Pages

08/03/2023

బహుళ - అట్టాడ అప్పల్నాయుడు




కొన్నిపుస్తకాలు చదవడానికి రాసిపెట్టుండాలి. ఈ పుస్తకం గురించి అస్సలేమీ తెలీనప్పుడు, రచయిత ప్రసిద్ధులే కాబట్టి పేరు వినడమే తప్ప ఆయన ఏ రచనా చదవక పోవడమూ వంటి అజ్ఞానంలో ఉండిపోయినప్పుడు, నాలుగొందలకు పైగా పేజీలున్న ఈ పుస్తకాన్ని పోస్ట్ చేసి, చదవమని చేతిలో పెట్టిన  నేస్తానికి  వేలాది  థాంకులు.   [బావిలో కప్పలా ఉండిపోతున్నానని కొత్త కొత్త రచయితల్ని పరిచయం చేస్తూ, ఫలానాది బావుంది, చదవమని చెప్పి ; నేను బద్ధకిస్తే, పుస్తకాలు ఇచ్చి,  "చదివావా?", "మొదలు పెట్టావా?" - అని వెంటబడే నేస్తాలూ ఉన్నందుకు జీవితం ధన్యం అని చెప్పుకోవచ్చు]   ముఖ్యంగా ఈ పుస్తకం ఎక్కడా అమ్మకానికి అందుబాటులో లేనపుడు, అండర్ లైన్లు చేసి, పేరాలు మార్క్ చేసుకునున్న సొంత కాపీని ఇచ్చినందుకు, అంత ప్రేమించిన రచననని నా చేత చదివించాలని అనుకున్నందుకు,  సృజనా - చాలా థాంక్స్. I cherished reading this book. 

ముందుమాటలు ఠారెత్తించి, రచనను టాల్ స్టాయ్ రచనతో పోల్చి, అంచనాలను పెంచేస్తున్నప్పుడు ఒక హెచ్చరిక కూడా వినిపించింది. నిజానికి ఇది కాస్త స్వీయ జీవిత అనుభవం / ఆటో బయాగ్రాఫికల్  ఫిక్షన్  కాబట్టి తనకెంతో ఇష్టమైన "కవితాత్మక శైలి, సునిశిత వ్యంగ్య మిళితమైన క్రుద్ధ వచనం, హాస్య చతురత.. ఈ నవలలో ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే మెరుపులా మెరిసిపోతాయనీ, పైపెచ్చు ఇదీ అని చెప్పలేని విషాద గంభీర స్వరం నవల పొడుగునా కనిపిస్తుందని," ఎ.కె.ప్రభాకర్ గారు రాసారు.  అంటే, రచయిత తన సహజ శైలిని, రచనలో ఉబికొచ్చే కొన్ని వరదల్నీ, జ్వరాలనీ, కంట్రోల్ చేసుకుంటూ ఒక కథని చెప్తున్నారని కదా అర్ధం.  ముందుమాట చదివే - 'ఇగ ఈ రచయిత ఇతర రచనలని కూడా చదవాలి సుమా' అనిపించింది. 

 

ఒకప్పుడు వెనకబడిన ప్రాంతాలలో, అణిచివేత ఎక్కువ ఉన్న ప్రాంతాలలోనూ, కొన్ని వర్గాలలో ఎగిసిన సామాజిక చైతన్యం, అసమానతల పట్ల వ్యతిరేకత, రాజకీయాలూ, పల్లెల్లో యజమానులకూ, పనివారికీ మధ్య అనుబంధమూ, శ్రీకాకుళ ఉద్యమం, ఉద్యమకారుల ఎదురీతలూ, త్యాగాలూ, ప్రేమలూ, వాళ్ళ జీవితం, వాళ్ళ ఆదర్శాలూ ఎలా ఉండేవి అనే విషయాలకు ఈ పెద్ద నవల సాక్షం.  

 

'బహుళ', పేరుకు తగ్గట్టు గానే, బహుళ అంశాలను స్పృశిస్తుంది. బహుళంగా మనుషులూ, పాత్రలూ, తరాలూ, కాలాలూ సజీవంగా కదులుతూ వెళ్తుంటారు. అయితే, ఇంత పెద్ద సినిమా లాంటి నవలలో ఎక్కడా తికమక పెట్టకుండా, ముందు వెనకలకి వెళ్ళిపోకుండా, ఎక్కడ ఏమి జరిగి ఉంటుందా అని పాఠకుడు తల బద్దలు కొట్టుకుని, ఆలోచించుకోనక్కర్లేకుండా, మనుషులు వచ్చి, తమ తమ కథల్ని చదివించేసి, జరిగిపోతూ ఉంటారు. ఒక తరం తరవాత ఇంకో తరం ముందుకొస్తుంది. గడిచిపోయిన పాత్రల పట్ల, తమ తాత తండ్రుల పట్లా, గౌరవాభిమానాలతో పాత్రలు వర్తమానం లో బ్రతుకుతుంటాయి .  

 

అయితే గతం చెప్తూనే ఆ కాలమాన పరిస్థితుల్నీ, రాజకీయాలనీ పరిచయం చెయ్యడం, ఈ నవల సాధించిన విజయం. ఇంతేసి మంది మనుషులు, ఒకరికొకరు చుట్టాలు, బంధువులు, స్నేహితులు,  వివిధ కులాల వారు, వివిధ (రాజకీయ) వర్గాల వాళ్ళూ, వీరందరి మనసుల్లో ఆలోచనలు, 'ఎవరు' , 'ఎందుకు',  'ఎప్పుడు', 'ఎలా' స్పందిస్తారు అని కూడా విడమరిచి రాసి, రక రకాల వ్యక్తిత్వాలని పరిచయం చేస్తారు. 

కథ లో విస్తృత శ్రేణి లో బోల్డన్ని పాత్రలు, వాటి మధ్య  సమన్వయం చాలా బావుంది. చివరికొచ్చీసరికి కొంచెం బోరు కొట్టింది. అంతవరకూ పల్లెటూరి ప్యూరిటీ చదివీ చదివీ ఆధునిక పోకడల్లో కొత్త తరం పరిచయం అయి, వాళ్ళ ఇంగ్లీషు + తెలుగు సంభాషణలు చదివి, అస్సలు ఆ 'ఇది'  నచ్చలేదు. దానికి కారణం, నేను అంతకు ముందుదాకా,  మూడు తరాల గురించి "అచ్చ తెలుగులో" చదవడం వల్ల కాబోలు!   మెల్లిగా ఈ కొత్త పాత్రలు కూడా పూర్వీకపు వాసనకు అతుక్కుని, స్వచ్చపడతాయి. అప్ప్పుడు "హమ్మయ్య!" అనిపిస్తుంది. 

 పాత్రలు బోలెడు అన్నాము కదా. వీరిలో సమాజానికి మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చి, సొంత డబ్బులు ఇచ్చి, ఊర్ని అభివృద్ధి చేసి, కుటుంబ బాధ్యతల విషయంలో దెబ్బతిని, రాజకీయాల్లోంచీ ఉపసంహరించుకున్న మంచి వాళ్ళ దగ్గర నుంచీ,    తను అప్పులిచ్చి, వసూలు చేసుకొచ్చే క్రమంలో ఊరంతా క్షామంలోకి,బీదరికంలోకీ కూరుకుని పోవడానికి కారణం అయ్యే వ్యాపారి వరకూ ఉంటారు.  అమ్మలూ, అత్తయ్యలూ, పెద్దమ్మలూ, లోతైన మనసుల ఆడవాళ్ళు - మన కథలకి అవసరమైన వాళ్ళందరూ సరదాగా, బాధగా, ఓర్పుగా, బేలగా, ధైర్యంగా, చాలా బోలెడు స్త్రీలు.  ఈ కథ కూడా స్త్రీ పాత్ర తోనే అల్లుకుని, ఆమెతోనే ముగుస్తుంది. 

కథ కు వచ్చేసరికీ హీరో "పెదనారాయుడు" ఒకె లెజెండ్. జముకుల పాటగాళ్ళ ప్రదర్శనల్లో, జానపదుల కళల్లో ప్రజలు దేవుళ్ళా ఆరాధించుకునే ఒక నాయకుడు. తెల్లదొరల పాలనలో, జమీందారులు ప్రజలను పీడించుకుని తినే రోజుల్లో, ఒక పెద్ద రైతు ఇంట పుట్టి, తండ్రికి చేదోడు వాదోడుగా వ్యవసాయంలో సాయం చేస్తూ, క్రమంగా అన్యాయాలను ఎదురిస్తూ, తన బుద్ధి, భుజ బలాలతో, మంచితనంతో, ధైర్యంతో విప్లవాత్మక ఆలోచనల్తో, ప్రజలు ఆరాధించే రూపమవుతాడు. బలహీనుల పక్షాన నిలబడి, బలవంతులకి కన్నెర్ర అయిన ఈ హీరో ఒక తుఫాను రాత్రి, ఎవరు చంపారో, ఎలా జరిగిందో తెలీని విధంగా, పెద నారాయుడి శవం "ఊరి ముందరి పందెపుతోట మధ్యలో అంటు మామిడి కొమ్మకు వేలాడుతూ కనిపిస్తుంది. అతని రెండు చేతులూ  విరిగిపోయాయి. కనుగుడ్లు లేవు. శరీరమంతా నెత్తుటి మరకలు."

అమాయక గ్రామీణులు ఈ హత్య కు ఎలా  స్పందించారు ?  "పెదనారాయుడి అస్తికలను ఒక సమాధి లో పెట్టుకుని పూజించుకున్నారు. ఆ సమాధి  దగ్గర ప్రతి యేటా తిరునాళ్ళు జరుగుతున్నాయి. ఆయన్ను దేవుడి గా భావించుకున్నారు. మొక్కులు మొక్కుకోవడం, పిల్లలకు ఆయన పేరులు పెట్టుకోవడం, ఆయన కథ ను బోనెల పాట గాను, ఒగ్గు పాటగానూ, బుర్ర కథ గానూ పాడుకుంటుంటారు".   ఆయన వంశస్తుడే ఈ కథకుడు.

కురుపాం జమీ గ్రామాల్లో, బహుశా భూమి అంతా జమీందారుదే.  రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు భూమి కావాలి కద.   Land ownership ఆ రోజుల్లో  ఎలా వుండేదో చూడండి. 

కురుపాం జమీగ్రామాల్లో, అలనాటి రోజుల్లో, భూమి కోసం రైతులు జమీందారీ ఉద్యోగుల చుట్టూ తిరుగాడేవారు. ఎవరెక్కువ శిస్తు చెల్లిస్తే వారికి ఎక్కువ భూమి మీద  హక్కు దొరికేది.  భూమి హక్కంటే, ఆ రోజుల్లో, శిస్తు చెల్లించి సాగుజేసే హక్కు మాత్రమే ! తెల్ల దొరల పాలనలో సెటిల్ మెంట్ చట్టం ప్రకారం, జమీందార్లకే భూమి మీద హక్కుండేది.  జమీందార్లు తమ జమీ ప్రాంతానికి నిర్ణీత కప్పం తెల్లదొరలకు చెల్లించే వారు. రైతుల నుంచి మాత్రం యేడాదికో ధర నిర్ణయించి శిస్తులూ, దస్తులూ వసూలు జేసుకునే వారు. జమీందార్ల అవసరాలు, విలాసాల బట్టే శిస్తులూ దస్తులూ ఉండేవి. పంటల బట్టి కాదు. 

 

'పెద నారాయుడు' హీరో కాబట్టి, అతని గురించి చదివేటప్పుడల్లా చాలా బావుంటుంది. అతని సాహసాలూ, అమాయకత్వం, అతని పెంపకం, అతని తండ్రి చెప్పిన కథలూ, పాత్రల మధ్య అన్యోన్యత, అనుబంధాలూ.. ఆయన పెళ్ళీ, పిల్లలూ అయింతరవాత కూడా ప్రజా జీవితానికి తన జీవితాన్ని అంకితం ఇచ్చేసిన పెద నారాయుడు చాలా తెలివయిన వాడు.  అతన్ని పరీక్షించేందుకు పిల్లనిచ్చిన మామ గారు ఒక తెలివిమాలిన రాజు కథ గురించి చెప్పినప్పుడు పెద నారాయుడి విశ్లేషణ ఎలా ఉంటుందంటే :  “రాజు, రాజు పరివారం మీద కోపంతో ఎవరో ఆ కత కల్పించేరు.  కడుపులో మంట చల్లారడానికి ఆళ్ళని యెగతాళి జేసేరు. గానీ.. రాజు గానీ, రాజు పరివారంగానీ అంత తెలివి మాలినోళ్ళవరు ! దురుమార్గపోళ్ళనండి, కర్కోటకులనండి, వీరులూ, ధీరులూ అనండి. నమ్ముతాను. గానీ తెలివి మాలినోలంటే నమ్మను! తెలివిమాలినోళు సింహాసనమ్మీదెన్నాళ్ళో వుండరండీ ! “  అంటాడు.

ఆ పెదనారాయుడి మనవడు చిన్న నారాయుడు, అతని గుండెలో సగభాగం, అతని భార్య బంగారమ్మదీ ఈ కథ. వీళ్ళిద్దరి లవ్ స్టోరీయే "బహుళ". ఎన్ని కష్టాలు పడుతుందీ జంట ?!   ఎన్ని నొచ్చుకోళ్ళు ?! విడదీయరాని జంట - విడిపోయిన జంట. ఆ బంధం ఎంత దృఢమయినంటే, 'తనని, తన కొడుకునీ వొదలి వెళ్ళడానికి బంగారమ్మ తన ఒంట్లో నరాలెన్ని తెగుంటాయో ! ఎంత కష్టపడుంటుంది!  ఎక్కడుందో, ఎలా ఉందో!!" అని కుమిలిపోకుండా, తనను తలచుకోకుండా, బెంగపడకుండా, బాధపడకుండా  ఒక్క రోజు కూడా జీవించని నారాయుడు భార్యని తల్చుకుంటూనే కన్నుమూయడం ఒక దీన సంఘటన.  అది జరిగిన తరవాత కొన్నేళ్ళకు అతని కొడుకు,  "పెదనారాయడి" జాతరకొస్తే, అతన్ని చూసుకుని చచ్చిపోవడానికి వచ్చిన బంగారమ్మదీ ఈ 'బహుళ' కథ. 

కథలో రాజకీయాలు బ్రతుకు పోరాటానివి.  అసలు కుటుంబంలో / ఒకే కులంలో పెళ్ళిళ్ళు ఎందుకు జరిగేవి? ఒక స్త్రీ పాత్ర చెప్తుంది.    "నానా బదవలూ చేసి యకరమో సకరోమో బూమీపుట్టా సంపాదించినారు మన తాత్తండ్రులు.  జమీందార్ల కిస్తీలు కట్టడానికి మన పెద్దలు కడుపులు కాల్చుకునిఈవఒళ్ళు. ఇంత మడిసెక్క సంపాయించడానికి యెంత కడుపు కాల్చుకున్నారో, యెంత నెత్తురూ, సెమటా ధార బోసేరో మనకి తెల్దు.  అలాగ సంపాయించిన మడిసెక్కలు పరాయోళ్ళ పాలబడకండా.. రక్త సంబంధాల మధ్యన పెళ్ళీ పేరంటం చేసీవోళు !" 

కులాల్లో ఎక్కువ తక్కువలు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. అయితే, కులాలూ, వృత్తులూ ఒకరి మీద ఒకరు విపరీతంగా ఆధారపడేవాళ్ళు. ఆధునికత కమ్ముకుని, వర్షాధార వ్యవసాయం అసమానతలని పెంచేసినప్పుడు, కులవృత్తులు కనుమరుగవుతూ కొన్ని వ్యత్యాసాల్ని ఇంకాస్త ఎక్కువ చేసినప్పుడు, అంట రాని కులాల వారు కూడా చదువుని ఆధారం చేసుకుని పైకొచ్చారు. చదువు తప్ప జీవితపు రక రకాల ఢక్కామొక్కీలనుంచీ ఏ కులం వారినైనా తప్పించే వేరే ఏక సాధనం లేదు. ఇలా మెల్లిగా సమాజాల్లో మార్పులు రావడం మొదలవుతుంది. పల్లెల్లో, అగ్ర వర్ణాల వారి పిల్లలు కూడా అంతో ఇంతో కుల వివక్షని ఎదిరించారు. ఇలా మెల్లగా ఊర్లకి ఊర్లు మారాయి. రాజకీయ, సామాజిక చైతన్యం వచ్చింది.

నక్సలిజం, కమ్మ్యూనిజం కొత్త ఊపుని తెచ్చాయి. దేశం కోసం, ప్రజల కోసం, ఎందరో స్త్రీ పురుషులు ఉద్యమం లోకి దూకారు. అన్యాయాల్ని ఎదిరించారు. చాలా బాధలు సహించారు.  బంగారమ్మ కి పుట్టిన, నారాయుడి 'అర్భకుడైన కొడుకు' చదువుకుని,  తన వంతు కష్టాలవీ తానూ అనుభవించి,  జీవితంలో పైకొచ్చి, "అర్బన్" నక్సలైటు అయ్యాడు.  ఇదంతా ఇలా పెదనారాయుడి సంతతి కథ.  నిజానికి ఒక కుటుంబానికి, ఒక హీరోకి, ఒక సమూహానిది అని గిరి గీసేసి వీళ్ళదే ఈ కథ అని చెప్పలేము. అలా ఎంతో పెద్ద కథ కాబట్టి ఈ పెద్ద నవల సమాజంలో మార్పుల చైన్ రియాక్షన్ గురించి చెప్తుంది కాబట్టి, దీన్ని చదివినప్పుడు నేను చాలా స్వీట్లీ సర్ప్రైస్డ్.

ఉద్యమాలలో మిస్ లీడ్ అయిన వాళ్ళ గురించి కూడా చెప్పకుండా వొదిలిపెట్టలేదు.  ఉద్యమంలో నానా బాధలూ పడి రోడ్డున పడిన ఒక పాత్ర అయితే   "రాజ్యమొచ్చినాక ఇదిగీ పట్నంలోన పెద్దపెద్ద బిల్డింగీలు ఔపడతన్నాయి గదా, ఆట్ని మన పేదల కిచ్చేత్తారట కదా ? మనం యేది కావాలో యెంచుకోడమేనాట కదా ? నిజింగే, ఆ బిల్డింగీలు మన రాజ్జెమొస్తే మనకే ఇత్తారా ? అని అడుగుతుంది.  ఆమెను ఆటపట్టించేదుకు అలా చెప్తున్నారని "మన రాజ్జమింత బేగీ రాదనీ, వొచ్చినా, ఇల్లూ, పొల్లూ అవన్నీ రాజ్జెం చేతిలో వుంటాయనీ, రాజ్జెం అన్నీ ఆలోచించి, అందరికీ సమానంగా అనీటినీ సమకూరుస్తాదనీ, వివరిస్తే, నిరాశగా "ఔనా ? ఇవ్వరా  ? మన రాజ్జెమొచ్చినా ఇవ్వరా ? ఇదేటమ్మీ ! మరి యేల ఈ ఇబ్బందులన్నీ మనకి ? అని అంటుంది.                                    

ఈ అమాయకత్వం పక్కన పెడితే, గ్రామంలో కరువు కాటకాల్లో కూడా కనికరం లేకుండా వడ్డీలు వసూలు చేసి, జనం ఇక భరించలేనంత కష్టాలకు గురి చేసిన షావుకారు, అంతకు పూర్వం ప్రజల చేతిలో హతమయిన క్రూర మిరాశీదారు - వీళ్ళందరూ కూడా తెగే దాకా లాగి ప్రాణాలు హరించుకునేలా చేసిన రాజకీయ చిత్రం - శ్రీకాకుళ ఉద్యమాన్ని, ఆ విశాలమైన రంగస్థలాన్నీ - కళ్ళ ముందు నిలబడగా చూడడం, రక్తి కట్టించే భాష, ప్రతి మనిషి మనసులోకీ తొంగి చూసి, అతను కంబారయినా, అంబరమెక్కిన రాజైనా, అన్ని అంతరంగాలనీ చదివించడం బహుళ ప్రత్యేకత.  నారాయుడి జీవితాన్ని చదవడం కోసం,  మూలాల్ని మరిచిపోని మనుషుల్ని చదవడం కోసం, బహుళ చదవాలి.  సరళంగా కథ చెప్పే నెరేషన్ తో, చాలా బావుంది. పెద్ద పుస్తకం - మనసు తీరేలా చదవొచ్చు.  

