ఉరవిదంగళ్ (Malayalam) అనే తన 'ఆత్మ కథ' ని జెయమొహన్, 2011 లో ప్రచురించారు. అయితే ఎన్నో ఏళ్ళ తరవాత సంగీత దానిని "Of Men, Women and Witches " పేరుతో ఇంగ్లీషు లోకి అనువదించారు. చాలా ఆకర్షణీయంగా పిట్ట కథలూ, చమత్కారాలూ, కబుర్ల లాంటి కథలు చెప్తూ వాటి ని, వచనం తో నింపేసి, ఆసక్తిని పేని, దాంతో చదువర్లను కట్టిపడేసే కళ ఎరిగిన జెయ మోహన్ ఆత్మ కథ ఇది. దీన్నిండా ఆడవాళ్ళే. మనిషిని షేప్ చేసే, తల్లి, భార్య, పిల్లలూ, నాయనమ్మలూ, తానెరిగిన ఇరుగుపొరుగు అమ్మాయిలూ, జీవన ప్రయాణంలో తారసిల్లిన మహిళలు, కొద్దో గొప్పో అతిలోక సుందరీమణులు, అలౌకిక శక్తులు ఉన్న యక్షిణులూ నూ.
మనూ పిళ్ళై వంటి హిస్టారియన్ లు ఎలా కేరళ చరిత్రని, అక్కడి మాతృస్వామ్య వ్యవస్థనీ, elaborate గా చర్చిస్తారో అలా జెయ మోహన్ కూడా కేరళ చరిత్ర ని చెప్తూ, అక్కడున్న కులాలూ, కులాలలో నడిచే practices, మాతృస్వామ్య వ్యవస్థని వివరిస్తారు. అసలు స్త్రీలు కేరళ సమాజంలో, ఎంత ప్రధాన పాత్ర పోషించారో, వారికున్న ఆర్ధిక, రాజకీయ, లైంగిక స్వాతంత్ర్యం, అధికారం, గౌరవం - ఇపుడు అది కనుమరుగైన క్రమం, మెల్లగా మారిన కేరళ సమాజం, కరిగిన మాతృస్వామ్యం, వేళ్ళూనిన పితృస్వామ్య వ్యవస్థ, ఆడవారి జీవితం ఎలా పంజరం లోకి వెళిపోయిందో ఒక మళయాళీ గా తన గమనింపులోకి వచ్చిన విషయాలు రాసుకున్నారు. ఒరిజినల్ లో కేవలం 142 పేజీలున్న పుస్తకం లో ఒక వరద ప్రవాహం లాంటి వరుస కనిపిస్తుంది. అదెలాగంటే కేవలం నాలుగు చాప్టర్లలో జెయమొహన్, తన తల్లితండ్రుల మధ్య అగాధాన్ని, తల్లినీ, తండ్రినీ, వారి వ్యక్తిత్వాలనీ విడివిడిగా పరిచయం చేస్తూ, తన తోబుట్టువులనీ, ముఖ్యంగా తమ వంశం లో పెద్దదయిన నాయనమ్మ జీవితాన్నీ పరిచయం చేస్తారు. అదంతా చదివాక, ఆయన భార్యతో తనకు జరిగిన ప్రేమ వివాహం గురించి చదివి ముచ్చటేస్తుంది. భార్యంటే తనకున్న ప్రేమ ని ఎంత చక్కగానో వ్యక్తపరుస్తారు. తరవాత ప్రధాన పాత్రలు, కేరళ లో రచయిత ఎరిగిన యక్షిణులు - వారి కథలు. వీటిని ఎలా కలిపి ఒక గ్రంథం గా మారుస్తారు? ఎలా ఈ కథల్ని, తన జీవితానుభవాలుగా చెప్పుకున్నారు - అది చదవాలి.
జెయమోహన్ ప్రధానంగా మళయాళీ. తల్లి "వైశాలం" చాలా అందగత్తె, చదువుకున్నది. ఆరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఉందన్న కారణం చేత, అంత అందంగా ఉండని ఒక 'నాయర్ ' ని ఇచ్చి పెళ్ళి చేస్తారు. ఇతనికి విపరీతమైన కోపం, అందమైన ముగ్ధ "వైశాలం' ను, సహజంగా చాలా అభిమానవతి, సాహిత్యాభిమానీ, చదువుకున్నది, అయిన వైశాలం ని, అస్తమానం (జెయమొహన్ తల్లి).. చావగొడుతూ, అవమానిస్తూ, బూతులు తిడుతూ ఆమె ఆత్మని నిత్యమూ హత్య చేస్తూ ఉంటాడు. ముగ్గురు పిల్లలు వాళ్ళకి. మధ్యలో కొన్నాళ్ళు అతని హింసకు బాగా అభిమానపడి అతనితో విడిపోయినా, పరిస్థితులకు లొంగి, ఆయనతోనే ఉండడానికి వచ్చేస్తుందావిడ. పుట్టింటి గడప మరి తొక్కదు.
జెయమోహన్ అనారోగ్యంతో బాధపడే పిల్లాడు. తండ్రి కి చూస్తే ముక్కు మీద కోపం!! అయినా ఆ కాఠిన్యం తో పాటూ తండ్రికి కొడుకంటే ప్రేమా ఉంటుంది. భార్యన్నా ప్రేమ ఉంటుందేమో.. కానీ అతని లవ్ లేంగ్వేజ్ కేవలం అధికారం చలాయింపూ, కటువు మాటలూ, విసుగు చేతలూ. అయినా ఎక్కడో గుంభనమైన పితృప్రేమ కూడా దాచుకున్న ఆ తండ్రి చేతికింద పెరిగి, తండ్రిని కూడా ప్రేమించినా, అతనికన్నా తల్లి పై తీవ్రమైన ప్రేమ ని పెంచుకున్న కొడుకు గా, తన హృదయాన్నంతా పరచుతాడు రచయిత, ఒక చాప్టర్ లో.
నాయనమ్మ, నాయరు మహిళ. బోల్డంత ఆస్తి, భూమి, గుళ్ళు, చెరువుల ఓనరు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చాక, వైకోం సత్యాగ్రం అనంతరం, గుళ్ళూ, ఆస్తుల మీద పట్టు పోతుంది. దున్నిన వాడిదే భూమి అని లాండ్ సీలింగ్ చట్టాలొచ్చాక, ఆవిడ పీకల్లోతు వ్యాజ్యాలలో కూరుకుపోతుంది. చిన్న కులాల వారు ఆవిడ తోటల్నీ, పొలాలనీ కౌలుకు తీసుకుని, పరిస్థితులు మారాక, వాటికి యజమానులు అవుతారు. ఆవిడ చేతుల్లో హస్తభూషణంగా, ఎప్పుడూ కోర్టు కాయితాలున్న ఓ తోలు సంచీ!! చిన్న చిన్న వాటికే, అమాయకంగా, ఆగ్రహానికి ఆవేశానికీ లోనై, నిస్సహాయత తో, లాయర్లకు ఎకరాలకెకరాలు రాసేస్తూ చాలా భూమిని పోగొట్టుకునేస్తుంది. కేసులూ ఓడిపోతూంటుంది. ఆవిడ పోయాక కొన్ని కేసుల్లో తీర్పులు వీళ్ళుకు అనుకూలంగా వచ్చినా, వివిధ కారణాల వల్ల వీరి కుటుంబం ఇక ఆ ఆస్తులను తిరిగి క్లెయిమ్ చేసుకోదు.
ఒకప్పుడు నాయరు మహిళల పెళ్ళిళ్ళలో బోల్డు స్వతంత్రం మహిళలకి. అలా జెయమోహన్ నాయనమ్మ కు ముగ్గురికి మించి భర్తలు. ఆమె చదువు, పాండిత్యానికి సాటిరాని భర్తలు. ఆమె ఇంటిని కొడుకు, కోపంతో విడిచిపెట్టేనాటికి, ఆమె, తన కొత్త భర్తతో పడకగదిలో నిద్రించి ఉంటుంది. ఆ తల్లంటే కొడుక్కి ఎక్కళ్ళేని కోపం. ఇంత ఆస్తి ఉన్నా, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి, రోడ్డున పడి, ఎలానో జీవితం మొదలుపెట్టి, నిలదొక్కుకుని, ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాడు. వైశాలం తో పెళ్ళవుతుంది.
కొన్నాళ్ళకి నాయనమ్మ పోతుంది. తల్లి ఉరిపోసుకుంటుంది. తండ్రి కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. జీవితం అతలాకుతలం అవుతుంది. ఉక్కు పాదంతో జీవితాన్నేలిన తండ్రి కాఠిన్యం వెనుక కండిషనింగ్, నాయనమ్మ ఆత్మగౌరవ పోరాటం, తల్లి పడిన బాధలూ - అర్ధం అయినట్టు, భార్యని మాత్రం ప్రాణ సమానంగా ప్రేమిస్తాడు. సాధారణంగా, కఠినమైన బాల్యం ఉన్న మగవాళ్ళు పెళ్ళాలని ఆదరంగా చూస్తారా ? కానీ జెయమొహన్, భార్య అరుణ్మోళిని చూసుకునే పద్ధతీ, ఆమెని తలమునకలుగా ప్రేమిస్తున్నానూ.. ఆమె లేకుండా ఉండనే లేనూ అని ప్రకటించుకోవడమూ, అలా జీవించడమూ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. చాలా తక్కువమంది పిల్లలకు తల్లితండ్రుల మధ్య ఉన్న ప్రేమ, గౌరవాదరాలు ప్రత్యక్ష ఉదాహరణలు గా నిలుస్తాయి. ఇంటి నుండే, ఈ లోకం చాలా పాసిటివ్ గా, ప్రేమ మయంగా కూడా, ఉంటుందనే విషయం మనిషికి ప్రత్యక్షంగా తెలిస్తే కదా - అతను మంచి మనిషిగా పరిణామం చెందేది !!
తరవాత యక్షిణులు - ఇక్కడ నుండీ కథ కొత్త పుంతలు తొక్కుతుంది. బాడ్ పార్ట్ అంతా అయిపోయి కొత్త అధ్యాయం జీవితంలో మొదలైనట్టు. ఈ యక్షిణులకు కేరళ చరిత్ర లో కూడా పార్ట్ ఉంటుంది. ఎప్పటెప్పటివో కథలు, గాధలూనూ. కొందరు యక్షిణులు చెట్లను రక్షిస్తుంటారు. కొందరు యక్షిణులు అడవుల్లో పూజలందుకుంటారు. ఒకామె వేశ్యామాత. ఒకామె మదన మోహిని. ఒకామె బందిపోట్ల చేత హత్య కు గురైంది. కొందరు యక్షిణులు మార్తాండ వర్మ కేరళ ని జయించాక, యుద్ధంలో అమ్ముడుపోయిన బానిసలు. కేరళ రక్తంలో వివిద దేశాల డీ ఎన్ ఏ లు.. చరిత్ర. ప్రేమలు.. చరిత్రలు.
ఇదంతా ఇంత చిన్న పుస్తకం లో చొప్పించి, ధన ధనా చదివించే కళ జయమోహన్ మంత్ర దండానిది. శేఖర్ గుప్తా లాగా అరటి పండు వలిచే ప్రక్రియలో కథనం పక్కదారి పట్టకుండా, ఇంకా ఇంకా ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. ఉపకథలు, కొండలూ, కోనలూ, తుఫాన్లూ, నల్లని మబ్బులూ, చల్లని వానలూ, చిక్కటి గాలులూ పాఠకుడిని చుట్టుముట్టేస్తాయి. "మా ఊరిలా, మా ఊరలా.." అని నాస్టాల్జియా లో మునిగి తేలే కుర్రాడిలా ఆయన చెప్తూండగా మనమూ మన జ్ఞాపకాలలోకి పరుగుతులు తీస్తాము. అర్ధరాత్రి ఏ అతిథి గానో కొత్త ప్రదేశంలో పడుకుంటే, అందమైన అమ్మాయి 'సారె .. సారే' అంటూ పిలుస్తూ తలుపు తడుతుంది. అడవిలో సైకిల్ మీద పక్క గ్రామానికి ప్రయాణం అయిన పెద్ద మనిషిని ఓ మదన మోహన ఎత్తుకుపోతుంది. బీదరికం, దేశ దిమ్మరితనం, డిప్రెషన్ - భయానక జీవితానుభవాలూ, ఆయన కథలయ్యాయి. ప్రతీదీ విస్తృత పరిశీలన చేయటం, మనుషులని గుర్తు పెట్టుకోవడమూ వంంటి లక్షణాల వల్లే తనకు తారసిల్లిన ఎందరో మామూలుతనపు ముసుగేసుకున్న మహానుభావులని తన రచనలతో అందరికీ పరిచయం చేసారు రచయిత. అట్లాంటి వ్యక్తి కేరళా, తమిళ నాడు లో తమ జీవితాన్ని గురించి చెప్తూ - నంబూద్రిలూ, నాయనమ్మ తిట్లూ, అక్కడి నమ్మకాలూ, తిండి పదార్ధాలు, కషాయాలూ, కొరడా దెబ్బలూ, తిట్లూ, చండా వాద్యాలూ, కాలువల మీద పరిచే తాటి దూట వంతెనలూ, పడవ ప్రయాణాలూ, కథాకళి నడిచే రాత్రులూ అంటూ ఫ్లో తో చెప్తూ ఉంటే - ఇలా కొట్టుకెళిపోతూ ఉండడమే మనం చేయగలిగే పని. ఒకోసారి బోరు కూడా కొడుతుంది.. కానీ మనకి బేసిక్ గా, బ్రతకడానికి కాస్త గాసిప్‌కావాలి. చాలా సార్లు దాన్నే సాహిత్యం అంటాము. ఇది అలాంటి అందమయిన జీవన గాసిప్.
అయితే - ఇలా చదివి అలా వదిలేసే పుస్తకమైతే కాదు. పుస్తకం లో ప్రతి పాత్రా, ప్రతి ప్రస్తావనా, మనని వ్యక్తిగతంగా తాకుతాయి. ఉదాహరణకు వైశాలం, తన స్నేహితురాలి తో కలిసి అప్పట్లో పాపులరైన మళయాళ ప్రేమ సాహిత్యం చదువుతూ ఉండేది. ఆమె ప్రాణ స్నేహితురాలి భర్త, కేవలం, వాళ్ళ కులం లో చెల్లుతుంది కాబట్టి ఇంకో భార్యను పెళ్ళాడి ఇంటికి తెచ్చుకుంటాడు. గుమ్మంలో అతన్ని దండలతో చూడగానే ఈమె (మొదటి భార్య) మారుమాటాడకుండా పరిగెత్తి, పెరటి బావిలో దూకి చనిపోతుంది. ఆమె తల బావి గోడకి గుద్దుకోవడం వల్ల, నీటిలో పడే ముందరే తల పగిలి ఆమె వెంటనే చనిపోతుంది. ఈ ఆత్మహత్య కలిగించిన షాక్.. వైశాలం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ఆ చిన్న (!) ఇన్సిడెంట్ ని చదివిన మనం కూడా ఆ చావుని మర్చిపోలేం. ఆలోచిస్తాం. ఆ కొత్త భార్య రియాక్షన్ ఎలా ఉండి వుంతుంది. భర్త ఎంత గిల్ట్ ఫీలయి ఉంటాడు ? అసలు ఫీలయి ఉంటాడా ? దుర్మార్గుడిలానే ఉంటాడా ? ఇలా..
ఇలాంటి తీవ్రమైన ఇంపాక్ట్ దెబ్బల్ని చిన్నతనాన్నించీ తట్టుకుని, ఆ తరవాత, తలిదండ్రుల మరణానంతరం, ఇల్లు విడిచి, వీధిన పడి కొన్నాళ్ళు పరివ్రాజిక జీవితం గడిపాక, ఆ కాలంలో తెలుసుకున్న సత్యాలను క్రోడీకరించి, కథలు రాసినవాడు. కథల వల్లనే అరుణ్మోళి అనే ప్రియ సఖి దొరుకుతుంది. రాయటం - అతని వ్యక్తిత్వానికి ఓ అవసరం అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే, ఎన్నో విషయాలు అతనిలో తన్నుకొచ్చేస్తూ, గుర్తొచ్చేస్తూ ఉంటాయి. వాటిని చెప్పకుండా, ఎక్కడో ఒక చోట పొదగకుండా ఉండలేడు. తల్లి తో కలిసి పుస్తకాల గురించి చర్చించిన టీనేజర్.. జీవితంలో స్థిరపడ్డానని అనుకునే వేళ, ఆమె మరణం తరవాత పసివాడైపోతాడు. అదీ అతన్నుండీ పోదు. ఈ పుస్తకం ద్వారా, తన కుటుంబానికి, తన బాల్యానికీ, అప్పటి కేరళ రాజకీయ, సాంస్కృతిక వాతావరణానికీ నివాళులర్పించాడు.
పుస్తకం చాలా స్టిర్రింగ్ గా ఉంటుంది. ఆవేశం ఊపేస్తుంది. ఆ గోలలో పడి దీనిని 2025లో ఎడా పెడా అనువాదం కూడా చేసాను. దాని డ్రాఫ్ట్ చదివిన పెద్ద వారు దణ్ణం పెట్టారు. చాలా అసహ్యంగా చేసినట్టున్నాను. తెలుగైజ్ అయిన ఈ మళయాళం అసలు ఎప్పటికీ బయటికి వస్తుందని అనుకోను.
కానీ ఇంగ్లీషు లో ఓసారి చదవమని చెప్పేందుకు వెనకాడను. అనువాదం చాలా చాలా పోయెటిక్‌గా ఉంది. ఆ అమ్మాయి సంగీత ఎపుడైనా కనిపిస్తే ఆ చేతులని ఒకసారి కళ్ళకద్దుకోవాలని అనిపిస్తుంది. సామాన్యుడు కొనుక్కోగలిగే వెల లో దొరుకుతున్న ఒక మంచి పుస్తకం ఇది. ఇది ఒక తరం చరిత్ర. ఇప్పుడు చెట్లను, అడవుల్నీ కాపాడే యక్షిణులు లేరు. రేప్ కో హత్యకో గురయితే, యక్షిణి గా మారే ఆడవాళ్ళూ లేరు. మొగుడు తెలివితేటలు లేని దద్దమ్మ అని తేలితే, వాడి చెప్పులు గడపవతల పెట్టి ఒక్క ముక్క మాటాడకుండా తరిమేసే భార్యలూ లేరు. దెబ్బలాడుకోకుండా, అహంకారాలు బయట పెట్టుకోకుండా, చెప్పలేనంత ఏరొగెన్స్ తో తల్లితండ్రులనో, పెళ్ళాలనో, పిల్లలనో, భర్తలనో బాధపెట్టని మనుషులూ లేరు. సాంఘిక చరిత్ర ని ఇలా, విడమర్చి, ఆసక్తి కరంగా చెప్పే పెద్దవాళ్ళూ మనకు లేరు. కాబట్టి ఇదో చదివితెలుసుకోవాల్సిన కాలం కథ. కాలక్షేపపు ప్రేమలేఖ!
***

No comments:
Post a Comment