Pages

05/11/2025

The Boy, the Mole, the Fox and the Horse - Charlie Mackesy



ఎపుడైనా ఓ ప్రసిద్ధ రచయిత పుస్తకం విడుదలయినపుడు, మార్కెటింగ్ వ్యూహాకర్తలు తన వార్తల్ని అన్ని సామాజిక మాధ్యమాలలోనూ విరజిమ్ముతారు కదా. ఇపుడు  మాకెసీ "Always Remember The Boy, the Mole, the Fox and the Horse" పుస్తకం విడుదల సందర్భంగా  బిజీ జీవితాల్లో పడి ఈ 'అబ్బాయి' ని మర్చిపోయిన వాళ్ళందరి జ్ఞాపకాలనూ తట్టి లేపేందుకు అతని ఇంటర్వ్యూలు సోషల్ మీడియా లో బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం/Motivation గురించి చేసే మార్కెటింగ్ చాలా ఉధృతం అయిపోతున్న ఈ రోజుల్లో, అలాంటి ఇంకో పుస్తకం రావడం వింత కాదు.  కానీ మొదట lockdown sensation గా వచ్చిన ఈ పుస్తకం ఎందుకు స్వీటో రాస్తున్నాను. 

 

ఒక ఇంటర్వ్యూ లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ఓ ప్రశ్న "ఓ రచయిత గా మీ సృజన వల్ల, ఎవరికైనా ఉపయోగం కలిగి, వాళ్ళు దానిని మీ దృష్టికి తీసుకురావడం జరిగిందా ?"   అని అడిగారు. దానికి ఆయన, ఈ "The Boy, the Mole, the Fox and the Horse" పుస్తకం చదివి, అప్పటికి మానసికంగా కృంగిపోయి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి, ఆ ప్రయత్నం మాని, జీవితం పట్ల ఆశావహ దృక్పథం అలవరచుకున్నానని చెప్పినపుడు, తన పుస్తకం తనకి తృప్తి కలిగించిందని చెప్పాడు.

 

చార్లీ మేకసే ఓ ప్రఖ్యాత బొమ్మల రచయిత. నీటి రంగులూ, ఇంక్ తో వేసే ఆయన బొమ్మలు బ్రిటన్ లో అందరికీ ఆయనను ఇష్టుడిని చేసాయి. బేర్ గ్రిల్స్ అతని ప్రాణ స్నేహితుడు. కాబట్టి వైల్డ్ లో ఆరాముగా తిరిగే ప్రాణుల గురించి అవగాహన ఉన్నవాడే అనుకోవచ్చు.   ముఖ్యంగా ఈ పుస్తకం లో ఆయన సృష్టించిన పాత్రలు - 'అబ్బాయి', 'జంతువులూ', ఎంతో సహృదయతతో, మానవత్వం తో, దయతో, స్నేహంతో మెలుగుతూ, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పే ధైర్యాన్ని ఇస్తాయి.  ఈ పుస్తకం, ఎన్నో ఆత్మహత్యలని ఆపింది. ఆత్మహత్య అంటే, భౌతిక మరణమే కాదు. మానసిక మరణం కూడా.  దాని నుంచీ ఎందరినో చిన్న చిన్న పదాలతో, బుజ్జి స్కెచ్ లతో, కరుణతో కూడిన బోధపరుపులతో, అచ్చు, కధలు బెంగపడిన పిల్లల్ని లాలించినట్టు, ఈ తలా తోకా లేని కథ, అన్ని వయసుల వాళ్ళనీ లాలించింది.

 


జీవితానికి అర్ధం ఏమిటి, పరమార్ధం ఏమిటి, ఈ కష్టాలేంటి, వీటిని ఎలా ఈదాలి అని బెంగపడే మామూలు మనుషుల వెన్ను తట్టింది.  మన మన ఒంటరి జీవితాలలో, మనకి సాయం చేసేవాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు. అసలు సాయం అడిగే ధైర్యం కూడా చెయ్యం. చాలా సార్లు కుమిలిపోతూ ఈదుతూ ఉంటాము. లేదా ఈదటం ఆపేస్తాం. దీనిని ఎదుర్కోవడానికి ఒకప్పుడుండే సపోర్ట్ సిస్టం / పెద్ద కుటుంబాలో, పెద్ద వాళ్ళో, స్నేహితులో చాలామందికి  ఇపుడు ఉండకపోవచ్చు.   ఉన్నా, అహం అన్నిటినీ కప్పి పెట్టేసి, మన కళ్ళు కూడా  గప్పి మనకే ప్రమాదకరంగా తయారవచ్చు.  స్నేహితులున్నా, వాళ్ళతో మాటాడే తీరికా, ధైర్యమూ కూడా మనకు ఉండకపోవచ్చు.  అసలు మన గోడు వినే తోడు ఉండటం  కూడా అత్భుతమే జీవితంలో. ఆ అత్భుతాలలో పుస్తకాలు కూడా ఉంటాయి. చాలా సార్లు సాహిత్యం, బ్రతకడానికి చాలా తోడొస్తుంది. లోకం చూపిస్తుంది. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్తుంది. ఏ పనికైనా ఎలాంటి ఫలితాలుంటాయో చెప్తుంది. 

