Pages

03/07/2023

సముద్రపు పిల్లాడు - MSK Krishna Jyothi

 ఈ కథ - నాకు చాలా ఇష్టం అయిన పిల్లల కథ. ఒకరికి ఈ కథను చెప్పేందుకని రాసుకున్నాను.  ఇప్పుడు నా బ్లాగ్ చదివేవారికోసం ఇంకొక్కసారి. ఈ కథ నిజానికి ఎంతో depth, value ఉన్న కథ.. ఎంతో గుర్తింపు తెచ్చుకోవాల్సిన కథ. తెలుగు కథయిపోయి.. ఇలా మిగిలిపోయింది. 


సముద్రపు పిల్లాడు - MSK Krishna Jyothi


'చిన్నా' ఓ బెస్తవాళ్ళ గ్రామంలో ఉండే ,  మూడవ తరగతి చదివే చిన్న పిల్లవాడు. అతనికి స్కూల్ లో మిగతా పిల్లల కన్నా సముద్రం తోనే స్నేహం ఎక్కువ. వాడు చాలా చిన్నప్పుడు తల్లి అతనికి ఎండు చేప ముక్క ఓటి కాల్చి పెడుతుంది. వాడికి అది చాలా నచ్చేస్తుంది. ఇంకా కావాలని అడుగుతాడు. వాళ్ళ అమ్మ, పొట్ట నొప్పొస్తుందని తరవాత ఇస్తానమ్మా ఇప్పుడొద్దు అంటుంది. వెంటనే రోషం పుట్టి, జారిపోతున్న చెడ్డీని పైకి లాక్కుని సంద్రం వైపు నడుచుకుంటూ వచ్చేస్తాడు. తల్లి లబో దిబో మనుకుంటూ ఏడుస్తా పిల్లాడి కోసం వెళ్తుంది. 

అప్పటికి చిన్నా సముద్రంతో తన బాధ చెప్పుకుని కళ్ళలొంచీ, ముక్కులోంచీ నీళ్ళు కారుస్తూ ఏడ్చాడు. సముద్రం కూడా "ఓ" మని గోస చేస్తుంది. ఇంక నాలుగడుగులు వేస్తే వీడు సముద్రం లోకి వెళిపోతాడనగా  తీరంలో పిల్లలు కేకేసి వాడిని ఆపేస్తారు. వాళ్ళు వీడు చేప ముక్క కోసం ఏడుస్తున్నాడని తెలీకనే, వాళ్ళు అప్పుడు కాల్చుకుంటున్న చేప ని ఇస్తారు. అది చూసి చిన్నా చాలా ఆనందిస్తాడు. ఇంతలో అమ్మ వచ్చి చిన్నాని క్షేమంగా చూసి హమ్మయ్య అనుకుంటుంది. 


ఇంటికెళ్ళాక, బాగా ముద్దులు పెట్టి, ఇంకాసిని చేప ముక్కలు కాల్చి పళ్ళెంలో పెట్టి ఇచ్చింది. చిన్నాకి అది మొదలు, తను ఆ రోజు సముద్రం దగ్గరికి పోయి ఏడ్వడం వల్ల సముద్రమే తన కోరిక అలా తీర్చిందని -  నమ్మకం లా ఏర్పడిపోతుంది. అప్పటినిండీ ఏది కావలన్నా సముద్రానికి పోయి చెప్పుకుంటాడు. వాడికీ సముద్రానికీ మాత్రమే అర్ధమయ్యే ఒక భాష లాంటిది ఏర్పడుతుంది. ఏ కోరిక కలిగినా, సముద్రానికి చెప్పేసి, తరవాత ఇంటికొచ్చి అమ్మ కి చెప్తాడు. అమ్మ నానా తంటాలు పడి అతని కోరిక ని ఎలాగో తీరుస్తుంది. ఇంతకీ చిన్నా కోరికలు తన లానే చిన్నవి... సొరచేప తినాలనిపించడమో / ఎండు చేప ముక్క తినాలనిపించడమో - అలాంటివే!


కొంచెం పెద్దయ్యాక -  - కొద్దిరోజుల్లోనే ఒక కొక్కేనికి మెరుపు కాయితం చుట్టి తన చిన్న పొట్టకి తగినంత చిన్న స్థాయిలో చేపలు పట్టడం నేర్చుకుంటాడు.   కొన్ని రోజుల్లోనే పాపం వీడికి   ఇలా "చేప ముక్కలూ", "సొరచేప పిట్టు" లాంటివి కాకుండా ఒక పెద్ద అవసరం వస్తుంది.  ఓరోజు అప్పటికే చిరుగు కుట్లు ఉన్న  తన బీద స్కూలు బేగ్ కాస్తా పూర్తిగా చిరిగిపోయి, పుస్తకాలన్నీ  కింద పడిపోతాయి. పిన్నీసులు పెట్టినా, కుట్టినా సరి కానంతగా ఆ బేగ్ ఇక  చిరిగిపోయింది.  అమ్మకి చెప్తాడు కొత్త బేగ్ కావాలని. అమ్మ ఆ మాట విని భోరుమని ఏడ్చేసింది. 


ఇంతకు ముందు "నాన్న రానీ.. నాన్నొచ్చాక కొంటాను!"  అనేది. "నాన్నెప్పుడొస్తాడు" ?

 "సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే కాలమొచ్చినప్పుడు!".  

"ఆ కాలం ఎప్పుడొస్తుంది?"  అని ఎదురు చూసేవాడు.  చేపలు గుడ్లు పెట్టే కాలంలో వేటకి బోటుకి వెళ్ళిన బెస్తవాళ్ళంతా తీరానికి వచ్చి తమ ఇళ్ళల్లో గడిపేవారు. చిన్నా నాన్న కూడా పిల్లాడిని ఒక్క క్షణం వొదలకుండా ముద్దు చేసేవాడు. 

ఈ సారి మాత్రం చేపలు గుడ్లు పెట్టే కాలానికి అందరి నాన్నలు వచ్చినా చిన్నా నాన్న మాత్రం రాలేదు. అప్పటినించీ తల్లిని ఏమడిగినా ఏడుస్తుంది. పండక్కి ఏడ్చింది. మామ చిన్నాకిచ్చిన కొత్త చొక్కా పట్టుకుని ఏడ్చింది. చెప్పు తెగిపోయింది కొత్త చెప్పు కొనమంటే ఏడ్చింది. అమ్మ ఏడుస్తుందని పిల్లాడు ఈ మధ్య ఏమీ అడగడం లేదు అసలు. కానీ మర్చిపోయి కొత్త బేగ్ కావాలని అడిగీసేడు.  రేపు బడికి పుస్తకాలెలా తీస్కెళ్ళడమో తెలీలేదు. అమ్మ ఒక బియ్యం గోతం ఇచ్చింది. అది ఇంట్లోనే ఓ మూలకి విసిరి కొట్టి,  సముద్రం దగ్గరకి పరిగెత్తాడు. 


ఇసుకలో ఉత్తి కాళ్ళతో పరిగెత్తడం సులభం. చిన్నాకు చెప్పులు తెగిపోయి చాలా కాలమయింది. మళ్ళీ కొనలేదు.   చేతుల్లో బలం తెచ్చుకుని, బేగ్ ని సముద్రం లోకి దూరంగా విసిరేసాడు. "సముద్రంలోకి వేటకెళ్ళిన నాన్న ఇంకా రాలేదు కదా.. నాన్న ఈ సముద్రంలోనే వుండుండాలి. చేపలు గుడ్లు పెట్టే కాలం గడిచి చాలా కాలమైంది కదా. నాన్న ఇక రాకూడదూ!!"  అని బాధపడ్డాడు. వాడికి దుఃఖం వచ్చింది. వాడితో పాటూ సముద్రమూ ఏడిచింది. వాడు అలల్లోకి వెళ్ళిపోతున్న కొద్దీ, వెనక్కిపో అని వాడిని అలలు బెదిరించాయి. 

మరుసట్రోజు గోతాం సంచీ లో పుస్తకాలు పెట్టుకుని  బడికి తీస్కెళ్ళి చాలా అవమానపడతాడు. ఎలాగో ఆ రోజు గడిచాక, మరుసట్రోజు మామ దగ్గరికెళ్తానని తల్లి దగ్గర చిల్లర తీసుకుంటాడు.  ఎందుకంటే ఆ గోతాం తో బడికెళ్ళాలంటే సిగ్గు గా ఉంటుంది. బడికెళ్ళకుండా ఇంట్లో ఉంటే అమ్మ ఒప్పుకోదు. పైగా మామ తో మాటాడి, కొత్త బేగ్ కొనిపించుకోవాలి. 

మామ ఊరు దగ్గరే!  బస్సెక్కి చిన్నా మామ ఇంటికి చేరే సరికీ, అతను సముద్రం మీద వేటకు బైల్దేరుతూ ఉంటాడు. మామ చిన్నాని "వస్తావా?"  అనడిగితే, జీవితంలో మొట్ట మొదటి సారి చిన్నా బోటెక్కి సముద్రం మీదికెళ్తాడు. మొదట ఆ కుదుపులకి వికారం వస్తుంది. మెల్లగా సర్దుకుంటాడు. బోట్ల మీద బెస్త వాళ్ళంతా చేపల వలలు పన్ని పడుతుంటే అబ్బురంగా చూస్తాడు. వాడి ఆలోచనల్నిండా తన తండ్రే. నాన్న కూడా వీళ్ళలాగె ఇంతింత వలలు లాగేవాడా.. ఇన్నోటి చేపలు పట్టే వాడా అని అనుకుంటాడు.   

చిన్న వాడు  కాబట్టి వలలు లాగలేడు కాబట్టి, కొక్కెం తగిలించిన గేలం తో చిన్న చిన్న చేపలు పట్టుకుంటుంటాడు. చిన్నా మనసు నిండా నాన్నేగా! తను పెద్దవాళ్ళంత చేపలు పట్టలేదు గానీ, తను పట్టిన చేపలు పర్లేదు.   తన తండ్రి వాటిని చూసి సంతోషించేవాడా ? గర్వపడుండేవాడా?  ఈ కొద్ది చేపలు అమ్మితే వచ్చే డబ్బుతో తను స్వంతంగా, బేగు కొనుక్కోగలడా ?  .. ఇవే ఆలోచనలు!!

ఇంతలో ఒక పెద్ద చేప కొక్కేనికి చిక్కుతుంది. అది ఎంత బరువుగా ఉందంటే, ఆ బరువుకి పిల్లాడు ఎక్కడ సముద్రంలో పడిపోతాడో అని, దూరంగా ఉండి వీడి మీద కన్నేసిన మామ పరిగెత్తుకుంటూ సాయం వస్తాడు.  మామ సాయంతో గేలాన్ని లాగాక, ఆ పెద్ద చేపని చిన్నా రెండు చేతుల్తోనూ పట్టుకుని దాని వొళ్ళంతా మురిపెంగా తడుముతాడు.  అది గేలాన్నించీ తప్పించుకోవడానికి గాల్లోకి ఎగురుతోంది. పొగరుమోతు చేప. 

మామ బలంగా దాన్ని లాగుతున్నాడు.  చిన్నాకి ఏదో స్ఫురించి, ఒక రంపపు బ్లేడు తో గేలాన్ని కోసేస్తాడు. చేప మెరుపులా నీళ్ళలోకి వెళిపోతుంది. మామ విస్తుపోయి చూస్తే, "మామా, ఆ చేప పొట్ట లావుగా ఉంది. లోపల గుడ్లున్నాయి. దాన్ని మనం చంపేస్తే, గుడ్లు పెట్టే కాలం ఇక రానే రాదు. గుడ్లు పెట్టే కాలం వస్తేనే, నాన్నలు సముద్రం వొదిలి ఇంటికి వచ్చేది. బేగ్ లేకపొయినా పర్లేదు. గోతం సంచే పట్టికెళ్తాను" అన్నాడు. మామకి చిన్నా మాట్లాడేది ఒక్క ముక్క అర్ధం కాలేదు. 

ఇంతలో చిన్నా చేసిన మంచి పనికి మెచ్చుకుంటున్నట్టు, సముద్రమే మెల మెల్లగా నల్లని దూది మబ్బు ఐపోయి,  మేఘమై వర్షించి చిన్నాని ప్రేమగా తడిపేస్తుంటే, జాలర్లు బోట్లని వెనక్కి మళ్ళించి, ఒడ్డు దారి పట్టించారు.  సముద్రం మాత్రం చిన్నాతో "మనిద్దరం ఎప్పటికీ జతగా ఉందాం" అంటూ అలలు అలలుగా చిన్నాని తాకేందుకు ఆత్రంగా పైకి లేస్తూంది.  

***

నేను సరిగ్గా చెప్పానో లేదో ఈ కథని.  సముద్రం, జాలరి అయిన తన తండ్రిని కబళించినా, చిన్నాని మాత్రం కరుణతోనే చూస్తుందని అనుకోవడం లో ఒక విషాద రేఖ కనిపిస్తుంది. అమాయకుడు అయిన చిన్న పిల్లవాడి మంచి మనసుని చక్కగా చెప్తూ.. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా మనిషి కోల్పోకూడనిది మంచితనమే అని చెప్తుంది. అందుకే ఈ కథ నాకు చాలా ఇష్టం. ‌

2 comments:

Zilebi said...

కథ, దాన్ని రాసుకున్న తీరు రెండూ అద్భుతః !

Sujata said...

Thank you so much.