Pages

06/04/2021

Mossad - Michael Bar-Zohar, Nissim Mishal

Mossad, The Greatest Missions of the Israeli Secret Service -  Michael Bar-Zohar, Nissim Mishal 



మొసాద్ - ఇస్రాయిలీ సీక్రెట్ సర్వీస్. ఇది ఆవిర్భవించి డెబ్భయి రెండు ఏళ్ళు దాటాయి.   ఇజ్రాయిల్ అతి చిన్న రాజ్యం అయినా, అది అగ్ర రాజ్యం గా ఎదగడానికి మొసాద్ పోషించిన పాత్ర కీలకమయినది.  ఇన్నేళ్ళలోనూ, మొసాద్ లో పని చేసిన ఎంతో మంది గూఢచారులూ, కమాండర్లూ, చిన్నవీ, పెద్దవీ, ప్రాముఖ్యం లేనివీ, ప్రపంచ గతిని మార్చేయగలిగేంతవీ ఎన్నో పనులు చేసారు. ఇజ్రాయిల్ - పాలస్తీనా సంక్షీభం, అశాంతి, ఆత్మాహుతి దాడులూ, నిరంతరం తరుముతుండే ఉగ్రవాదం, అనిశ్చితి, చుట్టు పక్కల రాజ్యాలయిన జోర్డన్, సిరియా, మిడిల్ ఈస్ట్రన్ దేశాలు, ఇరాన్, ఇరాక్ - తదితర దేశాలకూ ఇజ్రాయిల్ కూ ఉన్న సంబంధాలు, గొడవలూ, సర్దుబాట్లూ, దౌత్య వ్యాపారం - అన్నిటినీ మొసాద్ శాసించకపోయినా, వీటన్న్నిటిలో తమ దేశం ఉనికిని కోల్పోకుండా ఉండేందుకు మొసాద్ చేసిన  కృషి మెచ్చుకోదగ్గది. 

Mossad, The Greatest Missions of the Israeli Secret Service - రాసింది Michael Bar-Zohar, Nissim Mishal లు. ఇద్దరూ మొసాద్ ఆవిర్భావం నుండీ (మైకెల్ ఇజ్రాయెల్ మొదటి ప్రధాని, ఫౌండర్ - డేవిడ్ బెన్ గురీన్ దగ్గర పని చేసిన వాడు). దాదాపు 2011 దాకా (పుస్తకం మొదటి ప్రచురణ 2010- లో) ఇప్పటి దాకా చేసిన కొన్ని కీలకమైన పనుల గురించి చెప్తారు. మొసాద్ మొదట మామూలు దేశ రక్షణావసరాల కోసం తయారైన సంస్థ. దీనిలో ప్రపంచంలో అభివృద్ధి చెందిన అగ్ర రాజ్యాల కోవలో అణ్వాయుధాలు  తయారు చేసుకో దలచిన చిన్న రాజ్యాలు - ఇరాన్, ఇరాక్, సిరియా, ఈజిప్ట్ - వీటికి దగ్గర ఉన్న ఓ చిన్న రాజ్యం యుద్ధం చెయ్యకుండా కేవలం ఇంటెలిజెన్స్ ద్వారా, (ఇంకా కొన్ని కీలక హత్యల ద్వారా) ఎలా నిలువరించిందో  రాసారు  - వీటిలో కొన్ని ప్రపంచానికి తెలిసినవి, కొన్ని ఎవరికీ తెలియని రహస్యాలు. 

