ఇది స్లో గా మొదలయ్యి.. సమాజపు కుత్సితాన్ని ఎండగడుతూ, దుర్భాగ్యుల దైనందిన జీవితం లో ఓ రెండ్రోజుల ని అత్భుతం గా అల్లి షాకు ల మీద షాకులిస్తూ – దర్శకుడు పచ్చిగా, నిస్సిగ్గుగా, నిష్పాక్షికంగా, నిష్పూచీగా చూపించే వ్యధా గాధల్ని – ముందు పెడుతుంది. చెప్పడానికి ఇందులో ప్రధాన పాత్రలు చిన్న పిల్లలే అయినా, కధ మాత్రం, పెద్ద వాళ్ళది.
కధ ప్రత్యేకంగా చెత్త కుండీల్లో, కుక్కలకూ, పందులకూ ఆహారంగా విడిచిపెట్టేయబడ్డ ముక్కు పచ్చలారని పసి బిడ్డల గురించి. మన దేశం లో అత్యంత సాధారణం గా జరిగే నేరాల్లో, పసి బిడ్డల్ని చంపడం / అనాధల్లా ఆస్పత్రులలో నూ, అనాధ శరణాలయాల్లోనూ విడిచిపెట్టడం వగైరా అందరికీ తెలిసిందే. కన్న బిడ్డల్ని రైళ్ళలోనూ, కుక్కలకు ఆహారంగా చెత్త కుండీల్లోనూ వదిలేయగల రాక్షసత్వం అత్యంత సాధారణం. అయితే – ఈ తల్లి కన్న బిడ్డలో అని నిట్టూర్పులు విడవడం, అలా కనబడిన పిల్లల్లో మొగ పిల్ల వాళ్ళని పెంచుకోవడం జరిగినా, ఆడ పిల్లల్ని మళ్ళా లెక్కా డొక్కా లేకుండా ప్రభుత్వ శాఖల వారు తీస్కెళ్తారులే అని వొదిలెయ్యడం కూడా సాధారణం.
ఇలాంటి ఏ తల్లి కన్న బిడ్డలో, బ్రతికి బట్ట అంటూ కడితే, ఎదిగిన తరవాత వాళ్ళేమవుతారు ? చాలా మంది ఏ రక్షణా లేక, అనారోగ్య కరమైన వాతావరణం లో పెరుగుతూ, ఆడపిల్లలైతే మరీ అన్యాయంగా ట్రాఫికింగ్ కి, మొగ పిల్లలు చిల్లర దొంగతనాలకూ మాదక ద్రవ్యాలకూ అలవాటుపడుతూ, బాల్యాన్నీ, అమాయకత్వాన్నీ కోల్పోయి, ఎవరో చేసిన పాపాలకు తప్పించుకోలేని జీవితాంతపు శిక్షకు గురవుతుంటారు.
అలాంటి తల్లి లేని బిడ్డ 'మునిసిపాలిటీ' కధ ఈ ‘థాంక్స్ మా' ! అయితే దర్శకుడు, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసి వాళ్ళ కష్టాల్ని కళ్ళకు కట్టేస్తున్న కొద్దీ, ప్రేక్షకుల గుండె జారి మనసంతా బేజారవుతు ఉంటుంది. చాలా మంది ప్రముఖ కళాకారులు, వాణిజ్య ప్రకటనల్లో తరచూ కనిపించే నటులూ, టీవీ ఆర్టిస్టులూ, కధనానికి మంచి పటుత్వాన్ని, నమ్మదగేలాంటి నటననీ, ఒక క్లాస్ నీ అందిస్తారు. ఈ కాస్టింగ్ లో ఏ మాత్రం తేడా వచ్చినా కధ లో సీరియెస్ నెస్స్ చాలా మటుకూ కనుమరుగయి ఉండేది.
రన్వీర్ షౌరీ నుంచీ అలోక్ నాథ్ వరకూ – మర్యాదస్తుల ముసుగులో దుర్మార్గపు పనులు చేసే పీడోఫైల్ లూ, వ్యభిచారుల పాత్రల్ని పోషించి, సినిమాకెంతో న్యాయం చేస్తారు. అసలు వాళ్ళ screen time ఒక పది నిముషాలు కూడా వుండదు. కానీ ఆ ముహాలు చాలు. సమాజం భ్రష్టతని చెప్పడానికి.
