Pages

28/04/2023

అనుక్షణికం - వడ్డెర చండీదాస్




పుస్తకం తెరవగానే  "కథాకాలం : 1971-80, రచనాకాలం : 1979-81"  అని చూసి మానసికంగా పెద్ద "పాత"  కథ కు సిద్ధమయి చదవడం లోకి దూకగలం. ఇతివృత్తంలోని ఒకరికొకరు పరిచయముండే అసంఖ్యాక పాత్రలు ఒకే పెట్టున పలకరిస్తూ యూనివర్సిటీ కేంపస్ లో ఎదురవుతాయి. నవల అంతా ఆయా పాత్రల జీవితాల్ని, ముఖ్య సంఘటనల్నీ, విడి విడిగానూ, అప్పుడపుడూ అల్లుకుంటూనూ సాగుతుంది. ముఖ్యంగా భారత చరిత్రలో ముఖ్యమైనటువంటి ఎమర్జెన్సీ రోజుల గురించి, అంచెల్లో, ఎలా ఏయే పరిస్థితులు, రాజకీయ పరిణామాలు రూపుదిద్దుకున్నాయో, వాటి వల్ల సాధారణ జనం పడిన అగచాట్ల గురించి విస్తారంగా వివరిస్తుందీ నవల. 

[కథాకాలంగా 1971-1980 ని తీసుకోవడానికి ప్రత్యేక కారణాలంటూ యేం లేవుగానీ ఈ దశాబ్దం కొన్ని విశేష లక్షణాలున్న దశాబ్దంగా నాకు అనిపించింది.  స్వపరిపాలనా భారతావనిలో అవిచ్చిన్నంగా కొనసాగుతూ వొస్తున్న వొకానొక రాజకీయ పరిపాలన వొక "డింకి" వేసిన దశాబ్దం.  అన్ని రకాలగానూ యెన్నడూ యెదగని కొన్ని దేశాలలా కాక - ధనమ్మూల మిదం జగత్తైనప్పటికీ, అనార్ధికమైన యెన్నో అంశాలకి సంబంధించి శతాబ్దాలుగా యెంతొ యెదిగి వొదిగి యెదిగిన భారత దేశంలో యే పరిస్థితులు యెలా వున్నా పౌరులందరికీ వోటు హక్కు ఉన్న ప్రజాస్వామికం వున్నప్పటికీ, వ్యవ్స్థికంగా సమూలమైన మార్పు కోసం నినాదోద్యమ కెరటం లేచిపడిన దశాబ్దం. - వడ్డెర చండీదాస్]

ఈ పుస్తకం గురించి ఇన్నేళ్ళ తరవాత పరిచయం రాయాలనుకోవడం చాలా అసమంజసం. అయినా, కొన్ని చెప్పుకోదగ్గ అనుభవాలు, విశేషాలూ ఉన్నాయి. నాకు ఏకబిగిన ఏ పుస్తకమూ చదవలేని, ఏ సినిమా కూడా ఒకే షాట్ లో చూడలేని మనస్థితి నుండీ బయటపడ్డట్టే అనిపించింది. ఒకే రోజులో ఆపకుండా చదివించడం, తెరలు తెరలుగా వేరే వేరే జీవితాల కథలు అంకాలుగా మారుతూ మధ్యలో ఆనాటి రాజకీయ వాతావరణం గురించి, మార్క్సిసం, విరసం, వంటి భావజాలాలతో అల్లుకుపోయిన జీవితాల గురించీ విడమర్చి చెప్పిన కొన్ని కథల వల్ల, ఈ పుస్తకం రీడబిలిటీ పెరిగిందనిపించింది. ఎప్పుడో, నేను పుట్టక మునుపు కాలం లో కథాంశాన్ని, ఇన్నేళ్ళ వయసులో చదువుతూ, ఆయ జీవితాల గురించి ఆలోచిస్తుంటే, సాంఘికంగా మనం పెద్ద దూరం ప్రయాణించకపోయినా, దేశంగా చాలా ముందుకు వచ్చామేమో అనిపించింది. 

అందమయిన +  వ్యక్తిత్వం ఉన్న ఆడవాళ్ళు, వాళ్ళ తాత్విక సౌందర్యం తో పాటూ, నిజాయితీపరులైన రచయితల కళ్ళల్లో పడి బ్యూటీ షేమింగ్ కు గురయిన ఫ్లాట్ చెస్టెడ్ మహిళల నుంచీ, సూట్ కాకపోయినా వికారమైన చీరకట్లతో ప్రపంచాన్ని ఠారెత్తించే వారు, విపరీతమైన కోరికల మత్తులో కొట్టుకుపోయేవారు, మొగుడి చేష్టలకు జడిసి, వేగలేక ప్రాణాలు తీసుకునే వారు, ఉన్మత్తులు, మత్తులు, కుటిలులూ, ధీరలు, కుక్క కాట్లకు చెప్పుదెబ్బలిచ్చుకునే మహిళలు, అతి నిజాయితీపరురాళ్ళూ, క్షణికావేశులూ.. ఇలా ఎందరో ఆడవాళ్ళు, వాళ్ళనల్లుకునే ఎందరో నీచులూ, మాన మర్యాదలున్న మగవాళ్ళు, ప్రేమికులూ, చేతులడ్డుపెట్టి రక్షించుకున్న తండ్రులు, వీరు వారు అని కాకుండా బోల్డన్ని రకాల పాత్రలు. 

ప్రతీ పాత్రదీ ఓ కథ. వాళ్ళలో 'స్వప్నరాగలీన' లాంటి ప్రత్యేక పాత్రలు....  ఆవిడ ని చూస్తే నైరూప్య లాలిత్యం హుందాతనంగా రూపుదిద్దుకున్నట్లు అనిపిస్తుందట.  పైశాచికపు టాకలిజీవులు తప్ప అందరూ ఆరాధించే అసాధారణ అపూర్వ అపురూప సౌందర్య స్వాప్నిక నిజం లాంటి స్వప్న. ఈ పిల్లని చండీదాస్ చాలా ఉద్విగ్నంగా సృష్టించి ఉంటారనిపిస్తుంది. కానీ ఎవరో పాత్రల గురించి ఆయన్ని ప్రశ్న అడిగితే, "తనకు రచయితగా తాను సృష్టించే అన్ని పాత్రల్నీ సమానమే. ప్రతి ఒక్కరితో తాదాత్మ్యించే రాస్తాను యధాతథంగా" అని సమాధానమిచ్చారు. 

నవల్లో ఒక్కో పాత్రదీ ఒక్కో బాధ, గాధ.  నవల ముగిసాకా, జీవితం గుర్తొచ్చింది. దేవుడు కూడా మనల్నందరిని సృష్టిస్తాడు కదా.. మార్క్ ట్వైన్ చెప్పినట్టు - ఓ చేత్తో సృష్టిస్తాడు. ఇంకో చేత్తో లయం చేస్తాడు. మధ్యలో బ్రతికే బ్రతుక్కి కష్టాలు, సుఖాలూ, అనుభూతులూ ఇస్తాడు. వాటి నుండీ నేర్చుకోవడమే, దొరికిన వారికి దొరికినంత జ్ఞానం.  ఎన్ని వికృతాలనో చూస్తాం. ఎన్ని ఘోరాలనో అనుభవిస్తాం. శాపనార్ధాలు పెడతాం. కొన్ని సార్లు ఉద్యమిస్తాం. ఎదురు తిరుగుతాం. కొన్ని సార్లు సర్దుకుపోతాం. మోసపోతాం. ఎవరో ఏదో నిర్ణయిస్తే, ఆ భారం మోస్తుంటాం. కాబట్టి, ఎందుకు ఈ తాపత్రయం ? 

