Pages

26/07/2010

జ్ఞాపకాల గజిబిజి

1) మార్క్ ట్వైన్ రాసిన 'ప్రిన్స్ ఎండ్ ద పాపర్' - అయితే ఇంగ్లీషు ఒరిజినల్ గానీ లేదా మన నండూరి వారి 'రాజు - పేద' అనే తెలుగు అనువాదం గానీ చాలా మంది పెద్ద పిల్లకాయల దగ్గర వుండొచ్చు. ఇదే సబ్జెక్టుతో అప్పుడెప్పుడో, మా టీవీ లో ఒక సినిమా చూసాను. బహుశా ఆ సినిమా పేరు కూడా రాజు-పేద నే అనుకుంటాను. ఇందులో బీద అబ్బాయి (టాం కాంటీ) తండ్రి (జాన్ కాంటీ) పాత్ర లో నూనుగు మీసాల 'ఎన్ టీ ఆర్' నటించారు. 'ఎన్ టీ ఆర్' ని ఇలా నెగటివ్ పాత్ర లో చూసి ఆశ్చర్య పోయానపుడు. బహుశా ఆయన కెరీర్ మొదట్లో చేసిన సినిమా అయి ఉండొచ్చు. దురదృష్టవశాత్తూ ఆ రోజు కేబుల్ వాళ్ళకు పోయిందో, మాకు పోయిందో గానీ కరెంటు పోయి సినిమా చూడ్డం జరగలేదు. ఆ సినిమా ఏమిటి ? మళ్ళీ చూడాలంటే ఎలా ? ఆ సినిమా మళ్ళా ఎప్పుడూ టీ.వీ.లో ప్రసారం అయినట్టు లేదు. ఏమి సాధనం ?

2) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, శ్రీమతి వేదవతీ ప్రభాకర్, శ్రీమతి చాయాదేవి పాడిన ఒక మాంచ్హి భజన వుంది. టీ.టీ.డీ వాళ్ళు ఎప్పుడో నా చిన్నప్పుడు విడుదల చేసిన, పేరు మర్చిపోయిన ఒకానొక కేసెట్లో మా ఇంట్లో ఉండేది. ఆ కేసెట్టు అరగ్గొట్టాకా, టేపు పాడయ్యి, మిగతా కేసెట్ల సంత లో కలిసిపోయాకా, మళ్ళా ఆ భజన దొరకనేలేదంటే నమ్మండి.

ఆ భజన మొదటి లైన్లు

''కమలా వల్లభ - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా

యశోదబాలా - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా

భక్త మనోహర - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా ''

ఇలా మూడు చరణాల లాంటివి - ఇంటర్నెట్టు వచ్చాకా వెతుకుతూనే వున్నాను. ఎక్కడో ఏ మహానుభావులో దాచి ఉంచి వుంటారుగా అని ! నా బావి పరిధుల్లో ఈ పని కాలేదు. ఎప్పటికైనా ఈ భజనను ఎలా అయినా సంపాదించి వినాలని చాలా ఆశ పడుతున్నాను.

అందుకే నా humble request ఏంటంటే : పై రెండు ప్రశ్నలకీ సమాధానం తెలిసిన స్నేహితులు దయచేసి నన్ను గైడ్ చెయ్యగలరు !

25/07/2010

In My Father's Court



ఇది ఒక Memoir. ఒక ఆటో బాలాగ్రఫీ. అసలిలాంటి పుస్తకాలు చదివినప్పుడు - ఏదో అత్భుత లోకాల్లోకి మనమూ బాలలమై విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పట్లాగే నా పరిశీలన ప్రకారం ఈ బాలాగ్రఫీలకే సాహిత్యంలో మంచి గుర్తింపూ, ఆరాధనా లబించింది. బాలాగ్రఫీ అంటే మరేం లేదు. ఆయా ప్రముఖ రచయితలు (ఇస్తాన్ బుల్ లాగా, నేనింతకు ముందు రాసిన ఏంజెలాస్ ఏషెస్ లాగా) తమ చిన్నతనంలో తామెదుర్కొన్న కష్టాల్నీ, కన్నీళ్ళనూ కమనీయంగా గుర్తుచేసుకుని, వాటిని మనతో పంచుకునే సొంత కధ(లు).

వెధవది ఎప్పుడూ కష్టాలేనా అని అనుకోనక్ఖర్లేదు. యూరోపియన్ లేదా ఆంగ్ల సాహిత్యంలో తరచూ కనిపించే యుద్ధం (మొదటిదీ, రెండోదీ) మనన్ని ఒక్కో సారి విసుగెత్తించినా, ఈ తరం పిల్లలు ఎంత ఆనందకరమైన కాలంలో పుట్టారో, (అంతెందుకు ? మనం కూడా!) ఒక్క సారి గుర్తుచేసుకో బుద్ధవుతుంది.

అయితే ఈ చెప్పబోయేది యుద్ధ కధ కాదు. యుద్ధం కన్నా ముందు వార్సా (Warsaw) లో ఒక రబ్బై (Rabbi) గారబ్బాయి చెప్పుకున్న ఒక చిన్నఆత్మ కధ. రచైత పేరు ఇసాక్ బాషెవిస్ సింగర్ (Isaac Bashevis Singer). ఈ పుస్తకం ఒరిజినల్గా యిద్దిష్ లో 'బెథ్ డిన్' అనే పేరుతో ప్రచురించబడింది. ఇదో చిన్న చిన్న వ్యాసాల సంకలనం. ఈ వ్యాసాలు అప్పటి వార్తా పత్రికల్లో సీరియల్గానూ, పలు సందర్భాలలో ప్రత్యేకంగానూ అచ్చయ్యాయిట. వీటిని క్రోడీకరించి, మొత్తం కధనంతటినీ గుది గుచ్చి (ముత్యాల సరాల్లాగా) ఒక పుస్తకరూపం ఇద్దామని సంకల్పించి సింగర్ ఈ బెథ్ డిన్ ని రాయడం జరిగింది. ఈయన ప్రముఖ రచయిత. నోబుల్ గ్రహీత. అందుకేనేమో, ఈ పుస్తకం ముందుమాటలో - ఈ రచనలో తన శైలి కన్నా భిన్నంగా రాసినట్టు అనిపిస్తుందనీ, తన చిన్నతనం నుంచే కామోసు ఈ జ్ఞాపకాలని గురించి ఇలా రాద్దామని అనుకుంటున్నాననీ చెప్పుకుంటాడు. ఈ బెథ్ డిన్ కు ఆంగ్ల అనువాదమే 'ఇన్ మై ఫాదర్స్ కోర్ట్'.

1966 లో మొదటిసారి అచ్చయిన ఈ పుస్తకం పురాతన జ్యూయిష్ సాంప్రదాయమైన 'బెథ్ డిన్' (Beth Din) ని గుర్తు చేస్తూ నడుస్తుంది. జూదులలో రబ్బై ది సామాజికంగా, (ఎలానూ మతపరంగా కూడా) ఒక విశిష్ఠ స్థానం. ఈ రబ్బై చెప్పిందే వేదం అని కాకుండా, మతం పట్లా, దేవుడి పట్లా, పాప పుణ్యాల పట్లా విశ్వాసులైన యూదు మతస్థులు ఎంతో పవిత్రంగా ఆయన ఆశ్రయంలోకి వస్తూ ఉంటారు. జీవితం లో సమస్యలనెదుర్కొంటున్నవారూ, సలహా కావలసిన వారూ, న్యాయపరమైన, మతపరమైన వ్యాజ్యాల పరిష్కారం కోసం వచ్చే వారూ - ఇలా రబ్బైని ఆ యూదు సమాజం నమ్ముకుంటుంది. ఈ మతగురువు వారికి న్యాయ బద్ధంగా, మతపరంగా వివిధ చట్టాల ప్రకారం, ధర్మ గ్రంధాల ప్రకారం తగిన సూచనలు ఇస్తూ ఉంటాడు. కేవలం ఆయనమీదా, దేవుని మీదా, గౌరవం గలవారే ఈ వ్యవస్థ ప్రకారం ఆయా తీర్పుల్ని సమ్మతిస్తూ, నడుచుకుంటారు. ఎవరికి సమ్మతం లేకపోయినా, ఆ తీర్పు కి విలువ వుండదు కదా. అయితే ఇప్పుడీ ప్రాక్టీస్ యూదులలో లేదుట. రచయిత వివరించిన దాని ప్రకారం.. ఇది ప్రాచీన కాలాల నాటిది. రాజకీయ సామాజిక అధికార అంచె పోటీలలో జ్యూయిష్ సమాజం చిక్కుకుపోక మునుపు మాట.

ఇసాక్ తండ్రి, తాతలు వార్సా (Warsaw, Poland) లో తరాలుగా రబ్బైలు. తల్లి కూడా ఒక ప్రముఖ రబ్బై కుమార్తె. ఇసాక్ బాల్యమంతా తండ్రి, తల్లి ల అమ్మాయకపు ప్రేమ, మత విశ్వాసం వగైరాలతో వార్సా లో నెంబర్ టెన్, క్రొచ్ మల్నా వీధి లో నిక్షేపంగా గడుస్తూంటుంది. యుద్ధపు నీలి నీడలు వార్సా లో పడలేదింకా ! (ఈ సింగర్ కుటుంబం యుద్ధం నేపధ్యంలో ఎన్నో యూదు కుటుంబాలలానే అమెరికా వలస వెళ్తుంది)

ఇన్ మై ఫాథర్స్ కోర్టు లో ఈ క్రోచ్ మాల్నా వీధి లో దగ్గర దగ్గర గా కాపురం ఉండే అందరి కధలూ ఇసాక్ కళ్ళతో, మనసుతో చదవచ్చు, చూడొచ్చు. మూఢ మత విశ్వాసం, అంధ విశ్వాసం, పేదరికం, నిజాయితీ, దేవుడి పట్ల నమ్మకం, ఇప్పుడు మనం మర్చిపోతున్న నైతికత, పాపభీతి - వగైరాలన్నీ వివిధ చిన్న చిన్న కధల్లో తెలుసుకోవచ్చు.

మచ్చుకి : ఇసాక్ తండ్రి రబ్బై కాబట్టి, ఇంట్లో ఆయన ఆదివారం ప్రార్ధనలు, పెళ్ళిళ్ళూ వగైరా నిర్వహిస్తూ ఉంటాడు. ఇదే ఆయన చెప్పే 'ఫాధర్స్ కోర్టు'. ఇదే ప్రార్ధనా మందిరం, ఇదే ఇల్లు, ఇదే న్యాయ స్థానం. వారం వారం జరిగే సబ్బాత్ మాత్రమే కాకుండా ఊర్లో జరిగే శుభ కార్యాలన్నింటికీ ఇదే వేదిక. ఏ వేడుక అయినా కుటుంబ సభ్యులకు విపరీతమైన పని. వంట, వడ్డనా, శుభ్రం చేసుకోవడం, వగైరా. కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలకీ, వ్యవహారాలకీ సాయం అందిస్తూ ఉంటారు. ఒకసారి సబ్బాత్ తరవాత ఇంట్లో వాళ్ళంతా ఒళ్ళెరగక నిద్రపోతారు. ఇసాక్ తండ్రి స్నేహితుడొకడు, ఆ అర్ధరాత్రి ఏదో పనుండి పొరిగూరికి ప్రయాణమౌతాడు. సబ్బాత్ సందర్భంగా వెలిగించిన కేండిల్స్ లో ఒకదానివల్ల మంటలు చెలరేగుతాయి. ఆ ఇంట్లో వెచ్చగా రజాయిల మధ్య పడుకున్న కుటుంబానికి ఈ సంగతే తెలీదు. పై అంతస్థు అంటుకున్న విషయం ఆ చీకట్లో కనిపెట్టిన స్నేహితుడు అర్ధరాత్రి తలుపులు బాది కుటుంబాన్ని మేల్కొలిపేదాకా ! అలా మృత్యువును అంత దగ్గర నుంచీ చూసిన ఆ కుటుంబం స్నేహితుని సాయంతో ప్రాణాలతో బయటపడడం ఒక మర్చిపోలేని సంఘటన.

ఇంకోటి : ఆ ఇంటికొచ్చే ముసలి చాకలామె. పండు ముసలిదైన ఆ చాకలామెకు మాట మీద నిలబడ్డం అంటే నమ్మకం. వొంగిపోయిన వీపు మీద బట్టల మూట పట్టుకెళ్తూ వుంతుంది. పోనీ ముసలామెకు పని ఇవ్వకూడదనుకుంటే, ఆ పని ఒక్కటే ఆమెకు ఆధారం. (ఆ రోజుల్లో కూడా) ముసలామెను కొడుకులు చూడరు. తన కాయకష్టం మీదే బ్రతకాలి. ఒక సారి ఆ ముసలామె ఎన్నాళ్ళకూ రాదు. ఆమె కోసం అంతా ఎదురు చూస్తుంటారు. వార్సాలో చాకలాళ్ళుంటుండే పేటకు వెళ్ళి ఆమె గురించి ఆరా తీస్తారు. నిజానికి వాళ్ళకు ఆమె ఎక్కడ వుంటుందో తెలియదు.

ఇలా ఆసక్తి రేకెత్తించే అమాయక కధలతో పాటూ, 'బెథ్ డిన్' లో భాగంగా ఇసాక్ సింగర్ తండ్రి వద్దకొచ్చె వివిధ కేసులు, కేండిడేట్లూ - వాళ్ళ సమస్యలూ, పరిష్కారాలూ - అలలలా కదిలిస్తూ, ఏనాటి వార్సా కో మనల్ని తీస్కెళిపోతాయి. దాంతో పాటూ, జెర్మనీ లో, రష్యాలో, ఆ రోజుల్లో యూదుల జీవితం, కొంచెం చరిత్రా, ఆనాటి సమాజం తో పాటూ, బండీ మీద తిరగాలనే బాల్య చాపల్యం అన్నీ చదవచ్చు.

ఇసాక్ సింగర్ రచనా శైలి కట్టిపడేసేదే. ఈ రోజుల్లో చెప్తారే అలా ''కిందపెట్టలేనటువంటిది'' (unputdownable) కాదు గానీ ఈ 'ఇన్ మై ఫాదర్స్ కోర్ట్' మాత్రం అమాయకత్వాన్ని, నిజాయితీ ని ఇష్టపడే వాళ్ళకి వొదలకుండా, సాంతం చదవబుద్ది కలిగిస్తుంది. అందుకే ఎప్పుడన్నా దొరికితే, చదవండి.