Pages

Showing posts with label Cinema. Show all posts
Showing posts with label Cinema. Show all posts

24/07/2021

నాలో నేను - డా.భానుమతీ రామకృష్ణ

 తెలుగు చలనచిత్ర పరిశమ లో / భారతీయ చలన చిత్ర చరిత్రలో డా|| భానుమతీ రామకృష్ణ రచయిత్రిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, దర్శక నిర్మాతగా అలా అన్ని రంగాలలోనూ పేరు పొందిన  బహుముఖ ప్రజ్ఞాశాలిని.    పద్మభూషణ్ డా|| భానుమతీ రామకృష్ణ రాసిన ఈ జీవిత చరిత్ర - 1994 సంవత్సరానికి ఉత్తమ జీవిత చరిత్రగా జాతీయ బహుమతి కూడా పొందింది. 



భానుమతి గారు రాసిన "అత్తగారి కథలు", "భానుమతి కథలు", ప్రచురించబడినా,  సేకరించలేక చరిత్రలో కలిసిపోయిన కొన్ని ముందుకాలపు రచనలు, పాఠకులకు భానుమతి గారి సులువుగా కథ చెప్పగలిగే హాస్యచతురత ను, రచనా కౌశలాన్నీ పరిచయం చేసినా, ఈ "నాలో నేను" - కల్పన లేకుండా - స్వగతంగా తన గురించి ఆమె నిర్మొహమాటంగా, ఖచ్చితంగా, ఎవరైనా ఏమైనా అనుకుంటారన్న భయం లేకుండా చెప్పిన ఆత్మకథ కాబట్టి, ఎక్కడా గొప్పలు పోకుండా, విర్రవీగకుండా ప్రాక్టికల్ గా, నిజాయితీ తో రాయడం వల్ల - మరింత ఆకట్టుకుంటుంది.  . 


ముదుమాట లో డీవీ నరసరాజు గారు చెప్పినట్టు ఈ స్వగతాన్ని, జీవిత యదార్ధ గాధ ని సినిమాగా తియ్యాలనుకుని, స్క్రిప్ట్ కూడా దాదాపుగా రాసుకుని, కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నారు భానుమతి. నాకు మాత్రం ఇది పుస్తకం గానే ఎంతో బావున్నట్టు అనిపించింది. జీవితంలో అతి ముఖ్యమైనది భానుమతి గారి దృష్టి లో సంతృప్తి ! "నేనింక ఏదీ సాధించేందుకు మిగలలేదు, జీవితంలో అన్నీ సాధించాను "  - అనే సంతృప్తి ఆమెకు కలగడానికి కారణం తన భర్త, ఇంకా శృంగేరి జగద్గురువు ఆశీర్వాదాలు అని చెప్తూ, ఎంతో చక్కగా డాక్యుమెంట్ చేసిన ఈ మహనీయురాలి జీవిత చరిత్ర, నిరంతర ఆలోచనల ప్రవాహం  ఈ "నాలో నేను". 


ఒకోసారి మనం అవసరమైనవెన్నో మర్చిపోతుంటాము కానీ  కొన్ని పనికిమాలిన జ్ఞాపకాలు కూడా మనసులో ఎంత పాతుకుంటాయో, వాటిని పెద్దయ్యాక కూడా ఎందుకు మర్చిపోలేమో వివరించలేము.   ఈ కథ లో భానుమతి వీధి బడి, రంగయ్య పంతులు, బెత్తం వంటి అనుభవాల నుండీ, తన ఆహార్యం, మేచింగ్ పట్టు పావడాలు, తల్లో పువ్వులు వగైరాల తో పాటు ఆరోజుల ఫాషన్ గురించి, తన బొద్దు తనాన్ని గురించి హాస్యంగా చెప్పినా,  తెలివితేటల పరంగా,   ఆ పసి వయసులోనే తన బుద్ధి కి అర్ధం అయేటన్ని మానవ స్వభావాల గురించి, అమాయకత్వపు రోజుల్లోనే ఆమె కు ఎంత అవగాహనో చదివితే భలే ఆశ్చర్యం వేస్తుంది. బడిలో పిల్లల పట్ల పంతుళ్ళ బిహేవియర్,  శిక్షలు - లౌక్యాలు ఎంత జ్ఞాపకంగా హాస్యంగా చెప్పారో!  


ఎపుడో చిన్నప్పుడు స్పాండిలైటిస్ లాంటి వెన్నుపూస సమస్యతో ఆ రోజుల్లో వైద్య సదుపాయాలు లేకనో, బీదరికం వల్లనో ఎప్పుడూ తల పైకెత్తి, ఆకాశం వైపు చూసి నడుస్తూ  కాళ్ళకు ఎదుర్రాయి దెబ్బలతో బాధపడుతూండే ఓ ముసలాయన జ్ఞాపకం , తనకు పెద్దయ్యి వెన్ను సమస్య వచ్చాక తనకు అర్ధం కావడం, "అబ్సర్వేషన్"  అను తన జబ్బు గురించి -  వివరిస్తూ,  చిన్నతనాన పొరుగున ఉండిన  పంజాబీ తాత ఒకరు చిన్నప్పుడెప్పుడో ఇచ్చిన ఉల్లిపాయల కూర తనకు ఎంతగానో నచ్చడం గురించి కూడా మురిపెంగా గుర్తుచేసుకోవడం, తినాలనిపించినప్పుడు స్వయంగా వంటింటి లోపలికెళ్ళి ఆ కూర చేసుకోవడం - తన ప్లెయిన్ హార్టెడ్ నెస్ ని, తన బాల్యాన్నీ, తన లోపలి బాలిక నీ,  వొదులుకోని స్త్రీ గా ఎంత బాగా చెప్పారో. నాకూ వ్యక్తిగతంగా ఉల్లిపాయ, మీగడతో చేసే ఈ కూర చాలా చాలా ఇష్టం. అందుకే ఎక్కువ కనెక్ట్ అయిపోయినట్టున్నాను.   😆


అలా చిన్నప్పట్నించీ ఎన్ని జ్ఞాపకాలో, తన కజిన్లు, వారి  వెధవ వేషాలు - చేసిన తప్పుడు పనులు, చుట్టు పక్కల ఇరుగు పొరుగుల గురించి, వారి దగ్గర తాను నేర్చుకున్న ఎన్నో మంచి  విషయాల గురించి, వారి వారి బలం, బలహీనతల గురించి,  రకరకాల మనుషుల గురించి, వారు తన పట్ల చూపిన ఆదరం, అనాదరాన్ని గురించి చెప్తున్నప్పుడు, పసి మనసుల అద్దంలాంటి నిర్మలత్వం లో మనం వదిలే ఇంప్రెషన్ ల ప్రభావం మనకు అర్ధం అవుతుంది.   తనలో చిన్నప్పటి సంస్కృతాధ్యయనం వల్ల ఒరవడిన ఆధ్యాత్మిక భావనల గురించి పొల్లు పోని క్లుప్త ప్రస్తావనలు - ప్రవాహంలా ఆయా ఈవెంట్లను అల్లుకుంటూ రావడం భానుమతి గారి ప్రత్యేకత.  

సినిమా రంగ ప్రవేశం, తండ్రి నేర్పిన సంగీతం, బాల్యంలోనే పాటల ద్వారా తనకు సరస్వతి కటాక్షం వల్ల అందరి లోనూ వచ్చిన మంచి పేరు - సాంప్రదాయ వాద పెంపకం వల్ల తండ్రి చాటు బిడ్డగా, క్రమశిక్షణ తో, హార్డ్ వర్క్ తో అప్పటికే స్టార్ గా ఉన్న ఆమె రామ కృష్ణ గారితో ప్రేమలో పడడం - ఆమె పెళ్ళి, పెళ్ళి తరవాత విడిచిన సినిమా రంగం, తాను కోరుకున్న కుటుంబ మధ్యతరగతి జీవితానికి వారు ఇష్టంగా అలవాటు పడినా, విధి లిఖితం వల్ల, పలువురు శ్రేయోభిలాషుల బలవంతం వల్ల, తండ్రికి ఎంతగానో ఇష్టమైన తన గాత్రం - నలుగురూ వినాలని ఆయనకు బలమైన కోరిక ఉండడం వల్ల, కొడుకు భవిష్యత్తు కోసం తల్లిగా ఆమె తపన పొందడం వల్ల, ఎందరో మేలు కోరే కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో సినీ రంగంలోకి పునఃప్రవేశం చేసాకా చాలా మంచి మంచి సినిమాలో నటించి, ప్రొడ్యూస్ చేసి, దర్శకత్వం చేసి, తన గానంతో ఎన్నో శాస్త్రీయ సంగీతం దగ్గర్నించీ, పాశ్చాత్య సంగీతం దాకా ఎన్నో శైలులలో పాటలు పాడి, అలరించి, వివిధ రాష్ట్ర ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు గ్రహించి, ప్రభుత్వం దగ్గర ఎన్నో బిరుదులు, గౌరవ ఎవార్డులు, రివార్డులు పొందిన గొప్ప మహిళ భానుమతి గారు. 

ముందస్తు హెచ్చరిక ఏమిటంటే : ఇది గొప్ప ప్రేమ కథ. దాదాపు పుస్తకం నిండా రామకృష్ణ భానుమతి, వారి ప్రేమ, పెళ్ళి, ప్రయాణం, వారి స్ట్రగుల్, విజయాలు. ఇదంతా చదవడానికి ఎంత బావుందో. ఒక స్త్రీ గా రొమాన్స్ ని ఎంత గొప్పగా వర్ణిస్తారో. తండ్రిని వొదల్లేక, ఒప్పించలేక, ఎదురు చెప్పలేక, రామకృష్ణ గారిని వొదులుకోలేక, చెల్లి సహకారంతో - స్నేహితుల తోడ్పాటుతో, నాటకీయంగా పెళ్ళి చేసుకోవాల్సి రావడాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించి, మన గుండె ఆగేంత ఉత్కంఠ ని చాప్టర్ల వెంట పరిగెట్టిస్తారు. పుస్తకం ఆఖరున వారి వియోగం కూడా కంటతడి పెట్టిస్తుంది.  ఇదంతా వారిద్దరి ప్రయాణం. అంతగా జీవితాలు పెనవేసుకుపోయిన ప్రేమికులు - అందునా కెరీర్ మనుషులు, కళాకారులు, సృజన రంగంలో తలలు పండినవారు  - ఈరోజుల్లో దొరుకుతారా? 

ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి - అందరితో మంచివాడు అని పేరు తెచ్చుకున్న ఆ చిన్న, బీద టెక్నీషియన్ని ప్రేమించడం - ఆయన కూడా ప్రతిభాశాలి కావడాన వారి ప్రయాణం సాఫీగా జరగడం, అత్తగారి, పెద్దత్త గారి ప్రోత్సాహం - ఈ స్టార్ నటీమణి, మధ్యతరగతి సాంప్రదాయ కోడలు లాగా వ్రతాలు, నోములూ, పూజలు, వంటలు చేసుకోవడం, ఆత్మీయంగా, అందరితోనూ కలిసి మెలిసి ఉండడమూ,  తన కోసం స్క్రిప్ట్ లు రాయబడిన / మార్చబడిన, అందరి చేత గౌరవించబడిన తార - చిన్న చిన్న నటీనటులని కూడా గుర్తు పెట్టుకుని వారు తనకి అదెప్పుడో చేనిన  చిన్న సాయాల గురించి / మేలు గురించి తన ఆత్మ కథ లో  కూడా గుర్తు చేసుకోవడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.  ఇదీ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒద్దిక అనిపిస్తుంది. 

మిస్సమ్మ లో తాను మిస్ అయిన చాన్స్ సావిత్రి లాంటి మహానటిని చిత్ర పరిశ్రమ కు అందివ్వడం, తన జీవితం లో ఇష్టం లేకుండా చేసిన అమెరికా ప్రయాణం, కొడుకు జీవితం - ఇవన్నీ భగవంతుని ఆజ్ఞ ప్రకారం జరిగినవే నని, తాను ఇలా జీవితం లో కళాకారిణిగా పైకెదగడం, పేరు తెచ్చుకోవడం కూడా కర్మ వశాత్తూ జరిగిందే ననీ, తన గొప్పదనం కన్నా ఇదంతా డెస్టినీ అని నమ్ముతారు. అలా అని ఆమె భావ వ్యక్తీకరణ లో నిర్లిప్తతా, అయిష్టం ఏమీ లేవు. ఎన్ని డీటైల్స్, ఎన్ని జ్ఞాపకాలు - ఎన్ని అవమానాలు, మధుర ఊహలు, అనుభూతులు, కష్టాలు, దుఃఖాలు - వీటిని ఎంత చక్కగా జీవితపు ప్రతి క్షణాన్నీ ఉన్నది ఉన్నట్టుగా, స్వీకరిస్తూ,  ఒప్పుకుంటూ, ఆనందిస్తూ జీవించడాన్నే ఆమె నమ్ముకున్నారు. 

తాను పని చేసిన సినిమాల గురించి - రాసిన కథల గురించి మాత్రమే కాక, చూసిన వివిధ భాషల అజరామరమైన సినిమాలు, వాటి మెరిట్, సినిమా పరిశ్రమ లో పెరిగిన కమర్షియలిసం, మారిన విలువలు, సామాజికంగా రాజకీయంగా, సినిమాల లో తన కు కలిగిన అనుభవాలు, భర్త వియోగం తరవాత కొన్ని మంచి సినిమాలలో చిన్న చిన్న పాత్రలే వేసినా, అవి మహిళల వ్యక్తిత్వానికి పాసిటివ్ రిప్రసెంటేషన్ ను ప్రతిబింబించేలా  ఉంటేనే, తాను అవి చెయ్యడాన్ని గురించి సమగ్ర వివరణ ఇచ్చారు. 

ఎంత రొమాంటిక్ స్త్రీ /  మాట జవదాటని  కూతురు /  కుమారుడిని  అమితంగా ప్రేమించే   తల్లి /  పద్ధతైన  కోడలు అయినా - ముందు  ఆమె మంచి ప్రొఫెషనల్. అదీ ఎంతో ప్రతిభా, నిబద్ధతా ఉన్న కష్టపడే మనిషి. కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ చాలా ప్రొఫెషనల్ గా, నైపుణ్యంతో నిండి ఉంటుంది. దీన్ని చదవడం చాలా మంచి అనుభవం. నా షెల్ఫ్ లో ఎన్నో ఏళ్ళుగా ఉండినా ఈ మధ్యనే చదవడానికి కుదిరింది. ఎంత బావుందో  ఈ పుస్తకం... ఇన్నాళ్ళూ ఎందుకు చదవలేదా అనుకున్నాను.  ఇదీ దైవ నిర్ణయం ఏమో.  ఇప్పుడు ఈ వయసులో ఈ పుస్తకం ఒక కొత్త డైమెన్షన్ లో కనిపించింది.  ఓ పదేళ్ళ క్రితం చదివి ఉంటే, ఏదో గడ గడా చదివేసేదాన్నేమో గానీ ఈ వయసులోనే ఎక్కువ అర్ధం అయింది, ఆ విలువలు, నిజాయితీ, భయం లేకపోవడం, అవేవీ పొగరుగా/అతిగా  అనిపించకుండా, ఆత్మ విశ్వాసంగా / తనను తాను గౌరవించుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న  ఓ మహిళ జీవిత కథగా   అర్ధం అయి, బాగా నచ్చింది.


*** 

 





16/09/2017

పథేర్ పాంచాలీ - బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్

పథేర్ పాంచాలీ - బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ (1894-1950)
అనువాదం : మద్దిపట్ట్ల సూరి (1920-1995)



కొన్ని పుస్తకాలకి గొప్ప చరిత్ర వుంటుంది. ఎప్పుడో చిన్నప్పటి పథేర్ పాంచాలి. సత్యజిత్ రేయ్ సినిమా గానే తెలుసు. టీవీలో ఎప్పుడో చూసిన చిన్న బిట్  - వానల్లో బురదల్లో పల్లెలో పడుతూ లేస్తూ నడుస్తూ వస్తున్న పెద్ద మనిషిని ఇద్దరు చిన్న పిల్లలు నవ్వుతూ గమనిస్తున్న దృశ్యమే మనసులో ముద్రించుకుపోయింది. అత్భుతమైన సినిమా అనీ, సత్యజిత్ రే దానికి ప్రాణం పోసాడనీ వినడమే. ఎప్పుడూ దాని పూర్తి పాఠం చదవలేదు.  ఇన్నాళ్ళకిన్నాళ్ళకి ఈ "అజరామర పథగీతం"  ఇంత చక్కని తెలుగులో దొరికితే చదవకుండా వొదులుకోగలగడమే ?!  దీన్ని తెలుగులో అత్భుతంగా, రస రమ్యంగా అనువదించినది శ్రీ మద్దిపట్ల సూరి.   బెంగాలీ నవలల పట్ల తెలుగు వాళ్ళకున్న క్రేజ్ తెలిసినదే. శ్రీ సూరి మంచి మంచి బెంగాలీ క్లాసిక్ లను తెలుగు లో కి అనువదించారు. ఈ అనువాదాన్ని ఈయన కాకుండా ఎవరన్నా చేసి వుంటే ఆ పుస్తకం ఇంత బావుండేదా అని  అనిపించింది. కాబట్టి  అనువాదకునికి నమస్కరించి, ఇది మొదలు పెట్టాలి న్యాయంగా.

చాలా రోజులకి గుండెల్లో ఇంకిపోయిన చెమ్మని బయటకు తీసుకొచ్చిన ఇద్దరు చిన్న పిల్లల కథ ఇది.  పథేర్ అంటే పథం. మార్గం. పాంచాలీలనేవి తరతరాలుగా సంప్రదాయ కథాగానానికి ఉపయోగిస్తుండే బెంగాలీ గీతాలు. అందుకే సత్యజిత్ రే తన చిత్రానికి 'సాంగ్ ఆఫ్ ద లిటిల్ రోడ్' అనే ఉప శీర్షిక జోడించారు.  దుర్గ, అపూర్ లు అక్కా తమ్ముళ్ళు. నిశ్ఛింది పురంలో హరిహర రాయ్ గారి పిల్లలు. హరి రాయ్ భార్య సర్వ జయ.  హరి హరుడికి వరుసకు అక్కగారైన ఇందిరమ్మ అనే వృద్ధురాలు వీళ్ళతోనే ఆ ఇంట్లోనే ఉంటూండేది.  ఆవిణ్ణి, సర్వ జయ నూ బీదరికం నిర్దాక్షిణ్యంగా విడదీసేస్తుంది. ఈ మౌసీమా ని ఎంతగానో ప్రేమించిన చిన్నారి దుర్గ తల్లికీ, ఇందిరమ్మ కూ  మధ్య నలిగిపోతూ.. వాళ్ళ అస్థిత్వ పోరాటం లో - ఇందిరమ్మ ఇల్లు విడిచి పోవడమూ, తిండికి మొహం వాచి, ఎండ దెబ్బ కి మరణించడమూ చూసి ఎక్కువ దెబ్బ తిన్న పిల్ల.  అత్యంత బీదరికంలో బ్రతుకు వెళ్ళదీస్తున్న సర్వ జయకూ పిల్లలల తో పాటూ ఆ ముసలావిణ్ణి సాకడం కష్టమైపోతుంది.  ఇందిరమ్మ జీవితాన్నీ మరణాన్నీ చదివే సరికే పాఠకుడు ఎప్పుడు ఈ బ్రతుకుల్లో వెలుతురొస్తుందా అని నిస్పృహ లో కూరుకుపోతాడు. 

హరి హరుడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణీకం తప్ప ఇతర పనులెరుగని పండితుడు. అతని కొడుకు అపూర్ !  అపూ అక్క దుర్గ వెంటే ఎప్పుడూ. తండ్రి పౌరోహిత్యపు పనుల వేటలో, ప్రవచనాల పనుల వేటలో నెలల తరబడి ఇల్లు విడిచి వెళ్ళినప్పుడు తల్లికి మిగిల్న తోడు వీళ్ళిద్దరే. వీళ్ళు ఊరు నాలుగు చెరగులా తిరుగుతూ, వంటకి ఫలమో, పుష్పమో, కట్టెలో, ఎక్కడో పడిపోయిన  కొబ్బరి కాయలో, ఏ చెరువులోనో దొరికిన చేపల్నో ఇంటికి పట్టుకొస్తూంటారు.  ఈ పిల్లల కళ్ళ నిండా లేమే.  అపూ కి తల్లి ఉడకేసే ఆ నీళ్ళ లాంటి అన్నమూ పరమాన్నమే. దుర్గ కాస్త పెద్దది.  ఇల్లు గడవడం కోసం పక్క వాకిళ్ళలో దొంగతనానికీ వెరవదు.  సర్వ జయ కి ఈ పిల్లల భవిష్యత్తు గురించి విపరీతమైన బెంగ. తిండికే గడవని తాము దుర్గ పెళ్ళెలా చెయ్యడమా.. అపూర్ ని ఎలా చదివించడమా అని బెంగ.

ఇన్ని బాధల్లో పదకొండూ పన్నెండేళ్ళ పిల్ల  దుర్గ ని ఇష్టపడిన ఒక డబ్బున్న యువకుడు సర్వజయలో ఎంతో ఆశ కలిగిస్తాడు.  దుర్గ కూడా తనకి పెళ్ళయితే, ఇంట్లో బాధలు కాస్తన్నా తీరుతాయి కదా అని ఆశిస్తుంది. కానీ కుటుంబ తగాదాల్లో, ఆ సంబంధం తప్పి, వెలుగు రాబోతున్న జీవితాలు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు మూలపడతాయి.  ఆ రోజుల్లో బెంగాల్ పల్లెల్లో, ఎందరో ప్రజలు మలేరియా తో చనిపోతారు. దుర్గ కూడా వొళ్ళెరగని జ్వరంలో - రోజుల తరబడి ముసురు పట్టిన రోజుల్లో, తన మీద చూరు నుండీ ధారగా నీరు కారుతున్నా కదల లేనంత జ్వరంతో ప్రాణాలు విడుస్తుంది.   దుర్గ పోయిన విషయం తెలీని తండ్రి  కొన్నాళ్ళ తరవాత, పట్నం నుంచీ తీసుకొచ్చిన బహుమానం కళ్ళలో నీళ్ళు తెప్పిస్తుంది. 

చిన్న పిల్ల దుర్గ లేకుండా అక్కడ ఉండడం కష్టమయ్యి  కాశీ లో ఏదో ఒక పని దొరకకపోదని కాశీకి వలస వెళ్తుంది కుటుంబం.  అక్కడకి వెళ్ళేందుకు జీవితం లో మొదటిసారి రైలెక్కిన అపూర్, దుర్గ రైలెక్కలేదని, దుర్గ ని ఆ ఊర్లో వొదిలేసి పోతున్నామనీ బావురుమనడం  చదివి, ఎంతో బాధ కలిగిస్తుంది. కాశీకి వెళ్ళినా వాళ్ళ పరిస్థితి ఏమాత్రం మెరుగు పడకపోగా హరి మరణం, సర్వజయ బ్రతుకు గడవడం కోసం  ఒక జమీందారింట్లో  వంటలక్క గా చేరడం, అపూర్ అక్కడ వాతావరణంలో ఇమడలేక, తీవ్ర అవమానానికి గురయి,  మళ్ళీ నిశ్చిందిపురానికి వెళ్ళిపోవాలని ఇద్దరూ నిర్ణయించుకోవడం... ఇదే ఈ పథం.


ఈ కధ లో అత్యంత నిరాశా పూర్వక జీవితం లో కూడా ఎక్కడో ఏదో మంచి జరగకపోదా అన్న ఆశ ఎలా మనుషుల్ని నడిపిస్తుందో చూస్తాం.  నిశ్చిందిపురం ఆ పిల్లల దృష్టిలో స్వర్గం.  అందమైన తోట. ఆ అందాన్ని వొదులుకుని పట్నాల్లో ఇరుకు ఇళ్ళలో ఎలా గడిపారో అపూ వాళ్ళు అనిపించేంత సౌందర్యం.   హరి హరుడి కూలడానికి సిద్ధంగా ఉన్న ఇంటి చుట్టు పక్కల  ఎలా వుంటుందంటే : :

వాళ్ళ ఇంటి కిటికీ కి కొంచెం అవతలగా చుట్టూ ముదురుగోడ. ఆ గోడని ఆనుకుని అవతల అంతా ఒకటే అడవి.  ఆ కిటికీ దగ్గర కూర్చుంటే చాలు - నీలి సముద్రపు అలల్లాగా భాండీర, శాఖోటక వృక్షాల చివళ్ళు ఆ చెట్లనీ ఈ చెట్లనీ వ్రేళ్ళాడే రక రకాల తీగలు, ఏళ్ళ తరబడి ఉన్న వెదురు చెట్లు, వయో భారం వల్లా ప్రక్కనున్న కర్ణికార, 'వన చాల్ తా' చెట్ల మీదికి ఒరిగిపోతూ ఉండటం, వాటికింద వెలుతురు తక్కువగా ఉండే చోట కాటుక పిట్టలు గంతులు వేస్తూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది. 

వాళ్ళ ఇంటి పక్కన ఆ అడవి ఇటు నీలిమైదానం వరకూ, అటు ఏటి గట్టునకు వ్యాపించి ఉంటుంది.  అపూ వాళ్ళకది ఎంత తిరిగినా తిరగనట్లే వుంటుంది.  అపూ అక్కతో కలిసి, ఆ అడవిలో చాలా దూరం తిరిగాడు.  కానీ ఆ అడవి ఎక్కడ ఆఖరయిందో తెలియలేదు వాడికి  - ఈ అడవి, దాని శ్యామలత్వం లోని నూతన స్పర్శ వాడి మనస్సుని, వాళ్ళ అక్క మనస్సునూ పులకరింపజేస్తుంటాయి. పుట్టినప్పట్నించీ సుపరిచితమైందీ అడవి వాళ్ళకి.

క్షణక్షణమూ ఏదో తెలియని ఆనందంతో వాళ్ళ పిపాసు హృదయాల్ని అపూర్వ విచిత్రరసానుభూతితో నింపివేస్తూ ఉంటుంది.  వర్షానికి నిగనిగలాడుతూ పచ్చగా వున్న చెట్ల పొదల మీదికి కరంజ పుష్పాల పసుపుపచ్చని చివుళ్ళు,  అస్తమయపు నీడలో పెద్ద అడవి ఉమ్మెత్త కొమ్మ మీద మెల్లిగా అటూ ఇటూ ఉడుత ఒకటి తిరుగుతుండడం, కావలసినన్ని ఫలపుష్పాలు, అన్నిటికంటె దట్టంగా అడవికి దగ్గరగా వున్న పొదలమీది కొమ్మ కొమ్మనీ ఏవో తెలియని పిట్టలు వ్రాలి ఉండడం  -  అలాంటప్పుడు వాడి మనసుకు కలిగే అపూర్వ గంభీరానందాన్ని ఎవరికీ వర్ణించి చెప్పలేడు వాడు! అదేదో స్వప్నం, ఇంద్రజాలం.  నాలుగువైపులా పక్షులు మధురంగా రోదన చేస్తూ ఉంటాయి, జల జల పూర్లు రాలుతూంటాయి. సంజె నీడలు మరింత దట్టంగా అలముకుంటూ వుంటాయి.  

దుర్గ పోయాక ఆ ఇంట్లో, ఆ ఊర్లోనూ ఉండలేక  వెళ్ళిపోతున్నప్పుడు అపూ హృదయాక్రోశం.. నిశ్చిందిపురానికి ఎంతో దూరాన ఉన్న రైల్వే స్టేషన్ లో రైలు స్టేషన్ ని దాటేస్తున్నప్పుడు చాలా రోజుల క్రితం తానూ అక్క దుర్గా కలిసి తప్పిపోయిన ఆవుదూడ ను వెతుక్కుంటూ, రైలు చూడ్డానికి వచ్చిన రోజు గుర్తొస్తుంది అపూర్ కి.  ఊరి చివర పెద్ద జామచెట్టు క్రింద తనూ, అక్కా ఇంత ముఖంచేసుకుని తమ రైలుబండినే చూస్తున్నట్టు అనిపిస్తుంది.

అక్కను ఎవరూ వెళ్ళి తీసుకుని రాలేదు. అందరూ విడిచిపెట్టేసారు.  అక్క చచ్చిపోయినా, తామిద్దరూ కలిసి ఆడుకునే వెదురుతోపులో, మామిడిచెట్ల నీడలో, నిశ్చిందిపురంలోని కూలిపోయేట్లున్న కొంపలో - అక్క స్నేహ స్పర్శ తనకెప్పుడూ సోకుతూనే ఉండేది. కానీ ఇవళే అక్కతో శాశ్వతంగా తెగతెంపులయిపోతున్నాయి నిజానికి ! 

అక్కను ఇహ ఎవరూ ప్రేమించడంలేదు. అమ్మా లేదు, ఎవరూ లేరు, అక్కను విడిచిపెట్టి వస్తున్నందుకు ఎవ్వరికీ విచారమే కలగలేదు.

తర్వాత జీవితంలో వినీలకుంతల సాగర మేఖల అయిన పృధివితో వాడికి, ఘనిష్ట పరిచయం ఏర్పడింది.  కానీ వాడికి శరీరం ఝల్లుమన్నప్పుడు, సముద్రయానంలో ఓడ డెక్ మీద నుంచి వినీలాకాశపు నూతన రూపం కంటపడుతున్నప్పుడు, ద్రాక్షాకుంజవేష్టితమైన ఏ నీలపర్వత సానువో - సముద్రంలో విలీనమౌతున్నట్లుండీ దిగంత ప్రాంతం నుండి   సుదూరంగా పోయి పోయి లీలగా కంపిస్తున్నప్పుడు, దూరం నంచీ భాసాభాసంగా కనిపించే చెలియలికట్ట - ప్రతిభాశాలియైన స్వరకర్త సృజించిన   మధుర స్వరంలాగా మధురాలాపనను వినిపింపజేస్తున్నప్పుడు - అలాంటి సమయాల్లో యెప్పుడూ వానకురుస్తున్న ఒక రాత్రివేళ ఓ పాత చీకటి కొంప లో రోగంతో మంచంలో పడిన ఓ పల్లెటూరి పేదపిల్ల 'అపూ! నయమయి లేచాక నాకొక రోజున ఎప్పుడైనా రైలు చూపిస్తావా ?' అని అడగడం వాడి మనసు లో ప్రతిధ్వనిస్తూనే వుంటుంది.

అన్నిటా ఓడాక సర్వజయ తో నిశ్చిందిపురానికి తిరిగి వెళ్ళిపోయేలా మాటాడాక అపూ "భగవాన్  నువ్వు మమ్మల్ని నిశ్చిందిపురానికి వెళ్ళేట్ట్లు చెయ్యి. లేకపోతే  బ్రతకలేను. నీ పాదాలు పట్టుకుంటాను" అని గుజగుజలాడాక,


పథ దేవత ప్రసన్నంగా నవ్వి ఓయి వెర్రివాడా, మీ ఊరిలోని వెదురుతోపుతో కాని, బందిపోటయిన వీరురాయ్ వటవృక్షం దగ్గరగాని, 'ధల్ చిత్' కాల్వరేవు దగ్గర గానీ నా పథం అంతమయిపోదు.  మీ 'సోనాడాంగా' మైదానాన్ని, ఇచ్చామతి నదిని దాటి, పద్మాలతో నిండివుండే మధుఖాలి తటాకం పక్కనుంచి పోయి, వేత్రవతి రేవును దాటి, సూటిగా, కేవలం సూటిగా - దేశాన్ని వదిలి దేశాంతరాల వైపు సూర్యోదయాన్ని విడిచి, సూర్యాస్తమయం వైపు, పరిచితములైన పరిధులన్నీ అధిగమించి, అపరిచితములైన పరిధులవైపు సాగి పోతున్నదీ పథం.


దివారాత్రాల్నీ, జనన మరణాల్నీ, మాసాల్నీ, సంవత్సరాల్నీ, మన్వంతరాల్నీ, మహా యుగాల్నీ దాటిపోతూనే వుంటుంది.  మీ జీవిత స్వప్నాలు కుక్క గొడుగుల్లా గుంపులు గుంపులుగా తలలెత్తుతాయి

నా వంశం అంతటితోనూ ముగియదు, పోతూనే వుంటుంది - పోతూనే వుంటుంది - ముందుకు సాగిపోతూనే వుంటుంది.

నిదా అనిర్వాణ వీణానిక్వాణం అనంతాకాశంలో అనంతకాలం ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. 

ఈ విచిత్ర ఆనందయాత్రా తిలకాన్ని నీ నుదుట ధరింపజేసి, నిన్ను గృహవిముక్తుణ్ణి చేసి తీసుకువచ్చాను.

"పద, ముందుకు పద.." అంది. (అంటుంది. )


అపూర్స్ ట్రైలొజీ  బిభూతి భూషణుడు రాసిన ఈ పథేర్ పాంచాలీ, అపరాజితో ల ని ఆధారంగా తీసిన మూడు సత్యజిత్ రే సినిమాలు.  మొదటిది ఈ "పథేర్ పాంచాలీ".  అపూ జీవన పథం లో ఎందరో పిల్లలు కలుస్తారు.. చుట్తు పక్కల వాళ్ళ పిల్లలు, కజిన్లు, స్నేహితులు,  తమ కంటే బీదవాళ్ళ పిల్లలు,  దుర్గ స్నేహితులు, తన స్నేహితులు,    ఆ పిల్లల ఆనందాలు,  వాళ్ళలో బీద పిల్లల, అనాధ ఆడపిల్ల ల కష్టాలు చదివి గుండె తరుక్కుపోతుంది.  అయినా కష్టాలనుభవిస్తున్న పిల్లలకి అవేవీ పట్టనే పట్టనట్టుంటారు. అంత అమాయకత్వం!

అపూ లో తండ్రి వారసత్వం గా వచ్చిన చదువూ, చదువు పట్ల ఇష్టం, వాడి బాల్యం, కష్టాలు, చిన చిన్న ఆనందాలు, ఇవన్నీ ఇంతే భాషా సౌందర్యంతో చదువుతున్నప్పుడు మనసు కదలకుండా వుండటం చాలా కష్టం.   ముఖ్యంగా   ఈ అనువాదకుడే  "అపరాజితుడి కథ" ని కూడా అనువదించారంట.   ఈ ఒక్క పుస్తకానికే గుండె పట్టేసి, కొన్ని పుస్తకాల్ని ముగించాక కొన్ని రోజుల వరకూ మనసుల్లోంచీ పోని ఓ తృప్తికరమైన భావన  కలిగి, ఓ లాంటి తన్మయత్వంతో మునిగిపోతుంటే, "అపరాజితుడి కథ" ని చదవడానికి మానసికంగా చాలా శక్తి ని సమీకరించుకోవాల్సొచ్చేటట్టుంది. !  ఆ అనుభూతిని పంచుకుంటూంటే ఎంతో ఆనందం. దీన్ని పరిచయం చెయ్యడానికి ఆ అనుభూతే పనికొచ్చింది.  అందుకే పుస్తకంలోని లైన్లు యధాతథంగా కోట్ చేసాను పైన. 


అంత అత్భుతమైన నిశ్చిందిపురం నుంచీ భరించలేని బీదరికం తరిమేసినా, తల్లి ఒడికి చేరే పిల్లల్లా మళ్ళీ సొంత గూటికి ఒక వేళ వాళ్ళు చేరుకుంటే, ఆ   అపూ, సర్వజయల మిగిల్న కథ ని చదవాలన్న కోరికతో - ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఓర్చుకోవడానికి కావలసిన ధైర్యం, మనో నిశ్చయం వీళ్ళని ఎలా నడిపించిదో చదివి, చాలా ఆనందంతో, దుఃఖం తో,  ఈ అత్భుత పుస్తక పరిచయాన్ని ముగించేస్తున్నాను.

* * *

మొదట పుస్తకం. నెట్ లో ప్రచురించబడింది.

15/07/2013

Thanks Maa (Hindi)

ఇది స్లో గా మొదలయ్యి.. సమాజపు కుత్సితాన్ని ఎండగడుతూ, దుర్భాగ్యుల దైనందిన జీవితం లో ఓ రెండ్రోజుల ని అత్భుతం గా అల్లి షాకు ల మీద షాకులిస్తూ – దర్శకుడు పచ్చిగా, నిస్సిగ్గుగా, నిష్పాక్షికంగా, నిష్పూచీగా చూపించే వ్యధా గాధల్ని – ముందు పెడుతుంది.     చెప్పడానికి ఇందులో  ప్రధాన పాత్రలు చిన్న పిల్లలే అయినా, కధ మాత్రం, పెద్ద వాళ్ళది.





కధ ప్రత్యేకంగా చెత్త కుండీల్లో, కుక్కలకూ, పందులకూ ఆహారంగా విడిచిపెట్టేయబడ్డ ముక్కు పచ్చలారని పసి బిడ్డల గురించి.   మన దేశం లో అత్యంత సాధారణం గా జరిగే నేరాల్లో, పసి బిడ్డల్ని చంపడం / అనాధల్లా ఆస్పత్రులలో నూ, అనాధ శరణాలయాల్లోనూ విడిచిపెట్టడం వగైరా అందరికీ తెలిసిందే.  కన్న బిడ్డల్ని రైళ్ళలోనూ,  కుక్కలకు ఆహారంగా చెత్త కుండీల్లోనూ వదిలేయగల  రాక్షసత్వం అత్యంత సాధారణం.  అయితే – ఈ తల్లి కన్న బిడ్డలో అని నిట్టూర్పులు విడవడం, అలా కనబడిన పిల్లల్లో మొగ పిల్ల వాళ్ళని పెంచుకోవడం జరిగినా, ఆడ పిల్లల్ని మళ్ళా లెక్కా డొక్కా లేకుండా  ప్రభుత్వ శాఖల వారు తీస్కెళ్తారులే అని వొదిలెయ్యడం కూడా సాధారణం.
ఇలాంటి ఏ తల్లి కన్న బిడ్డలో, బ్రతికి బట్ట అంటూ కడితే, ఎదిగిన తరవాత వాళ్ళేమవుతారు ? చాలా మంది ఏ రక్షణా లేక, అనారోగ్య కరమైన వాతావరణం లో పెరుగుతూ, ఆడపిల్లలైతే మరీ అన్యాయంగా ట్రాఫికింగ్ కి, మొగ పిల్లలు చిల్లర దొంగతనాలకూ మాదక ద్రవ్యాలకూ అలవాటుపడుతూ, బాల్యాన్నీ, అమాయకత్వాన్నీ కోల్పోయి, ఎవరో చేసిన పాపాలకు తప్పించుకోలేని జీవితాంతపు శిక్షకు గురవుతుంటారు.

అలాంటి తల్లి లేని బిడ్డ 'మునిసిపాలిటీ' కధ ఈ ‘థాంక్స్ మా' !   అయితే దర్శకుడు, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసి వాళ్ళ కష్టాల్ని కళ్ళకు కట్టేస్తున్న కొద్దీ, ప్రేక్షకుల గుండె జారి మనసంతా బేజారవుతు ఉంటుంది.   చాలా మంది ప్రముఖ కళాకారులు,  వాణిజ్య ప్రకటనల్లో తరచూ కనిపించే నటులూ, టీవీ ఆర్టిస్టులూ,  కధనానికి మంచి పటుత్వాన్ని, నమ్మదగేలాంటి నటననీ, ఒక క్లాస్ నీ అందిస్తారు.  ఈ కాస్టింగ్ లో ఏ మాత్రం తేడా వచ్చినా కధ లో సీరియెస్ నెస్స్ చాలా మటుకూ కనుమరుగయి ఉండేది.

రన్వీర్ షౌరీ నుంచీ అలోక్ నాథ్ వరకూ – మర్యాదస్తుల ముసుగులో దుర్మార్గపు పనులు చేసే పీడోఫైల్ లూ,  వ్యభిచారుల పాత్రల్ని పోషించి, సినిమాకెంతో న్యాయం చేస్తారు.  అసలు వాళ్ళ screen time ఒక పది నిముషాలు కూడా వుండదు. కానీ ఆ ముహాలు చాలు. సమాజం భ్రష్టతని చెప్పడానికి.

కధ సంగతి కొస్తే, 'మునిసిపాలిటీ', ఒక అనాధ బాలుడు.   వాడి తల్లి వాణ్ణి ప్రభుత్వాస్పత్రిలో కని వొదిలేసి వెళిపోతుంది.  ఊహ తెలిసిన దగ్గర్నుంచీ, తల్లి ధ్యాసే వాడికి. తనని ఎందుకో వొదిలేసి వెళిపోయినా, తల్లి తనని వెతుక్కుంటూ ఏనాటికైనా వస్తుందని రోజూ ఆ ఆస్పత్రి దగ్గరకెళ్ళి కాసేపు గడిపి వస్తూంటాడు.  వాడి తోటి పిల్లలు, వాళ్ళలో ఒక ఆడ పిల్ల, అందరూ బ్రతకడానికి చిల్లర మల్లర దొంగతనాలు చేస్తుంటారు.. చిన్నపాటి గాంగు లా ఏర్పడి.    ఈ అనాధ పిల్లల పరిసరాలు,  దొంగలూ, నేరస్థులతో నిండి వుంటుంది.


 ఐతే, ఓ సారి ఏదో గొడవ జరిగి, వాళ్ళ గుంపు లో 'మునిసిపాలిటీ'  పోలీసులకి పట్టుబడతాడు.  జువనైల్  కోర్టు లో బాలల హోం లో వుంచాల్సింది గా తీర్పొస్తుంది. అక్కడికెళ్ళిన రోజే,  ఓ పీడో ఫైల్ వార్డర్ (అలోక్ నాధ్) చేతిలో పడతాడు.  ఆ నరకం నుండీ తప్పించుకునేందుకు అదే రోజు రాత్రి హోం నుండీ తప్పించుకు పారిపోతుండగా, అతను చూస్తుండగానే, మెయిన్ గేట్ లొంచీ  టాక్సీ లో ఓ స్త్రీ దిగి, ద్వారం దగ్గర ఓ రెండ్రోజుల పసిగుడ్డుని విడిచిపెట్టి వెళిపోతుంది. ఆ శిశువు దగ్గరకి ఓ వీధి కుక్క వెళ్ళి తాకుతుండగా చూసి, భయపడి, ఆ పాపడిని ఎత్తుకొచ్చేస్తాడు మునిసిపాలిటీ.

అంతే – ఈ బాబు ని ఎత్తుకుని తన అడ్డా కి పారిపోతాడు. అక్కడ మిగిల్న పిల్లల కి అప్పటికే, మునిసిపాలిటీ హోం విడిచి పారిపోయాడని పోలీసులు వాయగొడ్తారు.  అయితే ఈ  పసి బాబు భాద్యత ని స్వీకరించే వయసూ, అనుభవమూ లేని ఆ పిల్లలు మొదట మునిసిపాలిటీ ని పిల్ల వాడ్ని వొదిలించుకోమని ఒత్తిడి చేసినా, అతని ఫీలింగ్స్ ని అర్ధం చేసుకుని తమ తో పాటూ ఉండనిస్తారు. పిల్లాడికి  గేదె నుండీ పిండుకొచ్చిన పాలు (ఎత్తుకొచ్చిన) పట్టి, ప్రాణం నిలబెడతాడు మునిసిపాలిటీ.  ఐతే,అదే సమయానికి నగరం లో ఓ ప్రముఖ వ్యాపారి పిల్ల వాడ్ని ఎవరో పార్కులోంచీ ఎత్తుకెళ్ళారనీ, ఆ పిల్లాడే వీడనీ వాళ్ళ పరిధి లో వాళ్ళకి ఓ సమాచారం అందుతుంది.


మునిసిపాలిటీ నిజానికి తల్లి చే పసి ప్రాయం లో విడిచిపెట్టేయబడ్డ అనాధ. కాబట్టి వాడికి ఈ బాబు తనలా కాకూడదని  పంతం. వాడ్ని ఎలా ఐనా తల్లి దగ్గరకు చేరుస్తానని శపధం చేస్తాడు.   వీళ్ళు  అనుకున్నట్టు ఆ పిల్లవాడు వ్యాపారి తప్పిపోయిన బిడ్డ కాదు. సినిమా మలుపులు, గుండె చిక్క బెట్టలేని ఉత్కంఠా, అథెంటిసిటీ తో సాగిపోతూ పిల్లాడి అసలు తల్లి ని కలిసే దాకా నడుస్తుంది. ఐతే, ఆమె పాపం బిడ్డను ఏ పరిస్థితుల్లో వదిలేసిందీ చూస్తే నిజంగానే ప్రేక్షకుడు డీప్ షాక్ కు గురవుతాడు. సినిమా మన సమాజం లో వున్న అన్ని అవకతవకల్నీ, స్పృశిస్తుంది.  వాట్ని మనం రోజు వారీ వార్తల్లో చదువుతూనే వుంటాం, గానీ అవి మనదాకా వస్తేనో ! అనే అలోచన మనకెప్పటికీ రాదు.
అలాంటి ఆలోచన రావడాన్నే మానవత్వం అంటారు.  ఆ మానవత్వాన్ని ప్రేక్షకుడు అనుభూతించగలిగితే, ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. పాపభీతి, దైవ భీతి, కరుణ, దయ లాంటివేమీ లేని స్వార్ధ పర / ముసుగులేసుకున్న సమాజం లో మనకీ ఓ ముసుగుందేమో, ఆ ముసుగు వెనక ఓ తోడేలో, హైనా నో ఉందేమో తరచి చూసుకోవాల్సిన అవసరం ఎప్పటికీ ఉంది.  

మృగప్రాయులైన మనుషుల మధ్య, దేవత లాంటి ఓ దొంగ, వీధి బాలుడు, అనాధ అయిన ఈ 'మునిసిపాలిటీ',  జీవితం లో ఓ రెండు రోజులు ఈ సినిమా.

నాకు  అర్ధం కానివీ, లాజిక్ కి అందనివీ ఎన్నో ప్రశ్నలు, సందేహాలూ ఉన్నా కూడా, వాట్ని పెద్ద పెద్ద లోపాలు అని చెప్పి సినిమాని తీసిపారేయక్కర్లేదు.  ఆయా కారణాల వల్ల   ఈ చిత్రానికి పెద్దగా పేరు వచ్చినట్టు లేదు. అయినా మంచి ప్రయత్నం.  అందరూ,  ముఖ్యంగా పిల్లలూ చాలా బాగా నటించారు. తారాగణం, చిన్న చిన్న వాళ్ళతో కలిపి ఏడ్ ల స్టార్లూ, టీవీ స్టార్లూ, చిన్న చిన్న పాత్రల్లో సందర్భోచితంగా ఒదిగిపోయి,  కధ కి ప్రాణం పోసారు. ముఖ్యంగా ఆ పసివాడి తల్లి పాత్ర లో నటించిన నటి,  ఇలాంటి సినిమాలు మన దేశం లో కూడా వస్తాయా !  మన వాళ్ళు ఇంత బాగా చేస్తారా ?! అని అబ్బురపోయేలా నటించింది.

దర్శకుడు ఇర్ఫాన్ కమాల్.  రచయిత గా, పాటల రచయిత గా పేరు తెచ్చుకున్నాడు.  ఈ సినిమా చాలోటి ఫిలుము ఫెస్టివళ్ళలో ప్రదర్శించబడిందంట ! బయటి దేశాల వాళ్ళు చూసి తరించడానికి కావల్సినంత దౌర్భాగ్యం సినిమాలో కుక్కి వదిలారనిపించింది. కాకపోతే, దీన్లో సినిమా తప్పేమీ లేదు. మన దేశం లో కూడా పరిస్థితులు అంత ఘోరంగానూ ఉన్నాయి.  తమిళ దర్శకుల అతి ఒరిజినాలిటీ చూసి ఎంత విసుగేస్తుందో అలా అనిపించింది కొన్ని చోట్ల - కానీ ఏమీ చెయ్యలేం. సన్నివేశాలు డిమాండ్ చేసాయి కాబట్టి, సత్యం నగ్నం గా మన ముందు నిలబడుతుంది.  అదో అథెంటిసిటీ ! అదో కళ. 


