Pages

Showing posts with label Stories. Show all posts
Showing posts with label Stories. Show all posts

28/06/2020

ఉల్లంఘన - ప్రతిభా రాయ్ (Ullanghan - Dr. Pratibha Ray)




ఉల్లంఘన   - సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన ఒడియా కథా సంపుటి. దీనిలో కథలన్నీ చాలా సంతృప్తికరంగా, మానవీయ దృక్పథంతో రాసినవి. ఒడియా సాహిత్యపు అనువాదాలు ఇంత వరకూ ఎప్పుడూ నిరాశ పరచలేదు. సాహిత్య ఎకాడమీ ప్రచురించే ప్రాచీన "సమ కాలీన"* వివిధ భాషల కథలు కూడా చాలా మటుకూ బావున్నా, ఒక ప్రతిభా వంతురాలైన రచయిత్రి, స్త్రీ కోణంలో (ఫెమినిస్టిక్ గా కాదు) చెప్పడం, అవన్నీ చిన్నాన్నల ప్రేమలవీ, పిన్నమ్మల అభిమానాలవీ, మనుషుల అసంకల్పిత  స్వార్ధాలవీ, ధైర్యాలవీ, మూర్ఖపు పట్టుదలలవీ, ఉమ్మడి కుటుంబపు రాజకీయాలవీ, పనివాళ్ళ విధ్యేయత్వానివీ, నిజాయితీవి అయినందున, ఇవన్నీ చదివాక కొంచెం సేపు ఆలోచన లో పడతాం.

మేము కొంచెం పాత కాలం వాళ్ళం. చిన్న తాతగారు, పిన నానమ్మ, మేనత్త, దూరపు చుట్టాల పిల్లలు, పెద్దమ్మ, పిన్నమ్మల పిల్లలు, ఇలా బోల్డంత మంది బంధువులు, (వాళ్ళలో ఒక వయసు వాళ్ళందరూ మితృలు కూడా)- ఇలా బోల్డన్ని బంధాల్ని ఎరిగున్న కాలం వాళ్ళం.  కాబట్టి వీటిల్లో చాలా సంప్రదాయాలతో కాస్త ఐడింటిఫయి చేసుకుని అర్ధం చేసుకోగలం. 

పూర్వ కాలంలో మనుషులు పాటించాల్సిన  వివిధ సంప్రదాయాలతో పాటు,  బాధ్యత గా నెరపవలసిన మానవ సంబంధాలు కూడా ఎక్కువ.  ఇరుగు పొరుగు వారు అయితే చుట్టాలు / వరసల పేర్లు తో పిలవబడే వాళ్ళు. సంసారాలు పెద్దవి. ఊరందరు ఒకటే. ఎవరింట్లో ఏమి జరుగునో అందరికీ దాదాపుగా తెలుస్తూండేది.  వాటిలో కూడా మర్యాదలు, పోట్లాటలు, పుకార్లు, అల్లర్లు. వీటన్నిటి తో పాటు సఖ్యత కూడా.

మన వీధిలో రోడ్లు ఊడ్చే పని వాడు కూడా మన జీవితాల్లో ఎంతటి కనిపించని అంతర్భాగమో చెప్తూ, మనుషుల్లో కొంచెం పక్క వాడి గురించి, వాడి మనస్థితి ని గురించీ, అంతస్తుల వారీగా మనలోని అందరి సమానత్వానికీ పట్టం కడుతూండడం వల్ల చదివాక మంచి అనుభూతిని ఇచ్చిన పుస్తకం. దీనిలో మచ్చుకి ఒక కథ - మృష్ఠాన్న భోజనం. 

ఉల్లంఘన అనే కథ (ఈ పుస్తకం పేరు) చాలా పేరు తెచ్చుకున్న కథ. సంప్రదాయం, ప్రాక్టికల్ జీవిత సమస్యలు, బాధ్యతల మధ్య నలిగే ఓ పదహారూ పదిహేడేళ్ళ కొత్త  కోడలి జీవితం గురించి చాలా చక్కగా రాసిన కథ. చదివేసాక,  చాలా షాక్ కి గురి చేసినా, మనం కొన్ని సమస్యలని మేనేజ్ చెయ్యగలిగితే ఎంత బావుండేది అనిపించేలా చేస్తుంది. సాంప్రదాయ చట్రం లో పడి,  వృద్ధాప్యం లో మానసిక ప్రకోపంతో, చపలత్వంతో నలిగిపోయిన మామగారి కథ కూడా ఇది.

సరే.. ఇప్పుడు నేను చెప్పబోయే కథ - మావిడి పళ్ళ కాలంలో చదివినది. మేముంటున్న ఊర్లో తోటలెక్కడో ఊరవతల ధనవంతులకే ఉంటాయి. అమ్మే పళ్ళన్నీ పక్క రాష్ట్రాల నుండీ కాయల్లా వచ్చి, కెమికల్స్ వేసి పండించినవి.  ఆంధ్ర లో లాగా చెట్లకి మగ్గి,  మావిడి, పనస పళ్ళ వాసన తో మార్కెట్లు గుమ్మెత్తిపోవు. అంతా కనుల మాయే. మంచి పళ్ళు ఊరెళ్ళి తిందామనే వాంచ ని కరోనా భయం తొక్కేసింది. కాబట్టి దీనిలో మావిడి పళ్ళ భోజనం గురించి చెప్పడం వల్ల, తోటలూ, వరదల వర్ణన వల్ల, ఈ కథ బాగా మనసులో ముద్రించుకుపోయింది.

సిటీల్లో ఇప్పుడు పెరిగే పిల్లలకి వరదల భీభత్సం అసలు తెలుసా అనిపిస్తుంది. సిటీలో వానా కాలాల్లో మునిసిపాలిటీ వైఫల్యాలవల్ల మోకాళ్ళ లోతుల్లో రోడ్ల మీద నిలిచే నీటి వరదలు కావవి.  ఊర్లకు ఊర్లని ముంచేసి, తోటల్నీ, పంటల్నీ సర్వ నాశనం చేసే వరదలు. పల్లెటూళ్ళ ఆర్ధిక వ్యవస్థలను చిన్నా భిన్నం చేసేసి, పశువుల్నీ, మనుషుల్నీ ఎంతో కొంత చంపేసే వరదలు.

ఒడిసా లాంటి తీర ప్రాంత రాష్ట్రాలకు వరదలు సాధారణం. తోటలకు తోటలే, వారాల తరబడి నీళ్ళలో నాని పోవడం, ఇళ్ళూ, పల్లెల్ని మళ్ళీ నిర్మించుకోవాల్సి రావడం, వీటన్నిటి వల్లా, కటిక బీద వాళ్ళ జీవితాలు ఇంకా బీదరికం లోకి వెళిపోవడం, తిండి కోసం జనం దొంగతనాలకు తెగబడటం.. ఇలాంటి జీవితం సామాన్యం గా ఉంటూండే కాలం లోనిది ఈ కథ. ఒడిషా లో రాజధాని భుబనేశ్వర్, పక్కనే ఉన్న కటక్, ప్రధాన పట్టణాలు.  మారు మూల పల్లెల నుండీ ఉపాధి కోసం కటక్ కు వెళ్ళే వారి సంఖ్య అధికం. కటక్ లో ప్రధాన కార్యాలయాలూ, కోర్టులూ ఉండటం కారణం.

సరే, ఈ కథ ఒక ముసలి అవ్వది. ప్రతిభా రే ముసలి అవ్వల కథలు ఇంకొన్ని రాసారు. ఇప్పుడు మనకి అస్సలు అక్కర్లేని ముసలిది ఒకతి, ఓ చలి కాలం వేళ ఇంటి ముందు అన్నం కోసం నిలబడితే మీరేం చేస్తారు ?  ఇప్పుడు మనం బిచ్చ గాళ్ళని నమ్మం. ఒకప్పుడు పేదరికం ఎక్కువ గా ఉండే కాలంలో, కాస్తో కూస్తో కలిగిన వాళ్ళు పేద వాడు ఇంటికొస్తే, ఉన్న దాంట్లోనే ఏదో తినడానికివ్వడం, బట్టలు లేని వారికి బట్టలివ్వడం సంప్రదాయంగా ఉండేది. ఇప్పటికీ బిచ్చ గాళ్ళ కోసం ప్రత్యేకంగా రేషన్ తీసి పెట్టుకునే సంప్రదాయ వాదులు ఉన్నారక్కడ. మా అత్త వారింట్లో ఈ సాంప్రదాయం ఉంది. 

అలా, దొంగతనాలు కూడా ఎక్కువ గా జరుగుతూ ఊరి జనమంతా అప్రమత్తంగా ఉన్న ఓ చలి సాయంకాలం, ఓ ఇంటికి ఓ ముసలమ్మ అన్నం కోసం వస్తుంది. అప్పటికి తండ్రి ఇంట్లో ఉండదు. కటక్ వెళ్ళి ఉంటాడు. తల్లి ఎంతో మంచిది. దీనురాలైన ముసలమ్మ కు ఆ పూటకి మంచి భోజనం పెడ్తుంది.   అంబిక అనే ఆ ముసలమ్మ ఎక్కడి నుండో తన ఊరు, (ఊరి పేరు మథువా)  ఇంకాస్త మారు మూల ప్రాంతానికి పోవాలి. అప్పటికే చీకటి పడింది, బయట చలి విపరీతంగా ఉంది. రాత్రికి ఆశ్రయం ఇస్తారా అని అడుగుతుంది.  తల్లి, ఎంతో దయతో, ముసలమ్మ కి బట్టలు ఇచ్చి, దారిలో తినడానికి మరి కొంత ఆహారం ఇచ్చి, ఇరుగు, పొరుగు బాగా భయపెట్టేయడంతో  ఇంటిలో మగ వారు లేనందున, అపరిచిత మనిషి కి ఆశ్రయం ఇవ్వలేనందుకు క్షమాపణ అడుగుతుంది. ముసిలిది అర్ధం చేసుకుని అక్కడి నుండి వెళిపోతుంది.  అయితే ఆవిడ కాస్తా వెళ్ళాక, ఇంటి యజమానురాలికి చాలా బాధ అనిపిస్తుంది. ఆ రోజు చలి కి ఆమె కానీ చనిపోతే తనని తాను క్షమించుకోగలదా అని బాధ తో భోజనం కూడా తీసుకోదు. ఒడిషా లో మనిషి ప్రాణాలు తీసేంత బలమైన చలి ఉంటుంది శీతాకాలాల్లో. 

ఆ రోజుల్లో దొంగలు ముందుగా తమ 'గూఢచారుల్ని'  పంపి, ఇళ్ళలో ఉన్న వారి కూపీ లాగేందుకు ఇలాంటి అవ్వలని, స్త్రీ లని, అనుమానం రాని విధంగా పంపించేవారు. ఆ కారణాన, పైగా ఇంటి యజమాని కటకం (Cuttack) వెళ్ళిన విషయం మాటల్లో చెప్పేసినందునా, అమ్మ భయపడి, నమ్మకస్తుడైన యుజో అనే  పని వాడిని ఆ రాత్రికి ఇంట్లో నే  కాపలా గా ఉండిపొమ్మంటుంది.   చుట్టు పక్కల వాళ్లంతా ఆ ముసలమ్మ దొంగల తరఫు గూడచారి కావచ్చునని, ఆ రాత్రి ఏవేళ కయినా దొంగలు రావచ్చని అనుకుంటారు.    ఆనాటి చలి విపరీతంగా ఉంటుంది.


అనుకోకుండా  రాత్రి పొద్దు పోయాక, కటక్ వెళ్ళిన ఇంటి యజమాని ఇంటికి తిరిగొస్తాడు. ఆయన రావడంతోనే, ముసలామెను చలిలో చీకట్లో ఇంటి లోంచి వెళ్ళమన్నందుకు గిల్టీ గా ఫీలవుతున్న భార్య దగ్గర 'సంగతి'  విని, అలా అర్ధం పర్ధం లేని భయాలతో పేదరాలిని పంపించేసినందుకు దెబ్బలాడి, ఆ రాత్రి చలిలో ఆమెను తీసుకు రావడాన్ని పెద్దగా సమర్ధించని 'యుజో' అనే ఆ నమ్మకస్తుడైన పని వానితో  ముసలమ్మ ని వెతుక్కుని,   చలి తో దాదాపు చావు అంచుల వరకూ వెళ్ళి, ఏ అరుగు మీదో చచ్చిన కట్టై పడుకున్న ఆమెను తన గొంగళి లో చుట్టి ఇంటికి తీసుకొస్తాడు.  తరవాత భార్యా భర్తలిద్దరూ పరిచర్యలతో ఆమెలో ప్రాణాన్ని కొడగొట్టకుండా కాపాడతారు.

తెలివొచ్చాక, మొహమాట పడి, తన స్థాయి బట్టి,  కింద నేల మీద పడుకోబోయిన ఆమెని బలవంతం గా మంచం మీద పడుకోబెడతారు. కంబళి కప్పుతారు.   మరుసటి  రోజు పొద్దున్న  వేడి అన్నం పెడతారు. మధ్యాన్నం, ఇంట్లో మిగిలిన స్వీట్లూ, పళ్ళూ, కాస్త డబ్బూ, కొన్ని కంబళ్ళూ,  ఇచ్చి పంపిస్తారు.


జీవితంలో అంతటి ఆదరణనెరగని ముసలమ్మ కరిగిపోతుంది. వేల నోళ్ళతొ ఆ కుటుంబాన్ని దీవిస్తుంది. తన గురించి వివరాలన్నీ చెప్తుంది. ఆమె పేరు అంబిక.
మథువా గ్రామానికి చెందినది. ఆమె కు, చనిపోయిన భర్తకూ ఓ చిన్న  మామిడి తోట ఉంది. అదే వారి జీవనాధారం. ఆ తోటలో మిగిలిన రకాల మావిడి పళ్ళున్నా, రెండే రెండు మేలిరకపు, అతి తియ్యని కొలంగోవా మావిడి పళ్ళ చెట్లున్నాయి. అవి చాలా కొద్దిగా కాసినా,  అత్భుతమైన రుచి  ఉన్నవి.

తనకి తిండి, నీడ, ప్రేమా ఇచ్చిన ఆ కుటుంబాని పట్ల ముసలామె కు చాలా అభిమానం అయిపోతుంది. ఆ రోజుల్లో అపరిచిత / వయసులో పెద్ద ఆడవాళ్ళని మౌషీ (పిన్ని - మాతృ సమానురాలు) అని పిలవడం వాడుక. కాబట్టి,అమ్మ ఆ ముసలమ్మ ని మౌషీ అనే పిలుస్తుంది. చిరుగు గుడ్డలతో, తైల సంస్కారం లేని జుత్తు తో, చేతిలో కాణీ లేని, తిండి మొహం చూసి రోజులు దాటిన తన లాంటి బీద రాలికి అంత గౌరవం ఇచ్చిన ఆ కుటుంబం అంటే, ఈ ముసలమ్మ కి ఎంతో అనుబంధం వచ్చేస్తుంది.  మథువా లో తన కొడుకు, కోడలు, మనవలు ఉన్నారు. వరదలు వచ్చి పంట నాశనం అయింది. కొడుకూ, కోడలూ, తిండి తిప్పలకై, పిల్లల్ని పోషించుకోలేక, ముసలామె ను నిర్లక్షం చేస్తుంటారు. ఒకప్పుడు బాగానే గడిపినా చాలా నిరాదరణ పూర్వకమైన వృద్ధాప్యం గడుపుతున్నది ఈ ముసలమ్మ.

సెలవు తీసుకునే ముందు వీళ్ళందరినీ ఆత్మ  బంధువులు  గా పరిగణిస్తూ, 'వచ్చే యేడు కొలంగోవా మావిడి పళ్ళు తీసుకుని వస్తాను. బాబు గారు, పిల్లలు, పెరుగు అన్నం తో మామిడి పళ్ళు నంజుకుని తింటారు ' అంటుంది. "మీరు నా కడుపున కనని బిడ్డలు. నాకు రెండు చెట్లున్నాయి. ఒకటి నా కొడుకుది. రెండోది మీది. నేను బ్రతికున్న కాలమూ, ఆ చెట్టు పళ్ళూ మీవి." అని వాగ్దానం చేస్తుంది. వీళ్ళు ఎంత వద్దన్నా వినదు. మరుసటి యేడు ఎండల్లో ఊరి నుంచీ నడుచుకుని పళ్ళు తెస్తుంది. అవి అత్భుతమైన రుచి, సువాసన గల  కండ పట్టిన మేలు జాతి పళ్ళు.

యుజో కి ఈ ముసల్దంటే ముందు నుండీ పడదు. వాడికి తన విధేయత వల్ల ఆమె పై అనుమానం. ముసలిది గొప్పలు చెప్పుకుంటూంది గానీ, అంత మంచి రకం మామిడి పళ్ళు చెట్టు దీనికి ఉంటుందా, ఉన్నా మర్యాదలకో, గొప్పలకో పోయి మీ ఊరు తెచ్చిస్తుందా అమ్ముకోక అని వీడి అనుమానం.  వాడు తీరా ఆ పళ్ళు తిని ఆశ్చర్యం తో మౌనం దాలుస్తాడు. ముసలి మౌసీ నిజంగానే కొలంగోవాలు తెచ్చింది.

నాన్న గారు, "మౌసీ, ఈ పళ్ళ టెంకలు నాటి, పెద్ద తోట చెయ్యొచ్చు కదా!  వీటికి మంచి గిరాకీ. మీ పేదరికం తీరిపోతుంది" అంటారు. అప్పుడు మౌసీ, "అయ్యో!! ఎన్ని సార్లు ప్రయత్నించామో బాబు గారు!!! ఎన్ని టెంకలో పాతాము. ఒక్కటీ మొలకెత్తలేదు.  నా భర్త బ్రతికున్నాళ్ళూ కొలంగోవా చెట్టులు మొలకెత్తిద్దామని ప్రయత్నిస్తూనే పోయాడు. నేను కూడా ఎంతో ప్రయత్నించాను బాబు గారు, ఒక్కటీ అవ్వ(లే) దు" అంటుంది. వీళ్ళు కూడా ఆ ఏడు తిన్న కాయల టెంకలన్నీ పెరట్లో పాతుకుంటారు.  ఒక్కటీ మొలవదు.

ఇలా ప్రతీ యేడూ, మథువా నుండీ ఆ బీదరాలు చేపలో, పళ్ళో కొడుకుతో పంపించడమో, తనే వచ్చి ఇవ్వడమో చేస్తుంది.  కొన్నాళ్ళకి ఆమె పోయాక, పనివాడు యజో, "ఇంక ఆ కొడుకేం తెస్తాడండీ తల్లి మాట నిలబెట్టేందుకు!" అని ఈసడించినా, కొడుకు ఎలాగోలా తెస్తూనే ఉంటాడు. వీడు ఏ కారణంగా నైనా పళ్ళు లేకపోతే ఆ ఏడు నుండీ ఆ చెట్లు పూత పుయ్యవు అని అంబిక వాణ్ణి బెదిరిస్తుంది‌.

అలా, వాళ్ళు అంత బీదరికంలో కూడా, ఈ దేవుడు కుదిర్చిన బంధుత్వాన్ని,  ఒక్క రాత్రి ఆశ్రయం ఇచ్చిన పాపానికి,  ఒక్క పూట అన్నం పెట్టినందుకు,  తమని ఎంత రుణగ్రస్తులు గా చేస్తున్నారో అని ఇంటి యజమానురాలు బాధపడుతూ, వచ్చినప్పుడల్లా,  మౌషీ కొడుకు చేతిలో పిల్లలకు డబ్బో, స్వీట్లో పెడుతూంటుంది - వాడు, 'మా అమ్మ వీటికి డబ్బులు తీసుకోవద్దని అందని '  ఎంత చెప్తున్నా.

ఒక యేడు, సందేహంగా చెప్తాడు మౌషీ కొడుకు - కొలంగోవా చెట్టు చనిపోయేలా ఉందని, వరదలకి దెబ్బ తిందని, కాపు తగ్గిందని. మరుసటి యేడు అతను రాడు. చెట్టు కూడా చనిపోయినట్టు అర్ధం చేసుకుని,  వీరందరూ   సమాధాన పడతారు. 

ఆ ఏడు పిచ్చి పిచ్చిగా వానలు కురుస్తాయి. పెరడంతా మొక్కలతో నిండిపోతుంది. అప్పటికి, ఆ కుటుంబము,      పిల్లలు కొలంగోవా మామిడి పళ్ళ కన్నా, మౌషీ అభిమానాన్ని, ఆమె కొడుకు ప్రథ గా తెచ్చి ప్రతీ యేడూ ఆమెని గుర్తు చెయ్యడాన్ని, ఆ ముసలమ్మ ఆదరణ ని ముఖ్యంగా మిస్ అవుతుంటారు. మౌషీ ఇన్నేళ్ళలోనూ, సొంత బంధువు కాకపోయినా, ఆత్మ బంధువు గా మారిపోతుంది.

ఒక ఆదివారం నాన్న గారు, మాలి సాయంతో పిచ్చి  మొక్కల్ని తీసి పారేసి, పురుగు పుట్రా చేరకుండా,  పెరట్లో మొక్కల పని పడదామని పెరట్లోకి వెళ్ళి, అన్నిటినీ పరిశీలిస్తుంటారు. . హఠాత్తుగా పెద్ద కేక వేసి, ఇంటిల్లపాదినీ పిలిచి, ఎన్నో ఏళ్ళుగా ఎన్ని సార్లు ప్రయత్నించినా మొలవని కొలంగోవా మామిడి చెట్టు మొలక ని చూపించి, "చూడండి, అంబికా మౌషీ వచ్చింది. ఇక ఆమె మనతోనే వుంటుంది" అంటారు. కుటుంబం అంతా ఎమోషనల్ గా, సంతోషంగా ఫీలవుతుంది. ఒక చిన్న మామిడి చెట్టు మొలక వాళ్ళని ఆనందాశ్చర్యాలలో,  ప్రేమలో ముంచెత్తేస్తుంది.  ఇక నుండీ వారికి మామిడి పళ్ళు పంపలేనని, తనే చెట్టయి వచ్చి తమ ఇంట్లో కలకాలం తియ్యని మామిడి పళ్ళు ఇచ్చేందుకు మౌషీ వచ్చిందని అబ్బుర పడతారు.  ఇదీ కథ.

ఆకలి గొన్న ప్రాణికి పెట్టిన ఒక  భోజనపు విలువ జీవిత కాలపు బంధంగా మారుతుంది. ఇలాంటి అమాయకపు, నిజాయితీ బంధాలు ఇప్పుడు ఉంటాయా ? చెప్పలేం. మనిషిని మనిషి నమ్మడమే లేదు.  అన్నీ కండిషనల్ ప్రేమలు, కృత్రిమత, పైరవీ, పెదవంచు మాటలు, డబ్బంటే కక్కుర్తి ఉన్న సమాజం ఇది. అందుకే గుండె బరువెక్కించే కథ అయిందిది.

అనువాదం గురించి : నిస్సందేహంగా చాలా బావుంది. కొన్ని అర్ధం కాని ఒడిషా సంప్రదాయాలు, కొన్ని పదాల విడి అర్ధాలు చక్కగా నోట్స్ ఇచ్చారు. ముసలి వారి కథలు చాలా బావున్నాయి. చావులాగే వృద్ధాప్యం అనివార్యం మన జీవితాల్లో.  అలాగే ఆ దశలో మనం ఎదుర్కొనే సవాళ్ళూనూ.

ఈ సంకలనంలో అన్ని రకాల ప్రేమానురాగాల గురించీ, కుటుంబపు సంస్కారాల గురించి కూడా చదివి, ఏ భాషయినా, ఏ సంస్కృతి అయినా, ఏ అంతస్తు వారం అయినా, మనుషులంతా ఒక్కటే అనిపిస్తుంది. తప్పకుండా చదవండి.



06/04/2017

కల

అది 1961 సెప్టెంబరు.  పూనా లో మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీ లో  మా కోర్స్ ముగిసిన తరవాత మా మొదటి పోస్టింగ్ సిక్కిం. ఆ రోజుల్లో అది ఇంకో రాజ్యం లా ఉండేది.  అప్పుడే అక్కడ చనిపోయిన ఇద్దరు ఇంజనీరింగ్ ఆఫీసర్ల స్థానాన్ని మేము భర్తీ చేస్తున్నాం అన్నమాట.   అక్కడ మా యూనిట్ కు చేరగానే నన్ను కధా స్థలానికి వెళ్ళమన్నారు.   కాకులు దూరని కారడవిలో హీమాలయ సానువుల్లో  ఇక్కడ ఒక రోడ్,  నది మీద ఓ వంతెన కట్టాలి మేము.  

ఆ మధ్య కాలం లోనే  తీస్థా నది లో వరదలు వచ్చాయి. ఉన్న వంతెన కాస్తా కొట్టుకుపోయింది.   సిక్కిం భూతల స్వర్గమే. కానీ మేము కట్టే రోడ్లూ, వంతెనలూ లేకపోతే ఇక్కడికినెవరైనా రాగలరా ?  ఈ మధ్య వంతెన కొట్టుకుపోయాకా, తాళ్ళతో ఒక వంతెన కట్టారు. అది కొన్నాళ్ళ వరకూ పనికొచ్చింది. ఒక సారి అదీ పుటుక్కుమంది- బరువెక్కువై.   దాంతో వంతెన మీదున్న ఆరుగురు కూలీలూ, ఇద్దరు కుర్ర ఆఫీసర్లూ, అయిదుగురు జవాన్లూ అదిగో ఆ తీస్థా లోనే పడి చనిపోయారు.    నేనూ అందుకే వచ్చాను. అంటే కొట్టుకుపోవడానికి కాదు లెండి. కట్టడానికి.

మేము ఇక్కడ సైనిక అవసరాల కోసం ఒక వంతెన కట్టాలి, ఈ సారి దీన్ని పఠిష్టంగా కట్టాలని ఆదేశాలొచ్చాయి.  కాసింత  దూరాన చైనా సరిహద్దు నుంచీ బైనాక్యులర్లు లేకుండానే వాళ్ళ విలాసవంతమైన రోడ్లూ, భవనాలూ (మన సరిహద్దు ప్రమాణాల్తో పోలిస్తే)   కనిపిస్తాయి.   మనం మాత్రం ఈ చరియలు జారిపడే మెత్తని కొండ లోయల్లో, తీగ వంతెనల్లోంచీ కొట్టుకుని వెళ్ళి ఏ బ్రహ్మపుత్ర లొనో శవాలై తేలుతాం.   తీస్థా నది సిక్కిం లో పుట్టి, బెంగాలు గుండా ప్రవహించి, బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్రా నది లో కలుస్తుంది. హిమాలయాల్లో పుట్టిన నది, ఆ వంకలన్నీ మలుపులన్నీ హుషారుగా దాటి, అడ్డూ అదుపు లేని సుడిగాలి లా ప్రవహిస్తుంది. మధ్యలో కొన్ని ఉపనదులు కూడా కలుస్తాయి. ఇంకేం ?

'టూంగ్' లో 'థేంగ్' అనే అత్యంత ప్రమాదకరమైన రాళ్ళతో నిండిన పర్వత సానువుల్లో వంతెన కట్టాలి. నేను, అక్కడికి 4 కిలో మీటర్ల దూరంలో కాస్త ఎత్తున 'థేంగ్ జిగ్స్'  లో విడిది చేశాను. ఎందుకంటే, ఇక్కడినించీ రోజూ ఒకసారి ఆ ప్రాంతాన్నంతా సింహావలోకనం చెయ్యొచ్చు. అంత ఎత్తునుంచీ ఏదైనా ప్రమాదకరంగా కనిపిస్తే నిర్ణయాలు తీస్కోవచ్చని నా ఆలోచన.   అయితే ఇక్కడ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు.మేము సామానంతా ఎలానో మోసుకుని ఇక్కడికి వచ్చాకా, ఇక్కడ వంతెన కట్టడం అసాధ్యమని తేలిపోయింది.  కిందకు ఓ వెయ్యి అడుగుల లోతున  ఉధృతమైన తీస్థా, నునుపు తేలిన బండ రాళ్ళతో నిస్పూచీ గా తెర్లుతూ ప్రవహిస్తుంది.  

 అక్కడ చైనాగ్ అనీ ఒక ప్రాంతం ఉంది. అది దాదాపూ నాలుగొందల అడుగుల రాతి ప్రాంతం.  వంతెన లేకుండా ఈ గుట్టని దాటాలంటే నాలుగొందల అడుగులు ఎక్కాలి, ఇంకో తొంభయి నిముషాలు  కిందికి దిగాలి.     యుద్ధ కాలాన ఇది చాలా ఎక్కువ సమయం. ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ లో వగైరా చైనా సరిహద్దుల్లో పెట్రోలింగ్ చెయ్యడం కష్టసాధ్యం.  చీనీ సైనికులు, గుంపులా వచ్చి సరిహద్దు గురుతుల దగ్గర ఫోటోలు దిగి వెళ్తూంటే మన సైనికులు అరకొర వసతుల మధ్య, కొద్ది మార్బలం తోనే పెట్రోలింగ్ చెయ్యాలి. మన టెర్రైన్ అలాంటిది. వాళ్ళు ఫుట్ బాల్ ఆడుకుంటూంటే మనం చూస్తూ ఉండాలన్నమాట.  వారు అత్యంత ప్రామాణికత తో సరిహద్దు లో పహారా కాసే సైనికులకు పూర్తి సౌకర్యాలు కల్పించగలిగారు. సాంకేతికతా, సామర్ధ్యమూ తో పాటూ వారి వైపు ప్రాంతం మన వైపు లా దుర్భరం కాకుండా చూసుకోవడంలో చైనీయులు ముందు ఉన్నారు.  ఇప్పుడైతె, సరిహద్దులో మన మొబైల్ ల లో కూడా భారతీయ మొబైల్ సిగ్నల్ కాకుండా చైనా సిగ్నల్ వస్తూంటుంది.


ఈ మధ్య కొంత టెక్నాలజీ ని వాడుతున్నారు, కానీ అరవైల్లో ఆ అడవుల్లో, కొండల్లో ఏదైనా నిర్మాణం  ఎంత కష్టమో ఈ తరానికి తెలియదు.    ఈ వంతెన, రోడ్డూ తొందరగా కట్టాలి.  కాబట్టి, కొండకిరువైపుల నుంచీ పని మొదలుపెట్టాం. లంచ్ ముందు  ఒక వైపు, లంచ్ తరవాత ఇంకో వైపు. నిజానికి అక్కడ గుట్టని కాస్త పేల్చి 45 డిగ్రీ ల కోణంలో 20 అడుగుల వెడల్పుతో రోడ్ వెయ్యాలి అనుకున్నాం.   కానీ అక్కడి మట్టి చాలా వొదులు. పేలుడు తీవ్రత ఏమాత్రం ఎక్కువ అయినా.. మా టీం మొత్తం ఏటవాలు కొండ మీది నుంచీ తీస్థా లోకి జారిపడడం తథ్యం.


కానీ  200 అడుగుల రోడ్ కోసం కాసిన్ని పేలుళ్ళు  జరపాలి. దాని వల్ల చాలా చెత్త పోగయ్యేది. దాన్ని తీసి దారి శుభ్రం చేయడానికే చాలా సమయంపట్టేది.  పొద్దున్న పేలుడు జరిపితే, మధ్యాన్నం,  సాయంత్రం జరిప్తే పొద్దున్నా ఆ వ్యర్ధాలన్నిట్నీ శుభ్రం చేసేవాళ్ళం.  ఈ నది ఉత్తరాన్నించి దక్షిణానికి పారేది.   ఆ ఒరవడి,  జోరు, పరిసరాల్ని హోరెత్తించేది.  కానీ అక్కడి కొండల్లో మెత్తని మట్టి -  స్థిరత్వం లేని, పదును నిలవని మట్టీ, రాళ్ళూ, ఎప్పుడు జారిపడతాయో తెలీదు.  స్లైడింగ్ జరగడం, ఆ మట్టికుప్పల్లో బురదలో కూరుకుపోయి మరణించడం తాలూకు సంభావన చాలా ఎక్కువ. నా మిలిటరీ ఎకాడమీ కోర్స్ మేట్ ఇలానే మరణించాడు. కింద 1000 అడుగుల లోతున నదీ, 75 డిగ్రీల వాలులో నిర్మాణ వ్యర్ధాలూ.. వాటికి కొంచెం ఎగువన రోడ్డు కోసం మేము చేసుకుంటూన్న కాంక్రీటు  స్లాబులూ.. ఇదీ పరిస్థితి.

ఆ ఏటవాలు లోయలూ,  ఆరడుగుల వెడల్పున మేము వేసిన 100 అడుగుల  పొడుగు రోడ్డు,   స్లైడింగ్ హెచ్చరికలూ.. వీటన్నిటి వల్లా, నది మిగిల్చే అప్రశాంతమైన హోరు వల్లా నాకు రాత్రిళ్ళు కలత నిద్రే పట్టేది.  దానికి తోడూ.. మట్టిపెళ్ళల్లో నేను కూరుకుపోతున్నట్టూ, ఏదో కొండచిలువ నిలువెల్లా మింగేస్తున్నట్టు ఎముకలలో నొప్పీ, ఒక ఇరుకు పైపు లో నా శరీరాన్ని కుక్కేస్తున్న భావనా, ఊపిరీ, మాటా ఆగిపోయినట్టు.. కలలు వచ్చేవి. కలలు అనకూడదు. ఒకటే కల. తిప్పి తిప్పి అదే వచ్చేది. దీన్ని నాలో భయాలకూ, ఆందోళనకూ ప్రతిబింబమనే అనుకున్నాను చాలా నాళ్ళు.   మా డాక్టర్ కూ, టాస్క్ ఫోర్స్ కమాండర్ కూ కూడా ఈ కల గురించి చెప్పాను. వాళ్ళ సలహా మీద మా కమాండెంట్ కి కూడా.


ఆయన కూడా పడుతూ లేస్తూ సైట్ కి వచ్చి, కొండల్లో మా బ్లాస్ట్ లను పర్యవేక్షించారు. ఆ ఇన్స్పెక్షన్ కోసం మా టీం అంతా సిద్ధంగా ఉంది. ఎన్న్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని పర్యవేక్షణలు జరిపినా,  నాకు మా పనుల్లో తృప్తి కలిగేది కాదు. ఒక సారి కమాండెంట్  వెళ్ళగానే ఉపద్రవం  రానే వచ్చింది.  నా కళ్ళెదురుగా స్లైడింగ్ జరిగింది. క్షణాల్లో నేను మట్టి పెళ్ళల్లో, రాయీ రప్ప్పా తో కలిసి తీస్థా లోకి జారిపోసాగాను. సరిగ్గా కలలో లానే, నా శరీరం మట్టి దిబ్బల్లో కూరుకుపోయింది. ఉక్కిరి బిక్కిరి అయ్యాను.


ఆ బురద లో నదిలోకి కొట్టుకుపోయానంటే  ఇక బ్రతికేది లేదు. మామూలుగా తూలి పడబోతేనే నిగ్రహించుకోలేము కొన్ని సార్లు. అలాంటిది కొండ చరియల్తో పాటూ 1000 అడుగుల లోతుకి జారితే ఏది తట్టుకుని ఆగగలను ? నా పని అయిపోయిందనే అనుకున్నాను. దేవుడూ దెయ్యమూ ఏమీ గుర్తు రాలేదు. నా కలే గుర్తొచ్చింది. నా చావే నాకు ముందుగా కల లో కనిపిందేమో అని అనుకున్నాను. అసలు కొండ చరియ   మిన్నువిరిగినట్టు  విరిగి మేను మీద పడ్డాకా పుర్రెలో  ఇన్ని ఆలోచనలా అనిపించి, కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే, కాస్త తల ఎత్తి చూడగలుగుతున్నట్టు  అర్ధమైంది.

దైవవశాన నా  కాళ్ళ కింద ఒక స్లాబూ, నెత్తి మీద ఒక స్లాబూ ఉన్నట్టు అర్ధమైంది. అవే నన్ను  చావు నుండీ కాపాడాయి.  కింది స్లాబు నా జారుడును నిలువరించింది. అదే లేకపోతే ఆ మెత్తని మన్నులోకి కూరుకుపోయి సజీవ సమాధి అయ్యే వాడిని, నెత్తిన ఉన్న స్లాబు, చెట్లూ, రాళ్ళూ నెత్తిన పడి, పుర్రె పగలకుండా కాపాడింది.  దాదాపు  16 గంటల తరవాత  నన్ను ఆ  మట్టి లోంచీ లాగారు. నలుగురు కూలీలు చనిపోయారు. నాకు ఏమీ కాలేదు. అక్కడక్కడా చెక్కుకుపోవడం తప్ప.  నా చావుని ఏ శక్తి ఆపిందో తెలీదు. డాక్టరు దయ వల్ల ఫిట్ నెస్ పత్రం తెచ్చుకుని ఆ తీస్థా మీదనే ఇంకో నాలుగు నెలల్లో వంతెనా, రోడ్డూ నిర్మించాను.   ఒక సారి చచ్చి బ్రతికాక, చావు మరెప్పుడూ భయపెట్టలేదు.

అదృష్టం ప్రతీ సారీ దయ తలుస్తుందని లేదు. నా చావు ఆ రోజలా రాసిపెట్టి లేదు. అంతే. కానీ ఆ చావు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కాంక్రీటూ, ఉక్కూ ఆ ఎత్తున ఎలా చేర్చామో, కాంక్రీటు స్లాబుల్ని ఎలా తయార  చేసామో తెలీదు. రాత్రీ పగలూ అక్కడే ఉండి, చావూ బ్రతుకుల ఊగిసలాట లో బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేసాం.   సిక్కిం లో ఇలాంటివెన్నో చేసాం.   ఇంకా సరిహద్దు వెంబడి కొండల్లో సైన్యం తిరగగలగడానికి, సరిహద్దు కి చప్పున చేరడానికి వేసిన రోడ్ల,వంతెన ల నిర్మాణాల్లో ఎందరో ఆర్మీ జవాన్లూ, ఆఫీసర్లూ, మామూలు కూలీలూ చనిపోయారు.  వాళ్ళందరి ఆత్మలూ నన్న ఆ పూట బ్రతికించాయనుకుంటాను.  నేను ఆ రోజు మరణించి ఉంటే మరో ఇంజనీర్ వచ్చి నా పని పూర్తి చేసి ఉండేవాడు. కానీ జారుతూండే కొండ వాళ్ళ భయంతో ఆ నిర్మాణాన్ని పటిష్ఠం గా ముగించి ఉండేవాడా అనేది నేను చెప్పలేను.    ఆ కల ఇప్పటికీ స్పష్టంగా గుర్తొస్తూ ఉంటుంది.  అది ఒక కల మాత్రమే.. అనుకుంటూ ఊరుకుంటాను.

ఈ పని ముగించడానికే ఏ దివ్య శక్తో నన్ను రక్షించిందని అనుకుంటాను. ఇన్నాళ్ళకీ నేను కట్టిన .. అహ.. కాదు.. నన్ను ఉపయోగించుకుని ఏదో ఒక  దివ్య  భారతాత్మ కట్టించిన రోడ్డూ, వంతెనా, సిక్కిం లో కొత్త దార్లను తెరిచింది. సైన్యానికీ, స్థానికులకూ ఉపయోగకరంగా మిగిలింది.





PS :  {నిజమైన సంఘటనలకు కాస్త కల్పన జోడించి రాసినది}

04/06/2013

Ball of Fat - Guy de Maupaassant

 ‘బౌల్ డి సూఫ్’  ప్రెంచు పేరు. దాన్ని  ఇంగ్లీష్ లోకి అనువదిస్తే బాల్ ఆఫ్ ఫాట్ (Ball-of-Fat) –  ఈమె చిక్కగా, లావుగా, ఆకర్షణీయమైన వొంటి  రంగూ,  నిండైన అవయవ సంపద తో  దొండపండు లాంటి  పెదవులు ఎపుడూ, తడితో మెరుస్తూ ముద్దుపెట్టుకోవాలనిపించేలా వుంటాయంట.  అయితే దురదృష్టవశాత్తూ ఈ అందగత్తె, ఒక వేశ్య!     వేశ్య కు మానాభిమానాలూ, ఆలోచించే విచక్షణా, దేశభక్తీ లాంటివి ఉంటాయని చెప్పే కధే ఇది. మోపాసా  కధల్లో అత్యుత్తమ కధ గా పేరెన్నిక పొందినది.

అవి ప్రష్యా, ఫ్రాన్సు ల మధ్య యుద్ధం జరుగుతున్న కాలం.  బాల్ ఆఫ్ ఫేట్ ఉన్న రోవెన్ అనే ఫ్రెంచు గ్రామం ప్రష్యా (జెర్మనీ) ఆక్రమణ లోకి వెళ్ళిపోయింది.  తలుపులు మూసుకుని, ఎవరి ఇళ్ళలో వారు బందీలయిన ప్రజలకు వీధుల్లో జెర్మన్ సైనికుల వీరత్వ ప్రదర్శన, వాళ్ళ రణగొణ ధ్వని,  ‘ఎపుడేమవుతుందో తెలీని’ అభద్రతా భావం,  కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి.  గ్రామం శత్రు సైనికుల ఆక్రమణ లో వుంది. ఆ  మాటకొస్తే, చుట్టు పక్కల గ్రామాలన్నిట్లోనూ ఇదే పరిస్థితి.   ధనవంతులు శేర్ల కొద్దీ బంగారు, వెండి నాణాల్ని  దురాశాపరులైన శత్రు సైనికుల జోలెల్లో పోసి, స్వాతంత్ర్యాన్ని  ఘడియల లెక్కన కొనుక్కుంటున్నారు.  బీద వాళ్ళు కోళ్ళనూ, మేకల్నీ, ఆఖరికి ఆహార ధాన్యాల్ని కూడా దాచుకోవల్సిన పరిస్థితి. ఇలాంటి దీనమైన  యుద్ధపు రోజుల్లో వేశ్యల బ్రతుకు ఎంత దుర్భరం ?

బాల్- ఆఫ్-ఫాట్ వేశ్యే కావచ్చు. ఆమెకు  తానూ ఓ మొగవాడినయి ఉంటే, యుద్ధంలో చేరి జర్మన్లను చంపేసి వుందునే అనే నిస్సహాయపూర్వకమైన ఆవేశం కలుగుతూ ఉంటుంది. వేశ్యే అయినప్పటికీ, ఆమెలో దేశభక్తి కేమీ తక్కువ లేదు. జెర్మన్ సైనికుల విలాసాలు తీర్చేందుకు ఒప్పుకోదు. వాళ్ళతో ఆమెకు చచ్చే చావైంది.  వాళ్ళని ప్రతిఘటించడం వల్ల కాక, ఈ లోగా ఆవేశంతో ఒక సైనికుణ్ణి దేంతోనో మోది, చంపినంత పని చేసి, గత్యంతరం లేక, ఊరి నుండీ ఫ్రెంచు సేన్ల ఆధీనం లో ఉన్న ప్రాంతానికి పారిపోవాలని నిశ్చయించుకుంటుంది.

ఆమె లానే కొందరు పౌరులు  – ఒక బండి మాట్లాడుకుని, తెల్లవారకముందే ఊరు విడిచి పోయేందుకని సిద్ధం అవుతారు. వాళ్ళలో ఇద్దరు క్రైస్తవ సన్యాసినులు (నన్ లు), ఒక వ్యాపారస్థుడూ, అతని భార్య, ఒక విద్యా వేత్త – ఒక చిన్న సైజు జమీందారూ (కౌంటు), అతని భార్యా,  వగైరాల మినీ ఫ్రెంచు బూర్జువా సమాజం, ఈ వేశ్య తో కలిసి ఒక మంచు కురుస్తున్న చల్లని శుభోదయాన ఆరు గుర్రాలు పూనిన బండి లో ఆవల ఫ్రెంచు సేనల అదుపులో ఉన్న ప్రాంతానికీ, ఇంకా వీలైతే ఇంగ్లండ్  కీ పారిపోదామని బైల్దేరతారు.


నిజానికి  వీళ్ళు తమ పలుకుబడిని ఉప్యోగించి  ఆ ప్రాంతానికి రాజు లాంటి జెర్మన్ సైనికాధికారి దగ్గర ప్రయాణానుమతి పత్రం తీసుకుని వుంటారు. అయినా ఏదో భయం, టెన్షన్!   తెల్లారి బయల్దేరిన వీళ్ళ బండి, రాత్రంతా కురిసిన మంచు గడ్డగట్టడం వల్లా,  దూదిలా ఇంకా జల జలా రాలే మంచు, అది  కలిగించిన బురద, జారుడూ, వల్ల నెమ్మదిగా సాగి,  బ్రేక్ ఫాస్ట్ టయానికి చేరాల్సింది కాస్తా అనుకున్న గ్రామం చేరుకోవడానికి రాత్రి అవుతుంది. అంత  వరకూ,  తినడానికి గానీ, తాగడానికి గానీ ఏమీ తెచ్చుకోని ఈ బూర్జువా ప్రాణుల్ని ఈ           వేశ్యే తను దారి కాపు కని తెచ్చుకున్న ఆహార పదార్ధాలిచ్చి, వైను,  ఇచ్చి నిలబెడ్తుంది.  


బండి లో కూర్చుని, తము వొదిలి వచ్చిన గ్రామ వాసుల దేశభక్తిని పొగుడుకుంటారు.  తాము స్వయంగా యుద్ధం నుండీ పారిపోతున్నా కూడా !  ఓ వేళ  పరిస్థితులు ఇంతకన్నా దారుణమౌతాయేమో చెప్పలేం అని తమ  చర్యల్ని తామే సమర్ధించుకుంటారు.   Ball-of-Fat  తన అనుభవాల్నీ చెప్తుంది.   'నన్లు'  తాము గాయపడిన ఫ్రెంచు సైనికుల సేవ చెయడానికి వెళ్తున్నామని చెప్తారు.  ఇలా  తమ తమ కారణాలు చెప్పుకుని, తాము  గ్రామం నుంచీ కదలాల్సిన అవసరాన్ని సమర్ధించుకుంటారు. 


మొదట బండి బైల్దేరగానే,  తమ తోటి ప్రయాణీకురాలు గ్రమం లో పేరు పొందిన వేశ్య అని తెలవగానే,  ఆ భద్ర మహిళలూ, మర్యాదా పురుషోత్తములైన పురుషులూ, గుసగుసలు పోతారు. మహిళల గుస గుసలు కాస్తా అవమాన కరంగా, పెద్దగానే వినిపిస్తాయి.  అవమానం  భరిస్తూ, చిర్నవ్వుతో నిర్లక్షమైన చూపుల్ని విసిరి, బాల్ ఆఫ్ ఫేట్ తన సహజ ప్రవృత్తి తో నిలకడ గా కూర్చుంటుంది.      రోజు  కొంత గడిచీ సరికీ గొంతెండిపోయి, ఆకలికి కరకర లాడిపోతున్న  వాళ్ళకి మొహమాటంగా తన తో తెచ్చుకున్న ఆహారాన్ని  ఆఫర్ చేస్తుంది. మొదట ‘మర్యాద’, ‘సంస్కారం వగైరాలు అడ్దొచ్చినా, ఆకలి భరించలేక, అందరూ వాట్ని తీసుకుంటారు, నిర్లజ్జగా లాగిస్తారు. వాళ్ళ కడుపులు నిండేసరికీ, బాల్- ఆఫ్- ఫేట్  కూడా సంత్రుప్తి చెందుతుంది.


వాళ్ళు ఆఖరికి 'టౌటస్' అనే ఆ ఫ్రెంచు గ్రామం చేరి అక్కడ రాత్రి బస చెయ్యడానికో విడిది (హోటలు/Inn) ముందు ఆగుతారు. వాళ్ళకి బయట జెర్మను భాషలో సైనికుల బూట్ల టక టకలు స్వాగతం చెప్తాయి. నిజానికి  ఈ విడిది ని జర్మన్లు  పట్టుకుని, అక్కడ బస చేసి వుంటారు.  సరిహద్దుల్లో పారిపోతున్న పౌరుల్ని నిలువరించేదుకే ఈ ఎత్తుగడ.


వాళ్ళని ఆ 'ఇన్' లో వుండనిస్తారు. అయితే  అక్కడి దళాధికారికి ‘ఫెయిత్’ కి  'బాల్-ఆఫ్-ఫేట్' వచ్చిన సంగతి ఆకర్షిస్తుంది.   ఆమె అసలు పేరు 'ఎలిసబెత్ రౌసెట్'.  ' ఫెయిత్' హోటెలు యజమాని ద్వారా 'మిస్ ఎలిసబెత్ రౌసెట్' ని రమ్మని కబురు చేస్తాడు. ఆమె  సంకోచిస్తూనే వెళ్ళి,  భుగ భుగలాడుతూ వెనక్కి వస్తుంది.  నిజానికి  ఆమె అతన్ని తిరస్కరించి వస్తుంది. 

బండి లో వచ్చిన మిగిల్న వాళ్ళకి కధ అర్ధం అవదు. మర్నాడు వాళ్ళు తీరా అక్కడ్నించీ బైల్దేరబోయే వేళకి గుర్రాలు పూనని  బండి వాడు తనను జెర్మన్లు బండి కట్టొద్దన్నారని చెప్తాడు.  వాళ్ళు ఫెయిత్ దగ్గరకెళ్ళి, అక్కడ్నించీ బైల్దేరడానికి పెర్మిషన్ అడుగుతాడు.  అతను ఒప్పుకోడు.  పిల్లీ ఎలుకా ఆట లా అవుతుంది.

అక్కడ అలా ఓ రెండు మూడ్రోజులు ఆపబడ్డాకా, వాళ్ళకి తాము ఫెయిత్ చేతిలో బందీలమని, రౌసెట్ అతన్ని తృప్తి పరిస్తే గానీ అతను తమని వదల్డనీ స్పష్టంగా అర్ధం అవుతుంది. రోజూ  పొద్దున్న ఫెయిత్ రోసెట్ కోసం కబురు పెట్టడం, ఆమే అతన్ని తిరస్కరించడం జరుగుతూ ఉంటాయి. 

ఆమె ధోరణి మిగిల వాళ్ళని చిరాకు పుట్టిస్తుంది.  ఊరిలో బండి తోలే వాళ్ళను సైతం విడిచిపెట్టక అందరితోనూ సుఖాన్ననుభవించిన వ్యభిచారికి ఈ జెర్మన్ దళాధిపతి తో సమస్య ఏమిటో వాళ్ళకర్ధం కాదు.   విసుక్కుంటారు.  ఆమెను నయానా భయానా ఒప్పిస్తారు. ససేమిరా అన్న ఆ యువతి ని, క్లియో పాత్రా పేరు చెప్పీ, చరిత్ర లో త్యాగధనులైన  ఇతర స్త్రీమూర్తుల్ని గురించి చెప్పీ వొత్తిడి తెస్తారు.

ఆఖరికి  'నన్లు' తాము ఇన్ని రోజులు గా టోటెస్ లో నిలువరింపబడడం వల్ల అవతల యుద్ధం లో గాయపడ్డ సైనికుల్ని రక్షించలేకపోతున్నామనీ, ఇదంతా రోసెట్ తలచుకుంటే ఆపగలదనీ అంటూ తెగ బాధపడిపోతారు. ఆఖరికి  ఎలిసబెత్ రౌసెట్ దళాధికారితో రాత్రి గడపడానికి  ఒప్పుకుంటుంది.  ఆ రోజు ఇంక తౌటెస్ నుండీ బైల్దేరొచ్చని ఈ బూర్జువాలంతా ఆనందిస్తారు. పార్టీ జరుపుకుంటారు.  మర్నాడుదయం రౌసెట్, కమిలిన దేహంతో, భంగపడిన హృదయం తో, వెర్రిదాన్లా వస్తుంది. ఆమె తో ఎవరూ మాట్లాడరు. వాళ్ళ ఓదార్పేమీ లభించదు.   బాల్-ఆఫ్-ఫేట్  నివ్వెర పోతుంది. 

తీరా  'రౌసెట్' చేసిన త్యాగం గురించి ఎవరూ మాట్లాడరు. ఆమె మానాన ఆమెను వదిలేస్తారు.  బండి బైల్దేరాకా, ఎవరి భోజనం వాళ్ళు తెచ్చుకుని ఆరగిస్తారు. 'నన్లు' కూడా తాము తెచ్చుకున్న సాసేజ్ మిగిలిపోతే, కాయితం లో చుట్టుకుని దాచుకుంటారు తప్ప రౌసెట్ కి ఆఫర్ చెయ్యరు.  అసలు ఆకలి కన్నా వాళ్ళు తనని మలినమైన దానిలాగా, దూరంగా ఉంచడం, అవమానించడం కలిగించిన బాధ వల్ల రోసెట్ అనగా ఈ 'బాల్-ఆఫ్-ఫేట్'  వెర్రి గా  మూగబోతుంది. కళ్ళ  లోంచీ  నీళ్ళు కారిపోతుంటాయి.  దళాధిపతి చేతిలో పడి తన మనసుకు విరుద్ధంగా జెర్మను వాడ్ని సుఖపెట్టినందుకు తనని తాను నిందించుకుంటూ, ఈ పరిస్థితి లోకి చాకచెక్యంగా నెట్టిన ఈ నాగరికులు తనను పురుగు లా చూస్తూ, వాళ్ళలో వాళ్ళు మాత్రమే నాగరీకమైన సొగసు మాటలు మాట్లాడుకుంటూంటే, తన బ్రతుకు  మీద తనకే అసహ్యం పుట్టి దారంతా ఆ స్త్రీమూర్తి పొగిలి పొగిలి ఏడుస్తూనే వుంటుంది.  ఇదీ  కధ.

సరిగ్గా ఇలాంటి తెలుగు కధనే చదివిన జ్ఞాపకం రావచ్చు చాలా మందికి. విజయనగరం, బొబ్బిలీ ప్రాంతాల వర్ణనతో ఫ్రెంచు బుస్సీ మూక బొబ్బిల్ని దండెత్తగా అక్కడి వేశ్యామణి ఒకతె, ఇలానే బండి లో కొందరు బ్రాహ్మణులూ, కోమట్లూ.. వగైరా అగ్ర వర్ణాల వారితో కలిసి పారిపోతుండగా, సరిగ్గా ఇలానే మోసగింపబడి ఆఖరికి గుక్కెడు నీళ్ళకు కూడా నోచుకోక అవమానపడుతుంది. నిజానికి  ఆమె దయ తలచడం వల్లనే, మిగిల్న వాళ్ళకి ప్రాణాపాయం తప్పుతుంది.  లేకపోతే, యుద్ధంలో మదమెక్కిన సైనికుల మతి చలించితే, మాన ప్రాణాలు పోవడమెంతసేపు ?  ఈ  తెలుగు కధ ని గుడిపాటి వెంకటాచలం బహుశా ఈ మొపాసా కధ నుండే ప్రేరణ పొంది రాసుండాలి.  






Note : చలం రాసిన తెలుగు కధ పేరు మరచితిని.  తెలిసినట్టైతే, దయచేసి సూచించగలరు.  

    

06/09/2008

ఈద్గా - మున్షీ ప్రేంచంద్

ఇది మున్షీ ప్రేంచంద్ రచించిన చిన్ని కధ. హమీద్ అనే నాలుగేళ్ళ బీద పిల్ల వాడు - తన అమ్మమ్మ తో కలిసి ఉంటూ ఉంటాడు. 30 రోజుల పవిత్ర రోజా పాటించిన తరవాత తరవాత ఈద్ పర్వదినం వచ్చింది. వీధి లో అందరు పిల్లలూ బొమ్మలూ, మిఠాయిలూ కొనుక్కుంటున్నారు. పెద్దలు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఇంట్లో చిన్న చితకా వస్తువులూ కొనుక్కుంటున్నారు. చంకీలు ఉన్న తమ టోపీల చిరుగులు కుట్టుకుంటున్నారు. పండగ కాబట్టి చిన్న పిల్లలందరికీ వారి పెద్దలు ఈదీ (బహుమానంగా కొంచెం డబ్బు) ఇచ్చేరు. ఆ డబ్బుతో పిల్లలంతా బజారులో / ఈద్ సంత లో ఎంజాయ్ చేస్తున్నారు. హమీద్ అమ్మమ్మ కడు బీదది, నిస్సహాయురాలైన వృద్ధురాలు! ఆవిడ పాపం హమీద్ కు 3 నయా పైసలు మాత్రం ఇవ్వ గలుగుతుంది.



ఈద్ కోసం నిజానికి ఈ పిల్లల బేచ్ లో చాలా రోజుల నుండీ ప్లానింగ్ నడుస్తూ ఉంది. వీళ్ళంతా ఈదీ తో ఫలానా బొమ్మలు కొనుక్కుంటామనీ, ఇంకేదో చిరుతిండి కొనుక్కుంటామనీ కలలు కంటున్నారు. హమీద్ కు ఇవన్నీ కొనుక్కునే స్థోమత లేదు. మిగతా పిల్లల ముందు చిన్నబుచ్చుకుంటాడని అమ్మమ్మ ఎలానో మూడు పైసలు ఇచ్చింది.


వీటితో ఏమి కొనుక్కోగలడు ? ఏదీ మూడు పైసలకు రాదు. మిగతా పిల్లలు కొనుక్కున్న రక రకాల బొమ్మలు చూస్తూ, నిరుత్సాహ పడుతూ సంత లో ప్రతీ ఆట వస్తువ విలువా అడుగుతూ తిరుగుతూ ఉంటాడు హమీద్. ఉన్నట్టుండి వాడికి చిమ్మ్ టా (పట్టకారు / Tong ) అమ్మేవాడు కనపడ్డాడు. వెంటనే హమీద్ కు అమ్మమ్మ గుర్తొచ్చింది. హమీద్ కు ఈ ప్రపంచంలో ఉన్నదల్లా ఆ ముసలి అమ్మమ్మే. ఆవిడ వంట చేసే టప్పుడు / రోటీలు చేసేటప్పుడూ, చేతితోనే రొట్టెలు పట్టుకు కాలుస్తూ ఉంటుంది. ఆవిడకు రొట్టెను పట్టుకునే ఆ పట్టకారు లాంటి చింటా లేదు మరి.


వెంటనే బేరం జరుగుతుంది. మూడు నయాపైసలకు చింటా ఇవ్వనంటాడు దుకాణదారు. అయితే, అంతకన్నా ఎక్కువ డబ్బు హమీద్ దగ్గర లేదు. నిరుత్సాహ పడి వెనుతిరిగి పోతున్న పిల్లవాడిని పిలిచి, ఎలాగో ఆ మూడు పైసలకే చింటా ఇచ్చేస్తాడు దుకాణదారు !

సంత నుండీ తిరిగి వస్తున్న హమీద్ ను మిగిలిన స్నేహితులు ఆటపట్టిస్తారు. బొమ్మలు కొనుక్కోమని డబ్బు ఇస్తే, చింటా కొంటావా అని ఏడిపిస్తారు. ఆ నాలుగేళ్ళ బుడ్డోడు మాత్రం ఈ వేళాకోళాలకు అదరడు - బెదరడు. పైగా తన చింటా అందరికన్నా గొప్ప ఆటవస్తువ అని, భుజం మీద పెట్టుకుంటే, గద అవుతుందనీ, విల్లు లా సంధిస్తే, విల్లు అవుతుందనీ.. ఇలా ఎలా కావాలంటే అలా దానితో ఆడుకోవచ్చని వాదిస్తాడు.


పిల్లలు - అమాయకులు. మొదట కాసేపు హమీద్ మాటలు నమ్మక పోయినా, కొంత సేపటికి తమ తమ బొమ్మలతో ఆడి, బోరు కొట్టి, వాళ్ళకి హమీద్ దగ్గరున్న చింటా ఆకర్షణీయంగా కనపడుతుంది. ఒక్కొక్కరూ.. 'ఒరే, నీకు నా బొమ్మ ఇస్తాను - కాసేపు నీ చింటా నాకివ్వరా..!' అని అడుగుతూ.. ఎక్స్చేంజ్ చేసుకుని చింటాతో ఆడుకుంటారు. మొదట టాం సాయర్ చచ్చిన ఎలకని ఇవ్వడానికి బెట్టు చేసినట్టు కాసేపు బెట్టు చేసినా... చింటా ఇచ్చి, తను ముచ్చట పడిన స్నేహితుల బొమ్మలతో తనూ కాసేపు ఆడుకుని తన సరదా తీర్చుకుంటాడు హమీద్.


ఇలా... సాయంత్రం ఇల్లు చేరేసరికీ, హమీద్ తన స్నేహితులందరి బొమ్మలతోనూ ఆడేసుకునుంటాడు. సరదాగా.. ఉల్లాసంగా ఇంటి సావిట్లోకి అడుగుపెట్టీసరికీ, తన కోసం ఆందోళన తో ఎదురుచూసిన అమ్మమ్మ..'ఇంత ఆలస్యమైందేమిరా.. ఈదీ తో కొన్న బొమ్మ ఏదీ ?' అని అరుస్తుంది. ఆవిడకి చింటా చూపిస్తే.. మొదట కోపగించుకుంటుంది. 'నీకు బొమ్మ కొనుక్కోమని డబ్బులిస్తే, ఇలంటి వస్తువ కొన్నావేమి రా?' అని విరుచుకుపడుతుంది. ఆవిడకి పాపం తల్లీ తండ్రీ లేని తన మనవడంటే, చాలా ముద్దు. ఎన్నడూ వాడి సరదాలు తీర్చగలిగే శక్తి ఆమెకు లేకపోయింది. ఈ ఈద్ కి ఎలా అయినా వాడికి ఏదో ఒకటి కొనిపెట్టాలని ఆమె తాపత్రయం.


వెంటనే.. 'నీకు చింటా లేదు కదా అమ్మమ్మా.. రొట్టెలు చేస్తున్నప్పుడు నీ చేతులు కాలడం నాకు తెలుసు. అందుకే ఈ చింటా నీ కోసం తీసుకొచ్చాను !' అని హమీద్ అనగానే, తన పట్ల మనవడికున్న ప్రేమకూ, అభిమానానికి నోట మాట రాక మ్రాన్ పడిపోయి, కొంత సేపటికి కన్నీళ్ళపర్యంతం అవుతుంది ఆ అమ్మమ్మ !



కధ నాకు గుర్తున్న మటుకూ స్థూలంగా ఇది. ఈ కధ నాకు మామూలుగా తెలియక పోను. నాకు హిందీ సాహిత్యం తో (లోగ్ లుగాయీ తరహా..) తో పరిచయం అంతంత మాత్రం. అయితే ఈ కధ ను ఎన్నో సంవత్సరాలు స్కూల్ టీచర్ గా పని చేసి రిటైర్ అయిన ఒక స్నేహితురాలు చెప్పారు. ఇది ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం సంగతి. ఆవిడ, స్వతహాగా టీచర్ మరియూ మంచి పాఠకురాలు గాబట్టి ఈ కధను చిన్న పిల్లలకు చెప్పినట్టు, రసరమ్యంగా చెప్పారు.



మున్షీ ప్రేంచంద్ రచించిన ఈ కధ (ఈద్ వస్తున్నది గాబట్టి గుర్తొచ్చింది. తప్పులు / మరచిపోవడాలూ ఉండొచ్చు ! కానీ హృద్యమైన ఈ కధని అందరితో పంచుకుందామని చెప్పానిక్కడ) ఎన్నో సంవత్సరాలుగా ఉపవాచకంగా స్కూలు పిల్లల కు చెప్పబడుతూంది. అసలు మంచి కధలు కావాలంటే, పిల్లల ఉపవాచకాలు వెదకడం మంచిది.

31/07/2008

కధలు - ఆర్ కే నారాయణ్

ఈ రోజు రెండు ఆర్.కె. నారాయణ్ కధలు చదివాను. కధ చదివాకా.. ఎప్పట్లాగే ఒక 'ఎఫెక్ట్' పడింది గానీ.. ఈ సారి ఈ 'ఎఫెక్ట్' తో పాటూ కధ అసలు ఎలా రాయాలన్నదాన్ని గురించి కూడా ఆలోచించేను.


ఈ రెండూ కధలూ Super funny గా ఉన్నాయి. వీటిలో మొదటిది - Woman in the Window

ఈ కధ భలే ఉంది. దీనిలో మన హీరో ఒక ఆడిటరు. సివిల్ / ప్రొడక్షన్ సైట్ కి డెప్యూట్ అయి, వెళుతూ, చిన్న ఆడిట్ పనులు చూసుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ సైట్లు ఎక్కడో కారు అడవుల్లో లేదా కుగ్రామాల్లో ఉంటాయి. ఈయన మరీ పిరికి వాడు కాకపోయినా - సైట్ లో తన దగ్గరికి వచ్చే బిల్లుల్లో దేన్నీ ప్రశ్నిచేంత ధైర్యం లేనివాడు. ఎప్పటికప్పుడు పని ముగించుకుని వెళదాం లే అనుకునే సాధారణ యువకుడు ! ఇతనికి, సైట్ లో ఒక ఇల్లు ప్రొవైడ్ చెయ్యబడుతుంది ! ఆ ఇంట్లో అంబీ అనే ఒక వంట వాడు -కం- నౌఖరు ఉంటాడు.

ఈ అంభీ ఒక వాగుడు కాయ ! సినిమా పత్రికలు చదువుతూ సినిమా హీరోయిన్ ల గురించి భలే గాసిప్ చెప్తూ ఉంటాడు ! రాజకీయ నాయకులూ - ఊర్లో ఏనుగు దాడి చేస్తే తను చేసిన హీరో పన్లూ.. ఒకటి కాదు. ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఈ చెప్పడం కూడా ఎంత రసరమ్య శ్రవణానందకరంగా చెప్తాడంటే - మన హీరో గారికి అదొక్కటే టైం పాస్. ఆ అరణ్యంలో బయటికి వ్యాహ్యాళికి పోదామన్నా ఏ పాములో కుట్టేస్తాయని భయం ! ఏ పుస్తకమో పట్టుకుందామంటే, అంభీ మాటలు దాన్ని డామినేట్ చేసేస్తాయి. So, ప్రపంచం లో తనకు తెలియని వింతలూ విశేషాలూ అంభీ గొంతులో వింటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు మన హీరో.

అయితే ఆఖరికి ఒక నాడు ఈ అంభీ - కబుర్లు దెయ్యాల మీదికి మళ్ళుతాయి. దెయ్యాలంటే నమ్మకం లేని హీరో - అంభీ వర్ణనలకూ, తను చెప్పే కబుర్లకి తీసుకొచ్చే ప్రమాణాలూ మాత్రం ఎక్కడో హీరో ని ఇరుకుని పెడతాయి. వాళ్ళు ఉంటూ ఉన్న ఇల్లు శ్మసానంలో కట్టినదనీ - చనిపోయిన వాళ్ళ అంతిమ సంస్కారాలు జరగక పోతే వాళ్ళు దెయ్యాలవుతారనీ - అలాంటి దెయ్యాన్ని - ఒక స్త్రీ దెయ్యాన్ని తను చూసేడనీ - చాలా నమ్మకంగా చెప్తాడు ! ఆ చెప్పడం కూడా ఎంత వివరంగా చెప్తాడంటే, హీరో కి వొళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ ఫలానా స్త్రీ దెయ్యం బహుసా గర్భవతి అయుంటుందనీ, ఎందుకంటే ఆవిడ నడుము కి ఒక చిన్న పిల్ల వాని (Foetus) అస్పష్ట రూపం చేతుల్తో చుట్టుకుని వేలాడుతూ ఉంటుందనీ - తల పండిన హారర్ రచయిత లాగా చెప్తాడు అంభీ !


బాబోయ్! ఈ Description కి ఝడుసుకు చచ్చినా, బయట పడకుండా ఎలానో నెట్టుకొస్తాడు హీరో. పైగా తన అధైర్యాన్ని బయటపెట్టకుండా పెద్ద జోక్ చెప్పినట్టు విరగబడి నవ్వుతాడు ! అది ఒక నదీ పరీవాహక ప్రాంతం. ఒకప్పుడెప్పుడో వరదలకి అక్కడి శ్మశానం కొట్టుకుపోయిందిట ! ఈ దెయ్యాల గొడవ నాకెందుకులే అనుకుని ఎంత త్వరగా ఆ ప్రాంతం నుండీ బయట పడదామా అని ఉంటుంది అతనికి ! ఈ లోగా అదృష్టవత్తూ అతనికి బదిలీ అవుతుంది. వెళ్ళాల్సిన తారీఖు కూడా తెలుస్తుంది. కానీ దెయ్యం ఆలోచెనల తో భయపడిన వాడు - ఎలానో నెమ్మదిగా అంభీ కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఆ దెయ్యం ప్రస్తావనే రాకుండా చివరి రోజు దాకా నెట్టుకొస్తాడు. ఈ రోజుల్లో అంభీ అతని బెడ్ రూం పక్కనే నేల మీద పడుకుంటూ ఉంటాడు. దెయ్యం భయానికి హీరో గది తలుపులు క్రాస్ వెంటిలేషన్ కోసం అంటూ Bedroom Doors తెరిచే పెట్టుకుని నిద్రిస్తూ ఉంటాడు.


ఆఖరికి రేప్పొద్దున్నే బయల్దేరాలనగా - రాత్రి నిద్ర పోతున్నవాడికి హఠాత్తుగా మెలకువ వస్తుంది. టైం ఎంతైందో చూసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక స్త్రీ ఆకారం ఆ మసక చీకట్లో తన బెడ్ పక్కగా కనిపిస్తుంది. వీడికి పై ప్రాణాలు పైకి పోతాయి. ఆ స్త్రీ నడుముకి వేలాడుతున్న ఫీటస్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నాలుగు కళ్ళూ అతన్ని చూస్తుంటే, ఆ దెయ్యం దెబ్బకి కళ్ళు గాట్టిగా మూసుకుని దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. తెల్లారి ఎప్పుడో నిద్ర పడుతుంది.


అయితే, లేచాక మాత్రం - అపనమ్మకం, పిరికితనాల మధ్య ఊగుతున్న మనసుని అదుపు లోకి పెట్టేందుకు నానా రకాల ఆలోచనలు చేస్తాడు హీరో ! ''ఒకె ! ఇన్నాళ్ళూ అంభి గాడి వర్ణనలు విన్నాను కాబట్టి, అన్నం సరిపోక పోబట్టి, మగత నిద్ర లో ఏదో పిచ్చి కల కని ఉంటాను లే'' అని అనుకుంటూ ఉంటాడు.


స్నానించి, పక్కా బట్టలూ సర్దుకుని స్టేషన్ కు వెళ్ళేందుకు జీపు ఎక్కబోతుండగా అంభీ - అంటాడు 'ఇప్పటికైనా నమ్ముతారా సారు - దెయ్యాల్ని ?' అని ! హీరో కి మతి పోతుంది. 'అదేంటి' - అని అడిగితే, అంభి చెప్తాడు - 'రాత్రి మీరు ఆ ఆడ మనిషి దెయ్యాన్ని చూసారు సార్ ! నేనూ చూసాను !' అని! ఇంక అంతే!! సామాన్లు జీపు లోకి విసిరి, హీరో జీపు తో ఆ ప్రాంతం నుంచీ పరార్ !


ఇంకో కధ - The Gold Frame.


ఇదో ఫోటోలకు ఫ్రేములు కట్టే 'దాస్ ' కధ! దాస్ పనితనం పేరెన్నిక గన్నది. ఇతని షాపు కి రక రకాల ఫోటోలు ఫ్రేములు కట్టించడానికి వస్తూ ఉంటాయి. వీటిల్లో పెద్దవాళ్ళ ఫోటోలూ, దేవీ దేవతల ఫోటోలూ ఎక్కువ !


ఒక రోజు ఒక కస్టమర్ ఒక ఫోటో ఫ్రేం కట్టించేందుకు తీసుకొస్తాడు. ఆ ఫోటోలోని పెద్దాయన మీద ఇతనికి ఎంత ప్రేమో, అభిమానమో వ్యక్తపరిచేందుకు అతనికి చాలా మంచి ఫ్రేం కావాలిట ! ఆ కస్టమరు మహా డిమాండింగ్ టైపు. నానా హంగామా చేసి ఒక ఫ్రేం - 'ద బెస్ట్ క్వాలిటీ' ది కావాలని గొడవ పెడతాడు ! ఆఖరికి దాస్ చెప్పగా గుండ్రని కటింగ్ ఉన్న గోల్డెన్ ఫ్రేం ఎంచుకుంటాడు ! దాస్ కూడా కొంచెం స్టైల్ కొడుతూనే ఉంటాడు. మొత్తానికి - ఫ్రేం కట్టడానికి రెండు వారాల వ్యవధి కి బేరం కుదురుతుంది.


అయితే, దురదృష్టవశాత్తూ ఆ ఫ్రేం కట్టబోయేంతలో పెద్దయన ఫోటో మీద ప్రమాదవశాత్తూ ఎనామిల్ చిందుతుంది. దాస్ ఆ షాక్ నుంచీ తేరుకుని చెరపబోయేంతలో ఫోటో కి చాలా డేమేజీ జరుగుతుంది. ఇలా ఫోటో తన చేతిలో నాశనం అవడం దాస్ జీవితంలో మొదటిసారి ! కాబట్టి తను చేసిన పనికి దాస్ కొద్ది క్షణాలు నిస్చేష్టుడౌతాడు ! అసలే ఈ కస్టమరు మహా ధనవంతుడు ! ఎంత డబ్బైనా పర్లేదు 'ద బెస్ట్' కావాలని డిమేండ్ చేసేడు. ఈ ఫోటో ని అతను చూస్తే ఏమయినా ఉందా! అని బెంగ పడతాడు.


అయితే అతని దగ్గర కొన్ని పాత ఫోటోలున్నాయి. వాటితో ఎలాగో ఒకలా మానేజ్ చేసి ఫోటొ ని ఎలానో ఒక రూపు కి తెస్తాడు. అయినా మారిన పెద్దాయన మొహానికి జరిగిన డేమేజ్ పూర్తిగా దిద్ద బడదు. ఎలానో దానికి అదిరే గుండె తో గోల్డెన్ ఫ్రేం కట్టి పేపర్ చుట్టి పెడతాడు కస్టమరు మహాశయుని కోసం ఎదురు చూస్తూ !


సరిగ్గా రెండు వారాలకి కస్టమరు గారు వస్తారు. దేవుడికి దణ్ణం పెట్టుకుని, గుండె చిక్కబెట్టుకుని పేపరు రాప్ ను విప్పి చూపిస్తాడు దాస్ ఆ ఫోటో ని అతనికి ! అంతవరకూ ఇంపేషంట్ గా ఎదురు చూసిన ఆ కస్టమరు దాస్ ఆ రేప్ ని వెప్పేందుకు చేస్తున్న ఆలస్యానికే విసుక్కుంటాడు ! తీరా ఫోటో ని చూసి ఏమంటాడో ఏమిటో అని బెంగ పెట్టుకున్న దాస్ కి రెలీఫ్ గా ఆ కస్టమరు ఒక్క మాటంటాడు - ఏం చేసేవబ్బా ఈ ఫోటోని ? నేను ఒవల్ షేప్ అంటే నువ్వు గుండ్రని షేప్ లో చేసేవేంటి ? అని!


ఈ రెండు కధలూ భలే ఉన్నాయనిపించింది. తెగే దాకా టెన్షన్ పెట్టి చంపి, నవ్వించేసాడు రచయిత మనల్ని. కధలు ఎలా రాయాలీ అంటే.. మంచి ఎఫ్ఫెక్ట్ కోసం వాటికి ఒక ముగింపు ఉండకూడదు ! వాళ్ళు ఇలా ఎందుకన్నారు, వీళ్ళు అలా ఎందుకు ప్రవర్తించేరు అని మనం విస్లేషించుకునీలా, గమ్మత్తుగా విడిపోవాలి. దటీస్ ఆర్.కే !

23/07/2008

కధా స్రవంతి

ప్రతి సోమవారం, డీ.డీ సప్తగిరి చానల్లోసాయంత్రం 8 గంటలకు 'కధా స్రవంతి' అని ఒక మంచి ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలో అజరామరులు అయిన గొప్ప రచయితల, రచయిత్రుల కధలు కొన్నిటిని ఎంచుకుని, వేరే వేరే ఎపిసోడ్లుగా ధారావాహికంగా ప్రసారం చేస్తున్నారు. ఈ వారం శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన 'ధర్మ వడ్డీ' అనే కధ ను ప్రసారం చేసారు.


అనుకోకుండా శ్రుతించి, ఈ కార్యక్రమం చూసాకా, నాకు ఈ కార్యక్రమ దర్శక నిర్మాతల మీదా, దూరదర్శన్ మీదా చాలా గౌరవం పెరిగింది. ఎందుకంటే, ఈ కధను చక్కగా బుల్లి తెరకనుగుణంగా మలిచి, ఒక పల్లె లో చిత్రీకరించి, గుండెకు హత్తుకునేలా చక్కగా తీసారు.


ఈ కధ ఎప్పట్లోనో, ధర్మవడ్డీ అనే ఒక అప్పు ఇచ్చే పద్ధతి గురించి శ్రీ గోపీచంద్ రాసినది. అప్పట్లో బాంకులు లేవు. అప్పు ఇవ్వటానికి గ్రామంలోనే ఎవరో వడ్డీ వ్యాపారం చేసేవారు. ఇష్టం వచ్చిన లెక్కలతో వడ్డీ పాపంలా పెరుగుతూ.. అసలు కన్నా మించిపోయి, అప్పు తీసుకున్న వాళ్ళ బ్రతుకులు చిందర వందర చేసే ఈ పద్ధతి మీద ప్రభుత్వానికి గానీ, సమాజానికి గానీ ఎటువంటి అదుపు లేని పరిస్థితుల్లోంచీ ఈ కధ పుట్టుకొచ్చింది.


ఈ కధ లో మన Protagonist - సూరయ్య (/సూరన్న) ఒక వడ్డీ వ్యాపారంలోకి దూకిన మోతుబరి. ఇతని తండ్రి 100 ఎకరాల మాగాణికి యజమాని గా ఉండి, చేతికి ఎముక లేనట్టు దాన ధర్మాలు చేసి, తను పోయేవేళకి కొడుక్కి కేవలం నాలుగు ఎకరాలు మాత్రం విడిచి పోతాడు. అందుకే సూరన్నకు దాన ధర్మాలు అంటే చిరాకు. అతనికున్న ఒక్కగానొక్క కూతురు పెళ్ళి చేసాడు. ఆ రోజుల్లో వడ్డీ వ్యాపారం అంటే.. ఎందరో పేదల ఇళ్ళు గుల్ల చేసి, పెళ్ళాల పుస్తెలు తెంచి, గొడ్డూ, గోదా పొట్టన పెట్టుకునే వ్యాపారం అనీ.. పాపం అనీ ఒక సెంటిమెంట్ వ్యాప్తి లో ఉండేది. అయినా సూరన్న, తన ఆస్తి ని ఇబ్బడి ముబ్బడి చేద్దామని ఉన్న పొలం అమ్మి, ఆ డబ్బు తో ఊర్లో వడ్డీ వ్యాపారం మొదలు పెట్టాడు.


అయితే, ఈ వ్యాపారం కారణంగా.. వసూళ్ళలో అతని నిక్కచ్చితనం, కౄరత్వం వల్ల గ్రామంలోనే అతనికి శత్రువులు తయారయ్యారు. ఇంతలో అతని దగ్గర రెండొందలు అప్పు తీసుకున్న ఒకానొకడు, వడ్డీ ఇవ్వనంటూ తిరగబడతాడు. ఎక్కువ మాటాడితే, అసలు కూడా ఇవ్వనని పట్టు బట్టాడు. ఇది అన్యాయం! సూరన్న కూడా ఆర్ధిక ఇబ్బందుల లో ఉన్నాడు. అతని చేతి లో డబ్బు అంతా వ్యాపారం మీద అప్పులు ఇవ్వబట్టి.. అంతా బయటే ఉంది. ఈ ఎదురుతిరగటం ఎక్కువ అయ్యాకా, సూరన్న డబ్బు అతనికి వాపసు రావట్లేదు. సూరన్న కోర్టుకు వెళ్తానని భీష్మించుకున్నా, పట్టించుకున్న నాధుడు లేడు.

సూరన్న ఈ బాధలో, దుగ్ధ లో పట్నానికి వెళ్ళి లాయరు తో మాట్లాడతాడు. అప్పు తీర్చని వాని మీద కేసు వేసి, వకీలు కి ఒక యాభయి సమర్పించుకుని, రాత్రి పూట ఇంటికి వస్తున్న అతన్ని దారి కాసి, అతని ప్రతివాది (అప్పు తీర్చని వ్యక్తి), మరికొందరు యువకులతో దాడి చేసి, డబ్బు దోచి, తీవ్రంగా కొట్టి పడేస్తారు. సూరన్న ఇంటికి ఎలాగో చేరతాడు. బయట అతనికి రక్షణ లేదు.

ఇలా సూరన్న ఊరివారి వ్యతిరేకత ఊబిలో చిక్కుకుపోయాకా, అతని అల్లుడు కూడా.. ఇంక ఆస్తి రాదని గ్రహించి, కూతుర్ని ఇంటికి పంపేస్తాడు. సూరన్న వడ్డీ వ్యాపారాన్ని ఆదినుంచీ వ్యతిరేకిస్తున్న అతని భార్య కూడా అతనిని ఆ వ్యాపారం పాపం అనీ.. ఎంతగానో నచ్చ చెప్పినా, సూరన్న మాత్రం డబ్బు - డబ్బే లోకం అనే గట్టిగా వాదిస్తున్నడు. ఇలాంటి పరిస్తితుల్లో ఏడుస్తూ ఇంటికి వచ్చిన కూతుర్ని అల్లుడింటికి పంపే ఉపాయం లేక, చేతిలో చిల్లిగవ్వ లేక, నిశ్చేష్టుడై, చెరువు గట్టున కూర్చుండిపోతాడు.

ఈలోగా, కూతురు కూడా ఒంటరిగా పొలంలో రోదిస్తుండగా.. ఊరి యువకులే కొందరు దుండగులు, సూరన్న మీద కసి తో ఆ పిల్ల మీద అత్యాచారం చేస్తారు. ఆ పిల్ల పాపం ఇంటికి తిరిగి వచ్చి, పెరటి బావిలో దూకి చనిపోతుంది. అప్పుడు విషయం తెలిసి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చిన సూరన్న కళ్ళ ముందే, కోపావేశంతో అతని భార్య నిప్పంటించుకుని, సూరన్న ఎంత బతిమలాడినా వినకుండా ఆత్మ హత్య చేసుకుంటుంది.

ఈ అకస్మాత్తు సంఘటనలూ, అతని మనసుకు తగిలిన తీవ్ర గాయాల కారణంగా సూరన్న పిచ్చివాడైపోతాడు. అతని ఇల్లు అప్పు కింద ఇంకెవరో రాయించుకుని, అతను రోడ్డు మీద పడతాడు. రోడ్డు మీద రాళ్ళను ఒక మూటలో కట్టి, తెలిసిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి, ఆ రాళ్ళనే డబ్బు గా అప్పు ఇచ్చి, మళ్ళీ, ఆ రాళ్ళనే, లెక్క పెట్టుకుని, మరిన్ని రాళ్ళనే వడ్డీ (ధర్మ వడ్డీ) గా వసూలు చేసుకుంటూ.. చాలా దీన స్థితిలో బ్రతుకుతూ ఉంటాడు. ఈ కధ చూసిన తరువాత, సూరన్న పరిస్థితి మీద ఎంత జాలి కలిగిందంటే, ఇటువంటి నిజ సంఘటన జరిగి, నేను ఆపలేని నష్టం జరిగిందే అని చాలా బాధ కలిగింది.

ఈలోగా, సూరన్న కూడా ఊర్లోని పిల్లలు పిచ్చి వాడంటూ రాళ్ళతో కొట్టి తరుముతూ ఉంటే, తన ఇంటికే వెళ్ళి, తన కూతురు చనిపోయిన బావిలోనే ఒక్క గెంతు గెంతి చనిపోతాడు. అతని శవాన్ని బయటికి తీసాకా.. ఊరివారంతా అతని జీవితాన్ని తలచుకుని చాలా బాధ పడతారు.

ఈ కధ లో తండి విచ్చలవిడి దానధర్మాల వల్ల విసిగి, డబ్బు మీద ఒక అభద్రతాభావాన్ని పెంచుకున్న సూరన్న అమాయకత్వం - ఆఖరికి డబ్బు చేతే నాశనం అయిన అతని జీవితం, ఆడబ్బు (రాళ్ళూ -రప్పలే) చేతే తరమి కొట్టబడి అతను చనిపోవటం చాలా సింబాలిక్ గా రాసారు రచయిత. ఇందులో సూరన్న మీద కోపం రాదు. తన మీద ప్రజల్లో కలిగిన వ్యతిరేకతను అర్ధం చేసుకున్నా, డబ్బు మీది అభద్రత తోనే, తన వైఖరిని మార్చుకోలేకపోయిన సూరన్న ని చూసి జాలి కలుగుతుంది.


ఈ కధ, ఇద్దరు స్నేహితులు చెప్పుకున్న కధ. టీవీ లో నేను చూసిన ఒక మంచి కార్యక్రమం. వచ్చే సోమవారం కోసం తప్పకుండా ఎదురు చూస్తాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు సప్తగిరి చానెల్ని అభినందించాలి.

అయితే, ఒక కధ చదివితే వచ్చే ఆనందాన్ని టీవీ ధారావాహిక ఇవ్వక పోవచ్చు. కానీ మనం చదవకుండా మిస్ అయిన మంచి కధలు ఇంత హాయిగా నాటక రూపంలో దొరుకుతుంటే.. చూసేందుకు సమస్య ఏముంది ?

01/07/2008

ఇంటెర్ ప్రెటెర్ ఆఫ్ మాలడీస్ - మిసెస్.సేన్

ఝుంపా లాహిరీ రాసిన ఈ పుస్తకానికి 2000 సంవత్సరానికి గాను ప్రఖ్యాతమైన పులిట్జర్ బహుమతి వచ్చింది. ఇది ఒక కధల సంపుటి. పుస్తకం ప్రాచుర్యాన్ని బట్టి, బ్లాగర్లు చాలామందికి, ఈ పుస్తకాన్ని ఇంకో సారి పరిచయం చేసే అవసరం లేదు. కానీ.. చదివిన చాలా రొజుల తరవాత, ఇంకో సారి ఈ పుస్తకాన్ని చదివినప్పుడు, మొదటిసారి చదివినప్పటి కన్నా ఎక్కువ నచ్చింది.

లాహిరి బెంగాలీ. లండన్ లొ పుట్టారు. అమెరికా లో స్థిరపడ్డారు. దేశానికి దూరంగా ఉన్న భారతీయుల ఆత్మలను తాకుతూ రాసిన కధలు.. వాటిల్లో, కొత్త జీవన విధానాలకూ, తాము నమ్మిన భారతీయ విలువలకూ మధ్య నలిగిపొయె పాత్రల చిత్రణ, ఆమె కధలను అంతర్జాతీయ స్థాయిలొ నిలబెట్టాయి.

ఈ కధలన్నిట్లొ, నాకు బాగా నచ్చిన కధ, మిస్సెస్.సేన్. ఇలియట్ అనే ఒక అమెరికన్ పదకొండేళ్ళ పిల్ల వాడు.. వాడి ఒంటరి తల్లి ; మిస్సెస్.సేన్, మిస్టర్ సేన్ లు, మొత్తం పాత్రధారులు. (అనొచ్చా...?!) ఈ ఎలియట్ తల్లి, పిల్లవాడి స్కూల్ ముగిసాక, వాడిని చూసుకొవడానికి అంతవరకూ కుదుర్చుకున్న బేబీ సిట్టింగ్ చెస్తూ ఉండిన అమ్మాయికి వేరే యూనివెర్సిటీ లొ సీట్ వచ్చి, తను వేరే ఊరికి వెళ్ళిపొతుంది. సరిగ్గా అదే సమయంలొ, మిస్సెస్.సేన్ '' ప్రొఫెస్సర్ భార్య.. పిల్లలను, మా ఇంట్లోనే చూసుకుంటాను' అని ఇచ్చిన ప్రకటన చూసి, వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇలియట్ ని ప్రతి రోజూ, స్కూల్ తరవాత, మిస్సెస్.సేన్ చూసుకునె విధంగా, ఇలియట్ తల్లి ఏర్పాటు చేస్తుంది.

అప్పుడే మిస్సెస్. సేన్ పాత్ర చిత్రీకరణ జరుగుతుంది. మిస్సెస్ సేన్, ఒక సాధారణ బెంగాలీ గృహిణి. భర్త, యూనివెర్సిటీ లో మాథెమెటిక్స్ బోధిస్తుంటాడు. ప్రతీ రోజూ, ఇలియట్ కోసం రోడ్ చివర వరకూ వచ్చి, బస్సు లొ వచ్చే పిల్లాడికి, ఏదో ఒకటి తినడానికి ఇవ్వటం, ఇంటికి జాగర్తగా తీసుకుని రావటం, సాయంత్రం వరకూ వాణ్ణి కనిపెట్టుకుని ఉండి, తల్లి పికప్ చేసుకోవటానికి వచ్చినప్పుడు, ఆమె కు కూడా, ఏవో తినటానికి ఇవ్వటం.. ఇలా ఎంతో, జాగర్తగా, సహృదయత తొ మెలుగుతూ ఉండే మిస్సెస్.సేన్ అంటే ఇలియట్ కు ఎంతో అభిమానం, ప్రేమా కలుగుతాయి. తల్లి కన్నా, నిజానికి మిస్సెస్.సెన్ దగ్గరె వాడికి ఎక్కువ వాత్సల్యం దొరుకుతుంది.

ఇలియట్ కు మిస్సెస్.సేన్ చేసే పనులన్నీ విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఆవిడ పాపిట్లో సింధూరం చూసి, ఆవిడ తలకి దెబ్బ తగిలిందేమో అనుకుంటాడు. ఆవిడ చాకుతో కూరగాయలు తరిగే విధానం.. ఆవిడ తో చేపల దుకాణానికి వెళ్ళడం.. ఇలా.. ఆవిడ భారతీయత అంతా.. వింతగా, ఇష్టంగా గమనిస్తూ ఉంటాడు ఇలియట్. కానీ అతని తల్లికి ఈ విచిత్రమైన భారతీయ గృహిణి పెద్దగా నచ్చదు. ఏదో తప్పక ఈ ఏర్పాటు కు ఒప్పుకుంటుంది గానీ.. మిస్సెస్.సేన్ ప్రతీ సాయంత్రం ఇలియట్ ను తీసుకెళ్ళడానికి వెళ్ళేప్పుడు - తనకు చేసే అతిధి సత్కారం కూడా ఆవిడకు నచ్చదు.


మిస్సెస్.సేన్.. తన హృదయన్నంతటినీ.. ఈ పిల్లవాడి ముందు స్వచ్చంగా బయటపెడుతూ.. తన మంచితనం తో.. మనల్ని కూడా మురిపిస్తుంది. ఉదా.. తను నేల మీద పేపర్ పరుచుకుని రోజూ కూరగాయలు తరిగేటప్పుడు, పిల్లవాణ్ణి, సోఫా దిగనివ్వదు. తనకు డ్రైవింగ్ అంటే, అయిష్టం, భయం. అందుకే.. ఏది ఏమైనా.. మిస్టర్ సేన్ ఎంత ఒత్తిడి చేసినా... ఇలియట్ కూడా ఉన్నప్పుడు డ్రైవ్ చెయ్యదు. ఇలా.. తన మీద ఆవిడ చూపించే కన్సెర్న్ ని ఇలియట్ హృదయం ఎప్పటికప్పుడు గమనిస్తూ.. అర్ధం చేసుకొవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఇలాంటి రోజుల్లోనే.. ఒక సారి మిస్టెర్ మరియూ మిస్సెస్ సేన్, ఇలియట్ కలిసి బీచ్ కు వెల్తారు. హాయిగా సమయం గడిపిన తరవాత, ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, మిస్టెర్ సేన్ ఒత్తిడి మీద (ఆవిడకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం పరీక్ష ఉంది మరి!) డ్రైవ్ చేస్తుంది. అయితె, ఆ భయంలో ఒక చిన్న ఆక్సిడెంట్ చేసేస్తుంది. అదృష్టవశాత్తూ .. ఇలియట్ కు దెబ్బలు ఎవీ తగలవు. మిస్సెస్.సేన్ కు కాస్త దెబ్బలు తగులుతాయి. పొలీసులూ.. నచ్చజెప్పడాలూ అవుతాయి. దంపతులిద్దరూ.. పిల్లాణ్ణి ఇంటికి తీసుకొచ్చాక, తల్లికి ఫొన్ చెస్తారు. ఆక్సిడెంట్ గురించి చెప్పడానికి.


ఇంక ఆ రోజంతా, దంపతులిద్దరూ ముభావంగా ఉంటారు. తల్లి పిల్లాణ్ణి తీసుకెళ్ళడానికి వచ్చే ముందు, మిస్సెస్.సేన్, ఇలియట్ కొసం, తినడానికి ఏదో తయారుచేసి పెడుతుంది.. తరవాత, మిస్టెర్ సేన్ కు పిల్లాణ్ణి అప్పచెప్పి, గది లొకి వెళ్ళి, తలుపు వేసుకుంటుంది. తల్లి వచ్చాకా.. మిస్టెర్ సేన్, ఆమెకు క్షమాపణ చెప్తాడు. ఇంక ఆ రోజు నుంచీ మిస్సెస్.సేన్ పిల్లాణ్ణి చూసుకునెది లేదు అని నిర్ణయించుకుంటారు. తన సామాన్లు తీసుకెళ్ళటానికి లోపలికి వెళ్ళిన ఇలియట్ కు, మూసి ఉన్న బెడ్ రూం తలుపుల లొంచీ.. మిస్సెస్.సేన్ ఏడుపూ, వెక్కిళ్ళూ వినపడతాయి.


తల్లీ, ఇలియట్, ఇంటికి వెళ్ళిపొతారు. దార్లో.. తల్లి ''తనకి ఈ ఏర్పాటు తప్పిపొవడం ఒక రిలీఫ్ అనీ.. ఆవిడకు ఎప్పుడూ.. మిస్సెస్.సేన్ నచ్చలేదనీ..'' చెబుతుంది. ఇంక నుండీ.. ఇలియట్ పెద్ద వాడు అయ్యడు కాబట్టి... ఇంక ఒంటరిగానే ఇంట్లొ ఉండాలని నిర్ణయిస్తుంది. అప్పుడు వాడికి తనని కంటికి రెప్పలా చూసుకున్న మిస్సెస్.సేన్.. గుర్తొచ్చి, చాలా బాధ కలుగుతుంది. ఆ తరవాత, వాడు ఎప్పుడూ మిస్సెస్.సేన్ ను కలుసుకోడు.


ఆ అమెరికన్ పిల్లవాడు, భారతీయ సాంప్రదాయాన్ని గురించి సెన్సిటైస్ అవ్వడం, జోళ్ళు బయట విడిచి పెట్టి ఇంట్లొ కి రావడం, మిస్సెస్.సేన్ తన ఇంటి గురించీ.. భారత దేశం గురించీ చెప్పడం వినడం.. అసలు అదేంటో తెలియని దేశం తాలూకూ స్వాభావికత ను అంచనా వెయ్యడానికి ప్రయత్నించడం.. ఇలా.. ఈ కధ లొ సున్నిత పార్స్వాలు అమోఘం.
ఈ కధ నాకు అందుకే బాగా నచ్చింది.

24/06/2008

స్వామి అండ్ ఫ్రెండ్స్

స్వామీ అండ్ ఫ్రెండ్స్ - ఆర్.కే. నారాయణ్ గారి అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకానికి తెలుగు అనువాదం కొన్నేళ్ళ క్రిందట విశాఖపట్నం లో 'జ్యోతి బుక్ డిపో' లో చాలా అదృష్టం మీద దొరికింది. ఈ పుస్తకం నిండా ఆర్.కే. లక్ష్మణ్ గారి ఇలస్త్రేషన్ లు ఉన్నాయి. ఈ పుస్తకం ఎవరు అనువదించారో గుర్తు లేదు.. బహుసా శ్రీమతి.వాసిరెడ్డి సీతాదేవి అనుకుంటాను. అయితే, ఈ పుస్తకం ఒక ఫ్రెండ్ కి బహుమతి గా ఇవ్వటం జరిగింది. ఆ తరవాత ఈ పుస్తకం ఎక్కడ ప్రయత్నించినా దొరకలేదు (తెలుగులో..) ! బ్లాగరులు చాలా మంది చదువరులు కాబట్టి, యధాప్రకారం. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో, ఎవరు అనువదించేరో.. లేదా.. ఎటువంటి సమాచారాన్నయినా ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

ఈ పుస్తకాన్ని నా సేకరణలలో (కొనుక్కుని ఉంచుకోవలసిన పుస్తకాలలో) చేర్చుకోవాలని ఆశిస్తున్నాను. తెలుగు లో కూడా స్వామీ... రాజన్, మని .. వీళ్ళంతా.. చాలా అలరిస్తారు మరి. అనువాదమే అయినా.. చాలా బావుంటుంది. ఎవరికయినా ఈ పుస్తకం గురించి తెలిస్తే ఒక సారి వ్యాఖ్య ద్వారా తెలియచేయ గలరు. ఆర్కుట్ సమూహం లో సభ్యులు.. ఇంగ్లీష్ లో చదువుకోవచ్చు గా.. అని, ఇంగ్లీష్ లోనే బావుంటుంది లెమ్మని....ఒక ఉచిత సలహా పడేసారు. తెలుగు అనువాదం కూడా బావున్నపుడు, (అసలు అనువాదం సంగతి చాలా మందికి తెలియదు) చదివితే మంచిదేగా..

04/06/2008

మోపాసా కధలు

ప్రముఖ ఫ్రెంచ్ రచయిత గై డి మొపసాంట్ (మోపాసా) కధలు - ఈ పుస్తకం విశాఖ లో 'గుప్తా బ్రదర్స్' లో కొన్నాను. మళ్ళా దీని ప్రతి దొరకలేదు. అసలు అన్ని సాహిత్య ప్రక్రియల లోనూ.. నాకు 'కధలు' నచ్చుతాయి. మోపాసా రాసిన ఈ కధలను ఎవరు అనువదించారో, ఎవరు ప్రచురించారో... ఇపుడు చెప్పలేను. ఎందుకంటే, ఆ పుస్తకం ఎక్కడో చేతులు మారి నా దగ్గర నుంచీ పోయింది.


అనువాద రచనలు చదివితే.. ఆయా దేశాల, రాష్ట్రాల సమాజం, జీవితం గురించి స్థూలంగా ఒక ఐడియా వస్తుంది. ఫ్రెంచ్ సమాజం - ఫ్రెంచ్ వారి 'వ్యక్తి-స్వాతంత్ర్యం', వారి జీవన విధానం.. వగైరా తెలుసుకొనే అవకాసం లభిస్తుందీ కధలు చదివితే.


ఈ సంపుటి లో మొదటి కధ 'రోజ్' ది. రోజ్ ఒక వంటలక్క. టీనేజ్ లో ఉంటుంది. ఒక గ్రామంలో జమీందారు ఇంట్లో వంట చేస్తూ.. ఇంటి పనులు చేస్తూ జీవనం గడుపుతూ ఉంటుంది. ఆమె కు ఉన్న ఒక్కగానొక్క బంధువు ఆమె తల్లి. ఈ తల్లి ఆరోగ్యం బాలేక, స్వగ్రామంలో కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటుంది. ఆవిడకు రోజ్ పంపే డబ్బులే ఆధారం. ఇలాంటి పరిస్థితులలో, యజమాని గొర్రెలు కాచే జాన్ అనే కుర్రాడు, రోజ్ ను ఆకర్షిస్తాడు. ఈ జాన్, రోజ్ ను చాలా నాళ్ళుగా వెంటపడుతూ, ఒంటరి గా ఉన్నపుడు మాటలు, చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంక ప్రేమ మొదలవుతుంది. ఇద్దరూ, పచ్చిక బయళ్ళ లోనూ, గొడ్ల సావిట్లోనూ.. రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు. కొన్నాళ్ళకు రోజ్ గర్భవతి అవుతుంది. అప్పటికే, ఆమె జాన్ ను తనను పెళ్లాడ మని అడుగుతూ ఉండటం, అతనూ ఒప్పుకుంటూనే, వాయిదాలు వెయ్యటం, జరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడే జాన్ ఆమె మీద మోజు తీరాక, తప్పించుకు తిరగడం కూడా మొదలవుతుంది.


తన గర్భాన్ని గురించి తెలుసుకున్న తరవాత, రోజ్ జాన్ ను కలుసుకుని.. తనను పెళ్లి చేసుకొమ్మని ఖచ్చితంగా అడుగుతుంది. మరుసటి రోజు ఉదయమే జాన్ కనపడకుండా పోతాడు. రోజ్ ఊరంతా, అతని గురించి వాకబు చేస్తుంది. అతను అప్పటికే వేరే యజమాని దగ్గర పనికి కుదిరి, వేరే ప్రాంతానికి వెళిపోయి ఉంటాడు. అంటే, రోజ్ ను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం అతనికి ఎంత మాత్రం లేదనీ, తనను కేవలం వాడుకుని, తన మానాన తను వెళిపోయాడని రోజ్ కు అర్ధం అవుతుంది.


అయితె రోజ్ కు ఇప్పుడు ఒక కొత్త సమస్య. తను ఇపుడు గర్భవతి. ఎన్నాళ్ళు తన పరిస్థితి ఇతరులకు తెలియకుండా దాస్తుంది ? ఎవరికన్నా తెలిస్తే, తను చులకన అయిపోదూ? ఇక ప్రతిమగాడూ తన కోసం ప్రయత్నిస్తే .. అని భయంతో, సిగ్గుతో, అవమానంతో, తనలోతానె కుంచుంచుకు పోతూ ఉంటుంది. అప్పటికే జాన్ సంగతీ, తన సంగతీ ఊరిలో అందరికీ చూచాయ గా తెలుసు. ఇక తను గర్భవతి నన్న విషయం తెలిస్తే ఎంత అవమానం?
అందుకే, తన గర్భం పెరిగే కొద్దీ.. శరీరం లో మార్పులు బయటకు తెలియకుండా.. పొట్టకు ఒక బట్ట తో గట్టిగా.. కట్టుకుంటూ ఏడు నెలలు కాలం ఎలానో నెట్టుకొస్తుంది. ఇలా ఉండగా.. ఒక రోజు ఆమెకు ఒక నల్ల సిరా తో రాసిన ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం చూడగానే, ఆమె కు అది జాన్ రాసాడేమో అని అనుమానం కలుగుతుంది. కానీ తనకు చదవటం రాదు. ఎవరి చేతనన్నా చదివించుకుంటే, తన రహస్యం బయటకు పొక్కుతుంది. అందుకే, వెంటనే ఆ ఉత్తరం జేబు లో పెట్టుకుంటుంది. రెండు రోజుల వరకూ, ఆ ఉత్తరం గురించిన తర్జన భర్జన ల తో మధన పడి చివరకు చర్చి లో మతాచార్యుడి చేత చదివించుకుంటుంది. ఇన్నాళ్ళూ ఆమె చర్చి మొహమే చూడటం లేదు. మతాచార్యుడికి ఏవో శక్తులు ఉంటాయని, తను ఆయనకు ఎదురు పడటం తోనే, తను చేసిన పాపం ఆయన గ్రహిస్తాదనీ ఆమె భయపడుతూ ఉండేది. కానీ.. ఈ రోజు తప్పలేదు.


చివరికి ఆ ఉత్తరం, తన తల్లి పొరిగింటి వారు రాసారని తెలుస్తుంది. తల్లికి చాలా అనారోగ్యం గా ఉంది. వెంటనే రమ్మని..ఆ సందేశం. వెంటనే, తీవ్ర ఆందోళనతో సెలవు అనుమతి కోసం, యజమానిని కలుస్తుంది. అప్పటికే ఆ జమీందారు, రోజ్ మీద కన్ను వేసి ఉంటాడు. ఎందుకంటే.. గర్భం లో పసి కందు పడిన దగ్గరినించీ ఆ పిల్ల కి, తన బిడ్డ కోసమే జీవించాలన్న ఆత్రం పెరుగుతుంది. తను బాగా పనిచేసి, యజమానిని మెప్పించి, జీతం లో పెరుగుదల తెచ్చుకుని, తల్లికీ, తన బిడ్డకు అండగా ఉండాలని రోజ్ ఆశ. అందుకే ఆమె ఇంటి పనులు చక్కబెట్టడం తో పాటూ.. అపుడపుడూ పొలానికి వెళుతూ, చక్కగా పని చేస్తూ ఉండేది. ఆమె అడుగు పెట్టాక, ఆ ఇంటికీ, పొలానికి లాభించింది. యజమాని డబ్బు తనదే అన్నట్టు గా జాగ్రత్త గా ఖర్చు పెట్టడం, ఆదా చెయ్యడం చేస్తూ ఉంటుంది. ఒక సారి రోజ్ చెప్పిన విధంగా గడువు కు ముందే కోతలు కోస్తారు. అలా చేసినందుకు అందరూ ఆమెనూ, యజమానినీ ఎగతాళి చేస్తారు. కానీ, ఆ రాత్రే, పెద్ద గాలి వాన వచ్చి, చుట్టూ పక్కల మోతుబరులు అంతా తీవ్రంగా నష్టపోతారు. జమీందారు వయసు నలభై ల లో ఉంటుంది. ఆ వయసుకి ఆయనకి పిల్ల దొరకడం కష్టం కూడా. ఆ రోజుల్లో, ఆడవాళ్లు - యజమాని భార్య అయినా.. పొలం లో కూలి పనికి వెళ్లి, ఇతర కూలీలతో సమానంగా పని చెయ్యటం సామాన్యం. అందుకే, ఇలాంటి పనిమంతురాలైన పిల్లను పెళ్లి చేసుకోవాలని యజమాని ఆశ పడతాడు.


సెలవు అడిగినపుడు.. రోజ్ తో 'సరే. నువ్వు ఊరు నుండీ వచ్చాకా, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి' అంటాడు. రోజ్ కూడా తన జీతం పెంచమని అడుగుదామని అనుకుంటూ ఉంటుంది. అందుకే తను కూడా.. తన యజమాని తో.. 'నేను కూడా మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను' అంటుంది. అప్పటికి ఆ సమావేశం ముగుస్తుంది.


ఊరు చేరేటప్పటికి రోజ్ తల్లి మరణిస్తుంది. ఈ బాధ లో కొట్టుకు పోతున్న రోజ్ కు ఏడు నెలల గర్భానికే, ప్రసవం జరుగుతుంది. నెలలు నిండకుండా పుట్టిన ఆ పసికందు ని మొదటి సారి చేతుల్లోకి తీసుకున్న రోజ్, ఆ వికృతమైన ఎముకల గూడు లాంటి బిడ్డ ని వెంటనే అసహ్యించుకుంటుంది. ఒక నెల తరువాత, అమెకు తిరుగు ప్రయాణం అయ్యే రోజు దగ్గర పడుతుంది. ఈ బిడ్డను తీసుకుని పనికి వెళ్ళలేదు కనుక.. కొన్నాళ్ళు బిడ్డను సాకేందుకు పొరుగు వారు ఒప్పుకుంటారు. ఆ బిడ్డ కోసం డబ్బు పంపిస్తానని వాగ్దానం చేసి, తిరుగు ప్రయాణం అవుతుంది రోజ్.
ఈ తిరుగు ప్రయాణం లో.. తన బిడ్డ ను తలుచుకుని, తనని వొదిలి రాలేక, బిడ్డ మీది మమకారం తో వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా దీనంగా, రెండు రోజులు - నడుస్తూనే ఉంటుంది. ఈ నడకకు కాళ్ళు బొబ్బలేక్కి, ఆ వేడికి దగ్గర్లో ఒక చెరువు కనపడితే, అందులో కాళ్ళు పెడుతుంది. చల్లగా అనిపించడంతో.. గబ గబా ముందుకు నడుస్తుంది. కాళ్ళ కి పెద్ద ముళ్లు గుచ్చుకుంటాయి. అసలే బాధ లో ఉన్న రోజ్ ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తూ, స్ప్రుహ తప్పిపోతుంది. సమయానికి ఆ దారినే పోతున్న రైతు ఒకడు ఆమెను రక్షించి యజమాని ఇంటికి తీసుకు వస్తాడు.


యజమాని ఇంటికి తిరిగి వచ్చాకా.. కొన్నాళ్ళకు ఆమె కోరుకున్నాక, యజమాని ఆమె ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తాడు. రోజ్ ఒప్పుకోను గాక ఒప్పుకోను అంటుంది. ఆమె మనసంతా...తన వికృతమైన బిడ్డ నిండి పోయి ఉంటాడు. ఒక కేతలిక్ గా..పెళ్లి అన్నది ఇపుడు పాపం. యజమాని మాత్రం మంకు పట్టు వదలడు. చాలా రోజులు వాద-ప్రతి వాదాల తరువాత.. ''ఇంకా జాన్ వస్తాడనే ఎదురు చూస్తున్నావా ? నీ సంగతీ నాకు తెలుసు లే ! ' అంటాడు. రోజ్ భయం తో బిగుసుకు పోయి, ఆయనకు ఎదురు మాట చెప్పదు. అతనికి ఏమి తెలుసు? అని సందిగ్ధం లో పడిపోతుంది. అయితె, ఆమె వ్యతిరేకత తో సంబంధం లేకుండా, ఒక రాత్రి ఆమెను బలవంతంగా లొంగదీసుకుంటాడు. అలా ఆమె తన యజమానిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.


పెళ్లైయిన తరవాత కూడా ఆమె మునుపటి లానే, పొలంలో కూలి లా పనులు చేస్తూనే ఉంటుంది. యజమానికి తన కొత్త భార్య వలన చాలా కలిసి వస్తుంది. అయన చాలా ధనవంతుడు అవుతాడు. అయితె, ఆ దంపతులకు ఇపుడు ఒకటే కష్టం. వాళ్ళకు పిల్లలు లేరు. అన్ని రకాల పద్ధతులూ పాటించారు.. దానాలు, ధర్మాలూ చేసారు. ఎవరేవరినో కలిశారు. పుణ్య క్షేత్రాలు దర్శించారు. తావీజులు కట్టించుకున్నారు. ఫలితం లేదు.


రోజ్ ఈ మధ్య కాలం లో అపుడపుడూ తన ఊరికి వెళ్తూ ఉంటుంది. ఆమె బిడ్డ, కొంచెం కండ పట్టి, చక్కగా కనిపిస్తున్నాడు. పిల్లాడి మీద వాత్సల్యం తో.. ఎంతొ ప్రేమ తో, ఎంతొ మమకారంతో ఊరు వెళ్ళటం, తిరిగి వస్తున్నపుడు తీవ్ర విచారం లో మునిగి రావటం జరుగుతూ ఉంటుంది. ఈ పిల్లాడి సంగతీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది.


అయితె తన నిస్సంతు జీవితం భరించలేని జమీందారుకి విపరీతమైన కోపం వస్తూంది ఈ మధ్య. తన భార్య మీద చిందులు తొక్కుతున్నాడు. తనకు వారసుడిని ఈయలేక పోతున్నదని, తనని అవమానాలకు గురి చేస్తున్నదని.. ఆయనకు రోజ్ మీద వల్ల మాలిన కోపం వస్తుంటుంది. కొట్టడం, తన్నడం, గేలి చెయ్యడం లాంటివి ఎక్కువయ్యాయి. జమిందారుకి వయసు ఎక్కువ కావటం తో.. పిల్లలు లేకుండానే చనిపోతానేమో అని భయం ఎక్కువయింది. ఆమధ్య రోజ్ తో ఏదో వాదన ముదిరి, ఆమె ని రెక్క పుచ్చుకుని బయటకు లాగి, రాత్రంతా వర్షం లో వోదిలేస్తాడు. తెల్లారి, తలుపులు తెరిచాక, రోజ్ ఇంట్లోకి వస్తుంది.


ఆఖరికి ఒక రోజు ఆమెతో గొడవ పడి, రోజ్ తలని పట్టుకుని గోడ కేసి బాదుతాడు. అంతే ! అంతకాలం ఆయన దుర్మార్గాలన్నిటినీ సహించిన రోజ్ ఆ రోజు మాత్రం భరించలేక పోతుంది. 'నీకు పిల్లలు లేక పొతే లేరు.. నాకు మాత్రం ఒక కొడుకు ఉన్నాడు. మా ఊరిలో అనాధ అయి పెరుగుతున్నాడు. నాకూ, జాన్ కు కలిగిన బిడ్డ..!' అని పిచ్చిదాన్లా అరిచి ఏడుస్తుంది.


నిశ్చేష్టుడై.. రాయిలా నిలబడిపోతాడు జమీందారు. కానీ.. అదుపు లేకుండా ఏడుస్తున్న రోజ్ ని చూసి, ఆమె చెప్పిన నిజాన్ని అర్ధం చేసుకున్న తరువాత, ఆయన రోజ్ ను తన చేతి లోకి తీసుకుని.. 'పద! మన పిల్లాడిని తీసుకోద్దాం మన ఇంటికి..!!' అంటాడు. ఆ కుటుంబం ఆరోజు తో పరిపూర్ణం అయి.. అంతా హాయిగా ఉంటారు.


ఇలాంటి కదిలించే ఒక ౧౦ కధలు ఉన్నాయి ఈ సంపుటి లో. అన్నీ మానవ సంబంధాల గురించే.. ఎవరి దగ్గరన్న, ఈ పుస్తకం ఉంటే వాళ్లు అదృష్ట వంతులు!