ఉదాహరణ కు  Nov 12, 2011 లో ఒక పేలుడు లో 17 గురు రివల్యూషనరీ గార్డులను (వీళ్ళలో ఆ ముసుగులో నిజానికి కొందరు కీలక  అణు శాస్త్రవేత్తలు ఉంటారు)  చంపడం ద్వారా, ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది మొసాద్.  భయపడకుండా, రహస్యంగా శతృవును తుదముట్టిస్తూ, తీవ్ర పరిణామాల్ని మొసాద్ ఆపగలిగిందనేది ఇక్కడ విషయం.   ఇరాన్ ఇరాక్ ల అణు కార్యక్రమాన్ని ఆపేందుకూ, ఆలస్యం చేసేందుకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది మొసాద్.  వారికి సహకారం అందించిన అప్పటి రష్యన్, జర్మన్ శాస్త్రవేత్తలను మట్టు పెట్టేందుకూ వెనకాడలేదు.  ముగ్గు పెట్టినట్టు ఒక పద్ధతి ప్రకారం, తిరుగులేని ప్రణాళికలతో ఎంతో మందిని చంపేసింది.  మొసాద్ కు సంబంధించి ఇది ఒక ధర్మ యుద్ధం. ఎదుటి వాణ్ణి చంపకపోతే, తమ పూర్వీకుల్లా తామూ  మొదలు వరకూ తుడిచిపెట్టబడతామో అన్న భయం ఇజ్రాయెల్ ది. 


 దేశ ప్రతిష్ట ని పణంగా ఎప్పుడూ పెట్టని దేశం ఇజ్రాయెల్. వీరికి ప్రతీ యూదు పౌరుడూ అపురూపం. ప్రపంచ యుద్ధాల్లో మిలియన్ల కొద్దీ చంపబడ్డ యూదులు ఇప్పుడు అణగదొక్కబడడాన్ని ప్రతిఘటిస్తూ ,  తమ సార్వభౌమత్వాన్ని, ఎవరూ వేలుపెట్టి ప్రశ్నించకుండా, కన్నెత్తి చూడ్డానికి లేకుండా భయపెట్టే బలమైన శక్తి గా ఎదగాలని ప్రగాఢంగా నమ్ముతారు. దీనికి యూదు విశ్వాసాలతో పాటు, భౌగోళికంగా బలమైన శక్తి గా ఎదగడమూ కీలకమే.  పాశ్చాత్య  దేశాల్లో ఒక అగ్ర రాజ్యంగా ఎదిగి, ఇప్పుడు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ఎత్తు ఎదిగిన ఇజ్రాయెల్ అలా సుభిక్షంగా ఉండడానికి కారణం మొసాద్.  ఇది చాలా సార్లు ఇతర రాజ్యాలతో తమ నోట్స్ పంచుకుండూ, కొన్ని సార్లు ఒంటరిగా కూడా పని చేస్తూ, ఎన్నో విజయాలు సాధించింది.  వీటిలో అత్భుత విజయాలూ ఉన్నాయి. భయంకరమైన అపజయాలూ ఉన్నాయి. పరాయి దేశాల్లో ఒంటరిగా - అమానవీయమైన, మరణ శిక్షలు సామాన్యమైన దేశాలలో, ఎప్పుడు ఆట కట్టేస్తుందో తెలీని పరిస్థితుల్లో, దేశం కోసం పోరాడే దేశ భక్తులైన మొసాద్ ఏజెంట్లు, వారిని కనిపెట్టుకునే కమాండర్ల వ్యవస్థ గురించి ఆసక్తి గా చదవొచ్చు. 


వీటిలో, "మ్యూనిక్ మాసకర్" కు తలబడిన పాలస్తీనా ఉగ్రవాద సంస్థ బ్లాక్ సెప్టెంబర్ నాయకులను వివిధ దేశాల్లో వెతికి వెతికి చంపడం - చెప్పుకోదగ్గది. అసలు ఆరాఫత్ స్థాపించిన పాలస్తీనా విమోచన సంస్థ "ఫతా" లో "బ్లాక్ సెప్టెంబర్" ఓ చిన్న పార్ట్. దీన్ని ఆరాఫత్ నే స్థాపించి, జోర్డన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఉసిగొల్పుతాడు. 1967 లో "ఆరురోజుల యుద్ధం" తరవాత జోర్డన్ దేశంలో పాలస్తీనా ఉగ్రవాదులు బహిరంగంగా ఆయుధాలు పెట్టుకుని నినాదాలు చేస్తూ తిరుగాడిన రోజులు.  వారి చేతుల్లోకి జోర్డన్ లో చాలా ప్రాంతాలు, ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలు, పట్టణాలూ వచ్చాయి. విర్రవీగి వారు చేస్తున్న అకృత్యాలు జోర్డన్ సైన్యానికి మింగుడుపడకపోయిన, రాజు వారికి పెద్దగా అనుమతులు ఇవ్వకపోవడంతో తీవ్రవాదులకు ఎదురు లేకుండా పోతుంది.  