కధ సంగతి కొస్తే, 'మునిసిపాలిటీ', ఒక అనాధ బాలుడు. వాడి తల్లి వాణ్ణి ప్రభుత్వాస్పత్రిలో కని వొదిలేసి వెళిపోతుంది. ఊహ తెలిసిన దగ్గర్నుంచీ, తల్లి ధ్యాసే వాడికి. తనని ఎందుకో వొదిలేసి వెళిపోయినా, తల్లి తనని వెతుక్కుంటూ ఏనాటికైనా వస్తుందని రోజూ ఆ ఆస్పత్రి దగ్గరకెళ్ళి కాసేపు గడిపి వస్తూంటాడు. వాడి తోటి పిల్లలు, వాళ్ళలో ఒక ఆడ పిల్ల, అందరూ బ్రతకడానికి చిల్లర మల్లర దొంగతనాలు చేస్తుంటారు.. చిన్నపాటి గాంగు లా ఏర్పడి. ఈ అనాధ పిల్లల పరిసరాలు, దొంగలూ, నేరస్థులతో నిండి వుంటుంది.
ఐతే, ఓ సారి ఏదో గొడవ జరిగి, వాళ్ళ గుంపు లో 'మునిసిపాలిటీ' పోలీసులకి పట్టుబడతాడు. జువనైల్ కోర్టు లో బాలల హోం లో వుంచాల్సింది గా తీర్పొస్తుంది. అక్కడికెళ్ళిన రోజే, ఓ పీడో ఫైల్ వార్డర్ (అలోక్ నాధ్) చేతిలో పడతాడు. ఆ నరకం నుండీ తప్పించుకునేందుకు అదే రోజు రాత్రి హోం నుండీ తప్పించుకు పారిపోతుండగా, అతను చూస్తుండగానే, మెయిన్ గేట్ లొంచీ టాక్సీ లో ఓ స్త్రీ దిగి, ద్వారం దగ్గర ఓ రెండ్రోజుల పసిగుడ్డుని విడిచిపెట్టి వెళిపోతుంది. ఆ శిశువు దగ్గరకి ఓ వీధి కుక్క వెళ్ళి తాకుతుండగా చూసి, భయపడి, ఆ పాపడిని ఎత్తుకొచ్చేస్తాడు మునిసిపాలిటీ.
అంతే – ఈ బాబు ని ఎత్తుకుని తన అడ్డా కి పారిపోతాడు. అక్కడ మిగిల్న పిల్లల కి అప్పటికే, మునిసిపాలిటీ హోం విడిచి పారిపోయాడని పోలీసులు వాయగొడ్తారు. అయితే ఈ పసి బాబు భాద్యత ని స్వీకరించే వయసూ, అనుభవమూ లేని ఆ పిల్లలు మొదట మునిసిపాలిటీ ని పిల్ల వాడ్ని వొదిలించుకోమని ఒత్తిడి చేసినా, అతని ఫీలింగ్స్ ని అర్ధం చేసుకుని తమ తో పాటూ ఉండనిస్తారు. పిల్లాడికి గేదె నుండీ పిండుకొచ్చిన పాలు (ఎత్తుకొచ్చిన) పట్టి, ప్రాణం నిలబెడతాడు మునిసిపాలిటీ. ఐతే,అదే సమయానికి నగరం లో ఓ ప్రముఖ వ్యాపారి పిల్ల వాడ్ని ఎవరో పార్కులోంచీ ఎత్తుకెళ్ళారనీ, ఆ పిల్లాడే వీడనీ వాళ్ళ పరిధి లో వాళ్ళకి ఓ సమాచారం అందుతుంది.
మునిసిపాలిటీ నిజానికి తల్లి చే పసి ప్రాయం లో విడిచిపెట్టేయబడ్డ అనాధ. కాబట్టి వాడికి ఈ బాబు తనలా కాకూడదని పంతం. వాడ్ని ఎలా ఐనా తల్లి దగ్గరకు చేరుస్తానని శపధం చేస్తాడు. వీళ్ళు అనుకున్నట్టు ఆ పిల్లవాడు వ్యాపారి తప్పిపోయిన బిడ్డ కాదు. సినిమా మలుపులు, గుండె చిక్క బెట్టలేని ఉత్కంఠా, అథెంటిసిటీ తో సాగిపోతూ పిల్లాడి అసలు తల్లి ని కలిసే దాకా నడుస్తుంది. ఐతే, ఆమె పాపం బిడ్డను ఏ పరిస్థితుల్లో వదిలేసిందీ చూస్తే నిజంగానే ప్రేక్షకుడు డీప్ షాక్ కు గురవుతాడు. సినిమా మన సమాజం లో వున్న అన్ని అవకతవకల్నీ, స్పృశిస్తుంది. వాట్ని మనం రోజు వారీ వార్తల్లో చదువుతూనే వుంటాం, గానీ అవి మనదాకా వస్తేనో ! అనే అలోచన మనకెప్పటికీ రాదు.
అలాంటి ఆలోచన రావడాన్నే మానవత్వం అంటారు. ఆ మానవత్వాన్ని ప్రేక్షకుడు అనుభూతించగలిగితే, ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. పాపభీతి, దైవ భీతి, కరుణ, దయ లాంటివేమీ లేని స్వార్ధ పర / ముసుగులేసుకున్న సమాజం లో మనకీ ఓ ముసుగుందేమో, ఆ ముసుగు వెనక ఓ తోడేలో, హైనా నో ఉందేమో తరచి చూసుకోవాల్సిన అవసరం ఎప్పటికీ ఉంది.
మృగప్రాయులైన మనుషుల మధ్య, దేవత లాంటి ఓ దొంగ, వీధి బాలుడు, అనాధ అయిన ఈ 'మునిసిపాలిటీ', జీవితం లో ఓ రెండు రోజులు ఈ సినిమా.
నాకు అర్ధం కానివీ, లాజిక్ కి అందనివీ ఎన్నో ప్రశ్నలు, సందేహాలూ ఉన్నా కూడా, వాట్ని పెద్ద పెద్ద లోపాలు అని చెప్పి సినిమాని తీసిపారేయక్కర్లేదు. ఆయా కారణాల వల్ల ఈ చిత్రానికి పెద్దగా పేరు వచ్చినట్టు లేదు. అయినా మంచి ప్రయత్నం. అందరూ, ముఖ్యంగా పిల్లలూ చాలా బాగా నటించారు. తారాగణం, చిన్న చిన్న వాళ్ళతో కలిపి ఏడ్ ల స్టార్లూ, టీవీ స్టార్లూ, చిన్న చిన్న పాత్రల్లో సందర్భోచితంగా ఒదిగిపోయి, కధ కి ప్రాణం పోసారు. ముఖ్యంగా ఆ పసివాడి తల్లి పాత్ర లో నటించిన నటి, ఇలాంటి సినిమాలు మన దేశం లో కూడా వస్తాయా ! మన వాళ్ళు ఇంత బాగా చేస్తారా ?! అని అబ్బురపోయేలా నటించింది.
దర్శకుడు ఇర్ఫాన్ కమాల్. రచయిత గా, పాటల రచయిత గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా చాలోటి ఫిలుము ఫెస్టివళ్ళలో ప్రదర్శించబడిందంట ! బయటి దేశాల వాళ్ళు చూసి తరించడానికి కావల్సినంత దౌర్భాగ్యం సినిమాలో కుక్కి వదిలారనిపించింది. కాకపోతే, దీన్లో సినిమా తప్పేమీ లేదు. మన దేశం లో కూడా పరిస్థితులు అంత ఘోరంగానూ ఉన్నాయి. తమిళ దర్శకుల అతి ఒరిజినాలిటీ చూసి ఎంత విసుగేస్తుందో అలా అనిపించింది కొన్ని చోట్ల - కానీ ఏమీ చెయ్యలేం. సన్నివేశాలు డిమాండ్ చేసాయి కాబట్టి, సత్యం నగ్నం గా మన ముందు నిలబడుతుంది. అదో అథెంటిసిటీ ! అదో కళ.
మన సమాజం లో ఉన్న అనేకానేక రుగ్మతల్లో ఇదో రుగ్మత ! నైతికత గురించి ఎన్నైనా ప్రసంగాలివ్వొచ్చు. కానీ మానవత్వం ఒకరు నేర్పేది కాదు. ఆ అనుభూతినే మర్చిపోయిన సమాజానికి ఓ చెంప పెట్టు ఈ "థాంక్స్ మా" !