శశీ థరూర్ - ఇప్పుడు వార్తల్నిండా అతనే... కాంగ్రెస్ లో ఉన్నా సరే ప్రజలు డంబ్ ఫెలో అని తీసి పారేయలేని వ్యక్తి. పెగాసస్ వార్తలు మొదలైన దగ్గర్నించీ ప్రధాన మంత్రి తరవాత, పార్లమెంటరీ పానల్ అధ్యక్షుడిగా, అంత గా పేపర్లలో ప్రత్యక్షమైన మనిషి.
2006 లో కేవలం పబ్లిక్ ఆఫీస్ లో పని చేసిన అనుభవం లేకపోవడాన, 'బాన్ కీ మూన్' ముందు ఓడిపోయి, ప్రపంచ గుర్తింపు కు నోచుకునే UNGS - యునైటెడ్ నేషన్స్ జెనరల్ సెక్రటరీ పదవి కోల్పోయినందుకు, కాంగ్రెస్ అతన్ని ఆహ్వానించి, మంత్రి పదవి ని ఇచ్చి, భారతీయ "టర్ఫ్ గేం" ను పరిచయం చేసింది. భార్య అకస్మాత్ మరణం తరవాత దాదాపు చీకటవబోయిన కెరీర్ ని నెమ్మదిగా నెట్టుకొచ్చి, ఇప్పుడు క్లీన్ చిట్ పొందడం, అంతా - విధి. ఇప్పుడు అతను ఐక్యరాజ్య సమితి పదవులకు నామినేట్ కాకపోవచ్చు. కానీ, తన అందం, తెలివి తేటలతో, వాక్చాతుర్యంతో, రచనా పటిమతో, యువత లో చాలా మంచి పేరు తెచ్చుకున్న రాజకీయ వేత్త.
ఇతను చాలా వ్యంగ్యాత్మకంగా 1989 లో రాసిన చతురమైన నవల ఈ గ్రేట్ ఇండియన్ నోవెల్. దీనిలో అతను మహాభారత కథ ని భారత స్వతంత్ర పోరాటానికి, తరవాతి పరిణామాలకీ ముడి వేసేసి, గాంధీ మహాత్మునితో కల్సి, నెహ్రూ, జిన్నా, సుభాష్ చంద్ర బోస్, ఇందిరా గాంధీ, మహరాజా హరి సింగ్, లాంటి మహా నాయకుల్ని, నిర్దాక్షిణ్యంగా విమర్శిస్తూ, (ఇండియా, పాకిస్తాన్ లలో వీరిని ప్రజలు ఆరాధిస్తూంటారు కదా) - మన స్వతంత్ర పోరాటాన్ని, గర్వించదగ్గ ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచకుండానే - మహా భారతంలోని పాత్రలను యధాతథంగా, (ప్రతీకలుగా కాదు, ఈసీగా తెలిసిపోయే చిన్న చిన్న పేర్ల మార్పులతో) తీసుకుంటూ, బ్రిటిష్ ప్రభుత్వాన్ని, వారి బిహేవియర్ ని చాలా సహజంగా - వారి దోపిడీ మనస్తత్వాన్నీ, స్వాతంత్ర భారతం లో వివిధ కొత్త పరిణామాల్ని, సీరియస్లీ సరదాగా వివరించడంలో సఫలీకృతుడయ్యాడు.
పిచ్చి రాజకీయాల గొడవల్లో పడి, ఎమర్జెన్సీ, నక్సలిసం, అరాజకీయం, అరాచకత్వం, అవినీతి, అధికారంలో ఉన్నవాళ్ళు స్వలాభం కోసం ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేసేందుకు ప్రయత్నించడం, ఆతరవాత వచ్చిన తిరుగు దిద్దుబాటు చట్టాలు, పొరుగు దేశాల్తో యుద్ధాలు, మనం ఆక్రమించుకున్న ప్రాంతాలు, రాజకీయ చతురత, బెడిసికొట్టిన నిర్ణయాలు - ఇలా ప్రతీదీ మనం ఒక జాతిగా ఎలా ఎదుర్కొన్నామో సులువుగా చెప్పేందుకు రాసినది ఈ పుస్తకం.
