బుల్లే షా, పంజాబ్ కు చెందిన ఒక ప్రసిద్ధ సూఫీ గురువు. శతాబ్దాలుగా జనరంజకమైన వాక్యాలని రాసి, వాటికి ఎప్పటికప్పుడు కాలానుకూలంగా సరికొత్త అర్ధాలు వెతుక్కునే పాఠకుల అభిమానానికి సొంతదారు. అతని కవితల్లో తీవ్రమైన భావోద్వేగం, పిచ్చి పరవశం, ఉత్సాహం, గాఢ అనురక్తి, మూఢ విశ్వాసాల పట్ల తీక్షణమైన తిరస్కారం, సాధారణం. తన కవితలు/పాటలు చదివిన పాఠకుడిని ఆలోచించేలా చేసి, తద్వారా వారిని తీవ్రంగా ప్రభావితం చేయగల లక్షణం బుల్లే షా సొంతం. 'జీవితం', దాని అంతిమ లక్ష్యం, 'మృత్యువు', 'జీవన పరమార్ధం,' 'ఆధ్యాత్మిక చతురత', 'విశ్వాసం' లాంటి వాటి వైపు పాఠకుడి దృష్టి మళ్ళించగల బుల్లే షా కవిత శతాబ్దాలుగా పంజాబీ సాహిత్యంలో ఓ దిక్సూచిగా నిలబడింది.
ఈ పుస్తకంలో మంజుల్ బజాజ్ ఈ కవితలను సులువైన ఇంగ్లీషు లోకి తర్జుమా చేస్తూ, బుల్లే షాని ఆధునిక పాఠకుల చెంతకు వీలైనంత సరళంగా, సున్నితంగా, ప్రతిభావంతంగా తీసుకు రాగలిగారు.
బుల్లే షా జీవిత కాలం బహుశా 1680 - 1758 మధ్యలో ఉండొచ్చు. అతని గురించిన సమాచారమంతా ఓరల్ గా మాత్రమే చరిత్రలో నిలిచిన అతని రచనల్లోనించి రాబట్టినదే. అతని జీవితమంతా ప్రేమను జీవిస్తూ బ్రతికేడు. అతని నిజమైన పేరు "అబ్దుల్లా షా". భక్తీ, ఆచారం కలిగిన సయ్యద్ కుటుంబంలో జన్మించాడు. ఉమ్మడి పంజాబు లోని కాసుర్ లో బాల్యం, చదువూ గడిచాయి. తండ్రి మత విద్య లో పండితుడు. బుల్లే చిన్నపుడు పంజాబీతో సహా అరబ్బీ, పెర్షియన్ చదువుకున్నాడు. కురానూ, ఇస్లామిక్ న్యాయ సూత్రాలు, పెర్షియన్ సాహిత్యం కూడా అధ్యయనం చేశాడు. యవ్వనంలోకొచ్చాకా, మూఢమైన మత విశ్వాసాలని ప్రశ్నించాడు.
ఆ తరవాతే లహోరు లోని "షా ఇనాయత్ కాద్రీ" అనే గురువుని కనుగొని అతని పరంపరని ఎంచుకున్నాడు. 'షా ఇనాయత్ ఖాన్' కులం (తోట) 'మాలి'. బుల్లా లాంటి వాడు, 'సయ్యదీ' అయి ఉండి తక్కువ కులస్తుడి శిష్యుడు కావడమేమిటని సమాజం వెక్కిరించింది. అతన్ని ఆ పరంపర నుండీ తప్పించేందుకు ప్రయత్నాలూ జరిగాయి. గురు శిష్యుల ఎడబాటు బుల్లే షాకి భరింపశక్యం కాలేదు. ఆ దుఃఖోద్వేగంలోనే చరిత్రలో అత్భుతమైన కవిత్వం రాసాడు.
ఈ గురువుతోని అతనికి కలిగిన ఎడబాటు అతని మనసుని ఎంతో చలింపజేసింది. విరహమే అతని ఎన్నో కవితలకు సబ్జెక్ట్ గా మారింది. ఒకానొక సందర్భంలో గురువు కొలువునుండీ బహిష్కరింపబడ్డాక, ఒక నాట్యకత్తె వేషంలో కొలువులోకి ప్రవేసించి, "తెరి ఇష్క్ నచియా" అనే ప్రసిద్ధమైన పాట పాడి, గురువు మనసు కరిగించాడని అంటారు.
షా ఇనాయత్ 1728 లో మరణించాక, బుల్లే షా ఒక టీచర్ గా, కవిగా 'కాదిరీ' పరంపరలోనే కొనసాగాడు. అతని తుది జీవితం, కసూర్ లోనే గడిచింది. అతని తరవాత కవితలన్నీ ఆధ్యాత్మికత లో మునిగి తేలాయి. తన శిష్యులకి మంచీ చెడూ, న్యాయం, అన్యాయం, చావూ పుట్టుకల గురించి మంచి అవగాహన ఉండాలని బుల్లే అభిమతం.
అతని చివరి దశకల్లా పంజాబులో రాజకీయ కల్లోలం మొదలయింది. ముఘల్ సామ్రాజ్య పతనం ఆరంభమైంది. చిన్న చిన్న రాజులు కూడా అణిచివేతలకు పాల్పడేవారు. సిక్కు మతం పుట్టడం, ముస్లిముల ఘోరమైన అకృత్యాలతో, నాదిర్ షా,అహ్మద్ షా అబ్దాలీల ముట్టడులూ కలిసి, మత విశ్వాసాలను కూలగొట్టాయి. రాజకీయ సత్యాలు కూడా అతని కవితలకు వస్తువులయ్యాయి. నిస్పృహా, ఆశా, రాజకీయ పరిమాణాల పట్ల వెటకారం, వ్యతిరేకతా కూడా చోటు చేసుకోవడం మొదలు పెట్టాయి.
బుల్లే కవిత లు మధుర భక్తి ప్రాధానాలు. దేవుడూ, భక్తుడూ వేర్వేరు కాదని, ప్రియుడికీ, ప్రియురాలికీ మధ్య ఉండాల్సిన మోహమూ, ప్రేమా, వాత్సల్యమూ, స్నేహమూ, బంధాలుగా దేవుడికీ భక్తుడికీ ఉండాలన్నది అతని దృక్పథం. బుల్లే కవితల్లో పొంగే భక్తీ, ప్రేమా, విరహమూ పాఠకుడిని వివశుడిని చేస్తాయి. "జీవితం ఎంత మధురమైనది? దానినెందుకు కట్టుబాట్ల పేరునో, కుల మతాల అంతరాల పేరుతోనో ద్వేషం, అహంకారంతో నింపేసుకుంటున్నాము ? చావు కూడా ఎంత అర్ధవంతమైన విషయం?" అని అనుకునేలా చేసినందునే, బుల్లే కవితలు కాలంతో ప్రయాణించాయి. ఇండియా, పాకిస్తాన్ లోని రెండు పంజాబులకూ ఈ కవిత్వం సొంతం.
తాను జీవించినంత కాలమూ బుల్లే షా మతాన్ని, దాన్నంటిపెట్టుకున్న అంధత నీ విమర్శించాడు. పరమత అసహనాన్నీ, మడీ,ఆచారాలనీ, అసలు మతంలోని 'అర్ధం పర్ధం లేని తనా'న్నంతా వ్యతిరేకించాడు. దేవుడికీ, మనిషికీ మధ్య మతం అనే ముసుగు దేనికి ? అందుకే అతను మరణించాకా, అతని శరీరాన్ని పాతిపెట్టేందుకు మసీదు అంగీకరించలేదు. అయితే, విచిత్రమేమిటంటే, ఇప్పుడు కసుర్ లోని బుల్లే సమాధి ఓ ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అతని సమాధి ఇరుగు పొరుగునంతా ఊర్లోని ధనికులూ, గొప్పవాళ్ళూ పాతిపెట్టబడ్డారు.
పంజాబీ సాహిత్యానికి బుల్లే దన్ను ని ఇచ్చాడు. బుల్లే కవిత్వమంతా పంజాబుకే చెందిన వ్యావహారిక మౌఖిక సాంప్రదాయంలోనే భద్రపరచపడింది. అసలు పంజాబీ భాష ఎదుగుదల లో సూఫీ కవిత పోషించిన ప్రధన పాత్ర విచిత్రంగా ఉంటుంది. బుల్లేషా యొక్క మొదటి పంజాబీ సాహిత్య ఆధారం, బుల్లేకి ముందున్న 13 వ శతాబ్దికి చెందిన సూఫీ గురువు బాబా ఫరీద్ మూలాన దొరికింది. సింధు నాగరికత లో భాగంగా ఉండిన పంజాబ్, ఆధునిక మానవుడి ప్రాచీన నాగరికతల్లో ఒకటిగా రికార్డయింది. తక్షశిల లో క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో దాని గురించి ఆధారాలు దొరికినా, ఆ సాక్షం, పూర్తిగా రూపాంతరం చెందని ఫార్మ్ లోనే దొరికింది.
పంజాబీ లిపి ప్రతులు హూణుల, గ్రీకుల ఘజనీ, ఘోరీల దండయాత్రల్లో పూర్తిగా మాయమయ్యాయని అంటారు. కాబట్టి ఏడవ శతాబ్దం నుండీ, పదవ శతాబ్దం దాకా పంజాబీ అంతా 'నాథ భాష' అనే ప్రాక్రిత పంజాబీనే. దీనిలోనే 'నాథ జోగీ' లు రాయబడ్డాయి. సూఫీజం వచ్చాక ఘజ్ఞవీ రాజంలో ఈ ప్రాక్రిత భాష, పెర్షియను తో కలిసి, పెర్సియో-అరబిల్ లిపులు కలిసి, 'శ్రీముఖీ' లిపి మొదలయింది. సిఖు గురువులు ఆ తరవాత 'గురుముఖీ' అక్షరమాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. సిక్కు గురువుల కాలం నాటి వ్యావహారిక భాషే ఈ 'గురు ముఖీ'. అచ్చులు లేని వ్యాపారుల భాష ఇది. ఈ లిపే ఇప్పటికీ పంజాబీ రాసేందుకు ఉపయోగపడుతుంది. పంజాబీని దేవనాగరీ లో కూడా రాస్తారంట. కానీ బుల్లే ఎంచుకున్నది శ్రీ ముఖి లిపి. ఈ లిపిలో తరచుగా ఉర్దూ అక్షర మాల కూడా దొర్లేది.
బాబా ఫరీద్ తరవాత నాలుగు తరాలలో సూఫీ కాఫీలు, సిక్కు షాబాద్ లు పంజాబీని ముందుకు నడిపించాయి. ప్రాక్ పశ్చిమ కవితల సౌందర్యాన్ని కలిపి, బ్రజ భాషను, పెర్షియన్ నూ కలిపి జానపద చాటువులూ, సామెతలూ, గేయాలు పుట్టాయి.
ఇలా సూఫీ మతం, సిక్కు మతం, చుట్టు పక్కల ప్రబలిన 'భక్తి ఉద్యమం' కలిపి, పంజాబీని రూపు దిద్దాయి. గురు గ్రంధ సాహిబ్ లో బాబా ఫరీద్ పాటలూ, కబీరు దోహాలు కూడా ఉన్నాయి. బాబా ఫరీద్ తరవాత, బుల్లే షాకి ముందూ ప్రసిద్ధులైన షా హుసేన్, సుల్తాన్ బాహులు కూడా వివిధ పంజాబీ యాసల్లో రచనలు చేసారు. బుల్లే షా, అతని కాలానికే చెందిన వారిస్ షాల చలవ కారణంగా, మధ్య పంజాబు అనగా మాఝీ ప్రాంతం మొత్తం పంజాబీ సాహిత్య భాషకు పెట్టని కోట గా మారింది.
బుల్లే రాసిన కాఫీలు విచిత్రమైనవి. వాటిలో భాష సొగసులు, విరుపులు ఏదీ ఉండదు. కవితాత్మకత కూడా తక్కువ. కానీ వాటి సూటిదనం వల్లనా, నలుగురికీ అర్ధమయ్యే భాష వాడడం వల్లా, అవి జనాన్ని బాగా చేరాయి. ఇవి రోజువారీ సంభాషణలు, చమత్కారాలు, తల్లి కూతుర్ల సంవాదాలు, పెళ్ళికూతురు అత్తవారింటికి వెళ్ళడం, ప్రియురాలూ, ప్రియుడూ అనుభవించే విరహ వేదనా, సమాజం కట్టుబాట్ల వల్ల గందరగోళాలయ్యే మనసుల గురించి ప్రస్తావనలూ, వాటి వెనకున్న తాత్విక అర్ధాలూ, ఈ కవితల్లో మార్మికత, ఎవరికి సంస్కారానికి తగినట్టు వారికి అర్ధమయే వేదాంతమూ అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. కొన్ని అతనివి 'కాని' కాఫీలు కూడా అతని పేరుమీదే చలామణీ అయ్యాయి. అతను మరణించిన వంద సంవత్సరాల దాకా కూడా అతని కవితలు రికార్డ్ చేయబడని కారణాన ఇప్పటికీ చాలా కవ్వాలీలు బుల్లే లైన్లూ, ఇతరుల లైనతో కలిపేసి కొత్త వి సృష్టించబడ్డాయి. చాలా మటుకూ పాకిస్తాన్, ఇండియా లలో ఈ కవాలీలు బుల్లే వి గా ఇప్పటికీ గౌరవించబడుతూనే ఉన్నాయి. అబీదా పర్వీన్, రబ్బీ షెర్గిల్ లు బుల్లే పాటల్ని బాగా ప్రాచుర్యం లోకి తెచ్చారు.
పాపులర్ హిందీ సినిమా పాటలూ, ఇప్పటికీ హిట్ అయే బాలీవుడ్, ఇండీ, పంజాబీ పాప్ పాటలూ బుల్లే ని కొత్త తరానికి పరిచయం చేస్తూ వస్తున్నాయి. పాత హిందీ సినిమాలలో చాలా సూపర్ హిట్ కవాలీ లు బుల్లే రచనల నుండీ తీసుకున్నవే. చరిత్రనీ, ప్రేమనీ, కొంటె తనాన్ని, వేదాంతాన్నీ సమానంగా మోస్తూ ఆ పదాలు జనాల నాలుకపై నిలిచిపోయాయి. కొత్తర్ధాలు చెప్తున్నాయి.
మంజుల్ ఇంగ్లీషు లో కి అనువాదం చేసిన ఈ పుస్తకంలో బుల్లే సాహిత్యం (అంటే ఇప్పటికి అందుబాటులో ఉన్న మాత్రంలో) వంద పాపులర్ కవితలే ఉన్నాయి. వీటిని ప్రేమగా సేకరించి, అనువదించి, చక్కగా ప్రెసెంట్ చేసారు. తను మొదటి సారిగా కనుగొన్న బుల్లే ద్విభాషా కవితల పుస్తకం చూసి, అంత వరకూ బుల్లే గురించి తెలీనిది ఏదైనా ఉందా అని పరిశోధించి, మనసు పెట్టి, కాఫీల్ని తన కున్న పరిధుల్లో, ఒరిజినల్ కు దగ్గరగా ఉండాలనే స్పృహతో ఎన్నో సంవత్సరాల కృషి ని ఇన్వెస్ట్ చేసి, అనువదించానని చెప్పారు.
పంజాబీ రానివారికి ఈ అమృతం రుచి తెలియాలని (ఒక వేళ) ఒరిజినల్ లో రైమింగ్ ని తేలేకపోయినా పర్లేదనుకుని ధైర్యం చెప్పుకుని, అదే సరళత తో అనువదించడానికి ప్రయత్నించారు. నాకయితే, గీతాంజలికి చలం తెలుగు అనువాదంలా, ఆ లైన్లు మన తో జీవితాంతమూ మిగిలిపోయినట్టు (పెద్ద ప్రశంస కదా) - ఈ ఇంగ్లీషు బుల్లే కూడా అనిపించాడు. పోయెట్రీ అంటే ఇష్టపడే వాళ్ళూ, ఇష్టపడని వాళ్ళూ మెచ్చుకుంటారు ఈ కవితల్నీ, ఈ ఎఫర్ట్ నీ. బుల్లే షా మన రెండు దేశాల కూ చెందిన వారసత్వ సంపద. అలా అని ఒక భాష లోనే దాచేసుకుంటే ఎలా. అందరికీ ఈ సంపద చేరాలీ అంటే వీలైనన్నై భాషల్లో అతని కవిత్వం ప్రవహించాలి. కొన్ని విని చూడండి.
***
The Most Popular Song "Bulla ki jana me koun":-
Bullah, how do I know
who am I?
I am not a believer among believers
Nor am I a disbeliever
Neither pure nor unclean
Neither Moses nor Pharoah
Bullah, how do I know
who am I ?
I am not in the Vedas or scriptures
Nor in alcohol or drugs
I am not a drunkard or a repentant
Not asleep nor awake
Bullah, how do I know
who am I ?
Neither saint nor sinner
Neither happy nor unhappy
Neither fire nor water
Neither earth nor wind
Bullah, how do I know
who am I ?
Not an Arab or a Lahori
Nor do I belong to Nagori
Not a Hindu, not a Turk
Nor a dweller of Nadaun
Bullah, how do I know
who am I ?
I do not know the secret of religions
I was not born of Adam and Eve
I am without a name
Without faith or disbelief
Bullah, how do I know
who am I ?
I know only myself
Nothing other than the Self
Nothing greater than the Self
Who then is that I see watching me?
***
***
***
Finding God
If God was to be found
by washing and bathing,
frogs and fish would find him
If God was to be found
by roaming in the wilderness
cows and calves would have him
Listen to Bulleh Shah
God comes to the pure of heart
those truthful in their ways
***
శుభం