* * * 

22/01/2023

The Living Mountain - Amitav Ghosh


ఇది అమితవ్ ఘోష్ రాసిన ఒక చిన్న కథ. చాలా చిన్న పుస్తకమే. గంట లో ఊదిపారేయొచ్చు. కానీ ఇది మన మనసుమీద చూపించాల్సిన ప్రభావం మాత్రం బహుశా జీవితకాలమూ ఉంటుంది. 


దేవాంగనా ఘోష్ అందమయిన బొమ్మలతో ఈ పుస్తకాన్ని నింపేసారు. చిన్న పిల్లల పుస్తకం చదువుతున్నట్టుంటుంది. కానీ ఇది పెద్దవాళ్ళమయి, మన తరవాత రాబోయే తరాలకి ఈ భూమి మీద జీవికనేదేదీ మిగల్చకుండా, అత్యాశకు పోయి  భూమి మీదున్న అన్ని శక్తులనూ, వనరులనూ, గాలినీ, చెట్టు చేమలనూ, ఆఖరికి పర్వతాలనూ విచక్షణా రహితంగా చెరిచి, చంపి, చెరపట్టి, సర్వనాశనం చేసే మనందరికోసమూ రాసిన కథ. 

ఒక చిన్న పిల్ల కథ చెప్తుంటుంది.   హిమాలయల్లో ఒకానొక ప్రాంతంలో ఒక లోయప్రాంతపు ఊరికవతల, ఒక 'బతికున్న' మంచుపర్వతం ఉంటుంది. దాని శిఖరం మేఘాల్లో మునిగిపోయి ఎప్పుడూ స్పష్టంగా కనిపించదు.   అక్కడ చాలా పర్వతాలే ఉన్నాయిగా.  ఈ పర్వతాన్ని అక్కడివాళ్ళు "మహాపర్వతం" అని పిలుస్తారు. అది వారికి అత్యంత పవిత్రమైన పర్వతం, పూజలందుకుంటూండే ఓ సాంస్కృతిక చిహ్నం. 




హిమాలయ శ్రేణులన్నిట్లోనూ,  దాదాపు అన్ని పర్వతాలూ,   కొన్ని స్థానికాచారాల ప్రకారం, సాక్షాత్తూ భగవత్స్వరూపాలే. హిమాలయాల్లో చాలా పవిత్ర నదులు, తటాకాలూ,  అక్కడ మాత్రమే కనిపించే అరుదైన వృక్షరాశులూ,  వాటిక్కాసే మహిమ గల  పళ్ళూ.. ఒక్కటేంటి, అన్నీ ఆయా  ప్రాంతవాసుల (మూఢ) నమ్మకాల ప్రకారం గొప్పవి. ఈ మూఢ నమ్మకాలు పర్వతాలనీ, వాటి మీద ఆధారపడుతూండే మనుషుల్నీ కొన్నేళ్ళ పాటూ రక్షించాయనే చెప్పొచ్చు. పవిత్రమని స్థానికులంటే నవ్వి పోయే పర్యాటకులు ఉండే కాలం ఇది. ఆయా పవిత్ర స్థలాల్ని ఫోటోల కోసం దర్శించేసాకా, చెత్త తో నింపెళ్ళే నాగరిక పర్యాటకులం మనం. 

సరే ! మళ్ళీ కథ లోకొస్తే,  ఈ "మూఢ" విశ్వాసాల పరంగా చూస్తే వీళ్ళ ఊర్లో పూర్వీకులందరూ, ఈ పర్వతానికి 'ప్రాణం' ఉందనీ, ఈ పర్వతమే ఊర్నీ, ఆ ప్రాంతాన్నీ తరతరాలుగా రక్షిస్తూ వచ్చిందనీ, నూరిపోస్తారు.  ఆ పవిత్రత కారణంగా ఆ పర్వతంపై ఎవ్వరూ పాదం మోపనే కూడదు అని ఒక ఆంక్ష కూడా తరతరాలుగానే ఉందక్కడ.  

అందరూ ఆ పూర్వీకుల మీద గౌరవంతో పర్వతాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేవారు. ఆ పర్వతం మీదనుండీ కిందికి ప్రవహించే ఓ సెలయేటి పక్కన ఒక "మేజిక్" చెట్టు కూడా వుంది. అది ఆ లోయలో తప్ప ఎక్కడా లేదు. ఆ చెట్టు అక్షయంగా చెక్క  ఇచ్చేది. దాని వేళ్ళకు అత్యంత రుచికరమైన పుట్టగొడుగులు మొలిచేవి. ఆ చెట్టుకు పూసిన పువ్వుల్లో అత్యంత మధురమైన తేనె వుండేది. ఆ చెట్టునుండీ వచ్చే సుగంధం తో పోల్చదగిన సుగంధం ఎక్కడా లేదు. పైగా ఆ చెట్టుకు ఔషధ లక్షణాలుండేవి.  

లోయలో ప్రజలు మిగతా ఏ విషయాల్లో కొట్టుకు చచ్చినా మహాపర్వతాన్నిరక్షించుకోవడానికి  ఈ ప్రాంతాలకి కొత్త వారిని అస్సలు రాకుండా కట్టడి చెయడంలో ఐకమత్యం పాటించేవారు. ఎవరైనా  ఈ ప్రాంతాల్లో ఏదైనా వెతుకుతూ వచ్చినా, వారిని కాపలా దార్లు ఆపేసే వారు. లోయనీ 'మహా పర్వతాన్నీ' చెడ్డవారి దృష్టి తాకకుండా కాపాడుకునేవారు.

ఏడాదికోమారు మంచు కురవడం తగ్గాక, లోయ దిగువున, ఓ వారం పాటూ సంత జరిగేది. ఈ లోయ గ్రామాల పెద్దలు మాత్రం అక్కడికి వెళ్ళి, దిగువ ప్రాంతాలవారికి కావల్సినవి అమ్మి, వీరికి కావలసిన వస్తువులు వాళ్ళ దగ్గర కొనుక్కునేవారు. 
 లోయలో ఉత్పత్తయిన అత్భుతమైన తేనె, వన మూలికలూ, ఇక్కడి పంటలూ, అవీ ఆ సంత జరిగే వారమంతా అమ్మి, లోయకి సంబంధించని కొనుగోలుదార్లూ, కొత్తవాళ్ళందరూ ఆ ప్రాంతం వదిలి వెళ్ళాక, మళ్ళీ లోయ రక్షణ బాధ్యతల్ని కాపలాదార్లకప్పగించి, లోయని సీల్ చేసేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసేవారు. ఇలా తరాల పాటు జరిగింది. 