ఇంకా "కాల పురుషుడి కథల్లో, దేనికీ ముగింపు ఉండదు. మనది ఒక జరుగుతున్న చరిత్ర!" అని చెప్పడం ప్రధాన లక్ష్యంగా రాసిన పుస్తకం ఇది. ఇది చదివాక, వ్యంగ్యానికి ఇంత ప్రతిభ, రాజకీయాలమీదా, మహాభారతం మీదా ఇంత జ్ఞానం అవసరం అని తెలుస్తుంది. రెండు దేశాల (భారత్, పాకిస్తాన్) చరిత్రల పట్ల సమగ్రమైన పట్టు, అవగాహన తో ఆయా నేతల్ని విమర్శించేందుకు తీసుకున్న నిర్దాక్షిణ్యమైన చనువు, వెక్కిరింత, ఈ రోజుల్లో ఊహకు కూడా అందని విషయం.
ఈ పుస్తకం ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్, మళయాళ భాషల్లోకి అనువదించబడింది. ఈ పుస్తకానికి యూకే లో ఇండిపెండెంట్ పత్రిక విడుదల చేసిన "12 ఉత్తమమైన భారతీయ నవలల జాబితా (2020)" లో స్థానం చిక్కింది. అచ్చు మహాభారతం లో లాగే 18 భాగాలు (పర్వాలు/పుస్తకాలు) - దాదాపు అన్ని ముఖ్య మహాభారత పాత్రలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పాత్రల్ని ఇస్తున్నాను.
మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుండగా, గణేషుడు రాసుకుంటాడు. సరిగ్గా ఇలాగే దీన్ని శశీ థరూర్ అనే వేదవ్యాసుడు అనగా వీ.వీ (వీవీ గిరి అనుకోవచ్చు / రాజగోపాలాచారి గానీ) చెప్తుండగా గణపతి అనే ఒక పాత్ర రాస్తూంటుంది. మధ్య మధ్యలో ఈ వ్రాయసకారుడు ఆయా ట్విస్టులకీ టర్నులకీ ఉలికిపడుతుండగా వీ.వీ వాటికి తన రసవత్తర అనునయాలు కూడా చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ గణపతి ఒక్కడే అచ్చంగా గణపతి అన్నమాట.
మహాత్ముడు లేని భారత దేశాన్ని, దేశ చరిత్రనీ ఊహించుకోలేము. తన సత్యాగ్రహంతో, అహింసే పరమధర్మమని విశ్వసించిన వాడు, ఘోరమైన శారీరక, మానసిక శ్రమని, ఓర్చుకుని, ఋషి లాగా దౌర్బల్యాలనీ అధిగమించి, ఒక్కడూ కోట్లాదిమందికి స్పూర్థినిచ్చి, దేశానికి స్వతత్రం తెచ్చిపెడతాడు మహాత్మాగాంధీ. ఇతను, అందరికీ పూజ్యుడు, గురువు, సేనపతి, తాత. సరిగ్గా ఇలాంటివాడే కదా గాంగేయుడు (భీష్ముడు)! అందుకే ఆ భీష్ముడు ఇక్కడ గాంధీ (నవల లో గంగాజీ). అయితే గాంధీ పాటించిన బ్రహ్మచర్యం, ఆ బ్రహచర్యం పాటించేందుకు అతను అవలంబించిన పద్ధతులు, (అమ్మాయిలతో గడపడం, తన ఆలోచనల్ని నియంత్రించుకోవడం సాధన చెయ్యడం, చిన్న కౌపీనం ధరించడం వగైరా ungentlemanly పనులతో) విమర్శలు ఎదుర్కొన్నాడు. భీష్ముడు కూడా బ్రహ్మచర్యం అవలంబిస్తాడు. ఆఖరికి ఆ బ్రహ్మచర్య దీక్ష వల్లనే ఎటూకానిదైపోయి వచ్చిన అంబ ని పెళ్ళి చేసుకోవడానికి నిరాకరిస్తాడు. ఆ అంబ, శిఖండి అయ్యాక, ఆమె చేతిలోనే మరణిస్తాడు. ఇక్కడ గంగాజీ కూడా నాథూరాం గాడ్సే (శిఖండి) చేతిలో బలవుతాడు.
ఇంకో ముఖ్య పాత్ర మహమ్మద్ ఆలీ జిన్నా : పాకిస్తాన్ కి ప్రాణం పోసిన వాడు. నానా పట్టూ పట్టి, దేశాన్ని ముక్కలు చేసేదాకా వదలడు. దేశం ఆవిర్భవించే ముందే కేన్సర్ బారిన పడినా, ఎక్కడా మాట పొక్కనివ్వడు. తనని బలహీనుడని పక్కన పెట్టేస్తారని భయం. ఇన్ని ప్రాణాలు తీసి, ఇన్ని కుటుంబాల్ని చిందరవందర చేసి, ఇప్పటికీ మన రెండు దేశాలూ కుత్తుకలు కోసుకునేంత శతృత్వాన్ని బహుమానంగా ఇచ్చిన పెద్దాయన, పాకిస్తాన్ స్వతంత్రం సాధించిన ఏడాది కూడా బ్రతకనేలేదు. ఎండి పీలికైపోయి, నిస్సహాయంగా కేన్సర్ బారిన పడి మరణించాడు. ఈయనకిలా ఒంట్లో బాలేకపోయినా, నొప్పితో, నీరసంతో అల్లాడుతూనే, గాంధీ, నెహ్రూలకి ధీటుగా మాటాడుతూ, ముస్లిం లీగ్ ని జట్టుగా నడిపించినందుకు (ముస్లింలు వివక్ష ఎదుర్కొంటారు, వారికి ఇంకో దేశం అవసరం అని గట్టిగా విశ్వసించబట్టి) అతన్ని కర్ణుడిని చేసేసాడు థరూర్. ఈ కర్ణుడు ఇలా దుర్బలుడు, తొందరలో చచ్చిపోతాడూ అని తెలిస్తే, ఈ విభజనని ఇంకాస్త డిలే చేసేవాడినే అని బ్రిటీషు దొర బాధపడీంతగా.. అంటే చచ్చిపోయే ఆఖరి క్షణం వరకూ పాకిస్తాన్ కోసం, తను నమ్మిన దానికోసం, ఎన్నో కష్టాలకోరుస్తూ పోరాడినందుకు కర్నిస్తాన్ (ముక్క దేశం) అనగా పాకిస్తాన్ ఫౌండర్ గా అక్కడ పూజ్యుడు.
ఇంకా చాలా పాత్రలున్న్నాయి గానీ, కొన్ని తరచుగా వచ్చేవి :
దృతరాష్ట్రుడు - గుడ్డిగా ముందుచూపు లేకుండా వ్యవహరిస్తాడని - నెహ్రూ
పాండు రాజు - వొద్దన్న పని చేసి చచ్చిపోయాడని - బోస్
విదురుడు - పటేల్
ద్రోణుడు - జేపీ
శకుని - సిద్ధార్ధ్ శంకర్ రే (ఇందిర కు ఎమెర్జెన్సీ పెట్టమని సలహా ఇచ్చిన ఘనుడు)
జరాసంధుడు - యాహ్యా ఖాన్
శిశుపాలుడు - లాల్ బహదూర్ శాస్త్రి
గాంధారి - కమలా నెహ్రూ
ద్రౌపది - మన ప్రజాస్వామ్యం - పెక్కు భర్తలతో (di Mocracy - నవల్లో పేరు. నెహ్రూకీ ఎడ్వీనా మౌంట్ బాటన్ కీ పుట్టిన అక్రమ సంతానం)
కౌరవులు - కాంగ్రెస్ పార్టీ
ప్రియ దుర్యోధని - ఇందిర (ఈ నవల్లో నూరుగురు కౌరవులు ఉండరు. గాంధారికి దుర్యోధని ఒక్కర్తే పుడుతుంది)
అర్జునుడు - పత్రికలు, వగైరా.
ఈ పుస్తకంలో ఇంకా ఎన్నో ముద్దు పేర్లు - ప్రాంతాలకు ఉన్నాయి. అప్పటికి ప్రసిద్ధమైన ఎన్నో పుస్తకాల పేర్లనే తన పర్వాలకు కొద్ది మార్పులతో కొంటె గా పేర్లు గా పెట్టుకున్నాడు రచయిత. చైనా మన దేశంలో చిన్న ముక్క ఆక్రమించేసరికీ, మనసు కష్టపెట్టుకుని నెహ్రూ కి గుండె ఆగి చనిపోయాడని చెప్తాడు.
జలియన్ వాలా బాగ్, దండి సత్యాగ్రహం (మామిడి పళ్ళ కోసం ఉద్యమం ట), నీలిమందు ఉద్యమం, చోరాచోరీ ఉదంతం, అన్నిటికీ వేరే పేర్లు. చైనా కి చిత్ర అంట. కష్మీర్ - (cash) కేష్ తీసేసి మనీ (money) అని పెట్టి మనీమీర్ అంట - ఇలా Goa ని Comea - కమియా అనీ ఇలా ! ఇంకా భయంకరం కష్మీర్ ని ఇండియాలో కలపడం. దీనికోసం మహరాజా హరీ సింగ్ ని కలవడానికి వెళ్ళటం, అప్పటికి ఆయన విలాసాలలో ఉండటం (ఇలా రాయడానికి ఎంత ధైర్యం ? నిజానికి శ్రీనగర్ వాళ్ళు కనీసం ఆయన్ని దేవుడి లాగా చూస్తారు)
కొన్ని విపరీతమైన స్వతంత్రాలు - ఆ రచయిత కి ఉన్న ఉగ్గబెట్టుకున్న కోపాన్ని వ్యక్తీకరిస్తాయేమో అనిపిస్తుంది. అయితే, మన వాడు జలియన్ వాలా బాగ్ ఉదంతం గురించి మాత్రం కళ్ళు అంటుకునేలా వర్ణిస్తాడు. డయ్యర్ ఇండియాలోనే పెరిగిన వాడు. బిషప్ కాటన్ స్కూల్ లో చదివాడు. అయినా భారతీయుల పట్ల, మనుషుల పట్ల కరుణ లేనివాడెలా ఔతాడు ? పోనీ వాడు కాల్చమంటే కాల్చిన సైనికులు మనవాళ్ళే కదా. కళ్ళెదురుగా చచ్చిపోతున్న, ఆర్తనాదాలు చేస్తున్న మనుషుల, నిస్సహాయుల, ఆక్రందనలకి వాళ్ళ చెవులు పేలిపోలేదా, మనసు మొద్దుబారిందా ? వాళ్ళ గుండె ఎందుకు ఇదంతా కానిచ్చింది ? వాళ్ళూ మనుషులా ? మిషన్లా? అని ఆక్రోశిస్తాడు.
జలియన్ వాలా బాగ్ ఉదంతం తరవాత ప్రపంచం దృష్టి భారత దేశం మీద పడింది. అంతవరకూ ఈ స్వతంత్రపోరాటం అదీ ఏదో 'మీ అంతర్గత వ్యవహారం, మాకెందుకూ?' అనుకున్న ప్రపంచం, డయ్యర్ చర్యల్ని తీవ్రంగా ఖండించింది. అయితే,ఆయన ని వీరుడిగా పరిగణించి, దేశం నుండీ వెళ్ళేటప్పుడు బ్రిటన్ విచారణ చేసి ఒకవేళ ఆయన ఉద్యోగం పీకేసినా, అతని వంశం కొన్ని తరాలపాటూ కూర్చుని తినేంత డబ్బుని, భారత దేశంలో మొదటి స్వతంత్రపోరాటం లో చనిపోయిన బ్రిటీషు వారి కుటుంబాల నుంచీ, ఎందరో బ్రిటీష్ సానుభూతిపరులు కొన్ని వేల పౌండ్లని సేకరించి ఇచ్చారు. ఇలాంటి చిన్న చిన్న డీటైల్స్ ని, వ్యంగాత్మకంగా చెప్పడానికి చరిత్ర ని, బ్రిటీష్ వారి దోచుకెళ్ళే మనస్తత్వాన్నీ తీవ్రంగా ఇప్పటికీ విమర్శిస్తూ ఉండే థరూర్ రాయటం, చాలా బావుంటుంది. ఇవన్నీ జరిగిపోయిన కబుర్లు కాబట్టి, ఈ నెరేషన్ చాలా కేజువల్ గా రక్తం మరిగిస్తూ ఉంటుంది.
కౌరవ సేన నే కాంగ్రెస్ గా, ఆ తరవాత వచ్చిన వివిధ ఇతర రాజకీయ పార్టీల పెరుగుదలల్నీ, అయోమయం లో పడిపోయి, ఎమర్జెన్సీ తరవాత వచ్చిన ఎలక్షన్ ల లో ఎలాగో గెల్చినా, మళ్ళీ ఎన్నికల కల్లా, ఇందిర ముందు చతికిల బడిన విలువలున్న రాజకీయ నాయకులు, పత్రికలు, నకుల సహదేవుల్లాంటి భారతీయ సివిల్ ఫారిన్ సర్వీసుల అధికారులు, వీళ్ళందరినీ కూడా ముద్దుపేర్లతో వర్ణిస్తాడు.
మహాభారతాన్ని ఆధారంగా తీసుకుని రాసిన పుస్తకం కాబట్టి, చిన్న చిన్న పాత్రల్ని కూడా వదలక, విస్తృతంగా అందరిని, అన్నిటినీ పరిచయం చేస్తుంటాడు రచయిత. దీనిలో ఎపుడో విని మర్చిపోయుంటాం తరహా - అర్జునుని భార్యలు, పిల్లలు నుంచీ అశ్వథామ, యుధిష్టరుని స్వర్గారోహణం - తీరా స్వర్గంలో అతనికి దుర్యోధని ఎదురుపడడం - భారతం తో పోల్చదగ్గ వివరణలు భలే ఉంటాయి. ఎసెన్స్ ని వదిలేయకుండా !
ఉదాహరణకు యమధర్మరాజుకు, యుధిష్టరునికీ మధ్య సంభాషణ లో ఒక పేరా. :
Accept doubt and diversity. Let each man live by his own code of conduct, so long as he has one. Derive your standards from the world around you and not from a heritage whose relevance must be constantly tested. Reject equally the sterility of ideologies and the passionate prescriptions of those who think themselves infallible. Uphold decency, worship humanity, affirm the basic values of our people - those which do not change - and leave the rest alone. Admit that there is more than one Truth, more than one Right, more than one dharma....."
................
ఇప్పటి భారత దేశం చాలా మారింది. రాజ్యం అవినీతి సంగతేమో గానీ ప్రజలు అవినీతిపరులయిపోయారు. వీళ్ళకి చరిత్ర, రాజ్యాంగం, మన దేశ ప్రతిష్ట,ఏమీ తెలీదు. చదువుకున్న మత దురహంకారులు, చదువులేని ఓటు అమ్మకందారుల చేతిలో మన పిల్లల భవిష్యత్తు ఉంది. అయితే, ఇంకా కథ ఉంది. అది నడుస్తూనే ఉంటుంది. అదొక్కటే రిలీఫ్.
🙈🙉🙊
.................
Note : మహా భారతం ఒక మతానిదీ అని చూడకుండా చదివితే, ఇది రాజ్యం కోసం, అధికారం కోసం, ఎప్పటికప్పుడు నిర్వచనాలు మారిపోయే ధర్మం గురించి జరిగిన ఒక యుద్ధం గురించి చెప్పే కథ. ఈ గ్రేట్ ఇండియన్ నోవెల్ లో అస్తమానం ఈ ధర్మం గురించి ప్రస్తావన వస్తుంటుంది. ఉదాహరణ కి వారసులు లేని రాజ్యం అయితే, బ్రిటీష్ వాడు ఎనెక్స్ చేసుకుంటాడు కాబట్టి, కుంతి, మాద్రి, గాంధారి, వివాహానికి బయట, వేరే పురుషుల ద్వారా సంతానాన్ని పొందుతారు. ఇది పెద్దల ఆజ్ఞానుసారం, భర్త అనుమతి తో జరుగుతుంది. వ్యాసుడు కూడా మధ్యలో ఒకసారి ఇలా ప్రత్యక్షం అయి, తన పాత్ర ముగిసాక, తెర వెనక్కి నెరేటర్ స్థానానికి వెళిపోతాడు.
గాంధీ నెహ్రూల వివిధ నిర్ణయాలు, వివిధ సందర్భాలలో వారికి తోచిన సమాధానాలు, బోస్ చేపట్టిన సైనిక తిరుగుబాటు, జిన్నా పట్టుబట్టిన పాకిస్తాన్ మత్రం, ఇవన్నీ ఎక్కడికక్కడ ధర్మాలే. వాటి పరిణామాల్ని వారు కూడా ఊహించి ఉండరు. ధర్మం అనే బ్రహ్మ పదార్ధం గురించి ముఖ్యంగా పాశ్చాత్య పాఠకుల కోసం చిన్న వివరణ ఇచ్చాడు థరూర్.
This got first published in pustakam.net -
http://pustakam.net/?p=21691
2 comments:
Wonderfully commented
Thanks andi
Post a Comment