పరిచయం : ఇది ఒక చిన్న నోట్ / ఉత్తరానికి అనువాదం. హైద్రబాద్ రన్నర్స్ క్లబ్, రన్నింగ్ సర్కిల్స్ లో చాలా ప్రముఖమైన సంస్థ. దీనికి పలు ఈవెంట్లను, మారథాన్ లు నిర్వహించిన అనుభవం ఉంది. వీరు ఔత్సాహిక రన్నర్స్ కోసం ట్రైనింగ్ కార్యక్రమాలు చేపడతారు. కొత్త గా పరిగెట్టే వారికి ప్రొఫెషనల్ హెల్ప్ ఇవ్వడం, ప్రోత్సహించడం, 'ప్రో' ల కోసం, అథ్లెట్ల కోసమూ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం చేస్తున్నారు చాలా ఏళ్ళుగా.
అల్వల్ రన్నర్స్ క్లబ్ లో ఒక స్నేహితుని ద్వారా ఈ హైద్రబాద్ రన్నర్స్ క్లబ్ గత నెలలో నిర్వహించిన 12 గంటల స్టేడియం రన్ గురించి, అక్కడి విశేషాల గురించి తెలుసుకున్నాను. ఇదంతా దానిగురించి.
ఈ ఆగస్టు అంతా హైదరాబాద్ లో వానలు, కొంచెం కొంచెం తెరిపి ఇచ్చి, దాదాపు ప్రతి రోజూ వర్షం కురిసి, ఊరిని ముంచెత్తేసింది వాన . సాధారణ జనం, పొద్దున్నే ముసుగు పెట్టి నిద్రలు పోయే ఓ సెలవు రోజున, ఆగస్టు 28 న, హైద్రబాద్ రన్నర్స్ క్లబ్ ఒక 12 గంటల రిలే & 12 గంటల solo పరుగు ఈవెంట్ ని నిర్వహించింది. దీన్ని హైదరాబాదు లో గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ రన్నింగ్ ట్రాక్ మీద నిర్వహించారు. దీన్ని "స్టేడియం రన్" అంటున్నారు. దీనిలో ఆరుగురు సభ్యులున్న టీం సభ్యులు (ఒకరి తరువాత ఒకరు గా), ఒక్కో రన్నర్ రెండు గంటల చొప్పున కనీసం 20 కిలో మీటర్లు పరిగెడతారు. రిలే థీంలో. [సోలో పరిగెత్తే వారు వేరే ట్రాక్ మీద మొత్తం 12 గంటలు పరిగెడతారు. ఫార్మాట్ అర్ధం కావడానికి కింద ఇచ్చిన 'నావ్' వీడియో చూడండి.]
ఆ రోజు నిర్వహించిన పరుగులో తమిళ నాడు, కేరళ, ఒడిశా, కర్నాటక, తెలంగాణ ల నుండి 37 టీం లు పాల్గొన్నాయి. వీరిలో చాలా మంది మహిళా సభ్యులున్నారు. ఆరుగురో, ఏడుగురో జాతీయ స్థాయి అథ్లెట్లున్నారు. చాలా మంది సరదాగా కాలనీ లెవెల్లో రోజుకు అయిదు కిలో మీటర్లు ఫిట్ నెస్ కోసమో, బరువు తగ్గడం కోసమో మొదలుపెట్టిన వారున్నారు. పరుగు ఒక మత్తు లాంటిది. ఫిట్ నెస్ ఒక వ్యసనం. బద్ధకించినన్నాళ్ళూ ఆ సొగసు తెలియదు గానీ, ఫిట్ నెస్, ముఖ్యంగా రన్నింగ్ జీవితంలో భాగమైన వారికి, ఇది ఒక తేలికగా వదిలేయగలిగే వ్యసనం కాదు.
ఈ పరిగెత్తే ఔత్సాహికులు కొన్నాళ్ళ సాధన తరవాత, మెల్లగా వారే సీరియస్ రన్నర్స్ ఔతారు. అలాంటి వారు చిన్న చిన్న టీం లు గా అయి, రోజువారీ, వారాల వారీ, చాలెంజు లు పెట్టుకుని పాల్గొంటున్నారు. వీళ్ళలో చాలా మంది, లోకల్ / outstation సిటీ మేరథాన్ లలో, ఇంకా పోయినేడు కోవిడ్ లో ఎవరి ఇంటిలో వారు ఆన్లైన్ మారథాన్ లలో కూడా పాల్గొన్నారు. ఈ సాధన వారిని శారీరకంగా ఎలానూ ధృఢంగా తయారు చేసేస్తుంది. కానీ వ్యాయామం, క్రమశిక్షణ, మనుషుల్ని మానసికంగా కూడా ఎంత దృఢంగా చేస్తాయో చాలా తక్కువ మందికి తెలుసు. డిప్రెషన్, ఒత్తిడి లతో బాధపడే వారు, ఏదో ఒక వ్యాయామన్ని, వీలయితే ఆరుబయట నడక, పరుగు, స్విమింగ్, సైక్లింగ్ లాంటివి ప్రయత్నించమంటారు అందుకే.
ఆగస్టు 28 న , గాడియం స్కూల్ లో నిర్వహించిన ఈ ఈ 12 గంటల స్టేడియం పరుగు ఈవెంట్ (DAWN TO DUSK RUN, A STADIUM RUN, 2021) లో పాల్గొన్న అల్వల్ రన్నర్స్ క్లబ్లో ఒక మహిళా సభ్యురాలు, ప్రముఖ సైక్లిస్ట్ , Dr.Niharika, ఈవెంట్ అనంతరం, ఈ పరుగు గురించి తన అనుభవాన్ని టీం మెంబర్స్ తో పంచుకున్నారు. అది చదవగానే ఇది చాలా చాలా కాంటెంపరరీ అనిపించి, దీనిని అనువదించి, అందరితో పంచుకునేందుకు అనుమతి తీసుకున్నాను. దీనిలో తప్పులన్నీ నావి.
---------------------------------------------------------------------------------------------------------------------
You must not only have competitiveness but also the ability to never quit, regardless of the circumstances you face.
ఆగస్టు 27 న అంటే, సరిగ్గా పరుగుకు ముందురోజు, మా ఇంటి "భూమి పూజ" జరిగింది. దీనిలో చాలా బిజీగా ఉన్నాను. బాలా అలసిపోయాను, కానీ మరుసటి రోజు పరుగులో పాల్గొంటున్నాననే భావన ఉత్సాహాన్ని కలిగించింది. శనివారం నిద్రలేవగానే షాక్ తగిలింది. ఖచ్చితంగా కారణం ఇదే అని చెప్పలేను గానీ, కోవిడ్ కు స్పుత్నిక్-V వాక్సిన్ తీసుకున్నాక నా ఋతుక్రమం దెబ్బతింది. అది కాస్తా 72 రోజుల తరవాత ఈరోజే మొదలయ్యింది.
ఈరోజు నాకు ఎంత ముఖ్యమైన రోజు ?! వొళ్ళంతా నొప్పులు, పీకుడు, పోట్లు, వికారమూ మొదలయ్యాయి. దానికి తోడు ఋతుస్రావం. కానీ పట్టుదలగా పరుగులో పాల్గొనాలనే నిర్ణయించుకున్నా. అదెంత తప్పు నిర్ణయమో తరవాత తెలిసింది. "ఇలాంటి చాలెంజులు జీవితం లో ఎన్ని ఎదుర్కోలేదు ? ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో పనులు చక్కబెట్టుకురాలేదు నేను ? ఈ రెండు గంటల పరుగు నేనింతకు ముందు ఎదుర్కొన్న 27, 40 గంటల** పోరాటలకన్నా ఎక్కువా ఏంటి? పద పద ! నువ్వు చెయ్యగలవు!" అని నాకు నేనే చెప్పుకున్నాను.
పవన్ దయతో, నన్ను వెన్యూ దగ్గర దాకా దిగబెట్టాడు. అక్కడ ఉత్సాహపూరిత వాతావరణం, అక్కడి క్రౌడ్ సపోర్ట్ చూసి, పూర్తి జోష్ వచ్చేసింది. ఎంత స్పూర్థిదాయకంగా ఉన్నారో అందరూ. వాళ్ళని చూసి, నా అసౌకర్యాన్ని ఎప్పుడో పూర్తిగా మర్చిపోయను మా అల్వల్ రన్నర్స్ క్లబ్ స్నేహితుల్ని ప్రతి ఒక్కరినీ అక్కడ చూసి, నా ఉత్సాహం రెట్టింపయిపోయింది.
పరుగు కు 30 నిముషాలుందనగా, వాష్ రూం కి వెళ్ళి, అంతా బానే ఉందని నిర్ధారించుకున్నాను. అక్కడి నుంచి తిన్నగా వార్మ్ అప్ కోసం జుంబా సెషన్ లో పాల్గొన్నాను. పరుగు మొదలయ్యే సమయం వరకూ ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించాను. వార్మ్ అప్ అయ్యాక, నా పరుగు బృందపు స్నేహితురాలు 'గార్గి ' తో నా అసౌకర్యం గురించి మాటాడాను. పరుగు సమయంలో ఏ బరువులూ ఉండకూడదు. అలాంటిది, ఆ చెమ్మ వాతావరణంలో ఈ టాంపన్ పెట్టుకుని ఆ బరువుతో 20 కిలో మీటర్లు పరిగెత్తడం ఎంత అసౌకర్యమో అని మాటాడుకున్నాము. అవన్నీ తీసిపారేద్దామని బలమైన కోరిక కలిగింది. బ్లీడింగ్ గురించి చింతించకుండా, ఏదయితే అది అయిందనుకుని టాంపన్ తీసేసి పరుగు కు సిద్ధపడ్డాను. [టాంపన్ బదులుగా పాడ్ వాడొచ్చు. కానీ దానివల్ల అనవసరంగా ఇంకా రాషెస్ వస్తాయి, పైగా అడ్డు ] అప్పుడు చాలా తేలిక గా, స్వేచ్చ గా, confident గా అనిపించింది.
యాధృచ్చికంగా నా సైక్లింగ్ స్నేహితుడు సత్య కేశవ్ ని కలిసాను. అతనిదీ, నాదీ ఒకే టైం స్లాట్. అతని పరుగు వేగం గురించి కనుక్కున్నాను. అదృష్టవశాతూ, అతనిదీ, నాదీ ఒకే పేస్. పరుగు మొదలయ్యాక, మెల్లగా మాటలు కూడా నడిచాయి. అతని ఉన్నత విద్య, ఉద్యోగం ప్లాన్ ల గురించి, మాటాడుకున్నాం. నాకు అలా తెలియకుండానే పది కిలో మీటర్ల పరుగు ఒక గంటా మూడు నిముషాలలో అయిపోయింది. నేను కొంచెం నీరు తాగాలని బ్రేక్ తీసుకున్నాను.
ఆ తరవాత మేము టైం వేస్ట్ చెయ్యకుండా పరుగు మొదలు పెట్టాము. కేశవ్ అప్పుడు వేగం పెంచాలని నిర్ణయించుకున్నాడు. కానీ నా పరిస్థితి వల్ల నేను నా వేగం లోనే - అంటే ఆరున్నర నిముషాలకొక కిలోమీటరు చొప్పున కొనసాగాను. 16 వ కిలో మీటరు చేరుకునే సరికీ కళ్ళు తిరిగిపోయాయి. వికారం, వాంతి వచ్చేలా అనిపించడమూ మొదలయింది. ఎక్కడ స్పృహ కోల్పోతానో అని భయపడ్డాను. అంతా చీకటయిపోయింది. పొట్టలో తీవ్రమైన నొప్పి, సన్నని వర్షం లో ఆగకుండా తడుస్తూనే పరిగెత్తడం వల్ల, రక్తస్రావం వల్లా, వొళ్ళంతా బరువుగా, చర్మం మీద దద్దుర్లు గా అయ్యి, అస్సలు శరీరం సహకరించక, ఓ 30 సెకండ్లు అకస్మాత్తుగా ఆగిపోయాను. నా మనసుకు అప్పుడు నేనే ధైర్యం చెప్పుకోవాల్సి వచ్చింది. "ఇంకో 20 నిముషాలే ఉంది. ఎలా అయినా 18 కిలో మీటర్లు పరిగెత్తాలి. ఇప్పుడు ఆగిపోకూడదు. ఈ నొప్పి అంతా ఒకట్రెండు రోజుల్లో పోతుంది. నేను బానే ఉంటాను. ఇది కేవలం ఒక నెగటివ్ ఎమోషన్ !" అని నన్ను నేనే సముదాయించుకున్నాను.
ఇటు పక్క నా టీం మెంబర్స్ చేసే ప్రోత్సాహపూరిత కామెంట్లు, కేకలు నన్ను నేను ఎలాగో ఒకలా ముందుకు తోసుకుపోవడానికి దోహదపడ్డాయి. దీనంతటి లోనూ నేను ఆగిపోతే, వాళ్ళెంత డిసపాయింట్ అవుతారో అనేది కళ్ళ ముందు మెదులుతూంది. నేను ఇంతకన్న బాగా చెయ్యగలను. మా అల్వల్ టీం అంతా నన్ను ముగింపు వైపుకు పరిగెత్తేందుకు ఉత్తేజపరుస్తున్నారు. అక్కడి జనం అంతా నా పేరు, మిగిలిన నా సమయాన్ని గట్టిగా అరుస్తున్నారు. "చివరి రక్తపుబొట్టు దాకా ...." తరహాలో, నా శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి పరిగెట్టా ఆ లాస్ట్ లాప్ మాత్రం.
పరుగు ముగిసాకా, కలిగిన విజయానందం, మాటల్లో వర్ణించలేనిది. నా టీం అందరినీ కలిసాను. నా విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాను. కొన్ని ఫోటోలు తీసుకున్నాక, వాష్ రూం కి పరిగెత్తాను. అప్పటికి పూర్తిగా ముద్దలా తడిచిపోయున్నాను. నా మనసంతా చాలా అలజడిగా ఉంది. పరుగు జరిగినంత సేపూ ఎందుకు పాల్గొన్నాన్నా అనిపించేలా చేసిన ఆ తీవ్ర అసౌకర్యం, నొప్పి, బాధ, శారీరక దౌర్బల్యం, నన్ను ఉక్కిరిబిక్కిరి చేసెసాయి. గార్గి ని పట్టుకుని ఆపుకోలేక పెద్దగా ఏడ్చేసాను. ఈ పరుగులో పాల్గొని తప్పు చేసానని నూటొక్కోసారి బాధపడ్డాను. అయితేనేం.. నేనీ పరుగుని పూర్తిచెయ్యగలిగాను. ఇంత బాధ పడీ కూడా, కష్టాన్ని ఓర్చుకోగలిగి, ఎదుర్కోగల గుణమేదో నన్ను నా మనసునీ ఆక్రమించేసి, ఈ విజయాన్ని సాధించగలిగేను. ఫ్రెష్ అయి, అయిదు నిముషాల్లో ఇంటికి బయల్దేరాను.
నా వరకూ నైతే, ఈ ఆఖరి 16 కిలో మీటర్ల పరుగు చాలా కఠినమైనది. అది మనసుకీ, శరీరానికి జరిగిన సంఘర్షణ. అయితే, ఎప్పటిలాగే శరీరంపై మనసు గెలిచింది.
నా ఈ విజయాన్ని నా పరుగు మితృడు శ్రీకాంత్ తాడూరి గారికి అంకితం ఇస్తున్నాను. ఇంకా అల్వల్ రన్నర్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీ దన్ను లేకపొతే, నేనసలు ఈ పరుగులో పాల్గొనేదాన్నే కాదు. ఇది నేను నా స్నేహితులకు రాస్తున్నాను. ఇదంతా నన్ను నేను ఉబ్బేసుకుందుకు కాదు. ఇది కేవలం ఒక చిన్న సందేశాన్నివ్వడానికి మాత్రమే. క్రీడల్లో పాల్గొనే మహిళ గా ఉండడం ఎంత కష్టమో, మీకు తెలియడానికి! మా "ప్రదర్శన" ను మా "హార్మోన్లు" ఎంతో ప్రభావితం చేస్తాయి. అందుకే, ప్రతి క్రీడాకారిణినీ చీర్ చెయ్యండి. వెన్ను తట్టి ప్రోత్సహించండి. నా తోటి మహిళలకు నేను చెప్పేది ఒకటే - నేను చెయ్యగలిగితే, మీరూ చెయ్యగలరు.
Notes :
Gaudium International School - They have a good running track
Dawn to Dusk 12 K Stadium Run video for full idea of the event by Nav.
Nav K is a vlogger, fitness enthusiast from Hyderabad.
Dr Niharika - భారత దేశంలో నెంబర్ 1 సైక్లిస్ట్. సోషల్ మీడియా ఎక్కువ వాడరు. ఈ Straha ఏప్ ని విస్తారంగా వాడతారు. అందుకే ఈ లింక్ ఇచ్చాను. ఈవిడ పరుగు గురించి చెప్తూ, సైక్లింగ్ కూ, రన్నింగ్ కూ ఉన్న తేడా ల వల్ల, ఈ పీరియడ్ రన్నింగ్ కు కాస్త ఇబ్బంది పడ్డట్టు చెప్పుకున్నారు. సైక్లింగ్ లో పీరియడ్ సమయం లో మహిళలు వాడే సానిటరీ వస్తువులు పరుగు కు సూట్ కాకపోవచ్చు. టాంపన్ లు అందరికీ సౌకర్యంగా ఉండవు. కొన్ని శారీరక ఇబ్బందుల వల్ల, వాడేందుకు బాధాకరంగా ఉన్నా, చాలా మంది మహిళా క్రీడాకారులు టాంపన్లు వాడుతున్నారు.
ఆమె ఫిట్ నెస్, సైక్లింగ్ నిపుణురాలు, mentor, coach. తన సైక్లింగ్ అనుభవాల ను వివరిస్తూ, సూయి ఆవిష్కార్ అనే పుస్తకాన్ని కూడా రచించారు. పైగా ఋతు సమయంలో మానసికంగా మహిళలు తమతో తాము చేసె మానసిక పోరాటం గురించి వోకల్ అవగలగాలని ఆశిస్తారు.
** Dr. Niharika, వరుసగా దాదాపు అన్ని వారాంతాలూ ఈ హై ఎండ్యూరెన్స్ సైక్లింగ్ ఈవెంట్స్ లో పురుషులతో కలిసి పాల్గొంటారు. అవి 27 గంటల నుండీ (400 km) 40 గంటల (1000 km) పాటూ సాగుతుంటాయి. కింద తన పుస్తకం లో తనగురించి పరిచయం.
Facebook page of Dr.Niha
----------------------------------------------------------------------------------------------------------------------------