ఒక్కోసారి సంభాషణ లు ఎటు వైపు నుండీ ఎటు తిరుగుతాయో తెలీదు. ఒక దాని వెంట ఒకటి ప్రస్తావన లు వస్తూ.. అంతూ పొంతూ లేకుండా కబుర్లు చెప్పుకునే తీరిక ఎవరికీ లేదు! కానీ కబుర్లంటూ ఉండకపోవు కదా. నేను చెప్పే కథ లు వినే ఏకాకి శ్రోత మా అమ్మాయి. మేమీమధ్య కబుర్లు విశేషాలూ మాటాడుకుంటూ ఒక ఏనుగు బొమ్మ గురించి మాట్లాడుతూ ఎల్మర్ కథ ని చెప్పుకున్నాం. ఎప్పుడో చిన్నప్పుడు అనగా మూడేళ్ళ వయసులో తను ఈ రంగు రంగుల ఎల్మర్ కథ ని చదివింది (అంటే నేను చదివి వినిపించాను) ఇప్పుడీ మధ్య ఏనుగుల బొమ్మ ఒక దాన్ని చూసి, ఏనుగు కథ ల మాట వచ్చింది. ఈ ఎల్మర్ కథ (లు) ఎంతో బావుంటాయి. తెలుగు లో ఈ ఎల్మర్ కథని చెప్తే ఎలా వుంటుందో చూడాలని నాకనిపించింది.
ఎల్మర్ ఒక పాచ్ వర్క్ ఏనుగు. అది ఇలా వుంటుందన్నమాట. పాచ్ వర్క్ అంటే తెలుసా ? రంగు రంగుల నలు చదరాలు కలిపి బొంత లాగా కుట్టే ఒక సాంప్రదాయం చలి దేశాల్లో ఉంది. వీట్ని క్విల్ట్ లాగా కుట్టుకుని గానీ, బట్టలు కుట్టుకోవడానికి గానీ తయారు చేసుకుంటారు. సో ఈ ఎల్మర్ ఇలా వుంటాడు.
హ్మ్మ్.. ఇప్పుడు ఈ ఎల్మరుడు ఇలా రంగు రంగుల తో వున్నాడు. వీడిది నిజమైన ఏనుగులుండే నలుపెక్కిన ఊదా రంగు వొంటి రంగు కాదు. కానీ ఈ రంగు రంగుల ఎల్మర్ చాలా ఆశావాది, చాలా పరోపకారి, చాలా మంచి వాడు, ఎప్పుడు సరదాగా హాయిగా వుంటూంటాడు. ఎల్మర్ అంటే మిగిలిన ఏనుగులందరికీ చాలా ఇష్టం. ఎల్మర్ కీ మిగిలిన అందరు ఏనుగులూ, ఇతర జంతువులూ, పులులూ, సింహాలూ, జిరాఫీ లూ, కోతులూ, మొసళ్ళూ ఆఖరికి చేపలూ, పిట్టలూ కూడా చాలా ఇష్టం, అందరీ వీడికి స్నేహితులే. ఎప్పుడూ ఒక్కడూ చక చకా తన స్నేహితులతో కలుస్తూ తిరుగుతూ, హాయిగా సంతోషంగా వుంటూ ఉంటాడు.
ఓ సారి ఎల్మర్ కి తను మిగిలిన ఏనుగుల కన్నా డిఫరెంట్ (తేడా!) అని స్పృహ వస్తుంది. 'అయ్యో 'నేను ఎందుకు ఇలా వున్నాను ? (With Patchwork and all ?!) మిగిలిన వాళ్ళ లా లేనూ.. వాళ్ళలో నేనూ ఒకడిలా కలిసిపోవాలీ అంటే నా వొంటికి ఊదా రంగు వేసుకోవాలి' అనుకుంటాడు. తీరా ఊదా రంగు వేసుకుని, తన రంగు రంగుల చర్మాన్ని దాచుకుని మిగిలిన ఏనుగుల దగ్గరికి వెళితే అవి వీణ్ణి గుర్తు పట్టవు. గుర్తు పట్టక పోగా ఎవడో కొత్త వాడు వచ్చాడని దూరం పెడతాయి. ఎల్మర్ కి బాధ అనిపిస్తుంది. నేను వీళ్ళలో కల్సిపోవడానికి వస్తే ఇలా దూరం పెడతారేంటబ్బా అనుకుంటాడు. కానీ అదృష్టవశాతూ వర్షం కురిసి, వాడి వొంటి మీద పెయింట్ పోయి, అసలు (రంగు) రంగులు బయటపడతాయి.
అప్పుడు ఏనుగుల్లో పెద్ద వాళ్ళు - " అరే నువ్వా ఎల్మర్ ? ఇలా ఎందుకు మేక్ అప్ వేసుకున్నావ్ ?" అని అడుగుతాయి. వీడు కారణం చెప్పేసరికీ నవ్వి ఓ నాలుగు చీవాట్లు కూడా వేస్తాయి. "పిచ్చి ఎల్మర్... నువ్వు మాకన్న కొంచెం డిఫరెంట్ గా ఉన్నావు సరే. అదే నీ స్పెషాలిటీ. నీ యూనిక్ నెస్ ని కోల్పోయి అందరి లో ఒకడి లా తయారవడానికి ఎందుకు ప్రయత్నిస్తావు ? నీ రంగు రంగుల పాచ్ వర్క్ తో నువ్వు ఎంత ముద్దు గా వుంటావో తెలుసా ? నువ్వు మా స్వీట్ హార్ట్ వి. నువ్వు మాకు ఎంతో ఎక్కువ. ఇంకెప్పుడూ ఇలా 'గుంపు లో గోవింద' అయ్యేందుకు ప్రయత్నించకూ".. అని గుణ పాఠం చెప్తాయి.
ఇంకోసారి అడవి లో పెద్ద గాలీ వానా వస్తాయి. వాన వెలిసేసరికీ ఏనుగులన్నీ గుహ లో రెస్ట్ తీసుకుంటుండగా కొన్ని చిన్ని చిన్ని నీలి పిట్టలు ఎగురుకుంటూ వచ్చి ఎల్మర్ ని రమ్మంటాయి. "ఎల్మర్! చూడు! ఒక రెయిన్ బో వచ్చింది. కానీ దాన్లో రంగులు లేవు" అని కంగారు గా చెప్తాయి. ఎల్మర్ వచ్చి ఆకాశం లోకి చూస్తాడు. దూరాన రెయిన్ బో కనిపిస్తుంది. కానీ దాన్లో రంగులు ఏవీ వుండవు. వొట్టి తెల్లని ఇంద్ర ధనువు అది. వీళ్ళందరూ అయ్యో ఇప్పుడెలా అనుకుంటారు.
ఎల్మర్ పరోపకారి పాపన్న కదా. "పోన్లెండి - నా దగ్గర బోలెడు రంగులు ఉన్నాయి కదా. నేను ఈ రెయిన్ బో కి నా రంగులు ఇస్తాను. కానీ ఆ రెయిన్ బో మొదలు ఎక్కడుందో వెతకాలి. దాన్ని తాకి కదా నా రంగులు ఇవ్వాలి. . అక్కడికి వెళ్ళి నా రంగులు ఇస్తానూ" అంటాడు. అడవి అడవంతా రెయిన్ బో 'తుది', 'మొదలు' లను వెతుకుతారు. కొన్ని మొసళ్ళేమో ఎల్మర్ కి ఆ రెయిన్ బో, జల పాతం వెనక ఉందని చెప్తాయి. వెంటనే ఎల్మర్ జల పాతం దగ్గరికెళ్ళి, నీళ్ళ కింద నుండీ లోపలికి వెళ్ళిపోతాడు. తెల్లని జల ధారల వెనక్కి వెళ్ళిపోయిన ఎల్మర్ ఎంతకీ మరి బయటికి రాడూ, కనిపించడూనూ.
అడవి జంతువులు అన్నీ బయట నుంచుని భయ భ్రాంతులై చూస్తుంటాయి. అలా వాళ్ళు చూస్తుండగానే రెయిన్ బో లో కి ఏడు రంగులూ మెల్లగా వచ్చేసి, రంగుల రెయిన్ బో చక్కగా ఆకాశంలో మెరుస్తూ కనిపిస్తుంది. 'తన రంగులన్నీ ఇచ్చేసి, ఎల్మర్ మామూలు ఏనుగు లాగా నల్లగా అయిపోతుందేమో.. ఎల్మర్ ఎంత త్యాగం చేసిందీ' అని అన్ని జంతువులూ బాధ పడతాయి. కానీ ఎల్మర్ ఆ జల ధారల తెరల మాటు నుండీ బయటకి వచ్చాకా, ఎల్మర్ రంగులు ఇంకా కాంతి వంతంగా మెరుస్తూ, దాని పాచ్ వర్క్ చర్మం భద్రంగా వుంటుంది.
దీని అర్ధం ఏమిటీ అని అందరూ అడిగితే, అందరికన్నా పెద్దదయిన సింహం.. "మన దుఃఖాన్ని పంచుకుంటే అది తగ్గుతుంది, అదే సుఖాన్ని, ఆనందాన్నీ అందరితో పంచుకుంటే అది రెట్టింపవుతుందీ... అందుకే ఎల్మర్ రంగులు పోలేదు. పైగా ప్రకాశిస్తున్నాయి " అని హితవు చెప్తుంది. [Elmer and the Rainbow]
ఇలాంటి ఎల్మర్ కథలు పిల్లల కోసం ఎంతో మనో రంజకంగా బ్రిటిష్ రచైత David McKee, 1989 లో రాయడం మొదలు పెట్టారు. పుస్తక రూపం లో నైతే మొత్తం 34 కథలు. ప్రస్తుతం ఏనిమేటెడ్ వీడియోలు యూట్యూబ్ లో బోలెడు. టెలివిజన్ సిరీస్ కోసం ఇతర రచయితల్ని కూడా కలుపుకున్నారు. ఏనుగులు ఎంతో శక్తివంతమైన, తెలివైన జంతువులు. అమాయకమైనవి కూడా. పిల్లలకి ఎందుకో ఏనుగు అంటే భలే ఇష్టం. కథ ల్లో అయితే మరీనూ. అందుకే ఈ కథలు మన లో ని పిల్లలకి కూడా భలే నచ్చుతాయి.
మొత్తానికి ఎల్మర్ కథ ని నా బ్లాగ్ లో చెప్పేసి, ఇంకో నలుగురు వాళ్ళ పిల్లలకీ ఈ ఎల్మర్ కథ లు, ఈ రంగు రంగుల ఆశావహమైన, అమాయకమైన కథలు చెప్తారని నా ఆశ పడతాను. ఒక మంచి కథ ని చదివినంత ఆనందం, కళ్ళింత చేసుకుని, రంగు రంగుల పుస్తకం లో కి దూరి, ఆ అత్భుత ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, మన నోటి నుండీ వచ్చే ఒక్కో వాక్యమూ ఎంతో అపురూపంగా వినే పిల్లలకి ఈ కథ చెప్పడం, భలే ఆనందకరం. ఈ తృప్తి కి ఏదీ సాటి రాదు. అదీ ఎల్మర్ కథ.
Notes :
Elmer Story Books -
https://www.waterstones.com/booklist/319791/elmer-the-elephant
David McKee
Views : https://www.theguardian.com/lifeandstyle/2014/jul/12/25-years-elmer-elephant-david-mckee