Pages

11/04/2023

మలయమారుతం - శారద





ఈ కథల పుస్తకం చాలా బావుంది. దీనిలో కొన్ని కథలు ఇంతకు ముందు అంతర్జాల పత్రికలలో   చదివినవి, కొన్ని చదవనివి. వీటి విషయం కొంచెం కొత్తది. బాగా చదువుకుని, స్వదేశంలోనూ, విదేశాల్లోనూ క్షేమమయిన ఉద్యోగాలు చేస్తూ, కుటుంబ బాధ్యతలు మోస్తూ, రక రకాల జీవితానుభవాలను మూటకట్టుకున్న కాలాతీత పాత్రలు, రక రకాల స్థానాల్లో నిలబడి, తమ సొంత మనసుల్లోకి చేసిన ప్రయాణం ఈ కథల విషయం. దాదాపు అన్ని కథలూ, పాత్రలు తమలోకి తరచి చూసుకునే సందర్భాలే.  

జీవితంలో ఇక సారైనా అలా మనలోకి మననం చూసుకుని, మన తప్పొప్పులని ఒప్పుకోగలిగితేనే మన మనసులు పరిపక్వమయ్యే అవకాశం ఉంటుంది. అది సాధారణంగా "నేనే తప్పూ చెయ్యలేదు!", "నేనేం చేసేను?" "నా మనసుకు సరి అనిపించింది చేసాను!", "నేనెప్పుడూ తప్పు చెయ్యను", "అప్పటికి అదే కరెక్ట్ నిర్ణయం. అందుకే తీసుకున్నాను!" లాంటి సమర్ధింపులతో, స్వార్ధంతో మనం ఎన్ని తప్పులు చేసేస్తూ - తప్పు గా జీవిస్తామో కదా.  మన తప్పుల్ని ఒప్పుకోవడానికో, అసలు మన తప్పుల్ని తలచుకోవడానిక్కూడా చాలా మంది ఇష్టపడం. 

"మలయ మారుతం" లో ఇలాంటి తమ తో తాము మాటాడుకునే మనుషుల కథలున్నాయి. ఈ అర్బన్ వర్కింగ్ లేదా నాన్ వర్కింగ్ జీవితాల్లో, అసూయలూ, కన్నింగ్, కుట్రలూ, క్షమ, గుర్తింపు లేని జీవితాలూ,  పెత్తనం, అజమాయిషీ లాంటివి అంత స్పష్టంగా కనిపిస్తూ ఎంత సమస్యల్ని అవి తెచ్చిపెట్టగలవో, మకిలి పట్టిన వ్యక్తిత్వాలు, నటనా, హిపొక్రసీ లు ఎంతగా మన జీవితాల్లో భాగాలయిపోయాయో కళ్ళకు కట్టినట్టు వివరంగా చెప్పారు శారద గారు.   కొందరు వాటి నుండీ బయటపడడానికి మనస్పూర్తిగానే ప్రయత్నిస్తారు. కొందరు అలా మంచిగా ప్రవర్తించమని మనకి దారి చూపిస్తారు. కొందరు అహంకారంతో అసలు తము వీటన్నిటికీ అతీతులం అనుకుంటారు. 

పిల్లల జీవితాల్లో, కాస్తంత భర్తల జీవితాల్ని కూడా అజమాయిషీ చేసేస్తుండే మహిళల గురించి రాసిన కథ మాతృదేవోభవ.  ఈ  కథ లో నాకు బాగా నచ్చిన కొన్ని వాక్యాలు :  

"చాలా మంది ఆడవాళ్ళ లాగే  సరోజ కూడా ఇక జీవితం నించి కానీ, ప్రపంచం నించి కానీ తను నేర్చుకోవలసినదేమీ లేదనీ, ఈ జన్మకి కావలసిన అన్ని రకాల జ్ఞాన విజ్ఞానాలని తను నేర్చేసుకుందని, తనకి తెలియని విషయాలేవీ లేవనీ గాఢంగా నమ్ముతుంది.  తక్కువ తెలివితేటలకీ, జ్ఞానానికీ వుండే ఆత్మ విశ్వాసం, ఎక్కువ తెలివితేటలకీ, ఎక్కువ విజ్ణానానికీ వుండవు. అందుకే వాదనల్లో కానీ, జీవితంలో కానీ ఎక్కువ సంస్కారం, తెలివీ ఉన్నవాళ్ళు ఓడిపోతుంటారు. నరేంద్ర కంటే ఎప్పుడూ వాళ్ళింట్లో సరోజదే పై చేయి." 

"ఇంతకుముందు బంధువులూ, స్నేహితులూ, పరిచయస్తుల్లా కనబడే జనం ఇప్పు డు సరోజ కళ్ళకి ఆడపిల్లల తండ్రులూ, మగపిల్లల తండ్రులూగా విడిపోయారు" 

"చిన్నప్పట్నించీ ఏ స్వయంప్రకాశం లేని నిస్సహాయురాలినని భావించే ఆడదానికి 'మగపిల్లాడి తల్లీ పదవితో వచ్చే పవరే వేరు. 


