నాటకం (!)   అంతా ఎరిగిన హరీష్ వాళ్ళందరికి కేవలం ధన్యవాదాలు చెప్పి ఊరుకుంటాడు.  అతనికి తన అదృష్టం మీద నమ్మకం ఎప్పుడో పోయి ఉంటుంది.  


అటు వైపు లావణ్య బాగా చదువుకుంటుంది. ఆమె తల్లి తండృలు కూడా మరణిస్తారు.  ఆమెకి వివాహమై, ఒక కొడుకు. కలకత్తా లో ఉద్యోగం. కానీ దురదృష్టవశాతూ ఆమెను వైధవ్యం వెంటాడుతుంది. అయినా చదువు అండదండలతో తన జీవితం తాను చక్కగా బ్రతుకుతుంటుంది.   కలకత్తా హై కోర్ట్ లో ఏదో కేస్ నిమిత్తమై వచ్చిన హరీష్ కి ఆమె అనుకోకుండా కలుస్తుంది. మామూలు స్నేహితుల్లా కలుసుకుంటున్నా, ఇంటి దగ్గర బల్లెం లాంటి మాటలతో పొడుస్తుండే నిర్మల,  కలకత్తాకి వెళ్తున్నావు గా,   లావణ్య ని కలుసుకున్నావా అని  ఎంత గుచ్చి అడిగినా, ఆమె ను కలుసుకోలేదనే చెప్తాడు హరీష్. 

హరీష్ బ్రతుకు అప్పటికే ఇంట్లో పని వాళ్ల ముందు, ఆఫీస్ లో సిబ్బంది ముందు అవమానాల పాలవుతుంది.  నిర్మల రెండు కళ్ళు,  పదింతలై అతన్ని చుట్టు ముట్టేసే వుంటాయెప్పుడూ.  వాళ్ళిద్దరూ ఇలాంటి ఘర్షణ తలెత్తినప్పుడల్లా రోజుల తరబడి మాటాడనే కోరు.  అతను ఎన్నో ఏళ్ళుగా వేరే గదిలో నో, తన ఆఫీస్ గదిలోనో పడుకుంటున్నాడు.  క్లబ్ లో, బార్ లో మాత్రం,  అతని పరిస్థితి మరీ తల్లక్రిందులై వుంటుంది.  నిర్మల ఎపుడన్నా - వృత్తిరీత్యానో  లేదా, అవసరార్ధమయినా,  ఒక స్త్రీ తోనో, ఏ విధవ క్లైంట్  తోనో మాటాడుతున్నపుడు అకస్మాత్తుగా అతని ఆఫీస్ లోకి చొరబడి హరీష్ ని వాళ్ల ముందే కేకలేసి, వాళ్ళ సంభాషణ విన్నానని అదీ ఇదీ అంటూ,  భర్తని వొదలమని  ఆ స్త్రీ ల కాళ్ళ మీద పడి ఏడవడం,  వాళ్ళు ఈ ఏడుపూ, అనుమానపు అభాండాల్ని తీవ్ర అవమానం గా భావించి వెళ్ళిపోవడం జరగడం వల్ల, ఇలా, ఆమె  తన పరువు గురించి అస్సలు ఖాతరు చెయ్యకుండా ప్రదర్శించే విపరీతమైన చెత్త ప్రవర్తన తో హరీష్ ని అందరి దృష్టి లో స్త్రీ లోలుడిగా,  నిర్మల  అంతటి పతివ్రతా నారి కి తగని వాడిగా  ఒక లాంటి చెడ్డ ఇమేజ్ ఏర్పడి. అతని పరిధి ఇంటి నాలుగు గోడలకీ, లేదా ఆఫీస్ కీ పరిమితం అవుతూ ఉంటుంది.  అదే సమయం లో లావణ్య అతనున్న ఊరికే,   'బాలికా పాఠ శాల ఇన్స్పెక్టర్' గా వస్తుంది.  

లావణ్య ది నిర్మలమైన మనస్తత్వం, కలుపుగోలుతనం. తను నిర్మల ఇంటికి వచ్చినపుడు,  హరీష్ ని తాను కలకత్తాలోనే కలుసుకున్న విషయం చెప్తుంది. నిర్మల లో అనుమాన పిశాచం బలపడిపోతుంది.  తన పెళ్ళి అంత ఆదరబాదరాగా జరగడానికి వీళ్ళ ప్రేమాయణమే కారణం అని గట్టిగా నమ్మడం వల్ల  - పైగా హరీష్ తనతో  లావణ్య ని కలుసుకోనే లేదని అబద్ధం చెప్పాడన్న విషయం అర్ధం అయి లావణ్య వెళ్ళగానే,  విపరీతమైన కోపం తో ఊగిపోయి భర్త ని పూర్తిగా తన మాటలతో, తిట్లతో, ఏడుపులతో, నాటకం తో చిత్తు చిత్తు చేసేస్తుంది. ఈ అవమానం, తన పేరు ముడిపెట్టి, లావణ్య ని కూడా పరోక్షంగా అవమానించడం, అనుమానించడం తో హరీష్ పూర్తిగా మానసికంగా దెబ్బ తింటాడు. ఉమ అతన్ని ఓదారుస్తుంది.

అయితే ఇవేమీ తెలీని లావణ్య హరీష్ ని తన కొడుకు పుట్టిన రోజు పార్టీ కి పిలిచినప్పుడు, ఆ ఊర్లో తాను తప్ప లావణ్య కి దగ్గరివారు ఎవరూ లేనందున నిర్మల కి భయపడకుండా, ఆమె ఇంటికి వెళ్తాడు హరీష్.  ఆ తిరుగుబాటు ను అసలు ఊహించలేక, భరించలేక  నిర్మల ఆత్మహత్యా యత్నం చేసి, నలుగురి లో తన ఇమేజ్ ని పెంచుకుని, తన పాతివ్రత్యాన్ని, పతి పట్ల ప్రేమనీ నిరూపించుకుని,  సమాజం సానుభూతి ని మూటగట్టుకుంటుంది.  హరీష్ మాత్రం నౌకర్లు, డాక్టర్ తో సహా అందరి అవహేళనల్నీ దిగమింగుకుని,  మరింత అంతర్ముఖుడైపోతాడు. ఏమిటీ జీవితం అని కలత చెంది ఆఫీస్ రూమ్ లో కూర్చుండిపోతాడు.

అతను ఆలోచనల్లో మునిగి ఉండగా వీధి లో శ్రీ కృష్ణ భజన కారులు గుమ్మం ముందుకొచ్చి గోపీ విరహ గీతాలు పాడుతుంటారు.  పెద్దయ్యాక, గోపికలని విరహినులను చేసి,  బృందావని ని విడిచిన కృష్ణుడు ఆ పాటల్లో విలన్ గా వర్ణించపడతాడు.  కానీ ఆ పాటని విన్న హరీష్ కి కృష్ణుడి తప్పేమీ లేదనిపిస్తుంది. పొద్దస్తమానం తనని ప్రేమతో, బంధనాలతో కట్టి పడేసే రాధ నుండీ కాసేపు దూరం పారిపోవాలని తనకి అనిపించదూ అనుకుంటాడు.  తనకి చనిపోయేదాకా ఈ భార్య అనే బంధనాన్ని భరించక తప్పదని - చావు ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తూ  నైరాశ్యంలో మునిగిపోతాడు.  

నిర్మల సతీత్వం అతని చావుకొచ్చింది.  అనుక్షణం ఇన్సెక్యూరిటీ తో బాధపడిపోతూ, ఇతరుల సానుభూతి ని ఒక స్త్రీ గా ఇట్టే గడించేయగల నిర్మలని  పెళ్ళి చేసుకుని ఆమె భర్త అయిన పాపానికి ఆమె బారిన పడి,  జీవితం లో ఓడి,  మానసికంగా చచ్చిపోయిన హరీష్ కథ ఇది.  నిర్మల కి సమాజంలో ఎక్కళ్ళేని సానుభూతి.  పెళ్ళయిన నాటి నుంచీ తన సహ ధర్మ చారిణి గా జీవితం లో తోడు రావడం మాట అటుంచి, కేవలం ఒక హక్కు లా.. హుకుం చలాయిస్తూ - వేయి కళ్ళతో అతని కదలికల్ని అదుపుచేస్తూ,  మానసికంగా రక రకాల అవమానకరమైన మాటలతో కృంగ దీస్తూ  అతన్ని జీవచ్చవం లా చేసిన ఈ సతీమణి, బయటి ప్రపంచానికి పతివ్రతా శిరోమణి.  ఇలా హిందూ వివాహ వ్యవస్థ లో ఒక బలహీన పార్శ్వాన్ని శరత్ చందృడు 1934 లోనే చర్చించాడు.  తాను ధర్మ నిరతుడు, విడాకులిస్తే ఆమె గతి ఏమవుతుందని ఆలోచించగలిగే హరీష్ కి ఆమె భార్యాత్వం వల్ల ఏమి ఒరిగిందో ఆలోచిస్తే బాధ కలుగుతుంది.
---------------------------------------------------------------------------------------------------------------------------
Notes : 
1.  ఈ పెద్ద కథ - శరత్  కథ ల సంపుటి లోనిది.  పుస్తకం పేరు : "Devdas and other stories", ఇంగ్లీష్ లోకి అనువదించింది శ్రీ విశ్వనాథ్ .ఎస్. నరవనె.  ఈ పుస్తకం లో  సంక్షిప్తీకరించిన నవల  'దేవదాస్',  అనుపమా ప్రేమ, మహేష్ ,  అసంపూర్ణ నవల  "శ్రీకాంత" లో కొన్ని భాగాలు,  ఇలా కొన్ని  శరత్ ప్రసిద్ధ కథలు చేర్చారు.   నేను  ఆరోవిల్లె లో పుస్తకాల దుకాణం లో  ఇష్టంగా కొనుక్కున "ఇహపర" గాధా సంపుటి ఇది.   చేత్తో పట్టుకోవడానికి సులువుగా ఉండే చిన్న పుస్తకం. కథలు కూడా సరళమైనవి. హృదయాన్ని తాకేవి. మహమ్మద్ ఖదీర్ బాబు చెప్పిన సద్లక్షణాలన్నీ  అంటే అంటే  పుస్తకం సైజ్, ప్రింట్, కంటెంట్, ముఖ చిత్రం, అన్నీ సంతృప్తికరం. 

 2.  Sarat Chandra Chatterjee (Sarat Chandra Chattopadhyay):  ప్రసిద్ధ బెంగాలీ నవలాకారుడు, రచయిత, వివిధ భారతీయ భాషల్లోకి విరివిగా అనువదింపబడిన సాహిత్యం సృష్టించి, సినిమాలు, నవల ల ద్వారా చరిత్ర లో నిలిచిపోయిన వాడు.  

3. V.S.Naravane : VishwanathS Naravane - ఫిలాసఫీ ప్రొఫెసర్ గా  పూనె యూనివర్శిటీ  లో కొన్నాళ్ళు పనిచేసి, వివిధ అమెరికన్ యూనివర్శిటీల్లో కూడా  గెస్ట్ స్పీకర్ గా భారతీయ కళ, సాహిత్యం,  చరిత్ర, పౌరాణిక గాధలు,  ఫిలాసఫీ గురించి చర్చిచిన వ్యక్తి.  అతని ఇతర రచనలు :  Modern Indian Thought ; A Philosophical Study, The Elephant and the Lotus: Essays in Philosophy and Culture, Best Stories from Indian Classics, monographs on Tagore, Coomaraswamy, Premchand and Sarojini Naidu. 

***




3 comments:

Rao S Lakkaraju said...

తాను ధర్మ నిరతుడు, విడాకులిస్తే ఆమె గతి ఏమవుతుందని ఆలోచించగలిగే హరీష్ కి ఆమె బార్యాత్వం వల్ల ఏమి ఒరిగిందో ఆలోచిస్తే బాధ కలుగుతుంది.
-------------
చాలా బాగా రివ్వు చేశారు.అందులో ముగింపు చివరి పేరా చాలా బాగుంది.

Sujata M said...

Many thanks andi.

Unknown said...

KATHA CHADUVUTUNTE,BADATHO MELITIRIGIPOYANANTE NAMMANDI.ETUVANTI BHAR.YA EVARIKI VADDANDI|