దీర్ఘమైన చలికాలం ఒంటరిగా గడిచింది. ముఖ్యంగా నాలాంటి పన్నెండేళ్ళ అబ్బాయికి. మా నాన్నగారి హఠాన్మరణం నాలో రగిలించిన దుఃఖ జ్వాల ఆరనే లేదు. అప్పటికీ ఆయన మరణించి రెండేళ్ళవుతూంది. మా అమ్మ అంతకు మునుపే ఆయన నుండి విడిపోయి పాత కార్ల వ్యాపారం చేసే ఓ పంజాబీ పెద్దమనిషిని వివాహం చేసుకోవడం కూడా పెద్ద దెబ్బ నాకు. మూడు నెలల నిరాసక్త శీతాకాలం ముగిసాక షింలా లోని మా బోర్డింగ్ స్కూల్ కు తిరిగి వెళిపోవడానికి ఎంతగానో ఎదురుచూసాననే చెప్పాలి.
కిప్లింగ్ మనసు గెలుచుకున్న ఆ శాంత గంభీర హిమాలయ శ్రేణుల్లోని బ్రిటిష్ రాజ్ కు రాజధాని లాంటి 'షింలా' ఆనతి కాలం లోనే ఒక మామూలు ప్రాంతం గా మారబోతున్నదని నేనెప్పుడూ ఊహించనైనా లేదు. అలా అని స్కూల్ లో నాకు పెద్దగా స్నేహితులున్నారని కాదు. నేనెప్పుడూ ఒంటరి వాడినే. సిగ్గు, గుంభనాలతో మా నాన్న గారి అరుదయిన రాకపోకల కోసం మాత్రమే ప్రాణం కొట్టుకుపోతుండే చిన్ని ప్రాణాన్ని. నాన్నగారు రాయల్ ఏర్ ఫోర్స్ (RAF) లో పనిచేయడం వల్ల ఆయన కార్యస్థలి దిల్లీ, కరాచీ లాంటి ఎయిర్ ఫోర్స్ బేస్ ల లో మాత్రమే ఉండేది.
ఆయన నాకోసం వచ్చినపుడు మేము గడిపే అత్భుత క్షణాల కోసమే అచ్చంగా బ్రతికే వాణ్ణి. ఇప్పుడు ఆ క్షణాలు తిరిగి ఎన్నటికీ రావు. ఇలాంటి పరిస్థితుల్లో నా ఒంటరి బ్రతుక్కి ఓ స్నేహితుడు ఉండి ఉంటే బావుండేదనిపించేది. కానీ మా స్కూల్లో తుంటరి రౌడీ పిల్లల మధ్య నా బోటి మృదు స్వభావిని వెతుక్కోవడం పరమ కష్టం. డెస్క్ ల మీద చాకులతో పేర్లూ బొమ్మలు చెక్కడం, టీచర్ గారి కుర్చీ మీద నమిలిన చూయింగ్ గంలు అంటించడం లాంటి అరాచక కుర్ర చేష్టలు నాకస్సలు నచ్చవు.
మిగిలిన వాళ్ళలాంటి మామూలు జీవితం నాకూ ఉండి ఉంటే నేనూ వాళ్ళలా తయారయి ఉండేవాడినేమో. కుర్ర పనులు చేస్తూ, కొంటె వేషాలూ వేసే వాడినేమో. కానీ మా అమ్మా నాన్నల విడాకుల అనంతరం, నాన్న ఒంటరి తనాన్ని పంచుకోవలసి రావడం, అమ్మ కు దూరం కావడం, నన్ను తొందరగా ఎదిగేట్టు చేసాయి. పైగా నేను చదివే సాహిత్యం లేదా పుస్తకాలు అంటే డికెన్స్, రిచ్మల్ క్రాంప్టన్ , టాగోర్ ఇంకా 'చాంపియన్', 'ఫిల్మ్ కామిక్స్', అప్పటి నా తికమక మనస్స్థితి కి అద్దం పట్టేవి. ఎలక్ట్రానిక్ వస్తు వినిమయం తక్కువగా ఉంటూండే ఆ కాలంలో కూడా చదువరులు అరుదుగా ఉండేవారు. వర్షా కాలంలో పిల్లలు పేక ఆడటమో, కామన్ రూం లోని పాత గ్రామోఫోను లో 'ఆర్టీ షో' వినడమో చేసే వారు.
మొత్తానికి నాలుగో ఫారం మొదలయ్యి నెల గడిచాక ఒక కొత్త అబ్బాయి 'ఒమర్' నా దృష్టిని ఆకర్షించాడు. దానికి ఏకైక కారణం, అతని స్వభావం. ఒమర్ చాల నెమ్మది. నిశ్శబ్దంగా, తన చుట్టూ చెలరేగిపోతూండే పిల్లకాయల సర్కస్ ని చిరునవ్వుతో పెద్దగా పట్టించుకోకుండా, దాటవేసేవాడు. అలా అని అతనికి ఆ అల్లరి అసమ్మతం కూడా కాదు. తన పనిని తాను చూసుకునే ఈ కుర్రాడిని గమనించడం నాకు అలవాటయింది. ఒక పర్యాయం అలాంటి గమనింపులోనే, అతని కళ్ళు, నేనతని వంక చూడటాన్ని పసిగట్టి, స్నేహపూర్వకంగా, ఆర్ద్రంగా నవ్వటంతో మా స్నేహ పర్వం మొదలయింది. మేము వెంట వెంటనే మాటాడేసుకోలేదు. మా మధ్య పరిచయం, మాటల కన్నా ముందుగానే మొదలయింది. కారిడార్లలో, క్లాసు రూము లో, డైనింగ్ హాల్ లో, ఆట మైదానాల్లో ఒకరి కొకరు ఎదురుపడినపుడు మర్యాదగా తలాడించుకునేవాళ్ళం. ఆ పలకరింపు నాలోని మొహమాటాన్ని చాలా వరకూ బద్దలుకొట్టింది.
మా స్కూల్లో కనబడని ఓ వివక్ష ఉంటూండేది. ముఖ్యంగా వేరే వేరె హౌస్ వాళ్ళం ఒకరి జోలికి ఒకరం పొయ్యేవాళ్ళమే కాదు. ఉదాహరణ కు కర్జన్ హౌస్ కుర్రాడు రిమస్ లేదా లెఫ్రాయ్ హౌస్ వాళ్ళతో స్నేహం చేసేవాడు కాదు. కానీ స్కూలు హాకీ టీం లో మేమిద్దరం - అనగా నేను గోల్ కీపర్ గా, ఒమర్ ఫుల్ బాక్ గా చేరీ చేరడంతోనే ఈ కనబడని గోడల్ని అధిగమించాము.
గోల్ కీపింగ్ నాకు చాలా ఇష్టమైన, ముఖ్యంగా చాతనయిన కళ. హాకీ, ఫుట్బాల్ రెండు క్రీడల్లోనూ నేను గోల్ కీపర్ గా ఉన్నాను. ఆట ని, నా జట్టునీ 'రక్షించడం' నాకెంతో అత్భుతంగా అనిపించేది. యాభ్యయేళ్ళ అనంతరం ఇప్పటికీ గోల్ కీపింగ్ చేస్తూనే వున్నానని చెప్పాలి. అప్పుడు ఆట స్థలాల్లో, ఇప్పుడు నిజజీవితంలో నా కుటుంబాన్నీ, నా వ్యక్తిగత, రచనా స్వేచ్చనూ 'రక్షించడం' కోసం గోల్ కీపింగ్ చేస్తూనే వున్నాను.
అలా.. మా ఆట మమ్మల్ని దగ్గర చేసింది. ఎప్పుడూ మౌనంగానే ఉంటూండే ఒమర్ మెల్ల మెల్లగా నాతో మాట్లాడుతూన్నాడు. ఆటల్లోనూ, స్కూల్ లోనూ మేమిద్దరం ఈ మధ్య కలిసే ఉంటున్నాము. మా ఇద్దరి మధ్యా మంచి సయోధ్య కుదిరింది. నా ఆలోచనా ధోరణి, నేను వేయబోయే ఎత్తుల్నీ అతను పసిగట్టగలుగుతున్నాడు. అతని కదలికల్నీ, అతని లక్ష్యాల్నీ నేనూ అర్ధం చేసుకోగలుగుతున్నాను.. ఇదంతా హాకీ, మాలో ఆ సమన్వయం కుదిరేందుకు సహాయపడడం వల్లనే. అందుకేనేమో, కొన్నేళ్ళ తరవాత కోనార్డ్ రాసిన "ద సీక్రెట్ షేరర్" చదివాక, ఒమర్ నే తలచుకున్నాను నేను.
మా క్లాసు రూం, బందిఖానా లాంటి మా బోర్డింగ్ స్కూల్ గోడల్ని దాటే అవకాశం వచ్చాకా మా స్నేహం ఇంకా పరిమళించి, చిక్కబడింది. మా హాకీ జట్టు, షింలా కు దగ్గర్లోని పర్వత సానువుల్లోని సనావర్ లో మా చిరకాల ప్రత్యర్ధి ' లారెన్స్ రాయల్ మిలటరీ స్కూల్' తో తలపడటం కోసం బయలుదేరడం, ఒక పెద్ద మలుపు.
సనావర్ లోని ఈ స్కూల్ లోనే మా నాన్న గారు చదువుకున్నారు. సనావర్ చేరాకా నాకు తెలిసిందేమిటంటే, ఈ స్కూలు మా నాన్నగారి టైంలో మిలిటరీ అనాధలకు ఆశ్రమం గా కూడా ఉండేదని. మా నాన్నగారు కూడా అనాధే. మా తాత గారు పదిహేడేళ్ళ వయసులోనే ఇల్లు విడిచిపెట్టి, స్కాటిష్ రైఫిల్స్ లో పదాతి దళం లో పద సైనికుడిగా చేరారు. ఆయన కిప్లింగ్ తాలూకు "ములవానీ, ఓథరీస్, లీరాయిడ్" లాంటి వారు. అయితే ఆయన, పిల్లలు ఇంకా పసివాళ్ళు గానే ఉండగా మరణించడంతో మా నాన్నగారు ఈ స్కూల్ లో చేరడం వల్ల, ఇక్కడ అబ్బిన సంపూర్ణ విద్య, ఆయనకు, సైన్యంలో ఒక ఆఫీసర్ గా అయ్యే భాగ్యం కలిగించింది.
సనావర్ లో నేనూ ఒమర్, భలే సరదాగా గడిపాము. మామూలుగా అయితే అతి క్రమశిక్షణ తో దుర్బరంగా గడపాల్సి వచ్చే ఆ మిలటరీ స్కూల్ లో అతిధులు గా భోగభాగ్యాలనందుకుంటూ, స్వేచ్చగా భ్రమరాలమైపోయాము. ఇక్కడే దొరికిన తీరిక వల్ల, మనసు ఉల్లాసంగా ఉండటం వల్లనూ, బోల్డన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. నాలాగే ఒమర్ కూడా అనాధ. అతని తండ్రిని అరాచకత్వం రాజ్యమేలుతూండే పెషావర్ లో అల్లరిమూకలు కాల్చి చంపాయి. డబ్బు పుష్కలంగా ఉన్న బాబాయి అతన్ని షింలా బోర్డింగ్ స్కూల్లో చేర్చి చదివిస్తున్నారు. అచ్చు నా చదువు ఖర్చు రాయల్ ఏర్ ఫోర్స్ భరిస్తున్నట్టు. అందుకేనేమో ఒమర్ ఎక్కువ భాగం మౌనంగా గడుపుతాడు.
సనావర్ లో లారెన్స్ స్కూల్ చాపెల్ లో విహరించినప్పుడు స్కూల్ "రోల్ ఆఫ్ ఆనర్ బోర్డ్" లో రెండు ప్రపంచ యుద్ధాలలోనూ చనిపోయిన పూర్వ విద్యార్ధుల లిస్ట్ లో మా నాన్న గారి పేరు "A A Bond" చదివి వొళ్ళు గగుర్పొడిచింది.
ఆయన పూర్తిపేరు ఏమిటి ? అని అడిగాడు ఒమర్.
"అబ్రీ అలక్సాండర్ " చెప్పాన్నేను.
"చాలా అసాధారణమైన పేరు!" అన్నాడు ఒమర్
"నీకు రస్కిన్ అనే పేరెందుకు పెట్టారు ?"
"బహుశా మా నాన్నగారికి జాన్ రస్కిన్ రచనలు ఇష్టం కావడం వల్ల కాబోలు. జాన్ రస్కిన్, కళ, ఆర్కిటెక్చర్ లాంటి గంబీరమైన విషయాల మీద రాసేవాడు. ఇప్పుడు ఆయనకు పాఠకులెవరూ లేనట్టున్నారు. అయితే నా రచనలకు పాఠకులు ఉంటారులే" అన్నాను నేను.
అపుడప్పుడే నేనూ రాయడం మొదలు పెట్టాను. నా మొదటి నవల "తొమ్మిది నెలలు " స్కూల్ లో విద్యాసంవత్సరానికి సంబంధించినది. "గర్భావస్థ" గురించి కాదు. మా స్కూలు లో మేష్టార్ల గురించీ, వార్డెన్, పోకిరీ పిల్లల గురించీ రాసాను. హాస్యం పండించే ప్రయత్నమూ జరిగింది. ఒమర్ నా 'తొమ్మిది నెలలు' చదివి, బానే ఉందన్నాడు. "అయినా ఇది బయటపడితే చిక్కేమో ఆలోచించు ! ముఖ్యంగా ఓలివర్ గారు చదివితేనో ?! అని భయం వ్యక్తం చేసాడు. ఓలివర్ గారిగురించి హాస్య కవితలు కూడా ఉన్నాయందులో. (ఓలివర్ గారు మా స్కూలులో మర్యాదస్తుడైన టీచర్).
అయితే అదేమీ గొప్పరచన కాదు. నేను సహజ రచయితను కాను. ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను సహజమైన క్రీడా కారుడిని. సనావర్ లో నేను చూపించిన మిరుమిట్లు గొలిపే ప్రదర్శన తరవాత అంతవరకూ నన్నో సాదాసీదా కుర్రాడిగా పరిగణించిన మా స్కూల్ లో నా హోదా పెరిగింది. అప్పటి దాకా అడపాదడపా మమ్మలిని ఇబ్బంది పెట్టిన రౌడీ పిల్లలు కూడా మాకు కాస్తో కూస్తో గౌరవం ఇవ్వడం మోదలయింది. ఈ హీరోయిసం అంతా నా 'తొమ్మిది నెలలు' మా హౌస్ మాస్టర్ చేతిలో పడేదాకా మాత్రమే సాగింది. ఆరోజుల్లో పిల్లలని శ్రేష్ఠమైన మలక్కా కేన్ బెత్తంతో శిక్షించడం సాధారణ విషయం కాబట్టి, నా మొదటి రచన చిత్తు ప్రతి ముక్కలయ్యి చెత్త బుట్టలో దఖలయినా, నా పిరుదుల మీద ఊదారంగు లో తేలిన పేము బెత్తపు దెబ్బలు నా రచనా ప్రతిభను లోకానికి చాటాయి. ఆసక్తి కనపరిచిన వాడికల్లా నా పిర్రల పై రంగు తేలిన దెబ్బలను గర్వంగా ప్రదర్శించి, నా గొప్పదనాన్ని చాటుకున్నాను.
ఒకరోజు ఒమర్ అడిగాడు నన్ను - "ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే, నువ్వు కూడా వెళ్ళిపోతావా ?" నేను "తెలీదు. మా మారుటి తండ్రి భారతీయుడే కాబట్టి ఇక్కడే వుంటాను" అన్నాను.
"అందరూ చెప్పుకుంటున్నారు. మన నాయకులూ, బ్రిటిష్ వాళ్ళూ మన దేశాన్ని విడగొట్టేస్తారంట. అప్పుడు షింలా భారత దేశంలోనూ, పెషావర్ పాకిస్తాన్ లోనూ ఉంటాయంట" అన్నాడు ఒమర్.
"ఓహ్. అది జరిగే పని కాదులే. ఇంత పెద్ద దేశాన్ని ఎలా చీల్చుతారు..? అన్నాన్నేను తేలిగ్గా.
కానీ మేమిలా మాట్లాడుకుంటూండగానే, నెహ్రూ, జిన్నా, మౌంట్ బాటన్లు దేశానికి చెయబోయే శస్త్రచికిత్స కోసం ఆయుధాల్ని సమకూర్చుకుంటున్నారు. వాళ్ళ నిర్ణయం మా బ్రతుకులను అల్లకల్లోలం చేయకముందు, మా స్కూలు భవనానికి చెందిన ఒక పాత డ్రైనేజీ సొరంగం రూపంలో మాకు కాస్త ఆటవిడుపు లబించింది. అది ఇప్పుడు వాడకంలో లేని, దాదాపు పూడుకుపోయిన డ్రెయిన్ టన్నెల్. సరదాకి లోపలికి దూరి, పాకుకుంటూ ఇరవయ్యడుగులు వెళ్ళాకా, తిరిగి రాలేక, సొరంగం చివర కనిపించే చిన్న వెలుతురును వెతుక్కుంటూ ముందుకు పోయినప్పుడు ఆ రెండో చివరన మా స్కూల్ అవతలిపక్కనున్న కళ్ళు జిగేలుమనిపించే కొండ వాలు లో తేలాం.
ఆ పచ్చని ప్రకృతి లో మనసు నిండే దాకా ఆడుకున్నాము. సాల్, దేవదారు వృక్షాల మధ్య కేరింతలు కొట్టాం. ఏమీ ఎరగనట్టు మళ్ళీ స్కూలు కు ఆ రహస్య మార్గం గుండానే చేరుకున్నాం. వొట్టి చాదస్తపు క్రమశిక్ష(ణ) పూరితమైన మా బందిఖానాలాంటి బాల్యంలో మాకు దొరికిన ఆ చిన్ని స్వేచ్చ ఎంత అమూల్యమైనదో చెప్పలేం.
దేశం అనిశ్చిత లో, ఆవేదనతో, అపనమ్మకంతో కొట్టు మిట్టాడుతున్న ఆ కాలంలో ఆ సొరంగం మాకో కొత్త లోకాన్ని చూపించింది. చెప్పలేనన్ని అమూల్య క్షణాలనూ, భద్రతనూ ఇచ్చింది. షింలా చుట్టు పక్కల అడవులూ, మైదానాలూ, సెలయేళ్ళూ మా కిలకిలా రావాలతో, మా కబుర్లలో మునిగితేలాయి. పెద్దలు నిర్ణయించిన సరిహద్దులు దాటి ఎటువంటి పత్రాలు, పాస్పోర్టులూ లేకుండా మరో ప్రపంచానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయాణం కట్టేవాళ్ళం. కొత్త సరిహద్దులూ, కొత్త అనుమతి పత్రాలూ మమ్మల్ని వేరు చేయనున్నాయని తెలీని అమాయకత్వం మాది.
కొన్ని నెలల తరవాత మాస్కూలు "రైసింగ్ డే" సందర్భంగా ముఖ్య అతిధి గా లార్డ్ మౌంట్ బాటన్ విచ్చేసారు. మా బిషప్ కాటన్, ఈ వైపుల్లో 'ఈటన్' కాలేజీ లాంటి ఘనత వహించిన స్కూలు. మరి గౌరవాధ్యక్షులు గా వైస్రాయ్ కాక ఎవరొస్తారు ? ఈ ఘనమైన స్కూలు ఎందరో సివిల్ సర్వెంట్లనీ, రాజకీయ దురంధరుల్నీ, జెనరళ్ళనూ అందించింది. గొప్పలు పోయేందుకు బోలెడందరు పూర్వ విద్యార్ధులున్నారు. జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పరువు పోయిన దుష్ట జెనరల్ డయ్యర్ లాంటి పూర్వ విద్యార్ధి గురించి మాత్రం ఒక్క ముక్క ఎత్తకుండా జాగ్రత్త పడతారు మా స్కూలు వాళ్ళు. లార్డ్ మౌంట్ బాటన్ చేతుల మీదుగా కొన్ని విభాగాల్లో ఏదో ఒక బహుమతిని నేను అందుకున్నానారోజు.
ఆ రోజు కొత్త భారతదేశం గురించి, మా చుట్టూ జరగబోతున్న, జరుగుతున్న వివిధ చారిత్రక సంఘటనల వైశిష్ట్యం గురించి మౌంట్ బాటన్ దీర్ఘ ప్రసంగం చేసారు. త్వరలోనే భారత్ బ్రిటన్ కు సమానమైన శక్తిగా ఎదగబోతోందనీ.. వగైరా.
కొద్ది రోజుల అనంతరం పంజాబు, బెంగాలు ప్రావిన్సులను విడదీసారు. కోట్లాది ప్రజలు సరిహద్దులకిరువైపులకూ, ఉన్న పళంగా, కట్టు బట్టలతో అనాధలయి వలస ప్రయాణం కట్టారు. కోట్లాది ప్రజలు అన్యాయాలకూ, అత్యాచారాలకూ, దోపిడీకీ, మానభంగాలకూ, హత్యలకూ గురయ్యారు. కోటీశ్వరులు రాత్రికి రాత్రే బికారులయ్యారు. జమీందార్లు ఇళ్ళు లేక రోడ్డున పడ్డారు. ప్రయాణ భారంతో, మత కల్లోలాలతో సతమతమయ్యారు. చెప్పలేనన్ని ఘోరాలు జరిగాయి. దేశం అతలాకుతలమైంది. షింలా లాంటి శాంతియుతమైన ప్రాంతం కూడా మతకల్లోలాలను, ఊచకోతల్నీ చూసింది.
కామన్ రూం లో ఈ పరిణామాల్ని రేడియో లో వినడమూ, అప్పుడప్పుడూ వచ్చే వార్తా పత్రికల్లో విషయాలు చదవడం, మమ్మల్ని భయపెట్టేవి. కానీ ఇన్ని కల్లోలాల మధ్య ఒమర్, నేనూ, బురదంటని కమలల్లాగా ఆందందం గానే గడిపేవాళ్ళం. సొరంగం లోంచీ కొండల్లోకి వాలిపోయి పైన్ చెట్లలో పాడే బుల్ బుల్ ల రాగాలు వినేవాళ్ళం. గాలికకి ఊగే పొడవైన గడ్డి మేటులు, విరగపూచే గడ్డిపూల తివాచీలలో పడి దొర్లే వాళ్ళం. అక్కడి నిశ్శబ్దాల్లో వడ్రంగి పిట్ట ఎక్కడో ఏ చెట్టుకో ముక్కుని తాటిస్తూ తొలిచే శబ్దాల్నీ, ఏ హిమాలయ పక్షో చేసే విచిత్రమైన కూతల్నీ వినేవాళ్ళం.
ఒక సారి అలాంటి వేళల్లోనే "అన్ని యుద్ధాలూ ముగిసాక కూడా ఈ సీతాకోక చిలుకలు అందంగానే ఉంటాయి " అన్నాన్నేను.
"బావుంది. ఎక్కడన్నా చదివావా ఇది ?" అడిగాడు ఒమర్.
"లేదు. నాకే అనిపించింది"
"నువ్వు రచయితవయిపోయావు అయితే ! "
"లేదు లేదు... నేను హాకీ ఆడాలనుకుంటున్నాను. ఇండియాకి. ఇంకా.. ఫుట్ బాల్, ఆర్సినల్ కి. కేవలం గెలిచే జట్లలోనే!" నిశ్చయంగా చెప్పాన్నేను.
"ఎప్పుడూ గెలుస్తూనే ఉండడం కుదరదు. రచయితవే అయిపో !" అన్నాడు ఒమర్. తథాస్తు.
వర్షాకాలం వచ్చాక, మా సొరంగం మూసుకుపోయింది. కంకర, ఇసక, పూడిక మరింత పెరిగి మా సాహస యాత్రలకు ఆటంకం కలిగింది. ఆ రోజుల్లో లారెన్స్ ఓలివియర్ సినిమా "హాంలెట్" సినిమాని చూపించడానికి మమ్మల్ని ఊర్లోకి తీసుకొచ్చారు. మా అప్రశాంత మానసిక స్థితి లో ఆ చిత్తడి మద్యాహ్నం పూట చూసిన సినిమా, మాకు ఏ మాత్రం ఓదార్పునీయలేదు. పైగా బెంగను రగిలించింది. ఆ సంవత్సరానికి అదే మా ఆఖరు సినిమా. ఎందుకంటే అప్పుడే షింలా 'లోయర్ బజార్ ' లో మతకల్లోలాలు చెలరేగాయి.
కిప్లింగ్ చెప్పినట్టు, షింలా లో అన్ని దారులూ తెలిసినవాడు, పోలీసులను సులువుగా బురిడీ కొట్టించగలడు. అలాంటి షింలా లో, "భారత దేశపు వేసవి విడిది" లో, కొన్నాళ్ళ పాటూ స్కూలు గోడల మధ్యే బందీలమైపోయాము. బయటికి తప్పుకునేందుకు సొరంగమూ లేదాయె. బజారుకు వెళ్ళే ప్రశ్నే లేదు. నీరు నిలిచిన ఆట స్థలాలలో ఎవరూ ఆడుకోవట్లేదు. ఒమర్ నేనూ, చెమ్మ పట్టిన చెక్క బెంచీల మీద కూర్చుని భవిష్యత్తు గురించి పెద్ద ధీమా లేని మా ఆశలన్నిట్నీ చెప్పుకునేవాళ్ళం. కానీ మా సమస్యలను పరిష్కరించుకోలేకపోయేవాళ్ళం. సమస్యల సంగతి, నెహ్రూ, జిన్నా, మౌంట్ బాటన్లు కదా చూసుకునేది.
గొడవలు సద్దుమణిగాక, ఇక ఒమర్, పాకిస్తాన్ వెళ్ళే సమయం వచ్చింది. కాస్త పరిస్థితులు చక్కబడ్డాయి కాబట్టి స్కూల్ లో చదివే పాకిస్తాన్ ప్రాంతపు పిల్లలను సైన్యం రక్షణలో కాన్వాయి లో సరిహద్దులను దాటించేందుకు ట్రక్ లు వచ్చాయి. అలా ఒమర్ పాకిస్తాన్ కు బయలుదేరిన రోజు చెప్పలేనంత బాధతో గొంతు పూడుకుపోయింది. అందరు విడవలేక విడవలేక వీడ్కోలు చెప్పుకున్నాము.
పిల్లలందరమూ చాలా బాధపడ్డాము. ఒకరిద్దరయితే అబ్బయిలయి కూడా గొల్లుమన్నారు. మా పఠాన్ స్కూల్ కేప్టెన్, ఎప్పుడూ ఎటువంటి భావమూ వ్యక్తపరచని తన గంభీర ముద్రను వీడి, ఆరోజు కంటతడి పెట్టాడు. ఒమర్ ఆఖరికి సంతోషంగా చేతులూపి నాకు వీడ్కోలు చెప్పాడు. నేనూ చెప్పాను. ఏదో ఒక రోజు తప్పకుండా కలుసుకుందామని ప్రమాణాలు చేసుకున్నాము. ఆ కేన్వాయి సురక్షితంగా పాకిస్తాన్ చేరినట్టు కబురందింది. ఆ ఏడు బజార్లో దారి తప్పి రాక్షస మూక ఊచకోతల్లో బలయిపోయిన మా స్కూలు వంట వాడి మరణం తప్ప వేరే సంఘటనలు ఏవీ జరగలేదు. స్కూల్కు సంబంధించి అందరూ సురక్షితంగానే ఉన్నాము.
స్కూల్ సంవత్సరం ముగిసి, వేసవి సెలవులకు మేమంతా సిద్ధపడుతూండగా ఒమర్ నుండీ నాకో ఉత్తరం వచ్చింది. తాను చేరిన కొత్త స్కూలు గురించి రాసాడు. నన్ను, నా సాంగత్యాన్ని ఎంత మిస్ అవుతున్నాడో, మా ఆట స్థలాలూ, ముఖ్యంగా మా సొరంగం - ఆ సొరంగం బయట ఆట స్థలాల గురించి ఎంతో ఆప్యాయంగా రాసాడు. నేనతని ఇంటి చిరునామాకు ప్రత్యుత్తరమైతే రాసాను. కానీ అది చేరిందో లేదో తెలీలేదు. ఎందుకంటే ఒమర్ నుంచీ ఇంకే ఉత్తరమూ నాకు రాలేదు. ఈ విశాలమైన దేశమూ.. భూమీ చాలా పెద్దది. దానిలో మా అస్థిత్వం ఏ మాత్రం ? మేము కేవలం పిల్లలము.
ఓ పదిహేడూ, పద్ధెనిమిది ఏళ్ళ తరవాత ఒమర్ సంగతి నాకు తెలిసింది. కానీ పూర్తిగా వేరే పరిస్థితిలో. అది ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధ సమయం - షింలాకు ఎంతో దూరంలేని అంబాలా పట్టణం మీద వైమానిక దాడి చేయ ప్రయత్నించిన ఒక పాకిస్తానీ విమానాన్ని కూల్చేసారు. విమానంలో సిబ్బంది అందరూ ఆ క్రాష్ లో మరణించారు. ఒమర్ వారిలో ఒకడు.
ఆ వార్త తెలిసాకా ఒమర్ గురించే ఆలోచించాను. విమానంలోంచీ ఒమర్, షింలా లో మేం బాలురుగా ఉన్నప్పుడు ఎంతో హాయిగా తిరుగాడిన, ఆడుకున్న మైదానాల్నీ, కొండల్నీ, లోయల్నీ, వాలుల్నీ, మా ఆట స్థలాలనీ చూసి వుంటాడా ? స్కూలు జ్ఞాపకాలు అతన్ని ముంచెత్తి వుంటాయి కదా. ముఖ్యంగా మా రహస్య సొరంగం గురించి అతనికి గుర్తు ఉండి వుంటుందా ?
మా ఒంటరితనాలలోంచీ, మా కఠొర జీవితాల్లోంచీ తప్పించి, స్కూలు బయటి వసంతాల్నీ, సీతాకోక చిలుకలనీ, చిరు స్వేచ్చ నూ, స్వతంత్రాన్నీ, ప్రేమనూ పరిచయం చేసిన ఆ పాత నిరుపయోగమైన సొరంగం అతనికి ఖచ్చితంగా గుర్తొచ్చే ఉంటుంది అనిపించింది.
కానీ తప్పించుకునేందుకు ఆకాశంలో సొరంగాలుండవు.
"The Playing Fields of Shimla" from "No Man is an Island" by Ruskin Bond.
Notes :
Ruskin Bond
Partition of India
Eton College
Kipling : Joseph Rudyard Kipling - ఇండియాలో పుట్టి "జంగల్ బుక్" రాసిన ప్రసిద్ధ బ్రిటిష్ రచయిత. హిమాలయాల ప్రేమికుడు.
Richmal Crompton
Secret Sharer
Leyroyd, Mulavaney and Otheris - Three Muskateers - Kipling's characters
Laurence Olivier