లోయలో బ్రతకడం కష్టమే.  తిండి కోసం చాలానే కష్టపడవలసి వచ్చేది. పండించే పని లేనన్నాళ్ళూ, పోట్లాటలతో కాలక్షేపం జరిగేది. అయితేనేం. అందరూ తృప్తిగానే బ్రతికేవారు. పదే పదే అదే తృప్తితో, ఆ మహా పర్వతం గురించిన పాటలవీ పాడుకుంటూ, నృత్యాలు చేసుకుంటూ,  ఉండేవారు.  అక్కడి ఆచారం ప్రకారం,  ఎక్కువగా ఆడవాళ్ళే నృత్యాలు చేసేవారు. మగవాళ్ళు రాజ్యం చేసేవారు. ఆడవారి పాదాల గుండానే ఆ పర్వతపు గుండె చప్పుడు వినిపించేది. ఏతావాతా, పర్వతం చెప్పేఊసులన్నీ వినగలిగేది ఆడవారే.  పాలించడానికి కాస్తో కూస్తో కర్కశత్వం కావాలి కాబట్టి మగవాళ్ళు ఆ పని చేసేవారు.  ఆడవారి మెదడుకి, మనసుకీ గౌరవం ఇచ్చేవారు. అలా జీవితం సాగిపోతూ ఉండేది. 




బాగా నర్తించే ఆడవారి పట్ల అందరికీ అసూయగా ఉండేది. ఆ పాటలూ, నాట్యాల సంబరాల్లో ఆడవారు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి, 'మహా పర్వతాన్ని'   ఫీల్ అయేవారు. వారి ద్వారానే మహాపర్వతం తమతో communicate చేస్తుందని నమ్మకం.  అందుకు.  ఈ నాట్యకత్తెలు తమ చెవుల్ని భూమికి ఆనించి ఆ పర్వతపు సందేశాలను వినేవారు.  అలా వీరే ఆ పర్వతానికి చెవులూ, నోరూనూ. చూశారా వీళ్ళ శక్తి?!

ఇలా సాగుతూన్న జీవితంలో ఒక ఉపద్రవం వస్తుంది. సంత జరిగిన వారంలో ఒక సారి మాత్రం ఒక కొత్తవాడు లోయ లో అత్భుతాల మీద ఎనలేని ఆసక్తిని వ్యక్తపరిచాడు.  మృదు మర్యాద పూర్వక సంభాషణల్తో ఊరి పెద్దల్ని ఎలాగో ఒప్పించి, రక్షణ వలయంలో ఉంటున్న ఈ ప్రాంతాల్లోకి అడుగు పెట్టేసి, లోయ లో గ్రామాల్ని, ముఖ్యంగా ఈ మహా పర్వతాన్నీ  కళ్ళారా చూసేసేడు.  ఊరి వారి నమ్మకాల్నీ, పర్వతంలో కల్పతరువులాంటి వృక్షాల గొప్పతనాల్నీ చెవులారా వింటాడు. ఉన్నన్నాళ్ళూ స్నేహంగానే వుండి,  తిరిగెళ్ళి, లోయ మీద దండెత్తే పెద్ద దళాన్ని తెస్తాడు. ఈ కాలకేయులకీ ఓ పేరుంది. 

మహాపర్వతం లో బోల్డన్ని నిధులున్నాయని, దాన్ని గౌరవం పేరుతో, పవిత్రత పేరుతో "మూఢ"నమ్మకాల్తో అలా గాలికొదిలేయడం మంచిది కాదనీ వాదిస్తారు ఈ దళం వాళ్ళు. . పైగా ప్రాకృతిక వనరుల మీద అందరి "హక్కూ" ఉంటుందని, లోయ వాళ్ళది మాత్రమే కాదనీ, 'సార్వజనీనతా' వాదం తెస్తారు. గొడవలూ, యుద్ధాలూ, అయ్యాక, లోయ వాళ్ళని కొందరిని కూలీలుగా వాడుకుంటూ, ఏవో తవ్వుకుపోదామని పర్వతాధిరోహణం చేస్తారు.  

ఈ పరిణామాల్తో లోయలో ప్రజలు విడిపోతారు. అంతవరకూ ఉన్న శాంతంతా పోతుంది. పర్వతం మీద పాదమన్నా మోపని వారు, "సార్వజనీనతా వాదం" ప్రకారమూ, వారి తరాల నాటి నమ్మకాలు  "మూఢ" నమ్మకాలు మాత్రమే లెమ్మని ఈ బలమైన కొత్త వారు కొట్టి పారేయడం వల్లనానూ,  పర్వతం ఎక్కడం మొదలెడతారు. 

ఆఖరికి తీవ్ర సంఘర్షణా, జీవితం నేర్పే పాఠాలూ, మనుషులు ఒకర్నొకరు నమ్మడంలో, ద్రోహం చేసుకోవడంలో, శారీరక మానసిక సామాజిక దౌర్బల్యాలతో గెలవడమూ, ఓడటాల్లో చాలా కోణాల్ని చూసినతరవాత, హృదయం కొట్టుకుంటూండే, ఆ "బ్రతికున్న పర్వతం" తన పై జరుగుతున్న దాడిని సహించినంత సేపు సహించి, కోపం వచ్చి ఒక్క సారి గర్జిస్తుంది. అంతే. 

ఇదంతా ఒక చిన్న ప్రాంతపు జానపద కధ కాదు. ఇది మనందరి కథా. అభివృద్ధి పేరిట, పర్వతాల ఎకొలాజికల్ సిస్టం ను తోసిరాజని విపరీతంగా భారీ నిర్మాణాలు, ప్రాజెక్టులూ కట్టేస్తూ, హిమాలయాల్ని సర్వనాశనం చేసేసుకుంటున్న మనుషుల కథ ఇది. ఈ రోజున జోషీమఠ్ లాంటి ముఖ్య నగరమూ, రేప్పొద్దున్న కొండల నిండా ఎడాపెడా కట్టేసిన నిర్మాణాల బరువుకు కుంగిపోనున్న షింలా (Shimla) లాంటి చారిత్రక నగరమూ, ఇలా ఇవన్నీ గొంతు చించుకుని చెప్పే కథే ఇది. ఈ "లివింగ్ మౌంటెన్".   అమితవ్ ఘోష్, పతంజలి శాస్త్రి లలాగా పర్యావరణాన్ని గురించి రాసే రచయితలు చాలా తక్కువ. వీళ్ళు చెప్పేదికూడా తక్కువే. కానీ ఈ కథలను  మనం మన పిల్లల కోసమన్నా వినాలి.  

