Some pictures of old Hampi
18/04/2021
హంపీ నుండీ హరప్పా దాకా - శ్రీ తిరుమల రామచంద్ర
Some pictures of old Hampi
09/04/2021
కికోస్ చచ్చిపోయాడు (The Death of Kikos)
ఇది నా childhood memory. స్కూల్లో చదివాను. ఇన్నేళ్ళు తరవాత శ్రీ అనిల్ బత్తుల గారు దీని లింక్ ఇచ్చారు. అనుకోకుండా మా హీరో కజిన్, ఒక సోదరి దగ్గర ఈ పుస్తకం దొరకడం తో భాగ్యరాశి దొరికినట్టు అనిపించింది.
ఈ పుస్తకం లో చాలా మంచి కథలున్నాయి. ఒక వయసులో చిన్న బొమ్మ కనబడితే, ఆ పుస్తకం వంక చూస్తూ ఎన్ని ఊహలు అల్లుకునే వాళ్ళమో, గిఖోర్ లాంటి బీద పిల్లవాడిని గురించి తలచుకుని కళ్ళు నిండా నీళ్ళు నింపేసుకునే వాళ్ళమో.. అలాంటి వెట్టి చాకిరీలో మగ్గిపోతున్న పిల్లలు, బాల కార్మికులు, మన చుట్టూ ఉన్నా కూడా.. అసలు ఈ బాల కార్మిక చట్టాలు రాసిన వారు, ఆయా రంగాలలో సేవ చేసేవాళ్ళూ ఇలాంటి సాహిత్యాన్ని చిన్నతనాన చదివి వుంటారు అనిపిస్తుంది నిజానికి. గిఖోర్ ఒక బీద పిల్లవాడు. నిర్దాక్షిణ్యంగా స్వయానా తండ్రి పట్నంలో పనిలో పెట్టాకా, బాల్యాన్ని మరిచి పని చేసీ చేసీ, అనారోగ్యం బారిన పడి మరణిస్తాడు.
మాట్లాడే చేపల కథలు - పదే పదే రిపీట్ అయ్యే నక్క తోకల కథలు.. ఇలా. మనం, అన్ని దేశాల, కాలాల, భాషల మనుష్యులమూ - అందరం మొత్తానికి ఒక్కరమే. మాటాడే చేపల్నే చూసుకుంటే, మన పురాణ కథల్లోనూ, ఫేబుల్స్ లోనూ, సుధా మూర్తి పిల్లల కథల్లోనూ.. ఎంత మంచి, మహిమ గల చేపలో. ఒక్కసారి కరుణిస్తే, ఆపదకు ఆదుకుంటాయి. అలాగే, తెలివి లేని అన్నలూ, వారి తెలివైన తమ్ముళ్ళూ, చురుకైన భార్యలూ - వారి ఉపాయాలు - తలచుకుంటే, ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి.
మేమూ అంతా అమ్మాయిలం, కాబట్టో, మా అమ్మా నాన్నా కూడా దాదాపూ ఇలాంటి అమాయకులే కావడం బట్టో, ఎందుకో, ఈ చిన్న కథ నాకు అప్పట్లో చాలా ప్రత్యేకం. అందుకే ఇలా "గిఖోర్" కన్నా ఎక్కువ గుర్తు ఉండిపోయింది. దీని ఆధారంగానే (జ్ఞాపకం ఆధారంగా) ఈ పుస్తకాన్ని వెతికాను. చాలా మందిని అడిగాను. ఆఖరికి అనిల్ గారు ఖజానా లోంచీ, [డోరేమాన్ సంచీ లోంచి తీసిచ్చినట్టు గా] ఇచ్చారు. ఈలోగా అనుకోకుండా ఏడాది క్రితం, ఒక సోదరి దగ్గర పుస్తకం దొరకడం, దాన్ని నేను చాలా అపురూపంగా భావించి, అడగలేక అడగబోతుండగనే, ఆవిడ, తన తల్లిగారి జ్ఞాపకమైనా సరే, నన్ను ఆదరించి ఇవ్వడం - చాలా అదృష్టమే. అసలు ఇలాంటి వెర్రి వ్యామోహాలు వొదులుకోవడమే జీవితం అని చాలా రోజులకి గ్రహింపుకొచ్చింది గానీ, దీన్ని రికార్డ్ చెయ్యడం కోసం ఇలా బ్లాగ్ లో రాస్తున్నాను. దీన్ని ఏ అరవైల్లోనో చదవొచ్చు కదా అని. ఇప్పుడు కథ చూడండి.
http://sovietbooksintelugu.blogspot.in/2015/04/ebook-link_10.html
ఊరించడానికో, గిఖోర్ ని తలచుకోవడానికో ఇది కూడా ఓ మంచి జ్ఞాపకం. వీలైతే, చదవండి.
దీని రచయిత : హోవనేస్ తుమన్యాన్ పేజీ ఇది
Original Story (English) : The Death of Kikos
Original Story (English) : Gikhor
Movies : Gikhor - రెండు సార్లు తీసినట్టున్నారు - 1934, 1982 లో
ఇది commissioned translation కాబట్టి అనువాదకులకు కూడా నా ధన్యవాదాలు. తెలుగు అనువాదం కూడా సోవియట్ రష్యాలో ప్రచురితం.
06/04/2021
Mossad - Michael Bar-Zohar, Nissim Mishal
Mossad, The Greatest Missions of the Israeli Secret Service - Michael Bar-Zohar, Nissim Mishal
మొసాద్ - ఇస్రాయిలీ సీక్రెట్ సర్వీస్. ఇది ఆవిర్భవించి డెబ్భయి రెండు ఏళ్ళు దాటాయి. ఇజ్రాయిల్ అతి చిన్న రాజ్యం అయినా, అది అగ్ర రాజ్యం గా ఎదగడానికి మొసాద్ పోషించిన పాత్ర కీలకమయినది. ఇన్నేళ్ళలోనూ, మొసాద్ లో పని చేసిన ఎంతో మంది గూఢచారులూ, కమాండర్లూ, చిన్నవీ, పెద్దవీ, ప్రాముఖ్యం లేనివీ, ప్రపంచ గతిని మార్చేయగలిగేంతవీ ఎన్నో పనులు చేసారు. ఇజ్రాయిల్ - పాలస్తీనా సంక్షీభం, అశాంతి, ఆత్మాహుతి దాడులూ, నిరంతరం తరుముతుండే ఉగ్రవాదం, అనిశ్చితి, చుట్టు పక్కల రాజ్యాలయిన జోర్డన్, సిరియా, మిడిల్ ఈస్ట్రన్ దేశాలు, ఇరాన్, ఇరాక్ - తదితర దేశాలకూ ఇజ్రాయిల్ కూ ఉన్న సంబంధాలు, గొడవలూ, సర్దుబాట్లూ, దౌత్య వ్యాపారం - అన్నిటినీ మొసాద్ శాసించకపోయినా, వీటన్న్నిటిలో తమ దేశం ఉనికిని కోల్పోకుండా ఉండేందుకు మొసాద్ చేసిన కృషి మెచ్చుకోదగ్గది.
Mossad, The Greatest Missions of the Israeli Secret Service - రాసింది Michael Bar-Zohar, Nissim Mishal లు. ఇద్దరూ మొసాద్ ఆవిర్భావం నుండీ (మైకెల్ ఇజ్రాయెల్ మొదటి ప్రధాని, ఫౌండర్ - డేవిడ్ బెన్ గురీన్ దగ్గర పని చేసిన వాడు). దాదాపు 2011 దాకా (పుస్తకం మొదటి ప్రచురణ 2010- లో) ఇప్పటి దాకా చేసిన కొన్ని కీలకమైన పనుల గురించి చెప్తారు. మొసాద్ మొదట మామూలు దేశ రక్షణావసరాల కోసం తయారైన సంస్థ. దీనిలో ప్రపంచంలో అభివృద్ధి చెందిన అగ్ర రాజ్యాల కోవలో అణ్వాయుధాలు తయారు చేసుకో దలచిన చిన్న రాజ్యాలు - ఇరాన్, ఇరాక్, సిరియా, ఈజిప్ట్ - వీటికి దగ్గర ఉన్న ఓ చిన్న రాజ్యం యుద్ధం చెయ్యకుండా కేవలం ఇంటెలిజెన్స్ ద్వారా, (ఇంకా కొన్ని కీలక హత్యల ద్వారా) ఎలా నిలువరించిందో రాసారు - వీటిలో కొన్ని ప్రపంచానికి తెలిసినవి, కొన్ని ఎవరికీ తెలియని రహస్యాలు.
ఉదాహరణ కు Nov 12, 2011 లో ఒక పేలుడు లో 17 గురు రివల్యూషనరీ గార్డులను (వీళ్ళలో ఆ ముసుగులో నిజానికి కొందరు కీలక అణు శాస్త్రవేత్తలు ఉంటారు) చంపడం ద్వారా, ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది మొసాద్. భయపడకుండా, రహస్యంగా శతృవును తుదముట్టిస్తూ, తీవ్ర పరిణామాల్ని మొసాద్ ఆపగలిగిందనేది ఇక్కడ విషయం. ఇరాన్ ఇరాక్ ల అణు కార్యక్రమాన్ని ఆపేందుకూ, ఆలస్యం చేసేందుకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది మొసాద్. వారికి సహకారం అందించిన అప్పటి రష్యన్, జర్మన్ శాస్త్రవేత్తలను మట్టు పెట్టేందుకూ వెనకాడలేదు. ముగ్గు పెట్టినట్టు ఒక పద్ధతి ప్రకారం, తిరుగులేని ప్రణాళికలతో ఎంతో మందిని చంపేసింది. మొసాద్ కు సంబంధించి ఇది ఒక ధర్మ యుద్ధం. ఎదుటి వాణ్ణి చంపకపోతే, తమ పూర్వీకుల్లా తామూ మొదలు వరకూ తుడిచిపెట్టబడతామో అన్న భయం ఇజ్రాయెల్ ది.
దేశ ప్రతిష్ట ని పణంగా ఎప్పుడూ పెట్టని దేశం ఇజ్రాయెల్. వీరికి ప్రతీ యూదు పౌరుడూ అపురూపం. ప్రపంచ యుద్ధాల్లో మిలియన్ల కొద్దీ చంపబడ్డ యూదులు ఇప్పుడు అణగదొక్కబడడాన్ని ప్రతిఘటిస్తూ , తమ సార్వభౌమత్వాన్ని, ఎవరూ వేలుపెట్టి ప్రశ్నించకుండా, కన్నెత్తి చూడ్డానికి లేకుండా భయపెట్టే బలమైన శక్తి గా ఎదగాలని ప్రగాఢంగా నమ్ముతారు. దీనికి యూదు విశ్వాసాలతో పాటు, భౌగోళికంగా బలమైన శక్తి గా ఎదగడమూ కీలకమే. పాశ్చాత్య దేశాల్లో ఒక అగ్ర రాజ్యంగా ఎదిగి, ఇప్పుడు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ఎత్తు ఎదిగిన ఇజ్రాయెల్ అలా సుభిక్షంగా ఉండడానికి కారణం మొసాద్. ఇది చాలా సార్లు ఇతర రాజ్యాలతో తమ నోట్స్ పంచుకుండూ, కొన్ని సార్లు ఒంటరిగా కూడా పని చేస్తూ, ఎన్నో విజయాలు సాధించింది. వీటిలో అత్భుత విజయాలూ ఉన్నాయి. భయంకరమైన అపజయాలూ ఉన్నాయి. పరాయి దేశాల్లో ఒంటరిగా - అమానవీయమైన, మరణ శిక్షలు సామాన్యమైన దేశాలలో, ఎప్పుడు ఆట కట్టేస్తుందో తెలీని పరిస్థితుల్లో, దేశం కోసం పోరాడే దేశ భక్తులైన మొసాద్ ఏజెంట్లు, వారిని కనిపెట్టుకునే కమాండర్ల వ్యవస్థ గురించి ఆసక్తి గా చదవొచ్చు.
