Pages

02/11/2021

India's China War - Neville Maxwell



First published in Pustakam.net :  http://pustakam.net/?p=21903 


ఇప్పటి రోజులకి ఇది చాలా చాలా పాతపుస్తకం.  డోకలాం లో సంఘర్షణ మొదలయినప్పుడు టెలివిజన్ న్యూస్ నిండా ఇండియా చైనా బోర్డర్, దానిలో ఏ సార్వభౌమ రాజ్యాల కోసం మనం ఇలా కొట్టుకు పోతున్నామో విశదంగా బొమ్మలు మేప్ లతో, గాల్వాన్ లోయ లో చైనా ఆక్రమణల గురించి విస్తారంగా  హై డెఫినిషన్ సాటిలైట్ చిత్రాల తో  చూసాము. ఇప్పుడు చైనా, భారత దేశం తన సరిహద్దుల్ని  పటిష్టం చేయదలచుకున్నప్పుడల్లా కన్నెర్ర జేస్తుంటుంది. చైనా టిబెట్ నిండా ఆధునిక సౌకర్యాలతో గ్రామాలకు గ్రామాలనే నిర్మించి మనకు గుబులు రేకెత్తిస్తుంటుంది. అభివృద్ధి ఆశ చూపించి, టిబెటన్లను తన వైపు తిప్పేసుకుంది. ఇవన్నీ వార్తల్లో చదువుతాం. 


సరిహద్దు సంఘర్షణల్లో భాగంగా 16 బిహార్ రెజిమెంట్ ఇరవయి మందిని కోల్పోయినాక, అందులోనూ యువ కల్నల్ సంతోష్ కుమార్ మరణం తరవాత, భారతీయుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ప్లాస్టిక్ సామానులమ్మే 'చైనా' బజారులన్నీ 'జనతా బజారు ' లో, 'ఇండియా' బజారులో అయ్యాయి. చైనీస్ బ్యూటీ పార్లర్లూ, మేక్ ఓవర్ చేసుకున్నాయి. చైనీస్ రెస్టారెంట్లు వణికాయి. కానీ మనకు చైనా లేకుండా దీపావళీ, రాఖీ, హోలీ లూ గడవవు, పెన్నులు పాళీలు, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లూ, ఆఖరికి పేరసేటమల్ గోలీలు కూడా చైనా ఉత్పత్తులే . మనదే కాదు. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం, సప్లయి విభాగాల్లో, చవగ్గా ముడి సరుకూ, కీలక వైద్య ఉపకరణాలూ, మందుల ఇండస్ట్రీ లో చైనాది మోనోపోలీ. చైనా ఇప్పుడు ఒక ఎదురు లేని ప్రపంచ శక్తి. 


ఇండియా ముందునుండీ మొత్తుకుంటున్న దాని బెల్లికోస్ ప్రవృత్తి రాను రానూ శృతి మించుతుంది. చైనా విదేశాంగ విధానం ఎలా ఉన్నా, మన లాంటి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని దేశానికీ, చైనా కీ పోలికే లేదు. మన విదేశాంగ విధానం, "నెహౄ  మెతక " విధానంగా తీవ్ర అపనిందల పాలయింది. 1961 లో మన ఓటమి - ప్రపంచం దృష్టి లో మనని ఓ బలహీనమైన మామూలు దేశంగానే మిగిల్చింది. అదే యుద్ధం చైనా ని  ఓ బలమైన రాజ్యంగా పైకి తీసుకొచ్చి నిలబెట్టింది.  దేశం లో ప్రతిదానికీ నెహ్రూ మూలంగానే మనం ఓడిపోయామని, మనకో దూకుడు పద్ధతంటూ ఉండాలని వాదన మొదలయింది. దాని పర్యవసానాలు మళ్ళీ చైనా ఇండియా సరిహద్దు వివాదాల్ని కొత్తగా తెరపైకి తీసుకొచ్చాయి. ఈ రెండు దేశాల వాదనల్లో ఏది నిజం, ఎవరి వైపు న్యాయం ఉందో వివరించే ప్రయత్నం చేస్తుంది ఈ పుస్తకం. 