అలాగే కాలంతో పాటు సంఘంలో రావలసిన మార్పులు - ఉదా:  అమ్మలు - పిల్లల లైంగికత్వాన్ని గౌరవించడం,  తమ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకుల బెంగలో మునిగిపోయినా కూడా అబ్యూస్ కి గురవుతున్న ఇంకోళ్ళ పిల్లని కాపాడడం లాంటి మంచి పనులు చేయడం. అలానే  మనం నిస్వార్ధంగా చేసే  కొన్ని చిన్న సాయాల ఇంపాక్ట్ పిల్లలమీదా, ముఖ్యంగా మన తోడ్పాటు ఎంతో అవసరమైన టీనేజ్ పిల్లల మీద ఎంత ఉంటుందో చెప్పడం, ఇవన్నీ ఇప్పటి కాలానికి కావలసిన కథలు.  ఇలా ఈ అమ్మలు, చాలా కథల్లో సింగిల్ మదర్స్ - ఎంత అత్భుతంగా మంచి పనులు చేస్తారో !  

అలానే ఉద్యోగమో, ఇంకో సంపాదనా మార్గమో ఉంటే స్త్రీ కి జీవితాన్నెదుర్కొనే ధైర్యం కూడా కలుగుతుంది.  అయినా సరే 'ఏం చెయ్యాలో తెలీక'  అలానే హింసకు అలవాటు పడి బ్రతికేస్తుంటారు కొందరు మహిళలు.   ఆడవారిపై శారీరక, మానసిక అధికారం చూపిస్తూ, దౌర్జన్యం చేసే భర్తలకి "కోపం తెప్పించకుండా బ్రతకడం" లాంటి డిఫెన్స్ కన్నా "అతని అహాన్ని తృప్తి పరిచేస్తే చాలనుకోవడం" - వాటితో సమస్యలు పరిహారమైపోతాయనుకోవడం ఎంత తిరోగమన వాదమో చెప్పడం, ఒక మహిళా రచయితగా శారదగారు చేసిన మంచి వ్యాఖ్య. 

అలాంటి "మారేదీ, మార్పించేదీ "  అనే  కథలో నాకు బాగా నచ్చిన వాక్యం :  "అసలు పిల్లలకి తల్లిపైనా తండ్రి పైనా గౌరవం మిగిలి ఉంటుందా ? తండ్రి ప్రవర్తననీ, తల్లి లొంగుబాటునీ చూసి పిల్లలు దౌర్జన్యంలో తప్పేమీ లేదనీ, దౌర్జన్యానికి విరుగుడు లొంగిపోయి వుండడమేననీ అనుకోరా ? పరిస్థితులను అర్ధం చేసుకొని జీవితానికి తనని తాను  అప్పగించేసుకుని వుండడం కాకుండా పరిస్థితులని మార్చుకునే దారి లేదా? "

భార్యా భర్తల ప్రేమలో ఎన్నో మలుపులొస్తుంటాయి. ఓట్టో లాగా మరణించిన భార్య తలపుల్లో సతమతమైపోతున్నా, ఆమె బ్రతికున్నండగా తన జీవితంలో ఊపిరులూదిన మధురిమలను తలచుకుంటూ బ్రతికే భర్త గురించీ,   అకస్మాత్తుగా జీవితం శూన్యమైపోయి, ఆత్మహత్య చేసుకోబోయిన ఒక ఇల్లాలిని సరైన సమయంలో ఆదుకోవడమే కాకుండా కళాకారిణి గా,  ఆమెకు ఓ డైరెక్షన్ ఇచ్చి, జీవితానికి ఓ అర్ధాన్నిచ్చిన ఓ స్నేహితుడి గురించీ, "మలయమారుతం" కథ లో మనుషుల మధ్య కావల్సిన అనుబంధాలగురించీ ఎంతో హృద్యంగా రాసారు. 

ఈ కథల సంపుటి ఏకబిగిన చదివేసాక, మనసు లో అలజడి లాంటిది తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుంది. రక రకాల పాత్రలు, ముఖ్యంగా అమ్మాయిల కథలే, ఒక మానసిక ప్రహేళిక లాంటి సవాళ్ళని ఎదుర్కొని, తాము చేసిన తప్పులకి సిగ్గు పడే, తమలో అహాన్ని తృప్తి పరచే సంఘటనల్లొ సాంత్వన వెదుక్కునే పాత్రలు ! ఇవి చాలా ధైర్యస్తుల కథలు.  శారద గారి "శంకరాభరణం"  సంపుటి లాగే ఈ పుస్తకం కూడా మెరుపులు మెరిపించింది. నాకు ఈ పుస్తకం పంపినందుకు చాలా థాంక్స్ శారద గారూ.   అన్ని కథల గురించీ చెప్పేసి, చదవాలనుకునే పాఠకుల ఉత్సాహం మీద నీళ్ళు చల్లడం ఇష్టం లేదు నాకు. అందుకే ఇక ముగుస్తాను. 





***

 

No comments: