ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర 2019 లో మొదటిసారి (ఆదినారాయణ గారి
వెర్షన్) ప్రచురితం అయింది. ఒక పాత రచనని ఇంతగా సంస్కరించి, ఈ కాలానికి
చెందిన పాఠకుడికి అర్ధం అయేందుకు చేయాల్సిన
మార్పులు చేసి, స్కెచ్ లు వేసి, ఆ కాలంలో ఆయా ప్రాంతాలు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు వీలుగా ఉండే పెయింటింగ్ లు సేకరించి అందంగా కూర్చి, చాలా శ్రద్ధగా
తీసుకొచ్చిన పుస్తకం / యాత్రా సాహిత్యం లో మైలురాయి. 2023 లో రీప్రింట్ అయింది. ఈ పుస్తకం అందరికీ అర్ధం కావడానికీ, దీనిని
ప్రచురించేందుకు రచయిత చేసిన ప్రయత్నమూ, కృషీ - చాలా
మెచ్చుకోదగ్గవి. ఎన్నో పరిచయాలు చదివి, ఎన్నో
మెచ్చుకోళ్ళు విని, ఎన్నో ఏళ్ళ తరవాత తెప్పించుకోగలిగి, చదివినందుకు
పూర్తి తృప్తి ని ఇచ్చిన పుస్తకం.
"పుస్తకం గురించి ఎన్నో వ్యాసాలు అందుబాటులో ఉన్నందున, ఈ పరిచయం
ముఖ్యంగా నాకు నేను రాసుకునే లాగ్ ఎంట్రీ కాబట్టి నచ్చిన కొన్ని విషయాలు
రాస్తున్నాను.
ఏనుగుల వీరాస్వామి (1780-1836) రాసిన కాశీయాత్రా పుస్తకం
ఆయన జీవించి ఉండగా ముద్రణ కాలేదు. మొదటిసారిగా 1839 వ సంవత్సరంలో
ఆయన ప్రాణ స్నేహితుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళ దీనిని ముద్రించాడు. 1869 లో దీన్ని
ఎలాంటి మార్పులు లేకుండా బ్రిటీషు గవన్రమెంట్ ప్రచురించింది. మూడవసారి దిగవల్లి
వెంకట శివరావు ఎడిట్ చేసి, అధ్యాయాలుగా విభజించి, వాక్యాలకి
కామాలు ఫుల్ స్టాపులు, ఫుట్ నోట్స్ ఇచ్చి 1941 లో విజయవాడ లో
ప్రచురించారు. 1973 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీషులోకి అనువదించారు.
తరవాత తెలుగు విశ్వవిద్యాలయం వారు, తరవాత ఏషియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, న్యూడిల్లీ
వారు 1991, 1992 లలో ముద్రించారు. 2014 లో రీంస్
పబ్లికేషన్స్ వారు తెలుగు అంకెల్ని మార్చి మొదటి సారి హిందూఅరబిక్ అంకెలు వేసారు.
1993 లో ఆదినారాయణ గారు ఈ కాశీ యాత్ర చరిత్ర చదివి, అది చదివేందుకు
చాలా ఇబ్బందులు పడి, దీన్ని సరళీకరించడానికి ప్రయత్నించి, పుస్తకం
వెనకున్న చరిత్రని తవ్వి తీసి, ఏనుగుల వీరాస్వామి తాను బ్రతికి ఉన్న రోజుల్లో
బ్రౌన్ కి అందచేసిన కాపీని కూడా సంపాదించి తేడాలు గుర్తించి, ఎంతో కృషి చేసి, ఇప్పుడు మనం
చదవగలుగుతున్న పుస్తకాన్ని తిరిగి రాసారు. ఇంత శ్రద్ధ, అంకితభావం, చరిత్ర పట్ల, మనుషుల మధ్య
ఉండాలిసిన గౌరవం వల్ల, ఈ పుస్తకం ఇప్పటి రూపం లో మనకి దొరుకుతుంది.
180 సంవత్సరాలుగా మార్కెట్ లో ఉన్న ఈ పుస్తకానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గలేదు.
ఆరోజుల్లో కాశీ వెళ్ళాలంటే ప్రాణం మీద ఆశవదులుకుని
చేస్తూండే సుదూర ప్రయాణాల్లో ఆత్మవిశ్వాసంతో, వీరాస్వామి
ఎంతో నాలుగువేల కిలో మీటర్లు, వందమందితో
కలిసి ప్రయాణం చేసాడు. దీనిలో గంగమీద వెయ్యి కిలోమీటర్ల పడవ ప్రయాణం కూడా ఉంది.
అతనికి ఉన్న తెగువ, ప్రతిభ, దహిర్యం, తపన, డబ్బు ఎవరికీ
లేవు. అతని ముందు ఎందరో పెద్దలు, రాజులు కాశీ ప్రయాణం చేసినా, ఇతనిలా ఆ
ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసినది ఎవరూ లేరు. పైగా భార్యతో
పాటూ తన తల్లిని కూడా ఇంత దూరం పల్లకీ యాత్రకు తీసికెళ్ళి క్షేమంగా తీసుకొచ్చాడు.
అతని ప్రయాణంలో ప్రతి ఊరూ, ప్రతి రోజు, ప్రతీ తేదీ, సమయమూ, వాగు, వంక, రోడ్డూ, డొంకా, అన్నీ రికార్డ్
అయ్యాయి. డోలీల ప్రయాణం కాబట్టి, నడవాల్సిన నేల స్వభావం, వాతావరణం, మధ్యలో
కుదుర్చుకున్న బోయీలు, మార్గంలో విడిది సౌకర్యమూ, టెంటులూ, వాటిక్కావల్సిన
పనిముట్లూ, దారంతా కొనుక్కోగల/కొనుక్కోవాల్సిన వంట ద్రవ్యాలు, పరిచయాలు, సిఫార్సు లేఖలు, ఎదురొచ్చిన
జబ్బులూ, చేతికాపుకొచ్చిన మందులు, వివిధ
ప్రాంతాలలో ఆచార వ్యవహారాలు, ముఖ్యంగా రక రకాల ప్రాంతాలలో చలామణీలో ఉన్న డబ్బు, నాణాలు, కొలతలు, కాలాలు గురించి
చక్కని సమాచారం తో, దుర్గమమైన అరణ్యాలలో ప్రయాణించి కూడా తాను తీస్కెళ్ళిన
వాళ్ళందరిని తిరిగి క్షేమంగా చెన్నపట్నం చేర్చగలగడం, దాదాపు
ప్రతిరోజు ప్రయాణం గురించీ, తన స్నేహితుడు శ్రీనివాస పిళ్ళకు క్రమం
తప్పకుండా ఉత్తరాల ను రాయడం వల్ల ఈ పుస్తకం రావడం సాధ్యపడింది.
ఎన్నో వ్యాసాలు, ఈ పుస్తకం
గురించి అందుబాటులో ఉన్నా, 180 సంవత్సరాల క్రితం, కొన్ని తెలిసిన
స్థలాల గురించి, ఆయన అబ్సర్వేషన్
నచ్చింది. ఇప్పుడు మనమూ భూలోకమే
అదిరిపోయేంతటి దేశ విదేశ యాత్రలు
చేస్తున్నాం. లక్షల రూపాయలు చెల్లించి 'చార్ ధాం' యాత్రలని మోగించి, హిమాలయాలని నాశనం చేసాం. వెళ్ళిన
ప్రదేశాలలో బాక్సులు టిక్ చేసుకోవడం, సోషల్ మీడియా లో
ఫోటోలు పెట్టుకుని మురిసిపోవడం తప్ప చూడబోయే / చూసిన ప్రదేశాల గురించి కనీస అవగాహన
కూడా లేకుండా కూడా ప్రయాణిస్తున్నాం. ఆ కాలంలో, యాత్ర పొడుగునా ఆయన ప్రయాణించిన ఊర్లలో
కొన్నిటి గురించి, ఆయన రాసిన వివరాల్లోంచి, చిన్న పేరాలే ఇస్తున్నాను. వీటిలో
వెళ్ళిన ప్రదేశం గురించి, అక్కడి “చిన్న చిన్న
విషయాల” గురించి కూడా ఆయన ఎంత కుతూహలంగా విషయసేకరణ
చేసి ఉంటాడో అనిపించింది.
తిరుమల :-
ఎగువ తిరుపతి స్వామికి చెల్లుబడి అయే ప్రార్ధనల వల్ల
కుంఫిణీ (ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి సుమారు లక్ష రూపాయలు ఆదాయం వస్తూ ఉంది. ఏ సత్కార్యం అయినా ఎగువ
తిరుపతిలో జరిపించడానికి సర్కారుకు రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ పరమాత్ముడు
సంపూర్ణ కటాక్షంతో ప్రతిఫలించి, లోకుల పాపాన్ని వారి రూపాయలగుండా హరించి ఇష్ట
సిద్ధి చేస్తూ ఉన్నాడు.
హైదరాబాదు :
కంచికి గరుడ సేవ ముఖ్యమైనట్టు ఈ షహరుకు మొహరం పండుగ
ప్రబలమైన ఉత్సవం.
అన్ని విధాలైన ఆరాధనలను అంగీకరించి "యాదృశీ భావనా యత్ర
సిద్ధిర్భవతి తాదృశీ" (నీకు ఎలాంటి భావన వుంటే, సిద్ధి అలానే
జరుగుతుంది) అనే న్యాయ ప్రకారం లోకుల ఇష్ట సిద్ధిని చేసే పరమాత్ముడు ఒకడే గనుక ఈ
ఉత్సవ కాలంలో, పరమాత్మ చైతన్యం ఇక్కడ ప్రతిఫలించుట చేత, ఈ స్థలం, ఈ కాలమందు
పుణ్యస్థలమని భావించి ఇక్కడ పండుగ రోజుల్లో నన్ను ప్రవేశపెట్టినందుకు, ఈశ్వరుణ్ణి
చాలా కొనియాడాను.
సికిందరాబాదు :
కంపెనీ ఉండే స్థలం సికింద్రాబాద్, హైదరాబాదు
కన్నా దినదినానికీ ఎక్కువగా బస్తీ అవుతూ ఉంది. ఇరవై సంవత్సరాల కింద నేను
చూచినప్పటికన్న, ఇప్పటికి ఆశ్చర్యకరమైన్ బసీ అయింది. షహరులో వస్తువులకు సుంకం
లేదు. ఏ వస్తువు మీద సుంకానికి ఎవరు ఊహిచి ధరకాస్తు చేసినా దివాన్ జీ సుంకం గుత్త
కి ఇస్తాడు. కట్టెల బళ్ళకు, విస్తరాకులకు, షహరులోకి రావడానికి, నాలుగైదు రకాల
సుంకాలు విధిస్తారు. పన్ను విధించే వారు ఎంతంటే అంత ఇవ్వవలసిందే. ఇంగ్లీషు దండులో
ఈ ఇబ్బంది లేకుండా న్యాయవిచారణ కూడా కొత్వాల్ చావడి లో కమీసరియాట్ అసిస్టెంటు
ద్వారా జరుగుతుంది. అందువలన ప్రజలు, వర్తకులు ఈ దండులో నివసించడానికి ఎక్కువగా
ఇష్టపడుతూ ఉన్నారు.
శ్రీశైలం :
1830, జూన్ 17 వ తేదీ గురువారం మద్యాహ్నం మూడు గంటల వరకూ
శ్రీశైలం మీద గుళ్ళో కళ్యాణమండపంలో ఉన్నాను. గుడికి రెండు ప్రాకరాలు ఉన్నాయి. బయటి
ప్రాకారం గోడామీద శివలీలలు, శృంగారమైన ప్రతిమలు ప్రాకారం నాలుగు పక్కలా గోడ మీద
చెక్కబడి ఉన్నాయి. అర్చకులకు సమ్మతి అయినప్పుడే స్వామికి నైవేద్య దీపారాధనలు
చేతున్నారు. భ్రమరాంబా దేవికి మాత్రం మిరాసి అర్చకుల తరఫున ఒకడు
నియమంగా గుళ్ళో కాపురం ఉండి అర్చన చేస్తూ ఉంటాడు. అలా అర్చన చేసే గుమస్తా ఒక
సవత్సరం పాటు ప్రాణంతో నివడం దుస్తరం. ఈ గుళ్ళో లింగం భూమికి
జానెడు పొడుగుగా ఉన్నది. గుళ్ళో ఎక్కడ చూచినా అడవి మొలిచి, పాములు, పులులకు
నిలయంగా మారింది. ఈ అడవిని కొట్టి చక్కగా చేసే దిక్కు లేదు. అయినా ఇది
సర్వజన పూజితమైన ప్రసిద్ధి పొందిన స్థలం. శ్రీశైల శిఖర
దర్శన మాత్రం చేతనే జన్మాదులు లేవని పురాణాలు మొర పెడుతున్నాయి. ఈ స్థలానికి
వెళ్ళి, ఇక్కడ ప్రతిఫలించే పరమాత్ముడి చైతన్యాన్ని
ఆరాధించగలిగినందుకు భగవంతుడిని హృదయపూర్వకంగా నమస్కరించాను.
కాశీ:
ఇక్కడ ఉండే ఆలయాలు అన్నీ చిన్నవి గానూ, అరటి పువ్వు
లాంటి సౌదాశిఖరాలు కలిగి ఉన్నాయి. వాటిల్లో అర్చకులు సరిగ్గా లేకపోవడం వలన
ఎద్దులతో, ఆవులతో నిండి ఉన్నాయి. ఆరాధనలు
చేసేవారు పత్రం, పుష్పం, ఫలం, తోయం తో వారే
తోచినంత మటుకి ఆయా మూర్తులను జాతినియమాలు లేకుండా ఆరాధిస్తున్నారు. అక్కడ కాచుకుని
ఉండే అర్చకులు ధనికుల వద్ద యాచన చేస్తూ పేదవారు ఇచ్చినది తీసుకుంటున్నారు.
ఈ కాశీలో ఉండే ఉపద్రవాలు మూడు అని చెప్పుకోవడం ఉంది. అది
ఏమంటే రాండు, సాండు, చీడీ అనే మూడు ఉపద్రాలు. (వేశ్యలు, వృషభాలు, పెద్ద పెద్ద
మెట్లు)
భిక్షాటకులుగా చాలామంది బైరాగులతో పాటుగా తిరుగుతుంటార్.
కంగాళీలు అనే భిక్షాటకులకు లెక్కే లేదు. సవారీ సమేతంగా యాత్రకి వచ్చే వారిని
యాచించే కంగాళీలు, ఫకీరులు, గల్లీలలో సవారీని సాగనివ్వరు. ఇచ్చినా తృప్తి
చెందరు. ఇవ్వని వారి గతి చెప్పనక్కరలేదు.
కలకత్తా:
ఈ కలకత్తా షహరుకి 10 కిమీ దూరంలో
దక్షిణంగా ఒక కాళీ గుడి ఉంది. దీనికి విశాలమైన గర్భ గృహం, ముఖ మండపం
ఉన్నాయి. ఆ గుడికి దగ్గర లోనే గంగ వాగు ఒకటి పారుతూ ఉంటుంది. బంగాలీ వారికి
కాళీమాత ప్రత్యక్ష దేవత. ముప్ఫయి రూపాయలతో వస్త్రసమేతంగా షోడసూఅపచార పూజ
జరుగుతుంది. భిక్షకులు వెయ్యిమందికి తక్కువ ఉండరు. ఈ దేశాన్ని గౌళ
దేశమని, విరాట దేశమనీ చెప్తారు. ఇక్కడ శిష్టులు అయిన బ్రాహ్మలు కూడా
సహజంగా మత్ష్యభక్షణ చేస్తారు. నాలాంటి అతిధులు వచ్చినపుడు లేత చేపల కూరని ఇతర
తినుబండారాలతో పాటు పంపిస్తుంటారు.
ఈ నగరంలో ఇరవై ముప్ఫయి లక్షలు కలవారు నూటికి రెండువందల వరకూ
ఉంటారు. ఇది బస్తీ అవడంతో గొప్పవారి ఇళ్ళన్నీ ఇంగ్లీషు వారి తరహాలోనే
కట్టుకున్నారు. కోటా చుట్టూ ఎస్ప్లనేడ్ అనే కొంత బయలు వదిలి, అవతలగా
ఇంగ్లీషు వారు రెండు మెద్దెలకు తక్కువ లేకుండా అయిదు అంతస్థులకు ఎక్కువ లేకుండా
గొప్ప ఇళ్ళు అనేకం కట్టారు.
కలకత్తా నగరం అందమంతా విదేశీయుల ఇళ్ళ వద్దనూ, ఇంగ్లీషు వారు
నివసించే గంగా తీరంలోనే ఉంది. కానీ హిందువుల ఇళ్ళ వద్దకు పోతే, సామన్య
స్త్రీలకు రాజుని చూచిన కళ్ళతో మొగుణ్ణి చూసినట్లవుతున్నది. ఓడరేవు ఉంది కాబట్టి
అన్ని ద్వీపాంతర వస్తువులు దొరుకుతున్నాయి. వర్తకులు సుఖంగా ఉన్నారు.
జాజిపూరు:
జాజిపూరు అనే పేరుగల నాభిగయ లో ఈ వైతరణీ నదీతీరంలో
దేహానంతరం, జీవుడు వైతరణి దాటే కష్టం పొందకుండా ఉండటానికి వైతరణీ
ప్రయుక్తంగా ఒక గోదానం చేసి, నాభి ఆకారంగా ఉండే ఒక చిన్న బావిలో పిండ ప్రదానం చేయాలి.
ఉత్కళ బ్రాహ్మలు నూటయాభై ఇళ్ళవారు నాభిగయావళీలని పేరు పెట్టుకుని యాత్ర వారిని
యాచించి జీవనం గడుపుకుంటున్నారు. ఇక్కడ ఉత్కళ బాధితులు 500 మంది దాకా
ఉన్నారు.
పూరీ:
ఇక్కడ గుడి నాలుగు వందల అడుగుల చదరంలో సుమారు తిరువట్టూరి
గుడి అంత విశాలంగా ఉండి దానికి రెండు ప్రాకారాలు ఉన్నాయి. గర్భ గృహం మీద స్తూపి
అరటి పువ్వు మాదిరిగా రెండు తాటిచెట్ల ఎత్తులో కట్టి, మీద చక్రం
ఉంచారు. ముఖమండపం విశాలంగా, పైన గుమ్మటం అందంగా, స్తూపీలు ఉంచి
కట్టారు. ముఖమండపం బయటి ప్రాకారంలో గోడలో తురకరాయి మీద శిల్పం
(చిత్తుళిపని) బహుసుందరంగా చేసారు. గర్భగృహం చుట్టూ చిల్లర గుళ్ళు చాలా ఉన్నాయి.
గుడి లోపల ఒక అక్షయవటం, ఒక ముక్తి మండపం ఉన్నాయి. వాటికింద జపం చేస్తే ముక్తి
కలుగుతుందని నియమంగా ఉంది
వెలుపల ప్రాకారంలో 400 పొయ్యిలు గల
వంటశాల విశాలంగా ఒకటి ఉంది. ఒక్కొక్క పొయ్యి మీద 12 పిడతలు ఉంచి
అన్నం వండుకునే విధంగా చేసి ఉన్నారు. ఒక్కొక్క పొయ్యి 5 వేల రూపాయలకు
కథా చిత్తుగా అమ్మకానికి దొరుకుతుంది. పచనం అయ్యే ప్రసాదంలో పొయ్యి కలవారికి ప్రతి
పిడతకీ స్వతంత్ర హక్కు ఉంది. అందువలన పొయ్యి కలవాడికి ఆదాయం ఎక్కువ. నిత్యం రమారమి
అయిదు గరిసెల బియ్యం భోగంగా నివేదన అవుతుంది. పిడతలు చేసే కుమ్మరులు 500 ఇళ్ళు వారు
ఉన్నారు.
లింగరాజ మందిరం (భువనేశ్వరం):
భువనేశ్వరం అనే గొప్ప బస్తీ లో శివస్థలం - లోకనాథస్వామి అనే
పేరుతో ఉంది. హిందువులలో చాకలి వారినీ, చండాలురను
గుడిలోనికి రానీయరు. ఈ ఓఢ్ర బ్రాహ్మణులలో 48 తెల్గల వారు
ఉన్నారు. అందులో జగన్నాధపురపురాజు పురోహిత వంశానికి చెందినవారు శ్రేష్టులు అని, గుడి పూజలు
చేసే పండాలు నికృష్టులని ప్రసిద్ధి. ప్రతి దినం
ఏడుసార్లు భోగానంతర దర్శన సమయాలు ఉంటాయి. అందువలన ఎపుడు గర్భగృహంలోకి వెళ్ళి
పీఠదర్శనం, ప్రదక్షిణం చేయదలచుకున్నా శనివారాల్లో తిరువళిక్కేణి లో
గర్భగృహంలో ఉండేటంత సందడి ఉంటూనే ఉంటుంది.
ఈ స్థలం వదిలేటపుడు గుడి ఇలాక పండాలకు నూరు రూపాయలు ఇస్తే
వారందరూ పంచుకుని తృప్తిని పొందుతున్నారు. ఈ పండా పురోహితులు ఎంత మాత్రం తృప్తిని
పొందడం లేదు. నా పరువు కాపాడుకోవడానికి మూడువందల రూపాయలు ముట్టచెప్పినా, నా
పురోహితుడికి కనికరం పుట్టలేదు.
శ్రీకూర్మం
1831 జులయ్ 7 వ తేదీన శ్రీకాకుళం అనే గొప్ప ఊరు చేరాను
అక్కడికి 16 కి.మీ ల దూరంలో శ్రీకూర్మం అనే మహాస్థలం ఉంది. ఇక్కడ
విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తిన రూపాన్ని శిలతో చేసిన విగ్రహంలో శంఖుచక్ర
లాంచనాలతో కూడా ఉంచారు.
ఈ శ్రీకాకుళం బలరామ క్షేత్రమని ప్రసిద్ధి. ఊరికి పక్కనే
లాంగుల్యా (నాగావళి) నది ఒకటి ఉంది. ప్రవాహకాలంలో ఊళ్ళో వీధుల్లో నది సంబంధమైన
నీళ్ళు వస్తూ ఉంటాయి. అందువలన నిలువెత్తు మిట్టలు వేసి, వాటి మీద ఇళ్ళు
కట్టుకున్నారు. నదీతీరంలో కోటీశ్వరుడు అనే శివస్థలం ఒకటి పురాణ ప్రసిద్ధమై ఉంది. ఈ
ఊళ్ళో బ్రాహ్మణ గుజరాతీ వాళ్ళు నలయి ఇళ్ళవారు వ్యాపార సాహుకారు పన్లు
చేస్తున్నారు.
- ఇంకా ఉంది. -