సరిగ్గా ఇలాంటి కారణాల వల్ల ఈ పుస్తకం సూపర్ హిట్ అయింది.  కరోనా రోజుల్లో ఈ స్కెచ్ లు ఇన్స్టాగ్రామ్ లో కనిపించాయి.  పుస్తకం లో ఏమీ ఉండదు. కధేమీ లేదు. ఓ ఒంటరి గా ఫీలయే చిన్న బాబు, అడవిలో మొదట మోల్ అనే ఓ బొరియల్లో ఉండే పెద్ద ఎలుక లాంటి జంతువు ని కలుస్తాడు. వాళ్ళిద్దరూ మాటాడుకుంటూ ముందుకు పోతూండగా, వాళ్ళని ఓ నక్క, తరవాత ఓ గుర్రమూ కలుస్తాయి. నలుగురూ కబుర్లు చెప్పుకుంటారు. స్నేహం చేస్తారు. ఆశ నిరాశల గురించి, ప్రేమ, స్నేహం గురించి మాటాడుకుంటారు. అంతే. అయితే ఆ మాటలవీ హాస్యంగా, భావస్ఫోరకంగా, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ, పాఠకుడిని అబ్బురం వైపో, ఆశావహ దృక్పధం వైపుకో మళ్ళిస్తాయి. ఇంతే.

 

కథ నిండా అడుగడుగునా బొమ్మలు. అవే ఆత్మ, ఆకర్షణానూ.  పుస్తకం 2019 లో  విడుదలయింది. అప్పటికే ఎన్నో పెద్ద పత్రికలలో పని చేసిన రచయిత ఎంతో పేరు పొందినవాడు. ఈ పుస్తకం మాత్రం ఆ పేరుని ఇంకాస్త సుడి తిప్పింది. పుస్తకం మొదట గొప్ప బొమ్మల పుస్తకంగానూ, తరవాత గొప్ప పుస్తకంగానూ ఎవార్డులు గెలుచుకుంది.  ఏనిమేట్ అయి సినిమాగా వచ్చింది. పోస్టర్లు గా విడుదలయింది. సోషల్ మీడియా లో  హోరెత్తింది. ఎక్కడో  అడవుల్లో తిరిగిన ఈ పిల్లవాడూ, ఎలుకా, నక్కా, గుర్రమూ చాలా పేరు గడించాయి.  Motivational ధర్మ సూక్ష్మాలు చెప్పాయి.  డాక్యుమెంటరీలలో కనిపించాయి. ఏనిమేలో  ఆస్కార్ గెలుచుకున్నాయి

 

జీవితాన్ని లైట్ గా ఎపుడు తీసుకోవాలో, సీరియస్ గా ఎలా తీసుకోవాలో మనకి తెలీదు. ఒక రుషో, రచయితో చెప్పేస్తే మారిపోము కూడా. రీల్ పైకి జరిపేసినట్టు మంచి సలహాల్ని పెడ చెవిన పెట్టి,  బ్రతకడం లో అందాన్ని మర్చిపోతాం. అన్నిటికీ పరిష్కారం "కరుణ" లోనే ఉంది. మన పట్ల మనకీ, మన చుట్టుపక్కల వాళ్ళ పట్లా ఆ 'కరుణ', 'దయ', ఉంటే చాలు. ఆనందం దానికదే వస్తుంది. ఇదే సీక్రెట్. ఆ మంచి మాట కోసం లోకం ఎంత వెతుకుతుందో, ఈ పుస్తకం సేల్స్ చెప్తాయి.  ఏ ధర్మమైనా, మతమైనా, చెప్పే సూత్రం ఇదే. ఇంతకు మించి ఏదీ లేదు.


నేను చాలా చాలా డిప్రెస్ అయిన ఓ సందర్భంలో నా బాల్య స్నేహితురాలు ఫోన్ లో చాలా ధైర్య వచనాలు చెప్తూండేది.  ఆమె ద్వారా నాకు వంటబట్టిన తెలుగు స్లోగన్ - "ఏమో గుర్రం ఎగరావచ్చు". దీని వెనక ఓ కథ కూడా ఉంటుంది. ఆ గుర్రం ఎగరగలగడం మళ్ళీ ఈ పుస్తకం లో చూసాను. పాపం గుర్రానికి ఎగరడం వచ్చు.  ఎగరాలన్న కోరికా ఉంటుంది. కానీ దాన్ని ఆపుకుంటుంది. వీళ్ళు - స్నేహితులు ఆ ముక్క విని 'ఎగురూ', 'ఎగురూ...' అని ఎగదోయరు. నీ ఇష్టం ఉంటే ఎగురు లేకుంటే లేదు గానీ -    నువ్వు ఎగిరినా, ఎగరకపోయినా నిన్ను మేము ఒకేలా ప్రేమిస్తాం అని చెప్తారు.  అది గుండెల్లో ఎంతో స్ట్రెస్స్ ని తీసివేసి, తేలిక చేసేస్తుంది కదూ. అదే కదా మనకి కావల్సింది.  అదో టచింగ్ సందర్భం.   అలానే  ఇంకో ఆనందకరంగా వాడిన సాధనం  -  'కేక్'. మన ఆనందాన్ని దేనికో ముడివేయడం తప్పే ! కానీ కొన్ని ముడివేతల్లో హాస్యం కూడా ఉంటుంది. వీలుంటే చదవండి. 







***

The story : https://medium.com/@curiouslearner2007/summary-of-the-best-small-book-3dd05049b976

###

On Instagram : https://www.instagram.com/reel/CxIiRiooIjs/

About the Author : https://en.wikipedia.org/wiki/Charlie_Mackesy

From the movie clip

Interview

A quote 





From the new book: 


And the status of the author DTD 8/11/25.


No comments: