12/09/2019
Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 5
ప్రతి ముగ్గురు పురుషులకీ ఒక స్త్రీ అనే నిష్పత్తిలో ఎల్.టీ.టీ.ఈ లో మహిళా సభ్యులు ఉండేవారు. వారిలో నాయకత్వ స్థాయిలో చాలా తక్కువమందే ఉన్నా, ప్రభాకరన్ తో వారికున్న రక్త సంబంధానికన్నా అతీతమైన బంధం, "అన్నా" అని వరుసతో పిలిచే గౌరవం, పరమ విధేయత, చెప్పుకోదగ్గవి. అసలంత చరిష్మా ని ప్రభాకరన్ ఎలా ఏర్పరచుకున్నాడు ? స్త్రీలకీ, వారి సమానత్వానికీ, పురుషులతో పోటీ పడి పనిచేసే వారి తెగింపుకీ, విశ్వాసానికీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన సంస్థ గా ఎల్.టీ.టీ.ఈ. ని రూపుదిద్దటం ద్వారానే.
తాము ఆ దేశంలో మైనారిటీలయి ఉండి, ప్రత్యేక ఈలం పోరాటం చేయడం లో ఉన్న చాలెంజ్ లను బేరీజు వేసుకున్న ఈ సంస్థ మొదటి నుండీ, స్త్రీ సమానత్వానికి తగిన ప్రాధాన్యతని ఇస్తూ వచ్చింది. వారు విధేయత తో సంస్థ లక్ష్యాలకోసం పని చేసేరు తప్ప పెద్దగా నాయకత్వ స్థానాలలో పని చేయలేదు. కానీ మతానికి సంబంధమే లేకుండా కేవలం దేశ సాధన కోసం కృషి చేసిన దళం కాబట్టి ఇక్కడ అసమానత కి తావు లేకుండా, నిజానికి మహిళల కి లైంగిక మానసిక వేధింపులు ఎదురవకుండా వారికి చాలా ప్రాధాన్యాన్నిచ్చి దళాన్ని నడిపించడం జరిగింది.
చెచెన్యా, పాలస్తీనా ల లా (అక్కడ ఆత్మాహుతి దాడి కి పాల్పడిన పురుషుడి కుటుంబానికి నాలుగొందల డాలర్లూ, స్త్రీ కుటుంబానికి రెండొందల డాలర్లూ ప్రతీ నెలా, జీవన భృతి చిక్కేది) స్త్రీ ప్రాణానికి తక్కువ విలువ, పురుషుడి ప్రాణానికి ఎక్కువ విలువా అని నిర్వచించలేదు. కానీ సాధారణ పౌర సమాజంలో స్త్రీ ల లాగా వీరు తాము బలహీనులం కాము అని నిరుపించుకోవడం కోసం ఎన్నో త్యాగాలు చేసారు. పోరాటం ముదిరినపుడు తప్పని సరి గా సాధారణ దుస్తులు ధరించాల్సి వచ్చేది. వారిని ఈ సాయుధ పోరాటంలో కి తీసుకు రావడమే సులువు. వన్ని పరిసరాల్లో ఎన్నోసార్లు ఆత్మ రక్షణ కోసం గూడు చెదిరి పారిపోవాల్సి వచ్చినపుడు, దాడులకు గురయినపుడూ వారు ఎదుర్కొన్న రక్షణ లేని పరిస్థితులకు మహిళలకి ఈ ఈలం పోరాటం ఓ కవచం లా కనిపించడంలో తప్పు లేదు.
పురుషులతో సమానంగా వారు పేలుడు పదార్ధాలు అమర్చి, పేల్చి, లోతుల్లోకి దిగి, అత్యంత సాహసమైన, దుర్లభమైన బావులు తవ్వడం లాంటి పనులు చేసారు. క్లిష్టమైన పనుల్లో స్త్రీ సహాయకురాలిగా, పురుషుడు ప్రధాన పాత్ర గా కాకుండా దానికి భిన్నంగా పని చేసి చూపించారు. వారు బావులు తవ్వినపుడు పురుషులు తట్టలు మోసారు. వారు లాండ్ మైన్ లను అసెంబుల్ చేసారు, అమర్చారు. పేలుడు పదార్ధాలను వాడారు. ఆయుధాలను మోసారు. మైళ్ళ కొద్దీ అడవుల్లో, నగరాల్లో, సైనికులమీద దాడులకు దిగారు. ఆత్మాహుతి దాడుల్లో ఒక్క మారు కూడా వెనుతిరిగి చూడకుండా పాల్గొన్నారు. పోరాటం చివరి రోజుల్లో ట్రక్కుల కొద్దీ శవాలై తేలారు. సముద్రం మధ్యలో శ్రీలంక నేవీ మీద కు దాడికి దిగారు. పురుషుల కన్నా ఎక్కువ సమర్ధవంతంగా పని చేసారు.
తమ జెండర్ సాకు గా చూపించి ఏ పనీ చెయ్యడానికి వెరవలేదు. శక్తికి మించిన పనులే చేసారు. ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలారు. అయితే శ్రీలంక ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా, ఉక్కుపాదంతో నలువైపుల నుండీ చుట్టుముట్టి వేలాదిగా దళ సభ్యుల్ని తుడిచిపెట్టేసినపుడు, పురుషుల కన్నా ఎక్కువ హింసకి లోనై చంపబడ్డారు. పైగా తమని తాము నిరూపించుకోవడానికి పురుషుల కన్నా ఎక్కువే కష్టపడ్డారు. ప్రభాకరన్ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేందుకు, ఆయన మీద గౌరవంతో ఎన్నో సమస్యలని ఎదుర్కొన్నారు. పోరాటం ముగిసి, నాయకులంతా మరణించాకా, హింసని మర్చిపోయేందుకు శ్రీలంక సమాజం చేసిన ప్రయత్నాలలో ఈ మహిళా తీవ్రవాదులని కూడా స్మృతి పథం లోంచీ అందరూ తుడిచేసారు.
ఈ మహిళా తీవ్రవాదుల గురించి సెప్టెంబరు 11 దాడుల ముందు వరకూ ఎవరూ, ముఖ్యంగా లంక మరియు విదేశీ మీడియా అస్సలు పట్టించుకోనే లేదు. సంఖ్యాపరంగా కూడా, వ్యవస్థాగత అమరిక లోనూ, తక్కిన సంస్థల్లో మహిళా తీవ్రవాదుల కన్నా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ ఫలితాలనీ, లక్ష్యాలనీ సాధించినా, వీరికి తగిన గుర్తింపు అప్పటి వరకూ దొరకనే లేదు. 9/11 తరవాత పాశ్చాత్య, లంకీయ మహిళా జర్నలిస్టులు సైతం ఈ మహిళా తీవ్రవాదుల పాత్రపై దృష్టి సారించారు. వీరి ప్రవేశం, దళాల వ్యవస్థా, పనితీరు, ప్రాధాన్యత, ధైర్యం వగైరా అంశాల పై పరిశోధన మొదలైంది.
సింహళ, తమిళ సమాజాలలో సాధారణ మహిళల నుంచీ ఈ తీవ్రవాద మహిళలకు పెద్ద సానుభూతి ఏమీ దక్కలేదు. ఎప్పుడో పాత తరపు స్త్రీలు మాత్రం, కట్టుబాట్లను చేదించి, ఆభరణాలను త్యజించి, ఆయుధాలు ధరించి, పురుషుల దుస్తులు ధరించి, ఏదో లక్ష్యం కోసం పని చేస్తున్న ఈ తీవ్రవాద మహిళలని కాస్త ఆదరంగా చూసినా, అంతకు మించి గుర్తింపు దక్కలేదు.
మే 2009 లో ప్రభాకరన్, అతని ఇద్దరు కొడుకులూ, కూతురూ, భార్యా, విధేయ అనుచరులూ హత్య కావింపబడ్డాక, ఈలం పోరాటం చాలా దారుణ పరిస్థితుల్లో ముగిసింది. అప్పటి నుండీ శ్రీలంక రాజకీయ వాతావరణం, సమాజ వాతావరణం చాలా మారిపోయింది. పోరాటం ముగిసాకా, ఎల్.టీ.టీ.యీ ఏకాకిత్వం ఎక్కువయిపోయింది. సమాజం లో ప్రతి ఒక్కరూ, వీరికి దూరంగా జరిగారు. ఏతావాతా విదేశీ మీడియా, సానుభూతిపరులూ, లంక సైన్యం సాగించిన అక్రమ నిరంకుశ రాక్షస విధానాలనూ, యుద్ధ నేరాలనూ రికార్డు చేసాయి. హిలరీ క్లింటన్ ఈ యుద్ధ నేరాలను గర్హిస్తూ చేసిన చిన్న ప్రకటనలు తప్ప ఎక్కువ పనేమీ జరగలేదు.
ఈలం పోరాటం లో ఈ మహిళల పాత్ర మాత్రం అసామాన్యమైనది. తమ నాయకుడు, అతని భార్యను మాత్రం సాంప్రదాయ కుటుంబ చట్రంలో భద్రంగా ఉంచి, మిగిలిన మహిళలను మాత్రం తీవ్రవాదం లోకి తీసుకొచ్చి, పోరాటంలో వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎల్.టీ.టీ.ఈ ప్రధానంగా ఆత్మాహుతి దళం. ఇందులో ఒక మాటు ప్రవేశించాక, నిష్క్రమణ మరణం ద్వారానే అని తెలిసీ, తమిళ దేశపు లక్ష్య సాధన కోసం altruistic suicides కి ముందుకొచ్చిన ఈ వేలాది మహిళలు చరిత్ర లో ఓ భాగంగా మిగిలిపోయారు.
ఎల్.టీ.టీ.ఈ లో ఈ మహిళల active role సాధారణ శ్రీలంక /తమిళ సమాజం లో మహిళల సమానత్వ కాంక్ష కూ, వారి రాజకీయ సామాజిక చైతన్యానికీ సూచిక. ఈ మహిళలు, పురుషుల చాటు రెండో తరగతి ప్రజల్లా ఉండి పోకుండా, తమ కు ఎదురైన వ్యక్తిగత, జాతిగత అన్యాయాలను తమకు చాతనయినంత మేరకు ఎదుర్కొన్నారు. అసలు సమాజం కూడా ముప్పయేళ్ళ హింస కు ఎందరో మనుషులనీ కోల్పోయింది. తప్పనిసరి గా లక్షలాది మంది దేశాలు పట్టి పారిపోయారు.
పోరాటం ముగింపు దశలో ఎందరో అమాయక జనం తీవ్రవాదుల, సైనికుక చేతుల్లో చనిపోయారు. రచయిత్రి ఇంటర్యూ చేసిన మహిళా తీవ్రవాదులు మామూలు గృహిణులు, పిల్లలు, యువతులు.. వివిధ వయసుల్లో, వివిధ నైపుణ్యాలతో యుద్ధాన్నీ, హింసనీ దగ్ఫరగా చూసిన వారు. వారికి ఈ ఆయుధాలు, పోరాటం, దళాలలో చిక్కే గౌరవం, నిరాశ గా ఉండిపోకుండా ఏదో చేసామన్న తృప్తి ని ఇవ్వడం గురించి మాట్లాడారు. సమాజం లో మహిళల పట్ల మారాల్సిన దృక్పథం గురించి, తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు.
ఈలం గురించి వివిధ వెబ్ సైట్ లలో, ఎల్.టీ.టీ.ఈ అధికారిక వెబ్ సైట్ల లో జెండర్ బేస్డ్ డాటా కోసం వీలయినంత మేర ప్రయత్నించినట్టు రచయిత్రి చాలా చోట్ల చెప్పడం బావుంది. నిజానికి ఇందరు స్త్రీలు, ఇందరు పురుషులు అని ఎక్కడా సమాచారం దొరకక కుస్తీ పడాల్సొచ్చింది. అయితే ప్రతీ సభ్యుడు, స్త్రీ పురుష బేధం లేకుండా సాధించిన వివిధ విజయాల గురించి వెబ్ సైట్ లు యధాతధంగా ప్రచురించడం ప్రస్తావించారు.
ఏదేమైనా ఈ తమిళ మహిళా పులులు ప్రత్యేకమైన పాత్ర పోషించి, తీవ్ర వా దాని కున్న dimensions ని మార్చేసారనడం లో సందేహం లేదు. 240 పేజీల ఈ రీసెర్చ్ గ్రంధం చదివి ఆ తరవాత ఊరుకోక అందులో కనిపించిన సోర్స్ ల గురించి నెట్ లో వెతికి భీభత్స రణ చరిత్ర ని చదివి, తీవ్రవాదాన్ని అణచడం లో శ్రీలంక గొప్పగా చెప్పుకునే శ్రీలంక మోడల్ మిలటరీ ప్లాన్ గురించి ఆలోచించి ఆశ్చర్యం కలిగింది. మొత్తానికి ఇప్పుడు శ్రీలంక శాంతియుత దేశం. పర్యాటక ప్రాంతం ఈలం తుడిచిపెట్టబడ్డ చరిత్ర. ఈ మహిళల మార్క్ మాత్రం ప్రపంచంలో ఎక్కడో లీలగా ఉండిపోతుంది.
-Finished-
Subscribe to:
Posts (Atom)