మా చిన్నప్పుడు పిల్లలకి కాలక్షేపానికి తోటల్లో, వీధుల్లో ఆటలూ, పుస్తకాలు చదువుకోవడమూ తప్ప వేరే సాధనాలేవీ లేని కాలానిది ఈ మాట. తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు పిల్లలు చదువుకునేందుకు అనుగుణంగా చిన్న చిన్న పోకెట్ పుస్తకాలు ప్రచురించే వారు. ఆ పుస్తకాలలో, ఒకో దేవీ దేవతలు, మహనీయులు, పురాణ కథలు, గురువుల గురించి ఆసక్తి కరమైన కథలుండేవి. వాతిల్లో సతి నాకు చాలా ఇష్టమైన కథ. సతిని పరమ శివుడు అత్యంత గాఢంగా ప్రేమిస్తాడు. అమ్మ చుట్టూ తిరిగే పసి వాడిలా ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తన సర్వస్వమూ ఆమెదే. ఆమె జూకాలు, గొలుసు పేటలు, పమిటంచులూ, గాలికి చెదిరే జుత్తూ... పల్చని పాదాలూ, అన్నీ అబ్బురమే ఆయనకు. అలాంటిది, సతీ వియోగం తో రుద్రుడై, తరవాత అన్నీ వొదులుకుని, ఆమె శవాన్ని భుజాన వేసుకుని గడ్డ కట్టిన శోకంతో, విరాగిలా తిరుగుతుంటాడు. ఆయనని మళ్ళీ పెళ్ళాడిన పార్వతి, తిరిగి అంతటి ప్రేమని పొందిందా అని అనుమానం కలుగుతుంది. కానీ ఘనీభవించిన శివుడిని, అతని తపశ్శక్తిని, ఆమె జీవ శక్తి గా మారుస్తుంది. అమ్మ వారు, అయ్య వారూ సృష్టికి అవసరం. జీవానికి, అమరత్వానికీ, వినాశనానికీ, వారే ఆధారం. సతి, శివుడి తొలిప్రేమ. అసలు హిందూ ధర్మం లో మహా దేవి, శివుడు, వారి వారి భిన్న రూపాలు, వాటి వెనకున్న కథలు, వీటన్నిటి గురించి దేవదత్ పట్నాయక్ రాసిన పుస్తకం "Shiva to Shankara : Giving Form to the Formless",
లింగాకారంలో పూజలందుకుంటుండే శివుడి ఆకారం ఏమిటి ? అసలెందుకు ఈ లింగాకారం? కాలంతో మాటు మారుతూండే ధర్మం, హిందూ మతానికి ఉన్న లక్షణం. ఒకప్పుడు వేద పఠనం, యజ్ఞ యాగాదులే కొమ్ము గా ఉండే మతం, ఎందరో దేవుళ్ళని ఆరాధించే ధర్మమూ మారి, అరణ్యాలలో తిరుగాడుతూ జీవనం గడుపుకునే జనం, వ్యవసాయం చేస్తూ, మైదానాలలో స్థిర పడినపుడు మారింది. వేలాది దేవుళ్ళ బదులు ఒకే శక్తి వంతమైన దైవారాధాన మొదలయింది. కొందరు విష్ణువునూ, కొందరు శివుడినీ, మరి కొందరు శక్తి నీ ఆరాధించడం మొదలయింది. వీటిల్లో పోటీలు, తమ తమ దేవుళ్ళే గొప్ప అని పోట్లాడుకునే తత్వమూ మొదలయాయి. ఒక్కో మతమూ, ఒక్కో దేవుడిని ఆరాధించాయి. వేద కాలంలో శివుడు రుద్రుడు. రుద్రుడు భయం కలిగించేవాడు. యజుర్వేదంలో శతరుద్రీయంలో శివుడు పరమ శక్తివంతుడుగా అభివర్ణించబడినా, అతను చాలా ప్రమాదకరమైన వాడు గా కూడా చెప్పబడ్డాడు. బ్రాహ్మణాలలో, 'అతని పేరే తలవకూడదు సుమా!' అని కూడా ఉంది. అతనో బయటి దేవుడు. యజ్ఞాలలో మిగులూ తగులూ మాత్రమే నివేదన చేయదగ్గ దేవుడు. వీటన్నిటి వల్ల, వేదకాలాల మునుపటి జ్ఞానం వల్లా, శివుడసలు వేదాల దేవుడే కాదు. అతనో ఆటవికుడు. దక్షిణాది వ్యవసాయ కుటుంబాలకు చెందిన ద్రవిడుడు. ఆర్యుల దేవుడు కాడు. దక్ష యజ్ఞాన్ని వినాశనం చేసి, సతి కాలిన శరీరాన్ని భుజాన వేసుకుని వెళ్ళిన శివుడు, మొదటి సారి వైదికులలో గౌరవాన్ని సంపాదించుకున్న అనార్యుడు.
కాలక్రమేణా బౌద్ధం, జైన మతం వగైరా మతాలు ప్రజాదరణ పొందడం మొదలయాక, దేవుడు యజ్ఞ శాలలని వీడి ఒక ఆకారాన్ని పొంది, ప్రజలకు దగ్గరగా, సామాన్యులకు అర్ధమయే పూజా విధానాలు కనిపెట్టబడడం ద్వారా మెల్లగా విశిష్టత ను సంపాదించుకున్నాడు. వేద పురాణేతిహాసాలు సామాన్య ప్రజలకు, పామరులకు చేరాయి. కొందరు శివుడిని 'బ్రాహ్మణుడినే' చేసారు. ప్రజలు అబ్బురపడే కథలు, లీలలు ప్రచారంలోకి వచ్చాయి. ఎవరికి ఎలా అర్ధమైతే అలా శివుడు రూపాంతరం చెందాడు.
చాలా వరకూ వియోగి, ఏమీ అక్కర్లేని వాడూ కావడాన, భక్త సులభుడయాడు. ఎక్కువ శ్రమ పడకుండానే భక్తులను అనుగ్రహిస్తాడు. విష్ణుడి లా ప్రాపంచిక భోగాలవసరం లేదు. పూలూ, వెన్నలూ, పాలు తేనెలూ అవసరం లేనివాడు. ఇవన్నీ శివుడి లక్షణాలు. ఏది మంచి, ఏది చెడు, ఎవరు స్త్రీ, ఎవరు పురుషుడు, ఏది అందమైనది, ఏది అందవిహీనమైనదీ కూడా తెలీని భోలా శంకరుడు. అతంకి నీ ఆత్మ శుద్ధి చాలు. ఆ ఆత్మ తొడుక్కున్న దేహం పాపిదా, పుణ్యాత్ముడిదా, రాక్షసుడిదా, రాజుదా, స్త్రీ దా, పురుషుడిదా, అని చూడని వాడు. నిరాకార స్వరూపుడు ఆయన. మరి ఈ పురుషాంగ ఆకారం దేనికి, అదీ యోనిలోంచి చొచ్చుకొచ్చి, ఆకాశాన్ని ఊర్ధ్వ ముఖంగా చూసే ఈ లింగాకారం వెనకున్న రహస్యం ఏమిటి ? లింగ పూజ అనాదితనం ఏమిటి ? ఒక హిందువు ఎటువంటి సిగ్గుకూ లోనవకుండా ఈ లింగానికి పూజ చేయడం వెనక ఉన్న తత్వం ఏమిటి అని అందరికీ ఒక అనుమానం ఉంటుంది.
దానికి సమాధానం చెప్పేందుకు ఈ పుస్తకం కొద్దో గొప్పో ప్రయత్నిస్తుంది. లింగ పురాణం, తమిళ జానపదాలు, హిమాలయ జానపద గాధలు, రక రకాల ఉపనిషత్తులూ, భాగవత పురాణం, బసవ పురాణం, రామాయణం, మహా భారతం, శివ పురాణం, బ్రహ్మాండ పురాణం, నవనాథ చరిత్ర, కాశీ స్థల పురాణం, స్కంద పురాణం, కాళికా పురాణం, నారద పురాణం నుండి వివిధ కథల్ని ఎంచుకుని దాని నుంచి శివ పార్వతుల కథ ని చెప్తూ, ఒకరిని విడిచి ఒకరికి అర్ధం లేని ఈ జంట ఉనికి గురించి వివరిస్తుంది. గంగ ని తలపై మోసేందుకు, నీల కంఠుడి గా గరళాన్ని గొంతులోనే అదిమి పట్టేందుకు, సంసారాన్ని అసలు పట్టించుకోని స్థితి నుండి, ఎప్పుడూ 'సత్ చిత్ ఆనందం' కోసం తీవ్ర సాధనలో తపస్సు లో ఉండే యోగి గా జీవించే రుద్రుడు, శివ స్థితి నుండి, అమ్మవారి అండ వల్ల ఇలా భక్తులను కరుణించే సృష్టి కి, తపశ్శక్తికీ, జ్ఞాన వైరాగ్యాలకూ, ఆది అంతాలకూ మూలమై, గురువై, తండ్రి అయి, శంకరుడిగా ఎలా రూపాంతరం చెందాడో వివరిస్తుంది.
పరమశివుడి రూపం, అతని తపో శక్తి, బీజం, నాడి, పరమాత్మ తత్వం, సృష్టి, స్థితి, లయ కారకత్వాలు, కామం, క్రోధమూ, ప్రాణ శక్తి, యోగాల గురించి వివరించే ప్రయత్నం చేస్తుంది. శివుడి లింగాకారం, దాని వెనక సాంప్రదాయ వాదుల కథలకూ, జానపద గాధలకు, తంత్ర సాధకులు చెప్పే కథలు, ఉపనిషద్, పురాణాలలో వ్యాప్తిలో కథలకూ ఉన్న తేడాలూ, సామ్యాలూ తెలుసుకోవచ్చు. ఇంకా వివరాలు రాయవచ్చునేమో గానీ ఈ పుక్కిటి పురాణాలు, బొత్తిగా జడుడైపోయి, తన చుట్టూ ఉన్న సంసారాన్నీ, జీవాన్నీ పట్టించుకోని స్థితి నుండీ బయల్దేరి వచ్చిన ఆయన లో తరాలుగా నిక్షిప్తమైన బీజ శక్తి నీ, ప్రాణం పోసే శక్తినీ తట్టి లేపే అమ్మ వారి సాంగత్యంవల్లనే సాధ్యమైనదనే చెప్తాయి. కాబట్టి అతని రూపం లేదా ఆకారం జీవ శక్తికీ, ప్రాణ శక్తికీ ప్రతీకలు.
ఎప్పటికీ దేనికీ అంతం ఉండదు, నదిలో నీరెలా నిశ్చలమైనది కాదో, లోకంలో దేనికీ శాశ్వతత్వం ఉండదు. సృష్టి, దాని వినాశనం, పునః సృష్టీ, నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఈ పునఃసృష్టి కి, ఆ నిరంతర శక్తి ప్రవాహానికి శివుడు ఆధారం. ఆయన కేవలం లయ కారుడేమీ కాదు. చంద్రుడికి జవ సత్వాలు ప్రతిరోజూ ఇస్తూనే వస్తున్నవాడు. యుద్ధాలలో అస్త్రాలకు కూడా ఆయనే మూలాధారం. ఒక సారి శివుడి కథనీ, ఆయన పిల్లల కథలనీ, అమ్మ వారి కథల్నీ, వాళ్ళ ప్రేమ పాశాలనీ, వాళ్ళ చుట్టూ అల్లుకున్న జానపద కథల్నీ, ఇంకోసారి చదువుకునేందుకు బావుంది ఈ పుస్తకం.
2017 లో మొదట ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇపుడు మాత్రం హార్పర్ కాలిన్స్ వాళ్ళు ఒక సెట్ లో Indian Wisdom గా అమ్ముతున్నారు. ఇందులో ఉన్న మిగిలిన పుస్తకాలు కూడా మెల్లగా పరిచయం చేస్తాను. మొత్తానికి ఈరోజు అంతా నాస్టాల్జిక్ గా గడిచిపోయింది. చిన్నప్పుడు దేవీ భాగవతం / రామాయణ భారతాలు, భాగవత పురాణం లాంటి పుస్తకాలూ, శంకర్ బొమ్మలతో రామకృష్ణ ప్రభ వాళ్ళు ప్రచురించిన రక రకాల బొమ్మల కథలనూ చదువుకున్న బాల్యం మన తరానిది. ఈ కొత్త తరం పిల్లలకి దేవదత్తుడే దిక్కు.
***




No comments:
Post a Comment