మార్క్ ట్వైన్ రాసిన అన్ని నవలల్లోకీ చాలా సీరియస్ నవల "పెర్సొనల్ రెకలెక్షన్స్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్". కామిక్ రచయిత గా మొదలుపెట్టినా, జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల కారణంగా, భార్య, ఇద్దరు కూతుర్ల మరణానంతరం, తన మలి సంధ్య లో.. సీరియస్, నిరాశాపూరిత కధలను రాయడం మొదలుపెట్టాడు ఈయన. 'జోన్ ఆఫ్ ఆర్క్' గురించి ఇంగ్లీషు లోకంలో పెద్దగా తెలీని కాలంలో పన్నెండు సంవత్సరాలు శ్రమపడి, సమాచారాన్ని సేకరించి, రెండేళ్ళ పాటు రచించిన, అతను తన నవలల్లోకెల్లా ఉత్తమమైనదని భావించిన నవల ఇది. 1850 లో జోన్ గురించి తెలుసుకుని, ఆమె గురించి లోకానికి తెలపాలన్న తీవ్ర కాంక్ష తో, ఈ కధ నిజమా కాదా అని వెయ్యిన్నొక్క సార్లు నిర్ధారించుకుని, ఈ చారిత్రాత్మక నవలను ప్రేమ తో రాసాడు.
జోన్ ఒక చిన్న పేద రైతు బిడ్డ. ఫ్రెంచ్ వారి చరిత్రలో ఆమెది ఒక సుస్థిరమైన స్థానం. ఆమె తో పాటూ పెరిగిన ఒక స్నేహితుడి జ్ఞాపకాల వెల్లువ ఈ పెర్సొనల్ రీకలెక్షన్స్ అన్న మాట. లూయీ దె కాంట్ అనే జోన్ సహచరుడు, 82 ఏళ్ళ వృద్ధుడు, ఒక ఫ్రెంచు పల్లె లో, వాళ్ళంతా చిన్న నాడు ఆడుకున్న చెట్టు దగ్గర కూర్చుని, జోన్ ని తలచుకుంటూ చెప్పిన కధ ఇది. "మొదటి నుండీ, ఆమె మరణం దాకా నేను తన తోనే ఉన్న వాడిని" అంటూ.. మొదలుపెడతాడు. ఫ్రాన్స్ లో పిల్లలు, ఒక అయిదు వందల సంవత్సరాలో, వెయ్యి సంవత్సరాలో ఆమె ను గుర్తు చేసుకుంటారు. ఆమె గాధలను గానం చేస్తారు. ఫ్రాన్స్ ఆమె ను మర్చిపోకూడదు. ఆ త్యాగధని ని కొలుస్తూ ఉండాలి అని లూయీ ఆకాంక్ష.
డోర్మెరీ లో పిల్లలందరకీ ఈ చెట్టు భలే ఇష్టం. వారి ఆట పాటలన్నీ ఈ చెట్టు చుట్టూతానే. ఎందుకంటే ఆ చెట్టు మీద ఫెయిరీ లున్నాయి. అవి ప్రతీ రోజూ ఈ పిల్లలతో ఆడుకుంటూండేవి. ఒక ప్రీస్ట్ ఫెయిరీలను ఆ చెట్టు నుండీ పొమ్మని శపించినపుడు అతన్ని ప్రశ్నించడం ద్వారా జోన్ నిజానికి కట్టుబడే మనిషి అని, చిన్న పిల్ల అయినా ధైర్య సాహసాలలో, తెలివి తేటలు ప్రదర్శిస్తూ వాగ్వాదం చెయ్యడంలో ఘనురాలు అని అందరికీ తెలుస్తుంది. అదే విధంగా ఒక కరుకైన మంచు కురిసే చలి రాత్రి జోన్ ఇంట్లో అందరూ సమావేశమై ఉన్నపుడు ఒక బిచ్చగాడు చలికి వణికిపోతూ, ఆకలితో అలమటించిపోతూ అక్కడికి వచ్చినపుడు అందరూ అతన్ని ఏవగించుకున్నా, దయగల తల్లి తన ఆహారాన్ని అతనికిచ్చి, ఆదరిస్తుంది. అతను పనికిమాలిన వాడైనా, వెధవ అయినా, ముందు అతని కడుపు నింపాకే మిగతా అంతా అని తండ్రితో వాదిస్తుంది. మనుషులు తప్పు చెయ్యొచ్చు. ఆకలి గొన్న అతని పొట్టదేమి పాపం ? అతనికి భోజనాన్నివ్వడం మన ధర్మం. అతని పాప పుణ్యాల విచారణ కు ఇది సమయం కాదు అంటుంది.
ఈ పిల్లలు కాస్త శాంతియుతంగా ఉండే ఆ ప్రాంతాల్లో అలా పెరిగి పెద్దవుతున్నారు. నిజానికి అప్పుడు ఫ్రాన్స్ అస్థిరత తో ఉడికిపోతుంది. ఇంగ్లీష్ పాలన లో మగ్గుతూంది. రాజు పదవీచ్యుతుడయ్యాడు. ఫ్రెంచ్ అభిమానానికి తీవ్ర గాయమైన కాలం. బర్గుండీ లూ, ఇంగ్లీష్ వాళ్ళూ ఫ్రాన్స్ లో వివిధ ప్రాంతాలను ఏలుతున్నారు. ఫ్రెంచు వారి పరిస్థితి దయనీయంగా ఉంది. పదవీచ్యుతుడైన రాజు ని డాఫిన్ అంటారు. ఫ్రాన్సు కు చెందిన కేథరీన్ కూ ఇంగ్లాండు కు చెందిన హెన్రీ కీ వివాహం జరగబోతున్న వార్త విని ఫ్రెంచు వారు ఉడికిపోతున్నారు. వాళ్ళ సంతానం ఫ్రాన్సు నూ ఇంగ్లండు నూ ఏలేట్టయితే ఈ జన్మ లో ఫ్రాన్సు కు స్వాతంత్ర్యం లభించదనీ, డాఫిన్ ఇక రాజవ్వడనీ బాధపడుతున్నారు.
రాజకీయ పరిస్థితులు ఇలా ఉండగా ఊర్లో ఒక బెనోయిస్ట్ అనే పిచ్చివాడు ఎక్కడో గొడ్దలి దక్కించుకుని, వీధుల్లో విలయ తాండవం చేస్తున్నపుడు, పిల్లలంతా పారిపోగా, జోన్ మాత్రం అతనికెదురెళ్ళి ఏదో లా అతన్ని కన్విన్స్ చేస్తుంది. ఆ మహాబలుడు, ఈ చిన్న పిల్ల మాట విని బుద్ధిమంతుళ్ళా వచ్చి తనకై నిర్దేశించిన చెర లో కూచుంటాడు. అతన్ని తాళం వేసి బంధిస్తారు ఊరివాళ్ళు. అయితే దురదృష్టవశాత్తూ అదే రోజు శత్రు సేనలు ఊరి మీద దాడి చేస్తాయా రాత్రి. అన్ని ఇళ్ళూ తగలబెడతారు. ప్రజలు కట్టు బట్టలతో అడవిలోకి పారిపోతారు. వారు పొద్దున్న తిరిగొచ్చి చూసేసరికీ, చెరలో ఈ మహాబలుడి కాలిన మృతదేహాన్ని చూసి, జోన్ తో సహా అందరూ దుఃఖిస్తారు. అప్పుడు మొదటి సారిగా యుద్ధ భీభత్సం, ఫ్రాన్స్ స్వతంత్ర లాలసా జోన్ కి ఎరుకలోకొస్తాయి.
ఫ్రాన్స్ పతనాన్ని దర్శిస్తున్న ఈ పిల్లలు యుద్ధావేశంతో రగులుతున్న పెద్దవాళ్ళు, నిస్సహాయమైన పరిస్థితులు.. వీటన్నిటి మధ్యా, లూయీ ఒక మారు అడవిలో చెట్ల మధ్య జోన్ ఏదో పెద్ద వెలుగులో మాటలాడుతూండడం చూస్తాడు. ఆ చిన్న పిల్ల తనకు దేవుడు ఫ్రాన్స్ రక్షణకై నియమించాడని, తనని రాజుని కలవనీయమనీ, కొందరు సైనికులనిమ్మనీ, సైన్యాధికారుల కు మొరపెట్టుకుని, ఎలాగో రాజుని కలిసి, ఆయన్ని గద్దెనెక్కిస్తానని ప్రమాణం చేసి, తరవాత ఎన్నో యుద్ధాల్లో పాల్గొని, చిన్న పిల్లే అయినా మెరుపు లా యుద్ధం చేసి, ఆర్లియన్స్ లాంటి శతృదుర్భేద్యమైన కోటల్ని చార్లెస్ వశం చేస్తుంది.
నిండా 17 ఏళ్ళు అన్నా లేని పిల్ల సాధిస్తున్న విజయాలను చూసి, ఆమె ని విచ్ అనీ, మంత్ర కత్తె అనీ, ఇంగ్లీష్ సైనికులు అభాండాలు వేస్తారు. దేవుడే తనని నడిపిస్తున్నాడని నమ్మి జోన్, వెండి పళ్ళెంలో విజయాన్ని తెచ్చి రాజుకిస్తుంది. ఈ క్రమంలో ఎన్నో విజయాలు, గాయాలు, అనవసరమైన విరామాలూ, ఈ లోగా రాజు చుట్టూ చేరిన కుయుక్తులు, జోన్ పారిస్ మీద దండెత్తినపుడు, పారిస్ యుద్ధంలో విజయం సాధించక పోతే, ఫ్రాన్స్ పూర్తిగా స్వతంత్రమయేందుకు ఇంకో 20 యేళ్ళు పడుతుందని చెప్పిన జోన్ మాటల్ని మరిచి, రాజు అకస్మాత్తుగా సంధి ప్రకటించేలా చేసి, ఆమె చేతులు కట్టేస్తారు. ఆ యుద్ధంలోనే ఈమె అత్యంత సాహసోపేతమైన జెనరళ్ళు వీర మరణం చెందుతారు. రాజు వైఫల్యం వల్ల ఫ్రాన్స్ ఓడిపోతుంది.
జోన్ ను అరెస్ట్ చేసి, ఆమె ప్రజాదరణ ను దృష్టి లో ఉంచుకుని, ఆమె సాతానుకు చెందిన వ్యక్తి అని ఋజువు చేయడానికి శత విధాలా ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళడిగిన సొమ్మునిచ్చి జోన్ ని విడుదల చేసుకోవడానికి చార్ల్స్ అస్సలు ప్రయత్నించడు. అత్యంత దయనీయ నిస్సహాయ పరిస్థితుల్లో ఆమె పై విచారణ జరుగుతుంది. ఒంటరి ని చేసి, చెరలో ఆమె ని బలాత్కరించారు. మానసికంగా ఆమెని లొంగదీయడానికి అమానవీయ పరిస్థితుల్లో బంధించి ఉంచారు. ఆఖరికి చదువు రాని ఆ పిల్ల చేత ఒక తప్పుడు ఒప్పుకోలు సంతకం పెట్టించి, సజీవ దహనం చేస్తారు.
బహిరంగంగా అమలు పరచిన ఆ శిక్ష ని లూయీ తన కళ్ళారా చూసి, విల విలా ఏడుస్తాడు. జోన్ చాలా నిస్సహాయంగా, ఒంటరిగా చనిపోతుంది. ఆమె ను చంపేందుకు శతవిధాలా ప్రయత్నించిన వ్యక్తి బిషొప్ బావియా చరిత్రలో బాలిక ని నిర్దాక్షిణ్యంగా చంపిన వ్యక్తి గా నిలిచిపోయాడు. ఇది జరిగిన 20 ఏళ్ళకి చార్లెస్ యుద్ధంలో అంతిమ విజయం సాధించిన నాడు, జోన్ ని తలచుకుంటాడు
ఈ జోన్ కథ ను మార్క్ ట్వైన్ ఇంగ్లీషు మాట్లాడే ప్రజలకు పరిచయం చేసి, జోన్ కు ఒక విస్తృత ప్రచారం కల్పించాడు. ఫ్రాన్స్ విజయం తరవాత రాజు చార్ల్స్ పోప్ దగ్గర జోన్ పై పెట్టిన ఆరోపణలు నిరాధారమైనవని, ఆమె హత్య తప్పని నిరూపింపచేసాడు అంటారు. ఫ్రాన్స్ లో దేవతగా కొలువబడే జోన్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మార్క్ ట్వైన్, చివరి దినాల్లో సావకాశంగా ముగించి, ఒక రూపాన్నిచ్చిన ఈ కథ ని ఆధారంగా చేసుకుని వచ్చిన హాలీవుడ్ సినిమాలు, నాటికలూ కూడా ఆదరణ పొందాయి. ఎన్నో సార్లు పునర్ముద్రణ పొందిన జోన్ కథ, పట్టుదలా, కరుణ, దయా, స్నేహమూ, త్యాగమూ, దేశభక్తీ లాంటి విలువలకు మానవ చరిత్రలో ఎంతో ఆదరణ, గౌరవం, ఉండి తీరతాయని నిరూపిస్తుంది.
***