కధని చాలా మంది చదవరు/లేరు కనుక "పైపైన" చెప్పేయడం జరిగింది. ఇది ఎవరికీ తెలీని కథ కాదు. అందరూ తెలుసుకోవాల్సినది కూడా ఎంతో కొంత ఉంది. ఈ కథ లో కొన్ని గ్రూపులకి కొన్ని 'పేరు'లున్నాయి. అక్కడ కాపలా వారికీ, దండెత్తి వచ్చినవారికీ, పాటలు పాడేవారికీ, నాట్యం చేసేవారికీ.. ఇలా. వాటిని నిజ జీవితాలతో అన్వయించుకునే ప్రయత్నం చేయవచ్చు. అంతవరకూ ప్రశాంతంగా పర్వతం పై గౌరవంతో మాత్రమే పెరిగిన, బ్రతుకుతూన్న ప్రజలు ఎంత తొందరగా కొత్త (destructive) వాదాలకు ఆకర్షితులయిపోతారో.  అలాగే చేతులు కాలాక పట్టుకునేందుకు ఆకులు దొరక్క ఎలా తల్లడిల్లుతారో అదీ చూడొచ్చు. ఎన్ని జీవరాశులనో నాశనం చేసేస్తూ, ఆఖరికి అభివృద్ధీ, సుఖాల పేరిట తన గోతిని తానే తవ్వుకునే మానవుడి కథ ఇది. చదవండి. 

***



01/12/2022

Call of Life - Knut Hamsun



కోపెన్ హేగెన్ నౌకాశ్రయం దగ్గర, దిగువకు వెళ్తుంటే అక్కడ వెస్టెర్ వోల్డ్ అని ఒక వీధి ఉంది.  అదో కొత్త, జనసంచారం లేని విశాలమైన వీధి.  దానికి ఒక వైపంతా వరుసగా చెట్లు. వీధి వెంబడి, అక్కడోటీ, ఇక్కడోటీ చెదురు ముదురుగా ఇళ్ళుంటాయి. గ్యాస్ తో వెలిగే వీధి దీపాలు కూడా ఒకటీ, అరానే.  మనుషులయితే ఎవ్వరూ కనబడనే కనబడరు.  ఇప్పుడు వేసవిలో కూడా ఈ వీధిలో విహరించే జనం కనబడడం చాలా అరుదు.

నిన్నటి సాయంత్రం ఇక్కడో వింత సంఘటన నా అనుభవం లోకి వచ్చింది. ఇదే రోడ్డు మీద నేనప్పుడు అటూ ఇటూ పచార్లు చేస్తున్నాను.   అపుడు నాకు సరిగ్గే వ్యతిరేక దిశలో ఓ మహిళ ఒంటరిగా నడుస్తూ ఎదురుపడింది. అప్పటికి చీకటి కమ్మి, వీధి దీపాలు వెలిగించడం కూడా పూర్తయింది. కానీ ఆ మసక చీకటిలో ఆమె ఎవరో, ఏమిటో సరిగ్గా పోల్చుకోలేకపోయాను. సాధారణంగా రాత్రి వేళల్లో తిరిగే రకం మనిషయి ఉంటుందని అనిపించింది. ఆమెను  దాటిపోయాను. 

రోడ్డువార్న వరుసగా ఉన్న చెట్ల దారి అంచు దాకా నడిచాక వెనక్కు తిరిగి ఇంటిబాట పట్టాను. అపుడే ఆ మహిళ కూడా దిశ ను మార్చుకుని వెనక్కి తిరిగి నడుస్తూ ఇంకోసారి ఎదురుపడింది. ఆమె ఎవరికోసమో వేచి చూస్తున్నట్టుంది. 

ఆమె "ఎవరికోసం ఎదురు చూస్తుండవచ్చు..??"   అనే ఉత్సుకత బయలుదేరింది నాలో.  అలా అటూ ఇటూ జరుపుతున్న వ్యాహ్యాళిలో ఆమె మూడో సారి ఎదురయ్యాక, నేను ఏమాత్రం ఆగకుండా, టోపీ కాస్త పక్కకి తప్పించి, అభివాదం చేస్తూ, "గుడ్ ఈవినింగ్! మీరు ఎవరికోసమయినా ఎదురుచూస్తున్నారా ?" అని అడిగాను. 

అనుకోనీ ఈ పలకరింపుకి ఆమె తుళ్ళిపడింది. బెరుకుగా "లేదు".. అని ఆగి "హ్మ్.. " అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చింది.. సరే ఆమె ఎవరికోసమో ఎదురుచూస్తుంది. 

"మరి మీకు ఇబ్బంది లేనట్లయితే ఆ వ్యక్తి వచ్చేదాకా నేను మీకు కాస్త తోడు ఉండనా ?" 

"అయ్యో వద్దు!" అనందేగానీ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు ఆమె.

మాటలు కలిసాయి. నాకు ధన్యవాదాలు చెప్తూ తన పరిస్థితిని వివరించింది. నిజానికి ఆమె ఎవరికోసమూ ఎదురుచూడటం లేదు. కేవలం చల్లగాలి పీల్చుకుందుకని బయటికి వచ్చింది. ఇక్కడ చూస్తే గాలి ఆడట్లేదు. అందుకే ఆ నడక! 

అంతే, ఇక మేమిద్దరం ఒకరితో ఒకరం కలిసి నడవడం ప్రారంభించాము. అదీ ఇదీ మాటాడుకుంటూ, పెద్ద ప్రాధాన్యత లేని కబుర్లు దొర్లించాం. నేను ఆమె పట్టుకునేందుకు వీలుగా, మర్యాదకి నా మోచేతిని ఆమెకు అందించాను. 

"థాంక్ యూ..!   వొద్దు." అన్నది ఆమె తలూపుతూ. 

"టైం ఎంతయింది ?" అని అడిగింది ఆమె. 

ఆ విహారంలో పెద్ద మజా ఏమీ లేదు. పైగా ఆ చీకట్లో ఆమె మొహం ఆనవాలు ఏదీ తెలీట్లేదు. టైం చూసే మిష మీద అగ్గిపుల్ల గీసి, మంటని కాస్త పైకెత్తి, ఆమె ముఖాన్ని కూడా చూసాను. 

"తొమ్మిదిన్నర!" అన్నాను. 

ఆమె చలికి కాస్త వొణికింది. ఈ అవకాశాన్ని జారవిడుచుదలచుకోలేదు. 

"మీకు చాలా చలిగా ఉంది. మనం ఏదయినా ప్రదేశానికి వెళ్ళి, ఏదయినా తాగుదాం "టివోలీ", "నేషనల్" ? ఎక్కడికి  ? చెప్పండి !" అన్నాను. 

“కానీ.. చూడండి. నేనిప్పుడు ఎక్కడికీ వెళ్ళలేను.”  సంకోచంగా అందామె.  అప్పుడు మొదటి సారి సరిగ్గా చూసాను.   ఆమె  తల వెనుకగా ఒక పొడవైన నల్లని మేలి ముసుగు ధరించి ఉంది.  నేను వెంటనే  'క్షమాపణలు'  కోరాను.  నేను పొరబడటానికి కారణం 'చీకటి'  కాబట్టి దానికే దోషం  అంటగట్టాను. ఆమె నా క్షమాపణను స్వీకరించిన పద్ధతిని బట్టి ఆమె ఊరికే రాత్రిళ్ళు బయట తిరిగే రకం మనిషి కాదనిపించింది.  

సరే ! నా చేతిని తీసుకోండి" సలహా ఇచ్చాను. "కాస్త వెచ్చగా ఉంటుంది".

