Pages

02/11/2011

అల్లం మురబ్బా

నేను హైదరాబాద్ లో అయిదు సంవత్సరాలుగా వుంటున్నాం. నేను ఆఫీసు కెళ్ళే దారంతా కనీసం 10స్కూళ్ళున్నట్టున్నాయి. పొద్దున్నే బయల్దేరితే, ఎదురింట్లో మరాఠీ కుటుంబం లో ముగ్గురు పిల్లలూ, మా వాచ్ మాన్ పిల్లల్తో కలిపి మొదలవుతుంది పిల్లల పచ్చ పువ్వుల మేళా. ఆఫీసు అరణ్యం చేరేదాకా, బంతులూ, చామంతులూ, ముద్దబంతులూ, కమలాలూ, నంది వర్ధనాలూ, పెద్దవాళ్ళు వెంటరాగా తరలే పారిజాతాలూ, ఇప్ప పూలూ అన్నీ; బస్సులూ, వాన్లూ, ఆటోలూ, మోటారు సైకిళ్ళూ, కార్లూ.. ఏ బండి చూసినా పిల్లలే. మొన్నామధ్య తెలంగాణా బందయినపుడు ఈ పిల్లల్ని చాలా మిస్ అయాను. శని ఆది వారాలు వాళ్ళ మీద బెంగెట్టుకుందేమో అన్నట్టుండే రోడ్డంతా, సోమవారం కొత్త ఉత్సాహంతో కళకళలాడుతుంది. యూనిఫారాల తళతళని పక్కన పెడితే, ఇంజనీరింగ్ పిల్లలూ, చక్కని పొడుగు జళ్ళూ, భుజాలకి వేలాడే బాగులూ వాళ్ళ శివారు కాలేజీల బస్సులూ.. అంతా సందడే సండడి.

ఇంత సందళ్ళో ఒక బేసిన్ లో అల్లం మురబ్బా చెక్కల్ని ఒద్దిగ్గా సర్దుకుని మా వీధి మొదట్లో ఎదురు పడతాడో అబ్బి. కానీ బేసిన్ మీద ఒక మూత వుండదు. దాన్లో అల్లం మురబ్బా చెక్కీలు నోరూరిస్తుంటాయి. అల్లం మురబ్బా నాకు చిన్నప్పుడు పరిచయం. మా నాన్న గారు కాంపుకని హైదరాబాదు వెళ్ళినప్పుడు తెచ్చేవాళ్ళు. బ్రష్ చేసాక చలికాలం తినమని ఇచ్చేవారు. అప్పట్లో అది కారం అనిపించి అస్సలు దాని జోలికి పోయేదాన్ని కాదు. కానీ చిన్నప్పుడు మాత్రం అల్లం మురబ్బా హైద్రాబాదు లోనే దొరుకుతుందని ఒక (అప)ప్రధ ఏర్పడింది. [అంటే హైదరాబాదు లో కూడా సరిగ్గా దొరకడంలేదని నా సూచన].


పాత కాలం నవలల్లో, మల్లిక్ కార్టూన్లలో, అమ్మాయీ, అబ్బాయీ పార్కు లో కూచుని గుట్టుగా ముచ్చట్లాడుకుంటూంటే, కధ హైద్రాబాదు లో జరిగితే మాత్రం అల్లం మురబ్బా అమ్మే అబ్బాయొస్తాడు. వైజాగ్ బీచీ లో మాకెప్పుడూ మురీ మిక్ష్చర్ (పిడత కింది పప్పు లాంటిది) అబ్బాయి తప్ప ఎవరూ డిస్టర్బ్ చెయ్యడం తెలీదు. మహా అయితే, టీ అమ్మే కుర్రాడు రావచ్చు. :)


పెద్దయ్యాక అప్పుడప్పుడూ దొరికే అల్లం మురబ్బా భలే ఇష్టమయ్యింది. కానీ వెధవది. హైద్రాబాదు లో స్ట్రీట్ ఫుడ్ కి, లోకల్ టాలెంట్ కీ విలువ లేదు. ఎంతసేపూ హైద్రబాదు బిర్యానీ కి ప్రసిద్ధి అనీ, హలీము కి ప్రసిద్ధి అనీ పెద్ద యెత్తున వ్యాపారం చేస్తుంటారు గానీ, ఎక్కడైనా అల్లం మురబ్బా కనీసం మిఠాయి దుకాణాల్లోనన్నా అమ్మే సౌలభ్యం వుందా ? నేను తిరిగిన ప్రదేశాల్లో లేదు. ఇలాంటివి కొట్లలో అమ్మరుట. లోకల్ ట్రైన్ లలో, రైల్వే స్టేషన్ పక్కన సాయంత్రం బజార్లలో అమ్ముతారంట.


ఇంతకీ మా వీధి లో పొద్దున్న వేళ నేను వెళ్ళేటప్పుడు ఆ హడావిడి లో వీధి చివర్న కనిపించేవాడు ఈ అల్లం మురబ్బా ఆసామి. మనిషి బాగా బీద వాడు. వృద్ధుడు. కానీ ఆ బేసిన్ లో మురబ్బ్బా ఎలా కొనడం. దాని మీద మూత లేదు. అతని లో 'సెల్లింగ్ ఎపీల్' లేదు. ఎన్నాళ్ళో అతని దగ్గర 'డర్టీ' మురబ్బా కొనడానికి ధైర్యం చాలక ఆయన కనిపించినప్పుడల్లా నిట్టూర్చుతూ ముందుకు సాగిపోయేదాన్ని.

కానీ ఒకరోజు ధైర్యం చేసి ఒక నాలుగు చిన్న చెక్కీలు కొనాను. నేను బండి ఆపి కొనడం చూసి, దారెమ్మట పోతున్న నాలుగయిదు జంటలు ఉత్సాహంగా కొన్నారు. ఆఫీసుకెళ్ళాక ఆ కొద్ది మొత్తమూ నలుగురితో షేర్ చేసుకున్నా. వాళ్ళందరూ నార్థ్ ఇండియన్లు. వాళ్ళ జీవితం లో ఇంత మధురమైన మురబ్బా (వాళ్ళ ఉసిరి మురబ్బా మహా మధురం. అంత తీపి నేను భరించలేను లెండి) ఎప్పుడూ రుచి చూసి ఉండరు.

వాళ్ళు వెంటనే నా వెంటపడ్డారు. ఇది ఏంటి ? ఎంత బావుందో .. మాకు కావాలి. ఒక్కొక్కరికీ కిలో లెక్కన కావాలి ట.. వగైరా డిమాండులతో ఉక్కిరి బిక్కిరి చేసేరు. మరేం చెప్పను నా బాధ. అది ఎక్కడ దొరుకుతుందో, ఎలా దొరుకుతుందో తెలీదు. నా ఖర్మ కాలి ఆ రోజు నించీ, ఆ అల్లం మురబ్బ ఆసామీ కూడా ఎదురు పడటం లేదు. పడినా ఆ డర్టీ మురబ్బా (మూతలేనందున మాత్రమే) కొనాలా ?

ఈ చింతాకాంత నాతో ప్రేమలో పడ్డాక, ఇంక ఎంత సేపూ మురబ్బా ఆలోచన్లే. ఇంత మంచి పదార్ధాన్ని జనం ఎందుకు మార్కెట్ చెయ్యరు ? బహుశా, చక్కెరా, అల్లం రెండూ కాస్ట్లీ కావడం వల్లేమో. కారంగా తియ్యగా, తింటూంటే గొంతులోకి జారుతూండే అల్లం రుచి - భలే గా - దాన్ని వర్ణించలేం. చలికాలం లో గొంతుకి మంచిది. (నా పెర్సనల్ రికమండేషన్ ఇంకోటి - హోం రెసిపీ - తమలపాకు ని తేనెలో ముంచుకుని తినడం - అబ్బ!)


మా చిన్నప్పుడు ఊర్లోకి ఒక కొబ్బరి మిఠాయి అమ్మే కోమటాయన వచ్చేవాడు. ఆయన పెద్దగా చదువుకోలేదు. తెల్ల షర్టూ, ఖాకీ నిక్కరూ, నెత్తి మీద కొబ్బరి మిఠాయి పళ్ళెం, దాని మీద సొంపైన కాటన్ వస్త్రమూ... ఆయన పిల్లల పేర్న ఎక్కాలు చెప్పేవాడు. పిల్లలం ఆయన్ని పట్తుకుని చుట్టు ముట్టి, ఎక్కాలు చెప్పించుకునే వాళ్ళం. ఉదా : నా పేరు మీద ఎక్కం చెప్పమంటే 'సుజాత ఒకట్లు సుజాత', 'సుజాత రెళ్ళు గిజాత', 'సుజాత మూళ్ళు అరవయ్యారు', 'సుజాత నాలుగుల నలభయ్యారు'.. అని ఏవో పిచ్చి లెక్కలు చెప్పేవాడు. వాటిల్లో Rhyme వుండేది అన్నమాట. రిక్షా చార్జీలు మా ఇంటి నుండీ ఏటొడ్డునున్న శివాలయానికి అయిదు రూపాయలుండే రోజులుండీ చూసిన మా కొబ్బరి మిఠాయి అమ్మే ఆయన, చార్జీలు పది రూపాయలయ్యే వరకూ కనిపించేవాడు. ఆ తరవాత ఏమయిపోయాడో తెలీలేదు. అప్పుడు పెద్ద సెంటిమెంటల్ గా ఆలోచించలేదు. ఎందుకంటే మా నానమ్మ అతని కంటే ఘనమైన కొబ్బరి మిఠాయి ఇంట్లోనే చేసి పెట్టేది. [అప్పట్లో ఇంట్లో చేసి మాత్రమే పెట్టేవాళ్ళు తినుబండారాలు కూడా]. మా నానమ్మకి ఈ 'జింజర్ బ్రిట్టిల్' గురించి తెలిసుంటే తప్పకుండా చేసిపెట్టేది. నేను ఎక్కడన్నా రెసిపీ చదువుతాను. చేసే టేలెంటు లేదు. కాబట్టి నిట్టూర్పులు తప్పలేదు.


ఇంతకీ హైద్రాబాదు లో అల్లం మురబ్బా ఒక కిలో స్వచ్చమైనదీ, శుభ్రమైన పరిసరాల్లో తయారు చేసిందీ ఎక్కడ సంపాయించడం ? ఇక్కడ ఫలానా బేకరీ లో శ్రేష్ఠమైన రమ్ము పోసి బ్రహ్మాండమైన కేకులు తయారు చేస్తారనీ, ఫలానా చోట మాంచి ఫాలూదా దొరుకుతుందనీ, ఇంకో చోట చాట్ బావుంటుందనీ రివ్యూలు రాసే ప్రాంతీయ వార్తా పత్రికల్లో కూడా అల్లం మురబ్బా మెన్షను ఎక్కడా కనబడ్లేదు. బహుశా అల్లానికీ, చక్కెరకీ వెల చెల్లించలేక ఆర్ధిక మాంద్యం ఓ పక్క పీక నొక్కేస్తుంటే, పెనుగులాడుతూ, జనాల ప్రోత్సాహం తగ్గిపోయి ఎక్కడో బిజీగా వుండుంటాడు 'ద ఫేమస్ హైద్రాబాదీ అల్లం మురబ్బా' వ్యాపారి.