అప్పటి దాకా, రాజు తాలూకు "నిర్ణయం తీసుకోలేని అశక్తత" వల్ల జోర్డన్ సైన్యం కుతకుతలాడుతూ ఉంది.  ఈ సమయంలో ఒక టాంక్ బెటాలియన్ ని సందర్శించిన రాజు హసన్ కు టేంక్ (శతఘ్ని) ఏంటినా (Antenna) మీద ఓ బ్రా ఎగురుతూ కనిపిస్తుంది.  కోపంతో రగిలిన రాజు - టాంక్ కమాండర్ ని ప్రశ్నిస్తే - "అవును. మేము ఆడవాళ్ళం. అందుకే ఎగరేసాను. నువ్వు మమ్మల్ని యుద్ధానికి అనుమతించవు" అని సమాధానం ఇచ్చాడట. ఈ సంఘటన జరిగాక ఇక ఊరుకోలేక, జోర్డన్ రాజు సైన్యానికి పగ్గాలను విప్పేయగా - 17 సెప్టెంబర్ 1970 న జోర్డన్ సేనలు పాలస్తీనా ఉగ్రవాదుల మీద విరుచుకు పడి, కనీసం 2-8 వేలమందిని రోడ్లమీద, కొట్టాలలోనూ, ఇళ్ళలోనూ, వాహనాల్లోనూ కాల్చి చంపేరు. ఈ పోరాటంలో బ్రతికిన వాళ్ళు బతుకు జీవుడా అని సరిహద్దు దాటి శతృ దేశమయిన ఇజ్రాయిల్ పారిపోయారు గానీ, జోర్డన్ సైనికులకు లొంగిపోదామనుకోలేదు. దీన్ని బట్టి, ఈ సంఘటన తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. 


ఈ పోరాటంలో తమ వారి మరణం చూసి, ఆరాఫత్ ప్రతీకారేచ్చ తో రగిలిపోయి "బ్లాక్ సెప్టెంబర్" ను స్థాపించాడు. ఈ 'అతి' రహస్య సంస్థ, స్కూల్ టీచర్లు, క్లర్కులు లాంటి అత్యంత సౌమ్యులు గా బయట ప్రపంచంలో తెలిసిన వారితో ఏర్పడింది. వీరు అత్యంత దయవిహీనంగా 'పాలస్తీనాను ఏడిపించె వాళ్ళని చంపడమే' - ఆ చంపడంలోనూ - ఫతా అవలంబించే విధానాలను, న్యాయ సూత్రాలనూ మరిచిపోయి, కౄరత్వం తో  విజృంభించే  "లక్ష్యం"తో ఏర్పడి ఉంటుంది. ఈ సంస్థ తమకు కాలం మూడిందాకా, జోర్డాన్ మీద అత్యంత హేయమైన, ప్రమాదకరమైన బాంబు దాడులు చేస్తూ వస్తుంది.  

ఇజ్రాయెల్ జోలికి రానంత వరకూ మొసాద్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మ్యూనిక్ లో ఇజ్రాయిలీ ఒలింపిక్ టీం ను కిడ్నాప్ మరియూ హత్య చేసినపుడు  ఇది అన్ని  లక్ష్మణ రేఖల్నీ దాటినట్లయింది. ఈ బ్లాక్ సెప్టెంబర్ దాడి తరవాత ఇజ్రాయెల్ ఉక్కు మహిళా ప్రధాని - గోల్డా మీర్ ఆదేశానుసారం మొసాద్ - వివిధ దేశాలలో స్థిరపడో, దాక్కునో రెండో జీవితం గడుపుతున్న అందరు బ్లాక్ సెప్టెంబర్ సభ్యులనూ, నాయకులనూ వెంటాడి వెంటాడి చంపేసింది. ఒక సీక్రెట్ సర్వీస్ సంస్థ ఇలా ఒక తీవ్రవాద సంస్థ సభ్యులను ఇంత చాకచక్యంగా చంపడం అదే మొదలు.    ఈ సాహస చర్యల ద్వారా  "మొసాద్" ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏమైనా చెయ్యగలదు, అలా, ఇజ్రాయిల్ జోలికి వచ్చే శతృవు ను వొదిలిపెట్టబోము అని నొక్కి చెప్పిన సంస్థ.    


