Pages

26/10/2025

శీలా వీర్రాజు శిల్పరేఖలు








శీలా వీర్రాజుగారి శిల్పరేఖలు - పుస్తకాన్ని ఆయన శ్రీమతి సుభద్రాదేవి గారు ప్రచురిస్తూ ముందుమాటలో చమత్కారంగా ఇలా రాసారు. 




ఇది వీర్రాజు గారి స్కెచ్ పుస్తకం.  ఆయన ఎన్నో సందర్భాలలో వివిధ ఆలయాలలో గీసుకున్న బొమ్మలు, వాటి గురించి వివరాల సంకలనం.  అంతేకాకుండా ఈ పుస్తకం ఆయన కుటుంబ సభ్యులు, తెలుగు వారికి ఇచ్చిన కానుక.  

వీర్రాజు గారి పరిచయం, ఆయన వ్యాసాలు, స్కెచ్ ల తో చాలా క్రిస్ప్ గా తీసుకొచ్చిన పుస్తకం.  ఇందులో ముఖ్యంగా,  లేపాక్షి గురించి ఆయన రాసిన వ్యాసాలను చదివి, ఎప్పటికన్నా లేపాక్షి చూడగలనా, అని బెంగ పడ్డాను.  ఈ పుస్తకం, ఆయన వివిధ సందర్భాలలో మందిరాలకు వెళ్ళినపుడు దేవుడినీ, మతాన్నీ పట్టించుకోకుండా ఆయా ప్రదేశాలలో శిల్ప కళనీ, చిత్ర కళనీ చూసి మైమరిచి,  రసాస్వాదనలో మత్తుడై, తనకు వీలున్నంత సమయంలో, గబగబా వేసుకున్న చిత్తు స్కెచ్ లు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో వాటిలో ఆయన చొప్పించిన సమాచారం, ఆయా ప్రాంతాల శిల్ప కళ పట్ల, అక్కడ ఉపయోగించిన రాతి పట్లా ఆయనకు ఉన్న అవగాహన వల్ల, సహజంగా చిత్రకారుడవడాన అబ్బిన పరిశీలనా శక్తి వల్ల ఈ స్కెచ్ లను చూస్తే ఆయా శిల్పాల వెనుక కథలు, మామూలు మనిషికి కూడా అర్ధమవుతాయి.  మనం కూడా ఈ మధ్య చాలా దేవాలయాలను ఆయా ప్రాంతాలకు వెళ్ళి చూడొచ్చు గాక. ఎవరో గైడ్ / పూజారిని అడిగి తెలుసుకుని వాటి చరిత్రని తెలుసుకునే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నాం ? చేసినా ఆయా ప్రాంతాలను ఏ యునెస్కో నో గుర్తిస్తే గానీ వాటికి గొప్పతనం ఆపాదించని జడులం మనం. 




వీర్రాజు గారికి లేపాక్షి అంటే ఉన్న అభిమానం గొప్పది.  "మన రాష్ట్రం వారికి లేపాక్షి గొప్పదనం ఇపుడిపుడే కొద్దో గొప్పో తెలిసుండొచ్చు.  లేపాక్షి బసవయ్య పేరు మాత్రమే తెలుసు. అదీ - అడవి బాపిరాజు "లేపాక్షి బసవయ్య లేచి రావయ్య" అంటూ రాసిన గేయం రేడియోలో అపుడపుడూ వినిపిస్తూ ఉండేది గనుక" - అంటారు ఆయన.  లేపాక్షి నోటు పుస్తకాల కాలమూ అంతరించింది. 

అయితే ఈ పుస్తకం లో అచ్చయిన లేపాక్షి బసవన్న ఈ క్షణమే లేస్తాడా అని ఉన్నా, దానిని ఇంకా గ్రాండ్ గా ప్రచురించాలంటే, ఒకే పేజీ లో ప్రింట్ చేసుండాల్సిందేమో.  

వీర్రాజుగారి "లేపాక్షి"  వ్యాసం, చాలా బావుంది.  ఈ ఆలయం ప్రభుత్వాల నిర్లక్షంతో శిధిలావస్థ కు చేరుకుంది. గోడలు పొగచూరిపోయి కుడ్య చిత్రాలు (గోడలపై వేసిన పురాతన చిత్రాలు) పాడైపోయాయి. గోడలు పడిపోయి, రాళ్ళు ఊడిపోయీ, శిల్పాలు దెబ్బతినీ, సరైన ఆలనా పాలనా లేకుండా ఉన్నపుడు దాన్ని వెలుగులోకి తెచ్చి  సంరక్షణకు పాటుపడ్డ 'కల్లూరి సుబ్బారావు ' గారి ఆహ్వానం మీద వీరాజు గారు లేపాక్షి వెళ్ళడం జరిగింది.  లేపాక్షిని కాపాడడానికి ప్రయత్నాలు జరిగాయి.  ఇపుడు ఎలా ఉందో తెలీదు. విజయనగర కాలం నాటి మన లేపాక్షి కి, హంపి కి ఉన్న ప్రాభవం అయితే ఇపుడు లేదు.  ఈ పుస్తకం చదివితే, ఆయన రాసిన వ్యాసాలు చదివితే, వెళ్ళి చూడాలన్న ఆత్రం కలుగుతుంది. ఇంత గొప్ప సంపదని మనం చేజేతులారా పాడు చేసుకుంటున్నామా అని బాధ కలుగుతుంది.  







ఆయన రకరకాల ప్రాంతాలలో గీసుకున్న స్కెచ్ లు కొన్ని ఇవి:- 






















ఈ పుస్తకం లో లేపాక్షి, అజంతా, ఎల్లోరా, రామప్ప, కోణార్క్ దేవాలయాల లో శిల్పాల స్కెచ్ ల‌ తో పాటు  తో పాటు, వివిధ ఆలయాలు, స్తూపాల, గోల్కొండ కోట వగైరాల స్కెచ్ లు ఎన్నో ఉన్నాయి. నేను, ఇక్కడ పెట్టిన ఫోటోలు ఈ పుస్తకం గొప్పదనాన్ని చెప్పేందుకు మాత్రమే.   స్కెచింగ్ అంటే ఆసక్తి ఉన్నా, తెలుగు ఆలయాల శిల్పాల గురించి అవగాహన పెంచుకోవలాన్నా ఇదో రిఫరెన్స్ గా పనికొస్తుంది. అభ్యంతరాలు ఉంటే ఫొటో లు తీసేస్తాను.   

వీటిలో పరిమితంగా ఉన్న మెటీరియల్ తోనూ, చాలీ చాలని సమయం తోనూ, సర్దుకుని గీసిన బొమ్మలు కూడా ఉన్నాయి.  పరిమిత వ్యాసాలు ఈ పుస్తకానికి ఇంకా వన్నె తెచ్చాయి.

వీర్రాజు గారు చిత్రకారుని గా ప్రసిద్ధులు. హైదరాబాదు, బెంగుళూరు, వివిధ పట్టణాలలో,  జెర్మనీ లలో ప్రదర్శనలు జరిపారు.  తన జీవితకాలంలో వేసిన తైలవర్ణ, నీటి రంగుల చిత్రాలను తను  చదువుకున్న రాజమండ్రి "దామెర్ల రామారావు చిత్రకళానికేతన్" కు ఇచ్చేసారు. 

ఆయన జ్ఞాపకంగా ఇంతకుముందు పుస్తకాలుగా ప్రచురించబడిన ఆయన స్కెచ్ పుస్తకాలకు మరిన్ని స్కెచ్ లు జోడించి, ఆయన భార్య, పిల్లలు ఎంతో ప్రేమతో ప్రచురించిన ఈ పుస్తకం, ఆర్టిస్ట్ అన్వర్ గారి పుణ్యాన కొనుక్కోగలిగాను. ఈ పుస్తకాన్ని పంపించినపుడు సుభద్రా దేవి గారు స్వయంగా కాల్ చేసి, పూర్తిగా అపరిచితమైన నాతో ఈ పుస్తకం గురించి ప్రేమగా కనుక్కోవడం మర్చిపోలేను. గొప్ప మనుషులకు వారి సౌమ్యమైన ప్రవర్తన, ఇంకా మంచిపేరు తీసుకొస్తుంది.  భువనేశ్వరం, కోణార్క్ వగైరాలు చూసినా, లేపాక్షి, రామప్ప గుడి, నేను చూడలేదు. చూడగలనన్న ఆశ కూడా లేదు. ఈ పుస్తకం కలిగించిన ఆసక్తి, రసానుభూతి ఈ జీవితానికి సరిపోవచ్చు.  

పరిమిత సంఖ్యలో ముద్రించిన ఈ పుస్తకం, తెలుగు శిల్పకారులని, చిత్రకారులనీ, ప్రస్తావిస్తూ, లేపాక్షి లో అత్భుతమైన కళని మనం కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్తుంది. ఇప్పుడు లేపాక్షి ఎలా ఉందో, ఆ కళా ఖండాలని శాస్త్రీయంగా రక్షించే చర్యలు ఏమైనా చేపట్టారో నాకు తెలీదు. రామప్ప గుడినో, వేయి స్తంభాల గుడినో తెలంగాణా జిల్లాల అధికారులు ఎలా సాంస్కృతిక చిహ్నాలుగా కాపాడుకున్నారో, లేపాక్షి ని కూడా ఎవరన్నా అలా రక్షించాలని కోరుకుంటున్నా.   ప్రస్తుతానికి ఈ పుస్తకం,  లేపాక్షి పట్ల,  స్కెచ్ ల ద్వారా, ఓ కళాకారుడు డాక్యుమెంట్ చేసిన అసమానమయిన ప్రేమ.  బాటన్ ని ఇంకెవరు అందుకుంటారో చూడాలి. 

***
Good Words Good Thoughts Good Deeds