అసలు ఎందుకూ కొరగాని, మనుషులే జీవించని,  గడ్డి కూడా మొలవని విస్తారమైన 'నో మేన్ జోన్ '  అంటే మానవ మాత్రులే ఉండని  ఆ ప్రాంతం గురించి ఇరు దేశాలకూ ఎందుకు ఇంత పట్టుదల ? ఇరు దేశాల రాజకీయ సంబంధాలలో ఇంత నాటకీయమైన అంశం - ఇరవయ్యో శతాబ్దాన్ని ఇలా ఇంత గా ప్రభావితం చెయ్యడం ఏంటి ? అసలేంటి మన సమస్య ? ఆసియా ఖండంలోని ఈ కొత్త రెండు సామ్రాజ్యాలూ, స్నేహంగా కలిసిమెలసి ఉంటారని, ప్రపంచ రాజకీయాలకు శాంతి  సౌభ్రాత్తృత్వాలకి  చిరునామా గా ఉంటారని లోకం అంతా అనుకుంటూండగా హిందీ చీనీ భాయి భాయి కాస్తా ఒకరి గొంతు ఒకరు పట్టుకుని యుద్ధానికి తెగబడడం ఒక ఆశ్చర్యకరమైన పరిణామమే. 


దీని గురించి భారత దేశంలో The Times పత్రిక లో కరెస్పాండెంట్ గా 1959  ఆగస్టు లో న్యూడిల్లీ  చేరిన (Australian) journalist,  Neville Maxwell [నెవిల్ మేక్స్ వెల్] - 1961 లో చైనా భారత యుద్ధానికి దారితీసిన వివిధ నాటకీయ పరిస్థితుల గురించి తన పత్రికకు రాసిన వందలాది వ్యాసాల్ని   క్రోడీకరించి రాసిన పుస్తకం ఇది. అవి లాంగ్జూ [Longju] లో మొదటి సారి భారత, చైనీయ సైన్యాలు ఆయుధాలతో తలబడిన మొదటి సంఘటన జరిగిన రోజులు. ఈ సంఘర్షణ తరవాత  ఇరు రాజ్యాల మధ్యా సరిహద్దు వివాదం ముదిరి, మూడేళ్ళూ చిలికి చిలికి గాలివానై పెద్ద యుద్ధానికి దారితీసింది.   

నిజానికి ఇది రెండు కొత్త రాజ్యాల మధ్య భూభాగం మీద పట్టు కోసం జరిగిన యుద్ధంగా కనిపించినా దీని వెనక 150 ఏళ్ళ హిమాలయాల రాజకీయ, దౌత్య, సైనిక నేపధ్యం ఉంది. రెండు దేశాల్లోనూ ఈ నేపధ్యం మీద గానీ, ఒకరి అభిప్రాయం  గురించి ఇంకొకరికి కనీస ఒప్పుకోలు కూడా లేదు. ఇండియా కి చైనీయుల వాదన అభ్యంతరకరం, అలానే చైనీయులకి భారత దేశపు వాదన ఒకటి అసలు ఉందన్న భావనే లేదు. రచయిత భారతీయ దృక్కోణం గురించి భారత సైన్యపు పలు రికార్డులు, ఫైల్స్ - ఇంకా మన్ కేకర్ (D.R..Mankekar) లాంటి మిలిటరీ రీసెర్చర్ ల  నుంచీ సేకరించిన ఆధారాల ప్రకారం ఒక రూపాన్నిచ్చే ప్రయత్నం చేసారు. అలాగే పెకింగ్ (నేటి బీజింగ్) కఠిన ఆంక్షలు, అధికారిక మౌనం లాంటి ఇబ్బందులని దాటలేక,   చైనీస్ దృక్పధాన్ని గురించి లండన్ లోని స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ ఎండ్ ఆఫ్రికన్ స్టడీస్ విభాగం నుంచీ సమాచారం సేకరించారు.   


వందేళ్ళ క్రితం రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం, హిమాలయాల పైనుండీ భారత దేశం మీదికి రష్యా సామ్రాజ్య వాద దాడుల నుంచీ రక్షించుకోవల్సి  ఉండొచ్చని భావించింది. దాన్ని చెక్ చేయబోయి, ఎగువ హిమాలయాల మీదుగా చైనా సామ్రాజ్యాన్ని ఎదుర్కొంది. అప్పటికి ఆ ప్రాంతం అంతా చిన్న చిన్న ముక్కలుగా, ఏ స్థిర రాజకీయ వాతావరణమూ లేక, నాయకత్వమూ, సంఘీభావమూ లేక, ఎవరన్నా ఆక్రమించేసుకోగల పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇటు రష్యా, చైనా, బ్రిటీష్ సేనలకి ఈ పనికిమాలిన ప్రాంతం స్ట్రాటజిక్ గా చాలా అవసరంగా ఆక్రమించుకోదగ్గ ప్రాంతంగా  అనిపించింది. 


అటు రష్యా ను ఆపేందుకు ఆఫ్గనిస్తాన్, ప్రస్తుత పాకిస్తాన్ ల మధ్య Captain Henry McMahon ఆధ్వర్యాన నిర్దేశించబడిన  1500 మైళ్ళ పొడవైన  "డ్యూరాండ్ లైన్"  ద్వారా  బ్రిటిష్ వాళ్ళు,  ఆఫ్గన్ ల తో, "మీ జోలికి మేము రాము - మా వైపు మీరూ రాకండి" అని చెప్పేసినట్టయింది.  ఆఫ్గనిస్తాన్ లో గెలిచేది లేదని బాధాకరమైన ఓటమి తరవాత తెలుసుకుంది బ్రిటీష్ సామ్రాజ్యం. ఇదీ ఒక తాత్కాలిక, అస్పష్ట సరిహద్దే,  ఈ డ్యూరాండ్ లైన్ ఇప్పటి పాక్ - 'తాలిబాన్ పాలిత' ఆఫ్గన్ సరిహద్దు వివాదానికి ప్రధాన కారణం. 


అలానే ఇండియా చైనా ల మధ్య తొందరపాటు గా, నిర్లక్షంగా, అస్పష్టంగా సరిహద్దుల్ని గీసి, రెండు రాజ్యాల మధ్యా వివాదానికి కారణమైనదీ బ్రిటీష్ పాలనే.  అదే విధంగా ఏదో విధంగా తన పూర్వానుభవాల దృష్ట్యా . తమని ట్రిక్ చేసేస్తారేమో అని భయపడి, సరిహద్దు సమస్యలని చర్చించేందుకు, ఎప్పటికి ముందుకు రాని, రహస్య దౌత్య విధానాల్నీ పాటించే "చైనా"  సంస్కృతీ ఒక కారణమే. ఒక స్పష్టమైన సరిహద్దును నిర్వచించేందుకు జరిగిన ప్రయత్నాలన్నీ ఆయా కారణాల వల్ల బెడిసి కొట్టడమూ ఒక కారణం. 


మొదటి సిక్ యుద్ధాన్ని 1846 లో గెలిచినప్పటికీ కష్మీర్ లాంటి అప్రాధాన్య ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించకుండ,  కష్మీర్ ని కేవలం ఉత్తర సరిహద్దుని కాపాడే బఫర్ గా మాత్రమేవాడుకునేందుకు వీలుగా, (నిజంగా ఆక్రమించడం ద్వారా మొదలయ్యే ప్రజా వ్యతిరేకత నీ, ఖర్చునీ వదిలించుకునేందుకు కూడా) అక్కడ జమ్ము రాష్ట్రానికి చెందిన డోగ్రా నాయకుడు గులాబ్ సింగ్ కు అధికారాన్ని  అప్ప జెప్పి, తను ప్రేక్షక పాత్ర పోషించింది బ్రిటిష్ ఎంపైర్. ఇలా, ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతానికి (కాశ్మీర్) కు ఒక హిందూ రాజుని కట్టబెట్టడం ద్వారా ఇప్పటికీ ఆరని అగ్ని జ్వాలల్ని మొదలు పెట్టింది. గులాబ్ సింగ్ ని అలా బ్రిటిష్ కనుసన్నల్లోకి తేవడం కూడా ఒక రకంగా బ్రిటిష్ వారి విజయమే. ఎందుకంటే గులాబ్ సింగ్ తక్కువ వీరుడేమీ కాదు. అతను అల్లంత దూరాన ఉన్న  లడాక్ ని జయించుకుని వచ్చిన వాడు. 


లడాక్ పదో శతాబ్దం వరకూ టిబెట్ రాజ్యంలోని భాగమే. ఆ తరవాత అది స్వతంత్రం ప్రకటించుకుంది. 14 వ శతాబ్దంలో ఇస్లామిక్ ముట్టడి లడాక్ ని సమీపించి 16 వ శతాబ్దం వరకూ ఆ ప్రాంతాన్ని అంటిపెట్టుకునుండటం తో అది కూడా ముఘల్ సామ్రాజ్యంలో భాగమైంది.  ముఘల్ పతనం తరవాత కూడా లడకీయులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. స్వయానా వారు "బుద్ధు"లు,  [Lhasa] లాసా సాంస్కృతిక సామీప్యం, రాజకీయ అనిశ్చితి, లడక్ ని మళ్ళీ టిబెట్ సాంప్రదాయాల వైపు లాగింది. ఇది పంతొమ్మిదో శతాబ్దం వరకూ సాగింది. అది కాస్తో కూస్తో మానసికంగా టిబెట్ కు 'లొంగిన ప్రాంతం' అయి, 'విధేయంగానే' ఉండేది. టిబెట్ లో దలై లామా మాట ఎలా వేదమో, లడాక్ లో కూడా అదే ఆజ్ఞ అయేది. కానీ అప్పటికి టిబెట్ చైనా అంతర్భాగం. 


1854 లో గులాబ్ సింఘ్ లడాక్ మీదికి దండెత్తి, దాన్ని గెలిచిన తరవాత అతని సేన అక్కడితో ఆగకుండా టిబెట్ మీదకి కూడా యుద్ధానికెళ్ళింది. 1841 కల్లా టిబెట్ సిక్ రాజుల ఆధిపత్యంలోకి వచ్చింది. 'రాకాస్ తల్', 'మానస్ సరోవర్' లాంటి పవిత్ర తటాకాలు కూడా సిక్కుల అదుపులోకి వచ్చాయి. మేలు రకం ఉన్ని ఉత్పత్తులు, విశాలమైన భవ్య హిమాలయాలు అదుపులోకి వచ్చాక కూడా కేవలం ఒక తప్పుడు నిర్ణయం కారణాన సిక్కు సైన్యం భయానక మైన చిక్కుల్లోపడింది. చలికాలం టిబెట్ లోనే గడపడలన్న వారి సైన్యాధికారి తీసుకున్న నిర్ణయం, వారికి ప్రాణాంతకమైంది. సరైన వసతులు లేకుండా 12000 అడుగుల ఎత్తులో, మంచు సముద్రంలో దుర్భర చలి పరిస్తితుల మధ్య ఆ వేలాది సైన్యం తీవ్ర ఇబ్బందులు, తరవాత ఒక్కొక్కరుగా మొత్తం సైన్యమే మృత్యువాత పడింది.  


అప్పటికి, టిబెటన్ లు బలగాల్ని సమీకరించుకుని వచ్చి తిరిగి లడాక్ ను ఆక్రమించుకునే దాకా వచ్చింది.  ఇక ఆ ఓటమి తప్పని పరిస్థితుల్లో సిక్కు సైన్యము, టిబెట్ సైన్యమూ, ఒక ఒప్పందానికి వచ్చాయి. 'ఒకరి రాజ్య అధికారాన్ని ఒకరు గౌరవించుకుంటామని, ఇక పోరు పేరున ఒకరితో ఒకరు తలపడమని' ఆ ఒప్పందం.  దీనిలో ఇరు సైన్యాలూ కూడా సరిహద్దు ఇదీ అని నిర్ణయం ఏదీ తీసుకోలేదు.  టిబెటన్ లూ, డోగ్రా వారూ, తమ తమ పరిధుల్లో తాము ఇరుగు పొరుగు వారమే అయినా ఒకరికొకరం దగ్గర ఎన్నటికీ కామని తెలుసుకున్న సంఘటన అది. రెండు ప్రాంతాల మధ్యా స్పష్టమైన సరిహద్దేదీ లేదు. మధ్య లో ఉన్న "ఎవరూ ఉండని ప్రదేశమూ " ఇతరత్రా బండ గుర్తులూ, ఎవరికి వారు నిర్ణయించుకున్నవే తప్ప పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణీత సరిహద్దులు కావు.  ఇక్కడ ఈ గులాబ్ సింగ్ లడక్ ప్రస్థానం,  టిబెట్ యుద్ధాన్ని ఓడిపోవడాన్నీ బ్రిటీష్ సామ్రాజ్యం చాలా జాగ్రత్త గా పరిశీలించి, ఒక వేళ చైనా దండెత్తి (టిబెట్ మీదుగా) వస్తే, గులాబ్ సింగ్ అడ్డుకోకలడని ఆశించి, కష్మీర్ పై అధికారాన్ని అప్పగించింది. 


కానీ తదనంతరం, అమ్రిత్సర్ ఒప్పందం ఒకటి మాటాడి, గులాబ్ సింగ్, [ప్రతీకారంతో శక్తి యుక్తుల్ని సమకూర్చుకుని లడాక్ పై  ఇంకోసారి దాడి చెయ్యకుండా]   బ్రిటీష్ వారి అనుమతి లేకుండా సామ్రాజ్య విస్తరణ  చెయ్యకూడదని అతని చేతుల్ని కట్టి పడేసారు. అదే విధంగా గులాబ్ సింగ్ సైన్యం టిబెటన్ లతో చేసుకున్న ఒప్పందం ఆధారంగా సరిహద్దు వివాదాలన్నిటినీ కూర్చుని చర్చించేసుకుని పరిష్కరించేసుకుందామని చైనా కు కబురు పెట్టారు.  అప్పటికి పెకింగ్ లో బ్రిటీష్ వారి ఆఫీసు లేదు. అసలు చైనీయులని కాంటాక్ట్ చెయ్యడమే గగనం. వారి నుండీ సమాధానం దొరకడమూ దుర్లభమే. కాబట్టి వీళ్ళకి అతికష్టం మీద చైనా నుండీ దొరికిన సమాధానం " లడాక్ సరిహద్దులు పూర్తిగా పరిష్కరించబడినవనీ, వాటిలో అస్పష్టత ఏమీ లేదని - ఇందులో చైనా వచ్చి మాటాడాల్సిందేమీ లేదనినూ.."   దానితో ఏ చర్చా జరగలేదు. చైనా ఉద్దేశ్యంలో తనదైన ప్రాంతమంతా తనదే. ఇంకోరు ఇంకో మాట అనడానికి వీల్లేదంతే. 


పైగా, ఆ తరవాత ఇంకో వివాదమూ తెర మీదికొచ్చింది. అసలు గులాబ్ సింగ్ తో ఒప్పందం చేసుకునే హక్కు టిబెటన్లకి లేదనీ, వారు కేవలం చైనా తరఫున రాయబారానికొచ్చారే  గానీ, సంధి చేసుకునే అధికారం వాళ్ళకి చైనా ప్రభుత్వం ఇవ్వలేదనీ!!!   ఇదంతా మిగిల్చిన గందరగోళం మధ్య, ఇండియా, చైనాలు అసంబద్ధమైన, అస్పష్టమైన సరిహద్దు కారణంగా, ఇప్పటికీ యుద్ధ వాతావరణంలోనే ఉన్నారు. దానికి తోడు, ముందుచూపు లేని నాయకత్వం, లౌక్యం లేని దుష్ప్రచారం, అగ్నికి ఆజ్యం పోస్తూనే ఉన్నాయి.   


గులాబ్ సింఘ్ ఇంకో స్పష్టమైన విజయం అందుకోకుండా ఆపిన బ్రిటీష్ ప్రభుత్వం, కేవలం దౌత్యంతో, సరైన సరిహద్దుని నిర్ణయించడం ద్వారా చైనా ను బౌండరీ కవతలే ఉంచేందుకు చేసిన ప్రయత్నాలూ బెడిసి కొట్టాయి.  సరిహద్దు నిర్ణయించేందుకు గాను, పాంగోంగ్ లేక్ నుండీ కారకోరం శ్రేణి వరకూ ఉన్న ప్రాంతాన్నంతటినీ, సర్వే ఆఫ్ ఇండియా కు చెందిన అధికారి WH Johnson పర్యేవేక్షించారు. ఈయన 1865 లో ఖోటాన్ ని సందర్సించి, అక్కడి నుండీ అక్సాయ్ చిన్ (Aksai chin -  desert of white stones) వరకూ నడిచి,  సర్వే చేసారు. సముద్ర మట్టానికి 17000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆక్సాయ్ చిన్ లో గడ్డి కూడా మొలవదు. ఎవరూ నివసించరు. కారకోరం పర్వత శ్రేణికీ, కుయెన్-లున్ శ్రేణికీ మధ్య ఉన్న ఈ ప్రాంతం రెండు దేశాల మధ్యా అతి పెద్ద వివాదానికి దారి తీసింది. దీన్ని భారత దేశపు మేప్ లో చూపించడం చైనా కు తీవ్ర అభ్యంతరకరం.  ఈ విషయం పై బ్రిటీష్ అధికారులే భిన్న అభిప్రాయాలతో కొట్టుకున్నారు. ఇవి దౌత్యపరంగా చైనా కు అనుకూలాంశాలు.  

ఈ లోగా చైనా లో తలెత్తిన తిరుగుబాట్లూ, విప్లవాలూ చైనా ని మరింత కఠినంగా మార్చేసాయి. ఈలోగా రష్యా కూడా ఈ ప్రాంతంపై, చైనా తాలూకూ వీక్ లింక్స్ మీదా దృష్టి పెడుతుందేమో అన్న  భయాలు  కూడా బ్రిటిష్ విధానాల్ని ప్రభావితం చేసాయి. 1873 లో బ్రిటన్ ఆశించినవిధాన , కారకోరం నుండీ చాంగ్చె-హ్నొ లోయ దాకా ఒక లైన్ లో సరిహద్దు సరిగ్గా నిర్దేశిస్తూ లండన్ లో ఓ మేప్ సిద్ధం కూడా అయింది.  కానీ అసంఖ్యాక యుద్ధాల్లో మునిగిన జార్ ప్రభుత్వం బ్రిటిష్ దాడిని ఊహిస్తూ, రష్యా, చైనా, భారత సరిహద్దుల్లో చేపట్టిన కొన్ని చర్యలు బ్రిటన్ ను తొందరపాటు దిశగా నెట్టాయి. 

1889 లో లార్డ్ లాండ్స్డౌన్ అన్న మాట ఇది. 

The country between Karakoram and Kuen Lun Ranges is, I understand, of no value, very inaccessible, and not likely to be coveted by Russia.  We might, I should think, encourage the Chinese to take it, if they showed any inclination to do so.  This would be better than leaving a no-man's land between our frontier and that of China.  Moreover, the stronger we can make China at this point, and the more we can induce her to hold her own over the whole Kashgar-Yarkand Region, the more useful will she be to us as an obstacle to Russian advance along this line. 

1860 చర్చల్లో (& in Treaty of Aigum, 1858, Peking 1860)  రష్యా కు కొంత మధ్య ఏషియా లో భూభాగాన్ని కోల్పోవాల్సి వచ్చిన చైనా, ఆ తరవాత చర్చలన్న మాట కే వణికిపోవడం ప్రారంభించింది.  ప్రత్యర్ధులు తనని బలహీనంగా చేసి ఎలాగోలా తమ ప్రాంతాల్ని కొట్టేస్తారేమో అని దాదాపు అన్ని దేశాలతోనూ వివాద పరిష్కారం కోసం ప్రయత్నించకుండా పారిపోతూండడం, అడ్డదిడ్డమైన వాదనలు చెయ్యడం ద్వారా వివాదాలు పెచ్చరిల్లడానికి కారణం అయింది చైనా.  మొత్తానికి రష్యా, బ్రిటన్ లు కన్నేసిన తన దక్షిణ సరిహద్దుని రక్షించుకునేందుకు 1880 లలో నడుం బిగించింది చైనా.  వాళ్ళతో 1890 లో మాటాడ్డానికి వెళ్ళిన అధికారితో తమ సరిహద్దు కారకోరం నుంచీ ఇండస్,  టారిం బేసిన్  ల వాటర్ షెడ్ ప్రాంతాల వరకూ అని మౌఖికంగా చెప్పింది. 

అదే విధంగా 1892 లో కారకోరం నుంచీ తను నిర్దేసించిన భాగం వరకూ భౌతికమైన గోడని సరిహద్దు గా నిర్మించింది. దీన్ని బ్రిటీష్ ప్రభుత్వం స్వాగతించింది. ఇక్కడ చైనా నిర్దేశ ప్రాంతం నుండీ 'నో మేన్ జోన్' లోకి చొచ్చుకొచ్చినా అది పనికిరాని ప్రదేశమంటూ పట్టించుకోలేదు. అలా కారకోరం పాస్, రెండు దేశాలూ ఒప్పుకున్న సరిహద్దు అయింది. కానీ ఈ సరిహద్దు వంకరటింకరగా ఉండడం మళ్ళీ వివాదాస్పదమైంది. దానితో చైనా తరఫున ఒక అధికారి పరిశీలనకు పంపబడ్డాడు. ఆయన కాస్తా 'కారకాష్' నది నుండీ 'హాజి లంగర్' (WH Johnson  ఆక్ సాయి చిన్ దర్సించినపుడు అప్పటి ఖాటోన్ రాజు హజి హబీబుల్లా ఖాన్ పేరున నిర్మించిన సత్రం)  దాక వెళ్ళి అక్కడినుంచీ ఆక్సాయ్ చిన్ వైపు తిరిగి అక్కడినించీ 'లింగ్జీ తాంగ్' - అలా ఇంకా ముందుకు చాంగ్ చెన్మో నది దాకా వెళ్ళొచ్చి అదంతా తమదే అన్నాడు. 


అలా 1890 ల కల్లా, కారకోరం శ్రేణి నుంచీ- చాంగ్ చెన్మో నది వరకూ, ఇంకా ఆక్సాయ్ చిన్ ప్రాంతమూ తమదేనని చైనా వాదన వినిపించడం మొదలయింది.   అలా ఆక్సాయ్ చిన్ తమదంటే తమదని బ్రిటన్, చైనాలు కొట్టుకోవడం మొదలయింది. మొత్తానికి బ్రిటీష్ పెద్దమనుషులే సగం సగం రొట్టె పంచుకున్నట్టు, 'అక్సాయ్ చిన్' కొంత భాగం బ్రిటిష్ ఇండియాలోనూ, కొంత భాగం చైనా లోనూ ఉండేట్టు సర్దుబాటు చెయ్యబోయారు. సాధారణంగా ఒప్పందాలలో / చర్చల్లో పాల్గోవడం చైనాకి అలవాటు పోయింది కాబట్టి, ఈ సర్దుబాటు కి చైనా ఒప్పుకోలేదు. ఇలా వివిధ కాలాల్లో, ఒకదాని వెంట ఒకటి జరిగిన పరిణామాలు చైనా ప్రతీ ప్రాంతమూ తనదే అని చెప్పుకునేందుకు (కాదని చెప్పే స్పష్టమైన ఒప్పందం ఏదీ రాతపూర్వకంగా లేదు కాబట్టి) సాధ్యం అయింది. 

ఇలా లండన్ లో సాధికారక పత్రాలు, మేప్ లూ, వివిధ దశల్లో చర్చల్లో పాల్గొన్న అధికారులూ, వ్యంగ్య భాషణలూ, అంతర్గత నోట్ లూ సమగ్రంగా పరిశీలించడమే కాకుండా, భారత్ దేశాన్ని బ్రిటీష్ పాలకులు వీడాక,  ఈ పుస్తక రచయిత ,  భారతీయ సైనిక అధికారులతోనూ, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలోనూ ఉన్న పత్రాలను కూడా పరిశీలించి నేపధ్యాన్ని సృష్టించాడు. ఈ పుస్తకం లో  ఇంకో చాప్టర్ పూర్తిగా పెకింగ్ దృక్కోణం లోంచీ, ఈ వివాదం గురించి చైనా అనుకోలు, పట్టుదలా ల గురించి కూడా రాసాడు.  పైగా స్వాతంత్రం వచ్చాక టిబెట్ అంతర్గత వ్యవహారమైన దలైలామా విషయంలో భారత్ సాయం చెయ్యడం - చైనా అస్సలు క్షమించలేకపోయింది. 

మామూలుగా అలోచిస్తే, మన ప్రభుత్వం మీద తిరగబడిన వ్యక్తి ని వేరే దేశం ఆదుకుంటే, మనిద్దరి మధ్యా స్నేహ బంధం నిలుస్తుందని ఎలా ఆశిస్తాం ? అదే జరిగింది.  ఈ పుస్తకం ఇలా Shimla లో జరిగిన మొదటి - ఆఖరి చర్చలూ,  ఒప్పందం, McMahon Line తో కలిపి,  ఒక్కటి కూడా వదలకుండా, అప్పటి సంగతులని రికార్డ్ చేసి - ఇండియా చైనా ల దౌత్య / యుద్ధ పోరాట నేపధ్యాల్ని స్పష్టంగా చెప్తుంది. ఈ పుస్తకం ఎంత పాప్యులరో అంత అన్ పాపులర్ కూడా. దీన్ని భారత దేశాన్ని (For being extremely critical about Indian failure in this war)  గుడ్డిగా విమర్శించిన పుస్తకం గా అభివర్ణిస్తారు కొందరు. [దీనికి వ్యతిరేకంగా China's India War కూడా వచ్చింది]  కానీ దీనిలో సాధికారిక సమాచారం ఒక జర్నలిస్ట్ కోణంలో రిఫరెన్సుల ఆధారంగా ఉండడం వల్ల 'అసలు నేపధ్యం' తెలుసుకునేందుకు  చాలా ఉపయోగకరమైన పుస్తకం అని చెప్పొచ్చు. 

పుస్తకం లో నచ్చిన వాక్యాలు చాలా చాలా ఉన్నాయి. ఇవి మచ్చుకు:

 

"You listen too much to the soldiers. you should never trust experts. If you believe the doctors, nothing is wholesome.  If you believe i n theologians, nothing is innocent ; if you believe the soldiers, nothing is safe'  - London's advice to Governor General of India (Context : apprehensions about Russian occupation from Northern tip of India)

...................


Now, it is a question of fact whether this village or that village or this little strip of territory is on their side or on our side.  Normally wherever these are relatively petty disputes, well, it does seem rather absurd for two great countries.. immediately rush to each other's throats to decide whether two miles of territory are on this side or on that side, and especially two miles of territory in the high mountains, where nobody lives. 

But where national prestige and dignity is involved, it is not the two miles of territory it is  the nations dignity and self respect that becomes involved. and therefore this happens 

- Jawaharlal Nehru, Lok Sabha, Sep 4, 1959

......................

Today's reality : 

If the Chinese were ever to be driven off the Aksai Chin plateau, it could only be after they had been defeated militarily elsewhere.  But the overall superiority in numbers of the Chinese Army and their advantages in movement on the Tibetan Plateau make it likely that the Indians can never hope to mount a successful offensive action anywhere on the northern borders - so long as China's central power is unbroken. 

----------------

The Chinese, for their part, showed no interest in improving relations with India. Chinese maps continue to ignore the McMahon Line and show the eastern boundary with India running along the edge of the Brahmaputra Valley, just as India's maintained the claim to Aksai Chin ; presumably however, Peking's long-standing offer to negotiate a boundary settlement on the basis of the status quo when India is ready to do so still stands.  But thus to go back to the beginning would mean India's tacit admission of error, and recantation of the deeply cherished belief that in 1962 she was innocent victim of unprovoked Chinese aggression. That will not be easy. 

(Obviously, Indians refused to agree with this book  ఈ వివాదాస్పద రచయిత మాత్రం 2014 లో  నెహ్రూనే యుద్ధానికి పిలుపునిచ్చాడనీ, చైనా కాదనీ, ప్రకటించాడు.   )

---------------

నేను ఈ పుస్తకం చదువుతుండగా, హిందూ లో 'Fifty Years Ago ' శీర్షికన ఈ పుస్తకం గురించి నాలుగు ముక్కలు.  [ఎంత వ్యతిరేకత !!] 


........................


ఈ పుస్తకానికి / విషయానికీ వ్యతిరేకంగా భారత దేశాన్ని పూర్తిగా సమర్ధిస్తూ 2018 లో వచ్చిన పుస్తకం.


***