ఒక పుస్తకం గురించి చాలా విన్నాక, పత్రికలలో రివ్యూలు చదివాక, దాదాపు స్టోరీ ఏంటనేది చూచాయగా తెలిసిపోయాక, మంచి స్నేహితుడు చదవమని చేతిలో పెడితే, న్యూట్రల్ గా మొదలుపెట్టిన పుస్తకం ఇది. చదవడానికి సులువుగా ఉన్న భాష, దేశీ అనువాదం, (అనువాదకురాలు, డెబోరా స్మిత్ ఏషియన్ ఆత్మని పట్టుకోవడం కోసం ఉద్దేశ్యపూర్వకంగా అలా చేసుండొచ్చు) అందమైన కథనం, గబ గబా చదివించేస్తాయి. ఒక సారి చదివిన దానికీ, ఇంకోసారి నెమరువేసుకునేదానికీ అర్ధాలు కొత్తగా బోధపడతాయి. అది పూర్తిగా అనువాదం గొప్పతనం అనిపిస్తుంది. ఎప్పట్లాగే కవర్ పేజ్ చాలా అర్ధవంతంగా ఉంది. పుస్తకం ముగించాక అది తెలుస్తుంది.
భార్య అంటే ఏ మాత్రం ఆసక్తి, ప్రేమా లేని భర్త. కూతురి మీద, అసలు తమ పిల్లలంటే విపరీతమైన కంట్రోల్ ఉన్న తల్లితండ్రులు. పురుషాధిక్యత. హీరోయిన్ - యాంగ్ హై, మామూలు భార్య. ఆమె భర్త, కూడా సాధారమైన మనిషే. అయితే ఈ పిల్ల కి ఉన్న ఒక మొక్క లాంటి బ్రతుకు బ్రతకాలనుండడం అన్ని సమస్యలకీ బీజం. యాంగ్ హై కున్న అక్కయ్య ఇంగ్ హై, ఎంతో కుదురైన కూతురు. బాధ్యతకల చిన్నపిల్లవాడి తల్లి. డిజిటల్ కళాకారుడైన సంపాయించని భర్తని సాకుతూ, ఇంట్లో సకలం చూసుకునే సూపర్ వుమన్. ఈ ఇద్దరి అక్క చెల్లెళ్ళ జీవితం - ఈ వెజిటేరియన్.
యాంగ్ హై కి చిన్నప్పటి నుండీ ఒక ఆక్రోశం. జీవితం అంటే. ఆమె కి పెళ్ళయాక జీవితం ఏమీ పెద్ద మారదు. భర్త చాలా సున్నితత్వం లేని మామూలు భర్త. అతనికి భార్య మీద ప్రేమ, ఆదరణా ఉండవు. అతనికి ఆమె అర్ధం కాదు. యాంగ్ హై కి ఉన్న మానసిక సమస్యలు అతనికి పట్టవు. ఆమెకు ఏమి కావాలో అక్కర్లేదు. ఆమె బాధ్యతగా, మర్యాదపూర్వకమైన భార్యగా మసులుకుంటే చాలు.
యాంగ్ హై పెద్ద సౌందర్యవతి కాదు. కానీ మంచి సాంప్రదాయక కొరియన్ కుటుంబంలో పుట్టింది. చెప్పిన మాట వినే రకం. అంతే. ఆమెకు బ్రా వేసుకోవడం, రొమ్ముల్ని బట్టతో బంధించడమూ అంటే అసలు ఇష్టం ఉండదు. దాని వెనకున్న హైపర్ సెన్సిటివిటీ అతనికి అర్ధం కాదు. అసలు ఆమె భయాలూ, వేదనా, అతనికి పట్టవు. పిల్లలు అప్పుడే వద్దనుకున్నారు. ఆమె కు ఏవో కలలొస్తున్నాయి. హఠాత్తుగా వెజిటేరియన్ అయిపోతుంది. అతనికి ఈ మార్పు సహించదు. కారణాలడగడు. ఆమె సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా అని ఆలొచించడు. ఆమె భయాలు అతనికి అనవసరం. పూట పూటకీ, తనకు అన్నీ అమర్చిపెట్టే, విధేయురాలు ఎక్కడ అని అతనికి సందేహం. ఆవిడ ఓ మనిషనేది అతనికి పట్టదు. ఆమె తండ్రి చిన్నపుడు ఆమెని ఎలా చూసాడో, భర్త కూడా అదే నిరాసక్తి తో, నిర్లక్షంగా చూడడం - అదీ తన దృష్టి కోణంలో తనదేమాత్రం తప్పులేదనే విధంగా చెప్తూండడం - ఇదంతా సహజమే కదా అనిపించేలా ఉంటాయి.
దానితో ఇద్దరి మధ్యా ఘర్షణ మొదలవుతుంది. ఆమెకు చెట్లలా బ్రతకాలనుంటుంది. నాన్ వెజ్ తినడం వల్ల పీడ కలలు రావనుకుంటుంది. కానీ ఆమె ఎంత దూరంగా పారిపోయినా, పీడకలలు వెన్నాడడం ఆగవు. ఆమె కొరియన్లు సాధారణంగా తినే భోజనం మానేస్తుంది. ఈమె మాంసాహారం ముట్టకపోవడం వాళ్ళందరినీ కుదిపేస్తుంది. భర్త, అత్త మామలకు కంప్లైంట్ చేస్తాడు. అతనికి సమాజంలో అదో పెద్ద అవమానం. తండ్రీ, తల్లీ బలవంత పెడతారు. ఆమె తిరగపడుతుంది. సెల్ఫ్ హార్మ్ చేసుకునే దాకా వెళ్తుంది. నిజంగా ఎటువంటి అనారోగ్యం ఉన్న స్త్రీ పరిస్థితి అయినా, సరైన కుటుంబ ఆదరణ లేకపోతే ఎలా దిగజారుతుందో అనిపిస్తుంది.
ఆ తరవాత చాప్టర్లలో 'బులీమియా' దాకా వెళ్తుంది. తిండిని పూర్తిగా వదిలేసి, చావు అంచుల్లో యాంగ్ హీ వెళ్ళేసరికీ, ఆమె అక్కయ్యకు కూడా తమ సమాజం మీదా, వాళ్ళకి ఆడ పిల్లల మీదా, స్త్రీల మీదా ఉన్న చులకన భావమూ, మాట విని తీరాలనుకునే తత్వమూ, తమ vulnerabilities ని advantage గా తీసుకునే వాళ్ళ మీద కోపం, విరక్తీ కలుగుతాయి. తన 'ఫార్మాట్ ప్రకారం, రూల్స్ ప్రకారం జీవించే' జీవితం మీద విసుగు పుడుతుంది. అక్క చెల్లెళ్ళిద్దరూ జీవితం లో అలా కొట్టుకెళిపోతారు. మధ్య వచ్చే అధ్యాయాలలో వాక్యాల అందం, మనుషుల భావాల, ప్రవర్తనల విచిత్రం - జీవితం తీసుకునే మలుపులు, మనుషుల నిర్ణయాల ప్రభావాలూ నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
కొరియన్ సంస్కృతి, ఆ ఆహారపు అలవాట్లూ మనకన్నా వేరే పద్ధతిలో ఉన్నా, వారిదీ, మనదీ, ఆ మాటకొస్తే, పురుషాధిక్యత ఉన్న అన్ని సమాజాలలో, స్త్రీ స్థానం, లైంగికత, మానసిక సంఘ్ర్షణ, అనారోగ్యాలు వెనకడుగే వేసుంటాయి. ఎవరైన తమ జీవితం మీద గ్రిప్ ని సంపాదించారూ అనుకోవడం మిథ్య. సమాజపు చట్రాల కింద పడి, మానసికంగా నలిగిపోయే ఆడ బిడ్డల కథ ఇది. మతం, సాంప్రదాయాలు తొక్కిపెట్టేసే మనుషులం మనం అందరమూనూ. ఈ పుస్తకం చదివాకా, స్నేహితులతో దీన్ని గురించి చర్చిస్తాం. ఇలా ఎందుకు - అలా ఎందుకు అని విశ్లేషణలు చేస్తాం. జాలి పడతాం, తిట్టుకుంటాం. ఇల చదివి, అలా వదిలేసే సబ్జక్ట్ కాదు. చాలా రోజులు వెన్నాడుతుంది.
ఆపకుండా చదివించగలగడం, పాత్రల పట్ల సానుభూతి కలిగించగలగడం, ఎవరెవరు ఎలాంటి ఎలాంటి సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ప్రయత్నించే పుస్తకం. అందమైన వాక్యాలు, కొన్ని సారులు జుగుప్స కలిగించినా, పాత్రల మానసిక స్థితి ని వ్యక్తపరిచే సన్నివేశాలతో చాలా ఇంటరెస్టింగ్ గా అనిపిస్తుంది. చిన్న పుస్తకమే అయినా, చదివేవారిని షాక్ కి గురి చేస్తుంది. ఏంటిది "పిచ్చి గా" అనిపిస్తుంది. కానీ, మనకి తెలీని ప్రపంచం అది. కానీ అదీ existence లోనే ఉంది. చాలా బావుంది. చాలా సినిమాటిక్ గా. కొత్తగా.
రచయిత్రి హాన్ కాంగ్ కు, ఈ పుస్తకానికి, "మేన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్" వచ్చింది. 2024 లో ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అనువాదకురాలు డెబోరా స్మిత్, ఉత్తర భారత దేశంలోనే స్థిరపడిందని అన్నారు. వరండాలూ, అరణ్యాలూ, కొండ వాలుల్లో చెట్లూ, పూలూ, లతలూ, వర్షాలూ, రోడ్లను అందంగా వర్ణించి. పుస్తకానికో కవితాత్మక సౌందర్యాన్ని తేవడంలో ఆవిడ కృషి తెలుస్తూ ఉంటుంది. మంచి పుస్తకం.
***

No comments:
Post a Comment