Pages

13/07/2020

చెలియలి కట్ట - విశ్వనాథ సత్యనారాయణఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాలనుకోవడం ఓ సాహసం. అయినా ఇది నేను చదివాను అని చెప్పుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చెయ్యొచ్చు.  ఈ పుస్తకం గురించి స్వాతి లో మాలతీ చందూర్ ఏ ఇరవయ్యేళ్ళ క్రితమో రాసింది చదివి, [కథ పరిచయం చేసారు - కాబట్టి సస్పెన్స్ లేదు] ఎంతో ఇంప్రెస్ అయి కొనుక్కున్న పుస్తకం.  విశ్వనాథ ని చదివేటంత స్థాయి లేకపోయినా, నేను చదివిన రెండు మూడు పుస్తకాలలో ఇది నాకు చాలా నచ్చింది.

ఇది అన్ని పుస్తకాలకీ వర్తిస్తుందో లేదో తెలీదు. ఇంతకు ముందు కూడా ఎవరో చెప్పారు. ఆయన ఏకధాటి గా కథ ను చెప్తూ పోతూంటే ఆయన అల్లుడు గబ గబా రాసే వారని. ఈ డిక్టేషన్ ఆయా కథల్లో రక రకాల దృశ్య చిత్ర, పాత్ర వర్ణనలతో పాటు, ఏ విడతలోనూ కంటిన్యుటీ చెడకుండా ఆశువు గా చెప్తూ ఉండే వారని విన్నాను. ఈ పుస్తకాన్నయితే ఆయన చెప్తూ ఉండగా వ్యాసుడికి వినాయకుడు భారతం రాసి పెట్టినట్టు శ్రీ గుంటూరు సుబ్బారావు గారు రాసారు. ఆ విధంగా చూస్తే, ఈ యజ్ఞానికి బాధ్యులు ఇద్దరు. ఇద్దరూ అభినందనీయులే.కథ చెప్పొచ్చు - ఒక సముద్రపొడ్డు పల్లె లో బీద బ్రాహ్మణ కుటుంబం. కుటుంబ పెద్ద సీతా రామయ్య పెద్ద భార్య చనిపోతే, రెండో భార్య టీనేజ్ అమ్మాయి రత్నావళిని పెళ్ళి చేసుకుంటాడు. ఆ అమ్మాయి అందగత్తె. అత్త ఇంట్లో కొత్త కోడలి ముద్దు ఇంకా తీరనే లేదు. చద్దన్నం తింటుంది కాబట్టి మడి కట్టుకోదు. వంట చెయ్యదు. (చిన్న పిల్ల కాబట్టి పొద్దున్న చద్దన్నం తింటుంది) భర్త అప్పుల్లో, బాధల్లో సంసారాన్ని ఈదుతూ ఉండగా, మరిది, 24 ఏళ్ళ రంగా రావు పట్నంలో చదువుకుంటున్నాడు. అతన్ని ఎలాగో అప్పో సొప్పో చేసి చదివిస్తే, సీతారామయ్యకు, అతని, తల్లి, విధవ చెల్లెలు సరస్వతి కీ అతను భవిష్యత్తు లో ఆదుకుంటాడని ఆశ. సీతారామయ్య కు మొదటి భార్య వలన కలిగిన పిల్లవాడు, మేన మామ ఇంట్లో పెరుగుతున్నాడు. సరస్వతి కి వైధవ్యం, ఒక మొగ బిడ్డ తో అన్న ఇంటిలో అరవ చాకిరీ చేస్తూ, కుటుంబాన్ని గౌరవంగా నడుపుకొస్తుంది. ఇదీ ఈ కుటుంబ నేపధ్యం. ఆ పల్లెలో వీరికి మంచి పేరు ఉంది. కాబట్టే ఆస్తి కరిగిపోయినా అప్పు పుడుతూంది.

ఆ పేద కుటుంబం, రంగారావు చదువు కోసం నానా కష్టాలు పడి, డబ్బు పంపిస్తుంటే అతని చదువు సాగుతుంటూంది.  పట్నంలో చదువు ఇతనికి మాయా ప్రపంచం. అతని స్నేహితులూ, అతని యువక రక్తం, పట్నపు పోకడలు, నాగరికత్వమూ, ఇంట్లో మిగతా వారి పల్లెటూరి అమయకత్వం, అనాగరికత, వీరి శ్రమ, అతని నాజూకు, ఇలా ఎన్నో అంతరాలు కుటుంబానికి, రంగనికి మధ్య. కానీ అతనో స్వాప్నికుడు. భావుకుడు. అన్న అష్టకష్టాలు పడి భాద్యత గా చదివిస్తుంటే, ఆ కష్టాన్ని లెక్కించని తెలిసీ తెలీని స్వార్ధ పరుడు. అతి ఆత్మ విశ్వాసం, పరిణత లేని వ్యక్తిత్వమూ ఉన్నవాడు.  సెలవులకి ఇంటికొచ్చే ఈ ఆధునికుడు - ఇతను రత్నావళి కి ఆకర్షణీయంగా కనపడడం సహజం.

ఈ సంసారానికి రంగని చదువు ఆసరా కావల్సింది కాస్తా, అతని అపరిపక్వ ఆలోచనల్లో, పట్నపు చదువు ప్రసాదించిన అమాయకత్వపు విచార ధారల్లో మండిపోవాల్సి రావడం పెద్ద శరాఘాతం. రంగనికి కొత్త వదిన, అమాయకురాలు, చిన్న పిల్ల రత్నావళి, విద్యకు దూరమయి, ప్రగతి  లేక, ఒక ముసలి వాని రెండో భార్యగా ఈ పల్లె లో పడుండడం అన్యాయమనిపిస్తుంది.  ఇదే చట్రంలో నానా బాధలనుభవిస్తున్న విధవలయిన తన తల్లి, చెల్లెలు కాకుండా వదినే ఎందుకు అతని ఊహల్లో నిలుస్తుందో తెలీదు.

ఆమెను ఉద్ధరించే ప్రయత్నం లో ఇద్దరి మధ్యా, తెలియని దగ్గరతనం, చనువు, తరవాత శారీరక సంబంధం ఏర్పడతాయి. రంగడి కి రత్నావళి మీద ప్రేమ ఉందో లేదో తెలీదు. ఆమె ను ఏదో కాపాడాలనుకున్న  యౌవనపు అమాయకత్వం  అతనిది. అతని ఆలోచనల్లో - తప్పొప్పులు, సంఘం సృష్టించినవి. అవి స్త్రీ స్వేచ్చ కు లంకెలు. సంకెళ్ళు. తప్పంటూ ఏదయినా ఉంటే,  ఆ పదిహే డేళ్ళ అమ్మాయిని ఆ వయసుడిగిన అన్నకు   (సీతారామయ్యకు 35-40 ఏళ్ళుంటాయి)  ఇచ్చి పెళ్ళి చెయ్యడం తప్పు. వయసులో చిన్నదయిన రత్నావళి,  ఈ మరిది భావజాలపు చట్రంలో పడి, అన్ని హద్దుల్నీ చెరిపేసుకుని ముందుకు వెళిపోయి, రంగనితో ప్రేమ లో పడిపోతుంది.

విషయం తెలిసి, అన్న వీళ్ళిద్దర్నీ పట్నం పంపేస్తే, తెలిసీ తెలియని అజ్ఞానం, పొగరు, ఒకరిమీద మరొకరికి ఉన్న ఆకర్షణ, కన్నూ మిన్నూ కానరాని సిద్ధాంత ప్రభావం వల్ల, తాము ఆ కుటుంబానికి మిగిల్చిన క్లేశాన్ని అస్సలు తెలుసుకోకుండా, నిస్సిగ్గుగా, నిర్లక్షంగా ఆ పల్లె నుండీ బండి లో తరలి వెళ్తారీ రతీ మన్మధులు.  సీతారామయ్య మనిషే. తనని గుండెల మీద తన్ని పోతున్న తమ్ముణ్ణీ, ప్రేమించిన భార్యనూ ఊరి వారందరూ చూస్తుండగా బండి లో సాగనంపినప్పుడు, వల వలా ఏడుస్తాడు. తామేమి చేస్తున్నామో తెలీని వ్యర్ధ వినాశనాని వైపు వెళ్తున్న జంట ని చూసి,  ఎంతో బాధపడతాడు.

తీరా మద్రాసు చేరాక, అసలయిన జీవితం కనిపిస్తుంది. రత్నావళి కి, రంగనికి, మొదట్లో చేతిలో  డబ్బున్నంత వరకూ బానే వుంటుంది. "ఏదో చేసాము", "ఏదో సాధించాము" అనుకుంటూ తృప్తి గా ఉంటారు. రత్నావళి వ్యక్తపరిచే ప్రేమ ను రంగడు తీసిపారేసి, ఇప్పటి దాకా నీకు వేరే ఎవరూ పురుషులు తెలీక నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నీకు అందర్నీ పరిచయం చేస్తాను. వారిలో నచ్చిన వానిని నువ్వు ఎన్నుకుందువు గాని అంటాడు. ఇది రత్నావళి కి తగిలిన మొదటి దెబ్బ. స్వేచ్చ అంటే స్వేచ్చే. ఒకరికే కట్టు పడాల్సిన అవసరం లేదు కద.

కానీ ఈ స్వేచ్చను వెతికే, బ్రతుకు పోరాటంలో వీరిద్దరి ప్రయాణం చూడాలి. ఇద్దరిలోనూ, వయసు, అనుభవాలు తీసుకొచ్చిన మార్పులు. కాల పరీక్షకు తట్టుకోలేక విలవిల లాడిన బ్రతుకులు. ఎందరో స్నేహితులు, ఎందరో సన్నిహితులు, మేలుకోరే వారు, గోముఖ వ్యాఘ్రాలు, కుల రాజకీయాలు, చదువూలు, ఉద్యోగాలు, కూడబెట్టిన డబ్బు, ఆస్తి, వికసించుకున్న వ్యక్తిత్వము. పట్నపు రొద, న్యాయాన్యాయ విచక్షణా శక్తి, మానవత్వం. ఇదీ ఈ మామూలు అసాధారణ కథ లో అంశం.

రత్నావళి, మొదట్లో హోరుగాలికి కొట్టుకుపోయిన ఒక ఆకు లాంటిదయినా, పోను పోను, జీవితం అంటే ఏమిటో తెలుసుకుంటుంది. తను చేసిన తప్పు, తన చేతులారా చేసిన మానని గాయాలు, సంఘంలో తన స్థానము తెలుసుకుంటుంది. కానీ అత్యంత సాహసోపేతంగా ఆవిడ చదువుకుని, పండితురాలై, టీచరయి ఉద్యోగం చేసి, వయసు మీద పడ్డాక, మాతృ ప్రేమతో,  అప్పటికి చదువుకోసం  పట్నం చేరిన సరస్వతి కొడుకుని చేరదీసి, సాయం చేస్తుంది.

రత్నావళీ, రంగారావు, ప్రేమతో దోబూచులాడతారు.  రత్నావళి మొదట రంగారావుని గాఢంగా ప్రేమిస్తుంది. కానీ అతను కాదంటాడు.  కాలం గడిచాక, వారిద్దరి అనుబంధం ఓ స్థాయికి చేరాక, రంగడు, రత్నావళి ని ప్రేమిస్తాడు. ఆవిడ అప్పటికే నిర్వాణ స్థితికి చేరుకుంటుంది. కాబట్టి, ఇద్దరూ మానసికంగా, శారీరకంగా, దూరం గా నే మసిలినా ఆత్మ పరంగా ఇద్దరూ ఒక్కరే. అన్నాళ్ళు కలిసి చేసిన తప్పు, నడిచిన అడుగులు, ఒకరికొకరు సాయంగా, చేయూతగా నిలవాల్సి రావడం, వయసు తెచ్చిన అనుబంధం తో ఇద్దరూ కలిసే ఉంటారు చివరి దాకా.

జీవితంలో అర్ధం వెతుక్కుంటూ, తమ శూన్యతని ద్వేషిస్తూ, పశ్చాత్తాప భావనలతో  సతమతమయిపోతూన్న రత్నావళి అనుకోకుండా సీతారామయ్య మూడో భార్య ని చూసి, ఆమె వొళ్ళో సీతారామయ్య కుమారుడిని చూసి, తానేమి చెయ్యాలో నిశ్చయించుకుంటుంది. మొదట్లో రత్నావళి, రంగడి ప్రణయం ఆ పల్లెటూళ్ళో రెక్కలు తొడుక్కుంటున్నప్పుడే, సీతారామయ్య మొదటి భార్య కొడుకు అనారోగ్యంతో చనిపోతాడు. ఆ దెబ్బ కి సీతారామయ్య ఘోరంగా బలహీనపడతాడు.  ఆ తరవాతే, ఈ జంట ప్రణయం బయటపడి, వారిని ఇంటిలోంచీ పంపేస్తాడు. ఇలా  దెబ్బ మీద దెబ్బ పడి కోలుకోలేని ఈయన మూడో పెళ్ళి చేసుకోవడం, పిల్లాడిని కనడం - రత్నావళికి చాలా శాంతిని కలిగిస్తుంది.  విధి ఏదో తప్పు సరిదిద్దినట్టు, తాను తన తప్పుని కూడా సరిదిద్దుకోవాలన్నట్టు భావించుకుంటుంది. 

ఓ నిర్ణయానికొచ్చి, రంగనికి మాటమాత్రంగా వెళ్తున్నానని  చెప్పి, తన బాంకు పుస్తకమూ వగైరాలు తీసికెళ్ళి సీతారామయ్య చేతిలో పెట్టి, తను చనిపోతే ఎవరో అనాధ అనుకుని తనకు కొడుకు చేత తద్దినాలు పెట్టించమని అడిగి, పెద్ద ఉప్పెన వచ్చే వేళ సముద్రానికభిముఖంగా చెలియలి కట్ట లోకి వెళిపోతుంది. ఇంతే.  

ఈ అత్భుతమయిన సజీవ నిర్మలత్వం లో - అత్యత్భుత పాత్రలు, మానవత్వం, గిల్ట్ నిలువెల్లా కాల్చేస్తున్న మనుషులకి క్షమ ఇచ్చే ఊరట, రక రకాల మనుషుల వ్యక్తిత్వాలు, చనిపోవడానికొచ్చిన రత్నావళి వెంట నానా పాట్లు పడి చేరే రంగడు,అతని నిష్కల్మషమైన నవ్వు.. వివిధ పాత్ర ల మధ్య విస్తృత సంభాషణలు, రక రకాల భావాల విస్తృతి, ఒకప్పటి ప్రేమ వ్యవహారాలు, వాటి వెనకున్న సాధక బాధకాలు. లేచి పోయెళ్ళిన జంటల  బాధలు, కనువిప్పు కలిగినా ఏమీ చెయ్యలేని జీవితాలు. ఇవన్నీ ఈ చెలియలి కట్ట చర్చించే విస్తారమయిన పాయింట్లు. 

ఆత్మహత్య కు ముందురోజు రత్నావళి తమ పాత పల్లెటూరి ఇంటికి పడుతూ లేస్తూ వెళ్ళగలుగుతుంది. అప్పటికి ప్రభుత్వం ఆ తీరప్రాంతపు ఊరిని ఖాళీ చేయిస్తూంటుంది. అందరూ బళ్ళు కట్టుకుని ఊరు విడిచి పోతుంటారు. ఉప్పెన ప్రళయమై రాబోతూంది. తుఫాను వాతావరణం. మద్రాసు నుండి రైళ్ళు రద్దవుతాయి. ఆమె అక్కడికే వెళ్తుందని భావించి, రంగడు కూడా ఎలాగో ఊరు చేరతాడు. సీతారామయ్య కుటుంబం ఊరు విడిచాక, రత్నావళి వారి ఇంటిలోనే రాత్రి గడిపేందుకు వస్తుంది. అప్పుడు రంగడు కూడా వస్తాడక్కడికి. 

ఆ చీకట్లో వారిద్దరి పరిస్థితి.. ఇద్దరూ పశ్చాత్తాపం తో రగులుతున్నవారే. ఇద్దరూ విద్యాధికులే, సంపాదనాపరులే. సమానులే. ఉద్దండులే. వారి వారి బలహీనతల ముందు మూఢులే. కానీ ప్రేమో మరేదో కారణాన ఇద్దరూ ఒకే నావలో ప్రయాణికులు. అప్పటి పేరా ఒకటి : 

ఆకాశము మేఘావృతమై యుండెను. ధాత్రి యంతయు జలమయమై ఉండెను. ఊరిలో వీధులన్నియు బురదగా నుండెను. అతడు పడుతు లేచుచు తన ఇంటికి పోయెను. ఊరిలో నొక్క పురుగు లేదు. ఆ యింటిలో నొక దీపము వెలుగుచుండెను. బయట తాళము వేసి యుండెను.  లోపల దీపమెవరు పెట్టిరి ? అతను దొడ్డిగుమ్మము వైపునకు పోయి తలుపు తట్టెను. ఆ తలుపు పాతది. దానిని తేలికగా బ్రద్దలు కొట్టవచ్చును. గాలిచే కాబోలు. నాతలుపిదివరకే బ్రద్దలు కొట్టబడి యుండెను.  అతడు తలుపు చెక్కల నటునిటు త్రోసి లోనికి పోయెను.  గదిలోనుండి "ఎవరు వారు?" అని ప్రశ్న వచ్చెను. అతడును "ఎవరు వారు?" అనెను. 

రంగనికెదురుగా నన్నగారిగది ముందఱ రత్నావళి నిలుచుండెను.  ఆమె దీపపు వెలుతురులో రంగని చూచి యానవాలు పట్టెను. ఆమె ఆశ్చర్యపోయెను. రంగడు నవ్వుతు నిలుచుండెను. 


వారి ప్రయాణాన్ని ముందు నుండీ చదువుతూండడం వల్ల రత్నావళి ఎదుట ఈ రంగడు నిలబడడం, అదీ నవ్వుతూ... ఆ మనస్థితి కి కొలతలేవీ లేవు. తామిద్దరూ తప్పు చేసారు. తెలిసీ తెలియక, తెలిసాక దిద్దుకోలేక, ఏమీ చెయ్యలేక కొట్టు మిట్టాడడానికి, తామిద్దరూ బాధ్యులే. ఆమె ఒక్కతే ఎందుకు 'ఒక్కతై'పోవాలి ? తానూ ఆమె నేరాలన్నిటిలోనూ భాగస్వామే. ఆమె స్నేహితుడే, తోడే అన్నట్టు రంగడు ఆ క్షణాన రావడం చాలా బాధ, ఆనందం కలిగిస్తాయి. 

రత్నావళి అదే విధంగా చదువుకోవడానికి ప్రయత్నించినపుడు ఆమె మీద లేచిపోయి వచ్చిన అపవాదు వల్ల, ఆమెను కామ దృష్టి తో చూసిన ముకుంద రావు, ఆయన టీచింగ్, ఆయన లో మార్పు, ఆయన వ్యక్తిత్వం, ఈ జంటకు అండగా నిలబడడం, హృద్యంగా వుంటాయి. ఆయన ఒక మంచి టీచర్. అతనితో స్పష్టంగా సూటిగా తన అభిప్రాయాన్ని చెప్పిన రత్నావళి అపుడే ఎదిగిపోయినట్టనిపిస్తుంది. 

తెలుగు భాష మీద అతని మొదటి పాఠం (ఇంటిలో ట్యూషన్, ఏకాంతంలో)  చెప్పినప్పుడు, అంతకు ముందు అతని చూపులో, నడవడిలో రత్నావళి మీద కోరిక స్పష్టమవుతూ ఉంటుంది. అతని ధోరణి చూసి ఆమె అతని దగ్గర చదువుకోకూడదనుకుంటుంది. కానీ పాఠం చెప్పాక వచ్చే పేరా : 

ఇట్లు పద్యమంతయు నగువరకు గంటసేపు పట్టెను. చెప్పిన విషయములే మరలమరల చెప్పి రత్నావళి యేసంగతియు మరచిపోకుండజేసెను. ఆనాటికి పాఠమై పోయెను.  పాఠమై తరవాత నతనియొద్దనే చదువుకొనవలెననిపించెను.  పాఠము చెప్పినంతసేపు ముకుందరావు కన్నులు తమ ప్రయత్నము మానలేదు. అతని చేతులా ప్రయత్నం మరికొంత కొనసాగించ లేక పోవను లేదు.  రత్నావళి మనసులో చాల భయపడెను.  పాఠమైనంతనే ముకుందరావు నవ్వెను. రత్నావళి నవ్వలేదు.  అతడు "భయపడుచుంటివేమి?" అనెను. రత్నావళి "భయము కాదు. మీరు నావంకనట్లు చూడవద్దు. నాతోనట్లు మాట్లాడవద్దు. నేను చెడిపోయితినని మీకు చులకనగా నున్నదేమో? నేనేదో దారితప్పి ఇట్లు వచ్చింతిని.  నేను పడిన దారి తప్పని నాకు తెలిసినది. ఆ తప్పు సవరించుకొనుటకు చదువుకొనవలెననితలచుచున్నాను. ఆతప్పును మరింత వృద్ధి చేయుటకు కాదు. నేనిట్లంటినని కోపగించుకూనకుడు.  నాకు తొందరగా చదువు రావలెననిన తమవంటి వారియొద్దనే చదువుకొనవలయును.  మీరు కోపగించుకుని వెడలిపోయినచో నాకు చదువు రాదు.  మేరెంత బాగుగా చదువు చెప్పగలరో నాకీ కొంచెము సేపటిలోనే తెలిసినది.  నన్ను దయతో చూచి చెల్లెలుగా భావించి చదువు చెప్పుటకు మీ కనుగ్రహము కలిగెనా చెప్పుడు. లేనిచో మీవంటి మంచిగురువుల వద్ద చదువుకొనలేకపోయితినని జీవితాంతము దూఃఖించెదను." అని తలవంచుకొనెను.  ముకుందరావు దృష్టి ఆమె పాపట పై బడుచుండెను.  అతని దృష్టిలో క్రమముగా మార్పు కలిగెను.  ఆమె మాటలలో కాలుష్యము లేదు. కొంత దాచి చెప్పుటయు లేదు. మనోభావమును మళ్ళించుకొని యన్యాసక్త హృదయ చెప్పినట్టును లేదు. పండితుడు, వాగ్లక్షణములు తెలిసినవాడునైన ముకుందరావు రత్నావళి మాటలను, జూపులను, వైఖరిని యథార్ధముగ తెలిసికొనెను.  అతని కన్నులలో నున్న కామ తైక్ష్ణ్యము , కొంచెము విరక్తి, కొంచెము కోపము, కొంచెము నిస్పృహ, కొంచెము జాలి యన్నియు పెనవేసుకొని క్రమముగా జాఱి కన్నులు చల్లబడెను. అతని కన్నులు ప్రసన్నము లయ్యెను.  అట్లగుటకు నైదునిముషములు పట్టెను.  అతని కన్నులతో బాటు వాని కూర్చున్న వైఖరిలో పూర్వపు తైక్ష్ణ్యము, నౌద్ధత్యమును పోయి, సౌకుమార్యము, ప్రసన్నత్వము గోచరించెను.  ఆ కూర్చున్న వైఖరి మాఱుట రత్నావళి చూచెను. ఆమె తలయెత్తెను.  ముకుందరావు కన్నులొక పురుషుడు ఒక  స్త్రీ ని సామాన్యముగా జూచుచున్నట్లయ్యెను. 


ఇది ఒక క్లాసిక్ ఇవ్వగల అనుభవం. కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. పెళ్ళి బయట సంబంధాలు ఆడవాళ్ళకు చాలా క్లాసిక్ లలో అవమాన పూరితంగా ముగింపునిస్తాయి. అన్నా కెరనీనా ప్రియుడి నిర్లక్షానికి గురవుతుంది. పిల్లాడికి దూరమవుతుంది. ఆఖరికి ఒంటరి అయిపోయి ఆత్మహత్య చేసుకుంటుంది. రత్నావళి కి ఆ చింత లేదు. ఆమె చివరి వరకూ ఒంటరి కాదు. ఎవరూ ఆమెను అవమానించరు. తృణీకరించరు. ఆమె కథ తప్పొప్పుల గురించే అయినా, కేవలం ఆమెదే తప్పనో, అదో ఘోరమైన తప్పనో చూపించదు. మొదట్లో ఆడబడుచు తిరగబడి, వదినను కొట్టినా అన్న వదినని ఏమీ చెయ్యకుండా రక్షిస్తుంది.  ఈరోజుల్లాగా ఆమె ఒక ఆస్థి  అని, ఆబ్జెక్టనీ ఎవ్వరూ అనుకోరు. ఇది చాలా ప్రోగ్రెసివ్ ఆలోచన. పూర్వపు "ఎవరి పాపానికి వారిని వొదిలేయడం' ఈనాటి పరువు హత్యల రోజుల్లో చాలా మానవత్వం ఉన్న ఆలోచన కిందే లెక్క. అందులో హిపోక్రసీ లేదు. దాయటం, రంగులు పూయటం లేదు.  

ఈ పుస్తకానికి చెలియలి కట్ట పేరు ఎందుకు పెట్టారో, ఉప్పెన, సముద్రం, ఉప్పునీరు, మంచి నీరు, చవుడు పట్టిన ఇళ్ళు, పంటలు పెద్దగా పండని పొలాలు, కటిక పల్లెటూళ్ళు, ఇవన్నీ ఎందుకు సృష్టించారో వివిధ రివ్యూలలో విస్తారంగా చర్చించారు. కాబట్టి ఆ జోలికి పోవట్లేదు. కొన్ని ఎమోషన్ లకి విలువిస్తాం కాబట్టి, ఇది అర్ధం అవుతుంది. అది ఏమిటో తెలియాలంటే చదవాలి ఈ చెలియలికట్ట ని. మచ్చుకు ముగింపు లో ఓ పేరా. 

అది యెట్టిదో ? - కడలితరగలలోన
కలిసిపోవుట యన్న - దెట్టిదో? అది యెట్టిదో ?
వట్టి యిసుకలపైన - మెట్టనే లనుకొని
మెట్టపడి పోవుచును మట్టిలో గలియు టది - యెట్టిదో ? అది యెట్టిదో ?
అట్టె సంద్రమునడుమ - పుట్టినది హాలాహల
మిట్టె చెలియలికట్ట నెట్టుకొనివచ్చుటది - యెట్టిదో ? అది యెట్టిదో ?
నెట్టుకొని ధర్మములు - గిట్టి చెలియలికట్ట 
పట్టువిడిజాఱి జల - మట్టుగా పొంగు టది - యెట్టిదో ? అది యెట్టిదో ? 

ముగించేముందు చదివేందుకు ఫ్లో గురించి ఒక సలహా. పుస్తకం మొదలు పెట్టేందుకు ఇబ్బంది లేదు. మధ్యలో వచ్చే సుధీర్ఘమయిన సంభాషణలు ఇప్పటి పాఠకులకు బోర్ కొట్టించ వచ్చు. కానీ మాటలు, కమ్మ్యూనికేషన్ తక్కువయిపోతున్న ఈ రోజుల్లో, సిద్ధాంత చర్చ కేవలం యూనివర్సిటీ లాంజ్ లో నో, టీవీ డిబేట్ లోనో కాకుండా ఇంటి వరండాలో చెయ్యడం కూడా చాలా ఇంపార్టెంట్. మనుషులు మాట్లాడుకోవడం, తమ తమ భావాల్ని వ్యక్తపరచడం, సరైన చర్చ లో పాల్గోవడం, తమను తాము మార్చుకోవడానికి ముందుకు రావడం కూడా అవసరం. తాను పట్టిన కుందేలు, తాను ఈదే బావి అంటూ గిరి గీసుకోకుండా అన్నిటినీ స్వాగతించడం, ముఖ్యంగా చదవడం - ఇవీ మనల్ని ఒక జాతిగా, ముందుకు తీసుకెళ్ళేవి. కాబట్టి అలా ముందుకుపోదాం. 😃

28/06/2020

నా కధ - చార్లీ చాప్లిన్ అనువాదం : శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార్

నా కధ - చార్లీ చాప్లిన్
అనువాదం : శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార్QUOTE  అతను ఎలిమెంటరీ స్కూలు దాటి చద్వలేదు - ఎటువంటి శిక్షణ పొందేందుకైనా పేదరికం, పొట్ట గడవని పరిస్థితి. అమ్మతో పదేళ్ళ పిల్ల వాడి గా స్టేజీ చుట్టూ తిరిగినా వేషాలు ఎవరూ ఇవ్వలేదు.   యాక్షన్ కూ ఆడిషన్ కూ అవకశమే లేదు - అయినా ఒక ఫినామినా గా, మేధావి గా, విదూషకునిగా, గొపొప్ప దర్శకునిగా తరవాత కధ, స్క్రిప్ట్ రచయితగా, మూకీ నుండీ, టాకీ వరకూ రెండు ప్రపంచ యుద్ధాల చరిత్ర కాలంలో మారణ హోమపు కమురు కంపులోని విసాద చాయల నేపధ్యంలో - కొన్ని భగ్న ప్రేమలు, మూడు పెళ్ళిళ్ళు, రెండు విడాకు, ఒక స్కాండల్, బ్లాక్ మెయిల్, క్రిమినల్ కేసులూ ఇలా 40 సంవత్సరాల పాటు జరిగిన జైత్ర యాత్రలో చిన్నా, పెద్దా 80 చిత్రాలలో 90 శాతం విజయాలతో "మిలియనీర్ ట్రాంప్' గ ఎదిగి, అమెరికా అధ్యక్షుని కోసం ప్రచార ప్రసంగాలు చేసి,  "ద గ్రేట్ డిక్టేటర్ "  తీసి, యాంటీ నాజీ గా, సోషలిస్టు గా, కమ్యూనిస్ట్ గా ముద్ర వేయించుకుని అప్పటి మత చాందసుల ఒత్తిడితో అమెరికా దేశపు చట్టాల చట్రంలో ఇరుక్కొని, దాదాపు ఇరవై సంవత్సరాల శిక్ష కు కారాగారపు గుమ్మంలో నిలబడి, అదృష్టవశాత్తు బయటపడి, అమెరికా దేశం నుండి దాదాపు తరిమి వేయబడిన బ్రిటిష్ పౌరునిగా, ప్రపంచం లోని మహామహుల సాన్నిధ్యంలో విందులు, వినోదాలు పంచుకుని, మేధావులతో భుజాలు రాసుకుని, దేశాధినేతలతో - రాణులతో, యువ రాజులతో ఓపెరాలు చూసి, అహంకారం పొడసూపని ఆత్మవిశ్వాసంతో, సంపదను పరాయిదానిగానే చూసి, అపారమైన కీర్తిని తలకెత్తుకొని, అసంగతమైన అపఖ్యాతిని మూటగట్టుకుని, చివరికి స్విట్జర్లాండ్ పర్వత సానువుల్లో తన చిన్నారి భార్య ఒడిలో, ఆరుగురు పిల్లలతో ఒదిగి, మనకు అందించిన ఈ అత్భుత గ్రంధం - చ్
చార్లీ స్వీయ కధ నుంచి, కాల పరీక్ష కు నిలబడే ఆయన అభిప్రాయాలూ - అనుభవాలూ కొన్ని మీ ముందుంచుతున్నాను UNQUOTE అంటూ రచయిత / అనువాదకుడు శ్రీ వల్లభనేని అశ్వినీకుమార్ మొదలు పెట్టిన ఈ పుస్తకానికి ముందు మాట తనికెళ్ళ భరణి రాసారు. 

చార్లీ చాప్లిన్ నిస్సందేహంగా అత్భుత వ్యక్తి.  ఎక్కడో ఖండాంతరాలలో అత్భుత ప్రతిభ కనబరచిన ఈ చిన్న వ్యక్తి ని ప్రపంచం నలు మూలలా చిన్నా పెద్దా అందరూ ఎంతో కొంత ఎరిగే ఉంటారు.     తొలి పలుకుల్లో తనికెళ్ళ భరణి అంటారు.. "ఒక సారి పుస్తకం మూసేసాకే - మనసుకి తడొస్తుంది. మెదడు కి చెమట పడ్తుంది - విషాద ప్రపంచం లో ఉక్కిరిబిక్కిరైపోతాం. ఒక్కసారి హాలీవుడ్ లోకి అడుగుపెట్టాక అన్నీ విజయ గానాలే - అక్కణ్ణించీ ప్రపంచం లో ప్రతీ కుటుంబం లోను సభ్యుడైపోయాడుగా మరి - కానీ పుస్తకం చదివేసాక మనకేడుపొస్తుంది !! "

1889 వ సంవత్సరం ఏప్రిల్ 16 న పుట్టాడు చార్లీ.. వాక్వర్త్ తూర్పు సందులో రాత్రి ఎనిమిది గంటలకి.. తల్లి చిన్న పిల్లల్ని ఆయా  సంరక్షణలో ఉంచి రాత్రి వేళల్లో నాటక శాలకు వెళ్తూండేది. ఆమె రంగస్థల నటి. పేదరికం ముందు నుంచీ ఉన్నదే గానీ దుర్భరమైన పేదరికం అనుభవింపు లో కి వచ్చేసరికీ చార్లీ కి ఊహ తెలిసింది. అన్న కేవలం తనకన్నా నాలుగేళ్ళు పెద్ద సిడ్నీ అంత చిన్న వయసు లో ఓడల మీద పని చెయ్యడానికి వెళ్ళడం. తల్లికి గొంతులో ఆరోగ్య సమస్య రావడం వల్ల ఆమె రంగస్థల నటన మూలపడడం.. చిన్నప్పట్నించీ చార్లీ అనుభవించింది బీదరికాన్నే, రిక్త హస్తాల్నే.


తండ్రి కూడా నటుడు. తల్లిని వదిలి సవతి తల్లిని పెళ్ళాడాడు. తల్లి ఒక్కత్తీ ఈ పిల్లల్ని సాకుతూ, ఇరుకు గదుల్లో, కుట్టు పనితో, ఆకలి కి పొట్ట నింపుకొనే దారి లేక, ఇంట్లో ఉన్న సామాన్లూ అవీ అమ్ముకుంటూ తినాల్సిన పరిస్థితిలో తీవ్ర ఒత్తిడి లో ఉంటుంది. తల్లి "హానా చాప్లిన్"  అంటే ఇద్దరు పిల్లలకి ఆరాధన.  చిన్న పిల్లలకి సహజంగా తల్లి పట్ల ఉండే ఆరాధన తో "మా అమ్మ ఎంతో అందంగా హుందాగా ఉండేది.  ఆమె వంటి రంగు చాలా తెల్లగా ఉండేది.  నీలి కళ్ళు, ముదురు రంగు జుత్తు లో ఆమె దేవత లా అనిపించేది. తెలిసిన వాళ్ళు ఆమె ఆకర్షణ గురించి చెప్పేవాళ్ళు " అని వర్ణిస్తాడు. 

చార్లీ జీవితం లో అత్యంత భయానక మైన అనుభవం అంతా బాల్యానిదీ.  భయానకం అంటే మరేమీ లేదు. బీదరికం.   తినడానికి, పిల్లవాడికి పెట్టడానికి ఏమీ లేక పొరుగు ఇళ్ళకు వెళ్ళి చెప్పాల్సి వచ్చే ఆ తల్లి దైన్యం..   పెద్ద కొడుకు సిడ్నీ, పదిహేనెళ్ళయినా నిండని వాణ్ణి ఓడల్లో పనికి విదేశాలకు పంపడం,  కేవలం డబ్బు కోసం. పిల్లలు ఇద్దరూ చాలా కష్టాలు పడటం, ఈ కష్టాల్లో అలిసి పోయి, ఉద్వేగంతో, ఒత్తిడితో మనశ్శాంతి కరువై, హానా కి మతి భ్రమిస్తుంది. 

తల్లి ఒక్కతే చార్లీ జీవితానికి చెందిన ఒకే ఒక ఆధారం.  తల్లి అంటే వెర్రి అభిమానం, ప్రేమ, ఆవిడ త్యాగాల్ని మర్చిపోలేని కృతజ్ఞత, ఆమె కు ఎలాంటి సహాయం చెయలేని వయసు.. చార్లీ తల్లి మతి భ్రమించి మానసిక చికిత్సాలయానికి వెళ్ళేసరికీ, చాలా షాక్ కు గురయ్యే చిన్న పిల్లాడి ఒంటరితనాన్ని చదివి గుండె తడి ఉద్వేగం కలుగుతుంది. తల్లి వెళిపోయే సరికీ, అద్దె ఇంట్లో ఒక్కడూ ఎలానో ఉంటాడు.  అన్న సిడ్నీ ఓడల పని ముగించుకుని ఆఫ్రికా నుండీ వచ్చేవరకూ.. ఆ దశ అంతా అత్యంత విషాదం.   పిల్లలిద్దరూ తల్లిని ఆసుపత్రి లో కొంచెం కుదురుకున్నాక కలుస్తారు.   డాక్టరు చెప్పినదాని ప్రకారం, సరైన ఆహారం లేక ఆమె కు మతి భ్రమించింది.  చార్లీ ఆ రోజు నువ్వు నాకొక్క కప్పు టీ ఇచ్చి ఉంటే ఇలా అయుండేది కాదు అని తల్లి అనగానే చార్లీ గుండె బద్దలవుతుంది.  ఆ మాట అంతని గుండెలో అలా నాటుకుపోతుందంటే అతని జీవన పర్యంతం.. ఆ విషాదమైన మాట ని అతను గుర్తుంచుకునే ఉంటాడు. నిజానికి ఆ పూట తినడానికి ఏమీ లేక, పిల్లాడిని స్నేహితుని ఇంటికి తల్లే పంపిస్తుంది. అంత విషాదం లోనూ, చార్లీ తల్లిని ఆసుపత్రి లో వదిలి వచ్చాక ఆవిడ ఒక మూల దాచిన మిఠాయి చూసి ఒక్క సారిగా ఏడుస్తాడు.  హన్నా చాప్లిన్, ఆ తరవాత పిల్లల ఎదుగుదల ని గ్రహించుకోగలిగేంత స్థితి లో ఉండదు. 

ఇన్ని కుదుపుల తరవాత, సిడ్నీ ఇంక ఓడల మీద ఇల్లొదిలి వెళ్ళే పని మానుకుని, నటన మీద దృష్టి కేంద్రీకరిస్తాడు. అన్న అడుగుజాడల్లోనే చార్లీ కూడా నాటకరంగ ప్రవేశం చేస్తాడు. బాలనటుడి గా.   చార్లీ నాటకాల్లో ఎంతో కొంత పేరు గడిస్తూ, అత్యంత మేధావులైన బ్రిటీష్ నటులతో సరితూగే లా తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ,  ఇంగ్లండు యావత్తూ తిరుగుతూ, బాల్యం నుండీ యవ్వనానికి ప్రయాణిస్తూ..  నాటక రంగంలో ఒక ముద్ర వేస్తాడు. జనం చార్లీ ని గురించి మాటాడుకోవడం.. పత్రికలు అతనికి మంచి భవిష్యత్తు ఉన్నట్టు రాయడం,  ఆర్ధికంగా కాస్త కుదురు ఏర్పడటం..  అంతా తరవాత జరిగే విషయాలు.  తల్లికి మెరుగైన వైద్యం, ఆహారం ఇవ్వగలిగే తన స్థితి కి చార్లీ, సిడ్నీ ఇద్దరూ ఎంతో ఆందిస్తారు.

ఆతరవాత తాను పని చేసే రంగస్థల కంపెనీ ఫ్రెడ్ కార్నో తరఫున నాటకాలు వేయడానికి మొదటి సారి పారిస్ పర్యటన, (చార్లీ తండ్రి ఫ్రెంచు వాడే) పారిస్ లో అనుభవాలు..  ఇంగ్లండు లో హెట్టీ ని ప్రెమించడం, ఎందుకనో అది విఫలం కావడం.. మొత్తానికి ఫ్రెడ్ కార్నో తరఫున అమెరికాకి వెళ్ళాల్సిన అవకాశం రావడం.  కార్నో కంపెనీ అమెరికా లో నటించేందుకు మంచి హాస్య నటుణ్ణి వెతుకుతుందన్న మాట విని.. చార్లీ తను ఇంగ్లండు లో ఉండి చెయగలిగింది ఏమీ లేదని గ్రహించుకుంటాడు. మార్పు కోసం ఎదురు చూస్తున్న అతనికి ఇదో సువర్ణావకాశం.  అమెరికా చేరాక,  బ్రిటీషు మర్యాదలకి భిన్నంగా మనుషులు.. కొత్త అలవాట్లు, పలుకులు,  బ్రాడ్వే మాయ తెలిసే సరికీ.. "అవును ! ఇదే - ఇలాంటి జీవితం కావాలి. నాకు ఇదే తగిన ప్రదేశము ! అనుకునేంత గా నచ్చింది అమెరికా.. చార్లీ కి.

కానీ ఇంగ్లండు లో తనను చూడగానే గొల్లున నవ్వే ప్రేక్షకులు ఇక్కడ లేరు.  మొదట గందరగోళ పడ్డా.. మెల్లగా కుదురుకుంటాడు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకున్నాక, చార్లీ కి ఎదురు లేదు.  అప్పుడప్పుడే మొదలయ్యే చలన చిత్ర పరిశ్రమ కూడా అతన్ని ఆకర్షిస్తుంది.  మేధ, వ్యాపారం, కళ కలగలుపు వ్యవహారంలో కిటుకులు గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు.  అయినా వితండవాదాన్ని, మంకుపట్టు మూస భావాల్నీ జయించి,  ముందుకు పోవడానికి, హాస్య మూకీ చిత్రాల్లో తన మార్కు సంపాదించడానికి చిన్న పాటి యుద్ధం చేసి, గెలిచాడు చార్లీ.  సృజన, తన మీద తనకున్న నమ్మకం, కష్టపడే మన్సస్తత్వం తప్ప అతని దగ్గర ఏమీ లేదు. హాలీవుడ్ కు కావాల్సింది అదే.