మన సమాజం లో ఉన్న అనేకానేక రుగ్మతల్లో ఇదో రుగ్మత !  నైతికత గురించి ఎన్నైనా ప్రసంగాలివ్వొచ్చు. కానీ మానవత్వం ఒకరు నేర్పేది కాదు.  ఆ అనుభూతినే మర్చిపోయిన సమాజానికి ఓ చెంప పెట్టు ఈ "థాంక్స్ మా" ! 




22/04/2013

గాంధీ, మై ఫాదర్



గాంధీ గారు - మహాత్ములు. దేశానికి అహింస అనే అజేయమైన ఆయుధాన్ని కనిపెట్టిచ్చిన శాస్త్రవేత్త. 200 సంవత్సరాలు విడదీస్తూ పాలిస్తూ, దేశాన్ని చిధ్రం చేసిన విదేశీ పాలన నుండీ, పేదా గొప్పా, పండిత పామరులనూ, స్త్రీలనూ, పురుషులనూ, వీరూ వారూ అన్న తేడా లేకుండా ప్రభావితం చేసి, స్వాతంత్ర్య పొరాటానికే దిశానిర్దేశం చేసి, జీవితాంతం ప్రజలకు ఆదర్శం గా నిలుస్తూ, మహాత్ముడై, జాతికి పిత యై, ఏకతాటి మీద స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపించి, దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టిన మహనీయుడు.


ఇప్పటికీ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్ళు గడిచిపోయినా  "గాంధీ" నామం కాంగ్రెస్ కు ఆయువు పట్టు.  గాంధీ టోపీ అన్నా హజారేలకూ, అరవింద్ కేజ్రీవాల్ లకూ బ్రాండ్ ఎంబాసిడర్.  గాంధీ ఎవరో ప్రపంచం అంతా ఎరుగుదురు. ఓ నెల్సన్ మండేలా నూ, మార్టిన్ లూథర్ కింగ్ నూ ప్రభావితం చేయగల మహోన్నత వ్యక్తిత్వం గాంధీది. "గాంధీ గిరీ" సినిమాలకే కాదు ఇతరత్రా ప్రజాభిమానానికీ పనికి వచ్చే దివ్య సాధనం. కానీ ఆయన వ్యక్తిగత జీవితం ? అయోమయం. గాంధీ జీవితం  అంతా అతని ఆదర్శ పోరాటానికి రాలిన సమిధ.  గాంధీ కొడుకు హరిలాల్ మోహందాస్ కరం చంద్ గాంధీ కధ ఈ 'గాంధీ మై ఫాదర్ '.

ఈ సినిమా నా ఫేవరెట్ ఆక్టర్ 'అక్షయ్ ఖన్నా  సినీ జీవితం లో కలికి తురాయి అని చెప్పొచ్చు.  అక్షయ్ ఖన్నా గాంధీ ఓడిపోయిన కుమారుడు హరిలాల్ గా అత్భుతంగా నటించాడిందులో.  ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ని నిర్మించింది బాలీవుడ్ హీరో అనిల్ కపూర్. దీన్ని కూడా అనిల్ కపూర్'s బెస్ట్ అని చెప్పొచ్చు.

చలిలో ఆస్థ్మాతో దీనాతి దీనంగా చనిపోతూ ఉన్న ఓ బిచ్చగాడిని ముంబాయి లో ప్రభుత్వాస్పత్రి వాళ్ళు తీస్కెళ్తారు. ఎవరు నువ్వు అని వాళ్ళు అడిగినపుడు నేను 'బాపూ కొడుకుని !' అని చెప్తాడు హరిలాల్. 'బాపూ ' పేరేంటి అంటే "మోహన్ దాస్ కరం చంద్ గాంధీ" ! అని అస్పస్ఠం గ చెప్తూంటాడు.  నిజానికి ఆ బిచ్చగాడు మహాత్మా గాంధీ మొదటి కొడుకు హరిలాల్ మోహన్ దాస్ కరం చంద్ గాంధీ. జీవితం లో అన్నీ కోల్పోయి, అనీ ఓడిపోయిన వ్యక్తి.  జీవితపు చరమాంకలో ఉన్న అతనికి గుర్తు వస్తున్నట్టు గా ఈ మొత్తం సినిమా అంతా, అతని కౌమార దశ నుండీ మృత్యువు దాగా, గాంధీ కధ అంతా తెర ముదు ప్రత్యక్షం అవుతుంది

మోహన్ దాస్ కరం చంద్ గాంధీ - సౌత్ ఆఫ్రికా లో 'టాల్స్టాయ్ ఫార్మ్' రోజుల్నించీ  కధ మొదలవుతుంది.  పెద్దబ్బాయి హరిలాల్ (హరిలాల్, మనిలాల్, రాం దాస్, దేవదాస్ అనే నలుగురు కొడుకులు)  తన అడుగుజాడల్లో నడవాలని తండ్రి గా గాంధీ కోరుకుంటాడు. అదే అతని జీవితం లో చేసిన పెద్ద తప్పు. కొడుకు ఆశయాలకూ, అభిమతానికీ విరుద్ధంగా తనతో పాటూ జాతీయోద్యమం దిశగా కొడుకు నడవాలని, బారిస్టరు గాంధీ కోరుకుంటూంటాడు. హరిలాల్ చదువు మాతృభాషలో సాగాలని, సౌత్ ఆఫ్రికానుండీ, మెట్రిక్ చదివేందుకు రాజ్ కోట్ పంపేస్తాడు.  అక్కడ గులాబ్  అనే అమ్మాయినే హరిలాల్ కాబోయే భార్య గా కూడా నిర్ణయిస్తారు. కానీ హరిలాల్ చదువు ఆయా కారణాల వల్ల చెడుతుంది. సౌత్ ఆఫ్రికా కీ, ఇండియాకీ మధ్య దాదాపూ ఊగిసలాడుతున్న అతని చదువు, విసిగిపోయి, అతను గులాబ్ ను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోవడం, తిరిగి తండ్రి పిలుపు పై గులాబ్ ను వొదిలి, సౌత్ ఆఫ్రికా రావడం జరుగుతుంది.   

హరిలాల్ నిజానికి చిన్నప్పటినించీ తండ్రిలా ఇంగ్లండ్ వెళ్ళి పెద్ద చదువులు చదివి బారిస్టర్ అవ్వాలని కలలు కంటూంటాడు. వీట్ని గురించి తెలిసినా గాంధీ ఒక రకమైన మొండితనంతో హరిలాల్ తన తో పాటూ దేశం కోసం పని చెయ్యాలని కోరుకుంటాడు. ఇది ఎంత తప్పుడు నిర్ణయమో అతనికి తెలియదు.

సౌత్ ఆఫ్రికా లో గాంధీ అపార్థీడ్ (వర్ణ వివక్ష ) కు గురి అవుతూ ఉన్న సమయం. బారిస్టర్ అయి వుండి, ఫస్ట్ క్లాస్ టికట్ ఉన్నా కూడా రైల్ లోంచీ నెట్టివేయబడతాడు. ఫుట్ పాత్ మీద అందరు తెల్ల వారితో సమానంగా నడిచినందుకు 'కూలీ ' అంటూ గద్దింపబడతాడు. అతనితో ఉన్న భారతీయులందరూ, మెల్లగా స్వతంత్ర్య భావనలతో ఉత్తేజితులవుతున్నారు. అపుడే వీళ్ళు ఆయా ప్రాంతాలలోకి వెళ్ళాలంటే వీళ్ళకు పాస్ లు ఉండాలంటూ కొత్త చట్టం తీసుకొస్తారు తెల్ల దొరలు. భారతీయులంతా తమ తమ పాస్ లను తగలబెడతారు. ఆ ఉద్యమం ఊపందుకుంటున్న నేపధ్యంలో హరిలాల్ తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తాడు. జైలుకు వెళ్తాడు.

సహజంగా మొహమాటస్థుడూ, మిత భాషీ అయిన హరిలాల్ కు తండ్రి కన్నా తల్లి దగ్గరే చనువెక్కువ. తండ్రిగా గాంధీ చాలా క్రమశిక్షణ ని పాటిస్తూ, పిల్లల్ని తననుకున్న పద్ధతుల్లోనే పెంచుతూంటాడు.  భార్య కస్తూర్బా కూడా ఎన్నో త్యాగాలు చేస్తూ,భర్త అడుగుజాడల్లో నడుస్తూ, గాంధీ మార్గాన్ని సులభతరం చేసింది.   కాబట్టి తండ్రి దగ్గర చెప్పుకోలేని తన ఆకాంక్షల్ని తల్లితో పంచుకుంటాడు హరిలాల్. ఇద్దరూ ఎంత ప్రయత్నం చేసినా, మోహన్ దాస్ మనసు మార్చలేకపోతారు.  ఈలోగా ఊపందుకున్న పోరాటంలోకి హరిలాల్ కూడా యువకుడు కావడం వల్ల ఉత్సాహంగా దూకుతాడు. కానీ అతనికి తెలుసు - తన లక్ష్యం బారిస్టరు కావడం.

హరిలాల్ భార్యని వొదిలి తండ్రి తననైమైనా బారిస్టరీ చదివిస్తాడేమో అనే ఆశతోనె సౌత్ ఆఫ్రికా వస్తాడు. అక్కడ పుస్తకం లో దాచుకున్నముగ్ధ లా వున్న అతని భార్య ఫోటోని చూసి, గాంధీ సెక్రటరీ, వెంటనే గాంధీ గదిలోకి వెళ్ళి : "మిస్టర్ గాంధీ - ఈ ఫోటో చూడండి ? వీళ్ళిద్దర్నీ విడదీయడానికి మీకు మనసెలా వొప్పింది?" అని అడుగుతుంది చనువుగా. వెంటనే గులాబ్ (భూమికా చావ్లా) ని సౌత్ ఆఫ్రికా పిలిపిస్తారు. కానీ కొన్నాళ్ళ సంసార జీవనం తరవాత, హరిలాల్ జైలుకి వెళ్ళాక, గులాబ్ నీ, పిల్లల్నీ (హరిలాల్ ఆదర్శ జాతీయోద్యమ జీవితానికి అడ్డురాకుండా వుండేందుకని) తిరిగి ఓడ లో ఇండియా కి పంపేస్తాడు మోహందాస్ గాంధీ.

గాంధీ కుమారుడిగా హరిలాల్ కు ఒక సంపన్న గుజరాతీ 'బారిస్టరీ ' చదవడానికిచ్చిన స్కాలర్ షిప్ ను తమకు తెలిసిన 'సొరాబ్జీ' ల అబ్బాయి కి మళ్ళిస్తాడు తండ్రి. ఇలా రెండు సార్లు చేతి దాకా వచ్చిన అవకాశాన్ని తండ్రి తిప్పికొట్టడం చూసిన హరిలాల్ చాలా హతాశుడైపోతాడు.  

ఇవన్నీ (తన నిర్ణయాలకూ, తన ఇస్టాయిస్టాలకూ సంబంధం లేకుండా) అన్నీ తానై తనకి వ్యతిరేకంగా ఉన్నందుకు తండ్రిని అసహ్యించుకునే పరిస్థితికి హరిలాల్ దిగజారుతాడు. ఇక్కడ ఆయా నటుల నటనా, మోహన్ దాస్ గాంధీ గా చేసిన జరీలాల్ నటనా చాల బావుంటాయి.  ఆ ద్వేషం హద్దులు దాటి, తండ్రినీ, అతని ఆదర్శాల్నీ ధిక్కరించి ఇండియా వచ్చేస్తాడు హరిలాల్. అప్పటికీ తండ్రిని ఎదిరించలేక, మారువేషం తో డర్బన్ లో ఓడ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడి ఇల్లు చేరతాడు. ఆ తరవాత తండ్రీ కొడుకుల మధ్య చినుకులా మొదలైన వాగ్వివాదం ముదిరి, తండ్రి ని తనని రాజ్ కోట్ పంపించేయమని బ్రతిమలాడి ఇండియా వచ్చేస్తాడు హరిలాల్.  ఇక్కడ తండ్రి గా గాంధీ తన తప్పిదాన్ని గుర్తించినా,  ఆదర్శాల కోసం దాన్ని సరిదిద్దలేక, అర్ధం చేసుకోని కొడుకు బాధనీ అర్ధం చేసుకుంటాడు. అక్కడితో ఒక అధ్యాయం ముగుస్తుంది.

రాజ్ కోట్ లో భార్యా, నలుగురు పిల్లతో, అద్దె ఇంట్లో హరిలాల్ ఇబ్బందులు పడుతూ, అటకెక్కిన చదువుని గాడిలో పెట్టే ప్రయ్తంతం చేస్తూంటాడు. మెట్రిక్ మూడు సార్లు తప్పుతాడు. ఈలోగా లోకమాన్య తిలక్ తదితరుల ఆహ్వానం పై గాంధీ భారత్ తిరిగి వస్తాడు. తల్లి తండ్రుల ని కలుసుకుని, వారి ప్రధమపర్యటన పర్యాంతం, కుమారుడిగా తన బాధ్యత గా తోడుంటాడు హరిలాల్. అప్పటికే గాంధీ పేరు భారత దేశం అంతటా మహాత్ముని పేరు మారుమోగుతూంది. కొత్తగా దిగివచ్చిన దేవత లాంటి భావన, ప్రజలందర్లోనూ, తీవ్రమైన ఎక్స్పెక్టేషన్ ! సౌత్ ఆఫ్రికా లో గాంధీ చేసిన పోరాటం, అంత పెద్ద బారిస్టరూ, దేశ పురవీధుల్లో సామాన్యుడిలా పర్యటించడం, ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి.  గాంధీ కొడుకుగా హరిలాల్ పతనం కూడా పూర్తి స్థాయికి చేరుకుంటూంటుంది.

హరిలాల్, ఉద్యోగం కోసమో, ఆర్ధిక సహాయం కోసమో తండ్రిని చేసిన అభ్యర్ధనలు నిరాకరించబడతాయి. గాంధీ పేరు, అతనికి ఏ విధం గానూ సహాయపడదు. నలుగురు పిల్లలూ, నిరుద్యోగం, జీవితం లో అపజయం, హరిలాల్ ని కుంగదీస్తాయి. తండ్రి అంటే ద్వేషం పతాక స్థాయికి చేరుకుంటుంది. కొందరు మోసగాళ్ళు గాంధీ పేరును ఉపయోగించుకునేందుకు హరిలాల్ ను వాళ్ళ మిధ్యా వ్యాపారాల్లోకి లాగి, అతన్ని అధో పాతాళానికి చేరుస్తారు. తాగుడు కు బానిస అవుతాడు. అప్పుల వాళ్ళ బెదిరింపులు ఎక్కువవుతాయి. అలాంటి తండ్రికి పుట్టిన కొడుకువా అని నిందలూ మొదలవుతాయి. తండ్రి పేరు కున్న పెద్ద నీడ లో గాంధీ అసమర్ధ కొడుకుగా తనకున్న పేరుతోనూ, అవస్థలు పడుతూ, హరిలాల్ మానసిక, ఎమోషనల్ చిత్రవధ ని అనుభవిస్తాడు. పోషించుకోవడానికి హరిలాల్ భార్య, పిల్లని తీసుకుని కన్నవారింటికి చేరుతుంది.  అక్కడే హరిలాల్ కొడుకు మరణిస్తాడు. ఆ వార్త విని మామ గారింటికి చేరిన హరిలాల్ కి భార్య మృత్యు వార్త కూడా ఎదురయి, నిలువునా దుఃఖ సాగరంలో మునిగిపోతాడు.   హరిలాల్ లో ఉన్న విచక్షణ అంతా అంతరించుకుపోయి మనిషి పూర్తిగా మారిపోతాడు.


ప్రశాంతత కోసం ఇస్లాం స్వీకరిస్తాడు. ఆతరవాత వేశ్యా వాటికల కి వెళ్తాడు, అప్పుల వాళ్ళని తప్పించుకుని తిరుగుతూంటాడు.  వ్యక్తిగా దిగజారుతూంటాడు.  తల్లి కస్తూర్బా వచ్చి అతని పరిస్థితి చూసి బాధపడితే, ఆమె కోసం మళ్ళీ బ్రహ్మ సమాజం లో చేరి, హిందువు గా మారతాడు.  అయితే, జీవితంలో ఓటమి, అతని స్థాయిని దిగజార్చి తాగుడుకు బానిస గా చేస్తుంది.  తండ్రి అంటే ఎలానూ ప్రేమ లేదు. తల్లిని  మాత్రం కలవడానికి అదీ కొద్ది నిముషాలు మాత్రమే ! ప్రయత్నిస్తాడు. ఎక్కడన్నా తల్లీ తండ్రీ, ఏ గృహనిర్బంధం లో ఉన్నపుడో, దేశంలో ఎక్కడికైనా రైల్లో ప్రయాణం చేస్తున్నపుడో తారసపడుతుంటాడు. దాదాపు బిచ్చగాడిలా, జేబులో కాణీ లేక, ఒక్క క్షణం ప్రత్యక్షమై, తల్లిని పరామర్శించి మళ్ళీ అదృశ్యం అవుతుంటాడు. గాంధీ, ఎంతో సాదరంగా కొడుకుని ఇంటికి ఆహ్వానిస్తూనే వుంటాడు. అయినా, తండ్రి కళ్ళలోకి చూడ్డానికి కూడా హరిలాల్ ఇష్టపడడు.


చివరి క్షణాల్లో కస్తూర్ బా, హరిలాల్ ని గురించి తలుచుకుని బాధపడుతూనే కన్ను మూస్తుంది.   భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు ఎవరో రోడ్డు పక్కన దీనాతిదీన స్తితి లో బిచ్చగాడిలా పడున్న హరిలాల్ చేతిలో లడ్డూ పెడతారు. అప్పటికే హరిలాల్ మానసిక సంతులితను కోల్పోయి వుంటాడు. స్వాతంత్ర్యం వచ్చినన్న స్పృహ లేనే లేదు.  గాంధీ కూడా చనిపోయే ముందు రోజు తన సెక్రటరీ ని హరిలాల్ ని ఇపుడు వెతకగలమా ? అతన్ని చూడాలనుంది అని అడుగుతాడు. కానీ హరిలాల్ ని వెతకడం ఎంత కష్టమో తెలిసి నిస్సహాయంగా ఫీల్ అవుతాడు. 

గాంధీ హత్య జరిగినపుడు హరి ఒక చిన్న హోటల్లో ఏదో తినడానికి వెళ్తాడు.  రేడియోలో గాంధీ మరణ వార్త విని సొంత తండ్రి పొయైనట్టే (బాపూ ) అంటూ బాధపడుతూ హరిలాల్ చేతిలో ఏదో తినడానికి పెట్టి, డబ్బులు తీసుకోకుండా కొట్టు మూసేస్తాడా హోటెలు యజమాని. అప్పుడూ, ఆ వార్త రిజిస్టర్ అయినట్టుండదు హరిలాల్ కి. 

అయితే పతనం లోకి జారిపోతున్న హరిలాల్, రోడ్డు పక్కన బిచ్చమెత్తుకునే బీద స్థితిలోకి వెళిపోతాడు. చలిలో, వర్షంలో రోడ్డు మీదే నివాసం. శ్వాస్ కోశ వ్యాధికి గురవుతాడు.  ఆ రోజున తండ్రినీ, తన జీవితాన్నీ తలుచుకుంటూ కళ్ళు మూసిన ఆబిచ్చగాడు   -  ఆ హరిలాల్ - ఆఖరి శ్వాస తీసుకున్నాకా, అతని జేబు లో దొరికిన ఫామిలీ ఫోటోలూ, వగైరాల ద్వారా అతనే హరిలాల్ అని అందరికీ తెలుస్తుంది. అలా.. మహాత్మా గాంధీ కొడుకు అత్యంత దీనమైన పరిస్థితి లో కన్ను మూస్తాడు.

గాంధీ జీవితంలో ఈ చీకటి కోణం,అపారమైన పుత్ర శోకం, చాలా మందికి తెలీదు. ఈ నిజ జీవిత కధను అత్యంత హృద్యంగా తెరకెక్కించిన దర్శకుడికి చాలా పేరు వచ్చింది.  చాలా జాగ్రత్తగా ఎన్నుకున్న తారాగణం, చారిత్రక చిత్రం కాబట్టి నిజాల్ని నిజాలుగానే వుంచుతూ, కల్పనల్ని పక్కన పెట్టి, చక్కగా తీసిన ఈ చిత్రం, ఓ అత్భుతం. యూ ట్యూబ్ లో పూర్తి సినిమా వుంది. గుజరాతీ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పాట ఒకటి చాలా బావుంటుంది. మంచి సినిమా ఈ "గాంధీ, మై ఫాదర్".








06/12/2010

నథ్థా & రూప్ కన్వర్

నిన్నే జీ టీవీ లో అమీర్ ఖాన్ మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్పాడని 'పీప్లీ లైవ్ ' చూసాను. నచ్చింది. పీ.సాయినాధ్ ద హిందూ లో దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల గురించి రాస్తున్నప్పుడు - ఆసక్తి గా (విరక్తి గా కూడా) ఫాలో అయిన ప్రాణం నాది. ఒక సమయంలో వెల్లువెత్తిన రైతు ఆత్మహత్యల బాక్ గ్రౌండ్ లో నథ్థా అనే ఒక పేద రైతు, కాంపెన్సేషన్ కోసం ఆత్మహత్య చేసుకుందామని నిశ్ఛయించుకుంటాడు. ఆ తరవాత, ఓ వైపు ఎన్నికలు ముంచుకు రావడంతో సమీకరణాల పోటీల్లో, టీ ఆర్ పీ ల వేట లో మీడియా, రాజకీయ నాయకులూ వెంటబడటం, ఆ రైతు కుటుంబం పడిన పడరాని పాట్లూ - నవ్వు తెప్పిస్తాయి. కరిస్తే కప్పకు కోపం, విడిస్తే .. అన్నట్టయిపోతుంది. బర్ఖా దత్ (రాడియా ఉదంతంలో ఖంగు తిన్నది) లాంటి ఒక పాత్ర, అందులో ఒదిగిపోయిన నటి మొహంలో 'తప్పంతా నీదే!' అనే ఎక్స్ప్రెషనూ - ముఖ్యంగా నచ్చాయి.


మొత్తానికి ఆత్మహత్య చేసుకుంటాడని ఆ రైతు గురించి పొగ గుప్పుమనడంతో గ్రామం లో జాతర మొదలవుతుంది. సరిగ్గా ఈ పాయింటు దగ్గర మార్క్ టుల్లీ రాసిన 'నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా !' గుర్తొచ్చింది. ఇందులో 1987 లో దేశాన్ని ఒక కుదుపు కుదిపిన రూప్ కన్వర్ సతీ ఉదంతం గురించి టుల్లీ సవివరంగా చెప్పాడు. విలేఖరి కున్న విశాలమైన దృక్కోణంతో ప్రత్యక్షంగా చూసి, చదివి, వినీ, అనుభూతించి సవివరం గా రాసిన ఒక చాప్టర్ ఈ సతి.

రూప్ కన్వర్ సతీ సహగమనం జరిగినప్పుడు అత్తింటి వాళ్ళు, రూప్ కన్వర్ తనంతట తానే స్వచ్చందంగా తన భర్త పార్ధివ శరీరంతో సహా తగలబడి చనిపోయిందని, ఇది గ్రామస్థులందరి సమక్షం లోనూ, తేట తెల్లంగా జరిగిన విషయం అనీ, ఘంటాపధంగా చెప్తారు.

రూప్ కన్వర్ సతి సంగతి, కన్న వారికి చెప్పనే లేదు. గ్రామం అంతా కూడబలుక్కుని ఒక 18 ఏళ్ళ అందమయిన రాజపుత్ మహిళ ని, సతి అనే దురాచారానికి బలి చేసారని కన్న వారి ఆరోపణ.

సతి జరిగిన కొన్ని రోజుల తరవాత, సతీ రూప్ కన్వర్ సజీవంగా తగలబడిపోయిన ప్రదేశంలో ఒక గుడి లాగా తయారవుతుంది. ఇప్పుడు మన ప్రాంతాల్లో వివిధ స్త్రీ ల పేర జరిగే జాతర లాగా - అక్కడ పెద్ద యెత్తున జాతర, వ్యాపారం మొదలవుతాయి.

గ్రామస్థులంతా ఈ వ్యాపారాభివృద్ధికి సంతోషించాలా, పోలీసుల, విలేఖరుల ప్రశ్నా శరాఘాతాలనించీ కాసుకోవాలా అన్న మీమాంశలో పడినట్టు కనిపిస్తారు.

రచయిత థీరీ ప్రకారం, రాజపుత్ కులస్తులు, సతీ జరగడంతో తమ ప్రతాపాల కీ, ఆచారాలకీ ఆదరణ దొరికిందని గర్విస్తారు. మార్వారీలు, వ్యాపారం పెరిగిందని ఆనందిస్తారు. ఇలా గ్రామంలో ఒక్కో కులానిదీ ఒక్కో బాధ !

పీప్లీ లో ఆఖర్న నథ్థా, గ్రామం వొదిలి పారిపోయి, డిల్లీ లో భవన నిర్మాణ కూలీ గా తేల్తాడు. అతని తోటి వాళ్ళందరూ, గ్రామాలు వొదిలి వలస వచ్చిన వ్యవసాయ కూలీలే. రైతులే ! వ్యవసాయం లో ఒడిదుడుకులని ఎదుర్కోలేక, విధాన పరమైన చిక్కుల్ని ఓర్చుకోలేక, డబ్బులేక, ఎందరో రైతులు వ్యవసాయాన్ని ఒక ఉపాధి మార్గంగా ఎంచుకోలేకపోతున్నారు. వ్యవసాయాన్ని మనం ఎంత నీర్సంగా తీసుకుంటున్నామో చూడండి.


రూప్ కన్వర్ సతీ లో కూడా వీధి మొగలో ఐస్ క్రీం బండీ వాడి దగ్గర్నించీ, రాజీవ్ గాంధీ దాకా, దీని వల్ల మనకేంటి ప్రయోజనం - మనకేంటి భంగం - అని ఆలోచిస్తారు తప్ప - చివరాఖరికి రూప్ కన్వర్ సంగతి / ఆవిడకి జరగాల్సిన న్యాయం సంగతి కూడా ఎవరికీ పట్టదు.

రూప్ కన్వర్ ని బలవంతంగా చంపేశారా / బ్రెయిన్ వాష్ చేసారా / ఆవిడ మానసిక స్థితి బాలేదా - ఎందుకలా చనిపోయింది ? గ్రామం మొత్తం కలిసి నేరస్థులా ? ఇలాంటి ప్రశ్నల కి సమాధానం ఎప్పటికీ దొరకదు.

రూప్ కన్వర్ శీలం మీద పనిలో పని గా కధలు వినిపిస్తాయి. పోలీసులు - చంపేశారనే అంటారు. కానీ, ఈ నేరం మీద అత్తవారిని అరెస్టు చేస్తే, గ్రామంలో ఆ మారణ కాండని చూసిన వారు, ప్రోత్సహించిన వారు, మూఢ నమ్మకం ముసుగులో గ్రామానికి రాబోయే పాప్యులారిటీ ని కేష్ చేసుకోదలచుకున్నవారూ - అందర్నీ అరెస్టు చెయ్యాలి.

రాజస్థాన్ ప్రభుత్వానీ, డిల్లీ గద్దెనూ, రూప్ కన్వర్, చచ్చి చాలా సాధిస్తుంది. కానీ అన్యాయమయిపోతుంది.

నథ్థా కూడా అంతే ! అతని కుటుంబానికి నథ్థా మిగలడు. ప్రభుత్వం నుంచీ రావలసిన సహాయమూ అందదు. మీడియా జాతరంతా, ఇంకో బ్రేకింగ్ న్యూస్ వెంబడి పరుగు తీసి పీప్లె ని ఖాళీ చేసేస్తుంది. ఎలక్షన్లు ముగియడంతో, పీప్లీ నుండీ నాయకులూ, పోలీసులూ కనుమరుగవుతారు. ఇంత కాలమూ ఈ సర్కస్ ని అంతా చూసిన గ్రామం, గ్రామస్థులూ, మళ్ళీ తమ తమ జీవితాల్లో నిశ్శబ్దంగా మునిగిపోతారు.

అయితే, ఇలాంటి సినిమాలూ, వ్యాసాలూ, పట్నాల్లో సుఖంగా పరుగులు తీస్తున్న మామూలు మధ్యతరగతి భారతీయుల్ని, ఒక సారలా తట్టి ఊరుకుంటాయి. రాజస్థాన్ లో ఇప్పటికీ బాల్య వివాహాలూ జరుగుతున్నాయి. ఇప్పటికీ సతీ సహగమనాలు జరుగుతున్నాయి (ట!) కానీ వాటిని గ్లోరిఫై చెయ్యడం - రాజకీయ కారణాల దృష్ట్యా తగ్గింది. టెలివిజన్ లో మాత్రం - సాంప్రదాయ కుటుంబాల్లో, సాంప్రదాయాలూ, ఆచారాలూ పాటించే, (నార్థ్ ఇండియన్) స్త్రీ ల దుఃఖ భరిత జీవితాన్ని గ్లోరిఫై చేస్తూనే ఉన్నారనుకోండి.

ఇంకా రైతులూ, చేనేతాజీలూ, వెధవది - టామిళ్ నాడ్ లో తిరుపూర్ గామెంట్స్ లో పంచేసే టెక్స్టైల్ కార్మికులూ - అందరూ - ఇలా ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఆత్మహత్య చాలా సంధర్భాల్లో - ఒక ఆక్రందన ! 'నాకు హెల్ప్ కావాలీ' అని - వ్యక్తి అరిచే ఒక అరుపు ! దాన్ని ఎవరు స్వీకరిస్తున్నారు ? కొందరు రా.నా.లు 'వొళ్ళు బలిసి ఆత్మహత్యలు చేసుకుంటున్నార్రా ఈ రైతులు ! ' అని కోప్పడేస్తారు.

సరేలే ! అదంతా మనకెందుకు గానీ.. చెప్పొచ్చేదేంటంటే - మార్క్ టుల్లీ రాసిన -'No Full Stops in India చదవండి. ఇండియా గురించి మనకేటి తెల్సంటారు ? ఒక పాలి చదివితే తెలిసొస్తాది.

కాపోతే కుంజెం ఓల్ద్ హిస్టరీ. అంటరాని వర్గానికి చెందిన తన నౌఖరు ఊర్లో జరిగిన పెళ్ళి దగ్గర్నించీ, కుంభ్ మేళా, అతి పెద్ద మొదటి టెలీ సోప్ - రామాయణం, స్వర్ణ దేవాలయం, సతీ సహగమనం.. ఇలా దేశాన్ని ప్రభావితం చేసే ఉదంతాల - ఇంకో కోణాల్ని చర్చించారిందులో.

ఫాస్ట్ బీట్ జర్నలిజం ఉండదిందులో ! మనకి నచ్చేవీ, మనం వినాలనుకునేవీ కాకుండా, మనకి తెలియనివీ, మనం ఊహించనివీ, (అన్నీ తెల్సినవే), మన దేశంలో పాతుకుపోయిన బ్యూరాక్రసీ, నిష్కృయాప్రియత్వాన్నీ, ప్రజల పాట్లనీ హాస్యస్ఫోరకంగానూ, వ్యంగ్యంగానూ, కావాల్సిన చోట్ల, సీరియస్ గానూ చెప్తాడు మార్క్ టుల్లీ. మన దేశం గురించి ఒక బీ.బీ.సీ. వోడు ఎంత బయాస్డ్ గా చెప్తాడో అనుకునే వాళ్ళకి ఆశ్చర్యం కలిగి తీరుతుంది - ఆ నిజాయీతీకి, భారత దేశం మీద ఆయనకున్న ప్రేమకీ !

04/10/2008

నిషబ్ద్

నిషబ్ద్ - పోస్టర్ మీద 'అతనికి 60, ఆమెకు 18' అని రాసి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ కాస్త ఇరుకైనది. నిషబ్ద్ అసలు చాలా హైప్ లోంచీ, కాంట్రవర్సీ, ఈ సబ్జెక్ట్ మీద ఎప్పట్లాగే మీడియా లో చర్చల లోంచీ బోల్డంత ఆసక్తి కలిగిస్తూ థియేటర్లలో విడుదలయింది. ఇలాంటి ప్రేమ ని ఒప్పుకోలేని సమాజం సంకుచితమా, సమాజం హర్షించలేని ఆ ప్రేమ సంకుచితమా అని మనుషుల్లో కలిగే ఒక ఆలోచన కలిగించడానికి పనికి వస్తుంది.


నిజంగా చెప్పాలంటే, ప్రేమకు వయసు, కారణం.. ఇలాంటివన్నీ ఉండవు. సినిమాల్లో అయితే మరీ గ్లోరిఫై అయిన ప్రేమ - మొదటి చూపు లోనే ప్రేమ - ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి, చంపడం లేదా చచ్చిపోవడం, ఇలాంటివన్నీ సాధారణంగా చూస్తూ ఉంటాము గాబట్టి మనకవన్నీ అలవాటే. నిజ జీవితం లో ప్రేమ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా వయసు మళ్ళిన ఒక గృహస్థు (భార్యా, పిల్లలు కలవాడు) తన వయసులో కన్నా ఎంతో చిన్నదైన అమ్మాయిని ప్రేమించడం - ఆ అమ్మాయి, అతని కూతురి స్నేహితురాలు కావడం, ఇవన్నీ ఎంత అనూహ్యమైన విషయాలు ?


నిషబ్ద్ మొదలయేసరికే విజయ్ (అమితాబ్) ఒక పర్వత శిఖరం కొన మీద నించుని ఉంటాడు - అక్కణ్ణించీ దూకి, ఆత్మ హత్య చేసుకోవడానికి. ఎందుకు - అంత కష్టం ఏమొచ్చిందీ అంటే - అతను చెప్పిన తన కధ ఈ నిషబ్ద్. ఒక నటుడిగా అమితాబ్ విలక్షణత, అతని భార్యగా నటించిన రేవతి మీనన్ ప్రతిభ ఈ సినిమాని చూడ చక్కగా తీర్చిదిద్దాయి.


కేరళ లో (మున్నార్) అందమైన పిక్చర్ పెర్ఫెక్ట్ పరిసరాల్లో విజయ్ (అమితాబ్), అమృతల (రెవతి) అందమైన పొదరిల్లు లాంటి ఇల్లు. విజయ్ ఒక ఫొటొగ్రాఫర్. వీళ్ళకి ఒక అందమైన కూతురు రీతు (ష్రద్ధా ఆర్య)! ఈ అమ్మాయి స్నేహితురాలే జియా. జియా ఒక ట్రబుల్డ్ టీనేజర్. ఈమె తల్లిదండృలు విడిపోయారు. తల్లి ఆస్ట్రేలియా లో ఒంటరిగా ఉంటుంది. జియా మాత్రం ఇండియాలో ఉండి చదువుకుంటూంది. ఈమె రీతూ తొ కలిసి, శలవులకు కేరళ రావడంతో కధ మొదలవుతుంది. రామూ శైలి లో జియా..(ఆస్ట్రేలియన్ పెంపకం గాబట్టి అనుకోవాలా) చిన్న చిన్న బట్టల్లోనే పరిచయం అవుతుంది. ఈ ఇద్దరు పిల్లల్నీ రీతూ తల్లి దండృలు ఎంతో సాదరంగా ఆహ్వానిస్తారు. రీతూ, జియా ఇద్దరూ ప్రాణ స్నేహితులు. రీతూ కన్న, జియా చాలా పెంకిది, తెలివైనది. చురికైనది. తొందరలోనే, అందరితోనూ కలిసిపోతుంది.


అయితే ఆమె లో ఏదో చైతన్యం తో విజయ్ (అమితాబ్) ఉత్తేజితుడవుతాడు. ఆమె కూడా అతని పట్ల తెలియని ఇష్టాన్ని పెంచుకుంటుంది. ఇవన్నీ ఎవరికి వారు గమనించుకునే లోగానే, ఇద్దరూ ప్రేమ లో పడతారు. ప్రేమ లో పడటానికి మనలో ఏదో కావాలి. అది ఏమిటి - మనలో స్పందనల్ని ఒడిసిపట్టగలిగే ప్రేరణలని ఎదిరించి, ప్రేమ కోసమే ప్రేమించడానికి కూడా ఏదో అవసరం. అందరూ ప్రేమించలేరు. అయితే, సమాజంలో ప్రేమ కి ఒక బాధ్యత ఉంటుంది. ఒక భార్య కి భర్త అయి ఉండి, ఒక కూతురి తండ్రి అయి ఉండి, తన కూతురి వయసు పిల్లతో ప్రేమ లో పడటం న్యాయం కాదు. అయితే ఎవరూ కావాలని ప్రేమ లో పడరు.


అంతవరకూ తన భాద్యతలని ఎరిగిన మనిషిగా, ఎంతో హుందాగా, ఎంతో గౌరవంగా జీవితాన్ని గడిపిన వ్యక్తి, తన వయసుని మరిచి, తన ముందున్న స్త్రీని ఒక స్త్రీ లాగా ప్రేమించడం, అదే తొలి ప్రేమ అన్నంతగా ప్రేమించడం సాధ్యమా..?


జియా ఖాన్ కూడా చాలా అందంగా - యవ్వనంతో మిసమిస లాడుతూ, కనిపించినా, పాత్ర పరంగా తన అంతరంగం లో దాగున్న అగ్నిపర్వతాలను కూడా చాలా బాగా ప్రదర్శించింది. జియా (పాత్ర పేరు కూడా అదే) ఒక ఫ్రీ బర్డ్. ఆమె అన్ని మానసిక అవసరాలనూ తీర్చడానికీ ఒక కుటుంబం అంటూ లేకుండా, ప్రేమను అనుభవించకుండా, బలవంతపు కఠినాత్మకత, కేర్లెస్ నెస్, తల్లి కున్న బాయ్ ఫ్రెండ్స్ ని చూస్తూ, తల్లి అనుభవాల్ని చూస్తూ ఏర్పరచుకున్న వ్యక్తిత్వం ఆమెది. అంతవరకూ ఆమె తొ మామూలుగానే ఉంటూ వచ్చిన తల్లి బాయ్ ఫ్రెండ్ కూడా - తనకు కాస్త వయసు రాగానే తననే ఆశించడాన్ని తీవ్రంగా అసహ్యించుకున్న వ్యక్తి - ఒక తెగిన గాలిపటం. ఇపుడు ఆమెకు ఆస్ట్రేలియా వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ 'అతను ' ఉంటాడు. తల్లి అతన్ని వొదులుకోలేదు.


ఇలాంటి అమ్మాయికి ఈ అరవయ్యేళ్ళ వృద్ధుణ్ణి చూసి ప్రేమ కలిగింది. అయితే, తను అనుభవిస్తున్న ప్రేమ వెనకున్న పరిమాణాల సంగతి ఆమెకు తెలియదు. ఆమెకు ప్రేమో / ఆకర్షణో కలిగింది. ఈ ప్రేమకి చలించిన విజయ్ - తన వయసునీ, వరుసనీ మరిచి, పిచ్చివాడైపోతాడు. అతను అలా చెయ్యకూడదు - అలా చెయ్యకూడదని జియాకు తెలియదు. ఆమె లో భారతీయత తక్కువ.


ఈ సినిమా లో రేవతి గురించి చెప్పుకోవాలి. రేవతి అంటేనే, చాలా మంచి నటి.. అని అందరికీ తెలుసు. ఒక సారి జియా వీళ్ళ ఫేమిలీ ఫోటోలు చూస్తూండగా, రేవతి చిన్నపుడు (పెళ్ళి కాక ముందు) భరతనాట్య ప్రదర్శన ఇచ్చినప్పటి ఫోటో కనపడుతుంది. అపుడు జియా 'ఆంటీ.. మీకు డాన్స్ వచ్చా.. ?' అంటే నవ్వి రేవతి 'పెళ్ళయ్యాక మానేసాను ' అంటుంది. జియా.. ఎందుకు మానేసారు అని అడిగితే, ఆలోచన లో పడి.. 'పెళ్ళయ్యాక, విజయ్ నే నా జీవితం. తరవాత రీతూ వచ్చింది.. ఇంకెక్కడ కుదురుతుంది ?' అంటుంది. ఇంతగా కుటుంబం కోసం తన ఇష్టాఇష్టాలని వొదులుకుని, పూర్తిగా విజయ్ కే అంకితమైన భార్య ఆమె.


విజయ్ గా అమితాబ్ - తప్పు ఒప్పుల సంఘర్షణల మధ్య ఊగిసలాడినా.. జియా వైపే మొగ్గుతూ ఉంటాడు. ఈ పరిస్థితుల్లో రీతూ కు తండ్రికీ, తన స్నేహితురాలికీ మధ్య ఉన్న 'అనుబంధం' గురించి అనుకోకుండా తెలుస్తుంది. తండ్రికి తల్లి కాకుండా వేరే ఎవరితోనో 'ప్రేమ ' ఉందని తెలిస్తే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది ? రీతూ గా ష్రద్ధా ఆర్య నటన చాలా బావుంది. ఈ అమ్మాయి, ఈ విషయాన్ని తల్లికి చెప్పలేక, తండ్రితో మాట్లాడలేక, (జియా తో మాత్రం మాటాడటం మానేస్తుంది) ఎంత తల్లడిల్లిపోతుందో చూస్తే జాలి కలుగుతుంది. ఆఖర్న తల్లికి జియాని పంపెయమ్మా.. తను మనింట్లో ఉండొద్దు ! అని చెప్తే, అమృత కి అసలు విషయం అర్ధం కాదు. ''మీరు ఫ్రెండ్స్ కదా - అలా కోపం వస్తే ఆమెని వెళ్ళిపోమంటారా ఎవరైనా..?'' అని సర్దేస్తుంది. ఈ పాత్ర లో రేవతి ఎంత చక్కగా ఒదిగిపోయిందంటే, ఆమెకి భర్త మీద లేశమాత్రమైనా అనుమానం ఉండదు. అసలు వీరిద్దరి మధ్యా జరుగుతున్నది రేవతి కి మాత్రం కనిపించదు - అనిపించదు.


ఈ పరిస్థితుల్లో ఆపధ్బాంధవుడిలా శ్రీధర్ (నాజర్) (అమృత సోదరుడు) ప్రవేశిస్తాడు. రీతూ తన హోం ట్రూత్ ని మామయ్య కి చెప్పడం, ఆయన విజయ్ తో (అమితాబ్) తో ఈ విషయం డిస్కస్ చెయ్యడం (జియా ఇంకా చిన్నపిల్ల ! ఆమె ఒక వేళ నిన్ను నిజంగా ప్రేమించిందే అనుకో - నీ వయసు కు నువ్వు ఆమెకు ఎలాంటి జీవితాన్నివ్వగలవు ? ఆమె ను ప్రేమించి, ఆమె ఫ్యూచర్ కు నువ్వు అన్యాయమే చేస్తున్నావు అని వాదిస్తాడు శ్రీధర్) చివరికి రేవతి కి కూడా సంగతి తెలియడం.. ఆమె భర్తని అసహ్యించుకోవడం..(అది చూసి తీరాల్సిన సీన్) చివరికి సమాజపు, కౌటింబికపు భాద్యతల పరంగా విజయ్ - జియాని పిలిచి, 'నేను నిన్ను ప్రేమించడం లేదు - నీది ఎడాలసెంట్ వయసు అందుకే నీకు అలా అనిపిస్తూంది. నువ్వు నా ఇంటి నుంచీ వెళిపో. నీ ముఖం కూడా చూపించొద్దు. ఏదో కాస్త ప్రేమ గా మాట్లాడితే అది నిజం ప్రేమ అనుకుంటావా..'' లాంటి ఏవో మనసు విరిచే మాటలని, ఆమెను ఇంటినుంచీ వెళ్ళగొట్టడం - తో ఈ గొడవ సద్దుమణుగుతుంది. ఈ నిరాకరణ ని ఎదుర్కోవడానికి జియా కు ఎంత ధైర్యం కావాలి ? జియా విజయ్ ని బ్రతిమాలుతుంది. 'నిన్ను చూడకుండా ఉండలేను ' అంటుంది. కానీ అమితాభ్ కాఠిన్యాన్ని చూసి, గుండె చెదిరి - ఏడుస్తూ వెళిపోతుంది. ఈమెను ప్రేమించే బాయ్ ఫ్రెండ్ (ఆమె ఇష్టపడదు) ఆఫ్తాబ్ శివ్ దాశానీని పిలిచి అతనికి ఆమెని అప్పగించేస్తాడు విజయ్.


ఈ చిన్ని ఎపిసోడ్ ముగిసాక, విజయ్ ఒంటరి అయిపోతాడు. అతనితో భార్య మాటలాడదు. (ఆమె విశ్వాసాన్ని అతను కోల్పోయాడుగా) కూతురు అసహ్యించుకుంటుంది. జియా లేదు. వెళిపోతున్న జియా ఎంత హర్ట్ అయిపోయి వెళిపోయిందో అదే గుర్తొస్తూ.. ఆమె లేక బ్రతకలేక, ఆ కొండ కొమ్మున నించుని ఉంటాడు అమితాబ్. కానీ చాలా సేపు, ఆమె ని తలచుకుని రోదిస్తూ.. పొద్దు పోయేదాకా గడిపి, ఇంటికొస్తాడు. Sridhar (నాజర్) 'ఇంత వరకూ ఎక్కడికెళ్ళావు విజయ్?' అని అడిగితే, 'చావడానికీ అని నిర్లిప్తంగా చెప్పి - 'కానీ చావలేకపోయాను. జియాని తలచుకుంటూ.. ఆ విరహ బాధలో ఇంకొన్నాళ్ళు ఆమె కోసం బాధపడుతూ బ్రతకాలనుంది - అందుకే ఇంటికొచ్చేసాను ' అంటాడు. అప్పుడు విజయ్ లో ఉన్న ప్రేమ తీవ్రత అర్ధం అవుతుంది. అంతే..! ఇదే ముగింపు.


అయితే, రాం గోపాల్ వర్మ కి కొంచెం ప్రేక్షకులను ఆకర్షించడానికి కాస్త ఉత్సాహపడే లక్షణం - ఈ సినిమాని కొంచెం (కొంచెమే లెండి) చతికిలపరిచాయి. కొన్ని సార్లు ప్రేమ ని కొంచెం మంచిగా చూపించాలి. సౌందర్యానికీ, పొడుగు కాళ్ళకూ, స్కిన్ షో కూ కొంచెం ఎక్కువ మోతాదులో ప్రాముఖ్యత ఇస్తే, జియా ఖాన్ ని తడిపి, చిన్న బట్టల్లో చూపితే - అది చూసి అమితాబ్ కు ప్రేమ కలగడం - ఇవి కొంచెం చీప్ గా అనిపిస్తాయి. సినిమా లో జియాఖాన్ కాళ్ళు చూసీ చూసీ విసుగు పుడుతుంది. అసలు జియా ఖాన్ ముఖం చూస్తేనే చిరాకు వచ్చేంత వరకూ చూపించి, చివరి అర్ధ గంట లో మాత్రం మంచి నటన చూపించాడు. ప్రేమ ఒక ఉత్కృష్టమైన భావన. దీన్ని అంతకన్నా తక్కువగా చూపిస్తే, అది కన్విన్సింగ్ గా ఉండదు.


విజయ్ పాత్ర లో అమితాబ్ కాకుండా ఇంకోరెవరైనా ఉంటే సినిమా తేలిపోయి ఉండేది. నిస్సహాయమైన ఒక వృద్ధ ప్రేమికుడి గా విజయ్ 'జియా జ్ఞాపకాలలో నైనా జీవించాలని ఉంది..' అన్నప్పుడు పురుషుని ప్రేమ ఎంత లోతైనదో అర్ధం అవుతుంది. మన సమాజం లో - ఒక వయసు రాగానే పెద్దలు కుదిర్చిన పెళ్ళీ.. పెళ్ళి అయిన కొన్నాళ్ళకి పిల్లలూ - ఇవి మనుషులకి తప్పని చిక్కుముళ్ళు. వీటికి వ్యతిరేకంగా ఏ ఒక్కటి జరిగినా సమాజం లో అలజడి మొదలవుతుంది. 'ఇంకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు '? 'ఇంకా ఎందుకు పిల్లలు కనలేదు ?' 'ఇంకా ఎందుకు మీ పిల్లలకి పెళ్ళి చెయ్యలేదు ?' ఇలా ప్రశ్నలు - వీటికి సమాధానం ఏముంది ? పెళ్ళి బయట ప్రేమ అంటే సమాజం (family) ఊరుకుంటుందా ? అయినా ఒక కుటుంబాన్ని కలిపి ఉంచే నమ్మకం, విశ్వాశం, ప్రేమ, ఇవన్నీ ఏమిటి ? ఈ ఏక్సిడెంట్ ల తరవాత ఆ ముగ్గురు కుటుంబ సభ్యులూ బాధితుల్లా ఒకరి కొకరు దూరమయిపోయి - తట్టుకోలేని నిశ్శబ్దం లో మిగిలిపోతారు. ఈ నిశ్శబ్దం లో కూడా విజయ్ లో ప్రాణాన్ని హరించకుండా నిలిపి ఉంచింది, ఈ ప్రేమే. నిష్కారణంగా బంగారం లాంటి సంసారాన్ని పాడుచేసుకున్నాడే - అనిపించినా, ఎట్ లీస్ట్ జియా పట్ల తనకి కలిగిన ప్రేమ ని అంగీకరించి, (రేవతి ముందు) నిజాయితీ గా, దాని పర్యవశానాన్ని ఎదుర్కున్న ప్రేమికుడిగా అమితాబ్ చాలా చక్కగా నటించారు.


So..ఇన్ని సమస్యలకూ ఒక కళా రూపం నిషబ్ద్ ! పోస్టర్ చూసీ, స్టోరీ వినీ, వెళ్ళని వారు భయపడకుండా చూడొచ్చు. భారత దేశపు అత్యుత్తమ నటులు ముగ్గురు ప్రధాన పాత్రల్లో నటించారు. పర్లేదు. ధైర్యంగా చూడండి.

02/10/2008

15 పార్క్ ఎవెన్యూ

15 పార్క్ ఎవెన్యూ - భూటాన్ లో తీసారు....(అదో .. రెఫ్రెషింగ్ ఫీలింగ్)... నేనప్పటకి ఢిల్లీ కీ గల్లీల్లో ఉండేదాన్ని. ఇప్పట్లాంటి గడ్డు రోజులు కావవి. ప్రగతీ మైదాన్ (Sakuntalam) లో యాభయి రూపాయలు పెడితే మంచి సినిమా టికెట్ దొరుకుతుంది. పార్కింగ్ ఫ్రీ. ఆఫీసు 5.30 కి ముగిసాకా, వేరే వేరే చోట పనిచేసే మా ఫ్రెండ్స్ అందరం మా వాయు భవన్ ముందర కలుసుకుని, పొలోమంటూ ప్రగతీ మైదాన్ కి పోయి, టికెట్ కొన్నాక ఓమాటు బైటికొచ్చి, ఆవనూనె లో వేయించిన పెసలు తింటూ, హాయి హాయి గా గడిపి, 7 / 8 గంటల షో (సినిమా నిడివి బట్టీ) కి తయారయ్యేవాళ్ళం.


అలాంటి రోజుల్లో అపర్ణా సేన్ సినిమా కాబట్టి బోల్డంత ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళి చూసిన సినిమా ఈ '15 పార్క్ ఎవెన్యూ'. కధ - గురించి ముందే తెలుసుకునుండకపోయుంటే, కొంచెం కష్టం అయేది. కానీ స్కీజో ఫ్రీనియా అనే ఒక రకమైన మానసిక రోగం తో బాధపడే ఒక అమ్మాయి కధ అని విని ఉన్నాం కనుక - ఈ మేధోపరమైన సినిమాకి మానసికంగా తయారయి ఉన్నాం. ఈ అమ్మాయి పేరు మీఠీ (కొంకణా సేన్ శర్మ). ఈమె, తన అక్కయ్య షబానా ఆజ్మీ తో కలిసి 15 పార్క్ ఎవెన్యూ అనే ఎడ్రెస్ వెతుకుతూండడంతో సినిమా మొదలవుతుంది.


మీఠీ కి తనకి జయొదీప్ తో పెళ్ళయిందనీ, తనకు 5గురు పిల్లలున్నారనీ, తామంతా పార్క్ ఎవెన్యూ లో 15 వ నెంబరు ఇంట్లో ఉన్నామనీ ఒక భ్రమ. అది భ్రమ మాత్రమే కాదు.. అదే ఆమెకు సంబంధించిన జీవితం, ఆమె అస్థిత్వం. ఇలాంటి భ్రమనే నమ్ముకుని జీవిస్తున్న మీఠీ ని కంటికి రెప్ప లా కాపాడుకుంటూ వస్తున్నారు తన అక్కయ్య (షబాన) మరియూ తల్లి (వహీదా రెహ్మాన్). వీరందరి జీవితాల్తోనూ ఒక నిజమైన జయొదీప్ (రాహుల్ బోస్) తరవాత వచ్చి కలిస్తే, కొన్ని అత్భుతమైన పెర్ఫార్మెన్సులూ, కొన్ని విషాద సంఘటనలూ, అత్యత్భుతమైన స్క్రీన్ ప్లే..ఇవన్నీ కలిసి, గుండె తరుక్కుపోయేలా చేసే జీవిత క్రమాలూ.. కలిస్తే 15 పార్క్ ఎవెన్యూ అవుతుంది.

అందరూ బెంగాలీ లూ (బహుశా వహీదా, kanwaljit తప్ప) కలిసి, ఈ సినిమాని చాలా మంచి హైట్స్ కి తీస్కెళ్ళి వొదిలేసారు. సినిమా ముగిసాకా, పట్టేసిన గుండె సర్దుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. మీఠీ చిన్నప్పట్నించీ హాలూసినేషన్స్ కి గురవుతూ ఉంటుంది. ఆమెకు తండ్రి మానశిక చికిత్సాలయం లో ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారు. కొన్నేళ్ళకు పరిస్తితి మెరుగు పడినట్టనిపించి సగం, అక్కడ కన్నా, ఇంట్లో అయితే ఆడపిల్లకు సేఫ్ అనీ ఆలోచించీ సగం, పిల్లను ఇంటికి తీసుకొచి కాలేజీ లో చేర్చి మంచి మానసిక ఆలంబన అందిస్తుంది ఆ కుటుంబం. కాలేజీ లో జర్నలిజం లో కోర్స్ చేస్తుంది మీఠీ. అక్కడే జొయొదీప్ (రాహుల్ బోస్) పరిచయం అవుతాడు. రాహుల్ బోస్ అంటే నాకు 'ఇంగ్లీష్ ఆగస్ట్ ' సినిమా నుంచీ కొంచెం ఇష్టం.


జొయొదీప్ అంటే పిచ్చి ప్రేమ పెంచుకుంటుంది మీఠీ. ఒక మంచి ప్రేమికుడిగా, స్నేహితుడిగా, మీఠీ లో ముడుచుకుపోయే తత్వాన్ని పోగొట్టడానికి, ఆమె లో ఆత్మ విశ్వాసం నింపడానికీ జొయొదీప్ ప్రయత్నిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి సంగతీ, పెద్దలకు తెలిసి, వారికి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అవుతుంది. ఈ లోగా జర్నలిస్ట్ గా ఉద్యోగం చేస్తున్న ఈ పిల్లను యాజమాన్యం ఒక చోట అల్లరి మూకలు (ప్రస్తుతం కాంధమాల్ లో జరుగుతున్నట్టు) చేస్తున్న అల్లర్లను కవర్ చేయడానికి పంపబోతుంది. అయితే మొదట బెదిరినా ఆ అమ్మాయి, జొయొదీప్ ముందు తనను తాను నిరూపించుకోవడానికి ఈ ఎసైన్మెంట్ కు ఒప్పుకుని, కుటుంబ సభ్యులకు సరిగ్గా వివరాలు చెప్పకుండానే ఆ భయంకర ప్రదేశాల్లోకి ఒంటరి గా వెళ్తుంది. అక్కడ దారుణంగా గేంగ్ రేప్ కు గురవుతుంది. ఈ షాక్ కి ఆమె ఈ సారి నిజంగానే మానసికంగా బలహీనురాలయిపోతుంది.

ఎలాగో ఈ వార్త తెలిసి, మీఠీని ఇంటికి తీసుకొచ్చాకా, మీఠీ ని కలవడానికి వెళ్ళిన జొయొదీప్ - తన పరిస్థితి చూసి జాలి తో నిండిపోతాడు. తనను తాకిన వెంటనే మీఠీ జొయొదీప్ ను గుర్తించక, కరెంట్ షాక్ కొట్టినట్టు, వెనక్కి తప్పుకుంటుంది. ఆమెకు స్పర్శ అంటేనే ఏదో ఏవగింపు.. భయం. తను చేసుకోబోయే అమ్మాయి మీద ప్రేమతో తప్ప, ఇలా జాలితో పెళ్ళి చేసుకోలేనని చెప్పి, జొయొదీప్ వారి జీవితాల్నుంచీ నిష్క్రమిస్తాడు. తండ్రి ఈ విషాదానికి తట్టుకోలేక, గుండెపోటు తో మరణిస్తాడు.

ఇన్ని విషాదాల తరవాత మీఠీ ని ఆక్రమించుకున్న స్కీజోఫీర్నియా.. ఆమె ను ఆమె గతంలో జొయొదీప్ తో కన్న కలలే నిజం అనేంత గా భ్రమల్లో ముంచుతుంది. జొయొదీప్ తో తనకు నిజంగానే పెళ్ళయినట్టూ, వారికి 5 గురు పిల్లలున్నట్టూ, వారంతా 15 పార్క్ ఎవెన్యూ లో నివాశం ఉంటున్నట్టూ ఊహించుకుంటూ ఆ ఊహల్లోనే బ్రతుకుతూ ఉంటుంది మీఠీ.


ఇన్ని కాంప్లెక్సిటీ ల తరవాత.. కొన్నాళ్ళకి జొయొదీప్ నిజంగానే వీరి జీవితాల్లోకి వస్తాడు. ఈ రావడం యాధ్రుచ్చికంగానె జరిగినా, మీఠీ ప్రస్తుత పరిస్థితి చూసి, ఆమె ఈ పరిస్థితికి కాస్త తనూ కారణమేనేమో అన్న గిల్టీ ఫీలింగ్ తో తను ఆమెకు ఏదోలా సహాయం చేద్దామనే ఉద్దేశ్యంతోనే వస్తాడు. మీఠీ కి 15 పార్క్ ఎవెన్యూ వెతకడానికి సహాయం చేస్తానని చెప్తాడు. కానీ ఆఖరికి, ఈ ఇల్లు వెతకడం లోనే మీఠీ కనిపించకుండా పోతుంది. ఆమె కు తన ఇల్లూ, పిల్లలూ, భర్తా దొరికారా, లేదా అనేది మన ఊహ కే వొదిలేసిన దర్శకురాలు, మీఠీ ని ఇన్నాళ్ళూ పసిపాప లాగా సాకిన తల్లీ, మీఠీ కోసం, ప్రేమనూ, జీవితాన్ని త్యాగం చేసిన అక్కయ్యా, అప్పటికి ఇద్దరు పిల్లల తండ్రి అయినా, మీఠీ కోసం ప్రేమ (!!!) తో, ఆమె మీద జాలితో, ఆమె తప్పిపోయేంత వరకూ ఆమె తో స్నేహించిన జొయొదీప్.. ఇలా అందరూ మీఠీ తప్పిపోయాక పడిన ఆందోళన మన మనసుల్లోనూ కలిగిస్తుంది అపర్ణా సేన్.


మీఠీ కధ ని చెప్తున్నపుడు వాళ్ళింటి దగ్గర రోడ్ మీద చెత్త, గాజు పెంకులూ ఏరుకుంటూ.. అవే అత్బుతమైన వస్తువుల్లా దాచుకునే ఒక పిచ్చిదాన్ని చూపిస్తారు. ఆమె ని చూసి, మీఠీ భయపడుతూ ఉంటుంది. ఆమె ను ఒక రెండు సార్లు మాత్రమే చూపించినా ఆ సీన్ చూస్తే, సాధారణంగా మనకు తారసపడే మానసిక రోగుల పాస్ట్ గురించి ఎందుకో ఆలోచించాలనిపిస్తుంది. వారి పట్ల సమాజపు వివక్ష ని అసహ్యించుకోవాలనిపిస్తుంది.


సినిమా కధ ఇంత సింపుల్ గా చెప్పగలిగినా.. చూడడానికి చాలా బావుంది. సహజంగా విషాదాంతాలు ప్రేక్షకుల మీద చూపించే ప్రబావం ఎక్కువ. 15 పార్క్ ఎవెన్యూ లో తెర ముందు నటించిన ప్రతి ఒక్కరి నటనా - తెర వెనుక ఉన్న ప్రతి ఒక్కరి ప్రతిభ అబ్బురపరుస్తుంది. విదేశాల్లో షూటింగులూ, పాటలూ చిత్రీకరించడం.. ఒక్కోసారి విదేశాల్లోని సబ్జక్టుల తో నే సినిమాలు తీయడం ఎక్కువైన రోజుల్లో, భూటాన్ లో తీసిన, (ఎక్కువ భాగం ఇండియాలోనే) ఈ సినిమా చాలా మంచి ప్రమాణాలతో తీసినది. నేను మొదలు పెట్టడమే ఈ సినిమా భూటాన్ లో తీసారు - అని ఎందుకు చెప్పానంటే, భూటాన్ లో చిత్రీకరించిన భాగం.. చాలా గాఢమైనది; స్వచ్చమైన ప్రతిభ, మనుషుల మనసుల్లోని అందాలను బయటికి తీసుకొచ్చే ఏదో మిస్టిక్ భావజాలం ఆ సీన్ ల లో అల్లుకుపోయి కనిపిస్తుంది. అప్పటికే తడిచిపోయిన ప్రేక్షకుల మనసుల్ని కాస్త ఆహ్లాదపరిచే గాంభీర్యం భూటాన్ ది. అందుకే అది చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ అన్నాను.


ఇంట్లో స్పెషల్ పిల్లలు ఉంటే ఆ కుంటుంబం చేసే త్యాగాలు.. వారి లో ప్రతి ఒక్కరి జీవితం.. ఒక కధ లాగా - వారి మనసుల్లోకి మనం తొంగిచూడగలిగితే కనిపించే లోతులు.. ఇదంతా, ఈ సినిమా చూస్తే కొంచెం అన్నా అర్ధం అవుతుంది. ముఖ్యంగా షబానా.. సైకియాట్రిస్ట్ గా నటించిన చటర్జీ.. ఈ లోతుల్ని స్పృసించడానికి కాస్త సహాయపడతారు.


ముఖ్యంగా వహీదా రెహ్మాన్ - తల్లి గా ఎంత అత్భుతంగా నటించినంటే, కూతురి గురించి బాధపడే నిస్సహాయురాలైన వృద్ధ, అమాయకురాలైన తల్లి గా ఆవిడ జీవించింది. ఒక సీన్ లో మూఢ నమ్మకాల ఆధారంగా పనిమనిషి చెప్పిన మాట నమ్మి.. అలా చేస్తే పిల్ల బాగుపడుతుందేమో అన్న ఆశ తో మీఠీ కి మంత్రాల ట్రీట్మెంట్ కూడా ఇప్పించబోతుంది. షబానా నటన చెప్పనే అక్కర్లేదు. షెఫాలీ షెట్టి (జొయొదీప్ భార్య) చాలా తక్కువ సేపు కనిపించినా..చాలా బాగా నటించింది. ఇంత మంది విదూషీమణులు, కన్వల్ జీత్, రాహుల్ బోస్, ధ్రితిమాన్ చెటర్జీలు (సైకియాట్రిస్ట్) నటించిన సినిమా ఎలా వుంటుందనుకుంటున్నారు ?


సీరియస్ నటన, ప్రతిభలు నచ్చే వారూ.. సినిమా ఒక కళ అయితే.. ఆ కళ ని ఆరాధించే వారూ, పిపాసులూ.. తప్పకుండా చూడదగిన చిత్రం ఈ '15 పార్క్ ఎవెన్యూ' ! {చూడాలనుంటే, యూ ట్యూబ్ లో చూడొచ్చు}

08/05/2008

మాతృభూమి!


ఒక ఆదివారం B4U Moovies లో 'మాతృభూమి: అ నేషన్ వితౌట్ విమేన్' (హిందీ) అనే సినెమా చూసాను. మధ్యలోంచి చూడటం మొదలుపెట్టడం వల్ల అసలు కధ ఎమిటో మొదట అర్ధం కాకపోయినా ఇంతకూ ముందు ఈ సినెమా గురించి విని ఉండటం వలన చూచాయ గా అర్ధం కావటం ఆరంభించింది. ఈ సినిమా లో దిగ్గజాలే నటించారు. నేను ఇష్టపడే త్యులిప్ జోషి హీరోయిన్. ఐతే.. ఈ సినీమాలో సున్నితంగా పువ్వులా ఉండే ఈ అమ్మాయి ఎలా నటించిందా అని ఆశ్చర్యం కలిగింది. ఈ పువ్వు లాంటి అమ్మాయి మీద జరిగే అత్యాచారాల్ని చూసి రాక్షసుడికైనా బాధ కలుగుతుంది.



ఈ సినెమా కధ ఒక ఊహ నించి పుట్టింది. మనీష్ ఝా ఈ కధను రచించి, సినీమా దర్శకత్వం వహించారు. వర కట్న దురాచారం దేశం లో మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మనకు తెలుసు. ఇప్పటికీ ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే అబార్షన్ చేయించడం, ఆడ పిల్ల పుడితే రక రకాల హేయమైన పద్ధతుల లో ఆ పసిగుడ్డును చంపటం.. జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆడ సంతానాన్ని చంపటం.. ఇదే రేట్ లో కొనసాగితే.. కొన్నాళ్ళకి దేశం లో ఆడవాళ్ళే కరువుతారు. అటువంటప్పుడు సామాజికంగా ఎటువంటి పరిస్తితులు ఎదురుతాయో ఊహించి తీసిన చిత్రం ఇది. ఈ సినెమా ౨౦౦౩ లో విడుదలైంది. చాలా అంతర్జాతీయ వేదికలలో విడుదల అయి చాల పేరు పొందింది. ప్రపంచం అంతా.. ఇండియా లో ఇలా ఆడ పిల్లల్ని చంపుతారా?! .. అని ఆశ్చర్య పడితే మనకు అవమానం కదూ!



గ్రామంలో అగ్రకులానికి చెందిన ఒక పెద్దాయనకు ( ఠాకూర్) (సుధీర్ పాండే) అయిదుగురు కొడుకులు. ఎన్నాళ్ళుగానో ఆడపిల్లలను మట్టుపెట్టడం వల్ల గ్రామంలో ఆడదంటూ మిగలక.. గత పదిహేనేళ్ళుగా అందరూ మగ వాళ్లతో నిండిన గ్రామం అది. పెద్దాయనకు కొడుకుల పెళ్లి చెయ్యటం గగనం అవుతుంది. పిల్ల దొరకందే..! ఇతగాడికీ అయిదుగురు మగ పిల్లల్ని కన్న భార్య ఏనాడో పరమపదిస్తుంది. కాబట్టి ఆడపిల్ల ఒకటి దొరికితే.. ఆ ఆరుగురూ.. దాన్ని (ఒక వస్తువు లాగా..) అనుభవించుదామని చూస్తుంటారు. ఇక్కడ ఆడది లేక పొతే మగవాళ్ళ జీవితాల్లో కలిగే Sexual Frustration ముఖ్యమ్గా చూపించారు. మనిషి పశువు అవుతాడు. రాక్షసుడు కూడా అవుతాడు.



ఈ కుటుంబానికి (నిజానికి పెద్దబ్బాయికి) ఒక సారి ఒక సంబంధం వస్తుంది. కానీ తాళి కట్టే వేళకు ఆ పెళ్లి కూతురు అసలు ఆడది కాదని.. మోసం అని తెలిసి.. ఖంగు తింటారు. అప్పటికి వరకట్నం పోయి కన్యాశుల్కం పద్దతి వస్తుంది. ఊర్లో అమ్మాయి కనపడితే ఎత్తుకుపోవటమో, కొనుక్కోవటమో సాధారణం అయి వుంటుంది. ఆడ పిల్లలు పెళ్లి పేరుతో అమ్మకానికి సిద్ధంగా ఉంటారు.



ఇలాంటి పరిస్తితులలో ఒక స్నేహితుని ద్వారా..వీళ్ళకు ఒక పిల్ల సంగతీ తెలుస్తుంది. పిల్ల పేరు కల్కి. (త్యులిప్ జోషి) తండ్రి ఆ పిల్లను భద్రంగా లోకుల కంట పడకుండా దాచి ఉంచుతాడు. మొదట పెద్ద కొడుకు కి సంబంధం అంటూ మాట్లాడటానికి వెళ్తారు. లక్ష ఇస్తామన్న పిల్ల తండ్రి ఒప్పుకోడు. కానీ ఆఖరికి బేరం కుదిరి... అయిదు లక్షలకు, అయిదుగురు కొడుకుల తో పెళ్లి జరపటానికి ఒప్పుకుంటాడు. పెళ్లి దృశ్యం పాండవులతో ద్రౌపది లా.. అయిదుగురు భర్తలతో.. ఈ టీనేజ్ పిల్ల పెళ్లి. తండ్రి చేతులారా.. డబ్బు కోసం ఆ పిల్లను పసువులా అమ్ముతాడు. ఆ తరవాత మొదటి రాత్రి గది లోకి మామగారు దూరతారు. వారం లో రోజులు ఆ భర్తలందరూ వంతులు వేసుకుంటారు. ఆ వంతుల లో వారానికి రెండు రోజులు మమగారివి కూడా.. టీనేజ్ పిల్ల ఈ విపరీతాలకు తట్టుకోలేకపోతుంది. ఆ అయిదుగురు కొడుకుల లో చిన్న వాడు (సుశాంత్) కాస్త మనిషి లాంటి వాడు. కల్కి తో దయ గా ఉంటాడు. అతని సాన్నిహిత్యం ఆమె కు ఊరట.



అతని తో ఆమె స్నేహం గా ఉండటం చూసి ఓర్వలేక అన్నలు అతనిని చంపేస్తారు. అప్పుడు కల్కి .. సొంత కొడుకు చనిపోయిన రాత్రే మామగారు తనమీద అత్యాచారం చేయటం భరించలేక తండ్రి కి ఆ విషయం చెప్తూ రక్షించమని ఉత్తరం రాస్తుంది. ఆ మహానుభావుడు.. మామగారి దగ్గరకొచ్చి.మాట్లాడి ఇంకో లక్ష తీసుకుని.. కల్కిని ఊరుకోమని బోధపరిచి వెళిపోతాడు. అపుడు కల్కి కి తండ్రి ఎంత దుర్మార్గుడో అర్ధం అవుతుంది. ఇంక ఎవరు రక్షించేది లేక ఆ పిల్ల పారిపోయే దారులు వెతుకుతుంది. ఆ ఇంట్లో పని చేసే ఒక నిమ్న జాతి పిల్ల వాడి సాయంతో పారిపోతుండగా భర్తలు వెంటపడి.. ఆ పిల్లాన్ని చంపి, కల్కి ని తీస్కొచ్చి పశువుల కొట్టం లో గొలుసులతో కట్టి పడేస్తారు.



గ్రామంలో కుల వైషమ్యాలు ప్రజ్వరిల్లి.. నిమ్న జాతి పని పిల్ల వాడి బంధువులు అసహాయమ్గా పశువుల కొట్టం లో పడి ఉన్న కల్కిని (ఉన్నత జాతివారి( ఠాకూర్ మహిళను కిన్చపరచటం కోసం) బలత్కరిస్తారు. నెలల తరబడి ఈ అత్యాచారాలు, భార్తలూ, మామగారూ.. పిల్లవాడి బంధువులూ .. అంతా ఈ పిల్ల మీద అత్యాచారం చేస్తూ ఉండగా ఇంట్లో కి ఇంకొక పిల్ల వాడు పని లో చేరతాడు. గొలుసులతో కట్టేసి.. పడి వున్న ఈ కల్కి కి రోజు పాలో, రొట్టేలో ఇచ్చి ప్రాణాలు నిలిపేది ఆ పిల్లాడే. కొన్నాళ్ళకు కల్కి గర్భవతి అవుతుంది. ఆ పుట్టబోయే శిశువు కు తానూ తండ్రి అంటే తానూ అని గ్రామస్తులూ (పాత పని పిల్లాడి బంధువులు.. ఎవరైతే కల్కి ని చరచారో వారు), ఇంట్లో వారూ వాడులాడుకుంటారు.



వంశం అన్న మాట వచ్చేసరికీ జనం ఆ స్త్రీ మీద హక్కుల గురించి పోరాడుకుంటారు. సంతానం తమదంటే తమదని వాదించుకుంటారు. ఆ సన్నివేశం చూడాలంటే.. గుండె బలం కావాలి. ప్రజల desperation చూసి 'నిజమే! ఇలా కూడా జరగొచ్చు' అనిపిస్తుంది.



పెద్దాయన కల్కిని డబ్బిచ్చి కొన్నాడు కద! తమ కొడుకులకో తనకో తప్ప కల్కి వేరే వారి సంతానాన్ని కంటే తనకు నష్టం కదా.. అందుకే ఆ సంతానం తనదే అని ప్రకటించి.. కల్కి ని కనికరించి పురిటి సమయానికి ఇంట్లోకి తీసుకొస్తారు. అయితె అప్పుడు మామగారి క్రూరత్వం బయటపడి.. అగ్రజాతి వారి నిమ్నత్వం మీద గ్రామంలో గొడవలు మొదలుతాయి. తుపాకీ పట్టుకుని బయల్దేరిన నలుగురు కొడుకుల్నీ గ్రామస్తులు చంపేస్తారు. కల్కి ని బలత్కరించిన నిమ్న జాతి వాళ్ళూ ఆ గొడవల్లో చనిపోతారు. ఈ చావుల కు కారణం నువ్వే అంటూ కల్కి ని మామ గారు చంపబోతుండగా.. కొత్త పని పిల్లాడు ఆయన్నే చంపేస్తాడు. కల్కి కి ఆడపిల్ల పుడుతుంది. కొన్ని తరాల తరవాత ఆ గ్రామంలో ఆడపిల్ల పుడుతుంది. ఆ పిల్లను చూసి కల్కి మధురంగా నవ్వటం తో సినెమా ముగుస్తుంది.
ఈ సినెమా చూసినంత సేపు ఆ ఘోర కలి ని చూసి .. వళ్ళు గగుర్పొడిచింది. సినెమా లో మంచి పట్టు ఉంది. నాకు టెక్నికల్ గా చెప్పడం తెలియలేదు. కానీ ఇలాంటి పరిస్తితి వస్తె.. మగవాళ్ళూ.. ఆడవాళ్ళూ కూడా అలాంటి నరకాన్ని తట్టుకోలేరు. సెక్స్ మాత్రమే కాకుండా స్త్రీ మగవాడికి చాలా అవసరాలకు పనికొస్తుంది. ఇంటి పని, వంట పని చెయ్యడానికీ, పిల్లలను కని పెంచడానికీ.. ఇలా ఈ లెక్కలు కట్టి ఠాకూర్ కల్కి ని కొన్నా ఇవి నిజంగానే నిజాలు కదా! స్త్రీ లేక పొతే.. మిగతా పనులు జరిగి పోయినా వంశం మాత్రం పెరగదు కదా! అందుకే స్త్రీ కి అంత డిమాండ్. (కధ కాలానికి ఆమె కేవలం ఒక వస్తువు కదా) ఈ నిజం మన కళ్ళ కు కట్టే పని లో మనీష్ ఝా సఫలీకృతం అయ్యారు.



ఈ సినీమాలో కల్కి కి పెళ్లి జరిగే సన్నివేశం నుంచీ దాదాపు అన్ని సన్నివేశాల్లోనూ ఆమె 'ఇదేమిటి' అని ప్రస్నించదు. తన మీద రక రకాలుగా, వికృతంగా జరుగుతున్న అత్యాచారాల సన్నివేశాల లోనూ తిరగబడదు. మౌనంగా, దీనంగా, 'ఇదే నా ప్రాప్తం!' అనుకునేలా కనిపిస్తుంది. ఆఖరికి అయిదవ భర్తా, తన స్నేహితుడు అయిన అబ్బాయి హత్య కు గురయ్యాక... విపరీతమైన షాక్ లో ఉన్నా, మామగారు గది లో కి రావటం చూసి బెదిరిపోయినా.. వ్యతిరేకించలేని నిస్సహాయ స్థితి లో ఉంటుంది. అపుడు నాకు అమె పాత్ర ప్రవర్తన.. పూర్తి లోంగుపాటు.. ఆశ్చర్యం కలిగించినా.. అప్పటి పరిస్థితులకు స్త్రీ ల ముందు కూడా ఎటువంటి ఆప్షన్స్ మిగలక.. ఒక కొత్త సామాజిక న్యాయం మొదలుతుందేమో అని అనిపించింది. అపుడు స్త్రీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చూసాక ఎ స్త్రీ లెదా పురుషుడు ఆడ పిల్లల భ్రూణ హత్య చేయ్యరేమో అని దర్శకుడు ఆశ పడ్డట్టు ఉంటుంది సినిమా.


ఈ సినిమా చూసాక ఒక వారం వరకూ నా మనసు నుంచీ ఆ భావాల తీక్ష్ణత తొలగిపోలేక పోయింది. ఈ సినెమా ఫక్తు sexist సినిమా అయి ఉండొచ్చు. కానీ ఆ సినెమా చెప్పదలచుకున్నది మాత్రం చెప్పగలిగింది. పరిస్థితి తీవ్రత ని ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలూ గుర్తించి దానికి తగిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రజల లో ఆ చైతన్యం తీసుకు రాకపోతే.. ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రజలను మన మాతృభూమి లో.. మాత (స్త్రీ) లేక పొతే ఇంక జననాలేవి, వంశం ఏది, వంసోద్ధారణ ఏది ? మాత లేక పొతే మతం ఏది, సమాజం ఎక్కడ ? స్త్రీ ని చంపుతున్నారంటే ఒక 'మాత' ని చంపుతున్నట్టే. స్త్రీ జీవితం కేవలం పిల్లలు కనటానికే కాడు. కానీ స్త్రీ లేక పొతే... పిల్లలూ లేరు, మన జాతికి భవిష్యత్తూ లేదు. ఆడ పిల్లలను ఎ కారణం వల్ల చంపుతున్నామో ఆ కారణాలను మట్టుపెట్టాలి. లేకపొతే.. మనమే నాశనం అయిపోతాం అని చాల చక్కగా చెప్పారు 'ఝా'.



ఈ సినెమా ఇంకో సారి చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. కానీ మంచి ప్రయత్నం అనిపించింది. నటులంతా.. పేరున్న వారే. హిందీ, భోజపురీ సినీ నాటక రంగాల లో తారలే. వీళ్ళంతా ఈ సినెమా లో ఎందుకు / ఎలా నటించారా ?! అని అనిపిస్తూంటుంది. కానీ వాళ్లు నటించకపోయుంటే, వెంటనే ఛానెల్ తిప్పేసే దాన్ని. త్యులిప్ కు ఎక్కువ సంభాషణలు లేవు. ఆమె నటన లో ఎంతొ పరిపక్వత. ఈ నటులూ, ఈ దర్శకుడు.. హీరో లేని, డిషూం డిషూం లు లేని.. పాటలు లేని.. సంగీతం లేని ఈ సినెమా.. కధ కూడా భయంకరమైనది.. కానీ ముగింపు దాక కదలకుండా చూసేలా చేసిన సినిమా గురించి ఇక్కడ ఎవరైనా చదివి.. 'నవతరంగం' లాంటి పెద్ద వేదికల మీద రాస్తారేమో అని ఆశిస్తున్నా.