ఆమె నా మోచేతిని తన నాజూకు చేతితో మర్యాదగా అందుకుంది. 

మేమిద్దరం ఆ వీధిలో అటూ ఇటూ కొన్నిసార్లు నడిచాక, ఆమె మళ్ళీ నన్ను టైం ఎంత అయిందో చూడమని కోరింది. 

"పది అయింది". మీరు ఉండేది ఎక్కడ ?"

"గేమల్ కొంగేవీ లో"

నేనామెను ఆపేను. "మీ ఇంటి వరకూ నేను తోడు రానా ?"

"వొద్దు!" ఆమె అంది. "వొద్దు.. మిమ్మల్ని అలా చెయ్యనివ్వను. మీరుండేది బ్రెడ్గాడ్ లో!" సమాధానం ఇచ్చింది. 

"మీకెలా తెలుసు?" ఆశ్చర్యంగా అడిగాను.

"ఒహ్! మీరు నాకు తెలుసు!"

ఒక చిన్న విరామం తరవాత మేమిద్దరం అలా చేతిలో చేయి వేసుకుని వీధి దీపాల వెలుగులో నడిచాము. ఆమె తొందరగా నడుస్తూంది. ఆమె పొడవైన ముసుగు జీరాడుతూంది. 

"మనం త్వరగా వెళ్ళాలి!" అంది. 

గామల్ కొంగేవీలో ఆమె ఇంటిదగ్గర, చాలా దయతో, తోడు వచ్చినందుకు,  ధన్యవాదాలు  చెప్పేందుకన్నట్లు ఆమె నావైపుతిరిగింది. ఆమెకు తలుపు తెరచి పట్టుకున్నాను. ఆమె మెల్లగా లోపలకు నడిచింది. నా భుజంతో తలుపుని మెల్లగా నెడుతూ నేనూ లోపలికి వెళ్ళాను. ఒకసారి లోపలికివెళ్ళగానే, ఆమె నా చేతిని గట్టిగా పట్టుకుంది. ఇద్దరమూ ఒక్క మాట అనలేదు. 

రెండు అంతస్తులు మెట్లెక్కి మూడో అంతస్తు చేరాము. ఆమె స్వయంగా తన అపార్ట్మెంట్ తాళం  తెరిచింది. ఆ తరవాత రెండో తలుపు తెరిచి, నా చేతిని పట్టుకుని మెల్లగా నన్ను లోపలికి తీసుకునివెళ్ళింది. అది బహుశా ఒక డ్రాయీంగ్ రూం అయి ఉంటుంది.  అక్కడ గోడ గడియారం చేసే టిక్ టక్ శబ్దం విని పించింది. తలుపు లోపలికి వెళ్ళాకా, ఆమె ఒక్క క్షణం ఆగి, తన రెండు చేతులూ నా చుట్టూ వేసి, సన్నని కంపనతో, చాలా కోరికతో, పెదవులమీద ముద్దు పెట్టుకుంది తిన్నగా పెదవులపైనే!!

“మీరు కూర్చోరా ?”  ఆమె సూచించింది. “ఇదిగో సోఫా.. ఉండండి నేను దీపం తీసుకొస్తాను.”  

అప్పుడు దీపం వెలిగించింది.  నేను ఆశ్చర్యంలోనే ఉన్నాను. నేనెక్కడున్నానో చూసుకున్నాను.  

అదో విశాలమైన, చాలా అందమయిన ఫర్నిచర్ ఉన్న డ్రాయింగ్ రూం. దానికి అనుబంధంగా   ఉన్న 'సగం తెరిచిన' తలుపులు చాలా గదులకు ద్వారాలని   తెలుస్తూంది.  ఆ క్షణం, నేనసలు      'ఎవరి'తో, ఎక్కడ' ఉన్నానో,   'ఆమె అసలు ఎటువంటిదో, నా పరిస్థితి ఏమిటో' అస్సలు తెలియలేదు.

“ఎంత అందమైన గది ? “   అన్నాను ఆశ్చర్యానందాలతో..  “ మీరు ఇక్కడ ఉంటారా ?” 

“అవును. ఇది నా ఇల్లు.” అందామె.
“ఇది మీ ఇల్లా ? మీరు మీ తల్లితండ్రులతో ఉంటారా ఇక్కడ ?”
“ఒహ్! లేదు.” ఆమె పకాలున నవ్వింది. "నేను పెద్ద దాన్ని. మీరే చూస్తారు.” అని, తన మేలి ముసుగుని, ఇతర దుస్తుల పొరల్నీ  తీసేసింది.

"ఇదిగో చూడండి ! నేను చెప్పాను కదా!!" అంటూ, తన చేతుల్ని మరోసారి నా చుట్టూ వేసి, అణుచుకోలేనంత కాంక్షతో చుట్టేసుకుంది. 
 

ఆమెకు ఇరవై రెండో, మూడో ఉండొచ్చు. కుడి చేతి కి ఉన్న రింగ్ఆమెకు వివాహమైతే  జరిగినదని సూచిస్తుంది.  అందంగా ఉందా ?  లేదు.  ఆమె వడలిపోయి ఉంది. కనురెప్పలయితే లేనే లేవు.  కానీ  ఆమెలో సజీవమైన యౌవనోత్సాహం మాత్రం పుష్కలంగా ఉంది.  ఇంకా,  ఆమె నోరు అనూహ్యమైనంత అందంగా ఉంది.
 
ఆమె ఎవరో అడుగుదామనుకున్నా.  ‘అసలామెకు భర్తంటూ ఉంటే, అతను  ఎక్కడ ఉంటాడో ? అసలు నేనిప్పుడు ఉన్న ఈ ఇల్లు ఎవరిది..? ‘ 

ఇలా ఆమెను ఏదన్నా అడుగుదామని నోరు తెరిచినా ఆమె వలపుతో చుట్టి పడేస్తూ, అస్సలు మాటాడనివ్వలేదు.   ప్రశ్నలు వొద్దనే చెప్పేసింది.
 
“నా పేరు ఎలెన్.”  ఆమె చెప్పింది. “తాగడానికి ఏదన్నా తెప్పించమంటారా ?  మొహమాటపడకండి.   నేనిప్పుడు గంట మోగిస్తే ఎవరికీ నిద్రాభంగం కాదు. అంతవరకూ మీరు కాస్త ఈ బెడ్ రూం లో   ఉండండి"
 
నేను బెడ్ రూం లోకి వెళ్ళాను.  డ్రాయింగ్ రూం లోంచీ ఆ గదిలో కి పడిన వెలుతుర్లో ఆ గది కొంచెం ప్రకాశవంతంగానే ఉంది. అక్కడ రెండు మంచాలున్నాయి. ఎలెన్ గంట మోగించి వైన్ తెప్పించింది.  ఒక నౌకరు వైన్ తెచ్చిలోపల పెట్టి, గది బయటకు వెళ్ళడం వినబడింది.  కాసేపట్లో ఎలెన్ బెడ్రూం లోకి వచ్చి, తలుపు దగ్గరే నిలుచుండిపోయింది. నేను ఆమె వైపు ఒక అడుగు ముందుకేసాను. ఆమె చిన్న కేక పెట్టి, వెంటనే నావైపు వచ్చింది.
 
అది నిన్నటి సాయంత్రం.  ఆ తరవాత ఏమైందా ? ఆహా! కాస్త ఓపిక పట్టండి. ఇంకా చాలాఉంది.  చిరుచీకట్లు విడే సమయానికి నాకు మెలకువ వచ్చింది. కర్టెన్ రెండు వైపుల నుండీ, సూర్యకిరణాలు గదిలోకి ప్రసరిస్తున్నాయి. ఎలెన్ కూడా అపుడే నిద్రలేచి, నన్ను చూసి చిరునవ్వు నవ్వింది. ఆమె చేతులు వెల్వెట్ లా తెల్లగా ఉన్నాయి. ఆమె వక్షం అసాధారణంగా ఎత్తుగా ఉంది. ఆమెతో గుసగుసగా ఏదో చెప్పాను. ఆమె తన పెదవులతో నా పెదవులను మూసేసింది. ఆ మృదుత్వానికి మూగబోయాను. పొద్దు వికసించింది. 

రెండు గంటల తరవాత లేచాను. ఎలెన్ కూడా లేచి, బట్టలు వేసుకుంది. జోళ్ళు తొడుక్కుంది. సరిగ్గా అప్పుడు నాకు ఒక మరిచిపోలేని భయంకర అనుభవం ఎదురైంది.  


నేను వాష్ బేసిన్ దగ్గర నిలుచున్నాను. ఎలెన్ కి ఏదో పని పడి, పక్కగదిలోకి వెళ్ళింది. తలుపు ఓరగా తెరుచుకున్నాక, ఆ గదిలోకి ఊరెకే తొంగి చూసాను. అక్కడి దృశ్యం చూసి, నేనున్న గదికున్న కిటికీలోంచీ  చల్లగాలి దూసుకొచ్చి, నన్ను ఒక్క ఉదుటన చుట్టేసినట్టయి, వొణికాను. ఆ గదిలో ఒక మృతదేహం ఉండడం స్పష్టంగా కనపడింది. మృతదేహం. శవపేటికలో ! తెల్లని బట్టలు వేసుకుని, మాసిన తెల్లని గడ్డం ఉన్న ఒక పురుషుని మృతదేహం. అతని పుడకల్లాంటి మోకాళ్ళు, అతన్ని కప్పి ఉన్న వస్త్రాన్ని పొడుచుకొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఊహకి చెందిన దేన్నో బలంగా పట్టుకున్నట్టు, గట్టిగా బిగిసున్న పిడికిలి. అతని మొహం పాలిపోయి, జీవకళ కోల్పోయి, తెల్లగా ఉంది. ఇదంతా, పట్ట పగటి వెలుతుర్లో నేను స్పష్టంగా చూడగలిగాను. నేను గిర్రున వెనక్కు తిరిగాను. ఒక్క ముక్క మాటాడితే ఒట్టు.  
 
ఎలెన్ తిరిగొచ్చేసరికి, నేను బట్టలు వేసేసుకుని బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నాను.   ఆమె కౌగిలింతలకి నా మనసు అస్సలు స్పందించలేదు. అతి కష్టం మీద నన్ను నేను సంబాళించుకోగలిగాను. ఆమె ఇంకొన్ని ఎక్కువ దుస్తులే తొడుక్కునుంది. నన్ను కింది దాకా సాగనంపేందుకు రావాలని కోరుకుంది. గుమ్మందాకా వచ్చాక, ఎవరికీ కనబడకుండా గోడకి తన శరీరాన్ని ఆనించి, గుస గుసగా " సరే! గుడ్ బై!" అంది.

"రేపటి దాకానా ?"అడిగాను. ఒకవిధంగా ఆమెను పరీక్షించేందుకే.
“లేదు. రేపు వొద్దు.”
“రేపు ఎందుకు వొద్దు ?”
“అన్ని ప్రశ్నలడగొద్దు ప్రియతమా. రేపు నేనొకరి అంత్యక్రియలకు హాజరు కావాలి.  ఒక బంధువు        పోయారు.  హ్మ్మ్.. నీకు తెలుస్తూంది కదా.. !”
“మరి ఎల్లుండి ?”
“సరే. ఎల్లుండి!  ఇక్కడే ఈ ద్వారం దగ్గరే నిన్ను కలుస్తా. ఇప్పటికి గుడ్ బై”
నేను వచ్చేసాను.
 
అసలు ఎవరామె ? ఆ శవం ఎవరిది ? ఆ శవం అరచేతులు అంత గట్టిగా బిగుసుకుని ఎందుకు ఉన్నాయి ? ఆ దేహం తాలూకు నోరు తెరుచుకునెందుకుంది ? ఎంత భయానక హాస్యం ? ఎల్లుండి నాకోసం ఆమె ఎదురుచూస్తుందా ? అసలు నేనామెను మళ్ళీ కలుసుకుంటానా ?
 
అక్కడి నుండి తిన్నగా బెరియా కేఫ్ కి చేరుకుని డైరెక్టరీ తీసుకున్నాను.  ఇంటి నెంబరు ఆధారంగా, గామెల్ కొంగవీ.. ఇంకా.. ఆ పేరు మీద ఆగాను.  ఆతరవాత, మర్నాటి పొద్దుటి వార్తా పత్రికలు      వచ్చే దాకా కాసింత సమయం వేచి చూసాను.   పత్రిక చేతిలోకి రాగానే  చావు ప్రకటనల పేజీని        వెతుక్కున్నాను. సరిగ్గా అక్కడ ఆమె ఇచ్చిన ప్రకటన కూడా చూసాను. వరుసలో మొట్ట మొదటి      ప్రకటన! దళసరి అక్షరాల్లో..

“యాభై మూడేళ్ళ నా భర్త, చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడి ఈరోజు మరణించారు. ”
ఆ ప్రకటన తేదీ, మొన్నటిది.
 
చాలాసేపు కూర్చుండిపోయి, చుక్కల్ని కలుపుతూ, అంతటినీ సమీక్షించుకున్నాను.
 
ఒక ధనిక పురుషుడు పెళ్ళి చేసుకుంటాడు. అతని భార్య,  అతని కన్నా ముప్ఫయి (లేదా నలభై)  ఏళ్ళు చిన్నది.  అతనికి ఏదో వ్యాధి సోకి,  పట్టు విడవకుండా పీడిస్తుంది.  చివరికి ఒక మంచిరోజున అతను మరణిస్తాడు. అప్పుడు ఆ యువ వితంతువు హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది.

 

Original Story : Call of Life (translated to English by Auders Orbeck)

Written by  :  Knut Hamsun (Norway)

***