Pages

05/06/2011

Eat Pray Friendship

మెనీ థాంక్స్ టు ఫేస్ బుక్. అంతగా ఫేస్ బుక్ ని లైక్ చెయ్యని నేను ఈ మధ్యే - మా కజిన్స్ ఒక గ్రూప్ స్థాపించబట్టి, వాళ్ళ కబుర్లు తెలుస్తాయని ఒక మార్గదర్శి ఎకౌంట్ తెరుచుకున్నా. ఆ మార్గదర్శి దారి చూపించి, ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళకి నా ప్రియ సఖి, చైల్డ్ హుడ్ ఫ్రెండ్, లోకంలో నన్ను నేనెలా వున్నా సరే - 'చాలా బావున్నావంటూ' స్పెషల్ గా చూసే స్పెషల్ ఫ్రెండ్ ని వెతికిపెట్టింది.

ఈ రోజు చాలా హాపీ. దాదాపు 5 సంవత్సరాలయింది మేము కలుసుకుని. వచ్చేనెల లో కలవాలని ప్లాన్ చేసుకున్నాం. పెళ్ళిళ్ళు జరిగాయి.. పిల్లలు పుట్టారు. కొత్త సంగతులు. కొత్త అనుభూతులు.. కొత్త చాలెంజులు, మారిన బాధ్యతలూ, ప్రయారిటీలూ. జీవితంలో ఒక చోట పెట్టిన ఫుల్ల్ స్టాప్ నుంచీ కొత్త వాక్యం రాసినట్టు అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడే, 'శిరుత నవ్వుల వాడె సిన్నక్కా ..' కు అర్ధం విడమరచి చెప్పిన నా ఫ్రెండ్ ! నాతో పాటూ నా తరహా లో ఆలోచిస్తుందో లేదో గానీ (ఇపుడు) నన్ను ఒక్క పదం తో అర్ధం చేసుకోగలదు.

ఈ మధ్యే ఈట్ ప్రే లవ్ చదివాను. దాన్లో హీరోయిన్ లవ్ లో ఫెయిలయి.. డిప్రషన్ కి లోనవుతుంది. తరవాత ఇండియా వచ్చి ఆధ్యాత్మికత లో పడిపోతుంది. ఈ విదేశీయుల కు భారతీయ చింతన, ఆధ్యాత్మికత మీద ఇంటరెస్ట్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

జెనీవా లో చూసా ! టూరిసం ఆపరేటర్ ఆఫీసులో ధర్మశాల (ఇండియా) ఫోటోలు (మనం స్విజ్జర్లాండు, యూరోపుల అందమైన ఫోటోలు పెట్టి ఎలా కొత్త కస్టమర్లని ఆకర్షించాలని చూస్తామో అలా) గోడలపై పెద్ద పెద్దవి వేలాడేశారు. టాక్సీ డ్రైవర్లు సంతూర్, సితార్ ల వాద్యాన్ని వినిపిస్తున్నారు.

'ఈట్ ప్రే.. ' చదివాకా ఆధ్యాత్మికత మీదికి గాలి అయితే మళ్ళలేదు గానీ - ఎన్నో యోగి ఆత్మకధలు చదివినా కలగని క్యూరియాసిటీ - ఇక్కడ ఇండియా లో ఆశ్రమాల లో ఈ ఫారినర్స్ కి యోగా ధ్యానం వగైరాలు నేర్పించడానికి ఎంతెంత చార్జ్ చేస్తారో ! నా బుర్ర చాలా కమర్షియల్ ! అసలు కష్టపడే తత్వం లేదు గానీ ఉండుంటే, ఏ రీటైల్ దుకాణమో పెట్టి, పెద్ద వ్యాపారం చేసేద్దును.

చిన్నప్పుడు మనలో ఎంతో మంది రేడియోలో ఆర్.జే ల గొంతు విని వాళ్ళని (గొంతుల్ని) అభిమానించేవాళ్ళం గుర్తుందా.. మా ఆఫీసు లో అలాంటి ఒకావిడ నాకు తెలుసు. తన పేరు సంజన, సంజన నుంచి ఫోన్ (అఫీషియల్ మాత్రమే) వస్తే నాకు భలే ఆనందం. అంటే, ఆవిణ్ణి నేను ప్రత్యక్షంగా ఎప్పుడూ కలుసుకోలేదు. ఆవిడ మావ్ (Mhow), మధ్య ప్రదేశ్ లో వుంటారు. చాలా పట్టు బట్టి సంజన ఫోటో తెప్పించుకున్నాను. పెద్దావిడ. అయినా గొంతు ఎంత లవ్లీనో ! మన గోదావరి హీరోయిన్ సునీత (గొంతు - సునీత డబ్బింగ్ చెప్పిన చాలా సినిమాలకి నాకు సునీతే హీరోయిన్) కన్నా ఎంతో బావుంటుంది ఆవిడ గొంతు.

ఈ మధ్యే సంజన గారి అబ్బాయి ఎన్.డీ.ఏ లో చేరాడు. చాలా హాపీ. మా పాత బాస్ కొడుక్కి పెళ్ళయింది. నేను ఈట్ ప్రే.. చదివాను. ఈ మధ్య చాలా అత్భుతాలు జరిగాయి. నా పాత ఫ్రెండ్స్, రూం మేట్స్ అందరూ ఏమిటో రాశిఫలాల్లో చెప్పినట్టే, నన్ను వెతుక్కునేసె, నా ఫోన్ నెంబర్ కనుక్కునేసి పలకరించారు. ఈ నెల లో చాలా మంది పాత స్నేహితుల్నీ, మా గాంగ్ ఆఫ్ ఫోర్ లో ఒక ఇద్దర్నీ కలుసుకునే మహా భాగ్యం కలగబోతోంది. కొంచెం ఉత్సాహంగా వుంది. ఎన్నాళ్ళో ఎండలు వేపుకు తిన్నాక, చల్లని వర్షం కురిసినట్టు హాయిగా వుంది. చాలా సార్లు నా ఫ్రెండ్స్ ని తలచుకుని చాలా ఆనందిస్తుంటాను. నాకు అన్ని వయసుల వాళ్ళతో స్నేహం చేసేంత గొప్ప మనసు లేదు గానీ, కొన్ని స్నేహాలు, ఇలా ఏ ఱుతు పవనాల్లాగానో అప్పుడప్పుడూ తాకి వెళ్తుంటాయి. అన్నట్టు 'రు'తు పవనాల్ని ఎలా రాస్తారు ? 'బండి-ర' రాస్తారా ? 'ర' లా పలికే 'బ' లాంటి ఒక అక్షరం వుండాలేమో కదా మన తెలుగులో - అదేంటి ? మర్చిపోయాను.