వీటిలో, "మ్యూనిక్ మాసకర్" కు తలబడిన పాలస్తీనా ఉగ్రవాద సంస్థ బ్లాక్ సెప్టెంబర్ నాయకులను వివిధ దేశాల్లో వెతికి వెతికి చంపడం - చెప్పుకోదగ్గది. అసలు ఆరాఫత్ స్థాపించిన పాలస్తీనా విమోచన సంస్థ "ఫతా" లో "బ్లాక్ సెప్టెంబర్" ఓ చిన్న పార్ట్. దీన్ని ఆరాఫత్ నే స్థాపించి, జోర్డన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఉసిగొల్పుతాడు. 1967 లో "ఆరురోజుల యుద్ధం" తరవాత జోర్డన్ దేశంలో పాలస్తీనా ఉగ్రవాదులు బహిరంగంగా ఆయుధాలు పెట్టుకుని నినాదాలు చేస్తూ తిరుగాడిన రోజులు. వారి చేతుల్లోకి జోర్డన్ లో చాలా ప్రాంతాలు, ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలు, పట్టణాలూ వచ్చాయి. విర్రవీగి వారు చేస్తున్న అకృత్యాలు జోర్డన్ సైన్యానికి మింగుడుపడకపోయిన, రాజు వారికి పెద్దగా అనుమతులు ఇవ్వకపోవడంతో తీవ్రవాదులకు ఎదురు లేకుండా పోతుంది.
అప్పటి దాకా, రాజు తాలూకు "నిర్ణయం తీసుకోలేని అశక్తత" వల్ల జోర్డన్ సైన్యం కుతకుతలాడుతూ ఉంది. ఈ సమయంలో ఒక టాంక్ బెటాలియన్ ని సందర్శించిన రాజు హసన్ కు టేంక్ (శతఘ్ని) ఏంటినా (Antenna) మీద ఓ బ్రా ఎగురుతూ కనిపిస్తుంది. కోపంతో రగిలిన రాజు - టాంక్ కమాండర్ ని ప్రశ్నిస్తే - "అవును. మేము ఆడవాళ్ళం. అందుకే ఎగరేసాను. నువ్వు మమ్మల్ని యుద్ధానికి అనుమతించవు" అని సమాధానం ఇచ్చాడట. ఈ సంఘటన జరిగాక ఇక ఊరుకోలేక, జోర్డన్ రాజు సైన్యానికి పగ్గాలను విప్పేయగా - 17 సెప్టెంబర్ 1970 న జోర్డన్ సేనలు పాలస్తీనా ఉగ్రవాదుల మీద విరుచుకు పడి, కనీసం 2-8 వేలమందిని రోడ్లమీద, కొట్టాలలోనూ, ఇళ్ళలోనూ, వాహనాల్లోనూ కాల్చి చంపేరు. ఈ పోరాటంలో బ్రతికిన వాళ్ళు బతుకు జీవుడా అని సరిహద్దు దాటి శతృ దేశమయిన ఇజ్రాయిల్ పారిపోయారు గానీ, జోర్డన్ సైనికులకు లొంగిపోదామనుకోలేదు. దీన్ని బట్టి, ఈ సంఘటన తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
ఈ పోరాటంలో తమ వారి మరణం చూసి, ఆరాఫత్ ప్రతీకారేచ్చ తో రగిలిపోయి "బ్లాక్ సెప్టెంబర్" ను స్థాపించాడు. ఈ 'అతి' రహస్య సంస్థ, స్కూల్ టీచర్లు, క్లర్కులు లాంటి అత్యంత సౌమ్యులు గా బయట ప్రపంచంలో తెలిసిన వారితో ఏర్పడింది. వీరు అత్యంత దయవిహీనంగా 'పాలస్తీనాను ఏడిపించె వాళ్ళని చంపడమే' - ఆ చంపడంలోనూ - ఫతా అవలంబించే విధానాలను, న్యాయ సూత్రాలనూ మరిచిపోయి, కౄరత్వం తో విజృంభించే "లక్ష్యం"తో ఏర్పడి ఉంటుంది. ఈ సంస్థ తమకు కాలం మూడిందాకా, జోర్డాన్ మీద అత్యంత హేయమైన, ప్రమాదకరమైన బాంబు దాడులు చేస్తూ వస్తుంది.
ఇజ్రాయెల్ జోలికి రానంత వరకూ మొసాద్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మ్యూనిక్ లో ఇజ్రాయిలీ ఒలింపిక్ టీం ను కిడ్నాప్ మరియూ హత్య చేసినపుడు ఇది అన్ని లక్ష్మణ రేఖల్నీ దాటినట్లయింది. ఈ బ్లాక్ సెప్టెంబర్ దాడి తరవాత ఇజ్రాయెల్ ఉక్కు మహిళా ప్రధాని - గోల్డా మీర్ ఆదేశానుసారం మొసాద్ - వివిధ దేశాలలో స్థిరపడో, దాక్కునో రెండో జీవితం గడుపుతున్న అందరు బ్లాక్ సెప్టెంబర్ సభ్యులనూ, నాయకులనూ వెంటాడి వెంటాడి చంపేసింది. ఒక సీక్రెట్ సర్వీస్ సంస్థ ఇలా ఒక తీవ్రవాద సంస్థ సభ్యులను ఇంత చాకచక్యంగా చంపడం అదే మొదలు. ఈ సాహస చర్యల ద్వారా "మొసాద్" ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏమైనా చెయ్యగలదు, అలా, ఇజ్రాయిల్ జోలికి వచ్చే శతృవు ను వొదిలిపెట్టబోము అని నొక్కి చెప్పిన సంస్థ.
అరబ్ దేశాల సహకారంతో వివిధ ముస్లిం ఉగ్రవాద సంస్థలు "అత్యంత సాధారణంగా" గాలిలో ఎగిరే "ప్రయాణీకుల విమానాల్ని" బాంబ్ చెయ్యడం, హైజాక్ చెయ్యడం, బందీలను చంపడం లాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నపుడు, తమ దేశానికి అతి దూరంగా ఉన్న ఉగాండాలో ఎంటెబ్ లో శతృ దేశం కన్ను గప్పి, తమ విమానాల్ని తీస్కెళ్ళి, అక్కడ బందీలు గాఉన్న తమ దేశస్థుల్ని విడిపించుకుని, వచ్చి, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఎంతో ఖ్యాతి గడించింది. నిజానికి బ్లాక్ సెప్టెంబర్ 1973 లో, తమ అన్ని కార్యకలాపాలనూ ఆపేసి, తమ దుకాణం మూసేసినాక కూడా వెంటాడి వేటాడి, అప్పటికి నూకలతో మిగిలిన ఆఖరి కీలక నాయకుడిని (Red Prince) 1979 లో చంపేసి తన మిషన్ ని అధికారికంగా ముగించింది మొసాద్. Red Prince గా పేరొందిన ఈ బ్లాక్ సెప్టెంబర్ నాయకుడు "అలీ హసన్ సలామె" ను చంపడానికి ఎన్ని వ్యూహాలు పన్నారో, ఎన్ని సారులు విఫలం అయ్యారో, పొరపాట్న ఇంకో మనిషిని సలామె అనుకుని చంపేస్తారు కూడా. అన్నీ దాటుకున్నాక, చావు పడగ నీడన తాను ఉన్నానని బాగా ఎరుక వున్న ఈ రక్త పిపాసి, (అందుకే ఆ నిక్ నేం - రెడ్ ప్రిన్స్) సలామే ను చంపేస్తుంది మొసాద్ టీం.
మొసాద్ హత్యలు - వివిధ తీవ్రవాద సంస్థలు వొళ్ళు దగ్గరపెట్టుకుని వ్యవహరించేలా చేసాయి. తమ తమ ఉగ్ర లక్ష్యాలను చేదించాక, ఎప్పటికైనా మొసాద్ తమను చంపేస్తునదే స్పృహ తో మృత్యుదేవత తోనే కాపురం చేసేవాళ్ళు హమాస్, హిజబొల్లా లాంటి భయానక సంస్థల సభ్యులు.
కేవలం రేడియోల ద్వారా, లేదా చిన్న చిన్న పరికరలతో, కోడ్ లతో గూఢచర్యం నెరిపి, మొసాద్ ఏజెంట్లు ప్రాణాలు పణంగా పెట్టి ఆపరేషన్ లలో విజయాలు సాధించారు. గూఢచర్యం తో పాటు హత్య చెయ్యాలంటే, గుంపులుగా ఒక సర్వైలెన్స్ బృందం, ఒక హిట్ టీం, ఒక క్లియరెన్స్ టీం, అదృష్టం తిరగబడి పట్టు బడితే ఆయా దేశాల్లో చట్టాల ప్రకారం సభ్యులకు పడబోయే శిక్షలను దృష్టి లో ఉంచుకుని ప్రణాళిక రచించే కమిటీ. కొన్ని సార్లు చంపాలనుకున్న వ్యక్తిని ఎలానో ట్రాప్ చేసి తమ మిత్ర / శతృ దేశాల సరిహద్దుల్ని దాటించి, తటస్థ దేశాల్లో చంపేసిన సందర్భాలున్నాయి. ఇలా మొసాద్ పెద్ద టీం వర్క్ తో ఆపరేషన్లు చేస్తుంటుంది. కొన్ని సార్లు ఏజెంట్లు ఒంటరిగా సంవత్సరాల తరపడి శతృవు తో సహవాసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మొసాద్ చరిత్రలో ఫెయిల్ అయిన ఆపరేషన్లు కూడా ప్రసిద్ధాలయ్యాయి. వీటిలో సిరియా రాజధాని డమాస్కస్ లో కీలక స్థానానికి ఎదిగి, కేవల మొసాద్ అత్యుత్సాహం వల్ల దొరికిపోయిన నేషనల్ హీరో "ఎలీ కోహెన్" ది పెద్ద కథ. అతని మీద ఎన్నో నవలలూ, సినిమాలూ వచ్చాయి. అలాగే చేజేతులా మొసాద్ బయటపెట్టిన కీలక సోర్స్ "ఏంజెల్", బయట పెట్టబడిన వారంలోగా అతని హత్య, చెప్పుకోదగ్గవి. కొన్ని హనీ ట్రాప్ లు, కొన్ని అధిక ప్రసంగాలు, కొన్ని తీర్పులు, కొన్ని అతిశయోక్తులూ, చిరాకు పెట్టేస్తాయి. "హనీ ట్రాప్" ఇప్పుడు భారత పాకిస్తాన్ ల గూడచర్య పద్ధతుల్ని ఏలేస్తున్న ఏకైక పద్ధతి. దీన్ని ప్రవేశపెట్టింది మొసాద్. సిరియా అధ్యక్షుడు గా హఫీజ్ అల్ అసాద్ ఉన్నప్పుడు అతనికీ, నార్త్ కొరియా అధ్యక్షుడు కిం ఇల్ సంగ్ కీ ఉన్న దోస్తీ, న్యూక్లియర్ రియాక్టర్ నిర్మాణపు ఒప్పందం, తండ్రి హఫీజ్ పోయాక, అతని కొడుకు, ఇప్పటి అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ దాన్ని కొనసాగించడం, ఆ రియాక్టర్ ను అమెరికా పేల్చడానికి వెనకాడి ఒప్పుకోకపోవడంతో ఇజ్రాయెలే ఎయిర్ రైడ్ చేసి నాశనం చెయ్యడం లాంటి అంశాలు బావున్నాయి. అల్ అసాద్ ఇప్పుడు సిరియా యుద్ధం లో ప్రయోగించిన కెమికల్ వెపన్ లు, బయొలాజికల్ వెపన్లను అతని తండ్రి జమానా లో నార్త్ కొరియా అమ్మినవే. వీటిని ప్రపంచం ఆమోదించదు.
ఇజ్రాయెల్ ప్రధానంగా యూదు దేశం. యూదులు ఎక్కడ హింస కు గురవుతున్నా, దాని మతాచారం (Law of Return) ప్రకారం వారిని సురక్షితంగా ఇజ్రయెల్ కు తీసుకు రావడం దాని బాధ్యత. అలా సిరియా నుండీ, ఇథియోపియా (ఆఫ్రికన్ యూదులు) నుంచీ యూదుల్ని తీసుకొచ్చి ఇజ్రాయెల్ లో వారికి పౌరసత్వం ఇవ్వడం లాంటివి జరిగాయి. అయితే ఇలా శతృదేశాల నుండీ యూదుల్ని వివిధ ఆపరేషన్ ల ద్వారా రహస్యంగా (వేలాది మందిని - కొన్ని సంవత్సరాల పాటూ) తరలించారు మొసాద్ బంటులు. అలాగే, నాజీ జర్మనీ లో నరమేధానికి పాల్పడి, యుద్ధం ముగిసాక, జన సామాన్యంలో కలిసిపోయి, ట్రయల్ ను ఎదుర్కోని ఎస్.ఎస్. కమాండర్లను, మాజీ నాజీలను వెతికి పట్టుకుని, వాళ్ళని బోన్లలో నిలబెట్టింది మొసాద్. కొందరిని చంపేసింది కూడా.
ఇస్లామిక్ తీవ్రవాదంలో సూయిసైడ్ ని అంటే ఆత్మాహుతి ని మొదటి సారిగా ప్రవేశపెట్టి, దానికి మతపు గ్రాండ్ సీల్ వేసి ప్రోత్సహించిన షకాకీ (Shaqaqi - Islamic Jihad) ని మట్టుపెట్టింది. ఇస్లామిక్ జిహాద్ కు చెందిన ఇంత కీలక నాయకుడిని, ఇతర పై స్థాయి చాణుక్యుల్నీ, తీవ్రవాదుల్నీ, విష ప్రయోగం ద్వారా, చాక్లెట్లలో తెలియని విషాల్ని నింపి ఇచ్చి, వారు "తెలీని ఏదో వ్యాధి (Terminal illness) తో కుంగి కృశించి మరణించే లా " ఏర్పాటు చేసింది మొసాద్. ఆఖరికి ఆరాఫత్ మరణం కూడా అలాంటిదే అంటారు.
మొసాద్ మీద తీవ్ర ఆరోపణలున్నాయి. ఇది అత్యంత వ్యవస్థీకృతమైన సంస్థ. ఇజ్రాయిలీ గూఢ చర్య సంస్థల లో 'మొసాద్', 'షబాక్', 'అమన్' (మిలటరీ ఇంటలిజెన్స్) 'స్పెషల్ బ్రాంచ్', 'విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు చెందిన రీసెర్చ్ విభాగం' కీలకం. మొసాద్ లో మళ్ళీ వివిధ విభాగాలు, కీడాన్ లాంటి స్పెషల్ ఫోర్స్ లూ ఉంటాయి. ఏది ఏమయినా, ఇజ్రాయెల్ ఇప్పుడు పలు ప్రపంచ దేశాలకు (ముఖ్యంగా మన దేశానికి) సాంకేతిక సహారం అందిస్తూ, అత్యాధునిక యుద్ధ సామాగ్రిని అమ్మే సంస్థ. ఇజ్రాయిలీ రాడార్లు, అవాక్స్ సిస్టం లు, శిక్షణా, కీలక యుద్ధ విమానాల విడి భాగాలు, పాడి, వ్యవసాయ విధానాలు, డ్రోన్లూ, తుపాకులూ, గుళ్ళూ, చివరికి కేమెరాలు, ఇజ్రాయిలీ సాటిలైట్లు, వారి రోదశీ సేవలు మన దేశానికి చాలా కీలకం.
"మోషే దయాన్" లాంటి రక్షణ మంత్రులూ, "గోల్డా మీర్" (బ్లాక్ సెప్టెంబర్ మీద దాడి - ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్, ఇంకా పలు సాహసో పేతమైన అపరేషన్లను ఆర్డర్ చేసిన మహిళా ప్రధాని), నెతన్యాహూ లాంటి ఒకే మాట మీద నిలబడే వెన్ను బలం ఉన్న వివిద రాజకీయ నాయకులూ, మొసాద్ కు పెద్ద దిక్కు గా నిలిచారు. ఇప్పుడు ప్రపంచంలో సీ.ఐ.ఐ కన్నా ఎక్కువ మంచిపేరున్న సంస్థ మొసాద్. దీని ఏజెంట్లు చాలా మంది, దొరికిపోయిన తరవాత, చిత్రహింసలకు గురయి, ఉరి తీయబడి, చనిపోయారు. "మేము మిమ్మల్ని మర్చిపోము.." అంటూ, మొసాద్ తన యుద్ధాన్ని కొనసాగిస్తుంటుంది. మొసాద్ అధ్యక్షుడిని హీబ్రూ లో రంసాద్ అంటారు. ఈ రంసాద్ లు కొందరు సూపర్ హీరోలు, కొందరు బలహీనులు, కొందరు తాము ఎదుర్కొన్న్న చాలెంజ్ బట్టీ తప్పక ఎదుర్కోవాల్సి వచ్చి హీరోలయ్యారు. వీరందరి లక్ష్యం ఇజ్రాయెల్ ని రక్షించడమే. పనిలో పని గా, వీళ్ళు ప్రపంచాన్ని కూడా రక్షించారు.
05/04/2021
Rise of ISIS, A THREAT WE CAN'T IGNORE - Jay Sekulow
Rise of ISIS
A THREAT WE CANT IGNORE
by
Jay Sekulow, with ACLJ Law of War Team
Jordan Sekulow, Robert W Ash and David French
నిజానికి ఇది ఒక కేస్ స్టడీ. ప్రధానంగా ఐసిస్, హమాస్ ఉగ్రవాద సంస్థల ప్రస్థానం గురించి. దీన్ని July 2011 లో ప్రచురించారు.ఈ పుస్తకంలో ప్రచురించిన చాలా భాగాలు అంటే - ఐసిస్ పుట్టుక, ప్రస్థానం, హమాస్, ఐసిస్ ల మధ్య పోలికలు, వారి పోరాట వ్యూహాలు, రాజకీయపుటెత్తులు, ప్రపంచపు దృష్టిని ఆకట్టుకునేందుకు అవలంబించే పద్ధతుల గురించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తాలూకూ History Politics and Society Program on Religion and Politics in the Middle East లో సమర్పించిన థీసిస్ లో ఉన్నాయి.
ఈ పుస్తకం తాలూకు ప్రధాన ఉద్దేశ్యం - ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఎదగడానికి, ఒక భయానక శక్తి గా ఎదగడానికీ, ఏ శక్తులు దోహదం చేస్తాయో, ఎందుకు చేస్తాయో - ఆఖరికి వాటి అంతం ఎలా ఉండొచ్చో, చర్చించడమే. అయితే ఈ పుస్తకం ప్రచురించే సమయానికి (2011) ఐసిస్ కథ ముగియలేదు. కానీ, ఐసిస్ బలాలనీ, బలహీనతలను అంచనా వెయ్యడం లో ఒక థింక్ టాంక్ తాలూకూ ప్రయత్నం, అది విస్తృత సత్యంగా ఎలా మలుపు తిరిగిందో ఆలోచించడానికి బావుంది.
AQI (Al Queda in Iraq) నుండీ ఐసిస్ / ఐసిల్ / డాయిష్ పుట్టింది. 'అబూ ముసాల్ అల్ జర్కావీ' మానస పుత్రిక. 2004 లోనే మొదలయినా 2011 నుండీ ప్రాముఖ్యతలోకి వచ్చింది. 2013 లో స్థిరపడి, వేళ్ళూని, తన పేరు ఐసిస్ గా మార్చుకుని, ఇరాక్, సిరియా లలో (సిరియాలో దాదాపుఒక సమయంలో 90% భాగాన్ని) ఈజిప్ట్, టర్కీ ల లో కూడా చాలా భాగాల్ని తన అదుపులోకి తెచ్చుకుని, "కాలిఫైట్" ని ప్రకటించుకుంది. .
అమెరికా తాలూకూ ఆపరేషన్ ఇన్ హెరెంట్ రిసాల్వ్ (OP Inherent Resolve) లో దాదాపూ 8000 వైమానిక దాడుల అనంతరం, బలహీనపడడం మొదలయింది. Dec 2017 సరికి 95% of its territoryని కోల్పోయి, 2018 లో కుర్దులు (SDF - Syrian Democratic Forces) దాన్ని కొన్ని గ్రామాలకు పరిమితం చేయడం, Feb 2019 లో ఆఖరి ముట్టడి (Final Siege) మొదలయ్యాక, Mar 23, 2019 లో పూర్తి గా ఓడిపోయి, ఉగ్రవాదులు, తమ కుటుంబాలతో సహా మూకుమ్మడి గా లొంగిపోవడం, దాని అసంఖ్యాక విదేశీ సభ్యులను, వారి వారి దేశాలు అన్నీ నిరాకరించడం, అలాగే Oct 26, 2019 లో అబూ బకర్ అల్ బగ్దాదీ, సిరియాలో అమెరికా దాడి లో మరణించాక, దాని కథ ముగియడం జరిగాయి.
అయితే, అంతవరకూ ఎదురు లేకుండా, కనీ వినీ ఎరగని రీతిలో, స్వయంగా వివిధ ఇతర హింసాత్మక ఉగ్రవాద సంస్థలు కూడా సమ్మతించనంత ఘోరమైన పద్ధతుల్లో, తాము గెలుచుకున్న భూభాగం లో - తలలు నరకడం, తల్లుల ముందే బిడ్డల్ను చంపడం, బహిరంగంగా శవాలను మూడు నాలుగురోజుల పాటు ప్రదర్శించడం, స్త్రీ లను రేప్ చేసి, తమ తమ దేహాలను పవిత్ర పరిచేందుకు ఆత్మాహుతి దాడుల్లో పాల్గొనాల్సిందే అని ఒప్పించడం లాంటి పనులు చెయ్యడం తో పాటు, సాంకేతిక సహకారంతో, తమ తమ ఘోరాలను ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేసి, అసంఖ్యాక పిచ్చివాళ్ళను (వీరుల్ని/వధువులనూ) ఆకర్షించి, పద్ధతి ప్రకారం రిక్రూట్ చేసికుని, అర చేతిలో వైకుంఠం (కాలిఫైట్) చూపిస్తూ, వాళ్ళ చేత యుద్ధాలూ, హత్యలూ - కౄరత కు పరాకాష్ట లాంటి పనులన్నీ చేయించి, గ్రామాలకు గ్రామాల్నే చంపేసి, భీభత్సం సృష్టించింది. ఐసిస్ సృష్టించిన ఘోర కలి, దాని రెవెన్యూ విధానాలు, దాని సభ్యుల సాంకేతిక విద్య అపరిమితత్వం, కిచెన్ లో బాంబులు తయారుచెయ్యడం, మెల్లగా తలలు నరకడం గురించి యూ ట్యూబ్ ట్యుటోరియళ్ళు - ఇలా ఐసిస్ ప్రపంచ వ్యాప్తంగా ఇళ్ళలోకి ప్రవేశించి, రాజకీయాల్ని వేడెక్కించి, ఎందరో తల్లులకు గర్భ శోకాన్ని మిగిల్చి, అన్ని దేశాల్నీ ఓ కుదుపు కుదిపింది.
ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ ప్రేరణ తో, దన్నుతో, సూచనలతో, ఆదేశాలతో, అసంఖ్యాక బాంబు దాడులూ, కత్తి దాడులూ, వాహనాలతో హత్య చేయడాలు జరిగాయి. ఇంకా, ఆఫ్రికా లో బోకో హరాం లాంటి సంస్థలతో చేతులు కలిపి, మన దేశం లో కూడా తన శాఖ ను ప్రకటించి, తమ పరిథి ని ఇంకా విస్తృత పరచుకుంటూ, ప్రపంచానికి పెను సవాలైపోయింది. "షరియా లా" ని అక్షరాలా చాందసంగా అమలు చెయ్యడం, వాలంటరీ గా వచ్చిన స్త్రీలను కూడా సెక్స్ బానిసలు గా చూడడం, (తెలిసీ తెలియని వయసున్న టీనేజర్లు - పాశ్చాత్య దేశాలవారు), సామూహికంగా హత్యలు చెయ్యడం, సామూహికంగా శవాలను కప్పిపెట్టడం, పిల్లల మీద, మహిళల మీదా నేరాలకు పాల్పడడం వంటి ద్వారా, బయటి ప్రపంచం కన్నా, తమ లోపలి ప్రపంచంలో కూడా చాలా వ్యతిరేకత మూట కట్టుకున్నారు ఈ ఐసిస్ సభ్యులు. (తాము ఆక్రమించుకున్న ప్రాంతాల ప్రజల దృష్టి లోనూ, తెలిసీ తెలియక తమ లో చేరిన 'బలహీన' సభ్యుల దృష్టి లో కూడా "రక్తపిపాసి" లాగా నిలబడింది తప్ప, తాను చూపించిన కాలిఫైట్ స్వప్నాలని అందివ్వలేకపోయింది).
దీనికీ హమాస్ కూ ఉన్న పోలికలు, వాటి విధానాల మధ్య ఉన్న పోలికలూ - ముఖ్యంగా ఇజ్రాయిల్ కు అతి సమీపంగా రాగలగడం, తమకు మతపర శతృవుల్నీ (NON MUSLIMS / Non-believers) నిర్మూలించడమే, వారి లక్ష్యం గాబట్టి, ఇజ్రాయిల్ మీదా, యూదుల మీదా ఆధిపత్యం సాధించడం, యూదుల్ని చంపడం తమ తదుపరి లక్ష్యంగా ప్రకటించేసరికీ, వాతావరణం వేడెక్కడం మొదలయింది. నెతన్యాహూ, ఐసిస్ ను హమాస్ తో పోల్చారు. అమెరికాను ఐసిస్ మీదకు బలంగా విరుచుకుపడేందుకు ఒప్పించడానికి అందరికీ తలప్రాణం తోకకొచ్చింది. ఆఖరికి "అమెరికన్ విలువ"ల (American Values) గాలం వేసి, చమురు వ్యాపారాన్ని సరిదిద్దడానికి, రష్యా కూటమి అధికార విస్తృతిని అడ్డుకోవడానికి - తీవ్రవాదానికి తాళం వేసే "అనిశ్చితత్వాని'కీ అడ్డు వేసారు. ఐసిస్ ఇలా చాపకింద నీరులా ప్రపంచవ్యాప్తంగా కాలు కదపకుండానే లోన్-వుల్ఫ్ దాడుల ద్వారా భీభత్సం సృష్టించాక, మెల్లగా అమెరికా, కేనడా, నాటో లు ముందుకు కదలడం, ఐసిస్ కోసం ప్రపంచం రెండుగా చీలడం, వివిధ దౌత్య, సైనిక, రాజకీయ జోక్యాల తరవాత ఐసిస్ బలహీనతల సమాచారం అందుబాటులోకి రావడం మొదలయ్యాయి.
ఆఖరికి టర్కీలో తన రాజకీయ ప్రయోజనాల కోసం (నాటో సభ్యురాలు - ఈ.యూ. లో ప్రవేశం కోసం అభ్యర్ధి, కావడాన) ఎర్డోగన్ వ్యూహ మార్పు వల్ల, ఐసిస్ అంతం అయింది. అంతవరకూ, తమ దేశం గుండానే, వేలాది మంది విదేశీయులు సిరియాలోకి ప్రవేశించడాన్ని, ఆయుధ సరఫరాని అనుమతించడాన్ని, అమెరికా కు "టర్కీ సార్వభౌమత్వం" పేరుతో తమ దేశంలో బేస్ నిరాకరించడం - వగైరా ఐసిస్ అనుకూల దృక్పధాన్ని కొనసాగించడం, దాని వల్ల ప్రపంచంతో ఏర్పడ్డ శతృత్వం ఎన్నో నాళ్ళు నిభాయించలేక పోయినా సరే టర్కీ, తన మొండి విధానాల్నే నమ్ముకుంది. టర్కీ ని "సంచీ" లో వేసుకున్నంత వరకూ ఐసిస్ కూ, అది చేసే చమురు నల్ల వ్యాపారానికీ, దానికి కావలసిన ఆయుధ సంపత్తికీ, చనిపోతున్న వీరుల సంఖ్యను పూర్తి చేసేందుకు టర్కీ ఏర్పోర్టులలో దిగుతున్న కొత్త సభ్యుల సరఫరాకీ ఎలాంటి అడ్డూ లేదని ప్రపంచం గ్రహించింది. ఈ పుస్తకం లో రచయితల బృందం సూచించినది అదే.
అనూహ్యంగా, టర్కీ లో సురుక్ (Suruc - అది సిరియా సరిహద్దు నుండీ కేవలం 10 km దూరంలో ఉంది) లో, Jul 20 న బాంబు దాడి జరిగాక (ఈ దాడి బాధ్యత ను ఐసిస్ స్వీకరించలేదు) Turkey అకస్మాత్తు గా ఐసిస్ మీద ఎదురు దాడికి దిగడం తో పూర్తిగా సమీకరణాలు మారిపోయాయి.
టర్కీ మీద ఒత్తిడి తీసుకుని రావడం ద్వారా ఐసిస్ ను ఎదుర్కోగలమని సూచించిన నిపుణులు ఎన్ని వ్యూహాలు రచించినప్పటికీ, ఎర్డోగన్ (2014 లో కేవలం టర్కీ ప్రధాని) అధ్యక్ష పదవీ వ్యామోహం, అతని పార్టీ కేవలం 258 / 550 సీట్లు సాధించాక, అతనితో సంకీర్ణానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో షాక్ తిని, - ఐసిస్ వ్యతిరేకత టర్కీ లో పెరగడం తో, ఐసిస్ ను అణచకపోతే, అది తన నెత్తినే కాటేస్తుందని అర్ధం చేసుకుని - ఎలక్షన్ లలో గెలుపు కోసం, ఎర్డోగన్ (Erdogan) తన స్టాండ్ మార్చుకున్నాడు గానీ, మీడియా ప్రాచారం చేసినట్టు టర్కీ మీద దాడి (ఇది ఎవరు చేయించారో తెలీదు. ఈ దాడి లో 33 మంది సామాన్య పౌరులు మరణించారు) వల్ల కాదని అంటారు.
ఏది ఎమయినా ఐసిస్ ఇప్పుడు ఓ గతం. కానీ ఈ కాలంలో కూడా ఐసిస్, హమాస్ లు అవలంబిస్తున్న, అవలంబించిన పోరాట విధానాలు అధ్యయనం చేయాల్సిందే. పౌరులు ఎక్కువగా ఉండే జనావాస స్థలాలలో తమ బేస్ లు ఏర్పాటు చేసుకోవడం, హస్పెటల్స్ నుండీ రాకెట్లు లాంచ్ చెయ్యడం, ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన వివిధ ప్రాంగణాలలో బాంబులు, ఆయుధాలు భద్రపరచడం, సామాన్యుల ప్రాణాలను బలి పెట్టడం లాంటివి సాధారణం గా చెయ్యడం, ఈ రెండు సంస్థల స్వభావం. ఐసిస్ ప్రధాన ఆదాయ వనరు చమురు. ఐసిస్ తదనంతరం, చమురు వ్యాపారపు పగ్గాలు ఆయా దేశాలు అంది పుచ్చుకున్నాయి. ఇపుడు చమురు రాజకీయాలు రష్యాను, కతార్ ను, సౌదీ అరేబియాను, ఇజ్రాయెల్ ను, మొత్తానికి ప్రపంచాన్నీ ప్రభావితం చేస్తున్నాయి.
ముఖ్యంగా - అధ్యక్షుడిగా ఎన్నికయేందుకు ఉన్న అడ్డంకులను తొలగించుకోవడానికి , Erdogan తన (Turkey) శత్రు దళాలైన PKK (Kurdish Workers Party) మీద, కొంచెం ఐసిస్ మీదా, దాడులు జరపడానికి పూనుకుపోయి ఉంటే ఏమి జరిగేదొ. కుర్దిస్తాన్ కోసం పోరాడే కుర్దు వీరులు, ఐసిస్ కు గట్టి ఎదురు దెబ్బలు కలిగించకపోతే, ఆ ప్రయత్నాలలో వారు ఓడి ఉంటే ? ఇవన్నీ ఊహించడానికి కూడా భయానకం గా ఉంటాయి. సిరియా యుద్ధం, వరద ప్రవాహం లాంటి శరణార్ధులు యూరోప్ ను ముంచెత్తడం, సముద్రం మింగేసిన శరణార్ధులు - వీళ్ళంతా ప్రపంచానికి గుర్తున్నారా ? మానవత్వం, అమానుషత్వం - వీటిల్లో ఏది గెలుస్తుంది? అంత వరకూ తేనె తుట్ట ను కదిలించేది / కదలకుండా ఉంచేది ఎవరు ? వీటికి సమాధానాలు వెతకడం కూడా ఇప్పుడు కష్టమే.
ఐసిస్ ను ట్విటర్ లాంటి సంస్థలు ఎదుర్కోక మునుపు, ఫిఫా ప్రపంచ ఫుట్ బాల్ కప్ పోటీలు జరిగేటప్పుడు హాష్టాగ్ వరల్డ్ కప్ (#World Cup) ను ఉపయోగించి ఐసిస్ ట్విటర్ హాండ్లర్, ఒక నరికిన తల ఫోటో ను ట్వీట్ చెయ్యడం (This is our Football, its made of skin అంటూ) ప్రకంపనలు సృష్టించింది. ఐసిస్ చేసిన వివిధ హత్యలను, ఉదాహరణకు, జోర్డన్ పైలట్ ను ఒక బోనులో ఉంచి సజీవ దహనం చెయ్యడం, వివిధ దేశాల జర్నలిస్టులను, ఎయిడ్ వర్కర్ లను, సైనికులను చంపుతూ చేసిన వీడియోలు కొత్త లో sensation కోసం చూపించిన ప్రధాన స్రవంతి మీడియా - దాన్ని విరమించుకోవడంతో SOCIAL MEDIA లో, ప్రపంచ కప్ చూసే అభిమానులను టార్గెట్ చేస్తూ - ట్వీట్ చెయ్యడం, దాన్ని అమాయక, ఈ ప్రమాదాన్ని ఊహించనే లేని యువత చూడ డానికి అనువుగా పెట్టడం - ఐసిస్ మీద వ్యతిరేకత ను, చాందస భావాలతో పెరిగిన యువత లో 'అభిమానాన్ని' కూడా సృస్టించింది. ఏ పోరాటానికైనా, ఏ అకృత్యాలకైనా పాపం పండడం అనే మాట ఒకటుంటుంది. కొన్ని విపరీతాలు అందుకే జరుగుతాయి. కొన్ని చెడ్డ విషయాలు కూడా ఇలాగే అంతం అవుతాయి. ఇప్పటికీ ఐసిస్ అనుకూల, ప్రేరేరిత దాడులు ప్రపంచం లో అడపాదడపా జరుగుతున్నాయి. ఎక్కడో అది బ్రతికే ఉంది. కాబట్టి, జాగ్రత్త అవసరం.
***