ఒకప్పుడు సాంకేతికతే సినిమా అంతా అయినప్పుడు, నటీనటులు పడుతూ లేస్తూ తెర అంతా కలియ తిరుగుతూ అదే హాస్యం అని చెల్లుబాటయిపోతూండటం సహించలేక, తన బ్రిటీషు యాస ని ఆటపట్టిస్తూ, తన మీద హాస్యానికి మాటలు విసురుతూన్నప్పుడు,  దర్శకుడు - చార్లీ - ఇక్కడ నవ్వులు కావాలె. ఏదైనా హాస్యపు వేషం వేసుకో - ఏదైనా పరవాలేదు" అన్నప్పుడు పెద్ద ఆలోచన లేకుండానే దుస్తులు మార్చుకునే గదిలో పెద్ద పంట్లము, పొడుగాటి బూట్లు, డెర్బీ టోపీ, చేతిలో వంగిన కర్ర, అన్నీ వ్యతిరేకాలే - అనుకుంటూ, హాస్యగాడి పాత్ర కు వయసు ఎంత ఉండాలో నిర్ధారించుకోలేక, చిన్న మీసం పెట్టుకుని - మేకప్ తో బయటకు వచ్చి నిల్చునేసరికీ, అంత సాంకేతిక దర్శకుడూ, సామాన్య ప్రేక్షకుడిలా నవ్వి నవ్వి, పగలపడి నవ్వి, నిలువెల్లా వణికిపోయాడు. ఆ వేషమే ట్రాంప్.. చార్లీ ని చిరంజీవిని చేసిన గెట్ అప్.  ఈ పెద్ద మనిషి (ట్రాంప్) కి చాలా కోణాలున్నాయి. ఇతను ఒక కవి, కలలు కనేవాడు. ఎపుడూ ఏదో ఒక మంచి జరుగుతుందని ఆశించేవాడు. రొమాన్సు కోసం ఎంతో సాహసంతో ఎదురుచూసేవాడు.  అని మొదలుపెట్టిన చార్లీ... ట్రాంప్ ని అజరామరం చేసేసాడు.

ఈ చార్లీ జీవిత చరిత్ర ఎంతో వివరంగా, అతని సినీ జీవిత ప్రస్థానాన్ని వివరించుతూ, అతని జీవితంలో ఎదురుపడిన పలు స్త్రీ పురుషులూ, నటీ నటులూ, దర్శకులూ, సాంకేతిక నిపుణులూ.. నిర్మాతలూ, స్నేహితులూ, సన్నిహితులూ అందర్నీ చిక్కగా సినిమా కధ రాసినంత వలపుతో రాస్తాడు.  చార్లీ అమెరికా జీవితం ఎందుకంత వివాదాస్పదం, అతని కోర్టు కేసులూ, అత్భుతమైన వైవాహిక జీవితం,  తల్లి తరవాత తల్లి లాంటి భార్య. ఒడిదుడుకుల్ని ఎంతో వివరంగా అందించాడు చార్లీ.  అంతే అత్భుతంగా, పూర్తి నిబద్ధత తో, తన శైలి ని కూడా, కలుపుతూ హృద్యంగా తెలుగు చేసారు శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార్.  మధ్యలో చార్లీ కలుసుకున్న ప్రముఖులు... ఆ తరానికి చెందిన మహానుభావులు.. చార్లీ తో నటించిన నటీ నటులు,  కట్టుబట్టలతో ఇల్లువిడిచి, అమెరికా విడిచి పోవాలిసి రావడం,  సిడ్నీ, చార్లీ ల ప్రేమ.. ఇవన్నీ చదివినపుడు నిజంగా సంభ్రమం కలుగుతుంది.

చార్లీ ఎన్నో మంచి మానవత్వమైన సినిమాలు తీసాడు.    చాప్లిన్ తీసిన కొన్ని అత్భుతమైన సినిమాలు
సిటీ లైట్స్, మోడర్న్ టైంస్,  ద గ్రేట్ డిక్టేటర్ (ఇందులో స్పీచ్ అత్భుతం) ద కిడ్, ద గోల్డ్ రష్, లైం లైట్, ద సర్కస్, ద అడ్వెంచరర్, వన్ ఏ ఎం, మేకింగ్ ఎ లివింగ్, ఎ డాగ్స్ లైఫ్, ద ఇమ్మిగ్రంట్, ద ట్రాంప్.    హాస్యం కోసం ఎంతో సాహసమైన ఫీట్లు చేసాడు. ప్రేక్షకుల్ని నవ్విస్తూనే విషాదాన్నీ రుచి చూపించాడు. అతని ట్రాంప్ మాత్రమే కాదు ద గ్రేట్ డిక్టేటర్ లా అతను కూడా హాస్యం అంచున మానవత్వాన్ని కూడా, విలువల్ని కూడా ప్రేక్షకులకి గుర్తు చేసాడు. అందుకే చార్లీ ఒక ఐకాన్. అతని జీవితం ఒక అత్భుతం.  వివరంగా ఈ అత్భుత వ్యక్తి గురించి చదవడానికి అదీ.. తెలుగులో..  'నా కధ'  ఒక అత్భుత అవకాశం.
                                                                                

ఓల్గా - రాజకీయ కధలు

ఓల్గా - రాజకీయ కధలు 

ఓల్గా రాసిన మంచి రాజకీయ కధలు.   ఈ పది కధలూ రాయడానికి మిగిలిన రచనల కన్నా ఎక్కువ కష్టపడడం గురించి ముందుమాట లో ప్రస్తావిస్తారు ఓల్గా. అందుకేనేమో ఇవి  రచయిత్రి బలపరచిన మిగిలిన భావజాలాల  పుస్తకాల కన్నా, కధక కన్నా ఎక్కువ నచ్చాయి.  స్త్రీ అంటే ఒక భోగ వస్తువు. ఆమె శరీరం, అంగాంగాల గురించీ సాహిత్య ప్రపంచంలో పుంఖానుపుంఖాలూఅ వర్ణనలూ, సంపెంగ ముక్కూ, మెడ మీది గీతలూ, తుమ్మెద రెక్కల్లాంటి కురులూ, పొడవాటి జడ, సన్నని నడుమూ,  దొండ పళ్ళలాంటి పెదవులూ, నిండైన స్తనాలూ - ఇలా ఏ అంగాన్నీ వొదిలిపెట్టకుండా సమాజం అత్భుతమైనదిగా పొగిడే సాహిత్యం విస్త్రుతంగా అందుబాటులో ఉన్నప్పుడు, ఒక స్త్రీగా,   స్త్రీ శరీరాంగాల గురించి, వాటి పట్ల సమాజపు దౌష్ట్యం గురించీ రాస్తే అవి రాజకీయంగా సరైన వాదనలు గానే నిలుస్తాయి. అవీ ఈ రాజకీయ కధలు.  ఈ కధలు ఎనభైల్లో వివిధ పత్రికల్లో విడి గా ప్రచురించబడ్డాయి.  కానీ పుస్తకంగా, ప్రచురణా కాలం 1993.

మొదట : జడ. రచనా కాలం తొంభయిలదే అయినా, జడ పట్ల కధానాయకి అనుభవాలు కాస్త డెబ్భయిల్లో!  అమ్మాయికి పుట్టిన దగ్గర్నుంచీ జుత్తు పోషణే జీవితం, జుత్తే ఐడెంటిటీ, జుత్తే సర్వస్వం.   దాంతో పేలూ, ఉక్క పోతా.. రెండు పూటలా ఓ గంట సేపు సమయం వృధా అయినా, "అమ్మా జుత్తు అన్ని పన్లకీ అడ్డొస్తుంది కత్తిరించుకుంటానే "  అంటే గదమాయింపు!   ఆఖర్న ఆ పిల్ల జుత్తే తన ప్రత్యేకత అనుకుంటుంది.   పెళ్ళయ్యాక భర్త జుత్తుని పట్టించుకోపోతే కృంగిపోతుంది.  ఆ పెద్ద జడ పోషించీ పోషించీ, వైధవ్యం  కలిగాకా, తనకూ గుండు గీస్తారేమో అని భయపడిపోతుంది.  ఆ గండం  ఎలాగో గడిచినా, జుత్తుకీ, విధవరికానికీ లంకె!   " కోరికలు కలగకూడదనిట క్రైస్తవ నన్ లు గుండు గీయించుకుంటా" - అని స్కూల్లో తెలుసుకున్న పిల్ల -  ఇప్పుడు  విధవయ్యాకా, జుత్తుకి నూనె రాయడాన్ని కూడా వదినలు గేలి చేస్తూంటే ఇంక జళ్ళోకి పూలు పెట్టుకోవడమే?!! అరవై ఏళ్ళకి జుత్తు జబ్బు చేసి రాలిపోతూంటే, పుట్టిన్నాటి నుండీ తన వ్యక్తిత్వంలో భాగమైపోయిన జడ, దాని మీద కన్న వారి దగ్గరి నుంచీ, కట్టుకున్న వారి వరకూ, విధవయ్యాకా, వొదినల నుంచీ, సమాజపు పోకడల దాకా.. ఎందరి అజమాయిషీ - వీట్ని నెమరు వేసుకుని నివ్వెరపోయే, సీత!

రెండు : కళ్ళు. ఆడపిల్ల ఇంటి దగ్గర తల వంచితే, మళ్ళీ ఇల్లుంచేరాకే తలెత్తాలి.. అనే ధోరణి. ఈ కధల్లో కధానాయికలందరూ చెంగు చెంగున ఉత్సాహంతో తుళ్ళే పసిపిల్లలు. వాళ్ళకి పుట్టిన దగ్గర్నుంచీ పట్టింపుల మోతే.  ఆడపిల్లలు అరవకూడదు. కన్నెత్తి ప్రపంచాన్ని చూడకూడదు.. ఇలా అన్నిటికీ ఆంక్షలే.  ఎందుకు అని ప్రశ్నిస్తే గద్దింపులతో అణిచేసే తల్లిదండ్రులు. కళ్ళ ముందు అన్యాయం జరిగినా, ఆ ఆల్చిపల్లాంటి కళ్ళు ఏవీ చూసినా స్పందించని పూసల్లాగా తయారవడం గురించి. ఎంత మానసిక అణచివేత !

మూడు : ముక్కు పుడక.  సంపెంగ పూనాసిక లేని అమ్మాయి. ముక్కు పుటాలు పెద్దవి. చిన్నపుడు నాయనమ్మ బలవంతానికి బేసరి కోసం ముక్కు కుట్టించుకున్నా.. అది కాస్తా సెప్టిక్కయ్యి, ముక్కు మీద మచ్చా, కన్నమూ మిగిలిపోయి మొహాన అదే పెద్ద అందవిహీనతా సాక్ష్యం లా మిగిలిపోతుంది.  ఆడపిల్ల పొట్టయినా, పొడుగున్నా, నల్లగా ఉన్నా, బక్కగా ఉన్నా.. ఇలా పలు వంకలతో పెళ్ళి అనే ముఖ్య కార్యానికి నిరాకరణ కి గురయిపోవడన్ని చర్చిస్తారు, ఆఖర్న ఆ కన్నం పూడేలా చిన్న ఆపరేషన్ కూడా చేయించాకా, చిన్నప్పట్నించీ తన అస్థిత్వంలో భాగమైపోయిన ఆ ముక్కు మీది కన్నం గురించి ఆలోచిస్తుంది అమ్మాయి.  చదువు  విషయంలోనూ వివక్ష! అన్నకి ఓలా, తనకింకోలా చదువు చెప్పించడం.  అద్దెకున్న వాళ్ళు ఇంటిముందు పెద్ద చెట్లు నాటరు, ఎందుకూ? అవి పెద్దయ్యాకా, ఇంటి యజమాని అనుభవిస్తాడు గానీ, తాము అముభవిస్తామా అని!  అందుకే ఆడ పిల్లలకి మంచి చదువులు చెప్పించరు, ఎలాగూ మనింటి పిల్ల కాదు కదా. వెళ్ళిపోతుంది కదా అని!   అలా వానా కాలపు  చదువు ముగించి ,  చిన్న ఉద్యోగం చేసుకుంటున్న పిల్లకి అతి కష్టం మీద సంబంధం కుదురుతుంది.  అబ్బాయి ఆ ముక్కుకి ముక్కుపుడక లేదు.. కుట్టించుకోమంటే ?    అసలామె ముక్కు మీద అతని అధికారం ఏమిటి ? అని అనిపించదూ ?

నాలుగు : "నోర్ముయ్" ! చిన్నప్పుడు ఉత్సాహం మీద నీళ్ళు చల్లేసే ఆ 'నోర్ముయ్' ! మెదడు నిండా పుట్టే ఎన్నో మాటలూ, ప్రశ్నలూ, వాటిని శబ్ద రూపంలో బయట పెట్టే నోరు. పసితనం నుండీ ఆడ పిల్ల ఎక్కువగా వినే పదం. ఆఖరికి మాటలు మెదడు ఉత్పత్తి చెయ్యడమే మానుకునేంతలా కండీషనింగ్ ! పెళ్ళయాక మొగుడు ఎందుకలా ముంగిలా ఉంటావని చెంపలు వాయిస్తే మళ్ళీ నోరు పెగిలి బయటికొస్తాయి మాటలు, కేవలం అతనికి నచ్చేంత ప్రియ సంభాషణ చేసేంత వరకే.  కానీ అదే నోరు ఆలోచనల్ని మొదలెట్టి, ప్రశ్నిస్తే మాత్రం ఉరుములా మీదపడే పదం ఈ "నోర్ముయ్ !"

అయిదు : వెన్నెముక.  స్త్రీ తన బలా బలాల్ని బేరీజు వేసుకుంటూ, మెదడుపయోగించని, గంగిరెద్దు వ్యక్తిత్వాన్ని, ప్రశ్నించని, ఆలోచించని, కష్టించని దారుల్లోంచీ బయటికొచ్చి సన్నని నడుం కోసం తిండి మానుకుని బలహీనపడకుండా, శారీరక,  మానసిక దృఢత్వం పెంచుకోమని చెప్పే కధ.


ఆరు :  'రాతి గుండెలు'.  పెరిగి వయసు తో పాటూ శరీరంలో వస్తున్న మార్పుల గురిచి అవగాహనే లేని చిన్న వయసునుండీ, మగాళ్ళ దృష్టిలో కామ వాంచలు కలిగించే  స్తనాల,  (గుండెల) వల్ల బాల్యం నుండే,  టీచర్, మావయ్య, పక్కింటాయన, ఇలా అందరి ప్రవర్తన వల్లా - పెళ్ళయ్యాక భర్త వల్ల , తన దౌర్బల్యానికి కారణమయిన స్తనాల మీద విరక్తి ఆమెకు.  పిల్లలు కలిగి వారికి ఆహారాన్నిచ్చే మధుర గర్వ క్షణాల వరకూ - స్త్రీల స్తనాల పాత్ర గురించి ఈ కధ.   ఆఖర్న పిల్లలకు పాలివ్వాలన్నా ప్రైవసీ ఇవ్వక అబగా చూసే జనాల కారణాన, స్తన్యమే ఎండిపోయిన అమ్మ కధ.  ఆఖరికి కేన్సర్ వచ్చి స్తనాల్ని తొలగించ్నేయాల్సి వస్తే, ప్రీ కౌన్సిలింగ్ లో డాక్టర్ తో - 'వీటి పీడ వదిలితే ఆనందమే'  అని చెప్తూ - "నేను నా ఇద్దరు పిల్లలకీ పాలివ్వలేదు, అందుకేనా నాకు కేన్సర్ వచ్చింది ?"   అంటూ గిల్టీ గా అడిగే అమ్మ "రాతి"  స్తనాల  వెనక ఓ హృదయం గురించి.

ఏడు : "అయోని".   అమ్మమ్మ రెక్కలలో దూరి కధలు వింటూ, చందమామ కధల్లో అపురూప బాల్యం అనుభవించే, తొమ్మిదేళ్ళకే చందమామకు కధ రాసిన బుల్లి రచయిత్రి.   ఒకనాడు పిల్లలెత్తుకుపోయే రాక్షసుల బారిన పడి,  మూడేళ్ళ పాటూ లైంగిక అత్యాచారాలకు గురయ్యి, బాల వ్యభిచారిణిగా చీకటి జీవితంలో మగ్గిపోతూ, పన్నెండేళ్ళకు, తాను చచ్చిపోయే ముందు రాసిన   (రాయాలనుకున్న)  కధ  ఇది.   ఎంత కరుణ లేదో. ఆ పసి దాన్ని.. తిండి పెట్టకుండా,  ఆ  శరీరాన్ని అమ్మి, వాళ్ళు తన యోనినే పదే పదే చీల్చేస్తూంటే,   రక్తమడుగుల్లో అమ్మ కోసం వెతుక్కునే పిల్లకి అన్నం పెడితే, అది అన్నమో రక్తమో అర్ధం కాదు.   ఒకనాడు మాటల్లో సీత అయోనిజ అనే పాట వల్ల యోని అనే పదం తెలుసుకుని,  మనమంతా యోనిజలమా. యోనిజ, అయోనిజ, అయోని అంటూ పదాల్ని చర్చించి,   ఈ 'పదం' ఇప్పుడు తెలిసింది. "నేను అయోని ని అయితే బావుణ్ణు.. దీని వల్లే కదా నాకిన్ని కష్టాలు"  అంటూ షాక్ కి గురి చేసే పాప కధ.   ఈ కధ ఆడియో రచయిత్రి గొంతులోనే అందుబాటులో వుంది.   ఎంత  విషాదం  ? అది లేకపోతే ప్రపంచమే లేదు అంటే - "బాధ తోనే ప్రపంచం ఉందా? హింసతోనే ప్రపంచం ఉందా?"   అనే ఆ  చిన్న పిల్ల "అందరూ నన్ను 'యోని'  గానే చూసారు (మనిషి లా కాదు) ఈ ఒక్క అవయవం లేకపోతే నా బ్రతుకు ఇలా ఉండేదికాదుకదా" అనుకోవడం !  ఈ కధ చిన్నారి శ్వేతకు,  రచనా కాలం నాటికి ,  హైదరాబాదులో లైంగిక వ్యాపారాలకు గురయ్యి, చనిపోయిన చిన్నారులకు, రక్తపు కన్నీటితో అంకితం చేశారు రచయిత్రి.

ఎనిమిది :  ఒక రాజకీయ కధ : స్త్రీ ఎందుకు కావాలి సమాజానికి ? పిల్లల్ని కనడానికే. వంశాభివృద్ధికి.  అంత కన్నా ఇంకో పాత్ర లేదు, తనకో మనసుండదు. ఫాక్టరీ కో ఆక్సిడెంట్ లో చేతివేళ్ళు కోల్పోయిన  భర్తను ఆదుకోవడానికి యూనియన్ వాళ్ళొస్తారు. మానసికంగా కుంగిపోయిన మనిషిని తాను మనిషిని చేస్తుంది. ఉద్యోగం పోదు. బ్రతుక్కి అండగా సమాజం నిలుస్తుంది, కానీ గర్భధారణ జరిగాకా, ఆక్సిడెంటల్ గా అది విచ్చిన్నమై, తను తల్లిని చేయగలిగే అవయవాన్ని కోల్పోవాల్సి వచ్చినపుడు, భర్తా, అత్త మామలూ, కన్న వారూ, ఎవరూ అండగా నిలవరు, మానసిక ఆసరా అవసరమైన మనిషిని వొదిలి ఇంకో పెళ్ళి చేసుకునేందుకు భర్త సిద్ధ పడుతుంటే, తనకెందుకు సమాజం సాయపడదో అర్ధం కాదు ఆమెకు.


తొమ్మిది : కేసు. ఇది చాలా ఆశక్తి కలిగించే రాజకీయ కధ. మెటర్నరీ లీవులు, పిల్లలు అనగా రేపటి పౌరుల పంపకం, ఉద్యోగం చేసే ఆడ వాళ్ళ మాతృత్వపు హక్కులు, తండ్రికీ కావాల్సిన పెటర్నరీ హాలిడేస్.  వీటి గురించి, పాలిచ్చి పెంచాల్సిన వయసు పిల్లల కోసం  ఆఫీసు కు అనుబంధంగా క్రెచ్, ఫీడింగ్ టైం.. వగైరాల గురించి చర్చించిన కధ. ఇవన్నీ దాదాపూ మొత్తంగా (180 రోజులు) పిల్లల సంరక్షణ కీసం చైల్డ్ కేర్ లీవుల దాకా ఇప్పుడు అందుబాటు లోకొచ్చాయి, కానీ ఆ రోజుల్లో ఈ హక్కుల కోసం పోరాడిన వనితలు ఎదుర్కొన్న వివక్షా, తిరస్కారం, కుటుంబం నుంచీ సహాయ నిరాకరణల గురించి ఈ కధ.

పది :   ఆర్తి.   పిల్లలకు విడాకుల అనంతరం తండ్రే చట్ట ప్రకారం సంరక్షకుడు. ఇప్పటికీ అదే న్యాయం.  పెళ్ళాం మీద కక్ష కట్టి, పిల్లల్ని తనతో తీస్కెళ్ళిపోయి, తల్లికి గర్భ శోకం కలిగించే భర్త. పిల్లలకి అన్నం పెట్టాడో లేదో, చదివిస్తున్నాడో లేదో, వొంట్లో బాలేకపోతే ఎలా చూస్తాడో అని బెంగ పెట్టుకుని, ఆ రంపపు కోర భరించలేని తల్లి కి.. లాయర్ స్పష్టంగా చెప్పిన విషయం ఇది. "పొలం కౌలుకి తీసుకున్నమనుకో.. ఫలసాయం మీద హక్కు ఎలా అయితే యజమానిదో.. నీ పిల్లల మీద హక్కు కూడా తండ్రిదే, నువ్వు కేవలం క్షేత్రానివి. నీ స్థానం అదే! నువ్వు స్త్రీ వనీ, నీ బిడ్డలు నిన్ను చీల్చుకుని పుట్టారనీ, నీ స్తన్యం, నీ రక్త మాంసాలని తాగి పెరిగారనీ న్యాయం గుర్తించదు"  - 'అనీబిసెంటు కే తప్పలేదు ఈ మాతృశోకం'.  అని చెప్తే:

'మేము తల్లులం కాదు - ఆవులం.  
మేము చెల్లెళ్ళం కాదు - గేదెలం, 
మేము ఇల్లాళ్ళం కాదు - పందులం. 
మేం దేవతలం కాదు - పొలాలం. 

మాకే హక్కూ లేదు. మా మీద కూడా మాకు హక్కు లేదు. మేం పెళ్ళాడాలన్న మా ఇష్టం కాదు, పెళ్ళిని కాదనాలన్న్నా మా ఇష్టం కాదు. అంతెందుకు మా మీద సర్వ హక్కులూ మీవే. మా రక్తం మీద, మా కోరికల   మీద, మా ఆలోచనల మీద, మా మీద, అన్నిటి మీదా - మీకే హక్కు. మేం ఆడవాళ్ళం'  అని బాధ పడే స్త్రీ చివరికి తన శక్తిని గుర్తు చేసుకుని,

మా కీ మాతృత్వాన్ని ఏ ప్రకృతి  ప్రసాదించిందో, ఆ హక్కును కూడా ఆ ప్రకృతే ఇచ్చింది. ఆ హక్కును కాల రాసిన ఏ శక్తి ఏదైనా, ఎంత రాక్షస బలంతో కూడినదైనా, దానితో నేను తలపడతాను. 
మళ్ళీ రక్తం ధారపోసైనా నా హక్కును నేను పొందుతాను
నేను జయించి తీఎరుతాను. రాజీ ప్రశ్నే లేదు
ఈ పోరాటం చెయ్యనిదే నాకున్న సృష్టి శక్తికి అర్ధం లేదు. సార్ధకత లేదు..

అని ఆవేశంతో పాటూ ఎంతో ఆలోచన తో స్థిర నిర్ణయం తీసుకునే తల్లి కధ.    తల్లి బిడ్డ "సంరక్షణా హక్కులు" పొందేందుకు చేసే పోరాటం గురించి.

ఈ కధలన్నీ మరీ చాదస్తపు రోజుల్నాటివనీ ఈ రోజలకి సంబంధించినవి కావనీ అనిపించొచ్చు, కానీ ఆ రోజులతో పోలిస్తే స్త్రీ అభ్యుదయం, చదువూ, ఉద్యోగాల వరకూ, కొద్దో గొప్పో ముందుకు కదిలినా, ఇంకా మార్పు రావాలి.  ఆడపిల్లలు పురిటికి ముందే చావడం, పుట్టాకా అమ్మబడడం, పెంపకంలో వివక్షా అన్నీ మారాలి.    మన సమాజంలో స్త్రీ కి న్యాయం, భద్రత, ఈ మాత్రమైనా సాధ్యమయ్యేలా చేసినవి మాత్రం మునుపటి తరాల పోరాటాలే, ప్రశ్నలే.  'మొగ పిల్లలు ఏడవకూడదు, ఏడిపించకూడదూ'  అంటూ నేర్పే బదులూ, అమ్మాయిల్నీ, వాళ్ళ శరీరాంగాల్నీ కేవలం ఒక ఆస్థిలా చూసే స్వభావం మారి, వారినీ సమానంగా పెంచి, అవకాశాలిచ్చి, వారి బాధ్యతలని, కలల్నీ  పంచుకుని, మనసున్న మనుషుల్లా చూడాలని చెప్పడమే ఫెమినిజం.    ఈ కధల్లో బాడీ షామింగ్ గురించి ప్రశ్నించడం, తూనీగల్లాంటి ఆడపిల్లల రెక్కల్ని కన్న వారే ఖండించడం,   మానసిక, భౌతిక,  లైంగిక దాడి,   పిల్లల్ని అడ్డు పెట్టుకిని, భర్తల వేధింపులూ.. ఇలా   రాజకీయన్ని చక్కగా చర్చించారు.  అందుకే ఇది ఓల్గా కధల్లో బెస్ట్. ఆవిడ కూడా వీటిని రాసి తానెంతో నేర్చుకున్నానూ అన్నప్పుడు,  మనమూ ఏమి నేర్చుకోవచ్చో తెలుసుకోవడానికీ, మనుషుల్ని మనుషుల్లా చూడ్డానికి,  మానవత్వం తో నన్నా చదవాలీ కధలు.