ఇంత ఫిలాసఫీ లోనూ కొంచెం "నిజాయితీ" వర్ణనలు. అందమైన స్త్రీ ని వర్ణిస్తే చక్కగా చదువుతామే. చాలీ చాలని బట్టతో కుట్టిన జాకెట్లేసుకుని, పొట్ట విరుచుకుని తిరిగే మహిళల్ని చూస్తే చూసేవారిలో కలిగే వికారాన్ని గురించి కూడా  - "యీ బొడ్డుకింది చీరకట్టులో జనాన్ని చూడలేక డోకొస్తోంది. తిరగలి కంతలా బొడ్డు. మధ్యబాగం కాబట్టి నడుం అని అనుకోవాల్సొచ్చే నడుంకి అటు పక్క, ఇటుపక్క కిదికి జారిన కండలు, చిరు బొజ్జా - పవిట కప్పకూడదూ - యీ బొజ్జ రాణి - ఆహా ఆహా నన్ను చూడు - నా బొజ్జ చూడు  నా కలుగుబొడ్డు చూడు అంటూ - యే ఘటోదరీ బొడ్డు కిందకి చీర కట్టడం నిషిద్ధం అని శాశనం చేస్తే బావుండునుఅనుకునేట్టు. 


పైగా మహిళా పాత్రల శరీరము, వారి సెక్సువాలిటీ మీద, వారి పార్ట్నర్స్ వెలిబుచ్చే "అభిప్రాయాలు", ఆయా పాత్రల సంకుచితత్వమూ, కధాకాలం ప్రకారం, ఎప్పటి కండిషనింగో - ఆడవారికి అపుడపుడే అబ్బుతున్న విద్య, (పెద్దగా చదువుకోని వారికి బయటి ప్రపంచాన్ని,  రంగుటద్దల్లో అయితేనేం, అసలంటూ చూపించే నవలలు, పోచికోలు సాహిత్యం)  పెద్ద ఆలోచనలూ, ఆశలూ లేకుండా జరిగే వివాహాలు, సెక్స్ కోసం అడ్డదారులు తొక్కే ఆడ వారు,  భయంకరమైన కన్నింగ్ ఉన్న విషనాగుల్లాంటి మగవారూ, మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు, ఉన్న పెద్ద కేన్వాస్.  ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. వాటి రంగులు మారాయంతే. 


మధ్యలో అంతర్లీనమైన కథ "ఇందిర" ది. ఇందిరాగాంధీ ఉక్కు మహిళే. ఆవిడ "నిర్దాక్షిణ్యత", రాజకీయ కుయుక్తి, కోటరీ మాటలు విని దేశాన్ని చీకట్లోకి నెట్టేసిన పద్ధతీ,   ఆపై ఎన్నికలు తనకు తానై ప్రకటించి, ఊహించని విధంగా ఓడి, తరవాత ఒక్కతీ ఉద్దండులైన ప్రత్యర్ధుల్ని ఎదుర్కొని, రాజకీయంగా దృఢమై, శక్తి పుంజుకుని, తానే ఊహించనంత మెజారిటీ తో గెలిచి, మళ్ళీ ప్రధానమంత్రి అయి.. ఇవే విజయాలు, ఇవే అణిచివేతలు, ఇవే నిర్ధాక్షిణ్యతలు, చూపించిన ఆమె మహిళ కాకపోయి ఉంటే అతి పెద్ద నాయకత్వ నిర్ణయాలుగా పేరుపొంది ఉండేవి.   ఆ రోజుల్లో ప్రజల్లో ఉన్న విలువలు, ఒక "స్త్రీ" నాయకురాలవడానికి ఉపకరించేయి.   ఈ నవల్లో ఒక పాత్రధారి, డబ్బు, సారాయి పంచకుండానే ఎలక్షన్లలొ గెలిచి, మంత్రి కూడా అవుతాడు. ఈరోజుల్లో ప్రజలే అమ్ముడుపోయినారు.  ఎన్నికలొస్తే,  ఓటుకింతని అమ్ముకునే ఓటరు ఓటుకా విలువ ? 

బోల్డన్ని పాత్రలున్నందువల్ల సమాజంలో ఆడవాళ్ళ ప్రాముఖ్యతని రచయితే చాలా చోట్ల కొట్టొచ్చే విధంగ చెప్పే ప్రయత్నం చేసారు.  "మన దేశంలో స్త్రీల వోట్లతో గెలుస్తూ, స్త్రీ పరిపాలనలో ఉన్నప్పటికీ ఇంకా పురుష దురహంకారధిక్య ద్వంద్వ ప్రమాణ నైచ్యంలోనే ఉన్నాం. ద్వంద్వ ప్రమాణ స్థితి అంటే నాకు అసహ్యం, అసహనం" అని ఒక పాఠకుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  స్త్రీల నాయకత్వం సంగతి పక్కన పెడితే, ఈ నవల్లో లాగే అసంఖ్యాక పురుష పాత్రలు, ఆడవారి దేహాల్ని చూస్తూ జడ్జ్ చేస్తూ, అందానికీ, అనాకారితనానికీ, అన్నిటికీ వారినే విక్టిమైజ్ చేస్తూ, వారికో వ్యక్తిత్వం ఉంటుందనో, మనసు ఉంటుందనో బాధ్యతలు, జీవితమూ ఉంటుందనో పట్టించుకోకుండా మనసు లోపలనో / బరితెగించి బయటకో అడ్డమైన వాగుడూ వాగి, పైకి ఇది మామూలే అన్నట్టు ఉండడం.. ఇదే ప్రవర్తన, ఇన్ని సంవత్సరాల తరవాత, స్త్రీ విద్య పెరిగాక, స్త్రీలు ప్రశ్నించడం మొదలయాక కూడా కొనసాగుతూండడం చూస్తున్నాము. అలాగే ఈ పాత్రల్లోనే కొందరు జెంటిల్ మెన్ - వేశ్యలతో కూడా మానవత్వం తో వ్యవహరించగలిగే వారు, భార్యంటే ప్రాణం పెట్టే వారు, 'స్త్రీ' అవమానాన్ని సహించలేని మంచి మనసున్నవాళ్ళూ ఉన్న్నారు. వాళ్ళు ఇప్పటికీ మన చుట్టూ ఉన్నారు.  మంచీ చెడూ ఎప్పుడూ, అన్ని కాలాల్లోనూ చెట్టాపట్టాలేసుకునే ఉంటాయి.  ఎంతైనా ఇవన్నీ ప్రిమిటివ్ / ఆటవిక లక్షణాలు - ఇంకా నయం, మనం ఈ దేశంలో ఉన్నాం,  మహిళల జుత్తు కనిపిస్తుందనో, కాళ్ళు కనిపిస్తున్నాయనో చంపేసే దేశం కాదు మనది అని ఆనందించబుద్ధవుతుంది.   కానీ అల్టిమేట్ గా మహిళలు మన దేశపు వినోద పరిశ్రమ దగ్గర్నించీ,  స్కూల్స్ లో టీచర్లుగా, నర్సులు గా, సేవా రంగాల నుండీ, పారిశ్రామిక వేత్తలుగా, సైంటిస్టులుగా, పైలెట్లు గా, ఇంజనీర్లుగా,  సాఫ్ట్ వేర్ రంగం లో కూడా ఎక్కువ సంఖ్యలో పని చేస్తూ,  మన కొనుగోలు శక్తుల్నీ ప్రభావితం చేస్తున్నారు. మహిళా వోటు - కి కూడా కాస్త విజ్ఞత అబ్బితే, లేదా సమాజంలో కావల్సిన  మార్పులకి  స్త్రీ పురుషులిద్దరూ కలిసి,  ఒక్కో రెక్కా జేర్చి పూనుకుంటే, అప్పుడు కాస్తయినా ఈ ద్వంద్వత తగ్గుతుందని మనమే తెలుసుకోవాలి.  

మొత్తానికి ఇది ఓ పొలిటికల్ / ఫిలాసఫీ / సాంఘిక / మానసిక / లైంగిక విషయాలగురించి మాత్రమే చర్చించే నవల కాదు. అంతా ముగుస్తుంది. కానీ ప్రకృతి వెంటనే ఇంకో కథ మొదలుపెడుతుంది. పాత్రధారుల పాత్రలవీ ముగిసాక, వారి చెల్లెళ్ళూ, తమ్ముళ్ళూ, పరిచయస్తుల పిల్లలూ, అదే యూనివర్సిటీ గడపలెక్కుతారు. కొన్ని రోజులకి ఆ తరవాతి తరం, ఇంకో తరం.. వారి బ్రతుకులు - వారి కష్టాలు, సుఖాలు, ప్రేమలు, చావులు, పుట్టుకలూ, ఇంకో చరిత్ర.  కనురెప్ప పాటులో ముగిసి మళ్ళీ  మొదలయ్యేదే ఈ జీవితం.. క్షణికం, అనుక్షణికం. 


అందరూ పోతారు. ప్రతీదీ పోతుంది. యెవరూ పోరు. యేదీపోదు. పోనిదే రావటం యెలా? రానిదే పోవటం యెలా ? ఈ రావటం పోవటం లోంచి - 

అన్నీ యధావిధి సాఫీగా కొనసాగుతున్నాయి. యీ మండే పగటెండ వెన్నెల వేళ మేలుకున్నవారి వ్యధా విధి తప్ప - అన్నీ యధావిధిగా సాఫీగా సాగిపోతున్నాయి.  

క్షణం వెనుక  క్షణం ముందు క్షణం లోన క్షణం కింద క్షణం పైన క్షణం వక్క క్షణం క్రితం క్షణక్షణం, క్షణికం ; క్షణిక క్షణిక క్షణంలో పుట్టుకే గిట్టుకలా అసలు ఆరంభమే అవనట్లుగా, గిట్టుకే పుట్టుకలా అసలు అంతమే అవనట్లుగా ; క్షణక్షణాల క్షణికాల, క్షణికక్షణికాల క్షణం; అంతలోనే అంతమయ్యే క్షణికాల దొంతర, యెంతకీ అంతమవని దొంతర క్షణికాల, విశ్వాంతర్ప్లావిత సంకీర్న క్షణికాలు. అంతలోనే అంతమయ్యే యెంతకీ అంతమవని నిరంతర క్షణికం అనుక్షణికం. 





Many thanks to  Ms Purnima Tammireddy, who sent this book to me, almost a year ago.  But I could read it only today. 

***

14/04/2023

అశని సంకేతం - బిభూతి భూషణ్ బందోపాధ్యాయ, అనువాదం : కాత్యాయని



"గ్రేట్ ఫేమిన్ ఆఫ్ బెంగాల్"  గురించి అమర్త్య సేన్, శశి థరూర్ పుస్తకాలు రాసారు. ఉపన్యాసాలిచ్చారు.  చరిత్ర పాఠాల్లోకి అంతగా ఎక్కని ఈ ఘోర పాలనా తప్పిదాన్ని గురించి ఈ మధ్య జగ్గీ వాసుదేవ్ కూడా ప్రముఖంగా ప్రస్తావించారు.  ధాన్యాగారమైన బెంగాల్ లో, పంటలు లేక కాదు. దుర్మార్గమైన ప్రభుత్వ విధానాల వల్ల తినేందుకు తిండి దొరక్క, ప్రజలు వీధుల్లో పడి లక్షలాదిగా చనిపోయారు. ఎక్కడో జరిగబోయే యుద్ధం కోసం, బ్రిటీషు ప్రభుత్వం పిచ్చిగా, బలవంతంగా సేకరించిన ధాన్యాలు ఓడల్లో ముక్కిపోతుంటే, ఊర్లకూర్లు జనం "తెచ్చిపెట్టుకున్న క్షామం"తో తిండి లేక మరణించారు.   చెప్పలేనంత అరాచకాలు, చీకటి బజారులలో బోల్డంత వెల పోసి బియ్యం కొనుక్కోవాల్సి రావడమూ జరిగాయి. వీటిని బ్రిటీషు ప్రభుత్వం తమ పార్లమెంటు కు  సరిగ్గా నివేదించనే లేదు. జాత్యాహంకారం, మన బానిస జీవితమూ - మన తరఫున పోరాడేందుకు శక్తివంతమైన నోరన్నది లేకపోవడమూ వల్ల ఇవి జరిగాయన్న స్పృహ మేథావులలో కలిగింది.  


ఈ ఘోరాన్ని రికార్డ్ చేసేందుకు, మృత్యువు, ఆశ, నిరాశలూ, మెల్లగా కమ్ముకొచ్చే క్షామమూ ఎలా వుంటాయో, ఒక్కో దారీ మూసుకుపోతున్నపుడు జీవితం ఎలా వుంటుందో, గుంపులుగా తిండి కోసం వలసపోయి, తాగేందుకు గంజి కూడా దొరకక పిట్టల్లా జనం చనిపోవడం, భయాందోళనలూ, పుకార్లూ అతలాకుతలం చేసిన గ్రామీణ జీవితాన్ని అందరికీ తెలిపేందుకు,  బిభూతిభూషణుడు ఈ "అశని సంకేత్"  నవలని రాసారు. దీనిని సత్యజిత్ రే ఇదే పేరుతో బెంగాలీ లోనూ, డిస్టంట్ థండర్ (Distant Thunder) అనే పేరుతో ఇంగ్లీషు లోనూ  (Dubbed Version) సినిమా తీసారు. పుస్తకం చదివాక  సినిమా (ప్రైం లో వుంది) వెతుక్కుని తప్పకుండా చూస్తాం. రెండిటిలో చిన్న చిన్న మార్పులుంటాయి. పుస్తకం చాలా వివరంగా వుంటుంది. సినిమా లో చిన్న మార్పులున్నా, అది దృశ్య కావ్యం కాబట్టి, ఇంకాస్త  ప్రభావ వంతంగా ఉంటుంది. 


యుద్ధం వల్ల చాలా దుష్పరిణామాలుంటాయి. బర్మా నుండీ దిగుమతవాల్సిన  ధాన్యం రావడం ఆగిపోతుంది. ఆర్ధిక మాంద్యం, దానికి తోడు బలవంతపు ధాన్య సేకరణ ! భయంకరమైన ధరల సెగ, ప్రజానీకాన్ని ఎంత దీనత వైపు తోసేస్తాయో. ఈ నవల లో గ్రామీణులలో చదువుకున్న వారు చాలా తక్కువ.   1943 ప్రాంతాలలో వారికి  పరాయి పాలన కన్నా, సమాజంలో పాతుకుపోయిన భూస్వామ్య,  నిరంకుశ కుల వ్యవస్థ ఎక్కువ బాధించేవి.  బ్రాహ్మణుడు గ్రామంలో ఎంతో గౌరవించదగ్గ వ్యక్తి.  అన్ని ప్రాంతాలలోగానే ఇలాంటి కష్టాలు సంభవించినప్పుడు నష్టపోయేది దిగువ ఆదాయ వర్గాల వారే. వారిలో బ్రాహ్మణులూ ఉన్నారు, హరిజనులూ ఉన్నారు.   "గుడ్ ఎర్థ్"  నవల్లో లాగా గ్రామీణులు, చిన్న వృత్తి, వ్యవసాయ దారులూ, నగరాలకు తిండి కోసం వలస పోయారు.  సైన్యంలో చేరిన వారు, విదేశాలకు వెట్టి చాకిరీకి తరలించబడినవారూ పెరిగారు. దళారీలు తోడేళ్ళలా గ్రామాల మీద పడ్డారు.   బ్లాక్ మార్కెట్ ప్రభావాల వల్ల ధనికులు మరింత ధనికులయ్యారు. గ్రామాలలో మిగిలిపోయిన జనం, ఆకులు, దుంపలు, జల చరాలూ తింటూ, జబ్బుల పాలై మరణించారు. 


ఇలాంటి ఘోరాలు మొదలవ్వకముందే ఒక గ్రామానికి, వర్షాలు లేక కరువొచ్చిన ప్రాంతం నుండీ ఒక బ్రాహ్మణ కుటుంబం బ్రతుకు తెరువు వెతుక్కుంటూ వస్తుంది. మొదట్లో ఈ గ్రామంలో వారికి సరిపోయేంత ఆదాయం దొరుకుతుంది. ఎన్నో ఏళ్ళకు వీళ్ళు కడుపునిండా తిండీ, వొంటినిండా బట్టా కట్టుకోగలుగుతారు. ఆ ఇంటి ఇల్లాలు చాలా మంచి అమ్మాయి. ఎవరైనా ఇంటికొస్తే, ఉన్న దాంట్లోనే ఇంత పెట్టే మంచి మనసున్న మనిషి.  ఈ కృత్రిమ కరువు మొదలయ్యాకా, ధాన్యం కోసం ఒక్కోటీ ఆవిడ వొంటి మీదున్న కాస్త బంగారమూ అమ్మేసుకుంటారు. పొరిగూరి నుండీ ఏ పరిచయమూ లేని ఇంకో బ్రాహ్మణుడు వచ్చి తిండి కోసం తిష్ట వేసినా భరిస్తుంది. తను కడుపు మాడ్చుకుని భర్త నానా పాట్లూ పడి తెచ్చిన బియ్యం తో ఎలాగో అందరి ప్రాణాలూ నెలబెడుతుంది. 


పరిస్థితులు మెల్లగా దిగజారుతుంటాయి. వేరే ఊర్ల నుండీ బీదా బిక్కీ, తిండికోసం అడుక్కుంటూ వస్తూంటారు.  ప్రజలు ఇళ్ళలో అన్నాలు రహస్యంగా వొండుకు తినే పరిస్థితి వస్తుంది.  ఆడవాళ్ళు అడవుల్లోకెళ్ళి దుంపలు, ఆకులూ సేకరించాల్సొస్తుంది. చెరువుల్లో నత్తలూ, చేపల్నీ కూడా వెతుక్కుంటూ బురదమయం చేసేస్తుంటారు. ఎక్కడా కొనుక్కుందామన్నా తిండి దొరకదు. బియ్యం కోసం కొందరు స్త్రీలు వొళ్ళమ్ముకుంటారు. పరిస్థితులు పూట పూటకీ దిగజారుతుంటాయి.  బియ్యం బజారునిండీ తెచ్చుకునేలోగా దోపిడీలు చేయడమూ ఎక్కువవుతుంది.  ఇలాంటి పరిస్థితుల్లో, మానవ సంబంధాలు ఎలా వుంటాయి? సాయం కోసం తలుపు తట్టే సాటి మనిషిని ఆదరించే సహృదయత ఎంతమందికి ఉంటుంది. అసలు సాయం చేసేందుకు వీళ్ళకంటూ ఏదో ఒకటి ఉండాలి కద. ఈ బ్రాహ్మణుడు వీధి బడి నడిపే పంతులు. కరువులో పిల్లలని చదువు కెవరు పంపుతారు ? ఆదాయం ఉండదు. ఆకలి తీర్చాల్సిన నోర్లు పెరుగుతుంటాయి. భార్య చాలా మంచిది కాబట్టి, ఉన్నప్పుడూ, లేనప్పుడూ భర్తకి ధైర్యాన్నిస్తూ, తను తినీ తినకుండా అందరికీ భోజనం పెడుతుంది. 


ఈ పరిస్థితుల్లో గ్రామంలో  స్త్రీలు కులాలకతీతంగానే స్నేహంగా వుంటారు. వారిని కలిపి ఉంచేది బీదరికమే. అస్సలు తిండి లేని నాళ్ళలో అడవుల్లో ఒకరికొకరు సాయంగా వెళ్ళి కందమూలాలు తవ్వుకుని తెచ్చుకుంటారు. అలా వీరి స్నేహితురాలైన / పరిచయమున్న ఒక దళిత అనాథ స్త్రీ ఈ బ్రాహ్మణ కుటుంబం ఉండే ఇంటికి సమీపంలో తిండి లేక, నేల మీద పడి మరణిస్తుంది. తన దగ్గర ఏదో ఆహారం దొరుకుతుందని వస్తూంటుందని, పాపం నిరాహారంగా చనిపోయిందనీ ఈవిడ కన్నీరు మున్నీరు అవుతుంది.  నిజానికి ఆకలి చావుల గురించి వారు అంత వరకూ పుకార్లే వింటారు గానీ, ప్రత్యక్షంగా ఇంత సమీపం లోంచీ చూడడం వీళ్ళందరికీ ఇదే మొదటి సారి. ఆ    హరిజనురాల్ని శవాన్ని చూసి,  ఆ చనిపోయింది తాము కాదని అందరూ సంతోషిస్తారు. కానీ భయం గుండెని కమ్ముకుంటుంది. 

కానీ కులాచారాల ప్రకారం ఆమెను దహనం చేసేందుకు ఎవరూ రాకపోతే, ఈ బ్రాహ్మణ కుటుంబమే, ఆ శవాన్ని తాకి, తరవాతి కార్యక్రమాలకు ముందుకొస్తుంది. ఆ నిరంకుశ కుల వ్యవస్థ ని ఈ కరువు కాసేపు పక్కన పెట్టేలా చేస్తుంది. (మొన్నటి కరోనా లాగా Equaliser)  కరువు కూడా అందరికీ సమానమే అని అందరికీ అర్ధమవుతుంది. 

ఈ సినిమాని చూసినప్పుడు, తిండి కోసం ఒక ముఖం కాలిపోయిన ఇసుక బట్టీ యజమాని తో లేచిపోయేందుకు సిద్ధ పడిన అందమైన యువతిని చూస్తాం.  ఆవిడ భర్త తిండి కోసం కుటుంబాన్ని వొదిలి అప్పటికే ఎక్కడికో వెళిపోయుంటాడు. హీరోయిన్ బంగ్లాదేశీ అని చదివాను. ఆమె కూడా చాలా అందంగా ఉంది. బెంగాలీ గ్రామాల అందాలని ఒడిసిపట్టడంలో రే అగ్రగణ్యుడు. చుట్టూ పచ్చదనం ఉన్నా, పండిన పంట అంతా ప్రభుత్వానికి తరలించాల్సొచ్చి, ఆకలిచావులు సంభవించడం, బెంగాలీ జాతీయ స్పృహ ని తాకుతాయి. ఈ బాధితులకు జర్మనీ, యుద్ధమూ, వగైరాల గురించి ఏమాత్రమూ తెలీదు. అవెక్కడ ఉంటాయో కూడా తెలీదు. చనిపోయినవాళ్ళందరూ, "అన్నం, అన్నం" (భాత్, భాత్) అని తలుచుకుంటూ చనిపోతారు. అదో హృదయ విదారక దృశ్యం. అతి పెద్ద మానవ తప్పిదం. ఈ ఫేమిన్ బ్రిటీష్ ప్రభుత్వ పునాదుల్ని కదిలించడంలో ప్రముఖ పాత్ర వహించింది.  వారి నిరంకుశ పరిపాలనా విధానం, వలస దేశాలలో ప్రజని జంతువులకన్నా హీనంగా పరిగణించడమూ, దేశాన్ని ఆగ్రహంలో ముంచెత్తాయి. 


ఈ పుస్తకాన్ని తెలుగులో కాత్యాయని గారు అనువదించారు.    "ఇచ్చామతీ తీరాన"  కూడా ఆవిడే అనువదించారు. కేవలం టైటిల్ తప్ప మిగతా అన్ని భాగాలూ ఎలానూ 'చాలా బాగా'    అనువాదం చేసారు. బహుశా "అశని సంకేత్"  అనే పదానికి తెలుగు అర్ధం తట్టలేదేమో.. లేదా సరైన ఇంపాక్ట్ కలిగించేందుకు యధాతథంగా ఉంచారో అని అనిపించింది.  కానీ అదృష్టవశాత్తూ మిత్రులు విన్నకోట నరసింహారావుగారు నా సందేహాన్ని తీర్చారు. 'అశని' అంటే 'పిడుగు' అని అర్ధం ఉంది. అశనిపాతం అనగా పిడుగు పడడం అని అర్ధం. అంటే ఈ డిస్టంట్ 'థండర్' అన్న ఇంగ్లీషు అర్ధాన్నన్నా నేను చూసుకునుండాల్సింది.  కాబట్టి ఇది సరైన టైటిలే అనుకుంటున్నాను.   ఇది చాలా మంచి రచన. కథా వస్తువు పాతది, క్లాసిక్ ఇండియన్ నవల ఇది. ఇంత మంచి నవలని తెలుగులోకి తీసుకొచ్చినందుకు  HBT వాళ్ళని అభినందించాలి. 

ఒకలాంటి రొమాంటిసిసం తో ఆకట్టుకునేలా, ప్రపంచం అంతా చుట్టేసినట్టు రాసే బిభూతి భూషణుడు రాసిన నవలల్లో ఇదో అత్భుతం. "ఇచ్చామతీ తీరాన"  కూడా బావుంది. కానీ అదో వేరే రాజకీయ వాతావరణపు దృశ్యం. కానీ ఈ పుస్తకం చదివాక "ఇలాంటి కథ చెప్పడానికి చాలా సాహసం కావాలి"  అనిపించింది.  పరిస్థితులు నెమ్మదిగా మన కళ్ళ ముందే దిగజారుతుంటాయి. వాటిని చూస్తూ ఆత్మ స్థైర్యాన్ని నిలుపుకోవడం మానవ అస్థిత్వానికి చాలా ఇంపార్టెంట్.   ఏదేమైనా ఇది చాలా మంచి పుస్తకం అని చెప్పొచ్చు.   [గ్లూమీ సంగతులు - బాధ, కోపం కూడా వస్తూంటుంది.  పూర్తిగా అవాయిడబుల్ కరువు.  దాని దుష్ప్రభావాల ముద్రలు బెంగాల్ లో ఇంకా మిగిలే ఉన్నట్టు అనిపిస్తుంటుంది].  It was important to document this event in literature.   చాలా గొప్ప ప్రయత్నం.  

Notes : 

Distant Thunder (Film adaptation) - Available in Prime.

Bengal Famine 1943

Buy the Book

50 years of the Masterpiece

 : https://www.thedailystar.net/entertainment/tv-film/news/50-years-satyajit-rays-ashani-sanket-enduring-masterpiece-3394916

BBC story

దిగంతం - కాశీభట్ల వేణుగోపాల్



మామూలుగా చాలామందికి లానే, ఇవెప్పటి కథలో,    వీళ్ళెక్కడి చదువుకున్న అనామకులో - ఇంత దారిద్ర్యమా   - ఇంత  నిరుద్యోగమా - అంటూ పాత్రలు "సక్సెస్ ఫుల్"  కాపోతే ,  లేదా వారికి అసహ్యకరమైన పరిసరాల్లో, తృప్తి లేని బ్రతుకులు బ్రతకాల్సొచ్చి, తలా తోకా లేని & అసలు భవిష్యత్తంటూ ఉండని బతుకు బ్రతుకుతుంటే,  అంత డార్క్నెస్ భరించడం నాకూ చేత కాదు.  కానీ 'ఇనీషియల్ షాక్' తట్టుకోగలిగితే ఇది ఆయన మాత్రమే రాయగలిగే నవల. ఆయన అలానే రాస్తాడు చదువూ అని పుష్ చేసే "మిత్రో" ఉండబట్టి గానీ.. లేకపోతే, ఈ రచయిత [కాశీభట్ల వేణుగోపాల్] నాకు చిక్కకనే పోను. 

ఆరంభం లోనే  "ఏ ముఖమూ" లేని కథానాయకుడు, తనని తానే వెంబడించుకుంటూ, తాను పారేసుకున్న ముఖాన్నే వెతుక్కుంటూ, అలుపొచ్చేలా పరిగెడుతుంటాడు. అతనికో  నిర్లిప్త, భావరహిత, ప్రేమమయి,  ఓ "కుంటి, చెవిటి, మూగ" తల్లి.   ఆమెతోనే తన జీవితం. చుట్టు పక్కల బస్తీ లో అపరిశుభ్ర వాతావరణం మధ్య బీద, ఇంటెలెక్చువల్, చేతకాని జీవితం!  ఇది ఏ కాలం నాటి కథో అనిపిస్తుంది. అలాంటి నిరుద్యోగం ఇప్పటికీ ఉందేమో. అలాంటి నిస్సహాయత గురించి మురికివాడల జీవితం గురించీ 70 లలోనే ఎక్కువ కథలొచ్చేవి. మహానుభావుడు ఈ కధానాయకుడు -    తన ముఖానెప్పుడో పోగొట్టుకున్నాడు. మిగిలిన అర్భక మైన దేహం, ఉడిగిపోతున్న వయసు, ఒంటరి తనం, ఎక్కడో కొద్ది శాతాలలో మిగిలిన మంచి హృదయం, మిగిలినవన్నీ అంత హాని చెయ్యని నలుపు ఆలోచనలూ.  (ఒకరికి సాయం చెయ్యగలిగినంత "కాండక్టు" ఉన్న మనిషే). 

ఇప్పుడు కథలకు కాలం మారిందనుకుంటాను. అంత చదువుకున్న మనుషులు పాశ్చాత్య సాహిత్యం గురించి చర్చించుకునే బీద వ్యభిచారులు, గుడిసెల్లో ఉండే వ్యభిచారులూ, డబ్బులు చాలని చిరుద్యోగులూ ఆ కాలంలో ఉండేవారేమో. ఇప్పుడున్నంత సమాచార విప్లవం అపుడు లేదో. ఇపుడున్నంత డబ్బు సంపాదించే మార్గాలు లేవేమో అని జాలి కలిగించే పాత్రలు.  ఈ కథా నాయకుడికి చాలీ చాలని సంపాదన, కచ్చితమైన సిగరెట్టు + బీడీ దురలవాటు,  డార్కు ఇంగిలీషు ఆలోచనలు, [గొణుక్కునేందుకు ఇంగ్లీషూ, తిట్టుకునేందుకు బూతులూ !] అయితే ఈ మొహం కోల్పోయిన ఆత్మకు మనసుంటుంది.   [అప్పుడప్పుడు వెతకడం మానేసాక, అతనికి తన ముఖం లిప్తల్లో దొరుకుతూంటుంది.] 

ఆ మనసుకు బోల్డన్ని అనుభవాలుంటాయి. ఆదరించిన ప్రతి మనిషి పట్లా బోల్డంత కృతజ్ఞత ఉంటుంది. పెళ్ళికాదు.  ఆ పరిస్థితుల్లో  శరీరానికి ఓదార్పునిచ్చిన వ్యభిచారి అంటే కృతజ్ఞత ఉంటుంది. ఆమె మరణ సమయంలో ఆమె పోయాకానూ, "ఆవిడ ఎంత బాధలు పడుంటుందో ఈ ఇన్స్టిట్యూషన్ లో, ఈ మురికికూపంలో" - అని బాధపడగలిగేంత మనవత్వం ఉంటుంది. ఆఫీసు లో అమ్మాయినీ, పొద్దున్న పల్చని నైటీలో కనిపించే,  ఆనవాలు తెలీని మహిళనీ, లాలస తో చూడడం, సహజంగానే తనకు కావలసినది పొందలేకపోయిన నికృష్ట దురదృష్టం పట్ల ఏహ్యభావంతో నూ, కోరికలతోనూ,  చాలీ చాలని సంపాదన తోనూ పెనుగులాడే  కధానాయకుడు.  ఎందుకో సహజంగానే అతనికి పెద్దగా తన పరిస్థితిని మార్చుకోవాలన్న కసీ ఉండదూ, దార్లూ వుండవు. 

తల్లి - ఏమీ లేని తనం లో కూడా  అచ్చంగా తల్లి లానే, ఈ నలభైయేళ్ళ వృద్ధ యువకుణ్ణి కాపాడుకుంటూ, కడుపునిండా తిండి 'వండి' పెడుతూ,  అవిటిదయినా ధైర్యంగా జీవిస్తూ, కొడుక్కి స్పూర్తి నిస్తూండే మూగ మనిషి.    ఆవిడ ఓ ఆనందాన్నీ, చిరాకునీ, అసహనాన్నీ, దేన్నీ వ్యక్తపరచదు. ఆవిడ కి తన చేష్టలు ఆనందాన్ని కలిగిస్తున్నాయా, కోపం తెప్పిస్తున్నాయో ఎప్పటికీ తెలీయదు. ఆవిడ నవ్వగా అతనెప్పుడూ చూడలేదు. పైగా కనీసం చిరునవ్వో, కళ్ళలో మెరుపో -  అలా ఇంకేదో పద్ధతిలో నైనా సరే  ఎటువంటి భావాన్నీ వ్యక్తపరచని గాజు కళ్ళూ, చెక్క ముఖమూ ఆమెవి.  తల్లిని దాదాపు రోజూ కసురుకుంటాడు. కిరోసిన్ స్టవ్ మీద నీళ్ళు పోసి ఆర్పుతుందని,  వగైరా.. ఆవిడకి వినబడదు. అయినా కేకలేస్తుంటాడు. రోజూ ప్రేమగానూ, లాలనగానూ మాట్లడతాడు.  ఆవిడ లేని జీవితం లేనే లేదనుకుంటాడు.  "ఆది, అంతం" లేని జీవితం!  ఎన్ని లోతులకి జారాలో అన్ని లోతులకీ జారాక, వాటిల్లొంచీ పాక్కుంటూ, పైకొచ్చి, ఎదుగుతున్నాననుకుంటాడు. ఇదీ దిగంతం కథ. 

రచయిత శైలి విభిన్నం, శక్తి మంతం. బాగా చదువుకుని, అన్ని దారులూ నడిచొచ్చిన అనుభవం,  జీవితం అంటే కృతజ్ఞత ఉన్న శైలి. ముందుమాట లో "నే నోనేల బారు మనిషిని.  నా రచనల్లో గొప్ప గొప్ప ఆశయాలుండవు. గొప్ప విషయాలుద్భోదించే జ్ఞానం నాకు లేదు. నాలా ఆలోచించే వారికోసమే నా రచనలు.  "నా జీవితమే నా రచన, నా రచనే నా జీవితం. అంగవైకల్యంతో అయిదేళ్ళుగా మగ్గుతున్న నన్ను కాపాడుతున్న నా తల్లి సావి (సావిత్రక్కకు) సాష్టాంగపడుతూ.." అని రాసారు.  ఈ ఆఖరు వాక్యం చదివి నిశ్చేష్టురాలైనాను. ఒకరి మీద ఆధారపడవలసి రావడం, అదీ పెద్ద వయసులో, చాలా పెద్ద శిక్ష. ఈ మానసిక స్థితే చాలా విచిత్రమైనది. ఈ సమయంలో మనసులో కృతజ్ఞతను పెంచుకోవడమూ, కాపాడుకోవడమూ ఎంతో గొప్ప విషయం. ఈ సంపుటి (అన్వీక్షకి ప్రచురణ ట్విలైట్ సిరీస్ - 1) లో అన్ని రచనల్లోనూ ఈ కృతజ్ఞత కనిపించింది. 

ఈ పుస్తకాలలో ఒక దానికి ముందుమాట గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసారు.  దాని కన్నా "దిగంతం" బావుందనిపించింది. [ ఇది మూడు పుస్తకాల సంపుటి. ] "దిగంతం" లో ముగింపెంత బావుందో.  ముగింపు లో పూల బజారు కెళ్తాడు హీరో. అక్కడి దృశ్యం : 


పూల బజారు వీధిలోకి కావాలనే వెళ్ళా. ఉత్తినే పూల వాసనల్ని పీల్చడానికి. 

ఖరీదు లేని ఆనందం అప్పనంగా దొరికితే ఆబగా అనుభవించేందుకు.

పువ్వులమ్మే వాళ్ళందరూ ముళ్ళలానే వున్నారెందుకూ ?

కంటక దృష్టి ..!

వెధవా, నీ చూపు ముళ్ళ చూపు .. పాపం ఆ ముసలి సాయిబు చూడు తెల్లటి వెండి గడ్డం..!  మిల మిలా మెరిసే కళ్ళూ, తెల్లటి పైజామా లాల్చీతో తెల్లటి పొడుగాటి వేళ్ళతో.. 

యెంత సుతారంగా తాకుతున్నాడూ పూలని ? పూల మజ్జెనింకో వృద్ధసుమంలా లేడూ..?

నీ చూపు ముళ్ళ చూపంతే .. !

అరటి నారతో కట్టిన పూవులు హర్షాతిరేకంతో చేతులు చేతులు కట్టుకుని, చుట్టలు చుట్టుకుని నిల్చున్న ఆడపిల్లల్లా లేరూ .. !" 

ఓహో !  యేమి గొప్ప భా... వ.. న ..!

ఆయనెవరో ముసలి బాపనాయన "ఊలుదారాలతో గొంతుకురి బిగించి.." అని బాధపడి తన్నుకు చచ్చాడే....!

ఆయన దృక్కోణమది..! హాలెండు లో ట్యూలిప్పుల పైర్లకోతలు చూస్తుంటే ఆయన పుష్ప విలాపం వ్రాసుండేవాడా ? 

ఆయన చూసినట్లుగానే ప్రపంచంలో జనాలందరూ చూస్తుంటే.. యిన్ని వందల వేల కోట్ల రూపాయల పువ్వులమ్ముడు పోతాయా రోజూ..? 


తన బీద, ఒంటరి తల్లి కోసమూ, అమ్మ నవ్వగా చూడాలని దాని కోసం రకరకాలుగా ప్రయత్నించే తపించుకుపోయే పెద్ద యువుకుడు ఆకర్న తల్లి నవ్వు చూసినప్పుడు రాసిన పేరా చదివి చాలా తృప్తి కలుగుతుంది. ఒకే మూసలోని రచన చదివినపుడు కలిగిన చిన్న అలక్ష్య భావాన్ని ఈ వాక్యాలు చెదరగొట్టేసాయి. రచననూ, రచయితనూ, రికమెండు చేసి, కొని పెట్టి,  తరవాత చదివేందుకు బద్ధకిస్తే ప్రోత్సహించి, చదివించిన మిత్రునికి కృతజ్ఞతలు. నిజంగా విలువైన రచన. 


నిర్మలమై.. అరిటాకు పొట్లంలో ముద్ద గులాబీలాగా అమ్మ పెదవులు విచ్చుకునే వున్నాయి. 

శాస్వత హాస రేఖయై.. పై పెదవి ఆకాశం. కింది పెదవి భూతలం ! 

విచ్చుకున్న విశ్వాంతరాళ కాంతులై చిరునవ్వు..! 

అమ్మ చిరునవ్వు.. చూళ్ళేననుకున్న చిరునవ్వు...! 

ముఖమ్మీది ముడుతలు విడిగి విప్పారి విశ్వరహస్య భోధలు చేస్తూ.. కఠోర సత్యం.. ప్రవచిస్తూ, ఆమె పెదవుల మధ్య కుంచించుకుపోయి హీనమై క్షీణమై సత్యమై పేలిపోయిన దిగంతం..!


Its all Worth it. 






11/04/2023

మలయమారుతం - శారద





ఈ కథల పుస్తకం చాలా బావుంది. దీనిలో కొన్ని కథలు ఇంతకు ముందు అంతర్జాల పత్రికలలో   చదివినవి, కొన్ని చదవనివి. వీటి విషయం కొంచెం కొత్తది. బాగా చదువుకుని, స్వదేశంలోనూ, విదేశాల్లోనూ క్షేమమయిన ఉద్యోగాలు చేస్తూ, కుటుంబ బాధ్యతలు మోస్తూ, రక రకాల జీవితానుభవాలను మూటకట్టుకున్న కాలాతీత పాత్రలు, రక రకాల స్థానాల్లో నిలబడి, తమ సొంత మనసుల్లోకి చేసిన ప్రయాణం ఈ కథల విషయం. దాదాపు అన్ని కథలూ, పాత్రలు తమలోకి తరచి చూసుకునే సందర్భాలే.  

జీవితంలో ఇక సారైనా అలా మనలోకి మననం చూసుకుని, మన తప్పొప్పులని ఒప్పుకోగలిగితేనే మన మనసులు పరిపక్వమయ్యే అవకాశం ఉంటుంది. అది సాధారణంగా "నేనే తప్పూ చెయ్యలేదు!", "నేనేం చేసేను?" "నా మనసుకు సరి అనిపించింది చేసాను!", "నేనెప్పుడూ తప్పు చెయ్యను", "అప్పటికి అదే కరెక్ట్ నిర్ణయం. అందుకే తీసుకున్నాను!" లాంటి సమర్ధింపులతో, స్వార్ధంతో మనం ఎన్ని తప్పులు చేసేస్తూ - తప్పు గా జీవిస్తామో కదా.  మన తప్పుల్ని ఒప్పుకోవడానికో, అసలు మన తప్పుల్ని తలచుకోవడానిక్కూడా చాలా మంది ఇష్టపడం. 

"మలయ మారుతం" లో ఇలాంటి తమ తో తాము మాటాడుకునే మనుషుల కథలున్నాయి. ఈ అర్బన్ వర్కింగ్ లేదా నాన్ వర్కింగ్ జీవితాల్లో, అసూయలూ, కన్నింగ్, కుట్రలూ, క్షమ, గుర్తింపు లేని జీవితాలూ,  పెత్తనం, అజమాయిషీ లాంటివి అంత స్పష్టంగా కనిపిస్తూ ఎంత సమస్యల్ని అవి తెచ్చిపెట్టగలవో, మకిలి పట్టిన వ్యక్తిత్వాలు, నటనా, హిపొక్రసీ లు ఎంతగా మన జీవితాల్లో భాగాలయిపోయాయో కళ్ళకు కట్టినట్టు వివరంగా చెప్పారు శారద గారు.   కొందరు వాటి నుండీ బయటపడడానికి మనస్పూర్తిగానే ప్రయత్నిస్తారు. కొందరు అలా మంచిగా ప్రవర్తించమని మనకి దారి చూపిస్తారు. కొందరు అహంకారంతో అసలు తము వీటన్నిటికీ అతీతులం అనుకుంటారు. 

పిల్లల జీవితాల్లో, కాస్తంత భర్తల జీవితాల్ని కూడా అజమాయిషీ చేసేస్తుండే మహిళల గురించి రాసిన కథ మాతృదేవోభవ.  ఈ  కథ లో నాకు బాగా నచ్చిన కొన్ని వాక్యాలు :  

"చాలా మంది ఆడవాళ్ళ లాగే  సరోజ కూడా ఇక జీవితం నించి కానీ, ప్రపంచం నించి కానీ తను నేర్చుకోవలసినదేమీ లేదనీ, ఈ జన్మకి కావలసిన అన్ని రకాల జ్ఞాన విజ్ఞానాలని తను నేర్చేసుకుందని, తనకి తెలియని విషయాలేవీ లేవనీ గాఢంగా నమ్ముతుంది.  తక్కువ తెలివితేటలకీ, జ్ఞానానికీ వుండే ఆత్మ విశ్వాసం, ఎక్కువ తెలివితేటలకీ, ఎక్కువ విజ్ణానానికీ వుండవు. అందుకే వాదనల్లో కానీ, జీవితంలో కానీ ఎక్కువ సంస్కారం, తెలివీ ఉన్నవాళ్ళు ఓడిపోతుంటారు. నరేంద్ర కంటే ఎప్పుడూ వాళ్ళింట్లో సరోజదే పై చేయి." 

"ఇంతకుముందు బంధువులూ, స్నేహితులూ, పరిచయస్తుల్లా కనబడే జనం ఇప్పు డు సరోజ కళ్ళకి ఆడపిల్లల తండ్రులూ, మగపిల్లల తండ్రులూగా విడిపోయారు" 

"చిన్నప్పట్నించీ ఏ స్వయంప్రకాశం లేని నిస్సహాయురాలినని భావించే ఆడదానికి 'మగపిల్లాడి తల్లీ పదవితో వచ్చే పవరే వేరు. 


అలాగే కాలంతో పాటు సంఘంలో రావలసిన మార్పులు - ఉదా:  అమ్మలు - పిల్లల లైంగికత్వాన్ని గౌరవించడం,  తమ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకుల బెంగలో మునిగిపోయినా కూడా అబ్యూస్ కి గురవుతున్న ఇంకోళ్ళ పిల్లని కాపాడడం లాంటి మంచి పనులు చేయడం. అలానే  మనం నిస్వార్ధంగా చేసే  కొన్ని చిన్న సాయాల ఇంపాక్ట్ పిల్లలమీదా, ముఖ్యంగా మన తోడ్పాటు ఎంతో అవసరమైన టీనేజ్ పిల్లల మీద ఎంత ఉంటుందో చెప్పడం, ఇవన్నీ ఇప్పటి కాలానికి కావలసిన కథలు.  ఇలా ఈ అమ్మలు, చాలా కథల్లో సింగిల్ మదర్స్ - ఎంత అత్భుతంగా మంచి పనులు చేస్తారో !  

అలానే ఉద్యోగమో, ఇంకో సంపాదనా మార్గమో ఉంటే స్త్రీ కి జీవితాన్నెదుర్కొనే ధైర్యం కూడా కలుగుతుంది.  అయినా సరే 'ఏం చెయ్యాలో తెలీక'  అలానే హింసకు అలవాటు పడి బ్రతికేస్తుంటారు కొందరు మహిళలు.   ఆడవారిపై శారీరక, మానసిక అధికారం చూపిస్తూ, దౌర్జన్యం చేసే భర్తలకి "కోపం తెప్పించకుండా బ్రతకడం" లాంటి డిఫెన్స్ కన్నా "అతని అహాన్ని తృప్తి పరిచేస్తే చాలనుకోవడం" - వాటితో సమస్యలు పరిహారమైపోతాయనుకోవడం ఎంత తిరోగమన వాదమో చెప్పడం, ఒక మహిళా రచయితగా శారదగారు చేసిన మంచి వ్యాఖ్య. 

అలాంటి "మారేదీ, మార్పించేదీ "  అనే  కథలో నాకు బాగా నచ్చిన వాక్యం :  "అసలు పిల్లలకి తల్లిపైనా తండ్రి పైనా గౌరవం మిగిలి ఉంటుందా ? తండ్రి ప్రవర్తననీ, తల్లి లొంగుబాటునీ చూసి పిల్లలు దౌర్జన్యంలో తప్పేమీ లేదనీ, దౌర్జన్యానికి విరుగుడు లొంగిపోయి వుండడమేననీ అనుకోరా ? పరిస్థితులను అర్ధం చేసుకొని జీవితానికి తనని తాను  అప్పగించేసుకుని వుండడం కాకుండా పరిస్థితులని మార్చుకునే దారి లేదా? "

భార్యా భర్తల ప్రేమలో ఎన్నో మలుపులొస్తుంటాయి. ఓట్టో లాగా మరణించిన భార్య తలపుల్లో సతమతమైపోతున్నా, ఆమె బ్రతికున్నండగా తన జీవితంలో ఊపిరులూదిన మధురిమలను తలచుకుంటూ బ్రతికే భర్త గురించీ,   అకస్మాత్తుగా జీవితం శూన్యమైపోయి, ఆత్మహత్య చేసుకోబోయిన ఒక ఇల్లాలిని సరైన సమయంలో ఆదుకోవడమే కాకుండా కళాకారిణి గా,  ఆమెకు ఓ డైరెక్షన్ ఇచ్చి, జీవితానికి ఓ అర్ధాన్నిచ్చిన ఓ స్నేహితుడి గురించీ, "మలయమారుతం" కథ లో మనుషుల మధ్య కావల్సిన అనుబంధాలగురించీ ఎంతో హృద్యంగా రాసారు. 

ఈ కథల సంపుటి ఏకబిగిన చదివేసాక, మనసు లో అలజడి లాంటిది తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుంది. రక రకాల పాత్రలు, ముఖ్యంగా అమ్మాయిల కథలే, ఒక మానసిక ప్రహేళిక లాంటి సవాళ్ళని ఎదుర్కొని, తాము చేసిన తప్పులకి సిగ్గు పడే, తమలో అహాన్ని తృప్తి పరచే సంఘటనల్లొ సాంత్వన వెదుక్కునే పాత్రలు ! ఇవి చాలా ధైర్యస్తుల కథలు.  శారద గారి "శంకరాభరణం"  సంపుటి లాగే ఈ పుస్తకం కూడా మెరుపులు మెరిపించింది. నాకు ఈ పుస్తకం పంపినందుకు చాలా థాంక్స్ శారద గారూ.   అన్ని కథల గురించీ చెప్పేసి, చదవాలనుకునే పాఠకుల ఉత్సాహం మీద నీళ్ళు చల్లడం ఇష్టం లేదు నాకు. అందుకే ఇక ముగుస్తాను. 





***