అరబ్ దేశాల  సహకారంతో వివిధ ముస్లిం ఉగ్రవాద సంస్థలు "అత్యంత సాధారణంగా" గాలిలో ఎగిరే "ప్రయాణీకుల విమానాల్ని" బాంబ్ చెయ్యడం, హైజాక్ చెయ్యడం, బందీలను చంపడం లాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నపుడు, తమ దేశానికి అతి దూరంగా ఉన్న ఉగాండాలో ఎంటెబ్ లో శతృ దేశం కన్ను గప్పి, తమ విమానాల్ని తీస్కెళ్ళి, అక్కడ బందీలు గాఉన్న తమ దేశస్థుల్ని విడిపించుకుని, వచ్చి, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఎంతో ఖ్యాతి గడించింది.  నిజానికి బ్లాక్ సెప్టెంబర్ 1973 లో, తమ అన్ని కార్యకలాపాలనూ ఆపేసి, తమ దుకాణం మూసేసినాక కూడా  వెంటాడి వేటాడి, అప్పటికి నూకలతో మిగిలిన ఆఖరి కీలక నాయకుడిని (Red Prince) 1979 లో చంపేసి తన మిషన్ ని అధికారికంగా ముగించింది మొసాద్.  Red Prince గా పేరొందిన ఈ బ్లాక్ సెప్టెంబర్ నాయకుడు "అలీ హసన్ సలామె" ను చంపడానికి ఎన్ని వ్యూహాలు పన్నారో, ఎన్ని సారులు విఫలం అయ్యారో, పొరపాట్న ఇంకో మనిషిని సలామె అనుకుని చంపేస్తారు కూడా. అన్నీ దాటుకున్నాక, చావు పడగ నీడన తాను ఉన్నానని బాగా ఎరుక వున్న ఈ రక్త పిపాసి, (అందుకే ఆ నిక్ నేం - రెడ్ ప్రిన్స్)  సలామే ను చంపేస్తుంది మొసాద్ టీం. 


మొసాద్ హత్యలు - వివిధ తీవ్రవాద సంస్థలు వొళ్ళు దగ్గరపెట్టుకుని వ్యవహరించేలా చేసాయి. తమ తమ  ఉగ్ర లక్ష్యాలను చేదించాక, ఎప్పటికైనా మొసాద్ తమను చంపేస్తునదే స్పృహ తో మృత్యుదేవత తోనే కాపురం చేసేవాళ్ళు హమాస్, హిజబొల్లా లాంటి భయానక సంస్థల సభ్యులు.  


కేవలం రేడియోల ద్వారా, లేదా చిన్న చిన్న పరికరలతో, కోడ్ లతో గూఢచర్యం నెరిపి, మొసాద్ ఏజెంట్లు ప్రాణాలు పణంగా పెట్టి ఆపరేషన్ లలో విజయాలు సాధించారు.  గూఢచర్యం తో పాటు హత్య చెయ్యాలంటే, గుంపులుగా ఒక సర్వైలెన్స్ బృందం, ఒక హిట్ టీం, ఒక క్లియరెన్స్ టీం,  అదృష్టం తిరగబడి పట్టు బడితే ఆయా దేశాల్లో చట్టాల ప్రకారం సభ్యులకు పడబోయే శిక్షలను దృష్టి లో ఉంచుకుని ప్రణాళిక రచించే కమిటీ.   కొన్ని సార్లు చంపాలనుకున్న వ్యక్తిని ఎలానో ట్రాప్ చేసి తమ మిత్ర / శతృ దేశాల సరిహద్దుల్ని దాటించి, తటస్థ దేశాల్లో చంపేసిన సందర్భాలున్నాయి.   ఇలా మొసాద్ పెద్ద టీం వర్క్ తో ఆపరేషన్లు చేస్తుంటుంది. కొన్ని సార్లు ఏజెంట్లు ఒంటరిగా సంవత్సరాల తరపడి శతృవు తో సహవాసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 


మొసాద్ చరిత్రలో ఫెయిల్ అయిన ఆపరేషన్లు కూడా ప్రసిద్ధాలయ్యాయి. వీటిలో సిరియా రాజధాని డమాస్కస్ లో కీలక స్థానానికి ఎదిగి, కేవల మొసాద్ అత్యుత్సాహం వల్ల దొరికిపోయిన నేషనల్ హీరో "ఎలీ కోహెన్" ది పెద్ద కథ. అతని మీద ఎన్నో నవలలూ, సినిమాలూ వచ్చాయి.  అలాగే చేజేతులా మొసాద్ బయటపెట్టిన కీలక సోర్స్ "ఏంజెల్",   బయట పెట్టబడిన వారంలోగా అతని హత్య, చెప్పుకోదగ్గవి. కొన్ని హనీ ట్రాప్ లు, కొన్ని అధిక ప్రసంగాలు, కొన్ని తీర్పులు, కొన్ని అతిశయోక్తులూ, చిరాకు పెట్టేస్తాయి. "హనీ ట్రాప్" ఇప్పుడు భారత పాకిస్తాన్ ల గూడచర్య పద్ధతుల్ని ఏలేస్తున్న ఏకైక పద్ధతి.  దీన్ని ప్రవేశపెట్టింది మొసాద్.    సిరియా అధ్యక్షుడు గా హఫీజ్ అల్ అసాద్ ఉన్నప్పుడు అతనికీ, నార్త్ కొరియా అధ్యక్షుడు కిం ఇల్ సంగ్ కీ ఉన్న దోస్తీ, న్యూక్లియర్ రియాక్టర్ నిర్మాణపు ఒప్పందం, తండ్రి హఫీజ్ పోయాక, అతని కొడుకు, ఇప్పటి అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ దాన్ని కొనసాగించడం, ఆ రియాక్టర్ ను అమెరికా పేల్చడానికి వెనకాడి  ఒప్పుకోకపోవడంతో ఇజ్రాయెలే ఎయిర్ రైడ్ చేసి నాశనం చెయ్యడం లాంటి అంశాలు బావున్నాయి.  అల్ అసాద్ ఇప్పుడు సిరియా యుద్ధం లో ప్రయోగించిన కెమికల్ వెపన్ లు, బయొలాజికల్ వెపన్లను అతని తండ్రి జమానా లో నార్త్ కొరియా అమ్మినవే. వీటిని ప్రపంచం ఆమోదించదు. 


ఇజ్రాయెల్ ప్రధానంగా యూదు దేశం. యూదులు ఎక్కడ హింస కు గురవుతున్నా, దాని మతాచారం (Law of Return)  ప్రకారం వారిని సురక్షితంగా  ఇజ్రయెల్ కు తీసుకు రావడం దాని బాధ్యత. అలా సిరియా నుండీ, ఇథియోపియా (ఆఫ్రికన్ యూదులు) నుంచీ యూదుల్ని తీసుకొచ్చి ఇజ్రాయెల్ లో వారికి పౌరసత్వం ఇవ్వడం లాంటివి జరిగాయి. అయితే ఇలా శతృదేశాల నుండీ యూదుల్ని వివిధ ఆపరేషన్ ల ద్వారా రహస్యంగా (వేలాది మందిని - కొన్ని సంవత్సరాల పాటూ) తరలించారు మొసాద్ బంటులు.  అలాగే, నాజీ జర్మనీ లో నరమేధానికి పాల్పడి, యుద్ధం ముగిసాక, జన సామాన్యంలో కలిసిపోయి, ట్రయల్ ను ఎదుర్కోని ఎస్.ఎస్. కమాండర్లను, మాజీ నాజీలను వెతికి పట్టుకుని, వాళ్ళని బోన్లలో నిలబెట్టింది మొసాద్. కొందరిని చంపేసింది కూడా. 


ఇస్లామిక్ తీవ్రవాదంలో సూయిసైడ్ ని అంటే ఆత్మాహుతి ని మొదటి సారిగా ప్రవేశపెట్టి, దానికి మతపు గ్రాండ్ సీల్ వేసి ప్రోత్సహించిన షకాకీ (Shaqaqi - Islamic Jihad) ని మట్టుపెట్టింది.  ఇస్లామిక్ జిహాద్ కు చెందిన ఇంత  కీలక నాయకుడిని, ఇతర  పై స్థాయి చాణుక్యుల్నీ,   తీవ్రవాదుల్నీ, విష ప్రయోగం ద్వారా, చాక్లెట్లలో తెలియని విషాల్ని నింపి ఇచ్చి, వారు "తెలీని ఏదో వ్యాధి (Terminal illness) తో కుంగి కృశించి మరణించే లా " ఏర్పాటు చేసింది మొసాద్. ఆఖరికి ఆరాఫత్ మరణం కూడా అలాంటిదే అంటారు. 


మొసాద్ మీద తీవ్ర ఆరోపణలున్నాయి. ఇది అత్యంత వ్యవస్థీకృతమైన సంస్థ. ఇజ్రాయిలీ గూఢ చర్య సంస్థల లో 'మొసాద్', 'షబాక్', 'అమన్' (మిలటరీ ఇంటలిజెన్స్) 'స్పెషల్ బ్రాంచ్', 'విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు చెందిన రీసెర్చ్ విభాగం' కీలకం. మొసాద్ లో మళ్ళీ వివిధ విభాగాలు, కీడాన్ లాంటి స్పెషల్ ఫోర్స్ లూ ఉంటాయి. ఏది ఏమయినా, ఇజ్రాయెల్ ఇప్పుడు పలు ప్రపంచ దేశాలకు (ముఖ్యంగా మన దేశానికి) సాంకేతిక సహారం అందిస్తూ, అత్యాధునిక యుద్ధ సామాగ్రిని అమ్మే సంస్థ. ఇజ్రాయిలీ రాడార్లు, అవాక్స్ సిస్టం లు, శిక్షణా, కీలక యుద్ధ విమానాల విడి భాగాలు, పాడి, వ్యవసాయ విధానాలు, డ్రోన్లూ, తుపాకులూ, గుళ్ళూ, చివరికి కేమెరాలు, ఇజ్రాయిలీ సాటిలైట్లు, వారి రోదశీ సేవలు మన దేశానికి చాలా కీలకం. 


"మోషే దయాన్" లాంటి రక్షణ మంత్రులూ, "గోల్డా మీర్" (బ్లాక్ సెప్టెంబర్ మీద దాడి - ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్, ఇంకా పలు సాహసో పేతమైన అపరేషన్లను ఆర్డర్ చేసిన మహిళా ప్రధాని), నెతన్యాహూ లాంటి ఒకే మాట మీద నిలబడే వెన్ను బలం ఉన్న వివిద రాజకీయ నాయకులూ, మొసాద్ కు పెద్ద దిక్కు గా నిలిచారు. ఇప్పుడు ప్రపంచంలో సీ.ఐ.ఐ కన్నా ఎక్కువ మంచిపేరున్న సంస్థ మొసాద్.  దీని ఏజెంట్లు చాలా మంది, దొరికిపోయిన తరవాత, చిత్రహింసలకు గురయి, ఉరి తీయబడి, చనిపోయారు. "మేము మిమ్మల్ని మర్చిపోము.." అంటూ, మొసాద్ తన యుద్ధాన్ని కొనసాగిస్తుంటుంది.  మొసాద్ అధ్యక్షుడిని హీబ్రూ లో రంసాద్ అంటారు. ఈ రంసాద్ లు కొందరు సూపర్ హీరోలు, కొందరు బలహీనులు, కొందరు తాము ఎదుర్కొన్న్న చాలెంజ్ బట్టీ తప్పక ఎదుర్కోవాల్సి వచ్చి హీరోలయ్యారు. వీరందరి లక్ష్యం ఇజ్రాయెల్ ని రక్షించడమే. పనిలో పని గా, వీళ్ళు ప్రపంచాన్ని కూడా రక్షించారు.  

ఈ పుస్తకం 2010 లో మొదట ప్రచురితం అయింది. తరవాతి ఎడిషన్లు 2011 దాకానే మొసాద్ సమాచారాన్ని ఇచ్చాయి.  2011 తరవాత ప్రపంచం మారింది. ఎవరూ ఈసీ గా విక్టిం అయిపోదలచుకోలేదు. విమానయాన సంస్థలు సులువు గా  హైజాక్ అయిపోకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. తీవ్ర వాద సంస్థలూ రెండాకులు ఎక్కువే చదివాయి. అదృష్ట వశాత్తూ, వివిధ దేశాల రక్షణ వ్యవస్థలూ, గూఢచర్య చర్యలూ, ఎన్నో దాడులను నిలువరించాయి. కొన్ని విఫలయమయ్యాయి.  కానీ ఈ పుస్తకం కేవలం 2011 దాకానే మొసాద్ విజయాల్ని ప్రస్తావించింది.  నిజానికి ఇన్నేళ్ళ తరవాత అయిపోయిన విశేషాల్ని నెమరు వేసుకోవడానికి తప్ప పనికి రాదు. కానీ ప్రస్తుతం మన మొబైల్ లలో అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న నెట్ ఫ్లిక్స్ లూ, వగైరాలు చూపించే సినిమాలూ, "ఫౌదా", "ద స్పై" లాంటి సిరీస్ ల లో రక రకాల పాత్రల్ని దీనిలో వెతుక్కోవచ్చు.   


అప్పట్లో రష్యన్లు అత్యంత ఆధునిక మిగ్ యుద్ధ విమానం ను రంగం లో కి దింపినపుడు - కోల్డ్ వార్ కారణంగా ఎవరికీ మిగ్ సాంకేతిక విషయాలు తెలీక అయోమయంలో ఉన్నప్పుడు, తమ సైన్యాధ్యక్షుడు అడిగాడని,  అత్యాధునిక మిగ్ తో సహా తమ దేశానికి ఇంకో రాజ్యపు పైలట్ ను  defect అయ్యెందుకు  ఒప్పించింది మొసాద్. అలాగే, రష్యా లో ఐరెన్ కర్టెన్ వెనక కమ్యూనిజం అంతరించిపోవడాన్ని, అక్కడి విప్లవాన్నీ, సాక్షాధారాలతో బయటపెట్టి, అమెరికా చెవిలో వేసి, అది తగినట్టు పావులు కదిపేలా చూసిందీ మొసాదే.  ఇలా, మొసాద్ ప్రపంచానికి చేసిన మేలు తాలూకు చిట్టా పెద్దదే. అదంతా వివరంగా రాయడం వల్ల,  దీనిలో ఉన్న  అతి దీర్ఘమైన 21 చాప్టర్లు చదివి, అందులో సగం పాప్యులర్ అయి తెలిసినవి, కొన్ని ఎప్పుడూ విననివీ అయినందువల్ల సగం బోరు, సగం ఇంటరెస్టు తో మొత్తానికి ముగించాను ఈ పుస్తకాన్ని. (Total 388 pgs). పాత విషయాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, రాజకీయాల పై అనురక్తి ఉన్నవాళ్ళు చదవచ్చు  ఈ థ్రిల్లింగ్ ఏక్షన్ పాక్డ్ పుస్తకాన్ని. 




Notes :













This post was first published in pustakam.net

 

No comments: