Pages

01/07/2023

వెలుగు దారిలో - చెరుకూరి మురళీ కృష్ణ

This, was my Facebook post, which caught the attention of the Author Shri Muralikrishna. 


Posting few catchy things about the book and how the author can be reached for copies, by copy pasting his comment in my feed. Thank you.





నాకున్న కొంచెం టైమ్ లోనే ఏకబిగిన చదివించిన పుస్తకం ఇది. చెరుకూరి మురళీకృష్ణ గారు రాసిన ఒక అంధుని ఆత్మ కథ. 'భాస్కర్ పట్నాయక్' యుక్తవయసులో చూపు కోల్పోయిన వ్యక్తి. చిన్నతనం నుండీ చూపు కోల్పోతానని తెలిసి, తగ్గిపోతున్న కంటిచూపుతోనే చాలా ఇష్టం తో,  చాలా కష్టపడి తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ లో చదివి, చూపున్నన్నాళ్లూ వీలున్నంత ప్రపంచాన్ని,  ప్రకృతిని,   వెన్నెలనీ చూసి, చేతికందిన ప్రతీ కాగితమూ చదివేసిన అబ్బాయి. చూపు కోల్పోయాక మూడేళ్ల పాటు తీవ్రమైన డిప్రెషన్ లో కూరుకుపోయి, ఆ తరవాత కోలుకుని, అంధుల బడిలో చదువుకుని, దేశం లో మొదటి సారి బాంక్ లో ఉద్యోగం తెచ్చుకున్న అంధుడు. ఆయన జీవన పర్యంతం ఎదుర్కొన్న వివక్ష, అవనానాలు, ప్రోత్సాహం, చట్టం, పోరాటాలు. ఇంతే.  పుస్తకం లో నాకు చాలా నచ్చిన విషయాలు:-


1) కుటుంబం : ఒక వికలాంగునికి కుటుంబం ఎంత సహాయం, దన్ను ఇస్తుంది.. వాళ్ళ మధ్య బంధం ఎంత డీప్ గా ఉంటుందో.. అమ్మ, నాన్న, అన్నయ్యలు, అక్క, చెల్లెలు.. ఊర్లో బంధుమిత్రులు, కళ్లల్లో పెట్టుకుని చూసుకున్న జ్ఞాపకాలు.. మా గౌరాంగ అన్నయ్య.. నిరంజన్ అన్నయ్య అంటూ.. వారి చుట్టూ తన కృతజ్ఞతలు అల్లుతూ చెప్పిన స్వీయగాధ.  ముఖ్యంగా ఆయనకి‌ అండాదండా అయిపోయిన చెల్లెలికి !! 


2) పేర్లు : రచయిత ఎక్కడా తనకి మేలు చేసినవారి, సాయం చేసినవారి పేర్లు చెప్పారే తప్ప, తనని సాధించిన వారి పేర్లు బయట పెట్టలేదు. ఎలా ఎందుకు బాధపెట్టారో మాత్రమే చెప్పారు. ఇలా వేధించిన వారిలో కొందరు, తాము కేవలం అజ్ఞానం వల్ల అలా చేసామనీ, ఎవేర్ నెస్ వచ్చాక క్షమించమనడం వారి వారి గొప్పతనాలుగానే చెప్పారు. ముఖ్యంగా ఆయన అంధులు చెయ్యగలిగే పనులు గురించి, అంధుల హక్కుల గురించి తను పని చేసిన బాంకింగ్ రంగంలో అసాధారణ కృషి చేసారు. ఆయన వేసిన బాట ఆ తర్వాత ఎందరో ప్రతిభావంతులైన అంధుల ఉద్యోగజీవితాలని మెరుగుపరిచింది.


3) ప్రకృతి సౌందర్యం : ఒరిస్సా కోరాపుట్ లో జపనీయులు వేసిన రైలు మార్గాలు, వాటి వర్ణన!!!! అదీ ఓ తెల్లారుజామున మంచులో నడక ప్రయాణం, ఓ ఈదురుగాలుల వాన నాటి వర్ణన, లోయలో సెలయేరు, వంతెన, మృత్యువు, కొండల్లో చావుభయం.. ఆ ప్రకృతి శక్తి వర్ణన. ఓ గిరిజన గూడెం లో తుఫానులా చీకటిగా, చలిగా.. అది ఓ కాబోయే అంధుడు కళ్ళారా చూసి, గుండెల్లో దాచుకున్న  దృశ్యం.


4) వృత్తి : వికలాంగుల కోటాలో ఉద్యోగం వస్తే సరిపోదు.. ఇతనికి సమాన అవకాశాలు కావాలి!!  ప్రతిభ ని నిరూపించుకునే అవకాశాలు కావాలి! అతను చేయగలిగే పనినే చేస్తాడట. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అదీ ఇప్పిస్తే ఇంకా బాగా చేస్తాడంట! ఏమి గొంతెమ్మ కోరికలు?!! పదోన్నతి కావాల్ట.. పరీక్షలు రాస్తాట్ట. స్క్రైబు కావాలి..  పదిహేను నిముషాలు ఎక్కువ సమయం ఇవ్వాలట!  బదిలీ కావాలట!!  ఇలాంటి సూటిపోటి మాటలు, వేధింపులు,    కనీస హక్కు అనుకునే ప్రతీదీ..  ఇలా ప్రతీదీ అగ్నిగుండం!!  ఇవన్నీ దాటుకుంటే గానీ  ఉద్యగజీవితం వెళ్ళలేదు. దీనిలో సహకరించిన ప్రభుత్వ ఏజెన్సీలు, మంచి అధికారులు.. మొత్తానికి ఈయన వేసిన ఈ ముందడుగు "మార్గదర్శకాలు" మార్చడానికి,  లేదా అవంటూ ఉన్నాయని వ్యవస్థ కు తెలిసే మార్పు కు,  దారితీయడం. 


5) పోరాట తత్వము : ఊరికే హక్కనీ, ఆత్మాభిమానం అనీ మాటాడే మనిషికి బ్రతుకు చాలా కష్టం. కానీ ఇక్కడ పోటాడకుండా మూల కూచుంటే అస్తిత్వమే ఉండని పరిస్థితి వీరిది. అప్పటికే లోకం బెదిరిస్తుంది. పరిస్తితులు వికటిస్తాయి.  వెక్కిరింతలకీ, వేధింపులకీ భయపడి, తమ రాత ఇంతే అని వెనుదిరిగి రాజీపడితే ఇంకా ఇంకా కిందికి అణగదొక్కేస్తుంది. చాలాసార్లు ఒంటరి పోరాటం చెయ్యాల్సొస్తుంది.  మన మేలు కోరేవారు కూడా, మన బాధ చూళ్ళేక "ఎందుకులెద్దూ!" అని అనేస్తారు. కొన్నిసార్లు పట్టు విడుపులూ‌ ఉండాలి. అయినా లోపలున్న ధైర్యం కోల్పోకుండా పోరాడుతూ ఉండాలి. మార్పు అకస్మాత్తుగా రాకపోయినా కదలిక అయితే వస్తుంది. 


6) మాట సాయం / guidance : ఇది చాలా inspiring కథనం. పని ప్రదేశం లో వికలాంగుల  హక్కుల గురించి బాగా తెలుసుకోవచ్చు.  అలాగే వందశాతం వైకల్యం ఉన్న ఆటిజం వంటి సమస్యలు ఉన్న పిల్లల తల్లిదండ్రులు కూడా అధికారుల / వ్యవస్థ ల దుర్మార్గమయిన పాలసీల వల్ల ఉద్యోగాలలో, బదిలీలలో ఎదుర్కొనే సమస్యల గురించి కూడా ఈ పుస్తకం లో చదవొచ్చు. ఈ కేస్ ని చదివిన వాళ్ళలో ఇలాంటి విధానాలు అమలుచేసే/ రూపొందించే ఉద్యోగులు ఉంటే.. కొంత perspective వస్తుంది వాళ్ళకి. మనిషి, సాటి మనిషికి సాయం చెయ్యగలగడాన్ని ఏ కఠినాత్మకత అడ్డుకుంటుందో కదా. దానికి తోడు ఈ లోపాలు ఉండటం నేరమా?  చాలాసార్లు అది మానసిక శారీరక వికలాంగుల పట్ల ఉన్న చిన్నచూపు వల్ల అని తెలుస్తూ ఉంటుంది. తమదాకా వస్తే గానీ ఎవరికీ ఏమీ పట్టదు.  ఈయన తన లాంటి ఎందరికో చట్టాల గురించి చెపుతూ, వివిధ కేసుల్లో సహాయం చేసారు. 


7) చట్టాల లోనో, విధానాలలోనో ఉన్న అస్పష్టత వల్ల ఇంకా జనానికి తెలీని ఎన్నో మంచి విషయాలు, దానివల్ల అవమానాలు, అనుమానాలూ రోజువారీ వ్యవహారాలు కావడమూ, ‌తమకున్న వికలాంగత్వం వల్ల సమాజం దౌర్జన్యం చెయ్యడానికి వెనకాడకపోవడం, పదే పదే తమ వికలాంగతని నిరూపించుకునేందుకు ధృవపత్రాలు అవసరం పడటం, వాటికోసం రకరకాల ఆఫీసులకి వెళ్ళాల్సి రావడం,  తమకోసం పనిచెయ్యడాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సైతం "చారిటీ' గా భావించడం, ఆ ప్రభుత్వాన్ని కూడా కొందరు నకిలీ ధృవపత్రాలతో మోసం చెయ్యడం .. ఇలా .. Practical difficulties ని వివరంగా రాయడం


8) సంస్థలు : కొన్ని ప్రభుత్వ సంస్థలు,  వాటిలో మంచి వ్యక్తులు,   తాడికొండ లో లెక్కల మేస్టారు, కొన్ని స్వచ్చంద సంస్థలు, కొందరు అద్భుతమైన మనసున్న మనుషులు, వారు చేసిన సేవలు, నిలబెట్టిన జీవితాలు. కొన్ని సేవ లోనే సేద తీరిన దివ్య ఆత్మలు.. ఇవి, శూన్యం అనుకున్న జీవితాల్ని వెలిగించడం!!  Kindness చాలా చాలా గొప్ప విషయం.  పిసరంత ఆ దివ్య లక్షణం ఉంటే మానవ జీవితం ఎప్పుడూ గొప్పదే అవుతుంది.   అదేవిధంగా ధైర్యం, అంగీకారం ! ఇవీ ఉండాలి ప్రతీ ఒక్కరిలోనూ. 


ఇంకా చాలా ఉంది. కానీ ఎప్పుడైనా రాస్తాను. ఇది భాస్కర్ పట్నాయక్ గారినీ, మురళీకృష్ణ గారినీ అభినందించడానికి! What an incredible story!!  థాంక్యూ.


**********

రచయిత వ్యాఖ్య:

ఈ పుస్తకం మేమే పబ్లిష్ చేసాము. స్టోర్స్ లో దొరకదు. మీరు 8008001356 కి అడ్రస్ పంపి ₹250.00 googlepay చేస్తే నేను పుస్తకాన్ని వెంటనే పంపిస్తాను.


రచయితగా నా parichayam:


నేను ఆంధ్రప్రదేశ్ బ్యాంకు లో చీఫ్ మేనేజర్ గా చేసి 2020 లో పదవి విరమణ చేసాను. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము. నేను భాస్కర్ పట్నాయక్ చిన్నప్పటి నుంచి స్నేహితులం. అతనితో కలిసి చదువుకున్నాను.


నేను రచనా వ్యాసంగం మొదలుపెట్టి ప్రతిలిపి లో ( c.murali.krishna) profile తో పోస్ట్ చేస్తున్నాను. అతని జీవితం గురించి రాసినప్పుడు ఎక్కువ మందికి అది స్ఫూర్తిదాయకం అవాలన్న కోరికతో నేనే దానిని పబ్లిష్ చేసాను. మీరు ఆ పుస్తకాన్ని చదవడమే కాకుండా దివ్యంగులయిన పిల్లలకి కానీ వారి తల్లిదండ్రులకి కానీ బహుమతిగా ఇవ్వమని కోరుతున్నాను. నేను ఎన్నో పబ్లిక్ లైబ్రరీ లకి కొన్ని పుస్తకాలు ఇచ్చాను. ప్రస్తుతం ఈ పుస్తకం యొక్క ఆంగ్లనువాదం సిద్ధం చేస్తున్నాము. దానిని ఎవరన్నా పబ్లిషర్ కి ఇచ్చి ప్రింట్ చెయ్యాలని మా ఆకాంక్ష. మీ ప్రోత్సాహం కోరుతూ

 - మురళి కృష్ణ


News about one such fighter :


https://www.eenadu.net/telugu-news/india/sumit-who-was-born-blind-got-government-job/0700/123121572 



No comments: